ఇప్పటివరకూ నేను చదివిన కొందరు స్త్రీవాద రచయిత్రులలో కనుబొమ్మలెగరెయ్యకుండా నా చేత స్త్రీ వాదాన్ని చదివించగల శక్తి ఒక్క మార్గరెట్ ఆట్వుడ్ కు మాత్రమే ఉందనుకునేదాన్ని. కానీ అటువంటి మరో రచయిత్రి పరిచయమైనందుకు సంతోషం అనిపించింది. తమిళ రచయిత్రి సి.ఎస్ లక్ష్మి aka అంబై కూడా ఆ కోవకే వస్తారు. మనుషులందరూ సమానమని అంటూనే స్త్రీవాదం విషయానికొచ్చేసరికి మాత్రం మగవాళ్ళని మరో జాతిలోకి నెట్టేసి, వాళ్ళని శత్రువుల్లా చిత్రిస్తూ, ఏకపక్షంగా విపరీతమైన ద్వేషంతో కూడిన నిందారోపణలు చేసే రచనలు చదివినప్పుడు చాలా విసుగొచ్చేది. బహుశా ఈ విముఖత కారణంగానే నేను స్త్రీవాద రచనల జోలికి వెళ్ళడం మానేశాను. ఒకనాటి పితృస్వామ్యపు కాలంలో పురుషజాతిని ఎలివేట్ చేస్తూ తమ రచనల్లో మగవాడి వైపు నించి మాత్రమే కథను చెప్పుకొచ్చేవారు. అదే విధంగా నేడు అధిక శాతం స్త్రీవాద రచనలు చూస్తే అందులో కేవలం స్త్రీవైపు నుండే కథను చెబుతున్నారు. నాణానికి రెండు వైపులూ చర్చించడం విషయం అటుంచితే అప్పుడూ ఇప్పుడూ 'బిగ్ పిక్చర్' చూడడంలో రెండు వర్గాలూ విఫలమయ్యాయి అనిపిస్తుంది. అంబై రచనలు ఇలాంటి కాలంచెల్లిన వాదాలకు స్వస్తి చెబుతూ వివక్ష మూలలను వెదికే ప్రయత్నం చేస్తాయి. స్త్రీల పట్ల వివక్షకు ముఖ్యంగా తల్లితండ్రులనూ, సమాజాన్నీ ,యావత్ వ్యవస్థనూ దోషిగా పరిగణిస్తారు అంబై. స్త్రీ,పురుషుల్లో ఈ అసమానతల భావజాలానికి పునాదులు ప్రాథమికంగా కుటుంబంనుండే పడతాయని నమ్ముతారావిడ. 'ఎ కిచెన్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది హౌస్' లో అంబై రాసిన 25 కథలున్నాయి. వీటిని లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ ఆంగ్లంలోకి అనువదించారు.
Image Courtesy Google |
ఈ కథల్లో నేను చదివిన 'In a forest, a deer : Stories' లో ఉన్న Parasakti and Others in a Plastic Box, మూడు 'జర్నీ' కథలతో పాటు మరికొన్ని చదివిన కథలే పునరావృతమయ్యాయి. అంబై కథలను గురించి మునుపటి వ్యాసంలో వివరంగా ప్రస్తావించి ఉన్నాను కాబట్టి ఆమె కథల శైలిని గురించీ, ఒక్కో కథ గురించీ నేను మళ్ళీ ప్రస్తావించబోవడంలేదు. ఇందులో బాగా నచ్చిన 'వన్స్ అగైన్' అనే కథ గురించి మాత్రం చెప్పుకుందాం. తల్లితండ్రులు పిల్లల మనసుల్లో చిన్నతనంనుండీ లింగవివక్షకు బీజాలెలా నాటతారో చెప్పడానికి 'వన్స్ అగైన్' అనే కథ మంచి ఉదాహరణ. ఆర్భాటాలులేని సరళమైన కథనం ఈ కథ ప్రత్యేకత. కథ అతి మామూలు మాటల్లో, కాన్వాస్ మీద అలవోకగా బ్రష్ తో రెండు మూడు చిన్న చిన్న లైన్స్ గీసినట్లు ఈ విధంగా మొదలవుతుంది.
మరొక్కసారి
ఆ ఇద్దరి సృష్టి జరిగింది.
లోకిదాస్.
శబరి.
"లోకూ నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు ?
"నాకు నచ్చినన్ని లోలి పప్స్ తిందామనుకుంటున్నాను. "
"వెధవా,అంకుల్ కీ అంటీకీ సరిగ్గా చెప్పు. "
"నాకో కుక్కపిల్ల కొనుక్కుంటాను."
"ఈరోజు వీడు మంచి మూడ్ లో లేడండీ. సరిగ్గా చెప్పు నువ్వు ఏం ఉద్యోగం చేద్దామనుకుంటున్నావు ? "
"నేను ఇంజనీర్ అవుదామనుకుంటున్నాను."
"కరెక్ట్. చూశారా ఎలా చెప్పాడో. సహజంగా వెంటనే చెబుతాడు. ఈరోజు కాస్త మొండికేశాడు."
"ఇప్పుడు షోలే లో డైలోగ్స్ చెప్పు. "
"నేను చెప్పను. "
"నేను బయటకెళ్ళి ఆడుకోవాలి. ముందుచెప్పు,తరువాత ఆడుకోవచ్చు.చెప్పకపోతే నీకు నీ బాల్ ఇవ్వను. "
"అరే ఓ సాంబా"
"వెరీ గుడ్."
------
"శబరి కుట్టీ నువ్వు పెద్దయ్యాక ఎవర్ని పెళ్ళి చేసుకుంటావు ?"
"మా క్లాస్ లో అబ్దుల్లాని"
"ఆ పిల్లవాడు ముస్లిం కదా,నువ్వు అతణ్ణి చేసుకోకూడదు.తప్పు. "
"నువ్వు పెద్దదానివయ్యావు. ఆ మురళితో ఆటలేమిటి ? గాలిపటాలెగరెయ్యడం ఏంటి ? వెళ్ళి ఏ పుస్తకమో చదువుకోవచ్చుగా."
"వుమన్ సెక్రటరీ ని అప్పోయింట్ చేద్దాం,ఆమె పని చెయ్యడం సంగతటుంచితే ఆఫీసు కళగా ఉంటుంది. "
----
లోకిదాస్,శబరి అనే రెండు స్త్రీ పురుష పాత్రల్ని సమాంతరంగా చిన్నప్పటినుంచీ వర్ణిస్తారు. ఈ కథ సోషల్ కండిషనింగ్ ఎలా జరుగుతుందో చూపిస్తూ ఆడమ్-ఈవ్ కథను రీటెల్లింగ్ చేసినట్లు ఉంటుంది.సమాజంలో లింగ వివక్ష,కులమత వివక్షలకు బీజాలు ఎక్కడ పడతాయో ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అంబై.
"నువ్వు పెద్దయ్యాక ఇంజినీర్ అవ్వాలి సరేనా ? మగవాడన్నాక సంపాదించాలి,సంపాదనలేని వాడు మగాడే కాదు. బాగా సంపాదిస్తేనే అమ్మాయిలు నీ వెంట పడతారు. ఆడపిల్లలా అలా ఏడుస్తావేమిరా ? ఎకనామిక్స్ చదివి ఏమి చేస్తావు ? లెక్కలు తీసుకో. రేపు పెళ్ళైతే నీకు వండి పెట్టడానికి ఒకరు ఉంటారు. నువ్వు ఆ క్రిస్టియన్ కుర్రాడితో చర్చి కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.
"You are the one who earns money
You go out to work
You are the one who has many rights
You are the one who casts the vote
You are the one who mustn’t cry
You are strong
You make decisions
You can change the world
You have firmness of mind
You enjoy women
You are forceful in bed
You want to impress your boss
You are a man."
అలా అబ్బాయిలతో మాట్లాడకు.అలా అటూ ఇటూ పరిగెత్తకు,ఆడపిల్లన్నాక అణకువ అవసరం. ఇంజనీరింగ్ ఆ ? చదివి ఏమి చేస్తావ్ ? వంట నేర్చుకో. లేకపోతే అత్తారింట్లో చెప్పు దెబ్బలు తినాలి. సెక్స్ గురించి మాట్లాడుతున్నావేమిటి నీ స్నేహితురాళ్ళతో ? తప్పు. ఆ కుర్రాడు ముస్లిం కదా,స్నేహం చెయ్యకు. చీర కట్టుకోవడం నేర్చుకో. ఆడపిల్లకు సహనం ఉండాలి.
"You look after the house
You know that beauty products are for your use
You are modest
You listen to decisions
You are a goddess
You are always helpful
You work outside the house only when in dire need
You need protection
You are a woman."
లింగ వివక్ష అనేది మొత్తం వ్యవస్థకు సంబంధించిన విషయం. సమాజంలో స్త్రీ పురుషుల పాత్రలు వాళ్ళు పుట్టకమునుపే సమాజం నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులు ఆ సాంఘిక నియమాలను గుడ్డిగా అమలు చేస్తారు. నిజానికి నియమాలను ధిక్కరిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా హర్షించదు. సమాజంలో 'ఆదర్శమైన వ్యక్తి' చెయ్యాల్సిన పని నియమాలను పాటించడం, పెద్దలను అనుసరించడం మాత్రమే. ఆదర్శ సంఘ జీవిగా సమాజంలో ఇమడడానికి మనిషి చెల్లిస్తున్న మూల్యం ఏమిటి అని మరో సారి ప్రశ్నించుకోమంటుందీ కథ.
Wow.ఇప్పుడిప్పుడే ఈ conditioning మార్పు గురించి చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్టున్నారు. మా తరం నించీ మధ్యతరగతి ఆడ పిల్లలు బాగా చదవాలి అని, ఉద్యోగం చెయ్యాలని, ఆర్ధిక భద్రత కలిగి ఉండాలని బాగా పుష్ దొరికేది. ఇప్పుడు స్త్రీ ఉద్యోగి అయాక పిల్లలని "బాగా" చూసుకోవడానికి, పెంచడానికి "తల్లి"పాత్ర విషయం లో conflict చూస్తున్నాము. ఈ పిల్లల పెంపకం, వారి వ్యక్తిత్వ వికాసంలో తండ్రి పాత్ర్ గురించి మాత్రం పెద్ద discussion జరగట్లేదు. ఇదీ మెల్లగ మారాలి. కిన్ని సింపుల్ పదాలు, లిటరేచర్, మనకి చాలా చెప్తాయి. థాంక్యూ. చాలా మంచి రచయిత్రి ని పరిచయం చేస్తున్నారు.
ReplyDeleteఈ కథలన్నీ మీరన్న ఆ టిపికల్ ట్రాన్సిషన్ పీరియడ్ లో రాసినవేనండీ.అందుకే అందరం బాగా కనెక్ట్ అవుతాము.కథలన్నీ వాస్తవ జీవితానికి దగ్గరగా ఒకప్పటి తరం వాల్యూ చేసే సెంటిమెంట్స్ తో మనసుకి హత్తుకునేలా ఉంటాయి. థాంక్ యూ సుజాత గారూ ❤️🙂
Delete