వర్చ్యువల్ రియాలిటీకీ వాస్తవానికీ తేడా పూర్తిగా చెరిగిపోయిన ఈ తరంలో ఫేస్బుక్ కిటికీల్లోంచి చూసే జీవితాలకీ వాస్తవ జీవితాలకీ ఎంత ఉంటుందో, అధికార పక్షాల గుప్పిట్లో చిక్కుకున్న మీడియా చూపించే ప్రతిబింబాలకీ,వాస్తవానికీ కూడా అంతే తేడా ఉంటుంది. జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తూ ఏసీ కారుల అద్దాల్లో నుండి ప్రపంచాన్ని చూసే ఉంటారు, ఎటుచూసినా శుభ్రంగా,అందంగా ఉంటుంది. కానీ కారు దిగి రహదారులు దాటుకుని ఇరుకు సందుల గుండా మురికివాడల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో నడిస్తేనే గానీ దాని నిజస్వరూపం తెలియదు. మన దేశ వాస్తవిక స్థితి క్యాపిటలిజం కొలువుదీరిన ఆకాశహర్మ్యాల్లో కంటే ముంబై లోని ధారావి,ఢిల్లీ లోని కుసుంపూర్ పహాడీ లాంటి మురికివాడల్లోనూ, బళ్ళారి వైపు గనుల్లో కార్మికుల ప్లాస్టిక్ గుడారాల్లోనూ ఎక్కువ కనిపిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో నేను చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఈ 'నోట్స్ ఫ్రమ్ ది హింటర్ల్యాండ్' ఒకటి. ఈ పుస్తకం కాలు కదపకుండా ఇంట్లో కూర్చున్న పాఠకులకు భారతీయ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిస్తుంది. నాకు తెలిసిన సుందర భారతం ఎవరమూ గుర్తుపట్టలేని విధంగా ఈ ఏడాది మరీ వికృతంగా మారిపోవడంవల్ల కావచ్చు,ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో భారతీయ రచయితల పుస్తకాలపై మనసుపోయింది. బహుశా కరోనా తరంగాల తాకిడిలో కొట్టుకుపోయిన గతించినకాలపు సహజమైన జీవనశైలినీ,జీవితానుభవాలనూ తిరిగి వెతుక్కునే ప్రయత్నం కావచ్చు.
Images Courtesy Google |
ఈ పుస్తకంలో కొత్త నీరూ,పాత నీరూ పాయలుగా కలుపుతూ పలు భారతీయ రచయితలు రాసిన మొత్తం పది కథలున్నాయి. వీటిల్లో తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఒక కథ ఉండడం విశేషం. చక్కని అనువాదంతో కూడిన తిలక్ కథను చదివి చాలా సంతోషమేసింది. పేరుకి అతి పెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశాన్ని ప్రత్యక్షంగా శాసించేవి ముఖ్యంగా రెండే రెండు అంశాలు : ఒకటి కులం,రెండవది మతం. ఇక మూఢనమ్మకాలూ,ఛాందస భావాలూ, స్వార్థపరత్వంలాంటివి పరోక్షంగా తమ వంతు పాత్రను ఎటూ పోషిస్తాయి. వీటి బారినపడిన ప్రజాస్వామ్యం దిక్కులేక కొన ఊపిరితో కొట్టుకుంటూ ప్రపంచానికి గర్వంగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుంటుంది. ఈ రచనలో తిలక్,శ్రీలాల్ శుక్లా,రస్కిన్ బాండ్,శశి థరూర్, రహి మసూమ్ రజా వంటి కొందరు రాసిన కథలు కాల్పనికతకు దూరంగా వాస్తవికతకు అద్దంపట్టేవిగా ఉంటాయి. వీటితోబాటు పాలగుమ్మి సాయి నాథ్ (మరో తెలుగాయన :) ) ,అభిమన్యు కుమార్ వంటి జర్నలిస్టులు రాసిన వాస్తవిక అనుభవాలతో కూడిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.
ఈ పుస్తకానికి సంపాదకత్వం చేసిన శశి థరూర్ రాసిన వ్యాసం లాంటి కథ 'Scheduled Castes, Unscheduled Change' తో ఇందులో కథలు మొదలవుతాయి. ఈ కథను నేను ఇది వరకే మరొకచోట చదివాను. ఇదే కథను అనితా నాయర్ ఎడిట్ చేసిన 'Where the Rain is Born: Writings about Kerala' అనే పుస్తకంలో 'ఛార్లీస్ అండ్ ఐ' పేరుతో ప్రచురించారు. అప్పట్లో చాలా నచ్చి అనువాదం చేద్దామనుకున్నా వీలుపడలేదు. కేరళలో బలంగా వ్రేళ్ళూనుకుపోయిన వర్ణ వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను థరూర్ కేరళలో తన బాల్యానుభవాలతో ముడిపెడుతూ వివరించిన కథ ఇది. శశి థరూర్ అనగానే ఆయన సిగ్నేచర్ ఆంగ్ల పదగాంభీర్యాలు గుర్తొచ్చి, పేజీకో పదిసార్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తిరగేసే ఓపిక లేక ఆయన రచనలేవీ చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఈ కథ చదివినప్పటినుండీ థరూర్ మరికొన్ని కథలను చదవాలనే ఆసక్తి కలిగింది. ఈ కథలో ఆయన నేరేషన్ చాలా సహజత్వంతో సరళమైన పదాలతో ఒక ప్రవాహంలా సాగుతుంది.
రస్కిన్ బాండ్ రాసిన రెండో కథ 'The Night Train at Deoli' లో కాలేజీ కుర్రవాడైన కథానాయకుడు వేసవి సెలవుల్లో డెహ్రాడూన్ లో తన అమ్మమ్మతో గడపడానికి వెళ్ళే ట్రైన్ డియోలీ అనే స్టేషన్ దగ్గర ఆగుతుంది. "Why it stopped at Deoli, I don’t know. Nothing ever happened there. Nobody got off the train and nobody got on." అనుకుంటుండగా ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద వెదురుబుట్టలు అమ్ముకుంటూ ఆకర్షణీయమైన చారడేసి కళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. ఇద్దరి మధ్యనా పెద్ద సంభాషణ జరగపోయినా ఆమె రూపం అతడి మనసులో ముద్రపడిపోతుంది. ఈలోగా ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ రెండు నెలల తరువాత తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు అతడి కళ్ళు ఆమెకోసం ఆత్రంగా వెతుకుతాయి. విచిత్రంగా ఆమె మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ కనపడుతుంది. ఆమెతో మాటలు కలుపుతూ,"నేను ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ వస్తాను,నువ్వు ఇక్కడ ఉంటావు కదా" అని మాట తీసుకుంటాడు. మళ్ళీ ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ ఏడాది కాలేజీకి సెలవులివ్వగానే అతడు ఆమెను చూస్తాననే నమ్మకంతో ప్రయాణమవుతాడు. ఈ కథకు ముగింపు చదవాల్సిందే. బాండ్ తన కథల్లో ప్రకృతి వర్ణనల సున్నితత్వంతో పోటీపడుతూ తొలిప్రేమ తాజాదనాన్ని వర్ణించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇందులో మూసపోసినట్లుండే కథల్లో కాస్త భిన్నమైన కథ ఇదొక్కటే.
మూడో కథ ఆర్.కె.నారాయణ్ రాసిన 'An Astrologer’s Day' మాల్గుడి తరహా భారతీయ గ్రామీణ వాతావరణాన్ని మరోసారి గుర్తుచేస్తుంది. ఆయన కథల్లో నేపథ్యానికీ,పరిసరాల వర్ణనలకూ పెద్ద పీట వేస్తారని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కథలో చిన్న బజారులో మున్సిపాలిటీ వీధి దీపాలు లేకుండా కేవలం షాపుల్లో ఉన్న దీపాలతోనూ,గ్యాస్ లైట్ల వెలుతురుతోనూ నిండిన ఆ ప్రాంతాన్ని పాఠకుల మనస్సులో ఇట్టే చిత్రిస్తారు నారాయణ్.
నాలుగో కథ రంగా రావు గారు తెలుగు నుండి ఆంగ్లానికి అనువాదం చేసిన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన 'The Man Who Saw God' మానవత్వం గొప్పదా ? మతం గొప్పదా ? అనే ప్రశ్నల్ని మరోసారి రేకెత్తిస్తుంది. కరణాలూ,మునసబులూ,అవధానులూ వంటివారు సామజిక నియమాలను శాసిస్తూ పంచాయితీలలో ప్రముఖపాత్ర పోషించే అలనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కథ ఇది. గవరయ్య నాస్తికుడు,తోలు వ్యాపారం చేస్తుంటాడు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్న తీరులో అతడు తన మానాన తాను బ్రతుకుతుంటాడు. భక్తీ, పాపభీతి లేని కారణంగానే అతడి వయసులో సగం వయసున్న భార్య టైలరుతో వెళ్ళిపోయిందని అంటూ అతడిలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంటారు ఊరిపెద్దలు. ఈలోగా గవరయ్య భార్య నిండు గర్భిణిగా దీనమైన స్థితిలో ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తరువాతేమి జరిగిందనేది మిగతా కథ. ఈ కథ మానవత్వానికీ, మత మౌఢ్యానీకీ మధ్య జరిగే సంఘర్షణనను చూపిస్తుంది.
ఐదో కథ ప్రముఖ ఉర్దూ కవీ,రచయితా రహి మసూమ్ రజా రాసిన 'A Village Divided' ను Gillian Wright ఆంగ్లంలోకి అనువదించారు. మసూమ్ రజా పేరు వినగానే దూరదర్శన్ లో వచ్చిన చోప్రా 'మహాభారత్' కు రాసిన స్క్రీన్ ప్లే గుర్తొస్తుంది. మతంపేరుతో విషం కక్కే సమాజంలో ఇలాంటివి నిజంగా అద్భుతాలు అనిపిస్తాయి. ఈ కథలో రజా స్వస్థలమైన ఘాజీపూర్ నుండి బ్రతుకుతెరువుకు కోల్కతా,ముంబై,కాన్పూర్ వంటి చోట్లకు జనపనార మిల్లులో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళే యువకుల గురించి రాస్తారు. అడుగడుగునా పద్యాన్ని తలపించే ఆయన గద్యం నాకు చాలా నచ్చింది.
Calcutta is not the name of a city. For the sons and daughters of Ghazipur it is another name for the yearning that comes of separation. This yearning is a whole story in itself, in which the kajal lining the eyes of countless women has been washed away by tears, and then dried. Every year thousands upon thousands of men far from home send back thousands upon thousands of messages with the monsoon clouds. Perhaps that’s why clouds burst over Ghazipur and, in these rains, seeds of yearning sprout in new and old walls, in the roofs of mosques and temples, in the cracks of school windows and doors, and the pain of separation awakes and begins to sing :
No one stirs out in the monsoon rains,
Only you would leave for a distant land.
ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్ (పాలగుమ్మి సాయి నాథ్) రాసిన 'Ganpati Yadav’s Gripping Life Cycle' అనే కథ 'Everybody Loves a Good Drought' అనే కథల సంపుటి నుండి సంగ్రహించబడింది. మహారాష్ట్రలోని రామాపుర్ కి చెందిన 97 ఏళ్ళ రైతు /స్వాతంత్య్ర సమరయోధుడు గణపతి యాదవ్ అనుభవాలు అలనాటి స్వాతంత్య్ర సమరపు రోజుల్ని జ్ఞప్తికి తెస్తాయి. ఢిల్లీ కి చెందిన జర్నలిస్టు అభిమన్యు కుమార్ రాసిన వ్యాసం 'The Lynching That Changed India', స్నిగ్ధా పూనమ్ రాసిన 'The Man Who Lived' బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండీ మతంపేరిట జరుగుతున్న మరణహోమాల్ని కళ్ళకుకడితే, మాధురీ విజయ్ రాసిన 'Lorry Raja' కథ కర్ణాటక గనుల్లో పనిచేసే కార్మికుల దుర్భర జీవితాలకు అద్దం పడుతుంది. ఇక Gillian Wright హిందీ నుండి అనువదించిన శ్రీ లాల్ శుక్లా కథ 'Raag Darbari' భారత దేశంలో లంచగొండితనానీ,వ్యవస్థలో లొసుగుల్నీ చూపిస్తుంది. రెండు భిన్న తరాల రచయితలు రాసిన కథలు కావడంతో వీటిల్లో శైలుల వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. సమకాలీన రచయితల కథలలో భాషా సౌందర్య లేమీ,లోతులేని ఉపరితలానికి పరిమితమైన వర్ణనలూ స్పష్టంగా కనిపించాయి. ఏదేమైనా థరూర్ ఎంపిక చేసిన ఈ కథల్లో నాకైతే ఇది చెడ్డ కథ అని ఏమీ అనిపించలేదు. ఒక్కో కథా ఒక్కో ప్రత్యేకమైన శైలికీ,సంస్కృతికీ,కాలానికీ చెందినవైనా ఈ కథల సంకలనంలో అన్నీ కలిసి భారతీయ భిన్నత్వంలోని ఏకత్వాన్ని మరోమారు చాటి చెప్పాయి. భౌతిక స్వరూపం కంటే భారతీయ ఆత్మను పట్టి ఇచ్చే ఈ కథలన్నీ మనకు తెలిసిన భారతాన్ని సరికొత్త వెలుగులో చూపిస్తాయి.
No comments:
Post a Comment