Showing posts with label Random readings. Show all posts
Showing posts with label Random readings. Show all posts

Tuesday, March 28, 2023

The Art of Seduction - Robert Greene

అబిడ్స్ మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే రచనల్లో రాబర్ట్ గ్రీన్  పుస్తకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా "48 లాస్ ఆఫ్ పవర్" బావుందని కొందరు మిత్రులతో సహా మా పిల్లవాడు కూడా చెప్పడంతో (పిల్లల బుక్ క్లబ్ లో భాగంగా స్నేహితులు అందరూ చదివారని అన్నాడు), సరదాగా గ్రీన్ పాపులారిటీ ఏమిటో చూద్దామని ఈ పుస్తకం చదివాను. కరెంట్ ట్రెండ్స్ విషయంలో నా అజ్ఞానాన్ని నాకు మరోసారి గుర్తుచేసిందీ పుస్తకం. :)  

"నాలెడ్జ్ ఈజ్ పవర్" అంటారు. కానీ ఒక సూపర్ హీరో సినిమాలో అన్నట్లు "విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ". జ్ఞానాన్ని సంపాదించడంలో ఉండే జిజ్ఞాస మంచిదే గానీ దాన్ని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే లేదా వినియోగించే విధానంలో జాగ్రత్త, జాగరూకత లాంటివి అవసరమవుతాయి. కొన్నిసార్లు ఆ జ్ఞానాన్ని వినియోగించవచ్చా లేదా అనే విచక్షణకు ఖచ్చితమైన ఒక 'మోరల్ కంపాస్' మరింత అవసరమవుతుంది.

Image Courtesy Google

పుస్తకాల విషయంలో మంచి పుస్తకాలూ, చెడ్డ పుస్తకాలూ లాంటివేవీ ఉండవంటారు వైల్డ్, ఏ పుస్తకమైనా బాగా రాసినదైనా అయి ఉండాలి,లేదా చెత్తగా రాసినదైనా అయి ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. మానవ సమాజంలో పరమ అనైతికమైన (?) విషయాలుగా భావించే అంశాలను సైతం అద్భుతమైన భాషా సౌందర్యాన్ని ఉపయోగించి వినసొంపుగా చెప్పి ఒప్పించగలిగే నేర్పు కొందరు రచయితలకు ఉంటుంది. నేను చదివిన కొన్నిట్లో నబకోవ్ 'లోలిటా', ఆండ్రే గిడే 'ఇమ్మోరలిస్ట్', హెర్మన్ హెస్సే 'స్టెప్పెన్ వుల్ఫ్' లాంటివి ఈ కోవలోకి వస్తాయనుకుంటాను. ఏ పుస్తకమైనా నైతికానైతికమైన అనేక విషయాలను చెబుతుంది. అది ఏం చెబుతుంది అనేది ప్రక్కన పెడితే అందులోంచి ఏం తీసుకోవాలనేది పూర్తిగా పాఠకుల మానసిక పరిపక్వతా, విచక్షణల మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ తెలిసి ఉండడం ఎంత అవసరమో, దాన్ని అన్ని మానవసంబంధాల్లోనూ అమలుచెయ్యాలనుకోవడం అంతే అసంబద్ధం. ప్రతీ  మనిషీ ప్రత్యేకం, అన్నిటికీ ఒకే మూసలో పనిచేసే మంత్రం ఉపయోగించడం చాలా బ్యాడ్ ఐడియా.  

ఆ మధ్య చూసిన ఏదో తెలుగు సినిమాలో పెళ్ళిలో 'రొమాన్స్' అవసరం అని ఒక ముక్తాయింపునిచ్చారు. కానీ ఆ 'రొమాన్స్' అనే బ్రహ్మ పదార్థం ఏమిటనేది చాలామందికి తెలీదు. (పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకున్న ఓల్డ్ స్కూల్ పీసెస్ అయిన మాతో సహా :) ) రాబర్ట్ గ్రీన్ రాసిన నాన్ ఫిక్షన్ రచన 'ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్' లాంటి పుస్తకాలు ఆ సో కాల్డ్ 'రొమాన్స్' అంటే ఏమిటో కొంత వరకూ చెబుతాయి అనుకుంటాను. దాదాపు 500 పేజీల ఈ పుస్తకం ఇప్పటి  "కంట్రోల్" ప్రాతిపదికగా నడిచే మానవ సంబంధాలకు అద్దం పడుతుంది. అడ్రినలిన్ రష్, excitement ఇచ్చేది మాత్రమే ప్రేమని అనుకునే నేటి తరానికి గ్రీన్ చెప్పే చిట్కాలు సరిగ్గా సరిపోతాయి.

ఇవన్నీ తెలిసి ఉండడం మానసిక పరిపక్వతకు అవసరమే కానీ మానవ సంబంధాల్లో ఈ చాణక్య సూత్రాల ఎత్తుకు పై ఎత్తుల కంటే 'ప్యూరిటీ ఆఫ్ కన్సైన్స్' అత్యంత అవసరమని నమ్మే పాత తరం వ్యక్తులుగా చెప్పేదేమంటే ఈ పుస్తకాన్ని చదవండి కానీ ఇందులో ఉన్నవేవీ పాటించకండి. ఒక మనిషితో వ్యవహరించేటప్పుడు మీ జ్ఞానాన్నీ, తెలివితేటల్నీ వారి మీద ప్రయోగించకుండా మరో మనిషిగా ప్రేమతో, దయతో వ్యవహరిస్తే చాలు. మనకి నచ్చిన మనిషిని "విక్టిమ్" అనీ "టార్గెట్" అనీ అంటున్నప్పుడే రచయిత స్టాండ్ ఏంటో మనకి స్పష్టంగా తెలిసిపోతోంది. 

శాంపిల్ కి మోడరన్ చాణక్యుడు చెప్పిన కొన్ని మనిషిని టార్చర్ చేసే, సారీ.... సెడక్షన్ పద్ధతులు. కొన్ని చదువుతుంటే ఎంత షాకింగ్ గా అనిపించిందో చెప్పలేను.

1.Choose the Right Victim

2.Create a False Sense of Security—Approach Indirectly

3. Send Mixed Signals

4. Appear to Be an Object of Desire—Create Triangles

5. Create a Need—Stir Anxiety and Discontent

6. Master the Art of Insinuation

7. Enter Their Spirit

8. Create Temptation

9. Keep Them in Suspense—What Comes Next?

10. Use the Demonic Power of Words to Sow Confusion

11. Pay Attention to Detail

12. Poeticize Your Presence

13. Disarm Through Strategic Weakness and Vulnerability

15. Isolate the Victim 

17. Effect a Regression

18. Stir Up the Transgressive and Taboo

19. Use Spiritual Lures

20. Mix Pleasure with Pain

Friday, November 18, 2022

An Evening with Susan Sontag

 An Evening with Susan : 

శుక్రవారం సాయంత్రం అవగానే లేజీ మూడ్ వచ్చేస్తుంది. వారం అంతా ఉరుకుల-పరుగుల రొటీన్ నుండి చిన్న బ్రేక్ అనే తప్ప పెద్దగా ఏమీ మారదనుకోండి. హైదరాబాద్ లో పుస్తకాల మార్కెట్లతో పాటు నన్ను బాగా  ఆకర్షించినవి ఇక్కడ కేఫ్ లు. కొండాకోనల్లో నిశ్శబ్దానికి అలవాటుపడి ఉండడంతో ఇంకా జనారణ్యపు శబ్ద కాలుష్యానికి చెవులు పూర్తిగా అలవాటుపడలేదు. లైఫ్ లో పెద్దగా అడ్రినలీన్ రష్ అక్కర్లేని quiet & comfortable స్టేజిలో పెద్దగా సందడి లేని చోట్లు నచ్చే మాలాంటి వాళ్ళకి వీకెండ్ రాగానే "దో దీవానే ఇస్ షెహర్ మే" అని పాడుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న కేఫ్ వెతుక్కుని వెళ్ళి ఓ పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చదువుకోవడం ఈ మెట్రో జీవితంలో ఒక అదనపు సౌకర్యం. ఎటొచ్చీ ఆయనకు రుచికరమైన సూపు, నాకొక చిక్కని కాఫీ దొరికితే చాలు.

Copyright A Homemaker's Utopia

కూర్చుని కాసేపు సెటిల్ అయ్యాక కొన్ని క్షణాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు కళ్ళతో కాప్చర్ చెయ్యడంతో సరిపోతుంది. ఈరోజు ఇక్కడ మూడు విడివిడి టేబుల్స్ లో లాప్టాప్స్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుని పనిచేసుకుంటున్నవాళ్ళు (ఒక స్త్రీ, ఇద్దరు మగవారు) ముగ్గురు కనిపించారు. ముగ్గుర్లో ఒక మేల్ అండ్ ఫిమేల్ పనిచేసుకుంటున్నంతసేపూ చాలా సీరియస్ గా సిగార్స్ ఊదుతూనే ఉన్నారు. మరో టేబుల్ దగ్గర సుమారు ఐదేళ్ళున్న పాపాయిని ఎంగేజ్ చేస్తూ కూర్చున్న ఒక టీనేజ్ కేర్ టేకర్ కనిపించింది. ఆ పాపాయి అమ్మగారు జాబ్ అనుకుంటా, ఆవిడొచ్చేవరకూ పాపాయిని ఆడిస్తూ అక్కడ వెయిట్ చేసింది. మరో టేబుల్ లో నలుగురు, కాలేజీ పిల్లలనుకుంటా, ముగ్గురబ్బాయిలూ, ఒకమ్మాయీ హుషారుగా కబుర్లలో మునిగిపోయి ఉన్నారు. "ఏం పుస్తకం చదువుతున్నారూ ?" అని డిస్టర్బ్ చేస్తూ అడగడానికి దురదృష్టవశాత్తూ ఈరోజు ఎవరూ కనబడలేదు. నలుగురిలో ఏకాంతాన్ని అనుభవిస్తూ నేను ఈ మధ్యే ఆర్డర్ చేసుకున్న సుసాన్ సొంటాగ్ జర్నల్స్ తిరగెయ్యడం మొదలుపెట్టాను. రేపు ఎప్పుడైనా హైదరాబాద్ విడిచి వెళ్ళేటప్పుడు గుర్తుగా నాతో వెంట తీసుకెళ్ళడానికి కొన్ని చలిగాలుల సాయంత్రపు జ్ఞాపకాల్ని పోగుచేసుకోవాలి కదా !! 

ఈ సాయంత్రానికి సొంటాగ్ డార్క్ హ్యూమర్ జతకలిసి మరింత అందమైన అనుభవాన్నిచ్చింది.

* Not only must I summon the courage to be a bad writer - I must dare to be truly unhappy. Desperate. And not save myself, short-circuit the despair.

By refusing to be as unhappy as I truly am, I deprive myself of subjects. I’ve nothing to write about. Every topic burns. (6/19/76,NY) ( Is she trying to prove that all writers are unhappy ? )

* TB : Consumed (dissolved) by passion - passion leads to dissolution of the body. It was tuberculosis but they called it 'Love'. (Sigh !) 

* Beckett found a new subject for the drama :- What am I going to do in the next second ? Weep, take out of my comb, sigh , sit, be silent, tell a joke, die. (He he he)

*Poets self-limited by some actual or mental regionalism, deliberately cultivated - so he / she will be seen to have [created ] his / her "universe". 

Weakness of American poetry- It's anti-intellectual. Great poetry has ideas. ( You are hurting the egos of Eliot clan Susan )

Thursday, March 3, 2022

In Other Worlds : Essays In Cultural Politics - Gayatri Chakravorty Spivak

చాలా కాలం క్రితం మహాశ్వేతాదేవి రచనలు చదువుతున్నప్పుడు 'గాయత్రి చక్రవర్తి స్పివాక్' పేరు తొలిసారిగా విన్నాను. కథల గురించి తప్ప కథల వెనుక కథల గురించి సహజంగానే శ్రద్ధ తక్కువ కావడంతోటో మరొకటో తెలీదు గానీ ఆ సమయంలో ఆవిడను మహాశ్వేతాదేవి రచనల అనువాదకురాలిగా మాత్రమే చూశాను. మళ్ళా కొన్నేళ్ళ తరువాత డెరిడ్డా వ్యాసాలు చదువుతున్నప్పుడు ఈ పేరెక్కడో విన్నట్లుందే అనుకున్నాను. కాస్త వివరాల్లోకి వెళ్ళగా సొంటాగ్ లాగే గాయత్రి కూడా పురుషాధిక్య జాడ్యాలకు మినహాయింపు కాని సాహితీ ప్రపంచంలో 'పబ్లిసిటీ తక్కువ క్రిటిక్' అని అర్థమైంది. భారతీయురాలైన ఆమె పేరు ఇండియాలో కూడా తక్కువ వినడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా మరీ ఎక్కువైతే ఆశ్చర్యపోలేదు. స్త్రీవాదమనగానే తమ అస్తిత్వాన్ని ఎవరో గుర్తించాలనో, లేదా తమ హక్కుల్ని ఎవరిని నుంచో రాబట్టుకోవాలనో అనుకునే సగటు స్త్రీవాదుల మధ్య సుసాన్ సోంటాగ్, గాయత్రి చక్రవర్తి స్పివాక్ వంటి సాధికారత కలిగిన విమర్శకులు బహు అరుదు. వీళ్ళ విమర్శకు సాహితీలోకంలో శిఖరసమానులైనవారు కూడా మినహాయింపు కాదు, వీరి విమర్శ లక్ష్యం కేవలం స్త్రీవాదానికి మాత్రమే పరిమితమవ్వకుండా సాహిత్యంలో పురుషాధిక్య మూలాల్ని పెకలించే దిశగా సాగింది.

Image Courtesy Google

సుసాన్ సోంటాగ్ తరహాలోనే స్పివాక్ పేరు ప్రముఖ స్త్రీవాదుల జాబితాల్లో వినిపించకపోవడానికి కారణం కూడా ఆమె రచనలు ఏదో ఒక్క స్త్రీవాద సమస్యకో, సిద్ధాంతానికో, వర్గానికో, సమూహానికో పరిమితం కాకపోవడమేననిపిస్తుంది. చివరకు ఆమె తన కెరీర్ లో ఎక్కువ కాలం కలిసి పనిచేసిన ఫ్రెంచ్ తత్వవేత్త డెరిడ్డా సైతం ఆమెను తన 'కోటరీ' కి చెందిన వ్యక్తిగా పరిగణించేవారు కాదని స్పివాక్ ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పుకున్నారు. ఎప్పుడూ 'బిగ్ పిక్చర్' చూసే స్పివాక్ రచనల వైశాల్యం పెద్దది. ఈ కారణంగా సాధారణ పాఠకులకు సులభగ్రాహ్యంకాని స్పివాక్ రచనలు ఇతర స్త్రీవాదుల రచనల్లా పెద్దగా గుర్తింపుకి నోచుకోలేకపోయాయి.

స్పివాక్ రాసిన అనేక వ్యాసాల్లో 'Can the Subaltern Speak' పేరిట రాసిన ఒక వ్యాసాన్ని 'పోస్ట్ కలోనియల్ స్టడీస్' లో మిక్కిలి ప్రాధాన్యత కలిగిన వ్యాసంగా పరిగణిస్తారు. మేథావి వర్గాల్లో అంతర్గతంగా ఉండే నిరంకుశత్వాన్ని విమర్శిస్తూ రాసిన ఈ వ్యాసాన్ని నిజానికి 'బడుగుజీవి మాట్లాడగలడా?' అనేకంటే, 'బడుగుజీవి గళం వినబడుతుందా?' అన్న కోణంలోనే రాశారు. థర్డ్ వరల్డ్ గళం వినపడకుండా నిరోధించే అంశాలు అనేకం ఉన్నప్పటికీ, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్న విద్యావేత్తలూ,మతాధికారులూ,ఇతర ఉన్నత వర్గాలతో కూడిన శక్తివంతమైన సామజిక వర్గాలను అన్నిటికంటే ముఖ్యమైన కారణంగా చూపిస్తారు స్పివాక్. ఆమె మార్క్సిస్టు సిద్ధాంతాలూ, స్త్రీవాదం ,వచనం యొక్క పునఃనిర్మాణపు లక్షణాల ద్వారా తన వాదనలను సహేతుకంగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా పాశ్చాత్య పండితులు 'థర్డ్ వరల్డ్' ని నిర్వచించిన విధానమే  లోపభూయిష్టమైనదని స్పివాక్ అభిప్రాయపడతారు. ఈ క్రమంలో స్పివాక్ వాదనలన్నీ భౌతికమైన హింస కంటే ఆలోచన,భాష,వ్రాత రూపంలో జరిగే 'Epistemic violence' మరింత ఎక్కువ ప్రమాదకరమన్న దిశగా సాగుతాయి. ఉదాహరణకు చరిత్ర నుండి బడుగుజీవుల కథల్ని ఆనవాళ్ళు లేకుండా తుడిచివెయ్యడం ఈ రకమైన హింస క్రిందకి వస్తుంది. స్త్రీవాదాన్ని కూడా ఇదే వెలుగులో చూపిస్తూ, స్త్రీ గళం అణచివేతకు గురికావడానికి అటు పితృస్వామ్యంతో బాటు, ఇటు వలసవాదం కూడా ఒక కారణమంటారు. స్పివాక్ రచనల్లో సింహభాగం మేథావి వర్గాల ఆధిపత్యం కారణంగా సాంఘిక,సాంస్కృతిక,రాజకీయ,సాహితీ రంగాల్లో జరిగే అణచివేతపైనే దృష్టిసారిస్తాయి.

బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి కథ 'ద్రౌపది' ని స్పివాక్ ఆంగ్లంలోకి అనువదించడానికి కారణం కూడా అది తాను ప్రతిపాదించిన 'ఎపిస్టమిక్ వయొలెన్స్' ను ప్రతిబింబించే కథ కావడమేనంటారామె. క్లుప్తంగా కథ విషయానికొస్తే, ఒక సైనికాధికారి సేనానాయక్ ద్రౌపది అనే గిరిజన స్త్రీని బంధించి ఆమెను న్యాయ విచారణచేసే క్రమంలో దారుణమైన హింసకు గురిచేసి పలువురు ఆమెపై అత్యాచారం చెయ్యడానికి పరోక్షంగా కారణమవుతాడు. ఈ కథను తాను అనువదించడానికి 'ద్రౌపది' ఎంత కారణమో అందులో ప్రతినాయకుడు 'సేనానాయక్' పాత్ర కూడా అంతే కారణమంటారు స్పివాక్. ఆ కథలో సేనానాయక్ పాత్ర 'ఫస్ట్ వరల్డ్ స్కాలర్' ప్రతినిధిగా 'థర్డ్ వరల్డ్' కి చెందిన ద్రౌపదిని వెతుక్కుంటూ వెడుతుంది. ధర్మాధర్మాల విచక్షణా, సహానుభూతీ ఉన్నప్పటికీ చివరకి సేనానాయక్ తన వృత్తిలో భాగంగా ఫాసిస్టు భావజాలానికి కొమ్ముకాయక తప్పదు.

మహాశ్వేతాదేవి ఈ కథలో ఒక సందర్భంలో సేనానాయక్ తన చేతిలో ఉన్న Hochhuth రచన 'The Deputy' పేపర్ బ్యాక్ ని టేబుల్ మీదకు విసిరేశాడని రాస్తారు. చిన్న సంగతే అయినా ఈ వివరం కథలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిజానికి 'ది డిప్యూటీ' నవల హోలోకాస్ట్ సమయంలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ బాధ్యత గల మతాధికారి స్థానంలో ఉన్న పోప్ (Pope Pius XII) ఎటువంటి ప్రకటనా జారీచెయ్యకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన యాంటీ ఫాసిస్టు రచన. ఇది చదువుతున్న సేనానాయక్ కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న 'ఫస్ట్ వరల్డ్ ప్రతినిధి' గా ఉంది కూడా పోప్ తరహాలోనే ధర్మబద్ధంగా వ్యవహరించకుండా ద్రౌపది (థర్డ్ వరల్డ్) పై జరిగిన అత్యాచారానికి పరోక్షంగా బాధ్యుడవుతాడు. స్పివాక్ డెరిడ్డా 'డీకన్స్ట్రక్టివ్ ప్రిన్సిపుల్' ని ఈ విశ్లేషణకు మూలాధారంగా చేసుకున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ.

డాంటే మొదలు ఈట్స్ వరకూ సాహిత్యంలో స్త్రీ పాత్రపై దృష్టి సారిస్తూ ఆమె రాసిన 'ఇన్ అదర్ వరల్డ్స్' అనే పుస్తకంలో స్పివాక్ చేసిన కొన్ని విశ్లేషణలు స్త్రీవాదంపై ఆమె భావాలకు దర్పణం పడతాయి. కవితా వస్తువుగా స్త్రీని ఉపయోగించుకోవడంలో డాంటే,ఈట్స్ వంటివారు అవలంబించిన ద్వంద్వ విలువల్నీ, పురుషాధిక్య భావజాలాన్నీ వారి రచనల్లోని ఒక్కో వాక్యాన్నీ 'deconstruct' చేస్తూ చేసిన విశ్లేషణలు చదువుతున్నప్పుడు ఉత్తమ సాహిత్యంగా పరిగణింపబడే సాహిత్యంలో స్త్రీ పాత్ర ఎంత ? అనే ప్రశ్న జనించకపోదు. ఈ కవులందరూ సాహిత్యంలో స్త్రీ పాత్రను ఒక జీవం ఉన్న మనిషిగా కాకుండా ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చేయడాన్ని స్పివాక్ వ్యాఖ్యానాల్లో స్పష్టంగా చూస్తాం.

1977 లో జరిగిన వోక్స్ స్త్రీవాద సదస్సులో డాంటే La Vita nuova మీద వ్యాసానికి సంబంధించి పేపర్ ఒకటి చర్చకు పెట్టినప్పుడు ఆ పేపరు ప్రెజెంటేషన్ పూర్తైన వెంటనే సభలో ఒక స్త్రీ లేచి "స్త్రీకి ఏ మాత్రం విలువ ఆపాదించని ఈ రచనను స్త్రీలు ఏ విధంగా ప్రశంసించాలి ?" అని అడిగారట. దానికి అదే సభలో మరో స్త్రీ లేచి డెరిడ్డా డీకన్స్ట్రక్టివ్ సూత్రాన్ని గుర్తు చేస్తూ ఆ రచనకి రచయిత, అంటే ఇక్కడ డాంటే ఎంతమాత్రం బాధ్యుడు కాదని అన్నారట. డెరిడ్డా సూత్రం ప్రకారం వచనానికి తనను తానే నిరంతరం పునఃనిర్మించుకునే గుణం ఉంటుంది,ఈ కారణంగా స్వయానా రచయిత కూడా ఆ రచనకు బాధ్యుడు కాడు.

డాంటే-బీట్రిస్ ల ప్రేమకథలో డాంటే విపరీతమైన సెల్ఫ్ ఇండల్జెన్స్ తో బీట్రిస్ పాత్రను ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చెయ్యడం చూస్తాం. డాంటే ఆమెకు తన హృదయంలో ఒక గుడి కట్టి దేవతలా ఆరాధిస్తారు. కానీ నిజానికి ఆమె జీవితాంతం డాంటే ప్రేమను గురించిన స్పృహలేకుండానే జీవించి పాతికేళ్ళ వయసులో అకస్మాత్తుగా మరణిస్తుంది. అంటే ఈ కథలో బీట్రిస్ ఉనికిని పూర్తిగా తన ఆలోచనలకే పరిమితం చేస్తారు డాంటే. వాస్తవానికి ఆమెకు ఒక రూపం ఇవ్వకపోయినా తన ప్రతీ చర్యకూ బీట్రిస్ ని (ఆమె ఇమేజ్) కారణభూతంగా చూపించే ప్రయత్నం చేస్తారు. తన కల్పనలో తన కర్మలకు  ఆమెను బాధ్యురాలిని చేసి తాను మాత్రం ఎటువంటి బాధ్యతా తీసుకోరు. "బీట్రిస్ కారణంగా నేను అలా వ్యవరించవలసి వచ్చింది" అని డాంటే అనడంలో నిజానికి బీట్రిస్ పాత్ర ఏమీ ఉండదు. డాంటే రచనలో చర్యా/ప్రతిచర్యా /ఉనికీ ఇవేమీ లేని బీట్రిస్ కేవలం 'డాంటే యొక్క ఏజెంట్' గా మిగిలిపోతుంది. మరోవిధంగా చూస్తే ఆమె అతడి 'నాన్ ఏజెంట్' : ఆ కారణంగా ఒక ఆబ్జెక్ట్ (బీట్రిస్) స్థానంలో ఉంటూ సబ్జెక్టు(డాంటే) చర్యను ఆమె నియంత్రిస్తుంది. డాంటే తన ఆధిపత్యపు ఉద్దేశ్యాన్ని ఎప్పటికప్పుడు పునఃనిర్మించుకోవడానికి ఆమె ఒక ప్రేరణగా నిలుస్తూ, అతడి నార్సిసిజాన్నీ,మసకిజాన్నీ (Masochism) కప్పెట్టే తెరచాటుగా మారుతుంది.

మరికాస్త ముందుకెళ్ళి డాంటే కవిగా తన సృజనాత్మకతనీ, నైపుణ్యాన్ని మరికాస్త బిగ్గరగా చాటే పనిలోపడతారు. బీట్రిస్ ని జీవంలేని ఇమేజ్ గా మిగిల్చి 'ప్రేమ' ని మాత్రం కవితా సంప్రదాయంలో ఒక జీవం ఉన్న ప్రాణిగా చూపించే యత్నం చేస్తారు. ఆయన రచనలో ప్రేమను గురించిన వర్ణనలు ప్రేమ ఒక సజీవమైన వ్యక్తేమో అన్న భ్రమను కలిగిస్తాయి. ఈ ప్రయత్నాన్ని సమర్ధించుకునే దిశగా, వర్జిల్,లుకన్,హోరేస్ మరియు ఒవిడ్ వంటి వారి ప్రస్తావన తెచ్చి ప్రేమను 'పొయెటిక్ లైసెన్స్' కాలిడోస్కోప్ లో నుంచి సజీవమైన వ్యక్తిగా చూడొచ్చని నమ్మబలుకుతారు.

డాంటే,ఈట్స్ వంటి వారు స్త్రీని తమ కవితావస్తువుగా చేసుకునే క్రమంలో ఆమెకు తమ సృజనాత్మకతతో ఒక ఆదర్శ రూపమిచ్చే ప్రయత్నం చేశారు. కాల్పనిక వస్తువుగా ఇందులో స్త్రీ ప్రమేయం ఎంతమాత్రం లేకుండా ఆమెకు ఆపాదించిన రూపాన్ని మళ్ళీ వారే ఛిద్రం చేస్తారు, ఆ విధంగా ఆమెను 'న స్త్రీ స్వాంత్త్య్రమర్హతి' అన్న తీరులో ఆమె ఉనికిని సమూలంగా హరించే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇదంతా పాఠకుల దృష్టికి రాకుండా ఒక రహస్యంలా, వారి శిల్పంలో అంతర్గతంగా ఉంటూ, వారి పంక్తుల్ని ఒకదానితోనొకటి దగ్గరగా కలిపి ఉంచే చర్యలా జరుగుతూ ఉంటుంది. "ఒక స్త్రీగా స్త్రీ అస్తిత్వానికి ఆనవాళ్ళు లేకుండా చేసిన ఇటువంటి  ఉత్తమ సాహిత్యాన్ని నేను తిరస్కరిస్తే ఇక సాహిత్యంలో మిగిలినదేముంటుంది ? " అని ప్రశ్నిస్తారు స్పివాక్. పోనీ మరీ ఇంత కఠినమైన ప్రశ్నని కాసేపు ప్రక్కన పెడితే, "స్వయంసిద్ధమైన ఉనికిలేని కాల్పనిక వస్తువుగా స్త్రీ ఇమేజిని కుదించేశాక ఇక రచనలో ఎటువంటి ద్వంద్వానికీ చోటివ్వని కవి శిల్పం అతడి కావ్య సాధనలో ఏ రకమైన సంపూర్ణత్వాన్ని సాధిస్తుంది ?" అని సూటిగా ప్రశ్నిస్తారు. ఈ కారణంగా కేవలం వచనాన్ని మాత్రమే సాధనంగా చేసుకుని ఏకపక్షంగా చేసే ఈ రచనలు ఏ విధమైన వైరుధ్యానికీ ఆస్కారం లేకుండా చేసే అవకాశం ఉందంటారు స్పివాక్. ఇదే విశ్లేషణను ప్రముఖ ఫ్రెంచ్ సైకో అనలిస్టు జక్ లకాన్ పరిభాషలో ప్రకారం చెప్పాలంటే, కవులూ,రచయితలూ కేవలం ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని సృష్టించే ఈ తరహా సంబంధాలూ,ఊహలూ,ఫాంటసీలూ సాధారణ దృష్టికీ  గమనింపుకీ ఎంత మాత్రం అందేవి కాదు. అందువల్ల భాషాసౌందర్యాల మాటున చేర్చి భావగర్భంగా సమాజంలోకి ప్రవేశపెట్టే ఇటువంటి భావజాలాల్ని నమ్మి పాఠకులు ఆ కాల్పనికతను వాస్తవమని భ్రమపడే అవకాశం ఉంది [the symbolic masquerade of the Imaginary]. అక్కడితో ఆగకుండా అదంతా సహజమనీ,వాస్తవమనీ అంగీకరించే ప్రమాదం కూడా ఉంది.

పుస్తకం  నుండి మరికొన్ని అంశాలు : 

It is not surprising that the book ends with a promise to write further: “I hope to write of her that which has never been written of any other woman.” In Dante’s text, Beatrice is fully sublated into an object—to be written of, not to.

To keep the woman out. Here the third woman in Yeats’s life plays a role. She was caught on the rebound within the institution of marriage, and had a masculine nickname, “Georgie Yeats.” She was the transparent medium through which the voices of Yeats’s instructors, themselves at first dependent upon his own text, travelled: “On the afternoon of October 24th 1917,” Yeats writes in A Vision, “four days after my marriage, my wife surprised me by attempting automatic writing.… The unknown writer took his theme at first from my just published Per Amica Silentia Lunae”. We are back to “Ego Dominus Tuus.” Is it the unknown writer who is Yeats’s lord, is it Yeats who is his wife’s lord? We are caught in another labyrinth of “I,” “you,” and mastery.

తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ - 28 ఫిబ్రవరి 2022.

https://lit.andhrajyothy.com/vividha/article-about-spinak-articles-39742

https://www.andhrajyothy.com/telugunews/femininity-reduced-to-fiction-as-a-story-ngts-editorial-1922022804273432?fbclid=IwAR2t53EfcjxXkPSDc0DiW7zM3DPADq-FPModZ2OFzmYlZD-aPUrTo1XMahQ

Thursday, August 5, 2021

The Terror of Fables - Roberto Calasso

ఆస్ట్రియన్ రచయిత రాబర్ట్ ముసిల్ మాగ్నమ్ ఓపస్ 'ది మాన్ వితౌట్ క్వాలిటీస్' లో కథానాయకుడు అల్రిచ్ స్పోర్ట్స్ మాగజైన్లో ప్రచురించిన ఒక వ్యాసంలోని వాక్యం 'a racehorse of genius' చదివి ఆలోచనలో పడతాడు..ఆ సందర్భంలో అల్రిచ్ కి ప్రపంచ చరిత్ర యావత్తూ ఈ వాక్యంతోనే ముడిపడి ఉన్నట్లు తోస్తుంది..వెనువెంటనే అతడు ఒక మాథెమెటీషియన్ గా తన జీవితం నుండి ఒక సంవత్సరం పాటు శెలవు తీసుకుని 'ఎ మాన్ వితౌట్ క్వాలిటీస్' గా రూపాంతరం చెందుతాడు..ఈ కథ విన్నప్పుడు తరతరాలనుండి వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలూ,రాజకీయ సామజిక స్థితిగతులూ,సాంఘిక నియమాలూ,వ్యవస్థలూ మనకు ఆపాదించిన అస్తిత్వపు చిహ్నాలను సమూలంగా చెరిపేసి అల్రిచ్ లా శెలవు తీసుకోవడం మనకు కుదిరే పనేనా అనిపిస్తుంది..గత సంవత్సరం చదివిన ఒట్టెస్సా మోష్ఫెగ్ రచన 'మై ఇయర్ ఆఫ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్' లో కూడా యధాతథంగా కాకపోయినా దాదాపూ ఇటువంటి అంశమే చర్చకు వస్తుంది..అందులో యువ కథానాయిక జీవితపు నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక సంవత్సరంపాటు ఒంటరిగా తన అపార్ట్మెంట్లో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ నిద్రాణస్థితిలో జీవించాలని నిర్ణయించుకుంటుంది..రాబర్ట్ ముసిల్ కథానాయకుడు సంఘజీవిగా తన అస్తిత్వాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ,మోష్ఫెగ్ కథానాయిక ఒంటరితనంతో అలసిపోయి డిప్రెషన్ బారిన పడుతున్న నేటి తరానికి ప్రతినిధిలా కనిపిస్తుంది..ఏదేమైనా ఈ రెండు కథల్లోనూ అలసిపోయి అస్తిత్వపు మూలలను వదిలించుకోవాలనే తపన మాత్రం సుస్పష్టం..సాంస్కృతిక మూలాలను రక్షించుకోవడం పేరిటో లేదా సౌకర్యవంతమైన మార్గమనుకునో అనుకరణ,అనుసరణలను విధిగా పాటిస్తూ జీవించేవారు కొందరైతే,Be a Roman in Rome తరహాలో తమ చుట్టూ ఉన్న పరిసరాలకూ,మనుషులకూ,వ్యవస్థలకూ అనుగుణంగా తమ ఉనికిని నిరంతరం మార్చుకుంటూ స్పష్టమైన అస్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు..కానీ ప్రాక్టికల్ గా అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడం మన చేతుల్లో ఉండే పనేనా ?

Image Courtesy Google

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతీ,సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు,చరిత్ర,నాగరికత లాంటివి అందించబడతాయి..ముఖ్యంగా సాహిత్యంలో కథలూ,కవిత్వం లాంటివి ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా వర్తిస్తాయి..సాహితీ  ప్రపంచంలో 'మిత్' (పురాణం/గాథ) చాలా ప్రత్యేకమైనది..ఈ 'మిత్' ను వాడుక భాషలో పుక్కిట పురాణమని కూడా అంటుంటాం..'మిత్' చరిత్రను సజీవంగా ఉంచుతుంది..ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో, బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం,చిత్రలేఖనం ,నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో ,ఇతరత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థలోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి..పాలిటిక్స్,జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్ బార్త్ , తన 'మైథాలజీస్' లో 'మిత్' గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా 'సైన్ ని సిగ్నిఫైర్ గా మార్చే సెమియోటిక్  సిస్టం లో భాగమని' అంటారు..వివిధ సంస్కృతులకు సంబంధించిన చరిత్ర యావత్తూ ఈ మిత్ ప్రాతిపదికగా రూపొందినదే..మిత్స్ సమాజాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.

ఇటాలియన్ రచయిత రోబర్టో కలాస్సో 'ది ఫోర్టీ నైన్ స్టెప్స్' అనే పుస్తకంలో 'ది టెర్రర్ ఆఫ్ ఫేబుల్స్' పేరిట రాసిన వ్యాసంలో మిత్ కు కొన్ని పేజీలు కేటాయిస్తూ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు..చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..కథలూ,గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటని ఆశ్చర్యంగా అనిపించినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు..ఈ మిత్ ను రెండు అర్ధాల్లో తీసుకోవచ్చు అంటారు కలాస్సో : మొదటిది, 'ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం' అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో 'ఒక అబద్ధం / భ్రమ / పుక్కిటి పురాణమని' కొట్టిపారేసేది..మిత్ గురించి చర్చించే నేపథ్యంలో ప్లేటో 'రిపబ్లిక్' ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్ కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో 'రిపబ్లిక్' లోనే అంటారు..ప్లేటో 'రిపబ్లిక్' లో తాత్వికతకూ,కవిత్వానికీ పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు..ఆనాటికి కవిత్వానికి మారు పేరేదైనా ఉందంటే అది ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసి,ఇలియడ్,ఒడిస్సీలను సృష్టించిన హోమర్ మాత్రమే..ఆ కోణంలో చూస్తే మొత్తం రిపబ్లిక్ ను ప్లేటో, హోమర్ ల మధ్య ఘర్షణగా పరిగణించవచ్చు..గ్రీకులు హోమర్ ను తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా , ప్రపంచానికీ , దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధిగా చేసిన అనుసంధానకర్తగా చూస్తారు..అటువంటి హోమర్ ని ప్లేటో , 'రిపబ్లిక్' రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిట పురాణాలు సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు..ఇక రిపబ్లిక్ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను 'మిమెసిస్' (the dangerous art of imitation) సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు..కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిథ్యం వహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమయ్యారని అంటారు ప్లేటో. 

హోమర్ కు వ్యతిరేకంగా ప్లేటో వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది చేసిన అభియోగాలనుకుంటే పొరపాటే..నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్ దృష్టికోణం నుండి చేసినవేనంటారు కలాస్సో..ఒక వేళ హోమర్ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, నిరంతరం తమ రూపాలను మార్చుకుని మానవుల్ని మోసం చేసే దేవుళ్ళను ఇంద్రజాలికులుగా , మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది..కానీ నిజానికి దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాంతరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి కాదు..హోమర్ ఆ మెటామార్ఫోసిస్ కు పరోక్షంగా ప్రాతినిథ్యం వహించే సాధనంగా మాత్రమే అగుపిస్తారు..ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా,నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్ జోన్ సహజంగానే ఫిలాసఫర్లకు శత్రు సమానంగా కనిపిస్తుంది..అందువల్ల వాస్తవికతకు సుదూరంగా అబ్సర్డిటీ తో కూడిన ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే కవులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంఘం నుండి బహిష్కరింపబడాలన్నది ప్లేటో వాదన.

నిశితంగా గమనిస్తే ఆంగ్లో సాక్సన్ల క్రిస్టియానిటీకీ, వైకింగ్స్ పాగనిజానికీ మధ్య ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వైరం లాంటిదే ప్లేటో హోమర్ ల మధ్య 'సిములాక్రం' లో (Simulacrum = వాస్తవానికి ప్రతిరూపం/అనుకరణ/ప్రాతినిథ్యం వహించేది) కూడా కనిపిస్తుంది..'సిములాక్రం' మనిషిని తనను అనుసరించమని శాసిస్తుంది,దానిని చూసిన మనిషి తన ప్రమేయం లేకుండానే దాని ప్రతిరూపంగా మారిపోతాడు..ఒకవేళ ప్లేటో రిపబ్లిక్ లో భావించినట్లు సిములాక్రం వాస్తవదూరంగా,లోపభూయిష్టంగా ఉన్న పక్షంలో దానికి రూపకల్పన చేసిన కవి కూడా తాను సృష్టించిన దేవుడిలాగే ఇంద్రజాలికుడిలా,తాంత్రికుడిలా మారిపోతాడు..అందువల్ల దైవమైనా,ఆ దైవాన్ని సృష్టించిన కవి అయినా 'సిములాక్రం' అన్న పదంలో కంటికి కనిపించని శత్రువుల్లా దాగి ఉన్నారన్నది ప్లేటో భావన..దీనినే మరో విధంగా చూస్తే , 'మిత్' అనేది ఒక అవాస్తవికతను మరో అవాస్తవికతగా చూపించే ప్రయత్నం చేస్తుంది..ప్లేటో ఈ అవాస్తవికతను వ్యతిరేకిస్తారు. 

ఈ తరహా హోమరిక్ మిత్ నూ, వాళ్ళ 'మిమెటిక్' పోయెట్రీ నీ ఖండించిన 'ప్లేటో ప్రపంచం'లో కేవలం కవికే గాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు..ప్లేటో కవిని "A man skillfully able to transform himself into everything" అని నిర్వచిస్తారు..కవిత్వం విషయంలో సిములాక్రా , అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్ పదాల వాడకం పట్ల ప్లేటో కి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయినప్పటికీ , కావ్యసృష్టిలో  భాగమైన మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుంటాయంటారు కలాస్సో..మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడంతో 'A is transformed into B' అనే బదులు 'A is B' అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది..మొదటిది (మెటామోర్ఫోసిస్) ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి అంటే నేరేటివ్ కి అవకాశమున్న అంశం కాబట్టి ఏ ఇమేజ్ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞానసముపార్జనకు ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ,నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక..దీనికి భిన్నంగా, రెండో పద్ధతి 'A is B' నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్పుట్,ఔట్పుట్ పద్ధతిలో ఉండడం వల్ల మెటామోర్ఫోసిస్ కు అవకాశం శూన్యం..అందుచేత ప్లేటో మెటామోర్ఫోసిస్ ని తిరస్కరించడం అంటే,కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ,తద్వారా ఇమేజ్ ని అర్థంచేసుకునే (cognitive power ) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క.

ప్లేటో వాదనలో ఉన్న లొసుగులు చూశాం కాబట్టి,ఇప్పుడు ఆయన చెబుతున్న ఇమిటేషన్ లో ఉన్న ప్రమాదాలేమిటో కూడా చూద్దాం..పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి,తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి..ఈ మాయలో పడ్డవాళ్ళు కర్ట్ వన్నెగట్ సృష్టించిన Karass (A network or group of people who are somehow affiliated or linked spiritually ) లాంటివాళ్ళు..గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేని వీళ్ళు తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు.

ఇక మిత్ ను గురించి సోక్రటీస్ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకు కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది..ఈ విషయంలో ప్లేటో లో ఉన్న మొండితనం సోక్రటీస్ లో కనిపించదు..సోక్రటీస్ మిత్ గురించి మాట్లాడుతూ “Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., with the fables themselves].” అంటారు..ఈ సందిగ్ధంలో రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి..ప్లేటో హెచ్చరించిన అస్పష్టత,అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశమివ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఇక్కడ ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం.

ఈ మిత్ ప్రభావాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్ మిత్ ను ఉదహరిస్తారు కలాస్సో : మిత్ మనమీద చెక్కతో చేసిన టారియన్ ఆర్టెమిస్ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన..ఓరెస్టిస్ దాన్ని ఆలయంలోనుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువుకుని పారిపోతున్నంతసేపూ  అతడిలో ఒకవిధమైన ఉన్మాదం జనిస్తుంది..చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకుని యూరోటస్ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని  పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు..ఆ విగ్రహం అక్కడే ఏళ్ళ తరబడి ఎవరికంటాబడకుండా శిథిలమైపోతుంది..ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్ యువకులు ఆస్ట్రాబాకస్,ఏలోపెకస్ లు యాదృచ్చికంగా ఆ విగ్రహం చూడడం జరుగుతుంది..తీక్షణంగా తమకేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తున్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవుతారు..సిములాక్రం కి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో..దాని గురించి అర్థం చేసుకోగలిగిన వారిని మాత్రమే అది నయం చేస్తుంది..మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాథిలా సంక్రమిస్తుంది..

Thus the myth: The power that arouses terror is also the only one that can cure it, as happened with Orestes. But only if it is recognized for what it is.

తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ : 2 ఆగష్టు 2021

https://lit.andhrajyothy.com/vividha/poet-pleto-37634

https://www.andhrajyothy.com/telugunews/what-did-plato-have-to-do-with-poets-19210802042167?fbclid=IwAR0hR2M9kZvzyIyZ9yJrYkH-Klr53Vz_oy-OYh6GhMF2lTSYdjfh7bELCE4

Tuesday, December 22, 2020

If I Have to Say It - A Poem by Frida Kahlo

ఈ మధ్య ఏదో లిటరరీ రిఫెరన్సు కోసం వెతుకుతుంటే ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో తన భర్త డియాగో రివెరానుద్దేశించి రాసిన ఈ కవిత కనిపించింది..ఇప్పటివరకూ ఆమె చిత్రాల్ని చూడడమో,అంతకుమించిన ఆమె కాంట్రవర్షియల్ లైఫ్ స్టైల్ గురించి అక్కడక్కడా చదవడమో తప్ప ఫ్రిడా కవితలు కూడా రాస్తారన్నఎరుకలేదు..ఈ కవిత చదివాక ఆమె మరికొన్ని కవితలు చదివాను..కొన్ని కవితల్లో ఫ్రిడా స్వరంలో అంతర్లీనంగా కమలా దాస్ స్వరం ధ్వనించినట్లనిపించింది..తొలిపంక్తులు చదువుతున్నప్పుడు ఈ 'మెక్సికన్ కమలా దాస్' తన చిత్రాల వెనుక నీలెక్క నాకేంటన్నట్లు సర్వస్వతంత్రురాలిలా,ధీరవనితలా కనిపిస్తుంది కదా,మరి ఈ కవితలో ఇంతటి మనోదౌర్బల్యం, దైన్యమేమిటబ్బా అనుకున్నాను..ఈ కవిత చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రిడా ఈమె కాదే అని ఆమెను వెతుక్కుంటూ చదివాను..ఆమె స్థిరగంభీరమైన వ్యక్తిత్వం భర్త డియాగో విషయానికొచ్చేసరికి పేలవమైన రూపుదాల్చడంలో మర్మమేమిటో !! బహుశా ప్రేమ కావచ్చు !! కానీ చివర్లో ఆమె ఇవన్నీ నిన్ను అడగాల్సొస్తే అవేమీ నాకు అక్కర్లేదు పొమ్మంటుంది చూశారా,అప్పుడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఫ్రిడా మళ్ళీ కనిపించింది.

Image Courtesy Google

ఏదేమైనా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టులను కొందర్ని చూసినప్పుడు వారిలో ఆత్మన్యూనతపాళ్ళు చాలా ఎక్కువ అనిపిస్తుంది..ఈ న్యూనతలూ ,బలహీనతలూ , వైఫల్యాలు ,నైరాశ్యాలూ , సమాజంలో ఇమడలేకపోవడాలూ , తత్పరిణామంగా నిరంతరం జరిగే అంతః సంఘర్షణలోనుండే కదా అద్భుతమైన ఆర్ట్ పుడుతుంది..మెదడునిండా గ్యాప్ లేని ఇంటెలెక్ట్,రేషనాలిటీ,లాజిక్ వీటన్నిటితో నిండిన సాధారణ వ్యక్తులు (నాలాంటివాళ్ళు ? :) ) ఒక చిన్న పీస్ ఆఫ్ ఆర్ట్ కూడా సృజించలేకపోవడానికి కారణం బహుశా ఇదేనేమో కదా !! 'స్పష్టత' సృజనకు ప్రధాన శత్రువు.

ఆమె అంటోంది "నేను నిన్నేమీ అడగను,నీవే తెలుసుకోవాలి..నిన్ను అడగాల్సివస్తే అది నాకొద్దు" అని.. ఫ్రిడా, నువ్వు పైకి కనిపించేటంత రాడికల్ కాదు సుమా :) నేటితరంలో అందరం 'స్ట్రెయిట్ ఫార్వర్డ్' , ఆమెలా ఓల్డ్ ఫ్యాషన్డ్ తరం కాదు కదా..మనకి సమయం చాలా విలువైనది,"క్యా పతా కల్ హో నహో"..ఈ క్షణం చేతిలోంచి జారిపోయేలోగా దాన్ని అర్జెంటుగా జీవించెయ్యాలి అని మేనేజ్మెంట్ గురువులు బోధిస్తూ ఉంటారు..అందుకే ఈ తరానికి రొమాన్స్ కు నిర్వచనాలు తెలీదు..'When all is said and done' మిగిలేదేమిటి !! ఎవరి మొబైల్ ఫోన్లు వాళ్ళు చెక్ చేసుకోవడం తప్ప..ఇదే విషయాన్ని మరో కాంటెక్స్ట్ లో మన ముళ్ళపూడి బాపు సినిమా 'పెళ్ళిపుస్తకం' లో విలన్ మాటల్లో నర్మగర్భంగా ఇలా చెప్పిస్తారు : "ఒలిచిన అరటిపండుకీ,ఒలుచుకు తినే అరటిపండుకీ తేడా లేదూ ?"  అంటూ..ఆర్టిస్టులు వెర్రివాళ్ళు కాదు వారికీ విషయం బాగా తెలుసు..ఫ్రిడా కు కూడా ఖచ్చితంగా తెలుసు.

ఆమె కవిత 'If I Have to Say It' కు నా స్వేఛ్ఛానువాదం :

నన్ను ముద్దాడమని నేను నిన్ను అడగబోవడం లేదు.

నువ్వు పొరపాటో,తప్పో చేశావని నాకు నమ్మకంగా తెలిసినప్పుడు కూడా నన్ను క్షమాపణ కోరమని అడగబోవడంలేదు.

నీ సాన్నిహిత్యం నాకు చాలా అవసరమైనప్పుడు నన్ను నీ కౌగిలిలో బిగించి సేద తీర్చమని అడగబోవడంలేదు.

లేదా మన పెళ్ళిరోజు నన్ను విందుకి ఆహ్వానించమని నిన్ను అడగబోవడంలేదు. 

కొత్త అనుభవాలకోసం ప్రపంచాన్ని చుట్టివద్దాం రమ్మనో లేదా ఆ కొత్త నగరంలో ఉన్నప్పుడు నాచేతిని నీ చేతిలోకి తీసుకొమ్మనో అంతకంటే అడగబోవడం లేదు.

అబద్ధమే అయినప్పటికీ నేను ఎంతటి సౌందర్యరాశినో చెప్పమనీ,లేదా నాకు అందమైన పదాలతో ఏర్చికూర్చిన లేఖ రాయమనీ నిన్ను అడగబోవడంలేదు.

నీ రోజు ఎలా గడిచిందో చెప్పడానికో, లేదా నన్ను మిస్ అయ్యావని చెప్పడానికో నాకు కాల్ చెయ్యమని నిన్ను అడగబోవడం లేదు.

నీ మీద ప్రేమతో నీకోసం నేను చేసిన ప్రతి చిన్న పనికీ కృతజ్ఞతలు చెప్పమనీ,నా చిరాకుపరాకుల్లో నా గురించి చింతపడమనీ నిన్ను అడగబోవడంలేదు.

అంతేకాదు,నా నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలబడమని కూడా నిన్ను అడగబోవడంలేదు. 

నీకు చెప్పడానికి నా దగ్గర కథలూ,బాసలూ,ఊసులూ కోకొల్లలున్నా, అవన్నీ తీరిక చేసుకుని  వినమని నిన్ను నేను అడగబోవడం లేదు.

కనీసం నిన్ను నా తోడూ నీడగా నాతో కడదాకా ఉండమని కూడా అడగబోవడం లేదు.

ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ నేను నిన్ను అడిగి సాధించుకోవాల్సిన పక్షంలో 

అవేమీ నాకు అఖ్ఖర్లేదు.


If I Have to Say It

I’m not going to ask you to kiss me,

neither ask for forgiveness when I believe that you have done wrong,

or that you have made a mistake.

Nor am I going to ask you to hug me when I need it the most,

or to invite me to dinner on our anniversary.

I’m not going to ask you to go around the world

to live new experiences, much less

ask you to give me your hand when we are in that city.

I’m not going to ask you to tell me how pretty I am,

even if it’s a lie or that you write me anything nice.

Nor will I ask you to call me to tell me

how your day was or tell me you miss me.

I’m not going to ask you to thank me for everything I do for you,

for you to worry about me when my moods are down

and of course I will not ask you to support me in my decisions.

I’m not going to ask you to listen to me when I have a thousand

stories to tell you.

I’m not going to ask you to do anything,

not even to stay by my side forever.

Because if I have to ask you,

I do not want it anymore.

- Frida Kahlo, to her husband, Diego Rivera. 

Sunday, October 11, 2020

View with a Grain of Sand - Wisława Szymborska

True Love,ఈ మాట వింటే నవ్వొస్తుంది..ప్రేమలో నిజమైన ప్రేమలూ,అబద్ధమైన ప్రేమలూ ఉండవేమో కదా ! లవ్ ఈజ్ లవ్..ఈ మధ్య సినిమాలు,సాహిత్యం చేతిలో పడి ఈ 'ప్రేమ' అన్న పదం పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది.సీరియస్ ప్రేమ,క్యాజువల్ ప్రేమ,ప్రాక్టికల్ ప్రేమ అంటూ  ప్రేమను వెడ్డింగ్ బఫె లో మెనూ కార్డు ఐటెం చేసిపారేశారు.చాలా ఛీజీ సెంటెన్స్ లా అనిపించినా (ఈ మాట చాలా సినిమాల్లో వాడేశారు మరి) ప్రేమ ఎప్పుడు,ఎక్కడ,ఎందుకు,ఎవరి మీద,ఎలా ఏర్పడుతుందో చెప్పడం కష్టం..పంచాంగాలు చూసుకుని,సందర్భాసందర్భాలు నిర్ణయించుకుని పుట్టేది ప్రేమ కాదు..జాతి,కులం,మతం,వయసు,వర్గం లాంటి తారతమ్యాలేవీ మనిషి ఉనికిలో అతి స్వచ్ఛమైన ఈ భావోద్వేగాన్ని నియంత్రించలేవు..No one will ever understand unless they've been through it themselves.బట్ వై హిమ్ ? వై హర్ ? అని ప్రేమికులను నిలదీసినా కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వలేరేమో.ఇంత విశాల ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ ఇద్దరి మధ్యే ఎందుకు ఇటువంటి సంబంధం ఏర్పడుతుంది ? 

The light descends from nowhere.
Why on these two and not on others?
Doesn’t this outrage justice? Yes it does. అంటారు నోబెల్ గ్రహీత,పోలిష్ కవయిత్రి విస్లవా సింబోర్స్కా.

ఇద్దరు మనుషులను ముడివేసి ఉంచే పెళ్ళి లాంటి సామజిక బంధం కంటే,ఎవరి ప్రమేయమూ లేకుండా పుట్టే ఈ మానసికమైన బంధం గొప్పది అని చెప్పడమే రచయిత్రి ఉద్దేశ్యమా ?.

ప్రశాంతంగా ఉన్న నదిలో బలమైన తుఫాను తాకిడికి రేగిన అలజడిలా మనిషి అంతః ప్రపంచాన్ని అతలాకుతలం చేసి వదిలిపెట్టగల శక్తి ఈ ప్రేమకు ఉంటుంది..మీరెప్పుడైనా ప్రేమికుల్ని గమనిస్తే సహజ స్థితిలో ఉండే లాజిక్,రీజనింగ్ లాంటివేవీ లేని స్వప్నావస్థలో ఈ భూమిమీద దారితప్పి తిరుగాడుతున్న పసిపిల్లల్లా కనిపిస్తారు..కానీ నిశితంగా గమనిస్తే వాళ్ళ ముఖాలు అనిర్వచనీయమైన తేజస్సుతో (యుఫోరియా అంటారేమో) వెలిగిపోతూ ఉంటాయి.The language they use – deceptively clear అంటారు కవయిత్రి..వారి లోకంలో ప్రేమ పరిభాష కూడా చాలా స్పష్టమైనదీ,ప్రత్యేకమైనదీను..అంతేనా !! "కనీసం అసూయపడుతున్న స్నేహితులకోసమైనా ఈ జంట కాస్త ఫేక్ డిప్రెషన్ నటించరు కదా" అని హాస్యమాడతారు..ఈ ప్రపంచంతో పని ఏమి నాకు అన్న తీరుగా తమదైన ప్రపంచంలో ఉన్న అటువంటి ఇద్దరు వ్యక్తులనుండి ఈ ప్రపంచం పొందేదేమిటి ? అని సూటిగా ప్రశ్నిస్తారు సింబోర్స్కా..నిజానికి అద్భుతమైన ఆర్ట్ పుట్టినట్లే ప్రేమ కూడా స్వచ్ఛందంగా పుట్టాలి..అకస్మాత్తుగా..అసంకల్పిత చర్యలా..అలా కాని పక్షంలో అనుమానం అఖ్ఖర్లేదు,అది ప్రేమ కాదు.వ్యామోహం మాత్రమే.

కవిత్వం విషయానికొచ్చేసరికి ఎంతమందిని చదివినా చివరకు నాలాంటి సెరిబ్రల్ జీవులైన మేరీ ఆలివర్,సింబోర్స్కా ల దగ్గరకు వచ్చి ఆగడం రివాజైపోయింది.తొలి పరిచయంలోనే నా మనసులోకి సూటిగా వచ్చి తిష్టవేసుకుని కూర్చున్నారు వీళ్ళిద్దరూ.అందులోనూ సున్నితమైన భావోద్వేగాలను కవితలుగా మలచడంలో  సింబోర్స్కాకు ఒక ప్రత్యేకత ఉంది.View with a Grain of Sand చదువుతున్నప్పుడు ఈ కవిత సూటిగా నా హృదయాన్ని తాకింది.

Image Courtesy Google

ప్రేమికులు ఏం కోరుకుంటారు.it had to happen this way – in reward for what?
For nothing. అంటారు విస్లవా..ఎస్ ప్రాక్టికల్ గా ఏమీ కోరుకోరు.ప్రేమించినవాళ్ళు స్వచ్ఛందంగా చూపించే ప్రేమ తప్ప.ఇందులో అనైతికత,అనాగరికతలకు తావులేదు.విశ్వంలో ఒక ప్రాణి మరో ప్రాణితో ఏర్పరుచుకునే ఎమోషనల్ బాండింగ్ (ప్రేమందామా ?) నేరం కాదు.

"మరి అటువంటి జంటను ఆదర్శంగా తీసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి ?" అంటూ తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తారు కవయిత్రి.

"మతం,కవిత్వం ఏమైపోవాలి ? దేన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి ? దేన్ని పరిత్యజించాలి ? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని హద్దుల్లో ఉండాలని ఎవరు కోరుకుంటారు ? "

True Love,నిజానికి ఇది అవసరమేనా ? మన వివేకము,కామన్ సెన్స్,ఈ ప్రేమను ఉన్నత వర్గాల్లో ఒక స్కాండల్ ని దాచినట్లు మనసులోనే దాచేసుకోమంటుంది.వీలైతే ఆ మనసుకి తలుపు మూసి గొళ్ళెం బిగించి తాళం కూడా వేసెయ్యమని సలహా ఇస్తుంది.కానీ నిజానికి ట్రూ లవ్ అనుభవపూర్వకంగా తెలియని వాళ్ళే దాని ఉనికిని ప్రశ్నిస్తారు..కానీ వాళ్ళ నమ్మకం కూడా ఒక విధంగా మంచిదేనంటారు కవయిత్రి. 

ఎందుకంటే "అది వాళ్ళ జీవితాన్నీ,మరణాన్నీ కూడా చాలా సులభతరం చేస్తుంది."

True Love :

True love. Is it normal
is it serious, is it practical?
What does the world get from two people
who exist in a world of their own?

Placed on the same pedestal for no good reason,
drawn randomly from millions but convinced
it had to happen this way – in reward for what?
For nothing.
The light descends from nowhere.
Why on these two and not on others?
Doesn’t this outrage justice? Yes it does.
Doesn’t it disrupt our painstakingly erected principles,
and cast the moral from the peak? Yes on both accounts.

Look at the happy couple.
Couldn’t they at least try to hide it,
fake a little depression for their friends’ sake?
Listen to them laughing – it’s an insult.
The language they use – deceptively clear.
And their little celebrations, rituals,
the elaborate mutual routines –
it’s obviously a plot behind the human race’s back!

It’s hard even to guess how far things might go
if people start to follow their example.
What could religion and poetry count on?
What would be remembered? What renounced?
Who’d want to stay within bounds?

True love. Is it really necessary?
Tact and common sense tell us to pass over it in silence,
like a scandal in Life’s highest circles.
Perfectly good children are born without its help.
It couldn’t populate the planet in a million years,
it comes along so rarely.

Let the people who never find true love
keep saying that there’s no such thing.

Their faith will make it easier for them to live and die.

---- From 'View with a Grain of Sand' - Wisława Szymborska.

Friday, September 11, 2020

Love Thy Critic - Ruskin Bond

'రైటింగ్ ఈజ్ ఎ సోలిటరీ బిజినెస్' అనో 'ఎ రైటర్ షుడ్ బీ రెడ్,నాట్ హర్డ్' అనో ఎంతమంది రచయితలు చెప్పినా రాయడం వెనకున్న అర్థం పరమార్థం కొందరు రచయితలకు బోథపడుతున్నట్లు అనిపించదు..ఒకప్పుడు ఇండియా టుడే లో రస్కిన్ బాండ్ తన పుస్తకం గురించి ఒక ఘోరమైన పదజాలంతో కూడిన విమర్శ చదివారట. 1937 లో హెమ్మింగ్వే కు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఆయనేం చేశారో గుర్తు తెచ్చుకున్నారట..మాక్స్ ఈస్టమన్ అనే విమర్శకుడు హెమ్మింగ్వే 'డెత్ ఇన్ ది ఆఫ్టర్నూన్' ను సమీక్షిస్తూ అందులో హెమ్మింగ్వే మగతనాన్ని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా ఆ పుస్తకానికి 'బుల్ ఇన్ ది ఆఫ్టర్నూన్' అని పేరు పెట్టారట..ఆ తరువాత ఒక సందర్భంలో హెమ్మింగ్వే కు మాక్స్ ఈస్టమన్ తారసపడినప్పుడు మాక్స్ తలమీద పుస్తకంతో ఒక్కటి బాది,ఆయనను మట్టికరిపించారట..కానీ ఇప్పుడు రస్కిన్ విషయంలో చిక్కేమిటంటే ఆయన విమర్శకురాలు ఒక స్త్రీ.."ఆమెతో కుస్తీకి దిగితే ఖచ్చితంగా నేను ఓడిపోతానని తెలుసు" అని చమత్కరిస్తారు రస్కిన్..ఇక్కడ రచయితలకు రెండే రెండు మార్గాలు,పాఠకుల విమర్శను పట్టించుకోకుండా తమ సృజనాత్మక శక్తిని తమ రచనలపై పెట్టి తమ పని తాము చేసుకోవడం,లేదా వారితో పబ్లిక్ గా మల్లయుద్ధానికి దిగడం.

Image Courtesy Google

ఒక్కోసారి పరువూ,మర్యాదలకు భంగం కలిగిస్తూనో,నిజమైన టాలెంట్ ను కూడా చిన్నచూపు చూసే రీతిలోనో విమర్శకులకూ,రచయితలకూ మధ్య చాలా అభ్యంతరకరమైన రీతిలో వాగ్వివాదాలు జరుగుతాయి..అందులోనూ చాలా దిగజారుడు స్థాయి విమర్శకులు మాత్రమే రచయితల రచనలను గూర్చి కాకుండా వారిపై వ్యక్తిగతమైన దూషణలకు దిగుతారు..ఇది కేవలం అసూయనో,దుర్భుద్ధితోనో చేసేపని కాకా మరొకటి కాదంటారు రస్కిన్.

రచయితలపై కొన్ని తీవ్ర విమర్శలు చేసిన విమర్శకులను గురించి ప్రస్తావిస్తూ,

* Thomas Carlyle called Emerson ‘a hoary-headed and toothless baboon’ and wrote of Charles Lamb: ‘a more pitiful, rickety, gasping, staggering Tomfool I do not know.’ కానీ మనం ఎమెర్సన్ నీ,లాంబ్ నీ చదువుతాం గానీ కార్లైల్ ని ఎవరు చదువుతారు ??

* Of Walt Whitman, one reviewer said: ‘Whitman is as unacquainted with art as a hog is with mathematics.’ 

* Swift was accused of having ‘a diseased mind’ and Henry James was called an ‘idiot and a Boston idiot to boot, than which there is nothing lower in the world’. 

*Their critics have long been forgotten, but just occasionally an author turns critic with equal virulence. There was the classic Dorothy Parker review which read: ‘This is not a novel to be tossed aside lightly. It should be thrown with great force.

* Macaulay sneered at Wordsworth’s ‘crazy mystical metaphysics, the endless wilderness of dull, flat, prosaic twaddle’, 

ఇలాంటి అనేకమంది ప్రముఖ రచయితల గురించి రాస్తూ,ఇంతవరకూ షేక్స్పియర్ ను మించి ఎవరూ విమర్శింపబడలేదు అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Hamlet was described by Voltaire as ‘the work of a drunken savage’, and Pepys said A Midsummer Night’s Dream was ‘the most insipid, ridiculous play that I ever saw in my life’.

కానీ ఇక్కడ గ్రహించిన విషయం ఏమిటంటే ఆర్ట్ విషయంలో మహామహులు కూడా విమర్శలకు అతీతులు కాదు అని..ఇంతకుమునుపు చాలా వ్యాసాల్లో ప్రస్తావించినట్లుగానే వ్యక్తిగత విమర్శ కానంత వరకూ ఒక రచన గురించిన విమర్శను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నవారే రచనావ్యాసంగం జోలికి వెళ్తే మంచిది..ఎందుకంటే ఒకటి,పాఠకుల ఊహాత్మకతను అదుపు చేసే అవకాశం రచయితకు లేదు గనుక..రెండు,తమ రచన ఉత్తమమైనదని ప్రతీ పాఠకుడినీ ఒప్పించడం రచయితకు సాధ్యం కాదు గనుక.

కానీ రచయితలు ఈ తిరస్కారాల్నీ,విమర్శల్నీ తీసుకోవాలా అనే ప్రశ్న వస్తే రాజకీయనాయకులకూ,స్పోర్ట్స్ పర్సన్స్ కీ,నటులకీ తప్పనప్పుడు రచయితలే విధంగా మినహాయింపు అంటారు రస్కిన్.

As E.M. Forster once said: ‘No author has the right to whine. He was not obliged to be an author. He invited publicity, and he must take the publicity that comes along Of course, some reviewers do go a little too far, like the one who once referred to ‘that well-known typist Harold Robbins’.

రచనావ్యాసంగాన్ని జీవనోపాధిగా చేసుకోవడాన్ని యుద్దరంగంలో నిరాయుధులుగా ఉండడంతో సరిసమానంగా అభివర్ణిస్తూ, అప్పుడప్పుడూ కొంతమంది అపరిచిత వ్యక్తులు తారసపడి "మీరు మంచి రచయితేనా ? " అని అడిగినప్పుడు ఏమి చెప్పాలో పాలుపోక దిక్కులు చూస్తానంటారు రస్కిన్ బాండ్ :) 

ఇక విమర్శ విషయానికొద్దాం..విమర్శకు కొలమానాలేమిటి ? పెద్ద గీతా చిన్న గీతా తరహాలో ఒక రచన నాణ్యత తెలియాలంటే దానిని మిగతా రచనలతో పోల్చి చూడడం తప్పనిసరి..ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది..మన సాహిత్యం గొప్పదా ? పరాయి సాహిత్యం గొప్పదా ? మన బావిలో నీళ్ళ పరిమాణం అంచనా వెయ్యాలంటే మరో బావిని పరిశీలించాలి లేదా బావి బయట తలపెట్టి సముద్రాన్నో,నదినో,అదీ కాకపోతే ఒక చెరువునో చూస్తేనే మన నీళ్ళ పరిమాణం,నాణ్యత లాంటివి అవగతమవుతాయి..మనదంతా ఉత్తమ సాహిత్యం పరాయిదంతా వట్టి పైత్యం అనుకుంటూ తమ బావిని దాటి బయటకు వెళ్ళే అలవాటులేని విమర్శకులు (?) ,సాహిత్యకారులు (?) చేసే తీర్మానాలు ఉత్త కాలక్షేపం కబుర్లుగా కొట్టిపారెయ్యవచ్చు..వాటికి అంతకు మించిన విలువను ఆపాదించడం అనవసరం..చందమామ అంటే వల్లమాలిన ఇష్టం ఉన్నా,చలం,విశ్వనాథల మీద అభిమానం ఉన్నా జీవితమంతా కేవలం చందమామ గుణగణాలను భట్రాజు బృందంలా పొగుడుకుంటూ బ్రతికెయ్యడం 'అసలుసిసలు' పాఠకులూ,సాహితీ అభిలాష ఉన్నవారూ,సాహితీ వేత్తలూ  చెయ్యరు..అక్కడే ఆగిపోకుండా 'వాట్ నెక్స్ట్ ?' అని ఆసక్తిగా చుట్టూ చూస్తారు..నాలుగుపుస్తకాలు చదవగానే,రాయగానే విమర్శకులూ,రచయితలూ అయిపోయామనుకున్న భ్రమలో తాము తయారుచేసుకున్న కోటరీల కరతాళ ధ్వనులమధ్య మరో శబ్దం చెవులకు వినిపించనంత మైకంలో మైమరిచిపోయిన రచయితలు దీర్ఘకాలికంగా గుర్తుండిపోయే రచనలు చేసే సృజనకారులు ఎంతమాత్రం కాలేరు,ఇక ఏబీసీడీలు నేర్చుకోగానే మన చదువు పూర్తైపోయిందనుకునే పాఠకుల గురించి మాట్లాడుకోనవసరం అసలే లేదు..సాహితీమథనానికి ఆకాశమే హద్దు..ఎన్ని చదివినా,ఎంత రాసినా ఇంకా మన అజ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తూ ఏదో మిగిలిపోయిందనే స్పృహ పాఠకుడినో,రచయితనో ముందుకు నడిపించాలి..తమ ఊహాత్మకతను,ఆర్టిస్టిక్ మ్యూజ్ నూ నిరంతరం విమర్శకులకు ధీటైన జవాబిచ్చే క్రమంలో తాకట్టు పెట్టుకోవడం సృజనకారులు విషయంలో వృథాప్రయాస తప్ప మరొకటి కాదు..ఇది ఎలా ఉంటుందంటే పాఠకుడికి మన రచనను చదివి ఏమి ఆలోచించాలో,ఏమి ఊహించుకోవాలో మన దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించే ప్రయత్నం చెయ్యడంలా ఉంటుంది..సిగిస్మండ్ క్రిఝిజానోవ్స్కీ,ఫెర్నాండో పెస్సోవా లాంటి దిగ్గజాలే తమ రచనలకు వారి కాలంలో సరైన ఆదరణ లేక అనామకులుగా జీవించి ఈ లోకం నుండి నిష్క్రమించారు..ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళలో వారి రచనలు వెలుగుచూశాయి,కాలపరీక్షకు ఎదురీది నిలిచి ఇప్పటికీ పాఠకుల నీరాజనాలందుకుంటున్నాయి..అదేమీ కాదు మా శ్రమకు తగ్గ ఫలం,ఫలితం దక్కనప్పుడు మేమెందుకు రచనలు చెయ్యాలి అంటారా ? అయితే మీరు మరో వ్యాపకం చూసుకుంటే మంచిదండీ...Art is definitely not for you.

Friday, August 28, 2020

Michel Foucault on Freedom - Michel Foucault : Key Concepts by Dianna Taylor (Editor)

ఈ 'స్వేఛ్చ' అనే రెండక్షరాల పదం చూడ్డానికి కనిపించింత సరళంగా జీవితానికి అన్వయించుకునే సమయంలో అనిపించదు..అసలీ స్వేచ్ఛకు నిర్వచనం ఏమిటి ? స్వేఛ్చ శరీరానికి సంబంధించిందా లేదా మానసికమైనదా ? అనే ప్రశ్నలు అనేక సందర్భాల్లో తలెత్తుతాయి..సహజంగా మన దృష్టిలో స్వేచ్ఛ రెండు రకాలు..ఒకటి వ్యక్తిగతమైతే,రెండు సామజికమైనది..కానీ సంఘజీవిగా సమూహాల్లో కొనసాగడం అనివార్యమైన మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ,సామజిక స్వేచ్ఛ మీద ఆధారపడి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది..ఫిలాసఫర్స్ సహజంగా ఈ స్వేచ్ఛను మెటాఫిజికల్,పొలిటికల్ అనే రెండు కోణాల్లో చూస్తారు..కానీ Michel Foucault దృష్టిలో స్వేఛ్చకు మరో మూడో పార్శ్వం కూడా ఉంది..ఆయన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను సమర్ధించలేదు,అలాగే దాన్ని తిరస్కరించనూలేదంటారు..ఆయన స్వేఛ్ఛను నిర్వచించే క్రమంలో ఎన్నుకున్న కాన్వాస్ చాలా పెద్దదీ,చారిత్రకమైనదీను.."After all,what would be knowledgeable-ness and not,in one way or another and to the extent possible,in the knower's straying afield of himself "? అంటారు Foucault.

Image Courtesy Google
మెటాఫిజికల్ ఫ్రీడమ్ విషయానికొస్తే మెదడు శరీరాన్ని అదుపు చేస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే..ఆ విధంగా చూస్తే సోంటాగ్ అన్నట్లు మానసిక స్వేఛ్చ(ఫ్రీ విల్) శారీరక స్వేఛ్చకు దారితీస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి ? దీనిని లోతుగా అర్థం చేసుకోడానికి కొన్ని వాదాలను తెరపైకి తీసుకొచ్చారు రచయిత..వాటిల్లో మొదటిది 'డాక్ట్రిన్ ఆఫ్ డిటెర్మినేషన్'..మన ఆలోచనలూ,కర్మలూ మన అదుపాజ్ఞల్లో ఉండవని చెప్తుంది డిటెర్మినిజం (నిర్ణయాత్మకత)..మనం చేసే పనులన్నింటికీ మూలాలు వెతికితే అవి మన consciousness పరిథికి ఆవల వాస్తవిక ప్రపంచంలో వ్రేళ్ళూనుకుని ఉంటాయంటారు..అదే విధంగా 'జెనెటిక్ డిటెర్మినిస్టులు' మన వ్యవహారశైలి,విషయాల పట్ల మనం స్పందించే తీరు మన జీన్స్ లో ముందుగానే కోడింగ్ చెయ్యబడి ఉందని ప్రతిపాదిస్తారు..అదే కాల్వనిస్టులు (జాన్ కాల్విన్) దీనిని ఒక మతపరమైన కోణంలో చూస్తారు..దేవుని చేతిలో అంతా ముందే లిఖితమై విధి పేరిట ప్రతి కర్మా నిర్ణయింపబడిందని వీరి నమ్మకం..మనం దేవుని చేతిలో కేవలం కీలు బొమ్మలమని వీరి భావన..ఇక ప్రవర్తనావాదులు మన వ్యక్తిత్వం మనమున్న పరిసరాలను బట్టి రూపుదిద్దుకుంటుందని అంటారు..మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి-చెడులు మనల్ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైన ఈ వాదాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే,జీవితంలో ఏ ఒక్క విషయం,సందర్భం మన అదుపులో లేదన్న చేదు నిజం ఈ వాదాలన్నిటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుందని (బాహ్య ప్రపంచంతో సంబంధంలేని అంతఃప్రపంచం ఉంటుందని) నమ్మేవాళ్ళు ఈ వాదనను ఖండిస్తారు..ఇకపోతే నిర్ణయాధికారం,జడ్జిమెంట్ లనేవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి కొలమానాలుగా ఆలివర్ సాక్స్ పరిగణించినట్లు,మానసిక సంతులనం కోల్పోయినవారు తప్ప మిగతా వాళ్ళకి తమ ఆలోచనల పట్ల,నిర్ణయాలపట్ల కాస్తో కూస్తో అదుపు ఉండే తీరుతుంది..అదే విధంగా పొలిటికల్ ఫ్రీడమ్ బాహ్యప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వేషభాషలు,కులమతాలు,హక్కులూ,అధికారాలు మొదలగు సాంస్కృతికపరమైన అన్ని అంశాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది..One could be metaphysically free without any type of political liberty అనుకుంటే సాధారణ వ్యక్తుల కంటే ఆర్టిస్టులకు ఈ మెటాఫిజికల్ ఫ్రీడమ్ గురించిన అవగాహన కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది.

నిజానికి పొలిటికల్ ఫ్రీడమ్ లా కాకుండా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది,కానీ ఈ తరహా స్వేచ్ఛ ఉంటుందనే గ్రహింపు మాత్రం అందరికీ ఉండకపోవచ్చు..ఇదంతా చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.

* పొలిటికల్ ఫ్రీడమ్ తో సంబంధం లేని పక్షంలో,బాహ్య ప్రపంచపు హద్దులు,వత్తిళ్ళు,నియమాలూ లేని మనుషులు మెటాఫిజికల్ ఫ్రీడమ్ తో సర్వస్వతంత్రులు అవుతారా అంటే పూర్తి స్వేఛ్ఛను అనుభవించగలరా ?
* స్వేఛ్చ విషయంలో మనిషి ఎవరితో సంఘర్షిస్తాడు ?
* మనం చెయ్యాలనుకున్నది చెయ్యగలగడం స్వేఛ్ఛా ? లేక చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఉండడం స్వేఛ్ఛా ? వీటిపై మొరాలిటీ ప్రభావం ఏమిటి ?

అన్ని అడ్డంకులూ దాటుకుంటూ,బంధాలు తెంచుకుని తనకు నచ్చిన విధంగా జీవితాన్ని స్వేఛ్ఛగా బ్రతకాలనుకునే క్రమంలో మనిషి చేసే తొలి యుధ్ధం బహుశా తనతోనే..ఒక్కోసారి మెదడు చెయ్యమని ప్రోత్సహించిన పనిని consciousness (స్పృహ ? లేక ఆత్మ ?) వద్దని వారిస్తుంది..మెదడు జడ్జిమెంట్ తప్పైనా మానవ సహజమైన నైతిక విలువలతో కూడిన స్పృహ జడ్జిమెంట్ ఎప్పుడూ కరక్టే..పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నా లేకపోయినా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అనుభవించడానికి కూడా అడుగడుక్కీ ఎంతో కొంత సంఘర్షణ తప్పనిసరి..ముఖ్యంగా ఆ సంఘర్షణ మనతోనే మొదలయినప్పుడు,ఆలోచనా మాత్రంగానే అయినప్పటికీ పూర్తి స్థాయి స్వేఛ్చను అనుభవించడం అసంభవమనిపిస్తుంది.
Todd May : Image Courtesy Google
ఇక Foucault సిద్ధాంతానికొస్తే ఆయన ప్రశ్న ఎప్పుడూ "మనం స్వేఛ్ఛా జీవులమా ?" అని కాకుండా "చరిత్ర మన స్వేఛ్ఛను ఏ విధంగా శాసిస్తోంది ? ఈ విషయమై మనం ఏ చర్యలు తీసుకోగలం ?" అనే దిశగానే సాగాయంటారు ఈ వ్యాసాన్ని రాసిన రచయిత Todd May..మనకి ఏం ఆలోచించాలో,ఎలా ఆలోచించాలో చెప్పకుండా ఈ రెండవ ప్రశ్నకు సంబంధించి అన్ని చారిత్రక కోణాల్లోనూ విశ్లేషణలు మాత్రం చేశారు Foucault...ఈ విషయమై
There is an optimism that consists in saying that things couldn’t be better. My optimism would consist in saying that so many things can be changed, fragile as they are, more arbitrary than self-evident, more a matter of complex, but temporary, historical circumstances than with inevitable anthropological constraints.అని రాస్తారు.

ఈ విషయమై Foucault రచన 'డిసిప్లిన్ అండ్ పనిష్' ను ప్రస్తావించారు Todd ..ఆ పుస్తకంలో,క్యాపిటలిజం సమాజాన్ని శాసిస్తున్న తరుణంలో పాలకవర్గాలు మన స్వేఛ్ఛను హరిస్తున్నాయి అనేకంటే,అవి మనల్ని కొన్ని నిర్ణీత వర్గాలుగా విభజించి నిరంతరం మన ఆలోచనల్ని అదుపు చేస్తున్నాయని  (psychological monitoring and intervention) అంటారు Foucault..ఇలా తయారైన సమాజంలో ప్రజల్ని Docile Bodies (Foucault argues that individuals are under constant surveillance and regulation in ways that are often subtle and thereby seemingly invisible, leading to normalization and acceptance of such systems) గా అభివర్ణిస్తారు..ఈ విధంగా రూపుదిద్దుకున్న సమాజంలో ప్రజలు తమను తాము 'సైకలాజికల్ బీయింగ్స్' గా మాత్రమే భావిస్తున్నారంటారు..తత్ఫలితంగా తమ బాధలకు కారణం సమాజపు తీరుతెన్నుల్లో ఉన్న లోపమనో,సామజిక వైఫల్యమనో గ్రహించి దాన్ని ప్రశ్నించకుండా,తమ బాధలన్నీ కేవలం మానసికపరమైనవని తీర్మానించుకుని,వాటికి మానసికవైద్యం అవసరమని భ్రమిస్తున్నారనేది Foucault వాదన..నిజానికి స్వేఛ్ఛను ప్రత్యక్షంగా హరించడం కంటే మనుషుల్ని ఈ సైకలాజికల్ బీయింగ్స్ గా మార్చే క్రమంలో వారిని ఒక పథకం ప్రకారం conformity కి గురిచేసి,విభిన్న జీవన విధానాలను అవలంబించకుండా చేసి సమాజానికి ఎదురుతిరగకుండా నిరోధించడం మరింత తేలిక అంటారాయన..దీనికీ స్వేఛ్చకూ సంబంధం ఏమిటంటే,ఇటువంటి పద్ధతులు పరోక్షంగా మన ఆలోచనా విధానాన్ని శాసిస్తూ మనకు తెలీకుండానే మన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను అదుపు చేస్తున్నాయి..ఇటువంటి చారిత్రక అంశాలు మనం ఏం ఆలోచించాలి ? ఎలా ఆలోచించాలి ? అనే నిర్ణయాధికారాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాయి..Foucault స్వేఛ్ఛను సాంఘిక,ఆధ్యాత్మిక కోణాల్లోను,స్వేఛ్చ అమలు పరచడం గురించీ చేసిన విశ్లేషనల గురించి ఇంకో వ్యాసంలో మరింకెప్పుడైనా.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు,

One must observe that there cannot be relations of power unless the subjects are free. If one or the other were completely at the disposition of the other and became his thing, an object on which he can exercise an infinite and unlimited violence, there would not be relations of power. In order to exercise a relation of power, there must be on both sides at least a certain form of liberty

Saturday, August 22, 2020

Experience : Early Writings (1910–1917) - Walter Benjamin

ఈ మధ్య వాల్టర్ బెంజమిన్ ఎర్లీ రైటింగ్స్ లో కొన్ని వ్యాసాలు చదివాను..ఇందులో కొన్ని ఆయన  అంతరంగాన్ని మనకు పరిచయం చేసే వ్యక్తిగతమైన వ్యాసాలు..ఈ అక్షరాల్లో ఒక యువకుడిగా బెంజమిన్ మనకు అత్యంత సన్నిహితమైన సహచరునిలా అనిపిస్తారు..ఒక వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు అతడి భావాలు ఎలా ఉంటాయి ? అతడి కలలూ,కల్పనలూ వాస్తవిక ప్రపంచపు దాడికి గురైనప్పుడు అతడి ఆలోచనలు ఎటువంటి ఎదురుదాడి చేస్తాయి ? బెంజమిన్ దృష్టిలో అనుభవానికి నిర్వచనం ఏమిటి ? 'అనుభవం' వ్యాసానికి నా స్వేఛ్ఛానువాదం.

అనుభవం : 

యవ్వనపుపొంగు దాటి పరిణితి చెందిన వ్యక్తిగా మారిన ప్రతివారూ ముఖానికి అనుభవమనే ముసుగును ధరిస్తారు (కోవిడ్ మాస్క్ కాదన్నమాట :) )..మనిషికి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఈ ముసుగుతో నిత్య సంఘర్షణ పరిపాటి..ఈ ముసుగు అభేద్యమైనది,ఏ విధమైన మార్పూ,వ్యక్తీకరిణా లేనిదీను..అడల్ట్ గా మనం పిలుచుకునే వ్యక్తి,తన జీవితంలో దాదాపు అన్నీ అనుభవించి ఉంటాడు..యవ్వనం,ఆదర్శాలు,ఆశలు,ఆశయాలూ, అమ్మాయిలూ : కానీ చివరకు ఇదంతా ఉత్త భ్రమ అని తేల్చిపారేస్తాడు -- ఇది విని మనం భయానికి లోనవుతాం,ఆ అనుభవాలన్నీ విషతుల్యమని భావిస్తాం..బహుశా ఒకవిధంగా అతడు కరక్టే కావచ్చునేమో..కానీ అతడి వాదనను మనమేవిధంగా ఎదుర్కొంటాం ? "అబ్బే,మేమింకా ఏమీ అనుభవించనిదే !!"

ఆ ముసుగును ఒకసారి తొలగించి చూసే ప్రయత్నం చేద్దాం..నిజానికి ఈ అడల్ట్ తన జీవితంలో ఏమి అనుభవించాడు ? మనకు అసలు ఏం ఋజువు చేద్దామనుకుంటున్నాడు ?  అతడు కూడా ఒకప్పుడు యవ్వనాన్ని అనుభవించి ఉంటాడు,తన మనసుకి నచ్చినదేదో కోరుకునే ఉంటాడు,తల్లితండ్రులు చెప్పినవన్నీ నమ్మకుండా ,ఉట్టి అబద్ధాలని కొట్టిపారేసే ఉంటాడు..కానీ క్రమంగా జీవితం వాళ్ళు చెప్పినవన్నీ నిజమేనని నేర్పించింది..మనతో ఈ మాట అంటూ అతడు గంభీరంగా ఒక సుపీరియర్ ఫ్యాషన్ లో చిరునవ్వు నవ్వుతాడు : ఇదే మీ  విషయంలో కూడా జరుగుతుంది,కావాలంటే చూస్తూ ఉండండి అంటాడు..కానీ ఈలోగా మన పసితనపు చేష్టల్ని అతడు అవహేళన చేస్తాడు..అతడికి వయసుతో బాటుగా వచ్చిన హుందాతనం మనకు కూడా అలవడే వరకూ,మన యవ్వనాన్ని కేవలం చిలిపితనంగా,మన ఆలోచనల్నీ,ఆశయాల్నీ అపరిపక్వతతో కూడిన  చిన్నపిల్లలచేష్టలుగా,విలువలేనివిగా కొట్టిపారేస్తాడు..మరికాస్త ముందువెళ్తే,కొంతమంది ప్రబోధకుల దృష్టిలో యవ్వనానికి అసలు గుర్తింపే ఉండదు : 'అన్నప్రాసనరోజే ఆవకాయపచ్చడి' రీతిలో వీళ్ళు చాలా కఠినంగా తమ అనుభవసారాన్నంతా బోధించి మనల్ని ఉన్నపళంగా ఆ జీవితపు క్రూరత్వపు రొంపిలోకి తోసేసే ప్రయత్నం చేస్తారు..అడుగడుక్కీ రాజీపడే సందర్భాలూ,భావదారిద్య్రములు,భావావేశాల్ని అదుపులో ఉంచే ఉదాసీనత : ఇదే జీవితం,ఇదే మా అనుభవసారమంటారు సదరు పెద్దవాళ్ళు..మనపై ఈ రకమైన దాడి జరిగిన ప్రతిసారీ యవ్వనం అంటే నిత్యం వేసే తప్పటడుగుల్ని సరిదిద్దుకోవడమనో లేక ఈ కాలం నిరర్ధకమైనదనో,క్షణికమైనదనో భావన కలుగుతుంది..కానీ మన జీవితం కూడా చివరకు మరో గొప్ప అనుభవంగా రూపాంతరం చెందుతుంది.

ఈ పెద్దవాళ్ళ అనుభవం అంతే : జీవితం యొక్క నిరర్థకత,కౄరత్వం,ఇంతకుమించి మరొకటి కాదు..ఇటువంటి నిరాశావాదం తప్ప వాళ్ళు ఎప్పుడైనా మనల్ని భవిష్యత్తును మరో క్రొత్త కోణంలో ఆశావహదృక్పథంతో చూడమని ప్రోత్సహించారా ? ఉహూ..ఆ అవకాశం లేదు..ఎందుకంటే అటువంటివి వాళ్ళు కూడా బహుశా అనుభవించి ఉండరు..నిజానికి సత్యం,ధర్మం,జీవన సౌందర్యం ఇవన్నీ సుస్థిరమైనవి,మరి వీటన్నిటి మధ్యా అనుభవం ప్రాముఖ్యత ఏమిటి ? - అసలు రహస్యం ఇక్కడే ఉంది..మేథోసంబంధమైన ,అర్థవంతమైన విషయాలపై దృష్టిసారించని ఫిలిస్టిన్ కేవలం అనుభవప్రధానంగా జీవిస్తాడు..అతడి దృష్టిలో 'అనుభవం' జీవితపు సాధారణ తత్వానికి ఒక అనుమతిపత్రం  లాంటిది..నిజానికి ఈ అనుభవానికి ఆవలవైపు మనం నిర్వర్తించవలసిన విలువలనేవి ఉంటాయని అతడు కనీసం గ్రహించడు..బహుశా అనుభవం తప్ప మరొకటి తెలీని కారణంగానే అతడికి జీవితం నిత్యం అశాంతిగా,నిరర్థకంగా  అనిపిస్తుంది..అనుభవసారాన్ని భద్రపరుచుకున్న అతడి మనస్సును మినహాయిస్తే అతడి ఉనికి దాదాపూ శూన్యం..సాధారణ జీవితానికి సంబంధించి దైనందిన విషయవిశేషాలపై తప్ప అతడు వేరే ఏ ఒక్క విషయంతోనూ కూడా ఏ రకమైన ఆంతరంగిక సంబంధాన్నీ కలిగి ఉండడు.

కానీ అనుభవం మనకు ఇవ్వలేనిదీ,మన దగ్గర నుంచి తీసుకోలేనిదీ ఒకటుంటుంది : మునుపటి ఆలోచనలన్నీ భ్రమలైనప్పటికీ చివరకు మిగిలే సత్యం..లేదా ఎవరూ పాటించనప్పటికీ కేవలం మన సంకల్పబలం చేత నిలబెట్టుకునే విశ్వనీయత..ఏదేమైనా మన పెద్దవాళ్ళు అలసిపోయిన హావభావాలతో కూడిన ఒక సుపీరియర్ నిస్సహాయతతో ఒక్క విషయంలో మాత్రం నిజం చెప్తారు : మనం అనుభవించినదంతా దుఃఖపూరితమైనది,మనం అనుభవించలేనిది మాత్రమే శక్తివంతమైనదీ,అర్థవంతమైనదీ అనీను (?)..అప్పుడు మాత్రమే ఆత్మ పరిపూర్ణమైన స్వేఛ్చననుభవిస్తుంది..అయినప్పటికీ జీవితం దాన్ని కాలుపట్టి క్రిందకి లాగుతూనే ఉంటుంది,ఎందుకంటే జీవితం యొక్క అనుభవసారం అశాంతి మాత్రమేనని తేల్చేస్తారు.

ఏదేమైనా మనమిలాంటి విషయాలు ఇకపై అర్థంచేసుకోలేము..కానీ సోమరితనంతో కూడిన అహంకారంతో నిరాసక్తిగా,నిదానంగా ఆత్మ గురించిన అవగాహన బొత్తిగా లేనివాళ్ళ జీవితాన్నే మనం కూడా జీవిస్తున్నామా ? కాదేమో..ప్రతీ జీవితానుభవమూ ప్రత్యేకమైనది..మనం మన ఆంతరంగిక ప్రపంచపు సౌందర్యం (ఆత్మసౌందర్యం) తో అనుభవానికి ఒక ప్రత్యేకతను  ఆపాదిస్తాము - కానీ సరైన ఆలోచనలేనివాడు తన జీవితంలోకి పొరపాట్లను ఆహ్వానిస్తాడు..మనలాంటి సత్యశోధకులతో "నీవెప్పటికీ సత్యం అంటే ఏమిటో తెలుసుకోలేవు,అది నా స్వానుభవం " అంటాడు..ఏదేమైనా శోధకులకు ఈ పొరపాట్లనేవి సత్యానికి చేరుకోడానికి ఒక ఊతం లాంటివి..కేవలం ఆత్మ ఉనికిని పరిత్యజించిన వారికి మాత్రమే అనుభవం నిరర్థకమైనదిగా అనిపిస్తుంది..నిరంతరం ప్రయత్నించేవాడికి అనుభవం బాధాకరంగా పరిణమించినప్పటికీ అతడిని నిరాశవైపు ఖచ్చితంగా మళ్ళించదు.

అటువంటి శోధకుడు నిస్సందేహంగా ఫిలిస్టిన్ భావజాలపు మాయలో పడి ఓటమిని అంగీకరించడు..కానీ ఫిలిస్టిన్ మాత్రం నిరంతరం అర్థరహితమైనదానిలో మాత్రమే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు..ఆత్మలేదని తనని తాను నమ్మించుకుంటూ,తాను ప్రయాణించే మార్గం మాత్రమే సరైనదని భావిస్తాడు..కానీ విచిత్రమేమిటంటే అతడి కంటే ఎక్కువ ఖచ్చితమైన స్వాధీనతనూ,గౌరవాన్నీ వేరెవ్వరూ ఆశించరు..ఎందుకంటే విమర్శించాలంటే సృజించడం కూడా తెలియాలి..కానీ అది అతడికి చేతకాదు..బహుశా ఈ కారణంగానే అతడి సంకల్పానికి విరుద్ధంగా జరిగే ఆత్మానుభవం కూడా అతడికి ఆత్మవిహీనంగా,డొల్లతనంగా అనిపిస్తుంది.

Tell him
He should honor the dreams of his youth
When he becomes a man.

ఫిలిస్టిన్ యవ్వనప్రాయపు స్వప్నాలను తీవ్రంగా ద్వేషిస్తాడు..ఈ ద్వేషానికి అతడు తరచూ సెంటిమెంటాలిటీ రంగునద్దే ప్రయత్నం కూడా చేస్తాడు..ఎందుకంటే ఈ స్వప్నాలు అతణ్ణి భయపెడతాయి,నిద్రలో ఉలిక్కిపడేలా చేస్తాయి..యవ్వనంలో అందరికీ వినపడే ఆ స్వప్నాల్లోని ఆత్మఘోష అతణ్ణి కూడా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది..అందుకే అతడు దానితో నిత్యం సంఘర్షిస్తూ ఉంటాడు..తనకు ఊపిరాడకుండా చేసిన ఆ అనుభవాన్ని యువతకు చెపుతూ,వాళ్ళకు తమను చూసి తాము నవ్వుకోవడం ఎలాగో నేర్పిస్తాడు..నిజానికి  ఆత్మహీనమైన అనుభవం నిరాశాజనకమైనదే కాదు,చాలా సౌకర్యవంతమైనది కూడా.

ఇది కాకుండా మనకు మరొక అనుభవం గురించి కూడా తెలుసు..పరిణితిలేని వయసులో ఆత్మ గురించిన గ్రహింపులేని అనుభవం ఎన్నో కలల్ని మొగ్గతొడుగుతున్న దశలోనే నాశనం చేస్తుంది,అయినప్పటికీ దీనిలో కూడా ఒక రకమైన సహజత్వం ఉంది..ఇది చాలా స్వఛ్ఛమైనది,ఏదీ స్పృశించ సాధ్యం కానిదీ,సత్వరమైనదీను..ఎందుకంటే మనం యవ్వన ప్రాయంలో ఉన్నంతవరకూ యేది చేసినా ఆత్మసహేతుకంగానే చేస్తాం..Always one experiences only oneself,as Zarathustra says at the end of his wanderings..ఫిలిస్టిన్ కు కూడా తన అనుభవం తనకుంటుంది ; దానిని ఆత్మవిహీనమైన గొప్ప అనుభవంగా చూడవచ్చు..కానీ యవ్వనం ఆత్మసహేతుకంగా శ్వాసిస్తుంది..తాను అడుగుపెట్టిన ప్రతిచోటులోనూ,ప్రతి మనిషిలోనూ  ఆత్మను చూడగలిగినవాడు పెద్ద ప్రయత్నమేమీ చెయ్యకుండానే గొప్పవాటిని సాధించగలడు - అతడు అడల్ట్ గా మారగానే అతడి యవ్వనం అతడిలో కారుణ్యంగా స్థిరపడుతుంది..దీనికి విరుద్ధంగా ఫిలిస్టిన్ మాత్రం తీవ్రమైన అసహనంతో మిగిలిపోతాడు.

Friday, May 15, 2020

Roland Barthes on Feminism

Image Courtesy Google
మనకి ఖాళీల్ని పూరించడం ఇష్టం..కప్ బోర్డులను బట్టలతోనూ,ఖాళీ గదుల్ని వస్తువులతోనూ,మెదడుని సమాచారంతోనూ,జీవితాన్ని మనుషులతోనూ  నింపుకోవడం ఇష్టం...ఏదీ ఖాళీగా ఉండకూడదు,ఖాళీలు భయపెడతాయి..మనం జన్మతః ఒంటరివాళ్ళమని ఓరకంట చూస్తూ గేలి చేస్తాయి..ఆ ఖాళీలను పూరించి తీరాలి.ఆ దిశగా చదువు,ఉద్యోగం,వివాహం,సంతానం,రిటైర్మెంట్ లాంటివన్నీ నలుగురితో పాటు అదే వరుసలో పాటించిన మనిషి సమాజంలో గౌరవస్థానంలో ఉంచబడతాడు..కానీ ఇవన్నీ మనిషికి ఆహారనిద్రా మైథునాల్లా కనీసావసరాలా ? ప్రాచీన కాలంనుండీ విభిన్న సంస్కృతుల పరిణామక్రమంలో సంఘజీవిగా మనిషి సౌకర్యార్థం 'ఏవయసుకా ముచ్చట' ప్రాతిపదికన ఈ క్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటారు..కానీ కాలం గడుస్తున్నా ఈ క్రమంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు..జనాభా పెరుగుదలకూ,ప్రకృతి వనరులకూ మధ్య త్వరితగతిని మారుతున్న నిష్పత్తుల్లో భూమ్యాకాశాల సామ్యం కనిపిస్తునప్పుడు కూడా ఇంకా పెళ్ళి కాలేదా,పిల్లలు లేరా వంటి ఛాందసత్వాలు మాత్రం పోవడం లేదు..స్త్రీ శరీరం సంతానోత్పత్తికి అనువుగా ఉన్నంత మాత్రాన సంతానం ఉత్పత్తి చెయ్యాలా ? ఈ విషయంలో ఆమెకు నిర్ణయాధికారం లేదా ? ఈ ప్రశ్నల్ని సాహిత్యానికీ,ఫెమినిజానికీ ముడిపెడుతూ రోలాండ్ బార్త్ మైథాలజీస్ లో 'నోవెల్స్ అండ్ చిల్డ్రన్' అనే ఒక వ్యాసం రాశారు..ఇది చదువుతున్నప్పుడు దీని గురించి ప్రత్యేకించి ఒక నోట్ రాయాలనుకున్నాను.

ఇక్కడ మనిషి తన సౌకర్యార్ధం ఏర్పాటు చేసుకున్నక్రమాన్ని విమర్శించడం,లేదా అది సరికాదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు..నలుగురూ పాటించే క్రమాన్ని పాటించాలా వద్దా అనే విషయంలో ప్రతీ మనిషికి సంపూర్ణ నిర్ణయాధికారం ఉండాలి అని మాత్రం అనుకుంటాను.

ఇక వ్యాసంలోకి వస్తే,ఇది బార్త్ ఫెమినిస్ట్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది..ఒకసారి ఫ్రాన్స్ లో వెలువడే Elle అనే పత్రిక డెబ్భై మంది రచయిత్రులను ఒకే ఫ్రేములో బంధించిన ఫోటోను ప్రచురించిందట..మంచిదే..కానీ ఆ పత్రికలో రచయిత్రులను ఈ విధంగా వర్గీకరిస్తూ పరిచయం చేశారట.

Jacqueline Lenoir (two daughters, one novel); Marina Grey (one son, one novel); Nicole Dutreil (two sons, four novels), etc.

అసలేమిటిది ? దీనికి అర్థమేమిటి ?
"రైటింగ్ ను ఒక సాహసోపేతమైన వృత్తిగా రైటర్ ని కాస్తో కూస్తో బొహేమియనిజానికి అర్హుడుగా భావిస్తారు..రచయిత అన్నివిధాలా స్వతంత్రుడు,'రైట్ టు ఇండివిడ్యువాలిటీ' కి చిరునామాలాంటివాడు..అతడి వృత్తి రచయితగా సంఘంలో గౌరవంతో పాటు జీవనోపాధిని కూడా అందిస్తుంది..కానీ ఈ నియమాలన్నీ మగవారికే వర్తిస్తాయి..రచయిత్రులు పొరపాటున కూడా స్త్రీ ప్రప్రథమంగా చెయ్యాల్సిన డ్యూటీ (submitted to the eternal statute of womanhood),అనగా మాతృత్వానికి న్యాయం చెయ్యకుండా ఆ ఆర్టిస్టుల నియమావళిని తమకు అనుకూలంగా భావించకూడదు..నిజానికి స్త్రీలు ఈ భూమి మీద సృష్టించబడిందే పురుషులకు సంతానాన్ని కని ఇవ్వడానికి ; వాళ్ళు ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు,వాళ్ళ పరిస్థితుల్ని ఎంత కావాలంటే అంత సుందరమయంగా తీర్చిదిద్దుకోవచ్చు,కానీ వాళ్ళ స్త్రీ అస్తిత్వపు సహజస్థితికి దూరంగా జరగడం మాత్రం నిషిద్ధం..అన్నిటినీ మించి రచయిత్రిగా వారి ఆర్టిస్టు హోదా వారికి ఆపాదించిన బైబిలికల్ ఫేట్ ను భంగపరిచేదిగా ఉండకూడదు..అందువల్ల వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏమిటంటే,వెనువెంటనే వాళ్ళు 'మదర్ హుడ్' కి ట్రిబ్యూట్ ఇస్తూ తమను తాము రుజువు చేసుకోవాలి."
"మీ స్త్రీమూర్తులు స్వతహాగా ధైర్యవంతులు,స్వతంత్రులు,పురుషులతో సమానంగా అన్ని పనులూ చెయ్యగలరు,రాయడంతో సహా ; కానీ పురుషులకంటే ఒకడుగు ముందుకు వెళ్ళిపోయి మాత్రం కాదు ; వారి కనుసన్నలలో మెలుగుతూ,మీరు రాసే పుస్తకాలను మీ పిల్లలతో భర్తీ చెయ్యాలి ; కొంతకాలం సాధికారత స్వతంత్రత అనుభవించవచ్చు,తప్పేమీ లేదు..కానీ మళ్ళీ వెనుదిరిగి మీకు కేటాయించిన స్థానంలోకి మీరు వచ్చెయ్యాలి..ఒక నవల,ఒక సంతానం,కాస్త ఫెమినిజం,మరికాస్త దాంపత్యం..ఇదీ మీ క్రమం." 
"మీ రచయిత్రుల ఆర్టిస్టిక్ మ్యూజ్ ని తీసుకొచ్చి బలమైన కుటుంబ వ్యవస్థ దూలాలకు వ్రేళ్ళాడదీద్దాం..నిజానికి ఈ కాంబినేషన్ వలన రెండువైపులా ప్రయోజనం చేకూరుతుంది..ఇటువంటి మిథ్యల విషయంలో పరస్పరం సహాయం చేసుకోవడం ఎప్పుడూ లాభదాయకమే."
"For instance, the Muse will give its sublimity to the humble tasks of the home; and in exchange, to thank her for this favour, the myth of child-bearing will lend to the Muse, who sometimes has the reputation of being a little wanton, the guarantee of its respectability, the touching decor of the nursery. "
"ఈ విధంగా Elle పత్రిక పాఠకులకు చెప్పి ఒప్పించాలనుకున్న మిథ్య అందరికీ ఆనందదాయకమే..స్త్రీలు శక్తిస్వరూపిణులుగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి : వాళ్ళకి కూడా పురుషులతోపాటు గొప్ప సృజనాత్మక ప్రపంచంలోకి (సుపీరియర్ స్టేటస్ ఆఫ్ క్రియేషన్) అడుగుపెట్టే హక్కుని కట్టబెట్టాలి..కానీ ఇవన్నీ చూసి మగవారు బెదురుతారేమో,వారిని భయపడొద్దని భరోసా ఇస్తూ భుజం తడదాం ; స్త్రీలు ఎప్పటికీ మీ స్థానాన్ని లాగేసుకోరు,స్త్రీ సహజమైన మాతృత్వానికి దూరం జరగరు."
"Elle nimbly plays a Molièresque scene, says yes on one side and no on the other, and busies herself in displeasing no one; like Don Juan between his two peasant girls, Elle says to women: you are worth just as much as men; and to men: your women will never be anything but women." 
"Man at first seems absent from this double parturition;ఇక ఈ పత్రిక చూసిన మగవారికి పిల్లలూ,నవలలూ ఒకేలా కనిపిస్తారు..తమ ప్రమేయం లేకుండా వాటంతటవే ఏదో అద్భుతంలా సృష్టించబడి భూమ్మీదకి అకస్మాత్తుగా వచ్చేసినట్లు,పూర్తిగా తల్లికి మాత్రమే చెందినట్లు..అందునా డెబ్భై మంది స్త్రీలనూ, వారి పిల్లలనూ,పుస్తకాలనూ కలిపి ఒకే ఫోటో లో చూపించడం వల్ల నిజంగానే అవన్నీ ఒక మిరాకల్ లా సృజనాత్మకత,స్వప్నాల సరిసమాన ఫలితమేమో (the miraculous products of an ideal parthenogenesis ) అనిపించేస్తుంది..కానీ ఈ మొత్తం ఫామిలీ పిక్చర్ లో మగవాడు ఎక్కడ ? "
"Nowhere and everywhere, like the sky, the horizon, an authority which at once determines and limits a condition. Such is the world of Elle: women there are always a homogeneous species, an established body jealous of its privileges, still more enamoured of the burdens that go with them. Man is never inside, femininity is pure, free, powerful; but man is everywhere around, he presses on all sides, he makes everything exist; he is in all eternity the creative absence, that of the Racinian deity: the feminine world of Elle, a world without men, but entirely constituted by the gaze of man, is very exactly that of the gynaeceum. "
"ఈ విధంగా Elle పత్రికలో ప్రతీ భాగంలో ఈ ద్వంద్వ వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..ప్రాచీన గ్రీకు రోమన్ సంస్కృతుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన 'జానీసియం' అనే అంతఃపురాలను కేటాయించేవారు..ఇవన్నీ పురుషుల కనుసన్నలలో మెలుగుతూ స్వతంత్రంగా (?) వ్యవహరిస్తాయి..ఎటొచ్చీ ఆ అంతఃపురాలకు తాళాలు ఉంటాయి..స్త్రీలను వాటిలోపల స్వేచ్ఛగా తిరగమని వదులుతారు..ప్రేమించు,పనిచెయ్యి,రచనలు చెయ్యి,వ్యాపారవేత్తగా మారు,నీ ఇష్టం కానీ ఎప్పుడూ పురుషుడి ఉనికిని గుర్తుపెట్టుకో..నువ్వు అతడిలా సృష్టింపబడలేదని జ్ఞాపకం పెట్టుకో ;ఈ కారణంగా నీ ఉనికి అతడి మీద ఆధారపడుతుందని మరవొద్దు..నీ స్వేచ్ఛ కేవలం ఒక లగ్జరీ,ఆ లగ్జరీ నీకెప్పుడు దక్కుతుందంటే నువ్వు నీ స్త్రీ సహజ ప్రవృత్తిని గుర్తించి,అంగీకరించినప్పుడే..నీకు రాయాలనుంటే రాయి..సాటి మనుషులుగా మేమందరం నిన్ను చూసి గర్వపడతాము,కానీ మరో చేత్తో స్త్రీగా పిల్లలను కనవలసిన నీ విధిని మాత్రం మర్చిపోవద్దు..ఎందుకంటే అదే నీ డెస్టినీ..ఒక jesuitic morality: అందువల్ల నీ మోరల్ రూల్ ఆఫ్ కండిషన్ ను స్వీకరించు..కానీ అది నిలబడిన నమ్మకపు పునాదుల(dogma) విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీపడకు."

Sunday, December 15, 2019

Across Paris and Other Stories - Marcel Aymé

సాహితీ ప్రక్రియల్లో ఫాంటసీని ఒక అత్యుత్తమమైన ప్రక్రియగా పరిగణిస్తారు..ఈ ఫాంటసీని కాఫ్కా,బోర్హెస్ లాంటి వాళ్ళు తమ గంభీరమైన తాత్విక శైలిలో పాఠకులకు అందీ అందని పుల్లని ద్రాక్షగా చేస్తే కాల్వినో,కెరెట్ లాంటి వాళ్ళు కాస్త ఉదారంగా తమ సరళత్వంతో దానిని పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు..ఇక చాలా underrated ఫ్రెంచ్ రచయిత మార్సెల్ ఐమీ మాత్రం ఆ సరళత్వానికి చక్కని హాస్యాన్ని మేళవించి ఫాంటసీని సామాన్యులకు పళ్ళెంలో ఫలాహరంలా విందు చేస్తారు.
Image Courtesy Google
ఐమీ శైలిని గురించి చెప్పాలంటే "Martin the Novelist" అనే కథను మంచి ఉదాహరణగా చెప్పొచ్చు..గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నప్పుడు వరుసగా హీరోలూ,హీరోయిన్లు అనుకున్నవాళ్ళందరూ  చచ్చిపోతుంటే ఆ రచయిత కాస్త బ్రేక్ తీసుకుని కాఫీ తాగొస్తే బావుణ్ణనిపించింది..ఈ కథ చదివినప్పుడు George R. R. Martin అనేకసార్లు గుర్తొచ్చారు..కానీ ఈ కథలో రచయిత పేరు కూడా మార్టిన్ అని పెట్టడం కేవలం యాదృచ్ఛికమేనా అనిపించింది :) రచనా వ్యాసంగంలో రచయితలు పడే ఇబ్బందులు ఈ కథలో ప్రధానాంశం..సమాజానికి అనుగుణంగా తనను మార్చుకోలేకా,తన సృజనాత్మకతను చంపుకోలేకా ఒక నవలాకారుడు మార్టిన్ పడే సంఘర్షణను ఈ కథలో అద్భుతంగా చిత్రించారు..కథ విషయానికొస్తే,ఒకానొకప్పుడు తన రచనల్లో ప్రధాన పాత్రలనూ,ఇతరత్రా చిన్నాచితకా  పాత్రలనూ అలవాటుగా,ఇష్టంగా చంపేసే మార్టిన్ అనే ఒక నవలాకారుడుండేవాడు.అతడు ఎంత ప్రయత్నించినా ఈ పాత్రలను చంపేసే విచిత్రమైన అలవాటు మాత్రం పోయేది కాదు.

కానీ నిజానికి మార్టిన్ చాలా దయగల రచయిత..తన పాత్రలను పండుముసలి వయసు వరకూ సజీవంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా పాత్రల్ని చంపాలనే ప్రేరణ మాత్రం అతడిలో చాలా తీవ్రంగా ఉండేది..ఒకసారి ఒక నవలలో తన హీరోయిన్ ని ఎలా అయినా బ్రతికించుకోడానికి మిగతా పాత్రలన్నింటినీ చంపేస్తాడు..తన తెలివితేటలకు తానే మురిసిపోతూ భుజం తట్టుకుంటుండగా పాపం ఆ పేద హీరోయిన్ థ్రోమ్బోసిస్ (రక్తం గడ్డకట్టుట) అనే వ్యాధితో నవల ముగిసేలోపు కేవలం పదిహేను లైన్ల ముందు ఠపీమని మరణిస్తుంది..ఇక ఇది అయ్యేపని కాదని కూలబడిన మార్టిన్ కు మరో మెరుపులాంటి ఆలోచన వస్తుంది..ఈసారి అతడు తన నవలలో ఐదేళ్ళు దాటని పసిపిల్లలను ప్రధానపాత్రలుగా చేసుకుని కథ రాయడం మొదలుపెడతాడు..కానీ నవల పదిహేనువందల పేజీలకు చేరేసరికి వాళ్ళందరూ Octogenarians (ఎనభయ్యేళ్ళ వారు) గా మారతారు..ఇక ఆ దేవుడు కూడా వాళ్ళని చావకుండా కాపాడలేకపోతాడు..

కానీ ఈ కారణంగా అటు అతడి రచనల్ని ఎంతో ఇష్టంగా చదివే పాఠకులకూ,ఇటు ప్రచురణకర్తలకూ కూడా అతడిపై చాలా కోపంగా ఉండేది..క్రమేపీ మార్టిన్ రచనలకి పాఠకుల కొరత మొదలైంది..మార్టిన్ ఒక రచయితగా తన నిజాయితీని చంపుకోలేక,పేదరికాన్ని ఎదుర్కోలేక నానావస్థలూ పడుతుంటాడు..మార్టిన్ తీరుకి విసిగివేసారిన ప్రచురణకర్త,అతడు రాయబోయే మరో కొత్త కథను గురించి ప్రస్తావించడానికి వచ్చిన మార్టిన్ తో ఏ ముఖ్య పాత్రనూ చంపకుండా ఆ నవలను రాయమనీ,లేకపోతే అతడి నవలను ప్రచురించనని హెచ్చరిస్తూ మాట తీసుకుంటాడు.ఇక మన రచయిత మార్టిన్ గారి కష్టాలు మొదలవుతాయి..కథ పబ్లిషర్ అడిగినట్లు రాస్తే ఒక రచయితగా తన వృత్తికి న్యాయం చెయ్యలేడు..అలాగే తనకు నచ్చినట్లు కథ రాస్తే తన జీవనోపాథి కోల్పోతాడు..ఈ క్లిష్టమైన పరిస్థితిలో మార్టిన్ Alfred Soubiron అనే నలభై ఐదేళ్ళ నీలి కళ్ళ కథానాయకుడి గురించి ఒక కథను రాయడం మొదలుపెడతాడు.ఈ కథా,అందులోని మలుపులూ పాఠకులు చదివి తీరాల్సిందే..ఈ  మధ్యకాలంలో ఒక కథ చదివి ఇంత కడుపుబ్బ నవ్వుకున్నది లేదు..కథలోని పాత్రలు సజీవంగా మార్టిన్ కళ్ళముందు ప్రత్యక్షమవ్వగా రచయితకూ,పాత్రలను మధ్య జరిగే సంవాదం,రచయిత అంతః సంఘర్షణా ఈ కథను ఒక అసాధారణమైన కథగా నిలబెడతాయి.

పుస్తకంలోనుండి కొన్ని వాక్యాలు,

It is not unusual for a novelist to be visited by his characters, although they do not ordinarily
manifest themselves in so substantial a form.

 I have less responsibility in the matter than you might think. (An honest novelist is like God, he has only limited powers. His creatures are free. He can only suffer with them in their misfortunes and regret that their prayers are in vain. He has over them only the power of life and death; and in the sphere of chance, where destiny sometimes allows him a small margin, he may be able to afford them modest consolations. But we can no more change our minds than can God himself. All things are ordained in the beginning, and once the arrow has been loosed it cannot be drawn back.'

'What right? The novelist's right, of course! I can't make my characters laugh when they feel like crying. I can't make them behave according to impulses which are not theirs, but I can always bring their lives to an end. Death is something that everyone carries with him at every moment so that any moment I care to choose is the right one.'

And writers are nothing but bloody butchers! Come along, darling, you go first. He wanted to murder me. Jiji, I'm afraid. God knows what he'll be up to next, in his infernal novels. The man frightens me.

Thursday, November 14, 2019

Pessoa on Wilde : Aesthetics & Intellect

ఆ మధ్య ఫెర్నాండో పెస్సోవా సెలెక్టెడ్ ప్రోస్ చదువుతుంటే అందులో 'On the literary art and its artists' విభాగంలో ప్రత్యేకం ఆస్కార్ వైల్డ్ గురించిన పెస్సోవా రాసిన వ్యాసం ఒకటి కనిపించింది..ఒక కొత్త స్నేహితుణ్ణి కలిస్తే,అతడు ఇద్దరికీ ఉమ్మడిగా పరిచయమున్న మరో మంచి మిత్రుడి ప్రస్తావన తెస్తే !! ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా !!అలాంటి భావన కలిగి అసలు వైల్డ్ గురించి పెస్సోవా ఏమంటారో చూద్దామని నా కళ్ళు ఆతృతగా ఆ అక్షరాల వెంబడి పరిగెత్తాయి..ఆర్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆస్కార్ వైల్డ్ ప్రస్తావన తీసుకురాని సందర్భం ఉండదంటే అతిశయోక్తి కాదేమో( ఈ మాట రాయడం బహుశా ఏ వందోసారో )..ఇష్టంగానో కష్టంగానో వైల్డ్ ను తలుచుకోవడం ఒకరకంగా సాహితీలోకపు సంప్రదాయం..కానీ కళతో అంత సాన్నిహిత్యం ఉండి,కళ పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చే వ్యక్తిని పెస్సోవా అసలు ఆర్టిస్టే కాదు పొమ్మన్నారు..ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది..కానీ తన వాదనను సమర్ధించుకుంటూ పెస్సోవా ఇచ్చిన వివరణ చదివాకా నేను వైల్డ్ ను మరో కొత్త వెలుగులో చూశాను..అప్పుడు కనిపించిన వ్యక్తి పూర్తిగా వేరు.
Image Courtesy Google
నిజమే ఆస్కార్ వైల్డ్ లాంటి వాళ్ళని చదవడంలో లాజిక్/ఇంటెలెక్ట్ అవసరపడినంత భాష మీద పట్టు అవసరం పడదు..వైల్డ్ తనలోని సౌందర్య పిపాసకు ప్రతీకగా సుదీర్ఘమైన భౌతిక వస్తు వివరణలతో దట్టించి వదిలిపెట్టే గద్యానికి మధ్య మధ్యలో ఉన్నపళంగా విసిరే వ్యంగ్యోక్తులను ఏ విధమైన ఏమరుపాటూ లేకుండా పూర్తి మెలకువతో ఒడిసిపట్టుకోగల నేర్పు పాఠకులకుంటే చాలు..నిజానికి ఆయన కథలూ,నాటకాలు మెరిసినంతగా నవల మెరుపులీనదు..పెస్సోవా అభిప్రాయం చదివాక నేను చాలా ఏళ్ళ క్రిందట చదివిన 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' గుర్తొచ్చింది..ఒక క్లాసిక్,ఒక మాస్టర్ పీస్ అంటూ జనాలు వేనోళ్ళ పొగడగా విని ఆ నవల చదివానేమో,ఇదేమి క్లాసిక్ రా నాయనా అని అనేక సార్లు  తలపట్టుకున్నాను..పేజీలకు పేజీలు వెల్వెట్ పరదాల గురించీ,వెలుగుజిలుగుల షాండలియర్స్ గురించీ వైల్డ్ విపరీత వర్ణనలు విసుగు తెప్పిస్తాయి..ఇందులో ఎస్తెటిక్స్ పేరిట అనవసరమైన ఆర్భాటాలు అనేకం ఉంటాయి..కథలూ,నాటకాల్లో వైల్డ్ కున్న పదాల పొదుపూ,నైపుణ్యం గద్య రచనలో భూతద్దం పెట్టి వెతికినా కనపడదు..పైగా నవలలో పేజీలను నింపడానికి చేసే విఫలయత్నం అడుగడుక్కీ కనిపిస్తుంది..పుస్తకం ఎప్పుడైపోతుందా అని విసిగివేసారిపోయిన పాఠకులం ఒక గాఢమైన నిట్టూర్పు విడుస్తాం చూశారా !! సరిగ్గా అప్పుడే...అదే సమయంలో ఒక గొప్ప విస్ఫోటనం జరిగినట్లు కొన్ని వాక్యాలేవో కనిపిస్తాయి..అంతవరకూ నిద్రావస్థలో ఉన్న మనం ఒక్కసారి తలవిదిల్చి మరోసారి ఆ వాక్యాలను చదువుతాము..ఇహ ఆ వాక్యాలనే కళ్ళతో ప్రేమగా నిమురుకుంటూ కాసేపు అక్కడే ఆగిపోతాం..ఈ టెక్నిక్ తో పాఠకుల్ని హఠాత్తుగా ఒక అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యేలా చేసి ఒకరకంగా దారుణంగా మోసం చేస్తారు వైల్డ్..ఈ విషయం 'ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే' చదివినవాళ్ళకి అనుభవమయ్యే ఉంటుంది...అలాంటి విస్ఫోటనాలు పది పేజీలకొకటి జరిగి,చివరికి వచ్చేసరికి వైల్డ్ చేసిన మోసాన్ని మర్చిపోయి,మనం అమాయకంగా వైల్డ్ జీనియస్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకుని చప్పట్లు కొట్టేలా చేస్తుంది..ఆయన స్ట్రైకింగ్ quotes ఇచ్చే మత్తు అలాంటిది..అందుకేనెమో వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఆర్ట్ తో సంబంధం ఉన్న వ్యక్తిగా ఎక్కువ ఆరాధిస్తానంటారు పెస్సోవా..కనిపించే వైల్డ్ హీరో కాదు,ఆయనలో ఆటిట్యూడ్ ఇక్కడ హీరో అని అంటారాయన..వైల్డ్ ను ఒక ఆర్టిస్టుగా కంటే ఒక 'ఇంటలెక్చువల్' గా చూడాలంటారు పెస్సోవా.
His pose is conscious,whereas all around him there are but unconscious poses.He has therefore the advantage of consciousness.He is representative:He is conscious,
All modern art is immoral,because all modern art is indisciplined.Wilde is consciously immoral,so he has the intellectual advantage.
He did not know what it was to be sincere.Can the reader conceive this ?
He was a gesture,not a man.

Tuesday, September 24, 2019

బోర్హెస్ 'కాంగ్రెస్' ఏం చెబుతోంది..

జార్జ్ లూయీ బోర్హెస్ 'బుక్ ఆఫ్ సాండ్' లో 'కాంగ్రెస్' అనే ఒక కథ ఉంటుంది..నిజానికి ఇది పరిచయం అఖ్ఖర్లేని కథ,చాలా మందికి సుపరిచితమైన కథే..

Image Courtesy Google
ఈ కథ లో మానవజాతికీ,మానవత్వానికీ ప్రాతినిథ్యం వహించడానికి ఒక సంస్థను ప్రారంభిస్తారు..ఆ సంస్థలో పలు దేశాలకు,ప్రాంతాలకూ,భాషలకూ,వృత్తులకూ సంబంధించి పలు విభాగాలను తయారు చేసి వాటికి వివిధ దేశాలకు చెందిన కొందరు వ్యక్తుల్ని ప్రతినిధులుగా నియమిస్తారు..ఈ క్రమంలో ఆ సంస్థకు పెద్ద లైబ్రరీ అవసరమని ప్రపంచం నలుమూలల్నుంచీ పుస్తకాలు తెప్పిస్తారు..ఇలా అన్నిటినీ వర్గీకరించుకుంటూ,వ్యవస్థీకరించుకునే క్రమంలో అసలు లక్ష్యం మూలనపడి పుస్తకాలూ,ప్రతులూ,అంతర్గత విభేదాలతో కూడిన ఆర్గనైజేషన్ మాత్రమే మిగులుతుంది..ఇది గ్రహించిన ఆ సంస్థ అధ్యక్షుడు చివర్లో పుస్తకాలన్నిటినీ దగ్గరుండి మరీ తగలబెట్టిస్తాడు..ఎగసిపడే మంటల్లో కాలుతున్న పుస్తకాలను చూసిన తరువాత అందరూ స్వేచ్ఛగా ఆ సంస్థ తాలూకూ భవనం నుండి బయటకి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు..టూకీగా చెప్పాలంటే ఇదే కథ..మానవాళి తమకంటే ముందు పుట్టినదనీ,తమ తరువాత కూడా స్థిరంగా ఉంటుందనీ,మానవాళినీ,మానవత్వాన్నీ వ్యవస్థీకరించడం అసంభవమనీ,అంత పిచ్చిపని మరొకటి లేదనీ వాళ్ళు గ్రహించడం ఈ కథ సారాంశం.

నిశితంగా గమనిస్తే ఈ కథను మనం వివిధ కోణాల్లో చూడచ్చు..నేటి సమాజం కూడా అనేక తరాల వ్యవస్థీకరణల ఫలితం..ఉదాహరణకు మన భారతీయ సమాజాన్ని తీసుకుంటే మనుధర్మ శాస్త్రాల పేరిట వర్ణ వ్యవస్థల్నీ,రాజ్యాంగాన్నీ,సైన్యాల్నీ వ్యవస్థీకరించుకుంటూ పోయి ఈరోజు ఆ వర్గవిభేదాలతో,జాతిమత వైషమ్యాలతో ఒకరిమీదొకరు కత్తులు దూసుకుంటున్నాం..బోర్హెస్ చెప్పిన ఈ కథ ఏ సమాజానికి అన్వయించి చూసుకున్నా సులభంగా ఆ ఫ్రేమ్ లో ఇమిడిపోతుంది..ఇదే కథను నేటి సాహితీ రంగానికి అన్వయించి చూస్తే ఎలా ఉంటుందనే ఒక సరదా ఆలోచన వచ్చింది..టెక్నాలజీ పుణ్యమాని ఒకప్పుడు ప్రత్యేకమైన సమూహాలుగా మసలే సాహితీ సంఘాలు కూడా నేడు సోషల్ మీడియా వీధి వసారాల్లోనో,మరో వెబ్ పత్రికల మండువాల్లోనో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..బుక్ క్లబ్బులూ,బ్లాగులూ,సోషల్ మీడియా పత్రికలూ ఇలా ప్రతీదాన్నీ వ్యవస్థీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం..ఫలితంగా వెలసిన అనేక సమూహాల్లో తన ఉనికిని చాటుకునే దిశగా కళాకారుడు కూడా నచ్చినా నచ్చకపోయినా బిక్కుబిక్కుమంటూ ఏదో ఒక సమూహపు మూలన నక్కి తీరాలి (?) సమాజంలో అంతర్భాగంగా ఉంటూ తన ఉనికిని చాటుకోడానికి కళాకారుడు తన అస్తిత్వాన్నీ,వ్యక్తిత్వాన్నీ పణంగా పెట్టక తప్పే పరిస్థితులు లేవు..ఇదేదో బ్రహ్మ రహస్యమైన విషయం కాదు..ప్రతీ సమూహానికీ కొన్ని నియమనిబంధనలుంటాయి..అందులో ప్రతి వ్యక్తీ  కొన్ని కనిపించని నియమాలకనుగుణంగా వ్యవహరించవలసి వస్తుంది..సింపుల్ గా చెప్పాలంటే If you want to be part of a crowd,you have to play by their rules..ఈ క్రమంలో ఆర్టిస్టుకు తనకు సంబంధం లేనీ,తనకు నచ్చని విషయాలను కూడా ఆమోదించాల్సిరావడం,గట్ ఫీలింగ్ ను ప్రక్కనపెట్టి మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తూ 'సెల్ఫ్ క్యారెక్టర్ అస్సాసినేషన్' చేసుకోవడం తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి..అడిగిన సంస్థలకు రాయననడం తప్పు...ఆదేశించిన పుస్తకాలపై ప్రశంస/విమర్శ రాయకపోతే తప్పు..అసలు సంస్థాగతంగా వ్యవహరించడానికి నిరాకరించడం తప్పు..ఇదంతా ఈ వ్యవస్థీకరణల ఫలితమే..కానీ ఆర్టిస్టుకు ఉండవలసిన ఏకైక లక్షణం/అవసరం 'స్వయంప్రతిపత్తి కలిగి సర్వ స్వతంత్రుడిగా వ్యవహరించడం'...కానీ ఈ వ్యవస్థీకరణల కారణంగా ఆర్టిస్టు ఈస్థటిక్స్ లో ప్రాథమిక అంశాలు కూడా నేర్వకుండానే బేసిక్స్ దగ్గరే ఆగిపోతున్నాడా !! ఆర్ట్ ను institutionalize చెయ్యడం మంచికా ? చెడుకా ? దీనివల్ల ప్రయోజనం ఏమిటి ? కళ అనేది ప్యాషన్ నుండి పుట్టాలి గానీ,డెడ్ లైన్స్ ఆధారంగా పుట్టేదానిలో సృజనాత్మకత పాళ్ళు ఎంత ?? బహుశా బోర్హెస్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నిష్క్రమించారు అనిపించింది.