Wednesday, February 8, 2023

Love and Youth : Essential Stories - Ivan Turgenev

కొన్ని రోజులు ఫిలాసఫీలూ, సైకో ఎనాలిటిక్ విశ్లేషణలకు సెలవిచ్చి ఆడుతూ పాడుతూ "పుష్కిన్ ప్రెస్ ఫెస్టివల్" జరుపుకుంటున్నాను. మునుపు పుష్కిన్ ప్రెస్ ప్రచురణల్లో మార్సెల్ల్ ఐమీ, కాఫ్కా, ఆకుతాగవా కథలు చదివాను. ఇది నాలుగో కలెక్షన్. ఫిబ్రవరి కదా, కాస్త ఆహ్లాదకరమైన తేలికపాటి కథలేమన్నా చదువుదామని చూస్తే ఇవాన్ తుర్గేనెవ్ కథల పుస్తకం "లవ్ అండ్ యూత్" కనిపించింది. నాకు తుర్గెనెవ్ రచనలతో తొలిపరిచయం ఆయన నవలిక "ఫస్ట్ లవ్" తో జరిగింది. ఈ కథల సంపుటిలో మొట్టమొదటి కథే అది. ఇందులో మూడు ప్రేమ కథలతో బాటు 'Notes of a Hunter', 'A Sportsman's Sketches'  నుండి సంగ్రహించిన కొన్ని కథలూ, స్కెచెస్ ఉన్నాయి. ఇందులో కూడా అన్నిటికంటే ఆకట్టుకున్న కథ మొదటిదే : 'ఫస్ట్ లవ్'. దాని గురించి మునుపు బ్లాగ్ లో రాశాను కాబట్టి మళ్ళీ ప్రస్తావించడం లేదు.

Image Courtesy Google

మిగతా కథల విషయానికొస్తే తుర్గెనెవ్ కథలన్నీ మంచి ల్యాండ్ స్కేప్ నేపథ్యంలో మొదలవుతాయి. కెంజాయ రంగులో మెరిసే ఆకాశం, అల్లంత దూరం వరకూ విస్తరించిన పచ్చిక మైదానాలూ, తుప్పలతో కూడిన చిక్కని అడవి దారులూ, మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ కురిసే చిరుజల్లుల జూలై వానలూ, ఇలా కథ మొదలు పెడుతూనే ప్రకృతి వర్ణనలు చదువుతున్నామంటే అది ఖచ్చితంగా తుర్గెనెవ్ అయ్యుండాలి అని ఆయన పేరు తెలీకుండా ఏ కథ చదివినా ఊహించడం సులభం.

Bezhin Meadow కథలో అడవిలో దారితప్పిన వేటగాడు ఆ రాత్రి గడపడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతుండగా, గుర్రాలను మేపడానికొచ్చిన 16 ఏళ్ళ లోపు వయసున్న ఐదుగురు కుర్రవాళ్ళు చలి కాచుకుంటూ కనిపిస్తారు. వారి అనుమతితో ఆ రాత్రి అక్కడే విశ్రమించిన కథానాయకుడు, ఆ యువకులు ఒక్కొక్కరూ చలిమంట చుట్టూ చేరి పొద్దుపుచ్చడానికి తమలో తాము చెప్పుకునే కథల్ని మనకు చెబుతూ ఉంటాడు. ఆ కథలో కథలన్నీ రష్యన్  జానపదాలని తలపించే పిట్టకథల్లా ఉంటాయి. వాస్తవాన్నీ, కల్పననూ చెరిపేస్తూ ఫాంటసీ, గాసిప్, హారర్ లాంటి అంశాలను జత చేసిన ఈ కథలు వారి ఊళ్ళో తెలిసిన మనుషుల మధ్య జరిగిన (?) అనేక సంఘటనల గురించి చిలవలు పలవలు అల్లి చెప్పుకునే కథల్లా అనిపిస్తాయి. 'పుస్తకం' పుట్టుకకు ముందు ఆ నోటా ఈ నోటా కథలెలా వ్యాప్తి చెందేవో తెలియాలంటే ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ కథ చిన్నప్పుడు చదివిన చందమామ కథల్ని గుర్తుకుతెచ్చింది. అలాగే Biryuk కూడా దారితప్పిన వేటగాడికి ఆశ్రయం ఇచ్చిన ఒక అటవీశాఖ అధికారి కథ. బిర్యుక్ అంటే "లోన్ వుల్ఫ్" అని అర్థం ఉందట. ఈ కథలో ప్రత్యేకం పాత్రల్ని మలిచిన తీరూ, వారి హావభావాల వర్ణనా కథకు ప్రాణం పోశాయి. తుర్గెనెవ్ కథనాన్ని రక్తి కట్టిస్తూ భావోద్వేగాలను పండించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక The Rattling, అడవి దారిలో దోపిడీ దొంగల భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గుర్రపు బగ్గీలో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు చివరకు తమ గమ్యాన్ని చేరారో లేదో చెప్పే కథ. తుర్గెనెవ్ వర్ణనల్లో ప్రత్యేకత ఏంటంటే, పాత్రలతో బాటు మనల్ని కూడా ఆ ప్రయాణంలో భాగస్వాముల్ని చేస్తారు. వాళ్ళు భయంతో వణికిపోతున్నప్పుడూ, మళ్ళీ తేరుకుని స్పృహలోకి వచ్చినప్పుడూ కూడా మనం వారి అనుభవాన్ని మనదిగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా పాఠకుల ఏకాగ్రతను కథమీద నుండి మళ్ళకుండా కథనంలో అలవోకగా కలిసిపోయి కోటగోడలా కాపుకాసే రష్యన్ లాండ్స్కేప్ కథకు తగిన పరిసరాల ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. ఈ తరం కథల్లో ఏ నేపథ్యమూ, మూలాలూ లేని మొండి గోడల్లా నిలిచే పాత్రల్లోని డొల్లతనానికి కారణాలు కూడా ఇలాంటి కథలు చదివినప్పుడు అర్థమవుతుంది. ఆనాటి కథకూ, నేటి కథకూ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, మనిషి ప్రకృతి నుండి పూర్తిగా విడిపోయి ఒంటరిగా మరో ప్రక్క నిలబడి చెప్తున్న కథలు నేటివి. ఇక 'ఫస్ట్ లవ్' తో బాటు ఇందులో ఉన్న మరో రెండు ప్రేమ కథలు 'The District Doctor', 'The Lover's Meeting'. మొదటిది తన పేషెంట్ తో ప్రేమలో పడే డాక్టర్ కథైతే, రెండోది అమాయకంగా ఒక యువకుణ్ణి నమ్మి మోసపోయిన యువతి  కథ.

ఈ కథలు ఆధునిక సమాజం అధికంగా చెప్పుకుంటున్న 'కడుపునిండిన కథలు' కావు. తాత్వికత, ఆధ్యాత్మికత అంతర్వాహినిగా ప్రవహించే వచనంతో కూడిన కథలు. వీటిల్లో పల్లె జీవుల సమస్యలూ, పామరుల సంఘర్షణలూ, వారి భ్రమలూ, భయాలూ, ఊహాగానాలూ, సామాన్యుల సాధకబాధకల్లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అదే సమయంలో అన్ని కథల్లోనూ జీవన చిత్రాన్ని చూపించే ప్రయత్నమే కనబడుతుంది. ఎక్కడా నీతులు చెప్పకుండా, భావజాలాల్ని ప్రోపగాండా చెయ్యకుండా అలనాటి రష్యన్ లాండ్స్కేప్ ని అందమైన చిత్రంలా గీసి మనిషిగా మనడానికి అవసరమయ్యే ప్రాముఖ్యతలేవో మనల్నే తేల్చుకోమని అక్కడితో తన పనైపోయిందని  చేతులు దులుపుకుంటారు తుర్గెనెవ్. :)

హ్యాపీ రీడింగ్. :) 

No comments:

Post a Comment