Thursday, July 17, 2025

A Year of Reading Ulysses: My Journey Through Joyce

ఆధునిక సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన రచనల్లో జేమ్స్ జాయిస్ "యులీసిస్" ఒకటి. చాలామంది పబ్లిషర్లు తిరస్కరించిన తర్వాత, పారిస్ లోని "షేక్స్పియర్ అండ్ కంపెనీ" బుక్ షాపు యజమాని సిల్వియా బీచ్ 1922లో  'యులీసిస్'ను తొలిసారి ప్రచురించారు. కానీ అసభ్యత/ అశ్లీలతల పేరిట ఈ నవలను త్వరలోనే బ్యాన్ చేశారు. U.S.పోస్టల్ సర్వీస్ అయితే ఏకంగా 'యులీసిస్' కాపీలను తగలబెట్టింది. కథాపరంగా చూస్తే నిజానికి 'యులీసిస్' ఎటువంటి ప్రత్యేకతలూ లేని నవల. 1904 జూన్ 16వ తేదీన డబ్లిన్ లోని కొందరు సాధారణ వ్యక్తుల జీవితంలోని ఒకే ఒక్క రోజును తీసుకుని జేమ్స్ జాయిస్ ఈ నవలను రాశారు. ఈ కథ జరిగే సుమారు 18 గంటల కాలంలో  డబ్లిన్ వాసులు తమ రోజువారీ పనులు చేసుకుంటూ కనిపిస్తారు. ఉదయం లేచి అల్పాహారం తీసుకుంటారు,  పరిచయస్తుల్ని కలుస్తారు, బార్ లో మద్యం సేవిస్తారు, అంత్యక్రియలకు హాజరవుతారు, పోస్ట్ ఆఫీసుకెళ్ళి ఉత్తరాలు తీసుకుంటారు, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా తిరుగుతుంటారు- క్లుప్తంగా చెప్పుకోవాలంటే "యులీసిస్" కథంతా ఇలాగే ఉంటుంది. ఈ నవల ప్రత్యేకత కథలో కంటే అతి సాధారణమైన కథను జాయిస్ ఎలా చెప్పారన్నదానిలోనే ఉంటుంది. జాయిస్ దైనందిన వ్యవహరాల్లో, మామూలు సంభాషణల్లో 'ఆర్ట్'ను ఎంత సమర్థవంతంగా చూపగలిగారన్నదే ఈ నవల ప్రత్యేకత. నిజానికి ఈకాలంలో ఓటీటీ వెబ్ సిరీస్లు, సినిమాలూ, పుస్తకాల్లో కనిపించేంత అశ్లీలత ఈ నవలలో లేదు. అందువల్ల ఆధునిక పాఠకుడికి ఈ పుస్తకంలో షాక్ వేల్యూ పెద్దగా కనిపించే అవకాశం లేదు. కానీ 1920ల నాటి కాలంలో మతవిశ్వాసాలనూ, సాంఘిక నియమాలనూ సవాలు చేసిన ఈ నవలకు ఎదురైన వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.

Image Courtesy Google

సాహిత్యంలో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" కథనాలు కొత్తేమీ కాదు. మునుపు చాలా రచనల్లో చదివినవే. కొన్ని రచనల్లో కథంతా ఒకే ఒక్క ముఖ్య పాత్ర తన స్వగతం చెప్పుకుంటున్నట్లు రాస్తారు. ఉదాహరణకు జులియన్ బార్నెస్ " ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్", థామస్ బెర్న్హార్డ్ "ది లూజర్" లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఒకవేళ కథల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలుంటే వాళ్ళ  స్వగతాలను ఒక్కొక్కరి దృష్టి కోణం నుంచీ ఒక్కొక్క విభాగంగా విడదీసి చెబుతారు. ఉదాహరణకు ఇటీవల నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న హాన్ కాంగ్ రచన "ది వెజిటేరియన్", టాల్స్టాయ్ "అన్నా కరెనిన" లాంటి నవలలు ఈ శైలిలో ప్రయోగాలు చేసాయి. ఇప్పుడు జాయిస్ వచనాన్ని పరిశీలిస్తే, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష- ఈ మూడు రకాల నేరేటివ్ లూ పుస్తకమంతా ఏ విధమైన క్రమమూ లేకుండా ఒకదాన్నొకటి ఢీ కొడుతూనే ఉంటాయి. అందువల్ల 'యులీసిస్' వచనమంతా అనేక పాత్రల ఆలోచనల అంతర్వాహిని అస్తవ్యస్తంగా పెనవేసుకున్నట్లు, చిక్కులు పడిపోయినట్లు ఉంటుంది. ఈ నవలలో లియోపోల్డ్ బ్లూమ్, స్టీఫెన్ డెడలస్, మోలీ వంటి ముఖ్య పాత్రలతో బాటు కథ మధ్యలో వస్తూ పోతూ ఉండే ఇతరత్రా పాత్రల స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా కలగాపులగంగా కలిసిపోయి జాయిస్ వచనాన్ని పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడనివ్వవు. పాఠకుడికి ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో స్పష్టత ఉండదు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడడం మొదలులుపెట్టారో, సంభాషణ ఎప్పుడు ముగించారో తెలీదు. వాక్యాల చివర ఫుల్ స్టాపులూ, కామాలూ ఉండవు. రెండు, మూడు పేజీలు పూర్తైనా ఒక్కోసారి వాక్యం ముగింపు కానరాదు. 

ఇక్కడో సరదా సందర్భం గురించి చెప్పుకోవాలి. "యులీసిస్"లో శబ్ద ప్రధానంగా ఉండే వచనం చాలా చోట్ల కనిపిస్తుంది. అటువంటి అధ్యాయాల్లో "Oxen Of The Sun" ముఖ్యమైనది. ఈ వచనం సొగసు పూర్తిగా అనుభవంలోకి రావాలంటే అది వినడం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ క్రమంలో కొన్ని పోడ్కాస్ట్ లతో పాటు 'రీడింగ్ అప్లికేషన్'లో కూడా వినేదాన్ని. ఒకరోజు ఈ పుస్తకం చదువుతూ, సమాంతరంగా మధ్యమధ్యలో ఆడియో కూడా వింటున్నప్పుడు, 14వ ఎపిసోడ్- "Oxen Of The Sun" వింటున్న సమయంలో హఠాత్తుగా రీడింగ్ అప్లికేషన్ ఆగిపోయింది. Text-to-speech (TTS) ఆధారంగా పనిచేసే సాఫ్ట్వేర్, ఎక్కడా ఆగకుండా సాగిన జాయిస్ వాక్యాన్ని చదవడం చేతకాక హ్యాంగ్ అయిపోవడం చూస్తే, కాలదోషం పట్టని ఒక ఆర్టిస్టు వచనం, ఆధునిక టెక్నాలజీకి తన ప్రామాణికతకున్న శక్తిని చాటుతున్నట్లు అనిపించింది. ఆ క్షణంలో జాయిస్ లోని ఆర్టిస్టుకి చేతులెత్తి దణ్ణంపెట్టాలనిపించింది. ఇక చిట్టచివరి అధ్యాయం "పెనెలోపే"లో అయితే మోలీ బ్లూమ్ స్వగతంలా (soliloquy) రాసిన వాక్యం మొదట్నుంచి చివరి వరకూ ఆగకుండా అనంతమైన ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది.  ఏదేమైనా ఐరిష్ సంస్కృతి గురించీ, జేమ్స్ జాయిస్ శైలి గురించీ కనీస అవగాహన లేని సగటు పాఠకుడిని చెయ్యి పట్టుకుని 'యులీసిస్' యేరు దాటించే 'డిజిటల్ సాయాలు' ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అనేకం అందుబాటులో ఉండడం వల్ల 'యులీసిస్' చదవడం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలికే.

సహజంగా గొప్ప గొప్ప నవలల్లో తొలి వాక్యాలు గుర్తుండిపోయేలా ఉంటాయి. “First sentences are doors to worlds,” అంటారు ఉర్సులా లీగ్విన్. ఓపెనింగ్ లైన్స్ కి ఉండే ప్రాముఖ్యత అలాంటిది. 'మోబి డిక్'- "Call me Ishmael", 'అన్నా కరినిన'- “All happy families are alike; each unhappy family is unhappy in its own way”, 'ఔట్ సైడర్'- "Mother died today. Or maybe, yesterday; I can't be sure." లాంటి వాక్యాలు గుర్తుండని పాఠకులు అరుదు. మరి "యులీసిస్"లాంటి ఒక 'మాగ్నమ్ ఓపస్'కు ప్రారంభ వాక్యాలు ఎలా ఉండాలి! జాయిస్ ఇందులో కూడా ఉలిపికట్టె మార్గాన్నే ఎంచుకుంటారు. ఎన్నో ఆశలతో పుస్తకం మొదలుపెట్టే సగటు పాఠకుడికి "Stately, plump Buck Mulligan came from the stairhead, bearing a bowl of lather on which a mirror and a razor lay crossed." అనే అతి పేలవమైన వాక్యాలు జాయిస్ ప్రపంచానికి స్వాగతం చెబుతాయి. ఈ ప్రారంభ వాక్యాలు పుస్తకం "డియర్మ రీడర్ ఈ పుస్తకం నువ్వూహించుకున్నట్లు ఉండదు" అని చెప్పకనే చెబుతాయి.

"ఇన్సైడ్ జోక్స్" అనే పదం మీరు వినే ఉంటారు. ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరిగితే, అందులో వారు వాడే పదాలు, హాస్యం లాంటివి వాటి కాంటెక్స్ట్ తెలియనిదే మూడో వ్యక్తికి అర్థం కాదు. ఆ సంభాషణ పైకి కనిపించినంత సరళం కాదు. దానికి మూలం, నేపథ్యం లాంటివి ఏవో ఉన్నాయన్నమాట. జాయిస్ నవల ఇటువంటి ఒక 'ఇన్సైడ్ జోక్' లాంటిది అనిపిస్తుంది. ఎటొచ్చీ జాయిస్ ఏ ఒక్క వ్యక్తినో కాకుండా మొత్తం ప్రపంచాన్ని తన సంభాషణలో భాగంగా చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన రాసిన ఒక్క వాక్యం కూడా సూటిగా, సరళంగా ఉండదు. ఒక్కో వాక్యంలో అనేక సంక్లిష్టతలతో కూడిన పదబంధాలుంటాయి, మెటఫోర్లుంటాయి, కవిత్వం ఉంటుంది, పల్లెపదాలుంటాయి, గ్రీకు గాథలుంటాయి, దేశవిదేశీ పురాణేతిహాసాలుంటాయి, చరిత్ర, సంస్కృతి ఉంటుంది. పాఠకుడు ఈ చిక్కుముడులన్నీ ఛేదించుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు వెయ్యాలి. ఈ ప్రక్రియ మొదటి పేజీ నుండీ చివరి పేజీ వరకూ నిరంతరాయంగా సాగుతుంది. మనం ఒక పదానికి నేపథ్యం తెలుసుకునేలోపు దాని వెన్నంటే చిక్కుముడులతో కూడిన మరో పదం సిద్ధంగా ఉంటుంది. వాక్య నిర్మాణం ఎక్కడా వీగిపోని చిక్కగా అల్లిన గొలుసుకట్టులా ఉంటుంది. కొన్ని కొన్ని వాక్యాలకు ఒకటికంటే ఎక్కువ అర్థాలు కూడా ఉంటాయి.

పాఠకుడికి జాయిస్ శైలితో కాస్త చనువు ఏర్పడ్డాక ఆయన్ను చదవడం ఒక ఆటలా మారిపోతుంది. ఎందుకంటే 'యులీసిస్' కథలో పాఠకులను వెతుక్కోమని దాచేసిన "ఈస్టర్ ఎగ్స్" అనేకం దొరుకుతాయి. నాగరికత మొదలైన తొలినాళ్ళ నుండీ జాతీయ, అంతర్జాతీయ, చారిత్రాత్మక అంశాలూ, సాంస్కృతిక నిర్దేశాలూ, కథలూ, కవితలూ, రాజకీయాలూ, జానపదాలూ, పిట్ట కథలూ మొదలైన విషయవిశేషాలతో కలిపి సమృద్ధిగా రాసిన కథనం కేవలం పదాలతోనే ప్రపంచ యాత్ర చేయిస్తుంది. జాయిస్ తన నవలకు ఫ్రేమ్ వర్క్ గా తీసుకున్న హోమర్ "ఒడిస్సీ" చదివితే "యులీసిస్" చదవడం ఇక నల్లేరు మీద బండి నడకే అన్నది అర్థసత్యం మాత్రమే. కథాపరంగా "ఒడిస్సీ"కీ "యులీసిస్"కీ పొంతనలు చాలా తక్కువ. చాలామంది పాఠకులే కాదు, న్యూయార్క్ టైమ్స్ లో "యులీసిస్" రివ్యూలు రాసిన పలువురు ప్రముఖ రచయితలూ, విమర్శకులూ సైతం "యులీసిస్"ను చదవలేక అసంపూర్తిగా వదిలేసామని అంటారు. అంతెందుకూ, సాక్షాత్తూ వర్జీనియా వుల్ఫ్ “Never did I read such tosh” అనుకుంటూ రెండొందల పేజీల తర్వాత ఆ పుస్తకం ప్రక్కన పడేసి మళ్ళీ తర్వాతెప్పుడో పూర్తి చేశానంటారు. ఇక చాలామంది పాఠకులకు ఏ పుస్తకం చదివినా, అందులో "మిస్టరీ ఎలిమెంట్" పోకూడదని ముందుమాట చదవకుండా సరాసరి కథలోకి వెళ్ళిపోయే అలవాటు ఉంటుంది, ఈ పుస్తకం విషయంలో అది కుదరదు. ప్రతీ అధ్యాయం చదివే ముందు అసలేం జరగబోతోందో పాఠకుడికి కనీసమైన అవగాహన కూడా లేకపోతే ఎవరేం మాట్లాడుతున్నారో, కథేమిటో ఒక్క ముక్క అర్థంకాక, భాషరాని దేశంలో చేతిలో ఛార్జింగ్ లేని మొబైల్ ఫోన్ తో సహా తప్పిపోయినట్లు ఉంటుంది. పాఠకుడు ప్రతీ అధ్యాయం ముందూ నేపథ్యం ఏమిటో తెలుసుకుని చదవడం వల్ల కథలో అసలేం జరుగుతోందో తెలుసుకోవడం కొంచెం సులభమవుతుంది. దీనికి వెబ్ లో "యులీసిస్" గురించి ఉన్న అనేక విశ్లేషణలూ, వీడియోలూ, పోడ్కాస్టుల సాయం తీసుకోవచ్చు.

ఇంత హడావుడి ఉంది కాబట్టి ఇదేదో ప్రత్యేకించి స్కాలర్ల కోసం మాత్రమే రాసిన పుస్తకం అనుకుంటే పొరబాటే. మొదటి పది ఎపిసోడ్ల వరకూ విపరీతమైన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించినా "సైరెన్స్" ఎపిసోడ్ మొదలు హాస్యం, వ్యంగ్యం, పేరడీలతో జాయిస్ పామరుల కోసమే ప్రత్యేకించి రాస్తున్నారనిపించేంతగా, కఠినమైన వచనాన్ని కొమ్ములు వంచి ఉన్న పళంగా 180 డిగ్రీల టర్న్ తిప్పుతారు. వచనం రాయడంలో పది తలలూ, పది చేతులూ ఉన్న రచయిత ఎవరైనా ఉన్నారంటే అది జేమ్స్ జాయిస్ మాత్రమే అని ఎరుకలోకొచ్చే సందర్భం అది. ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు ఒకవేళ రచయిత గనుక కనిపిస్తే, "పాఠకుల్ని వెర్రివాళ్ళను చేసి ఆడుకుంటున్నారా? ఏం, మమ్మల్ని చూస్తే మీకంత వేళాకోళంగా ఉందా?" అని నిలదీసి అడిగి, కడిగి పారెయ్యాలనిపిస్తుంది. "యులీసిస్" చదవడంలో పాఠకులకు అన్నిటికంటే విసుగేసే విషయం- అస్సలు నేపథ్యం ఏమీ లేకుండా, సందర్భం ఏమిటో కనీస అవగాహన లేకుండానే వాక్యాలు మొదలైపోతుంటాయి. "గుర్రం నాడా దొరికింది, ఇక గుర్రం కొనడమే తరువాయి" అన్న తీరులో దీనికి "యులీసిస్" తలుపులకు తాళాలు తయారుచేసాకే ఈ నవలకు పునాదులు పడ్డాయేమో అని అనుమానం వస్తుంది. ఇక ఇంగ్లీషుతో బాటు జాయిస్ ఇటాలియన్, లాటిన్, ఫ్రెంచ్ లాంటి పలు భాషల్లో రాసిన వాక్యాలు మనల్ని పేజీకో పదిసార్లైనా గూగుల్ ని ఆశ్రయించేలా చేస్తాయి. నిజానికి "యులీసిస్" తొలి ప్రచురణలో ప్రతీ చాప్టర్ కీ ఇప్పుడున్నట్లు "ఒడిస్సీ" నవలలో ఉన్న పేర్లు లేవట. కానీ "James Joyce’s Ulysses: A Guide" లో జాయిస్ తన స్నేహితులకు ఇచ్చిన "గిల్బర్ట్ స్కీమా డయాగ్రమ్"ను కూడా జతచేశారు. వాటిల్లో ప్రతీ చాప్టర్ కూ "ఒడిస్సీ" నేపథ్యమేమిటో చెప్పే లంకెలుంటాయి.

నిజానికి ఒక పుస్తకం చదవడమంటే, చదువుతున్నంతసేపూ రచయితతో స్నేహం చేస్తూ వాళ్ళ ఆలోచనలతో సన్నిహితంగా వద్దామని ప్రయత్నించడమేనంటారు. కానీ "యులీసిస్" చదువుతున్నంతసేపూ రచయిత మనకా అవకాశం ఇచ్చినట్లు ఎక్కడా కనిపించదు. జాయిస్ వచనం ఆయన సృష్టించిన అనేక పాత్రల వెనక ఎక్కడో నక్కి పాఠకుడితో నర్మగర్భంగా దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయన తన గురించి ఎన్నో వివరాలను గుక్కతిప్పుకోకుండా చెప్పీచెప్పనట్లు చెబుతూనే, చివరి వరకూ దూరంగా, ఒక అపరిచిత వ్యక్తిగానే మిగిలిపోతారు. అయినప్పటికీ ఆయనంత ప్రామాణికమైన 'ఆటోబయోగ్రఫికల్ ప్రోజ్' మరెవ్వరూ రాయలేదంటారు. రచయిత పాఠకుడి స్థాయికి దిగే ప్రయత్నం అస్సలు చెయ్యకుండా తానున్న ప్లేన్ లోనే నిలబడి కథ చెప్పడం బోర్హెస్, క్రిఝానోవ్స్కీ, ఉంబెర్తో ఎకో వంటి చాలామంది రచయితల్లో కూడా కనబడుతుంది. జాయిస్ వచనంలో అందరికీ అర్థంకావాలనే ఉబలాటం కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయన వచనంలో అణువణువునా కనిపిస్తుంది.

ఒక రచయితకు సృజనాత్మకత, భాష మీద పట్టుతో బాటు పాండితీ ప్రకర్ష తోడైతే ఇలాంటి ఒక నవల పుడుతుంది. మొదటి నాలుగైదు చాప్టర్లలో దేశవిదేశీ కవితలూ, జానపదాలూ, చరిత్రా, పిట్టకథలూ, సాహిత్యమూ మొదలైన అనేక ఉపమానాలతో, నేపథ్యాలతో సాగే నేరేషన్ చదివి, చిక్కుముడులు విప్పుకుంటూ, ఇక ఓపిక నశించి, విరక్తి చెందిన సామాన్య పాఠకుడికి "ఇదేదో పీహెచ్డీ పట్టా పుచ్చుకోడానికి 'అకడమిక్ స్టడీస్లో' భాగంగా చదువుతున్నట్లు ఉంది గానీ నవల చదువుతున్నట్లు లేదేంటి!?" అనిపించడం ఖాయం. అప్పటికే రచయిత స్థాయికి సరితూగలేక అహం దెబ్బతిన్న పాఠకులకు "ఇదేదో తెలివితేటల ప్రదర్శనలా ఉంది, ఒక నవల రాయడానికి మరీ ఇంత పాండిత్యప్రకర్ష అవసరమా!?" అనిపించే సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ రచయిత పాఠకుడి స్థాయికి దిగే ప్రయత్నం అస్సలు చెయ్యకుండా తానున్న ప్లేన్ లోనే నిలబడి కథ చెప్పడం బోర్హెస్, క్రిఝానోవ్స్కీ , ఉంబెర్తో ఎకో వంటి చాలామంది రచయితల్లో కూడా కనబడుతుంది. "నా రచనలు అందరి కోసం కాదు, కొందరి కోసమూ కాదు" అన్న బోర్హెస్ మాటలు జాయిస్ వచనానికి కూడా సరిగ్గా సరిపోతాయనిపిస్తుంది. జాయిస్ వచనంలో అందరికీ అర్థంకావాలనే ఉబలాటం కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయన వచనంలో అణువణువునా కనిపిస్తుంది.

జాయిస్ శైలిలో మనకు నవలంతా స్థిరంగా కనిపించే ఒకే ఒక్క నియమం- "నియమాలేవీ లేకపోవడమే". మనకు అర్థంకానిదంతా పనికిరానిదంటూ పెదవి విరిచి తీసిపారెయ్యకుండా, రచయిత చెప్పేదేమిటో వినాలనుకునే పాఠకులకు "యులీసిస్" చదువుతున్నంతసేపూ ఓర్పు, సహనం కాస్త ఎక్కువ మోతాదులోనే అవసరమవుతాయి. మొదటి మూడు చాప్టర్లలో చాలా పకడ్బందీగా కనిపించే వాక్య నిర్మాణం తరువాత చాప్టర్లలో పూర్తిగా వీగిపోతుంది. ఇక్కడ నుండీ పాండిత్య ప్రకర్ష తగ్గి జాయిస్ అసలుసిసలు "Foul play" మొదలవుతుంది. ఇక్కడ నుండీ జాయిస్ వాక్యనిర్మాణపు సంప్రదాయాలకూ, నవల రాయడానికి అమలులో ఉన్న విధివిధానాలకూ పూర్తి స్థాయిలో తిలోదకాలిచ్చేస్తూ చదివేవాళ్ళకు కొత్త వెలుగులో కనిపిస్తారు. ఇక పదకొండో భాగం అయిన "సైరెన్స్"కి వచ్చేసరికి జాయిస్ స్వరంలోని "గూఫీ టోన్" పూర్తిగా అదుపు తప్పి తారాస్థాయికి చేరుకుంటుంది. “Bronze by gold heard the hoofirons, steelyrining imperthnthn thnthnthn” అనే వాక్యాలు చదివిన ఎజ్రా పౌండ్ "జాయిస్ తలకు ఏదైనా బలమైన దెబ్బ తగిలిందేమో" [“got knocked on the head.”] అని కలవరపడ్డారంటేనే మనం ఊహించుకోవచ్చు.  జాయిస్ సాధారణంగా ఆనాటి రచయితలు వాడని నాగరికతకు సుదూరమైన అసభ్యమైన భాషని పచ్చిగా, ఎటువంటి ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా ఎందుకు వాడారని ఎవరో అడిగితే "This race and this country and this life produced me — I shall express myself as I am." అని సమాధానమిచ్చారాయన. జాయిస్ తన నేరేషన్లో కొత్త కొత్త-వింత వింత పదాలను సృష్టించడమే కాకుండా ఇప్పటికే ఉన్న పదాలను కూడా కలిపి ఫ్యూషన్ చేసి పారేస్తారు.

ఉదాహరణకు ఈ క్రింది పదాలు చూడండి :

whatyoucallit / allroundman / Rutlandbaconsouthamptonshakespeare / honorificabilitudinitatibus / viceconsulate

ఈ నవల నైతిక విలువలనూ, సభ్యతనూ మాత్రమే కాదు, కాల్పనిక సాహిత్యపు సంప్రదాయాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తుంది. జాయిస్ వచనం కొన్నిచోట్ల ఐరిష్, బ్రిటిష్ రైమ్స్, దేశవిదేశీ కవిత్వం, చరిత్ర లాంటి ఉత్తమమైన సాంస్కృతిక అంశాలతోనూ, మరికొన్ని చోట్ల వాటికి పూర్తి భిన్నంగా 'gibberish' భాషలో అతి సామాన్యమైన, ఒకింత అర్థంపర్థం లేని సంభాషణలూ, పారడీలతోనూ ఎగుడుదిగుడు రోడ్ల మీద పడుతూ లేస్తూ చేసే ప్రయాణాన్ని తలపిస్తుంది. కేంబ్రిడ్జి సెంటినరీ యులీసిస్' కు సంపాదికత్వం వహించిన క్యాథెరిన్ ఫ్లిన్ తన ఉపోద్ఘాతంలో "At a larger scale, Ulysses challenges the reader through its defiance of conventional modes of narration and characterization" అంటారు. సంప్రదాయ వర్ణనలను సవాలు చేసిన రచనల్లో ఈ రచన నిస్సందేహంగా ముందు వరుసలో ఉంటుంది. ఎవరికైనా తాను పుట్టిపెరిగిన ఊరిపై ప్రేమ ఉండడంలో వింతేమీ లేదు. కానీ జాయిస్ కి తన డబ్లిన్ సంస్కృతి, అక్కడి మనుషులపై ఎంత అబ్సెసివ్ ప్రేమంటే-- ఆయన ఐరిష్ సంస్కృతినీ, స్థలాల్నీ, జీవనాన్నీ ఈ నవలలో అణువణువూ చిత్రికపట్టేంత. ఈ క్రమంలో ఆయన వివిధ శైలుల్నీ, నేపథ్యాల్నీ, ఆకారస్వరూపాల్నీ ఎంచుకున్నారు. జాయిస్ వచనానికి నియమాలేవీ లేకపోయినా "యులీసిస్" రాసే విషయంలో మాత్రం ఆయనకు చాలా స్పష్టత ఉంది. ఈ నవలను ఆయన ఎలా రాశారంటే, "భవిష్యత్తులో ఈ డబ్లిన్ నగరం, సంస్కృతి పూర్తిగా అదృశ్యమైపోయినా, నా పుస్తకం ఆధారంగా మళ్ళీ ఆ నగరాన్ని యథాతథంగా పునర్నిర్మించవచ్చు" అని తన మిత్రుడు, చిత్రకారుడూ అయిన ఫ్రాంక్ బడ్జెన్ తో అన్నారట-- "I am now writing a book,’ said Joyce, ‘based on the wanderings of Ulysses. The Odyssey, that is to say, serves me as a ground plan. Only my time is recent time and all my hero’s wanderings take no more than eighteen hours."

ఈ నవలను అసభ్యత/ అశ్లీలతల కారణంగా బ్యాన్ చేసినప్పుడు వారు చూపించిన స్పష్టమైన కారణాలేమిటో తెలీకపోయినా, ప్రతీ పాఠకుడికి కొన్ని సందర్భాలలో పుస్తకం విసిరిపారెయ్యాలన్నంత అసహ్యం కలగడం మాత్రం ఖాయం. నిజానికి "పెనెలొపె" చాప్టర్లో మోలీ బ్లూమ్ స్వగతం గానీ, "కిర్కె" చాప్టర్లో డబ్లిన్ రెడ్ లైట్ ఏరియా [నైట్ టౌన్] గురించి రాసిన విషయాలు గానీ చార్లెస్ బుకౌస్కీ లాంటి వాళ్ళు "ఫ్యాక్టోటం" నవలలో రాసిన విషయాలకంటే అసభ్యంగా అయితే అనిపించవు. కానీ "యులీసిస్" నవల అంతటిలో "నాసికా" అనే చాప్టర్ అసభ్యతకు పర్యాయపదంలా ఉంటుంది. ఇందులో లియోపోల్డ్ బ్లూమ్ 'శాండీ మౌంట్ స్ట్రాండ్ బీచ్' దగ్గర గెర్టీ మాక్ డోవల్ అనే స్త్రీని దూరం నుంచి చూస్తూ సెక్సువల్ ప్లెజర్ పొందడమనే అంశాన్ని జాయిస్ రాసిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. అలాంటి కొన్ని సన్నివేశాలు చదువుతున్నప్పుడు, "అసలు "యులీసిస్" రాయడం ద్వారా జాయిస్ ఏం చెప్పాలనుకున్నారు?" అనే ప్రశ్న వేసుకొని పాఠకుడుండడు. జాయిస్ తన నలభయ్యేళ్ళ జీవితంలో చూసిన మనుషుల యొక్క స్వచ్ఛమైన భాష, వ్యక్తిత్వ లోపాలూ, బలహీనతలూ, పద్ధతిలేని అస్తవ్యస్తమైన జీవన విధానం- వీటన్నిటితో కలిపి ఐరిష్ సంస్కృతి గురించి ఎటువంటి ముసుగులూ లేకుండా ఈ నవలలో రాశారు. కానీ సాధారణంగా ఆనాటి రచయితలు వాడని నాగరికతకు సుదూరమైన అసభ్యమైన భాషని పచ్చిగా, ఎటువంటి ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా ఎందుకు వాడారని ఎవరో అడిగితే "This race and this country and this life produced me — I shall express myself as I am." అని సమాధానమిచ్చారాయన. సమాజంలో భాష విషయంలో కంటికి కనిపించని అనేక నియమాలు అమలులో ఉన్నాయి. ఈ నియమాలను అతిక్రమించడానికి ఆర్టిస్టులు కూడా ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అటువంటిది తన ప్రపంచాన్ని ఎటువంటి కృత్రిమత్వపు తొడుగులూ లేకుండా ఉన్నదున్నట్లుగా సమస్త మానసిక అవకరాలతో సహా ఒక పుస్తకంగా రాయడం  ఆ కాలంలో నిజంగా సాహసమే. అప్పటికీ ఇప్పటికీ తన ప్రపంచాన్ని అంత స్వచ్ఛంగా చిత్రిక పట్టిన రచయిత మరొకరు లేరు. నైతికత, మతం, వ్యవస్థీకరణ, సాహితీ శైలులు- వీటి పట్ల ఎటువంటి గౌరవమూ లేని జాయిస్  లాంటి రచయితని నియంతృత్వపు నీడల్లో ఒక మానసిక రోగిగా జమ కట్టి పిచ్చాసుపత్రిలో చేరుస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 'యులీసిస్' మొదటిసారి ప్రచురించినప్పుడు విమర్శకులు జోసెఫ్ కాలిన్స్ రాసిన ఒక వ్యాసంలో, “He is the only individual that the writer has encountered outside of a madhouse who has let flow from his pen random and purposeful thoughts just as they are produced.” అని రాసిన వాక్యాలు రచయితగా జాయిస్ వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాయి. 

పుస్తకాలు చదవడమే అపురూపమైపోయిన ఈకాలంలో ఇంత శ్రమకోర్చి "యులీసిస్" ఎందుకు చదవాలీ అనిపించడం సహజం. ఐదువందల పేజీల పుస్తకాన్ని అరగంటలో కుదించే వెబ్ సిరీస్లు, అంతకంతకూ క్షీణించిపోతున్న మన అటెన్షన్ స్పాన్ ని సూచించే అర నిముషం వీడియోలు- ఇవన్నీ కలగలసిన "ఇన్స్టంట్" సంస్కృతిలో జాయిస్ నవలను చదవడం రాటుదేలిపోయిన మెదడును రీ వైర్ చెయ్యడంలాంటిది. మొండి పశువు కొమ్ములు బలవంతంగా వంచడంలాంటిది. సృజనాత్మకతకు అరుదైన పాండిత్యం తోడొస్తే రాసిన రాతలు ఎలా ఉంటాయో తెలియాలంటే "యులీసిస్" చదవాల్సిందే. "చదవడంలో ఆనందం" చదువు మొదలుపెట్టిన తొలినాళ్ళలో అనుభవమైనంతగా వయసు పెరిగాక అనుభవంలోకి రాదు. ఒకప్పుడు ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా ఓపెన్ మైండ్ తో పుస్తకాలు  చదువుతాం. మెల్లగా మెదడు మీద జ్ఞానభారం పెరిగిపోతుంది. దానికి తోడు ఇంటెలెక్చువల్ సినిసిజం, హేతువాదంలాంటివి మెదడులో ఓ పట్టాన కొత్త అనుభవాలకు చోటు మిగల్చవు. సరిగ్గా అలాంటి సమయంలోనే నేర్చుకున్నదంతా వదిలించుకుని మళ్ళీ పూర్వపు విద్యార్థిగా మారే అవకాశం ఇస్తుంది జాయిస్ "యులీసిస్". ముఖ్యంగా జాయిస్ వాడిన ఐరిష్ యాసలో మాట్లాడే పక్కా లోకల్ భాష మనకి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉందనే నమ్మకాన్ని తునాతునకలు చేసిపారేస్తుంది. మార్కస్ జూసాక్ నవల "బుక్ థీఫ్"లో లీసెల్ మెమింగర్ చిన్నప్పుడు చదవడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్కో అక్షరాన్నీ కూడబలుక్కుంటూ పదాలను పేర్చుకోవడం గురించి రాస్తారు. అదే విధంగా జేమ్స్ జాయిస్ "యులీసిస్" మనలో బాల్యంలో ఎక్కడో కోల్పోయిన తొలి పాఠకుడిని మరోసారి వెలికితీస్తుంది.

[ఈ వ్యాసాన్ని కుదించి ఆంధ్రజ్యోతి 'వివిధ'లో ప్రచురించారు]

-------------------------------------------------------------------------------------------

రాండమ్ గా 'యులీసిస్' చదువుతున్నపుడు రాసుకున్న కొన్ని అనుభవాలూ, కబుర్లూ [వరుస క్రమం లేదు] :

ఒకానొక సందర్భంలో మాటల మధ్యలో మిత్రులొకరు ఒక అత్యంత సంక్లిష్టమైన పరీక్షలో నెగ్గుకురావాలంటే రెండే రెండు మార్గాలు అని అన్నారు. "ఏమిటవి?" అని కుతూహలంగా అడిగితే, 1. నువ్వు జీనియస్ వి అయినా అయ్యుండాలి 2. ఆ పరీక్షలో గెలిచి తీరాలనే పట్టుదలో, పిచ్చో, వెర్రో నీలో ఉండుండాలి. మధ్యే మార్గం లేదని తేల్చేశారు. సాధారణ పాఠకురాలినైన నా వరకూ "యులీసిస్" చదవడం అటువంటి ఒక క్లిష్టమైన పరీక్ష పాసవ్వడంతో సమానం. ఇక్కడ నా మార్గం రెండోదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. హిందీలో 'सिर पर भूत सवार होना' అంటారు, అలా అన్నమాట. చదివి తీరాలన్న ధృడ సంకల్పం లేకపోతే అస్సలు చెయ్యలేని పని-- "యులీసిస్" చదవడం. ఎన్నిసార్లు నిరుత్సాహం కమ్ముకుంటుందో ! ఎన్నిసార్లు "ఇంత కష్టం అవసరమా!" అనిపిస్తుందో ! ఎన్నిసార్లు సహనం పరీక్షిస్తుందో ! అయినా ఈ రాతల్లో పదాల మీద ప్రేమ, అక్షరాలమీద అపేక్ష ఉన్నవాళ్ళని ఆకర్షించే మాయేదో మనల్ని వదిలిపెట్టనివ్వదు.

కేంబ్రిడ్జి సెంటినరీ యులీసిస్' కు సంపాదకత్వం వహించిన క్యాథెరిన్ ఫ్లిన్ తన ఉపోద్ఘాతంలో "At a larger scale, Ulysses challenges the reader through its defiance of conventional modes of narration and characterization" అంటారు. సంప్రదాయ వర్ణనలను సవాలు చేసిన రచనల్లో ఈ రచన నిస్సందేహంగా ముందు వరుసలో ఉంటుంది.

------------------------------------------------------------------------------------------

న్యూయార్క్ టైమ్స్లో ఎమిలీ విల్సన్ "ఒడిస్సీ" అనువాదం గురించిన వ్యాసం చదివినప్పుడు ఇప్పట్లో చదివే ఉద్దేశ్యం అస్సలు లేని "యులీసిస్"ని చదవాలనే ఆసక్తి కలిగింది. పట్టుమని పాతిక పేజీలు చదివానో లేదో నీరసం ఆవహించింది. సరే ఎటూ మొదలుపెట్టాక ఆపకూడదనే పంతంతో మరికొన్ని పేజీలు చదివాను. ఓ యాభై పేజీలయ్యేసరికి "లాభం లేదు, ఇది మన వల్ల అయ్యే పని కాదు!" అని అర్థమైపోయింది. రోజూ ఉదయం నిద్ర లేవడానికి ఏదో ఒక మోటివేషన్ అవసరమైనట్లు ఈ పుస్తకం ముందుకు నడవాలంటే ఇప్పుడు ఏదో ఒక మోటివేషన్ కావాలి. నాలాంటివాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతికాను. మనకి ప్రక్కింట్లో కూడా కరెంటు పోతే దొరికే తృప్తే వేరు. :) సగటు భారతీయులం. :) Yes, I'm not alone. చాలామంది పాఠకులు "యులీసిస్" కొన్ని పేజీలు చదివి, ఇక వల్ల కాక అసంపూర్తిగా వదిలేసినవాళ్ళే. న్యూయార్క్ టైమ్స్ లో "యులీసిస్" రివ్యూలు రాసిన పలువురు ప్రముఖ రచయితలూ, విమర్శకులూ సైతం పుస్తకం పూర్తిచెయ్యలేకపోయామని అన్నారట. ఇకనేం, మనకి కావాల్సినంత మోటివేషన్ వచ్చేసింది. జాయిస్ పాఠకులందరికీ "మీ వల్ల అయ్యేపని కాదంటూ" ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ముందు "ఆయనకంత సీన్ ఉందో లేదో" తెలియాలన్నా పుస్తకం పూర్తిగా చదవాలి కదా! అలా యులీసిస్ తో ప్రయాణం మొదలైంది.

------------------------------------------------------------------------------------------

వంద పేజీలు పూర్తయ్యాయి. 'హేడ్స్' చాప్టర్ చదువుతున్నాను. ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత కుదరలేదు. విసుగేసి పుస్తకం ప్రక్కన పడేసాను. ఇంత కష్టపడి చదవడం వల్ల ప్రయోజనం ఏమిటనిపించింది. ఒక మూడు రోజులు పుస్తకం ఒక్క పేజీ కూడా చదవలేదు. ఈ విరామ సమయంలో 'Miss Austen Regrets', 'The French Lieutenant's Woman', 'Up in the Air' లాంటి కొన్ని సినిమాలు చూసాను.

మళ్ళీ నాలుగోరోజు పోయిన ఉత్సాహం తిరిగొచ్చింది. పుస్తకం చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టాను. రోజువారీ నడకలో కబుర్ల మధ్యలో, "నువ్వు చెప్పినదాన్ని బట్టి ఒక రోజులో 18 గంటల సమయంలో డబ్లిన్ వీధుల్లో తిరిగే మనిషి గురించి రాయడంలో ప్రత్యేకత నాకైతే ఏమీ కనిపించడం లేదు. అలా కంటికి కనిపించే అన్ని వివరాలూ, సంగతులూ చెబుతూ ఎవరైనా నవల రాయగలరు కదా! మరి జాయిస్ యులీసిస్ నవల ప్రత్యేకత ఏమిటి?" అని అడిగారు నరేన్.

జాయిస్ తన నవలలో ఏం చెప్పారన్నదానికంటే ఎలా చెప్పారన్నదానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఉదాహరణకు ఒక వాక్యాన్ని ఎటువంటి చిక్కుముడులూ లేకుండా సరళంగా చెప్పొచ్చు. అదే వాక్యాన్ని అనేక మెటఫోర్ల పదబంధనలతో కుదిస్తూ పాఠకులకు అడుగడుగునా పరీక్ష పెడుతూ  సంక్లిష్టంగా కూడా చెప్పొచ్చు. జాయిస్ శైలి రెండోది. ఒక అతి సాధారణమైన కథను పట్టుకుని దాన్ని ఎంత అసాధారణంగా నేరేట్ చేయవచ్చో చెప్పడానికి "యులీసిస్"ని మించిన నవల లేదు. అటువంటి నవల ఇంతవరకూ ఎవరూ రాయలేదు. గూగుల్, AI ల సహాయం లేకుండా ఒక మనిషి ఇటువంటి నవల ఇకముందు కూడా రాసే అవకాశం కూడా లేదు.

-------------------------------------------------------------------------------------------

బోర్హెస్ కీ జాయిస్ కీ కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి. సంక్లిష్టమైనవాటికి "మాత్ టు ది ఫ్లేమ్" లా దగ్గరయ్యే నా కుతూహలాన్ని ప్రక్కన పెడితే, జాయిస్ నాకు ఎందుకు నచ్చారా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కారణం ఇది: ఆయన తనను తన పాఠకులు అర్థం చేసుకోవాలని అస్సలు ప్రయత్నించరు. తాను అందరికీ అర్థంకావాలనే ఉబలాటం ఆయనలో కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకో" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయనలో అణువణువునా కనిపిస్తుంది. తన రాతలకు సంజాయిషీలు, వివరణలూ ఇచ్చే రచయిత ఆయన కాదు. "నన్ను తెలుసుకోవాలంటే నీకు కూడా కొన్ని అర్హతలుండాలి. నాతో తగినంత సమయం వెచ్చించాలి. భాష, చరిత్ర, సాహిత్యం ఇలా పలు రంగాల్లో నీకు కాస్తో కూస్తో పరిచయం ఉండుండాలి. అప్పుడు కూడా పూర్తిగా అర్థమవుతానని ఖాయంగా చెప్పలేను. నా ప్రపంచాన్ని తెలుసుకోవాలనే కోరిక నీలో ఎంత బలంగా ఉంటే  నేను నీకంత త్వరగా అర్థమవుతాను."

------------------------------------------------------------------------------------------------

'ఒడిస్సీ' ఒక్కటీ చదివితే 'యులీసిస్' చదవడం సులభం అవుతుంది అని అనుకున్నాను. ఆన్లైన్ లో చాలా మంది అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఒడిస్సీ' ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ పుస్తకం మొదలుపెట్టాక దాని రోల్ కూడా లిమిటెడ్ అని అర్థం అయ్యింది. జాయిస్ నవలకు అదొక సాలిడ్ ఫ్రేమ్  వర్క్ మాత్రమే. మొదటి చాప్టర్ పూర్తి చేసాకా ప్రాక్టికల్ గా కాస్త క్లారిటీ వచ్చింది. గాబ్లర్ ఎడిషన్ తో బాటు సమాంతరంగా ఈ రెండు పుస్తకాలు కూడా కావాలి. ఒకవేళ Gabler ఎడిషన్ కొనకపోతే డైరెక్ట్గా ఈ రెండో పుస్తకం [కేంబ్రిడ్జి ఎడిషన్ ] కి వెళ్ళడం శ్రేయస్కరం. మొదటిది యులీసిస్ కి 'కీ' / డిక్షనరీ లాంటిది. చదువుతున్నపుడు అది ప్రక్కన ఉండాల్సిందే. రెండోది ఒక్కో ఎపిసోడ్ కీ ముందు మోడరన్ ఇంగ్లీష్ ఎనాలిసిస్ తో కూడిన పూర్తి వెర్షన్. ఈ మూడు పుస్తకాలూ సమాంతరంగా చదవందే యులీసిస్ ఏరు దాటడం ప్రాక్టికల్ గా అసాధ్యం.

* Ulysses Annotated: Revised and Expanded Edition - Don Gifford

* The Cambridge Centenary Ulysses: The 1922 Text with Essays and Notes - James Joyce (Author), Catherine Flynn

------------------------------------------------------------------------------------------

నాకు ఏ పుస్తకం చదివినా ఆ "మిస్టరీ / సర్ప్రైజ్ ఎలిమెంట్" పోకూడదని సహజంగా ముందుమాట కూడా చదవకుండా సరాసరి కథలోకి వెళ్ళిపోవడం అలవాటు. మునుపు చాలా వ్యాసాల్లో ఈ విషయాన్ని చెప్పినట్లున్నాను. కానీ ఈ పుస్తకం విషయంలో అది కుదరదు. అయినా ఇన్నేళ్ళ అలవాటు ఎందుకు మానెయ్యాలని మొండిగా ఓ 100-150 పేజీలు కష్టపడి లాక్కొచ్చాకా గానీ "ఈ నవల విషయంలో అలా కుదరదన్న సంగతి" అర్థం కాలేదు. ఈ జ్ఞానం ఐదారు చాప్టర్ల తర్వాత గానీ కలగలేదు. ఏదేమైనా స్వానుభవంతో నేర్చుకునే పాఠాలు గొప్పవి. :)

---------------------------------------------------------------------------------------

నేను ఇన్నేళ్ళలో చదివిన పుస్తకాల్లో ఒక్కటి కూడా ఇలా చదివింది లేదు. 'యులీసిస్' చదవడంలో అన్నిటికంటే నాకు విసుగేసిన విషయం- అస్సలు నేపథ్యం ఏమీ లేకుండా, పాఠకులకు సందర్భం ఏమిటో కనీస అవగాహన లేకుండానే వాక్యాలు మొదలైపోతాయి. "గుర్రం నాడా దొరికింది, ఇక గుర్రం కొనడమే తరువాయి" అన్న తీరులో దీనికి "యులీసిస్" తలుపులకు తాళాలు తయారుచేసాకే "యులీసిస్"కి పునాదులు పడ్డాయేమో అని అనుమానం.

----------------------------------------------------------------------------------------

కొన్నిసార్లు పుస్తకం విసిరిపారెయ్యాలన్నంత చిరాకు కలిగిన సందర్భాల్లో,  అవకాశం దొరికింది కదాని ఇంట్లో వాళ్ళు కూడా "ఇంత శ్రద్ధగా ఏ భగవద్గీతో చదివితే బావుణ్ణు" అని చురకలు అంటించారు. నిజానికి "పెనెలొపె" చాప్టర్లో మోలీ బ్లూమ్ స్వగతం గానీ, "కిర్కె" చాప్టర్లో డబ్లిన్ రెడ్ లైట్ ఏరియా గురించి రాసిన విషయాలు గానీ నన్నంత ఆశ్చర్య పరచలేదు. బహుశా ఇంతకంటే అభ్యంతరకరమైన భాషను వాడే 'బుకౌస్కీ' నవల "ఫ్యాక్టోటం" పదేళ్ళ క్రితం ఎప్పుడో చదివి వాంతులు చేసుకున్నంత పనిచేసిన అనుభవం ఉండడం వల్ల కావచ్చు. "యులీసిస్" మొత్తం మీద నాకు చాలా అసభ్యంగా అనిపించిన చాప్టర్ "నాసికా". "పాఠకుడికి అసలేం చెప్పాలనుకుంటున్నారు మాష్టారూ?" అని నిలదీసి అడగలనిపించేంత చిరాకేసింది.

----------------------------------------------------------------------------------------

అసలొక్కసారి ఆలోచించండి, మనకు మనసులో పుట్టే ఆలోచనల్ని, భావావేశాలనీ, కోరికలనూ ఉన్నదున్నట్లుగా నిజంగా, నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడితే మనల్ని ఈ సభ్య సమాజం మనల్ని భరించగలుగుతుందా? నిస్సందేహంగా భరించలేదు సరికదా, మనల్ని అసహ్యించుకుని పిచ్చివాళ్ళని ముద్ర వేస్తుంది. అనాగరికులని వెలివేసి సంఘ బహిష్కరణ చేస్తుంది. సమాజంలో భాష విషయంలో కంటికి కనిపించని నియమాలు  అనేకం అమలులో ఉన్నాయి. ఈ నియమాలను అతిక్రమించడానికి ఆర్టిస్టులు కూడా ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అటువంటిది తన ప్రపంచాన్ని  ఎటువంటి కృత్రిమత్వపు ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా వేష భాషలు, మానసిక అవకరాలూ, వ్యవహార శైలులతో సహా ఒక పుస్తకంగా రాయడం ఎంత సాహసమో కదా! ఐరిష్ ఆత్మను అంత స్వచ్ఛంగా చిత్రిక పట్టిన రచయిత మరొకరు లేరు. అది కూడా 1920ల కాలంలో!

------------------------------------------------------------------------------------

"యులీసిస్" మొదటిసారి ప్రచురించినప్పుడు విమర్శకులు జోసెఫ్ కాలిన్స్  రాసిన ఒక వ్యాసంలో రచయితగా జాయిస్ వ్యక్తిత్వాన్ని మనకు చూపించే కొన్ని అంశాలు : 

Mr. Joyce has no reverence for organized religion, for conventional morality, for literary style or form. He has no conception of the word obedience, and he bends the knee neither to God nor man. It is very interesting, and most important to have the revelations of such a personality, to have them firsthand and not dressed up. Heretofore our only avenues of information of such personalities led through the asylums for the insane, for it was there that such revelations as those of Mr. Joyce were made without reserve. Lest anyone should construe this statement to be a subterfuge on my part to impugn the sanity of Mr. Joyce, let me say at once that he is one of the sanest geniuses that I have ever known.

“Mr. Joyce is an alert, keen-witted, brilliant man who has made it a lifelong habit to jot down every thought that he has had, whether he is depressed or exalted, despairing or hopeful, hungry or satiated, and likewise to put down what he has seen or heard others do or say. It is not unlikely that every thought that Mr. Joyce has had, every experience he has ever encountered, every person he has ever met, one might almost say everything he has ever read in sacred or profane literature, is to be encountered in the obscurities and in the frankness of ‘Ulysses.’”

No comments:

Post a Comment