Showing posts with label Short Fiction. Show all posts
Showing posts with label Short Fiction. Show all posts

Saturday, February 1, 2025

The Golden Kite, the Silver Wind - Ray Bradbury

కొద్ది రోజులుగా బోర్హెస్, సిల్వినా ఒకాంపో, అడాల్ఫో సెసారెస్ లతో కలిసి ఎడిట్ చేసిన "బుక్  ఆఫ్ ఫాంటసీ" చదువుతున్నాను. అందులో రే బ్రాడ్బరీ కథ "The Golden Kite, the Silver Wind" చిన్నపుడు చదివిన చందమామ కథను గుర్తుచేసింది. "అనగనగా" అంటూ మొదలుపెట్టి పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన కథ ఇది. యునైటెడ్ స్టేట్స్ కీ, సోవియట్ యూనియన్ కీ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ విపరీతమైన టెన్షన్ నెలకొన్న సందర్భంలో రాసిన ఈ నీతి కథ ప్రతీ మానవ సమాజానికీ అన్వయించుకునే విధంగా అత్యంత అవసరమైన రాజకీయ పాఠం చెబుతుంది.

Image Courtesy Google

Life was full of symbols and omens. Demons lurked everywhere, Death swam in the wetness of an eye, the turn of a gull’s wing meant rain, a fan held so, the tilt of a roof, and, yes, even a city wall was of immense importance.

ఈ కథకు నా స్వేచ్ఛానువాదం: 

అనగనగా రెండూళ్ళు. ఒక్కో ఊరికీ ఒక "మాండరిన్" రాజుగా ఉంటాడు. ఒకరోజు రాజు గారు కొలువుదీరి ఉండగా ఒక బంటు పక్కూరు కువాన్-సి తన ఊరి గోడను పంది ఆకారంలో కట్టుకుందన్న వార్తను మోసుకొస్తాడు.

"నా చిన్నప్పుడు కొండ ప్రక్కన చిన్న పల్లెటూరు, ఇప్పుడు గోడ నిర్మించుకునేంత స్థాయికి చేరిందా!" కోపంతో రుసరుసలాడాడు మాండరిన్.

"ఎక్కడో దూరంగా ఉన్న ఊరు గోడ ఎలా కట్టుకుంటే మనకేంటి నాన్నా?" ప్రశ్నించింది రాజు గారి కూతురు.

"ఎందుకంటే, మన ఊరి గోడ 'నారింజ' ఆకారంలో కట్టుకున్నాం కదా! ఆ పందులన్నీ మన గోడను ఆకలితో తినేస్తాయి" సమాధానమిచ్చాడు రాజు.

మానవ జీవితమంతా సంకేతాలమయం. శకునాలు, చిహ్నాలూ మనకు చాలా ముఖ్యం. మృత్యువు ఎక్కడెలా పొంచి ఉందో చెప్పలేం. అందుకే ఒక గోడ కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చే యాత్రికులూ, ప్రయాణికులు, కళాకారులూ,  దేశదిమ్మరులూ ఈ రెండు ఊళ్ళలో ప్రవేశించడానికి శకునాలూ, సంకేతాలూ చూసుకుంటారు. "నారింజ ఆకారపు గోడ ఉన్న ఊరా? వద్దొద్దు, నేను పంది ఆకారంలో ఉన్న ఊళ్ళో ప్రవేశిస్తే, దానిలాగే సుష్టుగా తిని బాగా వృద్ధి చెందుతాను" అనుకుంటారు.

రాజుగారి భయమూ, బాధా చూసిన కూతురు అతనికో మంచి ఉపాయం చెప్పింది. గోడ కట్టడానికి అవసరమైన శిల్పుల్నీ, పనివాళ్ళనూ వెంటనే పిలిపించమని చెప్పి తాను మాత్రం తెర వెనుక నిలబడి, తండ్రికి వాళ్ళతో ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేస్తానని చెప్పింది.

రాళ్ళు, గ్రానైట్ , ఓనిక్స్, క్వార్ట్జ్ లాంటి స్ఫటికాలూ, శిలలతో పని చెయ్యడం తెలిసిన శిల్పులందరూ సభకు తరలి వచ్చారు. మాండరిన్ సింహాసనం వెనుకనున్న తెరకు దగ్గరగా నిలబడ్డాడు. కాసేపటికి తెర వెనుక నుండి గుసగుసగా మాటలు వినిపించాయి. మాండరిన్, కూతురి మాటల్ని యథాతథంగా వల్లించడం మొదలుపెట్టాడు.

"మన పట్టణమేమో నారింజ ఆకారంలో ఉంది, పొరుగున ఉన్న కువాన్-సి తమ పట్టణాన్ని పంది ఆకారంలో కట్టుకుంది. అందువల్ల అది మన నారింజలన్నిటినీ తినేస్తుంది. మీరు వెంటనే మన గోడను ఆ పందిని హతమార్చడానికి వీలుగా ఉండే పెద్ద దుడ్డు కర్ర ఆకారంలోకి మార్చాలి." అని ఆదేశించాడు.

శిల్పులందరూ సరేనని రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించింది. రాజుగారి తెలివికీ, వివేకానికీ అందరూ అతణ్ణి ప్రశంసించారు.

ఊళ్ళో గోడ కట్టడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రజలందరూ కలసిమెలసి పనిచేశారు. నెల తిరిగేలోగా గోడ కట్టడం పూర్తైపోయింది. ఇప్పుడు మాండరిన్ ప్రతిరోజూ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ఈ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఒకనాడు మధ్యాహ్నం బంటు ఒకడు అత్యవసర సందేశం మోసుకుని సభలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

"ఓ మాండరిన్, మన ఊళ్ళో వ్యాధి ప్రబలింది, నీరు విషతుల్యమైంది, ప్రజలు అల్లాడుతున్నారు. మనం కట్టిన దుడ్డు కర్ర ఆకారంలో ఉన్న గోడను కాల్చి మసిచెయ్యడానికి కువాన్-సి పట్టణం వారు తమ గోడను అతి పెద్ద చలిమంట ఆకారంలో పునర్నిర్మించారు." అని విన్నవించుకున్నాడు.

మాండరిన్ కి మళ్ళీ నీరసం వచ్చినంత పనైంది. ఊళ్ళోకి వచ్చే యాత్రికులు, సులభంగా బూడిదయ్యే కర్రను కాదని ఉవ్వెత్తున ఎగసిపడే మంటలున్న వారి ఊరి వైపు వెళ్ళిపోతారు అనుకుని విచారపడ్డాడు.

సరిగ్గా అదే సమయంలో తెర వెనుక నుండి "కాదు" అన్న స్వరం వినిపించింది. మాండరిన్ మునుపటిలాగే తెర వెనుక మాటల్ని అనుకరిస్తూ, "శిల్పకారులకు  వెంటనే మన గోడలను పెద్ద సరస్సు ఆకారంలో కట్టమని చెప్పండి. ఆ సరస్సు నీటితో వాళ్ళ మంటల్ని ఆర్పేయండి." అని ఆదేశించాడు.

మహారాజు తెలివికి పట్టణమంతా మరోసారి సంతోషించింది. ప్రజలందరూ  మరోసారి గోడ నిర్మించే పనుల్లో పడ్డారు. కానీ వారి పనిలో మునుపటి వేగం , ఉత్సాహం తగ్గాయి. ఎందుకంటే మొదటిసారి గోడ నిర్మించడానికి పట్టిన నెల రోజుల సమయంలో వారు సొంత పనులకూ, వ్యాపారానికీ, వ్యవసాయానికీ సమయం కేటాయించలేకపోయారు. ఈకారణంగా చాలామంది పేదరికంతో బలహీనపడ్డారు. ఏదైతేనేం, త్వరలోనే సరస్సు ఆకారంలో గోడ నిర్మాణం పూర్తయ్యింది.

రాజు గారు సరిగ్గా ఊపిరి పీల్చుకోనైనాలేదు, ఈలోగానే మళ్ళీ ముప్పు ముంచుకొచ్చింది. కువాన్-సి పట్టణంవారు ఈసారి తమ గోడలను సరస్సు నీటిని అమాంతంగా తాగేసే "నోరు" ఆకారంలో కట్టారనన్న వార్త ఊళ్ళో గుప్పుమంది.

మాండరిన్ మరోసారి కుమార్తె సలహా కోసం తెరకు దగ్గరగా జరిగాడు. అప్పుడు తెర వెనుక స్వరం, "మన గోడలను వెంటనే 'సూది' ఆకారంలోకి మార్చండి, ఆ నోటిని కుట్టేద్దాం." అని పలికింది. మాండరిన్ ఆ స్వరాన్ని అనుకరిస్తూ శిల్పులకు ఆదేశాలు జారీ చేసాడు.

"రాజా! రక్ష రక్ష!" అంటూ వార్తాహరుడు మళ్ళీ వచ్చాడు. "వారు తమ గోడలను 'కత్తి' ఆకారంలోకి మారుస్తున్నారు, అది మన సూదిని ఇట్టే విరగ్గొట్టేస్తుంది." అన్నాడు.

ఈసారి మాండరిన్ నిలువెల్లా కంపించిపోయాడు. తెరను పట్టుకుని నిలబడి , కుమార్తె చెప్పే ఉపాయం కోసం వేచి చూస్తున్నాడు.

తెర వెనుక స్వరం, "అయితే మన గోడను వెంటనే 'కత్తి ఒర'గా మార్చండి. వాళ్ళ కత్తి మన ఒరలో ఇమిడిపోతుంది." అని పలికింది.

"ప్రభూ, దయ చూపండి. కువాన్-సి పట్టణం వారు రాత్రీ పగలూ పనిచేసి, తమ గోడను మిరుమిట్లు గొలిపే 'మెరుపు' ఆకారంలోకి మార్చారు, అది మన కత్తి ఒరను ధ్వంసం చేసేస్తుంది." అంటూ పరుగుపరుగున ఏడుస్తూ మరో వార్త మోసుకొచ్చాడు వార్తాహరుడు.

ఊరంతా వ్యాధులు ప్రబలాయి, దుకాణాలు మూసుకుపోయాయి. నడి వేసవి రోజుల్లో వ్యవసాయం మాని, నిరంతరం గోడలు నిర్మిస్తూ నిర్విరామంగా పనిచేసిన జనం నీరసంతో శుష్కించిపోయారు. మృతుల సంఖ్య కూడా పెరిగింది. మాండరిన్ విచారంతో వ్యాధిగ్రస్తుడై మంచంపట్టాడు. తెరవెనుక స్వరం కూడా నీరసించి ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లు వినిపించసాగింది.

"కువాన్-సి ఒక 'గద్ద'. అయితే మన గోడల్ని ఆ గద్దను పట్టుకునే 'వల'గా మార్చాలి. వారు సూర్యుడిగా మారి మన వలను కాల్చేస్తే, మనం చంద్రుడిలా మారి వాళ్ళ సూర్యుణ్ణి గ్రహణంతో కనపడకుండా చేసెయ్యాలి."

ఆ విధంగా వ్యాపారాలూ, వ్యవసాయాలూ మానేసి సమతౌల్యం కోల్పోయిన  ఊరు తుప్పుపట్టిన యంత్రంలా చివరకు పూర్తిగా పనిచెయ్యడం మానేసింది.

తెర వెనుక నుండి క్షీణించిన స్వరం, "ఇంక చాలు, దేవుడి మీద భారం వేసి,  కువాన్-సి ని మన ఊరికి ఆహ్వానిస్తున్నామని వెంటనే కబురు పంపండి" అంది.

వేసవి చివరలో, శుష్కించిన శరీరంతో, నీరసంగా నడవలేని స్థితిలో ఉన్న కువాన్-సి రాజుగారిని నలుగురు బక్కచిక్కిన మనుషులు మోసుకొచ్చి సభలో కూర్చోబెట్టారు. రెండూళ్ళ మాండరిన్లు ఎదురెదురుగా కూర్చున్నారు.

తెర వెనుక స్వరం "మనం ఈ దురంతానికి ముగింపు పలుకుదాం. ఇదిలా కొనసాగదు, మన ప్రజలు ప్రతి రోజూ, ప్రతి గంటా తమ గోడల్ని నిర్మిస్తూనే ఉంటే వాళ్ళకి వేటకీ, వ్యవసాయానికీ, వ్యాపారానికీ, భోజనం చేయడానికీ, చేపలు పట్టడానికీ, ప్రేమలో పడడానికీ, తమ పూర్వీకుల్ని గౌరవించుకోడానికీ సమయం దొరకదు." అని పలికింది.

ఇద్దరు రాజులూ అంగీకారంగా తలూపారు.

"ఇప్పుడు మమ్మల్నందర్నీ సూర్యకాంతిలోకి తీసుకెళ్ళండి" అని సేవకులను  ఆజ్ఞాపించిందా స్వరం.

ఇద్దరు వృద్ధులనూ సూర్యకాంతి పడుతున్న ఒక చిన్న కొండ పైకి  తీసుకెళ్ళారు. అక్కడ పోషణ లేక, సన్నగా చిక్కిపోయిన కొందరు పిల్లలు రంగురంగుల గాలిపటాలెగరేస్తున్నారు.

రాకుమార్తె తన తండ్రి మంచం వద్ద నిలబడి, "అవి చూడండి," అంది.

"చూడ్డానికేముంది? అవి కేవలం గాలిపటాలేగా!" అన్నారు ఇద్దరు మాండరిన్లు.

"నిజమే, కానీ నేలమీద ఉండే గాలిపటానికి విలువేమిటి? విలువ లేని దానికో లక్ష్యాన్నిచ్చి, అది అందంగా ఎదగడానికి అవసరమైనదేమిటి?" ఆమె ఇద్దర్నీ ప్రశ్నించింది.

"గాలి కదా!" ఏకగ్రీవంగా సమాధానమిచ్చారు ఇద్దరు మాండరిన్లు.

"మరి ఆకాశాన్నీ, గాలినీ అందంగా మార్చడానికి వాటికేం కావాలి?" మళ్ళీ ప్రశ్నించిందామె.

"గాలిపటం." వారు ఒక్కసారిగా సమాధానమిచ్చారు. "నిజానికి సాదాసీదాగా,  ఖాళీగా ఉండే ఆకాశాన్ని రంగులమయం చేస్తూ అందంగా మార్చాలంటే ఎగిరే గాలిపటాలు అనేకం కావాలి."

"కదా! ఇప్పుడు మీ కువాన్-సి ఊరి గోడని చివరిసారిగా 'గాలి' ఆకారంలో నిర్మించండి. మేము మా గోడను ఒక బంగారు గాలిపటంలా నిర్మిస్తాము. మీ ఊరి గాలి మా గాలిపటాన్ని ఆకాశంలో అద్భుతమైన ఎత్తులకు తీసుకువెడుతుంది. మా గాలిపటం మీ గాలి యొక్క సమరూపాన్ని మార్చి దానికో గమ్యాన్నీ, అర్థాన్నీ ఇస్తుంది. ఈ రెండూ ఒకటి లేకుండా మరొకటి అందంగా, ఆనందంగా మనలేవు. కలసిమెలసి జీవించడం అంటే పరస్పర సహకారంతో ఒక దాని మీద మరొకటి ఆధారపడి చిరకాలం జీవించడం."

తరువాత ఇద్దరు రాజులూ చాలా కాలం తరువాత తృప్తిగా ఆహారాన్ని తీసుకున్నారు. తాత్కాలికంగా వచ్చిన ఓపికతో ఒకరినొకరు కౌగలించుకుని కీర్తించుకున్నారు. మాండరిన్ కుమార్తె వివేకాన్ని గౌరవిస్తూ ఆమెను కొడుకులు లేని మాండరిన్ కు దక్కిన గొప్ప కొడుకని వేనోళ్ళ పొగిడారు.

ఆ విధంగా ఆ రెండు పట్టణాలూ "గోల్డెన్ కైట్ పట్టణం" మరియు "సిల్వర్ విండ్  పట్టణం"గా మారాయి. పాడి పంటలతో, వ్యాపారాలతో, సుఖసంతోషాలతో  రెండూళ్ళూ కళకళలాడాయి.

Wednesday, February 8, 2023

Love and Youth : Essential Stories - Ivan Turgenev

కొన్ని రోజులు ఫిలాసఫీలూ, సైకో ఎనాలిటిక్ విశ్లేషణలకు సెలవిచ్చి ఆడుతూ పాడుతూ "పుష్కిన్ ప్రెస్ ఫెస్టివల్" జరుపుకుంటున్నాను. మునుపు పుష్కిన్ ప్రెస్ ప్రచురణల్లో మార్సెల్ల్ ఐమీ, కాఫ్కా, ఆకుతాగవా కథలు చదివాను. ఇది నాలుగో కలెక్షన్. ఫిబ్రవరి కదా, కాస్త ఆహ్లాదకరమైన తేలికపాటి కథలేమన్నా చదువుదామని చూస్తే ఇవాన్ తుర్గేనెవ్ కథల పుస్తకం "లవ్ అండ్ యూత్" కనిపించింది. నాకు తుర్గెనెవ్ రచనలతో తొలిపరిచయం ఆయన నవలిక "ఫస్ట్ లవ్" తో జరిగింది. ఈ కథల సంపుటిలో మొట్టమొదటి కథే అది. ఇందులో మూడు ప్రేమ కథలతో బాటు 'Notes of a Hunter', 'A Sportsman's Sketches'  నుండి సంగ్రహించిన కొన్ని కథలూ, స్కెచెస్ ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటికంటే ఆకట్టుకున్న కథ మొదటిదే : 'ఫస్ట్ లవ్'. దాని గురించి మునుపు బ్లాగ్ లో రాశాను కాబట్టి మళ్ళీ ప్రస్తావించడం లేదు.

Image Courtesy Google

మిగతా కథల విషయానికొస్తే తుర్గెనెవ్ కథలన్నీ మంచి ల్యాండ్ స్కేప్ నేపథ్యంలో మొదలవుతాయి. కెంజాయ రంగులో మెరిసే ఆకాశం, అల్లంత దూరం వరకూ విస్తరించిన పచ్చిక మైదానాలూ, తుప్పలతో కూడిన చిక్కని అడవి దారులూ, మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ కురిసే చిరుజల్లుల జూలై వానలూ, ఇలా కథ మొదలు పెడుతూనే ప్రకృతి వర్ణనలు చదువుతున్నామంటే అది ఖచ్చితంగా తుర్గెనెవ్ అయ్యుండాలి అని ఆయన పేరు తెలీకుండా ఏ కథ చదివినా ఊహించడం సులభం.

Bezhin Meadow కథలో అడవిలో దారితప్పిన వేటగాడు ఆ రాత్రి గడపడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతుండగా, గుర్రాలను మేపడానికొచ్చిన 16 ఏళ్ళ లోపు వయసున్న ఐదుగురు కుర్రవాళ్ళు చలి కాచుకుంటూ కనిపిస్తారు. వారి అనుమతితో ఆ రాత్రి అక్కడే విశ్రమించిన కథానాయకుడు, ఆ యువకులు ఒక్కొక్కరూ చలిమంట చుట్టూ చేరి పొద్దుపుచ్చడానికి తమలో తాము చెప్పుకునే కథల్ని మనకు చెబుతూ ఉంటాడు. ఆ కథలో కథలన్నీ రష్యన్  జానపదాలని తలపించే పిట్టకథల్లా ఉంటాయి. వాస్తవాన్నీ, కల్పననూ చెరిపేస్తూ ఫాంటసీ, గాసిప్, హారర్ లాంటి అంశాలను జత చేసిన ఈ కథలు వారి ఊళ్ళో తెలిసిన మనుషుల మధ్య జరిగిన (?) అనేక సంఘటనల గురించి చిలవలు పలవలు అల్లి చెప్పుకునే కథల్లా అనిపిస్తాయి. 'పుస్తకం' పుట్టుకకు ముందు ఆ నోటా ఈ నోటా కథలెలా వ్యాప్తి చెందేవో తెలియాలంటే ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ కథ చిన్నప్పుడు చదివిన చందమామ కథల్ని గుర్తుకుతెచ్చింది. అలాగే Biryuk కూడా దారితప్పిన వేటగాడికి ఆశ్రయం ఇచ్చిన ఒక అటవీశాఖ అధికారి కథ. బిర్యుక్ అంటే "లోన్ వుల్ఫ్" అని అర్థం ఉందట. ఈ కథలో ప్రత్యేకం పాత్రల్ని మలిచిన తీరూ, వారి హావభావాల వర్ణనా కథకు ప్రాణం పోశాయి. తుర్గెనెవ్ కథనాన్ని రక్తి కట్టిస్తూ భావోద్వేగాలను పండించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక The Rattling, అడవి దారిలో దోపిడీ దొంగల భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గుర్రపు బగ్గీలో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు చివరకు తమ గమ్యాన్ని చేరారో లేదో చెప్పే కథ. తుర్గెనెవ్ వర్ణనల్లో ప్రత్యేకత ఏంటంటే, పాత్రలతో బాటు మనల్ని కూడా ఆ ప్రయాణంలో భాగస్వాముల్ని చేస్తారు. వాళ్ళు భయంతో వణికిపోతున్నప్పుడూ, మళ్ళీ తేరుకుని స్పృహలోకి వచ్చినప్పుడూ కూడా మనం వారి అనుభవాన్ని మనదిగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా పాఠకుల ఏకాగ్రతను కథమీద నుండి మళ్ళకుండా కథనంలో అలవోకగా కలిసిపోయి కోటగోడలా కాపుకాసే రష్యన్ లాండ్స్కేప్ కథకు తగిన పరిసరాల ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ఈ తరం కథల్లో ఏ నేపథ్యమూ, మూలాలూ లేని మొండి గోడల్లా నిలిచే పాత్రల్లోని డొల్లతనానికి కారణాలు కూడా ఇలాంటి కథలు చదివినప్పుడు అర్థమవుతుంది. ఆనాటి కథకూ, నేటి కథకూ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మనిషి ప్రకృతి నుండి పూర్తిగా విడిపోయి ఒంటరిగా మరో ప్రక్క నిలబడి చెప్తున్న కథలు నేటివి. ఇక 'ఫస్ట్ లవ్' తో బాటు ఇందులో ఉన్న మరో రెండు ప్రేమ కథలు 'The District Doctor', 'The Lover's Meeting'. మొదటిది తన పేషెంట్ తో ప్రేమలో పడే డాక్టర్ కథైతే, రెండోది అమాయకంగా ఒక యువకుణ్ణి నమ్మి మోసపోయిన యువతి  కథ.

ఈ కథలు ఆధునిక సమాజం అధికంగా చెప్పుకుంటున్న 'కడుపునిండిన కథలు' కావు. తాత్వికత, ఆధ్యాత్మికత అంతర్వాహినిగా ప్రవహించే వచనంతో కూడిన కథలు. వీటిల్లో పల్లె జీవుల సమస్యలూ, పామరుల సంఘర్షణలూ, వారి భ్రమలూ, భయాలూ, ఊహాగానాలూ, సామాన్యుల సాధకబాధకల్లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అదే సమయంలో అన్ని కథల్లోనూ జీవన చిత్రాన్ని చూపించే ప్రయత్నమే కనబడుతుంది. ఎక్కడా నీతులు చెప్పకుండా, భావజాలాల్ని ప్రోపగాండా చెయ్యకుండా అలనాటి రష్యన్ లాండ్స్కేప్ ని అందమైన చిత్రంలా గీసి మనిషిగా మనడానికి అవసరమయ్యే ప్రాముఖ్యతలేవో మనల్నే తేల్చుకోమని అక్కడితో తన పనైపోయిందని  చేతులు దులుపుకుంటారు తుర్గెనెవ్. :)

హ్యాపీ రీడింగ్. :) 

Friday, December 16, 2022

Murder in the Age of Enlightenment: Essential Stories - Ryūnosuke Akutagawa

"It is better, I believe, to kill oneself than to endure spiritual bankruptcy" అనే వాక్యాలు చదివిన వారికి అకుతాగావా రచనలు పైకి కనిపించినంత సరళం కావని ఇట్టే అర్థమవుతుంది.

రెండేళ్ళ క్రితం ప్రఖ్యాత జాపనీస్ రచయిత Ryūnosuke Akutagawa 'త్రీ స్ట్రేంజ్ టేల్స్' అనే రచన చదివిన్నప్పుడు ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో ఆయన విలక్షణ శైలికి దాసోహం అయిపోయాను. తరువాత అకుతాగావా కథలు మరికొన్ని చదువుదామనుకున్నా వేరే పుస్తకాల ధ్యాసలోపడి కుదరలేదు, ఈలోగా పుష్కిన్ ప్రెస్ వారు  ఆయన కథల్లో కొన్నిటిని "Murder in the Age of Enlightenment: Essential Stories" పేరిట పుస్తకంగా తీసుకొచ్చారని తెలిసింది. ఎందుకో తెలీదు గానీ, "పుష్కిన్ ప్రెస్" రచనలంటే అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కొత్త చందమామ కథల పుస్తకాన్ని మిరపకాయ బజ్జీల పొట్లంతో కలిపి ఆఫీసు నుంచి వస్తూ వస్తూ నాన్నగారు తెచ్చి చేతిలో పెట్టినంత సంతోషంగా అనిపిస్తుంది. ఇక సగం సగం చదువుతున్న పుస్తకాలు కూడా ప్రక్కన పెట్టి ఈ పుస్తకం పట్టుకున్నాను. విచిత్రం ఏమిటంటే ఇది పూర్తి చేసినా కూడా ఎందుకో నాకు తనివితీరలేదు. మరికొన్ని కథల్ని చదవాలనిపించింది. ఒక రచయితని ఒకసారంటూ చదివాక మళ్ళీ వెంటనే రెండో పుస్తకం చదవడం నా వరకూ చాలా అరుదూ, అద్భుతమూను. అటువంటిది "హెల్ స్క్రీన్", "కాగ్ వీల్స్", "డెత్ రిజిస్టర్", "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" ఇలా చిన్న చిన్న నవలికల్ని పోలిన ఆయన రచనలన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్ళాను.

Images Courtesy Google

13 ఏళ్ళ సాహితీ ప్రస్థానానికి స్వల్పకాలంలోనే ముగింపు పలుకుతూ 35 ఏళ్ళకే జీవితాన్ని అంతం చేసుకున్న అకుతాగావా జీవితంపై మనోవైకల్యం ఉన్న ఆయన తల్లి ప్రభావం ఎక్కువ ఉందంటారు. తల్లిదండ్రుల దగ్గర బాల్యం రేకెత్తించిన భయాలకు దూరంగా తల్లి సోదరి చేరదీసినప్పుడు తాత్కాలికంగా సాహితీ లోకంలో శాంతిగా బ్రతికినప్పటికీ,  బాల్యం తాలూకూ చీకటి నీడలు ఆయన్ను జీవితాంతం వదిలిపోలేదు. ఈ కారణంగా స్కిజోఫ్రీనియా తాలూకూ భ్రమలతో, భ్రాంతులతో నిరంతరం భయాందోళనల మధ్యే జీవించారంటారు.

బహుశా ఈ కారణంగానే ఆయన కథల్లో వాస్తవానికీ, భ్రమకూ మధ్యనుండే  లోకాలకు చెందిన అస్పష్టమైన, అసంబద్ధమైన వర్ణనలు సృజనాత్మకత వైశాల్యపు పరిథుల్ని పూర్తిగా చెరిపేస్తూ పాఠకుల ఊహలకు రెక్కలిస్తాయి.  ఆయన కథ చెప్పే తీరు కొన్నిసార్లు ఖాళీ కాన్వాసు మీద కళాకారుడు గీసిన అందమైన చిత్రంగానూ, అదే సమయంలో అస్తవ్యస్తంగా, అపసవ్యమైన వెతుకులాటను తలపిస్తూ అసంబద్ధంగానూ అనిపిస్తుంది. ముఖ్యంగా 'కాగ్ వీల్స్', 'డెత్ రిజిస్టర్' , 'ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్' ఈ మూడు రచనలూ అకుతాగావా స్వానుభవాల ఆధారంగా రాసినవి కావడంతో రచయితగా ఆయన మెదడులోని మెకానిజమ్స్ ని మరికాస్త సానుభూతితో అర్థం చేసుకునే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. 'హెల్ స్క్రీన్' కథ అకుతాగావాలోని స్వచ్ఛమైన కళాకారుడి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

Hell Screen : "హెల్ స్క్రీన్" ఒక  కళాకారుడిగా తన స్వేచ్ఛ యొక్క పరిధుల్ని సవాలు  చేసిన చిత్రకారుడు యోషిహిడే కథ. యోషిహిడే జీవితాన్ని అడ్డం పెట్టుకుని అకుతాగవా ఈ కథలో అంతర్లీనంగా ఒక రచయితగా తన అంతఃసంఘర్షణనీ, మనఃస్థితినీ చెప్పుకున్నారా అనిపిస్తుంది. 

ఏ కళాకారుడి జీవితం అయినా సాధారణ సంఘజీవి మానసిక స్థితికి చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే సాహిత్యంలో కళను 'స్వేచ్ఛ' కు పర్యాయపదంగా వాడడం చూస్తుంటాం. కానీ కళాకారుడి స్వేచ్ఛకు పరిధులు ఏమిటనేదే నేటి వరకూ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏదేమైనా  గతాన్ని పరిశీలిస్తే, ఆ పరిధుల్ని సవాలు చేసినవారు మాత్రమే చరిత్రలో గొప్ప గొప్ప కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు, అటువంటి కళ ఉత్కృష్టమైన కళగా పరిగణింపబడుతోంది. దీనికి భిన్నంగా ఒక చట్రంలో ఇమడడానికి ప్రయత్నించిన కళాకారుడి సృష్టీ, సృజనాత్మకతలు అంతంతమాత్రమే. కళాసృజన విషయంలో నైతిక,సామాజిక విలువలకు సైతం తిలోదకాలివ్వడనికి వెనుకాడని యోషిహిడే అంతఃసంఘర్షణకూ, కళ పట్ల అతడికున్న నిబద్ధతకూ అద్దంపడుతుందీ కథ. 

నేను ఒకానొక సమయంలో చదివిన జె. ఎమ్. కోట్జీ, మిలన్ కుందేరా, హెస్సే , గిడే లాంటివాళ్ళతో బాటు ఇటీవలే చదివిన థామస్ బెర్న్హార్డ్ లాంటి రచయితలు కూడా ధృవీకరించినట్లు కళాకారుడికి సామజిక నైతికానైతికతలు వర్తించవు (?) , ఎటువంటి సామజిక చట్రంలోనూ అతణ్ణి ఇమడ్చడం సాధ్యపడదు. నిజమైన  కళాకారుడి మానసిక స్థితి నిరంతరం వాస్తవానికీ, కల్పనకూ మధ్య హేతువాదం, తర్కం చొరబడ వీలులేని ఒక రహస్య ప్రదేశంలో ఊగిసలాడుతూ ఉంటుంది.

కానీ సాంఘికంగా ఆమోదయోగ్యమైన సంప్రదాయవాదపు విలువలు వేరు. బౌద్ధంలో మానవజాతి నీతి నియయమాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి గాను ప్రధానంగా ఐదు ధర్మాలను ప్రతిపాదిస్తారు. 

* జీవహింస చేయరాదు. అనగా జీవించి ఉన్న ఏ ప్రాణినీ చంపరాదు.

* నీకు ఇవ్వనిదేదీ బలవంతంగా లాక్కోరాదు, అనగా చౌర్యం చెయ్యరాదు.

* ఇంద్రియాలను దుర్వినియోగం చెయ్యరాదు. అనగా భోగలాలసత్వాన్ని అదుపులో ఉంచుకుని ఇంద్రియ నిగ్రహం పాటించాలి. 

* దుర్భాషలాడరాదు.

* చిత్తమును భ్రమింపజేయు మత్తుపదార్థాలు ఉపయోగించరాదు.

కానీ యోషిహిడే కథ చదివినప్పుడు నిజమైన కళాకారుడి జీవితం ఈ ఐదు ధర్మాలనూ దాటుకుని గానీ మొదలవ్వదేమో అనిపిస్తుంది. ఈ కథలో ఒక పాత్ర ద్వారా, “Excel though he may in art, if a man does not remember the Five Virtues, his path can lead only to Hell.” అనిపించడంలో, కళాకారుడి నిబద్ధతను పాటించే క్రమంలో అకుతాగావా తన నైతిక పతనపు భారాన్ని దించుకునే ప్రయత్నం చేశారేమోననిపిస్తుంది.

"Murder in the Age of Enlightenment" లో అకుతాగావా రాసిన వాటిల్లో ప్రముఖమైన ఏడు కథలున్నాయి. [In a grove, Hell screen, Murder in the age of enlightenment, The General, Madonna in black, Cogwheels] 

The Spider's thread : ఇందులో చదివిన కథలన్నిటిలోనూ నైతికతను బోధించే కథ ఇదొక్కటే. ఇది పిల్లలకు కూడా చెప్పగలిగిన చిన్న ఫేబుల్ లాంటి నీతి కథ. నరకకూపంలోని రక్తపు సరస్సులో కాందాత తాను చేసిన పాపాలకు మిగతా జీవులతో శిక్షననుభవిస్తూ ఉంటాడు. అనేక పాపాల మధ్య అతడు చేసిన చిన్న దయగల పనికి సంతసించిన బుద్ధ శాక్యముని కాందాతకు నరకంనుండి విముక్తి కలిగించాలనుకుంటాడు. ఈ కథలో కాందాత సాలెగూడు దారాన్ని పట్టుకుని స్వర్గానికి ఎగబాకడం గురించిన వర్ణనల్లో అకుతాగావా జీవితంలో స్వర్గ-నరకాల నడుమ నిరంతరం జరిగిన ఊగిసలాట, మనోవైకల్యాలను అధిగమించి శాంతిగా బ్రతకాలనే తపన కనిపిస్తాయి.

ఇక ఈ కథల్లో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఒకటుంది. రాయడం విషయంలో నేను మునుపు చదివిన హెర్మన్ హెస్సే, ఉర్సులా లెగైన్, బోర్హెస్ , కాల్వినో, సిగిజ్మండ్ లాంటి కొందరు రచయితల శైలిలో కనిపించిన సారూప్యతే అకుతాగావా రచనల్లో కూడా కనిపించడం విశేషం. వీరందరి రచనల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం ఏమిటంటే, వీరికి పురాణేతిహాసాలూ, గ్రీకు రోమన్ మైథాలజీలతో పాటు, దేశ విదేశీ రచనలపై ఉన్న అపారమైన పట్టు. "కాగ్ వీల్స్" లో కనిపించే అనేకానేకమైన సాహితీ ప్రస్తావనలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. Strindberg’s Legends, Madame Bovary, డాంటే ఇన్ఫెర్నో, Stendhal, Anatole France, A Dark Night’s Passing, The Collected Letters of Prosper Mérimée వంటి అనేక ప్రస్తావనలు పాఠకులకు మునుపు పరిచయం లేని కాల్పనిక ప్రపంచాలకు తలుపుల్ని తెరుస్తాయి.

దీనికి తోడు "ది లైఫ్ ఆఫ్ ఎ స్టుపిడ్ మాన్" రచన మొదలవ్వడమే అకుతాగావా పఠనానుభవాలతో కూడిన ఈ ప్రారంభపు వాక్యాలతో మొదలవుతుంది. 

He was upstairs in a bookstore. Twenty years old at the time, he had climbed a ladder set against a bookcase and was searching for the newly-arrived Western books: Maupassant, Baudelaire, Strindberg, Ibsen, Shaw, Tolstoy, Nietzsche, Verlaine, the Goncourt brothers, Dostoevsky, Hauptmann, Flaubert …

Life is not worth a single line of Baudelaire.

ఇక మిగిలిన అకుతాగావా కథలు కూడా ఈ ఏడాది చదవాలని అనుకుంటూ, హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరో కొన్నివాక్యాలు : 

హెల్ స్క్రీన్ కథ నుండి,

After that, almost no one—at least not in the Horikawa mansion—spoke ill of Yoshihide. Perhaps this was because anyone who viewed the screen, no matter his accustomed loathing for the artist, was struck by the mysteriously solemn sentiment inspired by witnessing the mighty and wondrous tortures of Hell in all their manifest reality.

కురసోవా మాస్టర్ పీస్ 'రషోమాన్' పేరుతో తీసిన 'In a Grove' కథ గురించి తెలియని వారు అరుదు. ఈ వాక్యాలు అందులోవి. 

Oh, come off it. Killing a man isn’t as difficult as you people seem to think it is. At any rate, if you want to rob a man of his woman, it’s only natural that you’re going to have to kill him. Only, when I do it, I do it with a sword. People like you don’t use swords. You gentlemen kill with power, with money, sometimes with words alone—all on the pretence of doing a man a favour. True enough, no blood is shed. He might even live well. But you’ve killed him all the same. It’s hard to say whose sin is greater—yours or mine. [An ironic smile.]

ది జనరల్ కథ నుండి, 

Stendhal: Whenever I see a man decked in medals, I cannot help thinking how many cruelties he must have committed in order to be given such reward …

మడోన్నా ఇన్ బ్లాక్ కథ నుండి, 

Take a look. Do you see the engraving? Desine fata deum flecti sperare precando … ‘Cease to hope that the decrees of Heaven can bend to prayer.’”

With an instinctive sense of fear, I beheld the Madonna—the very embodiment of fate. Clad in blackest ebony, she wore a look of eternal indifference, her beautiful ivory face crossed by a cruel smile tinged with malice.

"కాగ్ వీల్స్" నుండి, 

“Great man”: this was the worst possible epithet anyone could have bestowed on me back then. I believed that I had committed all manner of sin, but still, whenever the opportunity arose, they went on calling me a “great man”. I couldn’t help but feel that I was somehow being mocked. By whom though? My affirmation of materialism did not allow such mysticism. Only a few months previously, I had written in a certain little niche magazine: “I have no artistic conscience; indeed, I have no conscience whatsoever. I have only nerves.”

Soon enough, I began to feel that anything and everything was a lie. Politics, industry, arts, science—all this seemed to me little more than a gaily coloured enamel concealing the true horror of human life.

“The Four Most Terrible Adversaries: Doubt, Fear, Arrogance, Lust”

As I sat there, staring at Napoleon, I thought of the works I had written. The first to drift into mind was “Words of a Dwarf” and its aphorisms—particularly the line, “Life is more hellish than Hell itself.” Then it was the fate of my artist Yoshihide, the protagonist of “Hell Screen”.

This mercurial change in attitude, from customary diffidence to sudden boldness, is one of my worse traits.

An hour later I found myself shut away in my room, seated at the desk in front of the window and making a start on a new story. My pen raced over the manuscript paper with a speed that I found quite astonishing, but after two or three hours it came to a halt, as though stayed by some invisible force. Having no other recourse, I stood up and began pacing about the room. It was at times like this that my megalomania was at its most extreme. In my savage joy, I felt that I had no parents, no wife or children, but only the life that gushed forth from my pen.

Not long after that, I was alarmed by the unexpected sight of a small white signboard hanging from the eaves of a shop. It was emblazoned with a trademark: an automobile tyre with wings. It made me think of the ancient Greek who placed his faith in artificial wings. He soared up high into the sky, until his wings were burnt by the sun and he went plunging into the ocean, where he drowned.

My only salvation now was sleep. But I didn’t have a single sleeping pill left. The grim prospect of more insomnia was utterly intolerable, but still, mustering a sort of desperate courage, I ordered coffee to be brought to the room and, like one demented, took up my pen. Two pages, five, seven, ten pages—the manuscript kept growing before my very eyes. I was filling the world of this novel with supernatural beasts, one of which was a self-portrait. But all of a sudden, fatigue began to cloud my head. At last I got up from the desk and lay down on the bed. I must have slept for forty or fifty minutes, when again I heard a voice whispering to me: “Le diable est mort.”

“To think, one minute you can be so detached from the world around, and the next, at the mercy of violent human passions …”

“To think, man can be virtuous one moment, and wicked the next.”

Monday, November 28, 2022

ముఖంపై మారే ముసుగులు చెప్పిన కథలు - లూగీ పిరాండెల్లో

"జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ పాత్రను నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే వేదికపై నువ్విక లేనట్లే" అనే ఇటాలియన్ రచయిత లూగీ పిరాండెల్లోను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించదు. ఆధునిక యుగంలో రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనిషికి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ సరికొత్తగా నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఆ కాలంలో కవులూ, రచయితలూ చేసిన సింహభాగం రచనల్లో ఈ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుంది. అటువంటి ఆధునిక యుగపు రచయితల్లో హెన్రిక్ ఇబ్సెన్, జార్జ్ బెర్నార్డ్ షా, శామ్యూల్ బెకెట్ వంటి వారికి సమకాలీనులైన నోబెల్ గ్రహీత లూగీ పిరాండెల్లో (1867-1936) కూడా ఒకరు. ఇబ్సెన్ సామజిక సమస్యల నేపథ్యంలో వాస్తవికతతో కూడిన రచనలు చేస్తే, బెకెట్ మనిషిలోని నిరాశా నిస్పృహలతో కూడిన సాంఘికమైన వేర్పాటుతనాన్నీ, సామజిక పరాయీకరణనీ ఆధారంగా చేసుకుని అసంబద్ధమైన అంశాలతో కూడిన రచనలు చేశారు, వీరిరువురికీ భిన్నంగా పిరాండెల్లో రచనలు మానసిక విశ్లేషణల చుట్టూ తిరుగుతాయి.

Image Courtesy Google

ఆధునిక రచయితలు తమ నాటకాల్లో మనస్తత్వ శాస్త్రంతోబాటు సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ వంటి వారి మానసిక విశ్లేషణలకు ప్రాధాన్యతనివ్వడం గమనిస్తాం. ఈ క్రమంలో పిరాండెల్లో నాటకాల్ని 'సైకో డ్రామా' శైలికి చెందిన రచనలుగా వర్గీకరిస్తారు. ఈ 'సైకో డ్రామా' అనే పదానికి సృష్టికర్త అయిన జాకబ్ లెవీ మోనెరో ఈ శైలికి చెందిన నాటకాలు మనుషులకు తమ మానసిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా సహాయపడగలవని భావిస్తారు. ఉదాహరణకు షేక్స్పియర్ 'హేమ్లెట్'ను ఈ శైలికి చెందిన నాటకంగా పరిగణిస్తారు. ప్రప్రథమంగా ఒక నాటక రచయితగానే ఖ్యాతిని కూడగట్టుకున్నప్పటికీ తరువాతి కాలంలో పిరాండెల్లో మంచి కథకుడిగా, నవలాకారుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రచనల్లో తరచూ 'కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్' ను ప్రధాన పాత్రగా చేస్తూ, "నేను ఎవరు ?", "ఏది వాస్తవం? ", "ఏది భ్రమ ?" అనే ప్రశ్నల్ని చర్చకు పెడతారు. ఒక సంఘజీవిగా స్పష్టమైన గుర్తింపు సంపాదించుకోవడంలో మనిషి ఎదుర్కునే సంక్లిష్టతల్నీ, భావప్రకటన విషయంలో మనుషుల మధ్య సంభాషణల్లోని అసంపూర్ణత్వాన్నీ, వాస్తవికత-భ్రమల మధ్య నిరంతరం స్థానభ్రంశం చెందే పరిధులనూ ఆయన తన రచనలకు థీమ్స్ గా వాడుకుంటారు.

19 వ శతాబ్దికి చెందిన ఆస్ట్రియన్ న్యూరాలజిస్ట్ ,సైకో ఎనాలిసిస్ ఆద్యుడూ   సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో మానసిక  విశ్లేషణలు ఎక్కువగా కనిపించడంలో నిజానికి వింతేమీ లేదు. పిరాండెల్లో రచనలు ఉపచేతనావస్థలో మానవ మస్తిష్కంలోని లోపలి పొరల్ని మానసిక విశ్లేషణల ద్వారా విడదీసే ప్రయత్నం చేస్తూ, మనిషి యొక్క ఉనికినీ, గుర్తింపునీ శోధిస్తాయి. అలాగని ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మనిషి మెదడులోని రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలమే దీనికొక కారణం కావచ్చు. నిజానికి ఫ్రాయిడ్, పిరాండెల్లో, ఈ ఇద్దరి రచనల్లోనూ సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ,  వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. కానీ ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణలు చదువుతున్నప్పుడు, వాటిల్లో కనిపించే మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అసంబద్ధంగా  ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్తుల్ని పోలి ఉంటాయి. ఈ కారణంగా మనిషి ప్రవర్తనా సరళిలో అసహజంగా అనిపించే లోపాలూ, పిచ్చితనంలాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. Six Characters in Search of an Author ,హెన్రీ-IV ఈ రెండు నాటకాల్లోనూ ప్రధాన పాత్రలు గతాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ వర్ణన జ్ఞాపకాల్లో నుండీ, అచేతనావస్థలో నుండీ వచ్చేది కావడం వల్ల వాళ్ళు ఆ క్రమంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకూ, అస్థిమితానికీ లోనవడం చూస్తాం. పిరాండెల్లో కథల సంపుటి 'The Tales of Madness' లో మనిషిలో విపరీత ధోరణులు మొదలుకుని చిత్త వైకల్యాలవంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు. ఈ కథల్లో అస్తిత్వవాదాన్ని విశ్లేషించడానికి 'madness' ను ఒక మెటఫోర్ గా వాడతారు. మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం మానసికవైకల్యాలపై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు.

ప్రతి మనిషిలో మనకు తెలిసి కొంతా, తెలియక కొంతా పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని పిరాండెల్లో కథలు  నిరూపిస్తాయి. వాస్తవం నుండి దూరం జరగడం, ఏదో జరుగుతుందని భయపడడం, నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం, సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం లేదా 'తను' కాని తనను సామాజిక చట్రంలో ఇమిడ్చేసుకోవడం, ఈ కారణాల వల్ల ఉత్పన్నమయ్యే అనేక భయాలూ, బాధలూ, కోపతాపాలు, నిరాశా-నిస్పృహలూ వెరసి పిరాండెల్లో కథలు అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మెదడులోని రహస్యాలను లోతంటా కొలవడానికి ప్రయత్నిస్తాయి.

పిరాండెల్లో అస్తిత్వాన్ని నిరంతరం రూపాంతరం చెందుతూ మిగిలిపోయే  జ్ఞాపకంగానూ, మనిషి గుర్తింపుని కాలాన్ని బట్టి నిరంతరం మారే ముసుగు  వెనుక రహస్యంగానూ చూస్తారు. అందువల్ల మనిషి తన స్పష్టమైన ఉనికిని నిర్వచించుకోవడం దాదాపూ అసాధ్యమనేది ఆయన వాదన, అందునా భావదారిద్య్రం రాజ్యమేలే ఆధునిక సమాజం ఇటువంటి అంశాలను పూర్తిగా కోల్పోయిందని మనసావాచా నమ్మేవారాయన. అందువల్ల ప్రతి మనిషీ తనని తాను కోల్పోయి మాత్రమే ఇటువంటి ఒక వ్యవస్థలో భాగం కాగలడని ఆయన రచనలన్నీ మనకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరూపించే ప్రయత్నం చేస్తాయి. ఈ కారణంగానే పిరాండెల్లో పాత్రలన్నీ సంఘజీవిగా రూపాంతరం చెందే క్రమంలో తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఒక అనుకూలమైన ముసుగు చాటున దాచే ప్రయత్నం చేస్తాయి.'హెన్రీ IV' నాటకంలో ప్రధాన పాత్రధారికి గుర్రం మీద నుండి పడిపోవడంతో మతిస్థిమితం తప్పుతుంది. కానీ అతడు కొంతకాలానికి కోలుకుని మామూలు మనిషైనప్పటికీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని సమాజం నుండి దాచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా పిచ్చివాడిలా నటిస్తుంటాడు. ఇలా తన అస్తిత్వాన్ని చెరిపేసుకుని నటించడం ద్వారా అతడు సామజిక శృంఖలాలనుండి తప్పించుకుని స్వేచ్ఛగా తనకు తోచినట్లు జీవించే అవకాశం ఉందని భావిస్తాడు. పిరాండెల్లో నవలల్లో బాగా పేరుపొందిన నవల 'ది లేట్ మటియా పాస్కల్' కూడా ఇటువంటి కథే. మరణించాడని సమాజం పొరపాటుగా భావించిన కథానాయకుడు తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని, వారికి నిజం చెప్పకుండా తన అస్తిత్వాన్ని సరికొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త జీవితం ప్రారంభించాలని తలపోస్తాడు. ఈవిధంగా మనిషి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ కనుగొనడానికి సహాయపడే శాస్త్రమైన కార్ల్ యుంగ్ మానసిక విశ్లేషణల్ని 'Six Characters in Search of an Author' ,'హెన్రీ -IV', 'The Late Mattia Pascal' వంటి రచనల ద్వారా పిరాండెల్లో తన కాల్పనిక ప్రపంచాలకు అన్వయించడాన్ని చూస్తాం. కార్ల్ యుంగ్ ఇగోని మనిషి గుర్తింపుకి కేంద్రంగా చూస్తారు. ఈ కారణంచేత ఎవరైనా తన వ్యక్తిత్వానికి ఒక ముసుగు తొడుక్కున్నప్పుడు తనని తాను ఆ ముసుగు ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతాడు కాబట్టి అతడు తన స్వతఃసిద్ధమైన ఐడెంటిటీని కోల్పోతాడని ప్రతిపాదిస్తారాయన. ఒకవేళ పైకి అగుపించే ఆకారస్వరూపాలే మనిషి అస్తిత్వాన్ని నిర్వచించే చిహ్నాలైతే, ఆ వాస్తవికత నిరంతరం రూపాంతరం చెందుతుందని పిరాండెల్లో రచనలు పదేపదే నిరూపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఆయన దృష్టిలో ఖచ్చితమైన, విశ్వజనీనమైన వాస్తవమంటూ అసలుండే అవకాశం లేదు కాబట్టి భ్రమను అపాయకారిగా కంటే ఒక వ్యక్తిగత ధృవీకరణగా, సమాజానికి సవాలు విసిరే అంశంగా చూడాలన్నది ఆయన భావన. 

పిరాండెల్లో కథల్లో నేపథ్యాలే కాదు ఆయన కథ చెప్పే తీరు కూడా విలక్షణంగా ఉంటుంది. జీవితంలోని అబ్సర్డిటీకి హాస్యాన్నీ, వ్యంగ్యోక్తుల్నీ జోడించి దాన్నొక హాస్య కథలా చెప్పడం ఆయన ప్రత్యేకత. కథలో ఎక్కడో ఒకచోట లోతైన విషయం చర్చిస్తున్నారనుకునేలోగా ఉన్నట్లుండి చిన్న చమత్కారం దొర్లుతుంది. మరోచోట ఏదో ఒక సరదా సందర్భంలో అంతర్లీనంగా నిరాశా నిస్పృహలు, ఇదిగో మేమున్నామంటూ తొంగిచూస్తాయి. ఇంకోచోట మానవసంబంధాలను ఆవిష్కరించే క్రమంలో ఉన్నట్లుండి తాత్వికత తెరపైకొస్తుంది. ఆయన కథల్లో వర్ణనలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఆయన శైలి పాదరసంలా ఒక వర్ణన నుండి స్వగతానికీ , స్వగతం నుండి ఒక నాటకీయ సంభాషణకూ, దాన్నుండి ప్రత్యక్ష ఉపన్యాసానికీ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో గమనించే సమయం పాఠకులకు ఇవ్వరు. 

తాను జీవించి ఉన్న కాలంలో సుమారు 200 పై చిలుకు కథలు రాసిన ఆయన, తాను తొలినాళ్ళలో రాసిన కథల్నే పునాదులుగా చేసుకుని తరువాతి కాలంలో అనేక నాటకాలకు రూపకల్పన చేశారంటారు. ఆయన కథల్లో అంతఃసంఘర్షణలూ, వ్యక్తిగత సమస్యల ఆధారంగా రాసివి కొన్నైతే, అధికశాతం కథలు మాత్రం మనిషి సామజిక సాలెగూడులో చిక్కుకుని ఎదుర్కునే సంఘర్షణలూ, సామజిక కట్టుబాట్లను ఉల్లంఘించలేని నిస్సహాయత వల్ల సంఘజీవిగా మనడానికి అవసరమయ్యే ముసుగు ధరించే దిశగా పురిగొల్పే పరిస్థితుల (పిరాండెల్లో చాలా ఏవగించుకునే విషయం ) చుట్టూ తిరుగుతాయి. బహుశా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పాఠకులు పిరాండెల్లో రచనల్ని ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా ఇదే కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో పాత్రల జీవితాలు విధి లిఖితంగా,ఊహించని మలుపులతో అనూహ్యంగా ఉంటాయి. అనేక వైరుధ్యాల పోగుగా ఉండే విభిన్నమైన మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు లూగీ పిరాండెల్లో. కాల్పనికత, వాస్తవికతలనే రెండు పాయలనూ రెండు వైపుల నుంచీ సరిసమానంగా అల్లుకొచ్చి చిట్టచివరకి వాస్తవికతకు ముడి పెట్టడంలో పిరాండేల్లో నైపుణ్యం ఆయన ప్రతీ రచనలోనూ కనిపిస్తుంది. ఆయనను చదవడమంటే తాత్వికతనూ, మానసిక తత్వశాస్త్రాన్నీ, అస్తిత్వవాదాన్నీ, కాల్పనికతనూ అన్నిటినీ సమపాళ్ళలో కలిపి వండిన విందుభోజనం చెయ్యడంలా ఉంటుంది. పిరాండెల్లో రచనలు పాఠకులకు అన్నిఅంశాలూ తగుపాళ్ళలో కుదిరిన ఒక పూర్తి స్థాయి రచన చదివిన తృప్తినిస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో కనబరిచే నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 28th నవంబర్ 2022

https://www.andhrajyothy.com/2022/editorial/stories-told-by-changing-face-masks-956143.html

https://epaper.andhrajyothy.com/Home/ShareImage?Pictureid=e0fe4a13

Monday, September 19, 2022

Loveless Love - Luigi Pirandello

గ్రీసులోని డెల్ఫిలో ఒక పురాతన అపోలో దేవాలయంలో జ్ఞానసముపార్జన వైపు ప్రయాణించే మార్గాన్ని సూచించే తొలివాక్యంగా " Know thyself" అనే చెక్కడం ఉంటుందట. ఈ మూడు కథలకూ కలిపి అటువంటి ఒక శిలాశాసనం రాయాలంటే "Thou canst not know thyself " అని రాస్తే సరిగ్గా సరిపోతుందంటారు ఈ కథలను ఆంగ్లంలోకి అనువదించిన జె.జి.నికోల్స్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో. మనం ఏమిటో, మనకి కావాల్సింది ఏమిటో స్పష్టత లేనప్పుడు జీవితం నరకప్రాయమవుతుందని చెబుతాయీ కథలు. కానీ ఆ స్పష్టత సాధించడం అంత సులభమేం కాదంటారు మానవ మనస్తత్వాల లోతులు తెలిసిన రచయిత పిరాండెల్లో.

ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు "ఇట్స్ కాంప్లికేటెడ్" అనడం తరచూ వింటుంటాం. నిజానికి ప్రేమ చాలా సరళమైన అనుభవం. కానీ మనకు ప్రతీ చిన్న విషయాన్నీ సమస్యగా చేసుకోవడం పట్ల ఆసక్తి మెండు కాబట్టి దాన్ని కూడా సంక్లిష్టమైనదిగా చేసుకుంటామనిపిస్తుంది. నోబెల్ గ్రహీతా, ఇటాలియన్ రచయితా లూగీ పిరాండెల్లో 'లవ్ లెస్ లవ్' అనే రచనలో మూడు కథలూ ప్రేమ తాలూకూ సంక్లిష్టతల చుట్టూనే తిరుగుతాయి. నిజానికి అన్నీ సరళంగా సజావుగా జరిగిపోతే ఇక చెప్పుకోడానికి కథలేం ఉంటాయి !

Image Courtesy Google

19 శతాబ్దికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో సైకో ఎనలిటిక్ విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మానవ మస్తిష్కంలో రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలం దీనికొక కారణం  కావచ్చు. సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. అందువల్ల ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ చదువుతున్నప్పుడు అందులో మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి  మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అబ్సర్డ్ గా ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్థుల్ని పోలి ఉంటాయి. అందువల్ల వారి ప్రవర్తనా సరళిలో లోపాలూ, పిచ్చితనం లాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదేమో.

మొదటి కథ 'ది వేవ్', తన ఇంట్లో అద్దెకున్న ప్రతీ అమ్మాయితోనూ ప్రేమలో పడే అలవాటున్న జూలియో అనే ఒక యువకుడి కథ. ఇక్కడ ఒక చిత్రమైన అంశం ఏమిటంటే, అతడు ఆ అమ్మాయి తిరిగి ప్రేమించగానే ఆమెకు దూరం జరిగి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. ఎటువంటి నిబద్ధతా లేకుండా తన మనసుని నేర్పుగా అదుపు చేసుకుంటూ ఇతరుల భావోద్వేగాలతో ఆడుకునే అలవాటున్న అతడు చివరకు తన ఆత్మన్యూనత, అసూయల కారణంగా అవే భావోద్వేగాల తూఫానులో చిక్కుకుని ఎలా సతమతమవుతాడో చెబుతుందీ కథ. జూలియో సంక్లిష్టమైన మనస్తత్వంపై  అగాథా కల్మషంలేని అమాయకత్వం పరోక్షంగా సాధించిన విజయానికి (?) ఈ కథ ఒక మంచి ఉదాహరణ. పిరాండెల్లో ఈ కథను రక్తికట్టించిన తీరు చాలా బావుంది.

రెండో కథ 'ది సిగ్నోరినా' కూడా దాదాపూ మొదటి కథలాంటిదే. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్  ప్రకారం వేటాడడం (ఛేజ్), దేన్నైనా తన సొంతం చేసుకునేవరకూ వదిలిపెట్టకపోవడం మగవాడి నైజం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విధానం అతడి జీవితకాలమంతా కొనసాగుతుంది. దీనికి భిన్నంగా స్త్రీ తనకు కావల్సినది దొరికాక, కోరుకున్నది సొంతం చేసుకున్నాకా స్థిరత్వాన్ని ఆశిస్తుంది. ఈ ఫ్రాయిడ్ విశ్లేషణలను ఆధారంగా చేసుకుని అల్లిన కథలే పై రెండూను. తన సామజిక స్థాయికి తగిన స్త్రీ కాదని ప్రేమించిన జూలియాని తిరస్కరించిన లూసియో , ఆమెకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి వరుడుగా రావడం పట్ల తీవ్రమైన అసూయతో ఆ సంబంధం చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడి స్థానంలో ఆమెకు గంతకు తగ్గ బొంతలా సరిపోయే తన స్నేహితుడు మార్జానీని వివాహమాడమని ప్రతిపాదిస్తాడు. లూసియోను ఎంతో ప్రేమించినప్పటికీ అతడి నిజస్వరూపం తెలుసుకున్న తరువాత జూలియా తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది మిగతా కథ. ప్రేమించిన మనిషి తనకి దక్కకపోయినా ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడం నిజమైన ప్రేమికుల లక్షణం. కాగా తనకు దక్కనిదాని వినాశనాన్ని కోరుకోవడం కౄరత్వం. తన అసూయాద్వేషాలనూ, ఆధిపత్య ధోరణినీ ప్రేమగా భ్రమించే లూసియో కథ ఇది. ఇక మూడో కథ 'ఎ ఫ్రెండ్ టు ది వైవ్స్', పై రెంటికంటే కాస్త భిన్నంగా ఉన్న కథ. ఈ కథ చాలా అసహజంగా అనిపించడంతో నాకు పెద్దగా నచ్చలేదు.

పిరాండెల్లో రచనల్లో ఇది తొలిసారిగా ప్రచురితమైన కథల పుస్తకం అని రాశారు. నేను కొన్నేళ్ళ క్రితం 'టేల్స్ ఆఫ్ మ్యాడ్నెస్' , 'ఆయిల్ జార్ అండ్ అదర్ స్టోరీస్' అనే రెండు కథల సంపుటులు చదివి ఉన్నాను కాబట్టి ఆ కథల్లో కనిపించిన పదును తొలినాళ్ళలో రాసిన ఈ కథల్లో లేదనిపించింది. ఏదేమైనా ప్రేమికుల తగాదాలూ, విరహాలూ, పరితాపాలూ, అసూయలూ, అమాయకత్వాలూ, మాటల్లేని సంభాషణలూ చదివే సరదా ఉంటే ఈ కథలొకసారి చదవొచ్చు. హ్యాపీ రీడింగ్ :) 

Wednesday, September 7, 2022

Lady Macbeth of Mtsensk - Nikolai Leskov

ఆ మధ్య ఓటీటీ సినిమాల వ్రతంలో బిజీగా ఉండగా 'లేడీ మాక్బెత్' పేరుతో ఒక సినిమా కనిపించింది. పీరియడ్ డ్రామాలంటే అమితమైన ఇష్టం కాబట్టి ఆ ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించి చూడగా అది రష్యన్ రచయిత నీకొలాయ్ లెస్కోవ్ కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని తెలిసింది. నిజానికి లెస్కోవ్ రచనలతో నాకాట్టే పరిచయం లేదు. తీరా బుక్ అడాప్టేషన్ అని తెలిశాక పుస్తకం చదవకుండా సినిమా చూడడం మా బుక్ నెర్డ్ల ప్రపంచంలో ఘోరమైన పాపంగా పరిగణిస్తాం కాబట్టి ఆ కథేదో చదివేశాక సినిమా చూద్దామని ముందుగా ఆ కథ చదివాను, తరువాత సినిమా చూశాను. లెస్కోవ్ కథను మూలాంశంగా తీసుకోవడం మినహా మూలకథకూ, సినిమాకూ ఎక్కడా పోలికలు లేవు. బ్రిటిష్ అడాప్టేషన్ కాబట్టి రష్యన్ పేర్లైన 'కాటెలినా' ను 'క్యాథెరిన్', 'సెర్జీ' ని 'సెబాస్టియన్' వంటి బ్రిటిష్ పేర్లుగా మార్చారు.

Image Courtesy Google

షేక్స్పియర్ 'మాక్బెత్' ద్వారా ప్రభావితమై రాసిన ఈ కథకు ఫ్లాబర్ట్ 'మేడమ్ బోవరీ', టాల్స్టాయ్ 'అన్నా కరినిన'లతో కూడా కొన్ని పొంతనలు కనిపిస్తాయి. సంతానలేమీ, మారుమూల పల్లెలో ఖైదులాంటి ఇంట్లో నిస్సారమైన జీవితం వెరసి ఉన్నత వ్యాపారస్థుల కుటుంబానికి చెందిన స్త్రీ కాటెలినా వివాహేతర సంబంధానికి దారి తీస్తాయి. కాటెలినా భర్త జినోవీ వద్ద పనిచేసే సెర్జీతో ఆమె వివాహేతర సంబంధం ఒక పాపం మీద మరో పాపంగా మారి వరుస హత్యలకు కారణమవుతుంది. కామం, ధనవ్యామోహం, దురాశ, స్వార్థం ఇవన్నీ పెచ్చుమీరితే మనిషి ఏ స్థాయికి దిగజారతాడో చెప్పడానికి కాటెలిన్ పాత్ర ఒక మంచి ఉదాహరణ. కానీ టాల్స్టాయ్ అన్నాలో కనిపించే మానవీయ సహజ గుణాలైన నిస్సహాయత, బలహీనత,అపరాధభావం, పశ్చాత్తాపం లాంటివి లెస్కోవ్ కాటెలినాలో ఎంత వెతికినా కనిపించవు. అన్నాలో అణువణువునా కనిపించే 'గ్రేస్' లెస్కోవ్ కాటెలినాలో శూన్యం. తనకు కావలసింది సొంతం చేసుకునే క్రమంలో ఏ పని చెయ్యడానికైనా వెనుకాడని ఆమె వ్యక్తిత్వమే పూర్తి లోపభూయిష్టం. ఆమెను చూసి ఏ సందర్భంలోనూ "అయ్యో" అనిపించదు.

ఇది నాణానికి రెండో వైపు కథను పూర్తిగా వదిలేసి ఒక మగవాడి దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పిన కథ. కథలో rawness కనిపిస్తుంది. టాల్స్టాయ్ రచనల్లో స్త్రీలపట్ల కాసింత సహానుభూతీ, గౌరవం కనిపిస్తాయి. దీనికి కారణం ఆయన ఉన్నతవర్గానికి చెందిన సమాజంలో భాగమని కొందరు అభిప్రాయపడతారు. లెస్కోవ్ శైలి మన్ననలూ, మర్యాదలూ లేని ఆనాటి దిగువమధ్యతరగతి రష్యన్ సమాజాన్ని చూపించింది. ఆయన ప్రపంచంలో మానవీయ ప్రవృత్తిలో మోటుదనం, క్రూరత్వం యధాతథంగా చిత్రిక పట్టినట్లుంది. జన్మతః పేద కుటుంబం నుంచి వచ్చిన స్త్రీగా కాటెలినా లో ఎటువంటి నైతిక నియమాలకూ లోబడని తెగింపు, స్వార్థం కనిపిస్తాయి. ఆమెకు కావలసిందల్లా పాపభీతికి ఆస్కారం లేని అచ్చమైన 'అనుభవం' మాత్రమే. అన్నాలో కనిపించే ద్వైదీభావం కాటెలినాలో లేదు. నాకు ఆమెలోని "స్వచ్ఛమైన మృగతృష్ణ " అస్సలు నచ్చలేదు.

ఎటొచ్చీ షేక్స్పియర్ 'మాక్బెత్' ని అనేక వ్యక్తిత్వ వైరుధ్యాల నడుమ ప్రతినాయకుడిగా కంటే కథానాయకుడిగా చూడగలిగిన సమాజం కాటెలినాను అదే సమదృష్టితో ఎందుకు చూడలేదా అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. రాబర్ట్ చాండ్లెర్ అనువాదంలో NYRB క్లాసిక్స్ వారు ప్రచురించిన లెస్కోవ్ కథల సంపుటిలో ఈ కథ కూడా ఒకటి. ఈ చిన్నపాటి నవలిక లెస్కోవ్ శైలిని నాకు తొలిసారి పరిచయం చేసింది.

Tuesday, December 14, 2021

ముళ్ళకంపల వాస్తవంపై విరబూసిన కల్పన - ‘సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ

1932 లో మాక్సిమ్ గోర్కీ ని సిగిజ్మండ్  క్రిఝిఝానోవ్‍స్కీ (1887–1950) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని కోరారట. నిజానికి  సిగిజ్మండ్ సాహితీరంగంలో ఆనాటికి ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. అప్పటికే 'ఆల్ యూనియన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియెట్ రైటర్స్' కి తొలి ఛైర్మన్ గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్న గోర్కీ, సోవియెట్ యువ రచయితలకు 'సోషలిస్ట్ వాస్తవిక సాహిత్యం' భవిష్యత్తు విషయంలో దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కానీ తన రచనల్ని పరిశీలించే నిమిత్తం గోర్కీ చేతిలో పెట్టడమనే ఈ ఒక్క తప్పిదానికీ సిగిజ్మండ్ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సొచ్చింది. గోర్కీ విమర్శలు సిగిజ్మండ్ కు ఒక రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన 'సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ' అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్ రచనలు ఆనాటి 'సోవియెట్ లిటరరీ ఎస్థెటిక్స్' కి  తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పరబట్టారట : "నేను మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్ని వాటి యొక్క తాత్వికమైన విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో, తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం,పాండిత్య ప్రకర్ష ఆనాటి మేథావి వర్గాల్లో ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలమది. పండితులందరూ సమోవర్ చుట్టూ సమావేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్ వర్డ్ ప్లే - lukavoe prazdnoslovie) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవజాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి కంటే అతడి కర్మల ద్వారానే సృష్టించబడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అందువల్ల మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనలకు ప్రచురణకర్తలు దొరుకుతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ  దొరికినప్పటికీ వాళ్ళు నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా ! "

Image Courtesy Google

ఇటువంటి తీవ్రమైన విమర్శలు చెయ్యడం ద్వారా గోర్కీ సిగిజ్మండ్ ఒక రచయితగా వాస్తవదూరమైన  విషయాసక్తితో (Self-indulgent untimeliness) ఘోరమైన పాపానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బాధ్యతగల రచయితగా సోసియెట్ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. యుద్ధ సమయంలో రచయితలు  వాస్తవాన్ని విస్మరించి పదసౌందర్యాలపై అనురక్తితో తాత్వికమైన విషయాల్లో మునిగితేలడం నేరమన్నది గోర్కీ భావన. నిజానికి గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్ ను 19 వ శతాబ్దానికి చెందిన రచయితగానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్ పై 19వ శతాబ్దపు రష్యన్ సింబాలిజాన్ని పెద్ద ఎత్తులో నిర్వచించిన నీకొలాయ్ గొగోల్, ఎడ్గర్ అలాన్ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్ శైలికీ  గొగోల్ శైలికీ చాలా పొంతనలుంటాయి. ఉదాహరణకు 'ది రన్ అవే ఫింగర్స్' (1922) అనే కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతడి చెయ్యినొదిలి పారిపోవడం గొగోల్ 'ది నోస్' కథను తలపిస్తుంది. సిగిజ్మండ్ కథానాయకులు కూడా గొగోల్ కథానాయకుల్లాగే కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్ 'ది ఓవర్ కోట్', సిగిజ్మండ్ 'క్వాడ్రాటురిన్' కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథానాయకులు వృత్తి,ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టు సిగిజ్మండ్ ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయినట్లుండే ఆయన కథలు అర్థంకావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్ లాంటి సిగిజ్మండ్ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.

ఉక్రెయిన్ లోని కీవ్ లో పుట్టిన పోలిష్ మాట్లాడే కుటుంబానికి చెందిన సిగిజ్మండ్ డొమినికోవిచ్ క్రిఝిఝానోవ్‍స్కీ 1919-1950 ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే ప్రచురించబడ్డాయి. మాస్కో సాహితీలోకంలో పలు మేథావుల మన్ననలందుకున్నప్పటికీ క్రిఝిఝానోవ్‍స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల,ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగా 1949 లో గుండెపోటుతో రచయితగా సిగిజ్మండ్ కెరీర్ ముగిసిపోయేవరకూ ఆయన మాస్కో సాహితీలోకంలో (నాన్ అకడమిక్) విమర్శకునిగా,సంపాదకునిగా మాత్రమే పనిచేశారు. దీనికి తోడు సిగిజ్మండ్ స్టాలిన్ కంటే మూడేళ్ళు ముందుగానే మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధవాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్ లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్ 1920 ల తొలి కాలంలో ఈ నియంతృత్వపు కాలాన్ని 'ఫెంటాస్టిక్' శైలిలో రూపకాలు,ఉపమానాలతో కూడిన కాల్పనిక  సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు. 

భావవ్యక్తీకరణ నేరమైన నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయితలూ,కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్ శకంలో ఇటువంటి రచయితలు  రెండు రకాలనుకుంటే,  అలెగ్జాండర్‌ సోల్జెనిత్సిన్‌, విక్టర్ సెర్జీ, మిఖాయిల్ బల్గకోవ్, బోరిస్ పాస్టర్నాక్ వంటి రచయితలు స్టాలిన్ సోవియెట్ రష్యా విప్లవం, సివిల్ వార్ కాలం నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవిధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృదయాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిఝిఝానోవ్‍స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని కౄరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి తీసుకువెళతాయి. 1930 ల్లో సిగిజ్మండ్ జీవించి ఉన్న కాలంలో తనను తాను రచయితగా కంటే థియేటర్ ప్రొఫెషనల్ గా, సాహితీ విమర్శకునిగానే చూసుకున్నారంటారు. షేక్స్పియర్,జార్జ్ బెర్నార్డ్ షా ల ప్రభావం అధికంగా ఉన్న తన కథలను నిర్లక్ష్యం చేసినా వారిద్దరి రచనల్నీ మాత్రం తనదైన శైలిలో విశ్లేషిస్తూ విస్తృతమైన పరిశోధనలు చేసి పలు వ్యాసాలు ప్రచురించారు. ఈ కారణంగా సాహితీ రంగంలో సిగిజ్మండ్ ఒక ప్రత్యేకమైన 'nonacademic sort of Shakespeare critic'  గా పేరు తెచ్చుకున్నారు. 

క్రిఝిఝానోవ్‍స్కీ రచనలపై షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన తనను తాను ప్రప్రథమంగా 'ఎక్స్పెరిమెంటల్ రియలిస్టునని' చెప్పుకునేవారు. స్టాలినిస్ట్ సెన్సార్షిప్ కారణంగా సిగిజ్మండ్ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా Joanne Turnbull, Nikolai Formozov వంటి సంపాదకుల దృష్టికి వచ్చి 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలు వెలువడ్డాయి. రచయితలుగా భిన్న ధృవాలైనప్పటికీ సిగిజ్మండ్ రచనా శైలిని ఆధునిక రచయితల్లో ఒకరైన వ్లాదిమిర్ షరోవ్ శైలితో పోలుస్తారు కార్ల్ ఎమర్సన్. వీరిద్దరి శైలుల్లో ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సినెస్థీసియా అంటారు, అంటే కథ చెప్పేటప్పుడు ఇద్దరూ సినెస్థీసియాను మూలాధారంగా చేసుకుని చెబుతారు. నిజానికి మనిషికుండే  పంచేంద్రియాలు మెదడులోని వేర్వేరు భాగాలను చైతన్యవంతం చేస్తాయంటారు. కానీ సినెస్థీసియా కారణంగా ఒక ఇంద్రియ చైతన్యం మరో ఇంద్రియం చేత ఉద్దీపితమవుతుంది. ఉదాహరణకు సంగీతం విన్నప్పుడు మనం కొన్ని రంగుల్ని చూడడం తటస్థిస్తుంది. లేదా ఏవైనా అంకెలు చూసినప్పుడు మనకు కొన్ని రంగులు జ్ఞప్తికి వస్తాయి, ధ్వనులకు వాసనలుంటాయి, స్వరాలకు వర్ణాలుంటాయి, లేదా ఏదైనా వాక్యాలను విన్నా,చదివినా శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణం జనించిన భావన కలుగుతుంది, ఇలా మెదడు అనేక అనుభూతులకు లోనవుతుంది. నిజానికి జీవశాస్త్ర పరంగా చూస్తే ఈ సినెస్థీసియా ఇంద్రియ సంబంధమైనది కాదు. ఈ సాహితీ ప్రక్రియ పాఠకులపై ప్రభావం చూపే రీతిలో అర్ధవంతమైన వాక్యాలను శ్రద్ధగా ఏర్చి కూర్చిన కృత్రిమమైన నిర్మాణం. ఈ సినెస్థీసియాను పాఠకులపై సమర్థవంతంగా ప్రయోగించడానికి రష్యన్ విప్లవం, సివిల్ వార్లను వేదికగా చేసుకున్నారు సిగిజ్మండ్.

సిగిజ్మండ్ దృష్టిలో భాష గతిశీలమైనది. కొన్ని కథల్లో సిగిజ్మండ్ పదాలూ,అక్షరాలూ పేజీని వీడి పైకి ఎగసిపడుతున్న అలల్లా ఒకదానితో ఒకటి తలపడుతున్నట్లుంటాయి. దీనికి తోడు ప్రవృత్తి రీత్యా ఏకాకి జీవితాన్ని ఇష్టపడే అంతర్ముఖత్వం సిగిజ్మండ్ కథల్లో కాంటియన్ భావజాలానికి సంబంధించిన మెటాఫిజికల్ ప్రపంచాలు ఎక్కువ కనబడడానికి ఒక ముఖ్య కారణం. కథ చెప్పే సమయంలో సిగిజ్మండ్ దృష్టి ఎల్లప్పుడూ మానవ మస్తిష్కం లోలోపలి పొరల్లో ఎవరూ చొరబడడానికి సాహసించని మారుమూల ఏకాంత ప్రదేశాలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన కథా వస్తువు (లేదా కథానాయకుడు) ఆ మెదడు లోపలి పొరల్లోంచి సూటిగా వెలుపలికి ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున వెలుపలికి దూసుకువచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ సమయంలో ఎటువంటి వైకల్యాలకూ తావివ్వకపోవడం సిగిజ్మండ్ ప్రత్యేకత.

యుద్ధంతో వినాశనాన్ని చవిచూసిన కీవ్ నుండి బయటపడి 1922 లో మాస్కో లో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్. కాసేపు సిగరెట్ ముట్టించి అది కాలే లోగా కథ రాసి సిగరెట్ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచయితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ,ప్రవృత్తికీ నిజాయితీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్. నార్వే రచయిత కనూట్ హాంసన్ బాటలోనే సిగిజ్మండ్ కూడా కథ రాయడం కోసం ఏకంగా తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సిగిజ్మండ్ అనువాదకుల్లో ఒకరైన కార్ల్ ఎమర్సన్ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. ఎమర్సన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి రాసిన ఒక వ్యాసంలో సిగిజ్మండ్ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలిలోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునేవారని అంటారు. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక,మానసిక సమతౌల్యంలోనుంచి పుడుతుందనీ సిగిజ్మండ్ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి. 

అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి  'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్ ఎమర్సన్ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిఝిఝానోవ్‍స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవిచూసిన క్రిఝిఝానోవ్‍స్కీ  ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "డూ యూ లవ్ పుష్కిన్ ?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక "ఐ...ఐ......" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య బోవ్షెక్ చెప్తూ, ఆ సమయంలో ముప్ఫయ్ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అన్న ఊహ రాక మానదు. 'కాంటియన్ థింకర్' (ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న క్రిఝిఝానోవ్‍స్కీ రచనలు మోతాదుమించిన తార్కికతతో ఉండడం వల్ల వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ  తీర్మానించడంతో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" క్రిఝిఝానోవ్‍స్కీ వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం.

క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి 'లెటర్ కిల్లర్స్ క్లబ్' లో టైడ్ (రచయిత) అనే పాత్ర ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్' అనే అంశం తోడ్పడుతుంది. కథలను అల్లే విధానాన్ని బట్టి సాహితీ ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్, పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయంటాడు టైడ్. వీటిల్లో పీపుల్ ప్లాట్స్ అనేవి వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే సాధారణమైన కథలన్నమాట. ఈ కథల్లో వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది. కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి, ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించివై ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్ అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యవు, పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన క్రిఝిఝానోవ్‍స్కీ కి ఈ రెండవ పద్ధతి అంటే ప్రాణం, ఈ కారణంగానే ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాశారు.

'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరికొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్ అనే రచయిత చెప్పే 'ఎక్సెస్' (Exes) అనే డిస్టోపియాన్ హారర్ స్టోరీ మరో కథల సంపుటి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆరోజుల్లోనే అలవోకగా రాశారు క్రిఝిఝానోవ్‍స్కీ. కొన్ని చోట్ల కథలో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి తత్వాన్ని ప్రస్తావిస్తూ సాగే సిగిజ్మండ్ లోతైన కథనంలోని ప్రవాహపు వేగాన్ని అందుకుంటూ చదవడం పాఠకులకు కత్తిమీద సాములా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు రచయితకు దైనందిన జీవితంలో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలే కాకుండా పలు రాజకీయ, సామాజిక, విజ్ఞాన, తత్వ, శాస్త్ర సాంకేతికత వంటి విభిన్నమైన అంశాలపై ఉండవలసిన జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది.  మరోచోట ఫెవ్ అనే రచయిత చెప్పిన 'టేల్ ఆఫ్ ది త్రీ మౌత్స్' అనే కథలో ఇంగ్, నిగ్, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిఝిఝానోవ్‍స్కీ ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. "తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని" ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిఝిఝానోవ్‍స్కీ. ప్రవాహానికి ఎదురెళ్ళడమనేదే విప్లవమనుకుంటే మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంపై తన వినూత్నమైన కథలతో తిరుగుబాటు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠకులు ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఈయన రచనల్లో దొరకని ఒకే ఒక్క వస్తువు 'అనుసరణ' (conformity).

క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివే భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం, బోర్హెస్ కథల్లోలాగే ఆయన కథల్లో కూడా తరచూ కనిపించే భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు !! బోర్హెస్, ఉర్సులా లెగైన్ వంటి కొందరు 'ఫెంటాస్టిక్ జానర్' రచయితల్లాగే క్రిఝిఝానోవ్‍స్కీ కి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిఝిఝానోవ్‍స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక రుజువులు కనిపిస్తాయి. గూగుల్ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు దేశవిదేశీ  సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్, కాఫ్కా వంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్ కు అందుబాటులో లేనప్పటికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్, పో, గోగోల్  వంటివారు కొలువుదీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న 'షూ బాక్స్' సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ ని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

రచయితగా క్రిఝిఝానోవ్‍స్కీ దృష్టి అంతా తనలో చెలరేగే నిరంతరమైన తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనిపించదు. 'ఇన్ ది ప్యూపిల్'  వంటి కథల్ని చూస్తే పాఠకులు తన వేగాన్ని అందుకుంటున్నారో లేదో కూడా గమనించని లోతైన క్రిఝిఝానోవ్‍స్కీ కథనం సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి, ,కెమిస్ట్రీ నుంచి కాల్పనికతకూ పాదరసంలా చురుకుగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది. ప్రేమలూ, వాటిల్లో రకాలూ, మానవ సంబంధాలను సర్రియలిస్టిక్ అంశాలతో జతచేసి రాసిన ఇటువంటి కథల్లో వ్యక్తుల బదులు చిత్రాలు (ఇమేజస్) ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి. క్రిఝిఝానోవ్‍స్కీ అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే  'నేను' కథా, కథనాల్ని బట్టి రూపాంతరం చెందుతుంటుంది. ఈ 'నేను' కి ప్రత్యేకమైన ఆకారంగానీ గుణగణాలుగానీ ఉండవు, సైన్సు పరిభాషలో చెప్పాలంటే క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో 'నేను' ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే కనపడుతుంది. "Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని ఆడమ్ థిర్వెల్ ఒక పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగథాల్లోకి తొంగి చూడమంటాయి. ఈ రష్యన్ రచయితను ఒకసారి చదివితే పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా  క్రిఝిఝానోవ్‍స్కీ ని చదవక మునుపు, క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి. 

రెండు స్థితుల నడుమ ఊగిసలాడే క్రిఝిఝానోవ్‍స్కీ స్థిర స్థావరమైన ఈ ఫెంటాస్టిక్ జానర్ కూడా అత్యంత సంక్లిష్టమైనది. ఒక స్థితిలో వట్టి భ్రమలా అద్భుతంగా  కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది. మరో ప్రక్క కొన్ని కథల్లో ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు. కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన తాత్వికత క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో కీలకమైన అంశం. ఈయన్ని చదివేటప్పుడు పదాలనూ, వాక్యాలనూ దాటి reading between the lines/seeing through the gaps తప్పనిసరి. ఎందుకంటే ఆయన పాఠకులతో చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య ఇరుకు సందుల్లో దాచేస్తారు. నిజానికి మన దృష్టిని దాటిపోయిన అతి చిన్న బిందువు వద్దే క్రిఝిఝానోవ్‍స్కీ కథకు రూపకల్పన మొదలవుతుంది. అదే విధంగా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.

ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది. ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్తిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం. కానీ క్రిఝిఝానోవ్‍స్కీ కథలెన్ని చదివినా ఆయన పాఠకులకు ఒక అంతుపట్టని ఎనిగ్మా గానే మిగిలిపోతారు. ఇలాంటి రచయితలు పాఠకుల ఊహలకు రెక్కలిస్తారే గానీ దిశానిర్దేశం చెయ్యరు. వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన. ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేస్తారు క్రిఝిఝానోవ్‍స్కీ. మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా, కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా, పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా, ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే, మరో ప్రక్క నిజమేనని తొందరగానే నమ్మేస్తాం. వాస్తవంలో సాధ్యం కాని విషయాలను సృజనాత్మకతతో సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక సాధనంగా ఎంత నేర్పుగా ఉపయోగించవచ్చో క్రిఝిఝానోవ్‍స్కీ కథలు చదివితే అర్థమవుతుంది. ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో, మాన్ బుకర్, నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో క్రిఝిఝానోవ్‍స్కీ లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉండే ఉంటారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 13  డిసెంబర్ 2021

https://www.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977

https://m.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977?fbclid=IwAR06wgTQdLluiVRwc4uLBCImxKt1WnUCln4jsO1qRa17Tut07np3RtPv_Ko

Monday, September 20, 2021

A Kitchen in the Corner of the House - Ambai (C. S. Lakshmi)

ఇప్పటివరకూ నేను చదివిన కొందరు స్త్రీవాద రచయిత్రులలో కనుబొమ్మలెగరెయ్యకుండా నా చేత స్త్రీ వాదాన్ని చదివించగల శక్తి ఒక్క మార్గరెట్ ఆట్వుడ్ కు మాత్రమే ఉందనుకునేదాన్ని. కానీ  అటువంటి మరో రచయిత్రి పరిచయమైనందుకు సంతోషం అనిపించింది. తమిళ రచయిత్రి సి.ఎస్ లక్ష్మి aka అంబై కూడా ఆ కోవకే వస్తారు. మనుషులందరూ సమానమని అంటూనే స్త్రీవాదం విషయానికొచ్చేసరికి మాత్రం మగవాళ్ళని మరో జాతిలోకి నెట్టేసి, వాళ్ళని శత్రువుల్లా చిత్రిస్తూ, ఏకపక్షంగా విపరీతమైన ద్వేషంతో కూడిన నిందారోపణలు చేసే రచనలు చదివినప్పుడు చాలా విసుగొచ్చేది. బహుశా ఈ విముఖత కారణంగానే నేను స్త్రీవాద రచనల జోలికి వెళ్ళడం మానేశాను. ఒకనాటి పితృస్వామ్యపు కాలంలో పురుషజాతిని ఎలివేట్ చేస్తూ తమ రచనల్లో మగవాడి వైపు నించి మాత్రమే కథను చెప్పుకొచ్చేవారు. అదే విధంగా నేడు అధిక శాతం స్త్రీవాద రచనలు చూస్తే అందులో కేవలం స్త్రీవైపు నుండే కథను చెబుతున్నారు. నాణానికి రెండు వైపులూ చర్చించడం విషయం అటుంచితే అప్పుడూ ఇప్పుడూ 'బిగ్ పిక్చర్' చూడడంలో రెండు వర్గాలూ విఫలమయ్యాయి అనిపిస్తుంది. అంబై రచనలు ఇలాంటి కాలంచెల్లిన వాదాలకు స్వస్తి చెబుతూ వివక్ష మూలలను వెదికే ప్రయత్నం చేస్తాయి. స్త్రీల పట్ల వివక్షకు ముఖ్యంగా తల్లితండ్రులనూ, సమాజాన్నీ ,యావత్ వ్యవస్థనూ దోషిగా పరిగణిస్తారు అంబై. స్త్రీ,పురుషుల్లో ఈ అసమానతల భావజాలానికి పునాదులు ప్రాథమికంగా కుటుంబంనుండే పడతాయని నమ్ముతారావిడ. 'ఎ కిచెన్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది హౌస్' లో అంబై రాసిన 25 కథలున్నాయి. వీటిని లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ ఆంగ్లంలోకి అనువదించారు.

Image Courtesy Google

ఈ కథల్లో నేను చదివిన 'In a forest, a deer : Stories' లో ఉన్న Parasakti and Others in a Plastic Box, మూడు 'జర్నీ' కథలతో పాటు మరికొన్ని చదివిన కథలే పునరావృతమయ్యాయి. అంబై కథలను గురించి మునుపటి వ్యాసంలో వివరంగా ప్రస్తావించి ఉన్నాను కాబట్టి ఆమె కథల శైలిని  గురించీ, ఒక్కో కథ గురించీ నేను మళ్ళీ ప్రస్తావించబోవడంలేదు. ఇందులో బాగా  నచ్చిన 'వన్స్ అగైన్' అనే కథ గురించి మాత్రం చెప్పుకుందాం. తల్లితండ్రులు పిల్లల మనసుల్లో చిన్నతనంనుండీ లింగవివక్షకు బీజాలెలా నాటతారో చెప్పడానికి 'వన్స్ అగైన్' అనే కథ మంచి ఉదాహరణ. ఆర్భాటాలులేని సరళమైన కథనం ఈ కథ ప్రత్యేకత. కథ అతి మామూలు మాటల్లో,  కాన్వాస్ మీద అలవోకగా బ్రష్ తో రెండు మూడు చిన్న చిన్న లైన్స్ గీసినట్లు ఈ విధంగా మొదలవుతుంది.

మరొక్కసారి

ఆ ఇద్దరి సృష్టి జరిగింది. 

లోకిదాస్.

శబరి.

"లోకూ నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు ? 

"నాకు నచ్చినన్ని లోలి పప్స్ తిందామనుకుంటున్నాను. "

"వెధవా,అంకుల్ కీ అంటీకీ సరిగ్గా చెప్పు. "

"నాకో కుక్కపిల్ల కొనుక్కుంటాను."

"ఈరోజు వీడు మంచి మూడ్ లో లేడండీ. సరిగ్గా చెప్పు నువ్వు ఏం ఉద్యోగం చేద్దామనుకుంటున్నావు ? "

"నేను ఇంజనీర్ అవుదామనుకుంటున్నాను."

"కరెక్ట్. చూశారా ఎలా చెప్పాడో. సహజంగా వెంటనే చెబుతాడు. ఈరోజు కాస్త మొండికేశాడు."

"ఇప్పుడు షోలే లో డైలోగ్స్ చెప్పు. "

"నేను చెప్పను. "

"నేను బయటకెళ్ళి ఆడుకోవాలి. ముందుచెప్పు,తరువాత ఆడుకోవచ్చు.చెప్పకపోతే నీకు నీ బాల్ ఇవ్వను. "

"అరే ఓ సాంబా"

"వెరీ గుడ్."

------

"శబరి కుట్టీ నువ్వు పెద్దయ్యాక ఎవర్ని పెళ్ళి చేసుకుంటావు ?"

"మా క్లాస్ లో అబ్దుల్లాని"

"ఆ పిల్లవాడు ముస్లిం కదా,నువ్వు అతణ్ణి చేసుకోకూడదు.తప్పు. "

"నువ్వు పెద్దదానివయ్యావు. ఆ మురళితో ఆటలేమిటి ? గాలిపటాలెగరెయ్యడం ఏంటి ? వెళ్ళి ఏ పుస్తకమో చదువుకోవచ్చుగా."

"వుమన్ సెక్రటరీ ని అప్పోయింట్ చేద్దాం,ఆమె పని చెయ్యడం సంగతటుంచితే ఆఫీసు కళగా ఉంటుంది. "

----

లోకిదాస్,శబరి అనే రెండు స్త్రీ పురుష పాత్రల్ని సమాంతరంగా చిన్నప్పటినుంచీ వర్ణిస్తారు. ఈ కథ సోషల్ కండిషనింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తూ ఆడమ్-ఈవ్ కథను రీటెల్లింగ్ చేసినట్లు ఉంటుంది.సమాజంలో లింగ వివక్ష,కులమత వివక్షలకు బీజాలు ఎక్కడ పడతాయో ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అంబై.

"నువ్వు పెద్దయ్యాక ఇంజినీర్ అవ్వాలి సరేనా ? మగవాడన్నాక  సంపాదించాలి,సంపాదనలేని వాడు మగాడే కాదు. బాగా సంపాదిస్తేనే అమ్మాయిలు నీ వెంట పడతారు. ఆడపిల్లలా అలా ఏడుస్తావేమిరా ? ఎకనామిక్స్ చదివి ఏమి చేస్తావు ? లెక్కలు తీసుకో. రేపు పెళ్ళైతే నీకు వండి పెట్టడానికి ఒకరు ఉంటారు. నువ్వు ఆ క్రిస్టియన్ కుర్రాడితో చర్చి కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.

"You are the one who earns money
You go out to work
You are the one who has many rights
You are the one who casts the vote
You are the one who mustn’t cry
You are strong
You make decisions
You can change the world
You have firmness of mind
You enjoy women
You are forceful in bed
You want to impress your boss
You are a man."

అలా అబ్బాయిలతో మాట్లాడకు.అలా అటూ ఇటూ పరిగెత్తకు,ఆడపిల్లన్నాక అణకువ అవసరం. ఇంజనీరింగ్ ఆ ? చదివి ఏమి చేస్తావ్ ? వంట నేర్చుకో. లేకపోతే అత్తారింట్లో చెప్పు దెబ్బలు తినాలి. సెక్స్ గురించి మాట్లాడుతున్నావేమిటి నీ స్నేహితురాళ్ళతో ? తప్పు. ఆ కుర్రాడు ముస్లిం  కదా,స్నేహం చెయ్యకు. చీర కట్టుకోవడం నేర్చుకో. ఆడపిల్లకు సహనం ఉండాలి.

"You look after the house
You know that beauty products are for your use
You are modest
You listen to decisions
You are a goddess
You are always helpful
You work outside the house only when in dire need
You need protection
You are a woman."

లింగ వివక్ష అనేది మొత్తం వ్యవస్థకు సంబంధించిన విషయం. సమాజంలో స్త్రీ పురుషుల పాత్రలు వాళ్ళు పుట్టకమునుపే సమాజం నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులు ఆ సాంఘిక నియమాలను గుడ్డిగా అమలు చేస్తారు. నిజానికి నియమాలను ధిక్కరిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా హర్షించదు. సమాజంలో 'ఆదర్శమైన వ్యక్తి' చెయ్యాల్సిన పని నియమాలను పాటించడం, పెద్దలను అనుసరించడం మాత్రమే. ఆదర్శ సంఘ జీవిగా సమాజంలో ఇమడడానికి మనిషి చెల్లిస్తున్న మూల్యం ఏమిటి అని మరో సారి ప్రశ్నించుకోమంటుందీ కథ.

Friday, September 17, 2021

In a Forest, A Deer : Stories - Ambai

"One writes because the act of writing has become as close to one as breathing. It is difficult to stop."  అని తన ముందు మాటలో రాసిన తమిళ రచయిత్రి అంబై కథలన్నీ అడ్డుకట్ట తెగిపోయిన  అనుభవాల ప్రవాహంలా ఉంటాయి. పదేళ్ళ కాలంలో వివిధ సమయాల్లో పత్రికలకు పంపిన ఈ కథలన్నీ రాయడానికి డెడ్ లైన్స్ లేవంటారావిడ. మొత్తం 18 కథలున్న ఈ అనువాదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. 'In a forest, A Deer' పేరిట అంబై కథలకు లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ చేసిన అనువాదం విషయమై రచయిత్రి పంచుకున్న విషయాలు నాకు చాలా నచ్చాయి. 

"అనువాదంలో నా పాత్రలు నాకు కొత్తగా కనిపించాయి. పాత్రల చిత్రీకరణ వేరుగా ఉంది,చిత్రీకరణలో నేనూహించుకున్న వర్ణాలు వేరు. శబ్దాలు కూడా భిన్నంగా ధ్వనించాయి. అనువాదంలో కొత్త భాషను సొంతం చేసుకుని చదివేకొద్దీ మన కథలు కొత్తగా రెక్కలు విప్పుకుని రెండు భాషల మధ్య దూరాలను చెరిపేసే దిశగా ప్రయాణిస్తాయి. జాలరి పడవను సముద్రంలోకి నెట్టే విధంగా అనువాదం ఒక భాషలోని కథను సాగరసమానమైన మరో భాషలోకి సున్నితంగా నెట్టి వదిలేస్తుంది."

Image Courtesy Google

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేను చదివిన కొందరు భారతీయ రచయితల్లో అంబై ఒకరు. ఈ మధ్య ఫెమినిస్టు కథలు చదివే ఆసక్తి బాగా తగ్గిపోయింది. కానీ ఇన్నేళ్ళుగా తమిళనాట ఉండీ  కూడా నలభై ఏళ్ళుగా రచనా వ్యాసంగంలో ఉన్న ప్రముఖ తమిళ రచయిత్రి అంబై కథలను చదవలేదే అనిపించింది . అందుకే రోజుకో కథ అనుకుని 'In a Forest, A Deer : Stories' ను చదువుతూ వచ్చాను. నిజానికి సాంస్కృతికపరమైన వివరణలతో చక్కగా చిక్కగా అల్లిన ఈ కథలన్నీ ఏకబిగిన చదవలేం. అంబై చెప్పే చిన్న చిన్న సంగతుల్ని పట్టుకోడానికీ,ఆమె పరిచయం చేసే ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకోడానికీ ఒక ప్రత్యేకమైన మూడ్ కావాలి. 

అంబై కలం పేరుతో రాసే 'సి.ఎస్.లక్ష్మి' కథలన్నిటిలో స్త్రీ కేంద్రబిందువు. అన్ని కథల్లోనూ ప్రోటొగోనిస్ట్ గా స్త్రీ కంఠస్వరమే వినిపిస్తుంది. కోయింబత్తుర్ లో పుట్టి, ముంబై,బెంగళూరుల్లో పెరిగి, ఢిల్లీలో పీహెచ్డీ చెయ్యడం వల్ల ఆమె కథల్లో క్రాస్-కల్చరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తాయి. పెరుమాళ్ మురుగన్ వంటి కొందరు తమిళ రచయితల కథల్లోలా  సాంస్కృతికపరమైన అంశాలన్నీ కేవలం తమిళ సంస్కృతికి మాత్రమే పరిమితం కాకపోవడం అంబై కథల్లోని ప్రత్యేకత. తన కథల్లో ఆమె తన తమిళ అస్తిత్వపు మూలాల్ని వెలికితీసి అనుభవాలను పంచుకున్నారే గానీ ఎక్కడా తమిళ సంస్కృతిని గుడ్డిగా భుజాన మోసిన దాఖలాల్లేవు. ఆ మాటకొస్తే కొన్ని చోట్ల తమిళ సంస్కృతీ,సంప్రదాయాల పేరిట జరిగే అణచివేతపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అలాగే ఈ కథల్లో స్త్రీవాదం పేరిట మూలాల్ని త్యజించి నేల విడిచి సాము చెయ్యలేదు. ఒకవైపు తన సాంస్కృతిక మూలాలను వదలకుండా ఒడిసి పట్టుకుంటూనే మరోవైపు ఈ కథలను ఆమె ఒక 'డిటాచ్మెంట్' తో రాశారనిపించింది. ఆమె తన కథల ద్వారా స్త్రీ కి వ్యవస్థను 'కండిషనింగ్' పేరిట తృణీకరించమని పిలుపునివ్వలేదు. స్త్రీ తన స్వేచ్ఛను విస్మరించకుండా ఆరోగ్యకరమైన వ్యవస్థలో భాగంగా మారడానికి అనువైన మార్గాల కోసం మాత్రమే ఆమె అన్వేషించారు.

ఈ కథల్లో అంబై తీవ్ర విముఖత కనబర్చిన విషయం 'రామాయణం'. కొన్ని కథల్లో రాముని ధర్మంపై తీవ్ర విమర్శలు చేశారు. Camel ride అనే కథలో ముక్కులోంచి రక్తమోడుతున్న ఒంటెను చూసి "ఇది సముద్రతీరంలో షికారుకు తీసుకెళ్ళనని మొండిగా మొరాయిస్తూ శూర్ఫణఖలా కూర్చుంది. శూర్ఫణఖ అంటే తన ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేసినందుకు మన పురాణాల్లో ఒక వీరుడి వల్ల ముక్కు పగలగొట్టించుకుందీ, ఆమే. గుర్తుందా ? " అంటారు.సాధారణంగా రామాయణంపై  ఇటువంటి విషయాలు చాలా చోట్ల చదివి నాకు విసుగ్గా అనిపించినా ఈ కథల్లో ఆమె విమర్శలు పంటిక్రింద రాళ్ళలా తగలకపోవడం విశేషం. దానికి కారణం కూడా ఉంది. దేన్నైనా విమర్శించే ముంది ఆ విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. కావ్యాలు చదవకుండా వాటిలో  అనుకూలమైన కొన్ని వాదాల్ని మాత్రం ఎంపిక చేసుకుని ఆమె విమర్శలకు పాల్పడలేదు. అంబై ప్రస్తావించే విషయాలు చూస్తే ఆమె రామాయణం ఔపాసన పట్టకుండా కేవలం ఒక ఫెమినిస్టు కోణంలో గాల్లోంచి విషయాలను ఏరుకొచ్చి ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఈ విమర్శలు చెయ్యలేదని అర్ధమవుతుంది. పురాణాల్లో ఒక్కో సంఘటననీ,చిన్న చిన్న వివరాల సహితంగా ఎందుకు నచ్చలేదో పరిశీలిస్తూ రాసిన విశ్లేషణలు కావడంతో ఆమెకు పాఠకుల్ని తనదారికి ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసనిపించింది. మంచి రచయిత తన కథ ద్వారా అయితే పాఠకుల్ని ఆలోచించేలా చెయ్యగలగాలీ లేదా ఒప్పించగలగాలి. ఈ రెండు విషయాల్లో అంబై కి మంచి నేర్పూ,ఓర్పూ ఉన్నాయి. మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, హిందుస్థానీ,కర్ణాటిక్ సంగీతాన్నీ,హిందీ,తమిళ సినిమా పాటల్నీ సందర్భోచితంగా తన నేరేషన్ లో వాడుకోవడం అంబైకు సంగీతం మీద ఉన్న ప్రీతిని చెప్పకనే చెబుతాయి.

ఒక కథలో మన ఎన్.టి.రామారావు రాముడిగా, శివాజీ గణేశన్ భరతుడిగా (నేను ఉత్సాహం కొద్దీ యూ ట్యూబ్ లో ఒక క్లిప్పింగ్ చూశాను,భరతుడు అంతఃపురం అదిరిపోయేలా చేసిన నటన మీరూహించినట్లే ఉంది :) ) తమిళంలో నటించిన 'సంపూర్ణ రామాయణం' గురించి రాశారు.

But as she grew up, there were some aspects of Rama that she began to dislike. She was stung to anger at the notion of Rama, in his original form of Vishnu, lying on the serpent Adisesha, with Lakshmi relegated firmly to his feet. She preferred Shiva. She liked the indifferent and defiant nature of Shiva as he went about smoking gartja, wandering as he chose, and dancing his immortal taandavam. Then, after she saw the film Sampurna Ramayanam, as far as she was concerned, Rama became the actor N.T. Rama Rao. What’s more, when she heard T.K. Bhagavati singing as Ravana, (Ga gamagagari rigaririsa rigaririsarisa nidapadasa’ in Kambodhi Raga, her heart inclined more and more towards the rakshasa.

 First Poems అనే మరో కథలో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది: రాముడన్నా,శివుడన్నా రవివర్మ చిత్రాల తరువాత గుర్తొచ్చేది ఎన్.టి.రామారావు అని ఆమె రాస్తే చదివి సంబరంగా అనిపించింది.

The idea that a girl should marry no one other than God fascinated her. At the same time they were learning about Akkamahadevi in their Kannada lessons. Mahadeviakka too, had renounced everything for the sake of Shiva. It struck her, though, that there might be a few problems in accepting God as one’s husband, when it actually came to practice. In the first place, she was scared to think in what form the gods might actually manifest themselves, even if they looked so beautiful as statues, and in the paintings by Ravi Varma. In the second place, it was N.T. Rama Rao who took the roles of Rama and Shiva in the cinema, in those days. Suppose, after she had given herself up to God, he then knocked on her door in the shape of Rama Rao? The thought confused her.

అంబై కథల్లో నాకు తెలిసిన తమిళ ప్రపంచాన్ని వెతికాను. కనిపించలేదు. ఆమె కథల్లో 'చెన్నై, కోయింబత్తూర్' లు లేవు, తెలుగు,తమిళ సంస్కృతులు కలగలిసిన 'మద్రాసు' మాత్రమే కనిపిస్తుంది. బాల్యం నుండీ అంబై అనుభవాలు ఆమె సృజించిన అనేక పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. తన చుట్టూ ఉన్న  ప్రపంచంతో గాఢమైన అనుబంధం,తన ఉనికి పట్ల స్పష్టత ఈ రెండూ అంబై పాత్రల్లో ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. గమనింపు రచయితకు ఎంత అవసరమో ఆమె రాసిన వివరాలు చెబుతాయి. చెవిలో పడిన ప్రతీ కీర్తనా, మాటా, అభిప్రాయాలూ, ఏ శబ్దమూ ఆమె గమనికను దాటిపోలేదనిపించింది. ఈ కథల్లో దేనికదే ప్రత్యేకంగా ఉన్నప్పటికీ నాకు బాగా నచ్చిన రెండు కథలు 1. Parasakti and Others in a Plastic Box 2. Wrestling.

ఇందులో అన్నీ స్త్రీవాదానికి సంబంధించిన కథలే అనుకుంటే పొరపాటే. ఆమె కథల్లో 'స్వేచ్ఛ' కు పేద పీట వేశారు అంబై. ఉదాహరణకు One and another కథ LGBT అంశానికి సంబంధించినది ; A Rat, a Sparrow /  A Saffron-coloured Ganesha on the Seashore / A Movement, a Folder, some Tears / Camel ride వంటి కథలు సామజిక సమస్యలు,సెక్కులరిజం,బాబ్రీ మసీద్ కూల్చివేత నేపథ్యాల్లో రాసినవి. A Rose-coloured Sari Woven with Birds and Swans / Parasakti and Others in a Plastic Box ఈ రెండు కథలూ ఒక తరంలో మనుషులకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఈ కథలు చదివినప్పుడు గతించిన తరాల్ని ప్రేమగా గుర్తుచేసుకోని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు. నేటి తరం స్వేచ్ఛ పేరిట ఏం కోల్పోతోందో, దానికి చెల్లిస్తున్న మూల్యం ఏమిటో, ఎన్ని ఉన్నా జీవితాల్లో ఒంటరితనంతో కూడిన ఖాళీ ఏర్పడడానికి  కారణాలేమిటో పరిశీలించుకోమంటాయీ కథలు. మనుషులతో సహా తన అస్తిత్వంతో ముడిపడిన వస్తువుల్ని కూడా నిముషంలో వదిలించుకుంటూ 'డిస్కార్డ్' మంత్రాన్ని జపిస్తున్న నేటి తరాన్ని ఈ కథలు ఆలోచనలో పడేస్తాయి.

‘“Is that what you call freedom? I can’t understand it,” she fretted.’ ‘As soon as she arrived, she was anxious to make all those things like rasam and sambar powders before the monsoons set in. Now, look, within one week, all these powders are ready in my house. And there are still three months to go before the beginning of the rains! Day before yesterday she went and bought a quantity of limes, chopped them up, and made salt pickle and hot pickle in two separate lots. Ginger murabha and ginger pickle have also been prepared.

But Amma is one who is deeply bound to the earth. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Certainly, she could stay either at my house or at yours. But it is bound to be hard for her. She’ll tell a thousand little lies: this one to hide that, that to hide this. It’s not just that Amma needs a place to live; she must reign indisputably in that space. Because Amma isn’t just an individual, she’s an institution.Her need is not simply a small space in which she can keep her plastic box. The pity is, she is wandering about seeking after a realm of her own. And if you and I wish to do so, we could give it to her. The jewellery that you and I possess were all given to us by Amma. 

అంబై కథల్లో నన్ను ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే ఆమె పాత్రల్లో స్త్రీ కి ప్రాధాన్యత ఉంది గానీ,స్త్రీల పట్ల పక్షపాతం లేదు. దీనికి తోడు ఆమె స్త్రీవాదాన్ని వినిపించడానికి ఎన్నుకున్న అంశాలూ, నేపథ్యాలూ వైవిధ్యంగా ఉన్నాయి. ఒక కథలో ముంబై లో సామజిక కార్యకర్తగా ; మరో కథలో కవి అయిన భర్తకు రచయిత్రి భార్యగా ; ఇంకో కథలో భర్తనూ,కుటుంబాన్నీ వదిలేసి తన ఐడెంటిటీని వెతుక్కుంటూ అడవుల్లో ఒంటరిగా నివసించడానికి వెళ్ళిన స్త్రీగా ; మరో కథలో తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కూతురితో సంబంధాన్ని సైతం తెంచుకున్న అమ్మగా ; ఇంకో కథలో తల్లి మనసు అర్ధం చేసుకున్న కూతురిగా ఇలా ఆమె స్త్రీలు విభిన్న రూపాల్లో కనిపిస్తారు.  

Unpublished Manuscript నాకు నచ్చిన మరో కథ. ఒక కవిని ప్రేమించి పెళ్ళిచేసుకుని అణచివేతకు గురైన స్త్రీ మూర్తి కథ. చదువుకుని,సాధికారికంగా ఉండే స్త్రీల విషయంలో భర్తల్లో ఉండే ఆత్మన్యూనతను గురించి చెబుతుంది. ఆర్టిస్టులు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదని రుజువు చేస్తుంది. తన భార్యను నిందిస్తూ 'Are you a woman?’ అని పదే పదే అడిగే భర్తను గురించి చదివినప్పుడు మన పురుషాధిక్య సమాజంలో ఉన్న జాడ్యాలను అతడు గొంతెత్తి అరిచి  చెప్తున్నట్లుగా ఉంటుంది.

She wondered why something that seemed perfectly all right when done by a man seemed like an act of madness when done by a woman instead? Once, by a rare chance, there was a showing of the old film Karnatt. Devika sang a love song in it, and during the entire time Sivaji Ganesan sat stiffly, one hand placed on his thigh. Perhaps, this was because Karnan was a warrior? Devika circled around him again and again, like a butterfly. Even Sivaji Ganesan’s smile was like squeezing toothpaste out of an empty tube. If men can soften and dissolve and melt through bhakti, why can’t they do so out of love? She decided firmly on the sort of man she could respect. He would have to know how to melt. ‘Melting, melting to the heart’s core.’

Amma answered that it was easier to live with Appa’s poetry than with a poet like Appa.

A Rose-Coloured Sari అనే కథలో ఈ వాక్యాలు దృష్టి, ధ్వనీ, వాసనలతో కూడిన అంబై విశాలమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తాయి : 

The sweet smell that fills the air as soon as a jackfruit is split open. The knots and swirls and scatterings as Mali begins the opening alaapanai of his Kaapi raagam. The steam that hits your face as you open the lid of the water-pot, the firewood still burning underneath, and as you bend over it, chembu in hand, ready to pour out the water into a bucket. Drops of sweat blooming on Balasaraswati’s forehead as she danced. Birju Maharaj’s Kathak dance-leaps. The smell of cooking when a properly-soured batter is just spreading on a heavy dosai griddle. The smell of sesame in the chilli powder. The smell of gingili oil, unstrained, fresh from the oilpress. The tenderness of Bhimsen Joshi’s Lalit raagam. The deep resonance of Gangubai Hangal’s voice. Girija Devi’s lilting tones. The kisses she and her lover had exchanged as they stood under a chestnut tree in a small village in Himachal Pradesh. The journey past her house every day, of bodies going to the cremation ground. Funeral fires burning at a distance. The voice of her Tamil teacher who had loved and read Tirumular, ‘I nurtured my body; indeed I nurtured my life-source.’ The poet Ghalib pleading, ‘Lord, they have not understood me; they will not understand me. Give them different hearts. Or at least give me a new language.’ Which of these things would her mind seek and at what moment? Would it seek after any of these at all? Or would it be soothed by Festivals of India?

How convenient a nostril is, for piercing and for threading a rope through! Like that folk tale from oral tradition. In a forest there lived a woman who was independent, under no one’s control, and who wandered about at her own will and pleasure. Later on, a man— when they tell this tale, they describe him as a great warrior and a man of great prowess—put a ring through her nose, subdued her, and dragged her home. Sometime later, she began to wear the same ring as an ornament.

పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు : 

‘It is my life, isn’t it? A life that many hands have tossed about, like a ball. Now, let me take hold of it; take it into my hands.’ So saying, Sita lifted the rudravinai and laid it on her lap.

హాస్యంతో కూడిన మరో చిన్న సంగతి :

Deva kaappaadu... O God, help me,’ Kempamma called out. Then thinking perhaps that it was wrong to summon God familiarly, in the singular, she called out again, ‘Devari kaappaadu'

Friday, September 3, 2021

Notes from the Hinterland : Stories and Essays - Shashi Tharoor

వర్చ్యువల్ రియాలిటీకీ వాస్తవానికీ తేడా పూర్తిగా చెరిగిపోయిన ఈ తరంలో ఫేస్బుక్ కిటికీల్లోంచి చూసే జీవితాలకీ వాస్తవ జీవితాలకీ ఎంత ఉంటుందో, అధికార పక్షాల గుప్పిట్లో చిక్కుకున్న మీడియా చూపించే ప్రతిబింబాలకీ,వాస్తవానికీ కూడా అంతే తేడా ఉంటుంది. జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తూ ఏసీ కారుల అద్దాల్లో నుండి ప్రపంచాన్ని చూసే ఉంటారు, ఎటుచూసినా శుభ్రంగా,అందంగా ఉంటుంది. కానీ కారు దిగి రహదారులు దాటుకుని ఇరుకు సందుల గుండా మురికివాడల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో నడిస్తేనే గానీ దాని నిజస్వరూపం తెలియదు. మన దేశ వాస్తవిక స్థితి క్యాపిటలిజం కొలువుదీరిన ఆకాశహర్మ్యాల్లో కంటే  ముంబై లోని ధారావి,ఢిల్లీ లోని కుసుంపూర్ పహాడీ లాంటి మురికివాడల్లోనూ, బళ్ళారి వైపు గనుల్లో కార్మికుల ప్లాస్టిక్ గుడారాల్లోనూ ఎక్కువ కనిపిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో నేను చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఈ 'నోట్స్ ఫ్రమ్ ది హింటర్ల్యాండ్' ఒకటి. ఈ పుస్తకం కాలు కదపకుండా ఇంట్లో కూర్చున్న పాఠకులకు భారతీయ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిస్తుంది. నాకు తెలిసిన సుందర భారతం ఎవరమూ గుర్తుపట్టలేని విధంగా ఈ ఏడాది మరీ వికృతంగా మారిపోవడంవల్ల కావచ్చు,ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో భారతీయ రచయితల పుస్తకాలపై మనసుపోయింది. బహుశా కరోనా తరంగాల తాకిడిలో కొట్టుకుపోయిన గతించినకాలపు సహజమైన జీవనశైలినీ,జీవితానుభవాలనూ తిరిగి వెతుక్కునే ప్రయత్నం కావచ్చు.

Images Courtesy Google

ఈ పుస్తకంలో కొత్త నీరూ,పాత నీరూ పాయలుగా కలుపుతూ పలు భారతీయ రచయితలు రాసిన మొత్తం పది కథలున్నాయి. వీటిల్లో తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఒక కథ ఉండడం విశేషం. చక్కని అనువాదంతో కూడిన తిలక్ కథను చదివి చాలా సంతోషమేసింది. పేరుకి అతి పెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశాన్ని ప్రత్యక్షంగా శాసించేవి ముఖ్యంగా రెండే రెండు అంశాలు : ఒకటి కులం,రెండవది మతం. ఇక మూఢనమ్మకాలూ,ఛాందస భావాలూ, స్వార్థపరత్వంలాంటివి పరోక్షంగా తమ వంతు పాత్రను ఎటూ పోషిస్తాయి. వీటి బారినపడిన ప్రజాస్వామ్యం దిక్కులేక కొన ఊపిరితో కొట్టుకుంటూ  ప్రపంచానికి గర్వంగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుంటుంది. ఈ రచనలో తిలక్,శ్రీలాల్ శుక్లా,రస్కిన్ బాండ్,శశి థరూర్, రహి మసూమ్ రజా వంటి కొందరు రాసిన కథలు కాల్పనికతకు దూరంగా వాస్తవికతకు అద్దంపట్టేవిగా ఉంటాయి. వీటితోబాటు పాలగుమ్మి సాయి నాథ్ (మరో తెలుగాయన :) ) ,అభిమన్యు కుమార్ వంటి జర్నలిస్టులు రాసిన వాస్తవిక అనుభవాలతో కూడిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

ఈ పుస్తకానికి సంపాదకత్వం చేసిన శశి థరూర్ రాసిన వ్యాసం లాంటి కథ 'Scheduled Castes, Unscheduled Change' తో ఇందులో కథలు మొదలవుతాయి. ఈ కథను నేను ఇది వరకే మరొకచోట చదివాను. ఇదే కథను అనితా నాయర్ ఎడిట్ చేసిన 'Where the Rain is Born: Writings about Kerala' అనే పుస్తకంలో 'ఛార్లీస్ అండ్ ఐ' పేరుతో ప్రచురించారు. అప్పట్లో చాలా నచ్చి అనువాదం చేద్దామనుకున్నా వీలుపడలేదు. కేరళలో బలంగా వ్రేళ్ళూనుకుపోయిన వర్ణ వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను థరూర్ కేరళలో తన బాల్యానుభవాలతో ముడిపెడుతూ వివరించిన కథ ఇది. శశి థరూర్ అనగానే ఆయన సిగ్నేచర్ ఆంగ్ల పదగాంభీర్యాలు గుర్తొచ్చి, పేజీకో పదిసార్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తిరగేసే ఓపిక లేక ఆయన రచనలేవీ చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఈ కథ చదివినప్పటినుండీ థరూర్ మరికొన్ని కథలను చదవాలనే ఆసక్తి కలిగింది. ఈ కథలో ఆయన నేరేషన్ చాలా సహజత్వంతో సరళమైన పదాలతో ఒక ప్రవాహంలా సాగుతుంది.

రస్కిన్ బాండ్ రాసిన రెండో కథ 'The Night Train at Deoli' లో కాలేజీ కుర్రవాడైన కథానాయకుడు వేసవి సెలవుల్లో డెహ్రాడూన్ లో తన అమ్మమ్మతో గడపడానికి వెళ్ళే ట్రైన్ డియోలీ అనే స్టేషన్ దగ్గర ఆగుతుంది. "Why it stopped at Deoli, I don’t know. Nothing ever happened there. Nobody got off the train and nobody got on." అనుకుంటుండగా ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద వెదురుబుట్టలు అమ్ముకుంటూ ఆకర్షణీయమైన చారడేసి కళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. ఇద్దరి మధ్యనా పెద్ద సంభాషణ జరగపోయినా ఆమె రూపం అతడి మనసులో ముద్రపడిపోతుంది. ఈలోగా ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ రెండు నెలల తరువాత తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు అతడి కళ్ళు ఆమెకోసం ఆత్రంగా వెతుకుతాయి. విచిత్రంగా ఆమె మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ కనపడుతుంది. ఆమెతో మాటలు కలుపుతూ,"నేను ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ వస్తాను,నువ్వు  ఇక్కడ ఉంటావు కదా" అని మాట తీసుకుంటాడు. మళ్ళీ ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ ఏడాది కాలేజీకి సెలవులివ్వగానే అతడు ఆమెను చూస్తాననే నమ్మకంతో ప్రయాణమవుతాడు. ఈ కథకు ముగింపు చదవాల్సిందే. బాండ్ తన కథల్లో ప్రకృతి వర్ణనల సున్నితత్వంతో పోటీపడుతూ తొలిప్రేమ తాజాదనాన్ని వర్ణించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇందులో మూసపోసినట్లుండే కథల్లో కాస్త భిన్నమైన కథ ఇదొక్కటే.

మూడో కథ ఆర్.కె.నారాయణ్ రాసిన 'An Astrologer’s Day' మాల్గుడి తరహా భారతీయ గ్రామీణ వాతావరణాన్ని మరోసారి గుర్తుచేస్తుంది. ఆయన కథల్లో నేపథ్యానికీ,పరిసరాల వర్ణనలకూ పెద్ద పీట వేస్తారని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కథలో చిన్న బజారులో మున్సిపాలిటీ వీధి దీపాలు లేకుండా కేవలం షాపుల్లో ఉన్న దీపాలతోనూ,గ్యాస్ లైట్ల వెలుతురుతోనూ నిండిన ఆ ప్రాంతాన్ని పాఠకుల మనస్సులో ఇట్టే చిత్రిస్తారు నారాయణ్.

నాలుగో కథ రంగా రావు గారు తెలుగు నుండి ఆంగ్లానికి అనువాదం చేసిన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన 'The Man Who Saw God' మానవత్వం గొప్పదా ? మతం గొప్పదా ? అనే ప్రశ్నల్ని మరోసారి రేకెత్తిస్తుంది. కరణాలూ,మునసబులూ,అవధానులూ వంటివారు సామజిక నియమాలను శాసిస్తూ  పంచాయితీలలో ప్రముఖపాత్ర పోషించే అలనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కథ ఇది. గవరయ్య నాస్తికుడు,తోలు వ్యాపారం చేస్తుంటాడు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్న తీరులో అతడు తన మానాన తాను బ్రతుకుతుంటాడు. భక్తీ, పాపభీతి లేని కారణంగానే అతడి వయసులో సగం వయసున్న భార్య టైలరుతో వెళ్ళిపోయిందని అంటూ అతడిలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంటారు ఊరిపెద్దలు. ఈలోగా గవరయ్య భార్య నిండు గర్భిణిగా దీనమైన స్థితిలో ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తరువాతేమి జరిగిందనేది మిగతా కథ. ఈ కథ మానవత్వానికీ, మత మౌఢ్యానీకీ మధ్య జరిగే సంఘర్షణనను చూపిస్తుంది.

ఐదో కథ ప్రముఖ ఉర్దూ కవీ,రచయితా రహి మసూమ్ రజా రాసిన 'A Village Divided' ను Gillian Wright ఆంగ్లంలోకి అనువదించారు. మసూమ్ రజా పేరు వినగానే దూరదర్శన్ లో వచ్చిన చోప్రా  'మహాభారత్' కు రాసిన స్క్రీన్ ప్లే గుర్తొస్తుంది. మతంపేరుతో విషం కక్కే సమాజంలో ఇలాంటివి నిజంగా అద్భుతాలు అనిపిస్తాయి. ఈ కథలో రజా స్వస్థలమైన ఘాజీపూర్ నుండి బ్రతుకుతెరువుకు కోల్కతా,ముంబై,కాన్పూర్ వంటి చోట్లకు జనపనార మిల్లులో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళే యువకుల గురించి రాస్తారు. అడుగడుగునా పద్యాన్ని తలపించే ఆయన గద్యం నాకు చాలా నచ్చింది.

Calcutta is not the name of a city. For the sons and daughters of Ghazipur it is another name for the yearning that comes of separation. This yearning is a whole story in itself, in which the kajal lining the eyes of countless women has been washed away by tears, and then dried. Every year thousands upon thousands of men far from home send back thousands upon thousands of messages with the monsoon clouds. Perhaps that’s why clouds burst over Ghazipur and, in these rains, seeds of yearning sprout in new and old walls, in the roofs of mosques and temples, in the cracks of school windows and doors, and the pain of separation awakes and begins to sing : 

No one stirs out in the monsoon rains,
Only you would leave for a distant land.

ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్ (పాలగుమ్మి సాయి నాథ్) రాసిన 'Ganpati Yadav’s Gripping Life Cycle' అనే కథ 'Everybody Loves a Good Drought' అనే కథల సంపుటి నుండి సంగ్రహించబడింది. మహారాష్ట్రలోని రామాపుర్ కి చెందిన 97 ఏళ్ళ రైతు /స్వాతంత్య్ర సమరయోధుడు గణపతి యాదవ్ అనుభవాలు అలనాటి స్వాతంత్య్ర సమరపు రోజుల్ని జ్ఞప్తికి తెస్తాయి. ఢిల్లీ కి చెందిన జర్నలిస్టు అభిమన్యు కుమార్ రాసిన వ్యాసం 'The Lynching That Changed India', స్నిగ్ధా పూనమ్ రాసిన 'The Man Who Lived' బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండీ మతంపేరిట జరుగుతున్న మరణహోమాల్ని కళ్ళకుకడితే, మాధురీ విజయ్ రాసిన 'Lorry Raja' కథ కర్ణాటక గనుల్లో పనిచేసే కార్మికుల దుర్భర జీవితాలకు అద్దం పడుతుంది. ఇక Gillian Wright హిందీ నుండి అనువదించిన శ్రీ లాల్ శుక్లా కథ 'Raag Darbari' భారత దేశంలో లంచగొండితనానీ,వ్యవస్థలో లొసుగుల్నీ చూపిస్తుంది. రెండు భిన్న తరాల రచయితలు రాసిన కథలు కావడంతో వీటిల్లో శైలుల వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. సమకాలీన రచయితల కథలలో భాషా సౌందర్య లేమీ,లోతులేని ఉపరితలానికి పరిమితమైన  వర్ణనలూ స్పష్టంగా కనిపించాయి. ఏదేమైనా థరూర్ ఎంపిక చేసిన ఈ కథల్లో నాకైతే ఇది చెడ్డ కథ అని ఏమీ అనిపించలేదు. ఒక్కో కథా ఒక్కో ప్రత్యేకమైన శైలికీ,సంస్కృతికీ,కాలానికీ చెందినవైనా ఈ కథల సంకలనంలో అన్నీ కలిసి భారతీయ భిన్నత్వంలోని ఏకత్వాన్ని మరోమారు చాటి చెప్పాయి. భౌతిక స్వరూపం కంటే భారతీయ ఆత్మను పట్టి ఇచ్చే ఈ కథలన్నీ మనకు తెలిసిన భారతాన్ని సరికొత్త వెలుగులో చూపిస్తాయి.

Wednesday, April 21, 2021

A Hate Letter To The Man I Loved

Image Courtesy Google

నాకు అతనంటే ఇష్టం...అతడికి నేనంటే నాకంటే ముందునుండే ఇష్టం..కానీ మిస్టర్ డార్సీ వారసులకు ప్రైడ్ ఎక్కువ..ఎప్పుడూ నాకు తెలియనివ్వలేదు..బహుశా నేనే గ్రహించలేదు..కానీ ఎప్పుడూ ఎక్కడికెళ్తే అక్కడికి వస్తూ నా నీడలా వెన్నంటి ఉండేవాడు..చాలా కాలానికి మమ్మల్నిద్దర్నీ దగ్గరగా గమనిస్తున్న ఎవరో అన్నారు,నీకు గ్రహింపు తక్కువ,కాస్త కళ్ళు తెరచి చూడు అని..నాలుగైదు రాత్రులు కంటి మీద కునుకు లేదు..స్నేహితుడు కాడన్నమాట..అయితే ఎవరు ? చుక్కలన్నీ కలుపుకుంటూ వెనక్కి వెళ్ళి చూస్తే నిజమేననిపించింది..తెలీకపోతే ఒకరకం ,తీరా తెలిశాక ఒకరకం.

అతడి సమక్షంలో క్రమేపీ నా మాటల్లో పదును తగ్గింది,అతడు మాట్లాడుతుంటే నా లాజికల్ బ్రెయిన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయేది..ఆక్వార్డ్నెస్,రెస్ట్లెస్నెస్..అతడి ఆలోచనలతో నిద్రలేని రాత్రులు,నిద్రమత్తులో పగళ్ళు,పగటికీ రాత్రికి తేడా తెలియకుండా,బాహ్య ప్రపంచంతో బాటు నాలో నేను కూడా అదృశ్యమైపోయిన క్షణాలూ,గంటలూ,రోజులూ గడిచిపోతున్నాయి..అసలే 'క్యూరియాసిటీ కిల్డ్ ది క్యాట్' కు పోస్టర్ ఛైల్డ్ అయిన నాకు ఈ జరుగుతున్నదానిలో నిజమెంతో,నా భ్రమ ఎంతో తెలుసుకోవాలనే తపన మొదలైంది.

అతడికి దూరంగా జరగడానికి ప్రయత్నించాను..అతడు జరగనివ్వలేదు..ఒకరోజు ఆలోచనలు అదుపుతప్పి 'మిస్డ్ యూ' అన్నాను..అతడినుండి సమాధానం లేదు..మౌనం..అటుపై మాట దాటవేశాడు..నా తొందరపాటుకి సిగ్గుపడ్డాను..కాస్త సమాధానపడ్డాక అనిపించింది ఇకనైనా మించిపోయిందేదీ లేదు,ఎమోషనల్ అటాచ్మెంట్ మాత్రమే కదా ! కాస్త దూరం జరుగుదామని ప్రయత్నించాను,అతడు జరగనివ్వలేదు..మళ్ళీ షరా మాములే..మా మధ్య సాన్నిహిత్యం క్షణక్షణానికీ పెరిగిందే తప్ప కొంచెం కూడా తగ్గలేదు..అన్నీ ఉన్నాయి,ఉందో లేదో తెలియని ప్రేమ తప్ప..ఇద్దరికీ అర్ధంకానీ శక్తేదో ఒకర్నొకరికి దగ్గరగా లాగేస్తున్న భావన..చిక్కు ముళ్ళు పడిపోయిన మనసుల్ని తెగేదాకా లాగితే భరించలేని వేదన..ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండలేడు..కానీ ప్రేమించానని మాత్రం చెప్పలేడు..ప్రేమిస్తే,వాళ్ళ నుండి ఏమీ ఆశించకూడదు అని ఎవరు చెప్పారో గానీ ఆ క్షణంలో వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం కలిగింది.

ఒకరి ఆలోచనల్ని మరొకరం పుస్తకం చదివినట్లు చదివెయ్యగలం..నాలో ఈ మార్పులన్నీ అతడికీ తెలుసు,కానీ అదే కఠినమైన మౌనం..కానీ ఆ మిస్టీరియస్ ఆటిట్యూడే కదా తనవైపుకు నన్ను బలంగా లాగుతుంది !! అతడు నా ఆలోచనలన్నీ అవలీలగా చదివెయ్యగలడు..తనని మిస్ అవుతున్నాను అని గ్రహిస్తే ఎంత బిజీ టైం లో ఉన్నా కూడా ఫోన్ చేస్తాడు,పని చేసుకుంటూ కబుర్లు చెప్తాడు..అతడి కలల ప్రపంచంలోకి మన పర్మిషన్ లేకుండా,మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అమాంతం చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోగల సమర్థుడు..కథలూ,కవితలూ,మా మధ్య ఎన్నెన్నో కబుర్లు..వాటిలో మధ్య మధ్యలో తళుక్కున అన్యాపదేశంగా పొంగుకొచ్చే 'రీడ్ బిట్వీన్ ది లైన్స్ ప్రేమ'..ప్రేమ అంటే సంథింగ్ అన్ కండిషనల్ కదా !! (constitution తో పాటు ఇలాంటి ఫిలాసఫీలు కూడా మారాల్సిన కాలం ఇది) అందులోనూ 'ఓన్లీ ఫూల్స్ ఫాల్ ఇన్ లవ్' అంటారు మరి..నా కళ్ళకు పెట్టుకున్న రోజ్ కలర్డ్ గ్లాస్సెస్ తీసే అవకాశం అతడు ఎప్పుడూ ఇవ్వలేదు,నేనూ తీసుకోలేదు.

అతడు కాలంతో పాటు పరిగెడతాడు..అతడి డిక్షనరీలో ప్రేమకంటే క్షణానికి విలువెక్కువ..నాతో గడిపే సమయం కూడా ఆ డైలీ టైం టేబుల్ లో భాగమేనేమో, ఒక రేషన్ లా కొద్ది కొద్దిగా దొరుకుతుంది..కానీ క్వాలిటీ టైం విలువ బాగా తెలిసినవాడు..నానుంచి తనకు తానుగా ఎప్పుడూ ఏదీ ఆశించడు..తన అనుకున్నవాళ్ళు (?) తన జీవితంలో ఉంటే తనకు చాలంటాడు..ప్రేమించడం సంగతి అటుంచి అతణ్ణి ద్వేషించడం ఎవరికీ సాధ్యం కాదు..సాధు జీవి..అతడు భూమి మీద,నేను ఆకాశంలో..భూమీ,ఆకాశం కలుస్తాయనేది భ్రమేమో కదా..అలా అనిపించిన ప్రతిసారీ బాల్కనీ లోనుంచి దూరంగా కనిపించే సముద్రం చిలిపిగా వెక్కిరిస్తూ నవ్వుతుంది..నేను రోజంతా అతడితో గడిపే ఆ కొద్ది నిముషాల కోసం ఎదురుచూస్తాను,అతడికి బహుశా ఆ క్షణంలో మాత్రమే నా ఉనికి గుర్తొస్తుందేమో అనుకుంటాను.

ఒకసారి రోజంతా బిజీగా ఉన్నాడేమో,నాతో గడపడం వీలుపడలేదు..ఈలోగా రాత్రి ఆఫీస్ పనితో నైట్ ఔట్ కూడా చెయ్యాల్సి వచ్చింది,అక్కడే  నిలబడి వేచి చూస్తున్న నాతో "ఈ రాత్రంతా నాకు పనుంది,వర్క్ ఫ్రమ్ హోమ్" అన్నాడు..అతడు నా దృష్టిని దాటిపోకుండా నా సమక్షంలో ఉంటే చాలు అని నా మొహంలో విచ్చుకుంటున్న ఆనందం ఇంకా పూర్తిగా బయటకు కనిపించనేలేదు,"నీకు కావాలంటే ఈరోజు నాతో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే గడపవచ్చు,నేను పని చేసుకుంటూ మధ్య మధ్యలో నీతో మాట్లాడతాను" అన్నాడు, బాస్ తన క్రింద పనిచేసే ఉద్యోగికి అవకాశమిచ్చినట్లు..నా మొహంలో చిరునవ్వు చటుక్కున మాయమైపోయింది..చెంప మీదెవరో ఛెళ్ళున కొట్టినట్లైంది..ఆశాభంగం.."నీకు కావాలంటే"..ఈ  రెండు పదాలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి..అంటే ఇదంతా కేవలం నా కోసమేనా !! అతడి కళ్ళల్లో ఆశ్చర్యం నా వీపుకి గుచ్చుకుంటుండగా నాకు నిద్రవస్తోంది అని చెప్పి నా మొహంలో భావాలు కనిపించకుండా అక్కడనుంచి మెల్లిగా వచ్చేశాను.

అతడి మనసులో భావాలు చదివే ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయాను..ఇక సెలవు నేస్తం అని చెప్పాను ఒకనాడు..అతడి మొహంలో ఆశాభంగం దాచుకుందామన్నా దాగలేదు.."నాకు మాటల మీద కంటే మౌనం మీద,చేతల మీద నమ్మకం ఎక్కువ" అన్నాడు..అదే చాలనిపించింది..బహుశా నేనే తొందరపడ్డాను అనుకున్నాను, అడుగు వెనక్కి వేశాను..కానీ ఒక్కసారైనా నీవంటే ఇష్టమని అతడి నోటి వెంట వినాలనే అబ్సెషన్ రోజురోజుకీ నాలో ఎక్కువై నన్ను పిచ్చిదాన్ని చేసేది.."నేనంటే ఇష్టమని తెలుసు,ఆ ఒక్క మాటెందుకు చెప్పవూ" అని ఒకరోజు నిలదీశాను..ఆ క్షణంలో ఆ మాట ఒక్కటీ అతడి నోటినుండి వింటే,అతడు మళ్ళీ జీవితంలో నా మొహం చూడకపోయినా ఫర్వాలేదనిపించింది..నా పిచ్చితనం నాకు తెలుస్తూనే ఉంది..ఉహూ..మళ్ళీ అదే మౌనం..నన్ను వెళ్ళనివ్వడు,ఉండనివ్వడు..రాక్షసుడు అని మనసులోనే తిట్టుకున్నాను.

ప్రేమతో బాటు ఏదీ శాశ్వతం కాదని తెలిసిన వ్యక్తి..కానీ అతడి నిజం నన్ను భయపెట్టేది..అందరం ఏదో ఒకరోజు చచ్చిపోతామని తెలిసినా జీవితం మీద ఆశే కదా మనల్ని ముందు నడిపిస్తుంది..ప్రేమ స్వాప్నిక లోకాన్ని దాటి వాస్తవరూపం దాల్చినప్పుడు అతడు ఆ వెలుతురుని చూడలేడు..మరో స్వప్నాన్ని వెతుక్కుంటూ వెడతాడు..కానీ మాసిపోయిన స్వప్నాలను సమాధి చెయ్యడు..ఎందుకంటే అతడికి ఆ క్షణం నిజం..ఆ ప్రేమ నిజం..కమిట్మెంట్ లేకుండా జీవితాంతం తోడుంటానంటాడు..ఇక్కడ చిక్కేమిటంటే ఒక బొమ్మతో ఆడుకుని అలసిపోయి,విసిగిపోయిన పసివాడిలా మరో బొమ్మ దొరకగానే దీన్ని ప్రక్కన పడేస్తాడు..కానీ ఆ బొమ్మని ఎవరికీ ఇవ్వడు..తన అల్మారాలో మిగతా బొమ్మల ప్రక్కన భద్రంగా అలకరించుకుంటాడు..అవి అతడి ఉనికిలో భాగం..అతడి స్పిరిట్యువల్ జర్నీలో మరో మెట్టు..అతడి సొంతం..అతడి ఉద్దేశ్యంలో బొమ్మలకి ఇష్టాయిష్టాలుండవు.

ఇదంతా తెలిసే నేను అతణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించాను..ఏదో ఒక సమయంలో అతడు నా మనసు ముక్కలు చేస్తాడని తెలుసు..నాది అతడిలా పదిమందికి పంచగలిగే విశాలమైన ప్రేమ కాదు..నా మౌనాన్ని చదివాడో ఏమో ఒకరోజు తనకిష్టమైన కవిత అంటూ ఒక కవితను నాకు చూపించాడు..ప్రేమ కవిత్వం..మనసులో భావాలు మాటల్లో చెప్పేస్తే గాలిలో కలిసిపోయి మాయమైపోతాయి..అలా చెప్పకుండా ఇలా అక్షరాల్లో పెట్టేవాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం అనుకున్నాను..ఆరోజు నేనెప్పటికీ మర్చిపోలేను..క్లౌడ్ నైన్ లో ఉండడమంటే ఏమిటో ఆ క్షణంలో అనుభవమైంది..ఆ క్షణాన్ని పూర్తిగా జీవించనైనా జీవించలేదు "ఇది కూడా షార్ట్ టైమ్ మాత్రమే,ఏదీ శాశ్వతం కాదు" అతడి స్వరం కఠినంగా పలికింది..నా కళ్ళల్లో నీళ్ళతో పాటు మొదటిసారి అతడిపై నా ప్రేమను వ్యక్తపరిచిన క్షణమది "You know what, I Hate You".