Saturday, June 20, 2026

The Proustian Reader - 2. Swann in Love

ప్రపంచ భాషలన్నిటిలోనూ అత్యంత అబ్యూజ్ కి గురైన పదం ఏదైనా ఉందంటే అది "ప్రేమ" మాత్రమే! మనుషులు ఎప్పటికప్పుడు తమ అవసరాలకూ, స్వార్ధానికీ  అనుకూలంగా దాని ఆకారస్వరూపాల్ని  మార్చుకుంటూ, దానికి కొత్త కొత్త నిర్వచనాలని ఆపాదిస్తూ వెళ్ళిపోయినప్పటికీ, పాపం ఈ "ప్రేమ" మాత్రం అందరికీ ఉపయోగపడుతూ ఒక స్థిరాంకంలా, సర్టిఫైడ్ క్లౌన్ లా మిగిలిపోయింది. మార్సెల్ ప్రూస్ట్ "ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్" నవలలో "స్వాన్ ఇన్ లవ్" చాలా కీలకమైన భాగం. పేరుని చూసి దీన్నొక ప్రేమకథ అనుకుని చదవడం మొదలుపెట్టాను గానీ పేజీలు తిప్పేకొద్దీ ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఇది ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రేమించుకున్నారో చెప్పే కథ కాదు. ఒక పూర్తి స్థాయి "సైకో అనలిటికల్ డిస్కోర్స్". ఈ భాగం, సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కార్ల్ యుంగ్, ఆలివర్ సాక్స్-- ఇలాంటి వారందరూ కలిసి ఒక పూర్తి స్థాయి ఫిక్షన్ రాస్తూ చేసిన సైకలాజికల్ ఎనాలిసిస్ లా ఉంది.

మొన్నామధ్య ఒక సీనియర్ బాలీవుడ్ నటుడు మూడో పెళ్ళి తర్వాత, "ఇప్పుడు నేను పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది" అని అన్నారని వార్తల్లో వచ్చింది. మరొకరొచ్చి పూర్తిచేస్తే గానీ పూర్తవ్వని ఖాళీలతో జీవిత భాగస్వామిని వెతుక్కుంటే అన్నిసార్లు ఆ ఖాళీల్లో పూర్తిగా పట్టే మనుషులు దొరక్కపోవచ్చు. అప్పుడు జీవితమంతా ఆ 'మిస్సింగ్ పీసెస్'ని వెతుక్కుంటూ, పజిల్ పీసెస్ ని అతికించుకున్నట్లు దొరికినవాళ్ళతో అతికించుకోవడమే సరిపోతుంది. బహుశా ఆధునిక ప్రేమల్లో "మల్టిపుల్ పార్టనర్స్" సంస్కృతి పెరగడానికి కారణం ఇదే కావొచ్చు. ఈ భూమ్మీద లోపాలూ, లోటుపాట్లూ లేని మనుషులుండరు కాబట్టి, ఏ మనిషైనా మన అంచనాలకు తగ్గట్లు పూర్తిగా మన "మౌల్డ్"లో ఇమిడిపోవడం అసాధ్యం. 

ప్రూస్ట్ "ప్రేమ" మనం పాపులర్ కల్చర్ లో చూసే రొమాన్స్ కాదు, ఒక మనిషిని ప్రేమించడమంటే ఆ మనిషికి ఎంతమాత్రమూ సంబంధం లేని మనదైన ఒక ఊహాప్రపంచాన్ని నిర్మించుకోవడం. చార్లెస్ స్వాన్ తన మనసులో ఓడెట్ చుట్టూ అటువంటి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. "He reorganized his life around Odette." మెల్లగా ఆ ప్రపంచంలో తనకు తానుగా బందీ అవుతాడు. ఈ చాప్టర్ ప్రారంభంలోనే ప్రూస్ట్ ప్రేమంటే మనకున్న సమస్త అంచనాలనూ తలకిందులు చేస్తూ, "She was not his type" అనడంతోనే ఈ ప్రేమకథకు పునాదిపడుతుంది. నిజానికి స్వాన్ మొదట్లో ఓడెట్‌ను ప్రేమించడు, అతని దృష్టిలో ఆమె పెద్ద అందగత్తె కూడా కాదు కాబట్టి, ఆమెపట్ల ప్రత్యేకంగా ఆకర్షణంటూ కూడా ఏమీ ఉండదు. వారిద్దరి ప్రేమ గురించి రాస్తూ, ప్రేమ అనేది తొలిచూపులోనే పుట్టే ఒక అద్భుతం కాదనీ, అది దశలవారీగా ఏర్పడే ఒక మానసిక స్థితి అనీ ప్రూస్ట్ మనకు సూచనప్రాయంగా చెప్తారు.

"He would get into his carriage and drive off, but he knew that this thought had jumped in after him and had settled down upon his knee, like a pet animal which he might take everywhere, and would keep with him at the dinner-table, unobserved by his fellow-guests. He would stroke and fondle it, warm himself with it, and, as a feeling of languor swept over him, would give way to a slight shuddering movement which contracted his throat and nostrils - a new experience, this, - as he fastened the bunch of columbines in his button-hole."

అసలు చార్లెస్ స్వాన్ ప్రేమకు బీజం స్వాన్ ఊహాలోకంలో పడుతుంది, అది   ఓడెట్‌ దగ్గర మొదలవ్వదు. ఆమెపై వ్యామోహంతో ఒక దశలో అతను ఓడెట్ ముఖాన్ని బొట్టిచెల్లీ చిత్రాల్లోని "జిప్పోరా"తో పోలుస్తాడు. ఆక్షణం నుంచి ఓడెట్ స్వాన్ దృష్టిలో ఒక సాధారణ స్త్రీగా కంటే ఒక కళాఖండంగా , "ఐడియలైజ్డ్ వెర్షన్"గా మారిపోతుంది. ఇక అక్కడనుంచీ స్వాన్ జీవితం ఓడెట్ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఎక్కడ ఉంది? ఎవరితో ఉంది? తన గురించి ఆలోచిస్తుందా? వేరెవరినైనా ప్రేమిస్తుందా? అనే ప్రశ్నలు అతన్ని ఊపిరిసలపనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. Forcheville తో ఆమెకు సంబంధం ఉందనే అనుమానం కాస్తా అసూయగా మారి, స్వాన్ ఓడెట్ ను ద్వేషించడం మొదలుపెడతాడు. 

ప్రూస్ట్ విశ్లేషణ చదువుతుంటే డాంటే "La Vita Nuova"లో బీట్రిస్ గుర్తుకొచ్చింది. బీట్రిస్ లాగే "ఓడెట్" వ్యక్తిత్వం కూడా ఆమెకు సంబంధం లేకుండా, కేవలం స్వాన్ భావనల్లో రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ప్రూస్ట్, ప్రేమ విషయంలో మనమెవ్వరమూ ఒప్పుకోడానికి ఇష్టపడని ఒక కఠినమైన నిజాన్ని చెప్తారు-- మనం ప్రేమించేది అన్ని లోపాలూ ఉన్న మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి గురించి మన ఊహాలోకంలో సృష్టించుకున్న రూపాన్ని, ఒక ఫాంటసీని. ఈ కారణంగానే "ప్రేమ" స్వచ్ఛతకు దూరంగా, క్రమంగా ఒక అబ్సెషన్ గా మారిపోతుంది. నిజానికి ఓడెట్ అతని జీవితంలో ఒక వ్యక్తిగా ఉండటం కంటే, అతని ఆలోచనల్లోనే ఎక్కువగా స్థానం ఏర్పరుచుకుంటుంది.

Odette as Zipporah

సాధారణంగా ప్రేమతో బాటు అసూయ పుడుతుందనుకుంటాం, కానీ ప్రూస్ట్ దానికి విరుద్ధంగా, అసూయే ప్రేమకు పునాది అంటారు. ఆ అసూయనే మనిషి "ప్రేమ" అనుకుని మరో మనిషిని అదుపుచేస్తూ, తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు, అది కుదరకపోయేసరికి భంగపడతాడు. ఎందుకంటే, ప్రతి మనిషీ తనలో ఒక స్వతంత్ర ప్రపంచాన్ని కలిగి ఉంటాడు. ఆ ప్రపంచంలోకి మనం పూర్తిగా ప్రవేశించలేం. ఇక్కడ ప్రూస్ట్ ప్రేమ గురించి రాస్తూ, "ప్రేమ అనేది మరొక మనిషిని కనుగొనడం కాదు, మనలోని నిద్రాణమై ఉన్న అస్థిరతను కనుగొనడం." అంటారు.

ఓడెట్ మీద ప్రేమ అసూయగా మారి, ఆపై ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకోవాలనే తపనతో స్వాన్ జీవితం అదుపు తప్పి అతని చేతుల్లోనుండి పూర్తిగా జారిపోతుంది. ఆపై అతని సమయం అతనిది కాదు. అది ప్రత్యక్షంనూ, పరోక్షంగానూ ఓడెట్‌ సొంతమైపోతుంది. ఆమెను కలిసే ముందు, ఆమెను కలిసిన తర్వాత, ఆమె నుంచి ఉత్తరం వచ్చే వరకూ-- ఇవన్నీ స్వాన్ జీవితంలోని క్షణాలకు, సరికొత్త కొలమానాలుగా మారిపోతాయి. ఈ దశలో ప్రూస్ట్ ప్రేమను ఒక వ్యాధిలా చిత్రిస్తారు. "Love had become an illness." అది ఒక్కసారిగా శరీరంలోకి ప్రవేశించే జ్వరం కాదు, నెమ్మదిగా వ్యాపించే ఒక రోగం. మొదట్లో ఒక అలవాటుగా మొదలైన ప్రేమ, మెల్లగా ఒక అవసరంగా, చివరికి వ్యసనంగా మారిపోతుంది.

And such moments as these, in which she forgot Swann's very existence... did more to attach him to her, than all her infidelities."

ఏదో ఒక సాయంత్రపు వేళ దూరంనుంచి ఏదో పాట వినబడుతుంది. అది వింటున్నప్పుడు కాలంతో బాటు వెనక్కు ప్రయాణిస్తూ పాతజ్ఞాపకాలేవో  ముందుకు తోసుకువస్తాయి. ఏవైనా ప్రదేశాలు, పాటలు, మాటలు సుపరిచితంగా అనిపించడం-- ఇవన్నీ ప్రేమ చిహ్నాలే! స్వాన్ - ఓడెట్ లకు కూడా వారిద్దరికీ మాత్రమే అర్ధమయ్యే ప్రేమికుల పరిభాష, ప్రేమ చిహ్నాలు ఉంటాయి. "Vinteuil Sonata" అనే సంగీతం వారి సంబంధంలో కీలకమైన భాగమైపోతుంది. అందులోని "little phrase" క్రమంగా వారి ప్రేమకు ప్రతీకగా మారిపోతుంది. "That phrase had become, in a way, the national anthem of their love." అంటారు ప్రూస్ట్. ప్రేమ నేరుగా ప్రేమికులను మాత్రమే తాకదు, అది వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా వ్యాపిస్తుంది. ప్రాణంలేని వస్తువులకు జీవంపోస్తుంది. అందుకే ఆ సోనాటా వినిపించిన ప్రతిసారీ స్వాన్ మళ్ళీ తనకు తెలీకుండానే ఓడెట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే, స్వాన్ నిజానికి ఆ సంగీతాన్ని వినడం లేదు, అందులో తన ప్రేమ తాలూకా భావోద్వేగాన్ని వెతుక్కుని వింటున్నాడు. అతను ఓడెట్‌ను ప్రత్యక్షంగా చూడడం లేదు, తన ఊహల్లోని ఆమె రూపాన్ని ఒక నీడలా మాత్రమే చూస్తున్నాడు. అతను ప్రేమించడం లేదు, తన మనసులో నిర్మించుకున్న ఆ ప్రేమ అనే ఫాంటసీ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. 

ప్రూస్ట్ "ప్రేమ"లో నిజానికి ఇద్దరు మనుషులు లేరు, స్వాన్ మాత్రమే ఉన్నాడు.  ఇదంతా చదివాక నిజానికి స్వాన్ ఓడెట్‌ను అసలు ప్రేమించలేదని అర్థమవుతుంది. మనుషులు ఏళ్ళతరబడి తమ జీవితాన్ని ఒక భ్రమకు అంకితం చేస్తారు. ఆ భ్రమకు "ప్రేమ" అని పేరుపెట్టుకుంటారు. దానికోసం నిరంతరం బాధపడతారు. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, తాము ప్రేమించింది ఒక వ్యక్తిని కాదనీ, తాము సృష్టించుకున్న ఊహాశక్తినేనని గ్రహిస్తారు.

"To think that I have wasted years of my life, that I have longed to die, that I have experienced my greatest love, for a woman who did not appeal to me, who was not even my type!" అనడంలో ఎంత విషాదం!!

ఈ వాక్యంలో స్వాన్ లో పశ్చాత్తాపం కంటే గాఢసుషుప్తి నుంచి తుళ్ళిపడి మేల్కొన్నాడేమో అనే అనిపిస్తుంది. అతను పొందిందీ, కోల్పోయిందీ ఓడెట్ ని కాదు, తన విలువైన సమయాన్ని. చివరికి స్వాన్ భ్రమలన్నీ తొలగిపోయి కఠినమైన సత్యాన్ని గ్రహిస్తాడు. ఇది కేవలం ఒక ప్రేమికుడి పశ్చాత్తాపం మాత్రమే కాదు, ప్రేమ పేరిట తన అహాన్ని తృప్తిపరుచుకునే మనిషి సహజ నైజాన్ని బట్టబయలు చేస్తూ ప్రూస్ట్ రాసిన లోతైన వ్యాఖ్యానం. ఓడెట్ ప్రేమతో స్వాన్ లో అప్పటివరకూ లేని కొత్త వ్యక్తిత్వం పుడుతుంది. ఆ ప్రేమ అసూయగా, తర్వాత ఒక వ్యాధిలా మారి చివరకు కాలంతో బాటు చేదు జ్ఞాపకాలు మాత్రమే మిగులుస్తుంది. అందుకే మార్సెల్ ప్రూస్ట్ "స్వాన్ ఇన్ లవ్" భాగాన్ని ఒక ప్రేమకథగా చదవడం దాని ప్రాముఖ్యతను తగ్గించడమే అవుతుంది.

"For what we suppose to be our love, our jealousy are, neither of them, single, continuous and individual passions. They are composed of an infinity of successive loves, of different jealousies..."

ప్రేమను నిలబెట్టేవి ఆనందం, స్థిరత్వంలాంటివి  కాదనీ, అనిశ్చితి అనీ సైకోఅనలిస్టులు చెప్పడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఆ కాలంలోనే ఒక రచయిత అనడం నిస్సందేహంగా ఆశ్చర్యమే! "And this malady, which was Swann's love..." అనడంలో ప్రూస్ట్ నిజంగానే ప్రేమను ఒక పూర్తి స్థాయి మానసిక వ్యాధిగా చూస్తున్నారు. ఆ వ్యాధి స్వాన్ అలవాట్లలోకి, ఆలోచనల్లోకి, నిద్రలోకి చివరకు అతని ఆరోగ్యంలోకి కూడా ప్రవేశిస్తుంది. మనిషి ఉనికిని సమూలంగా మార్చేసే ఈ వ్యాధిని పూర్తిగా నయం చెయ్యడం అసాధ్యం.

"He was no longer the same man... a new personality was there beside him, adhering to him, amalgamated with him..."

ఓడెట్ మీద ప్రేమ స్వాన్ కి మరో కొత్త వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది. ఇప్పుడతను మునుపటి మనిషి కాదు! ఇప్పుడు స్వాన్‌ లో ఇద్దరు వేర్వేరు మనుషులున్నారు. ఒకరు పూర్తిగా తర్కంతో, హేతుబద్ధంగా ఆలోచించే స్వాన్. మరొకరు హేతువును వదిలేసి పూర్తిగా ప్రేమకు దాసోహమన్న స్వాన్. "బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్" అని ఓ సినీకవి అన్నట్లు, స్వాన్ చివరకు ఓడెట్‌ను కాదు, తన భావోద్వేగాన్నే మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తున్నాడు. ఓడెట్‌ను మరచిపోవాలంటే కేవలం ఆ వ్యక్తిని మరచిపోవడం మాత్రమే కాదు, ఆమెతో కలిసి గడిపిన కాలాన్నీ, ఆ సమయాల్లో స్వాన్ లో పుట్టిన ప్రత్యేకమైన "నేను" అనే అనేక వ్యక్తిత్వాల్నీ, వాటితో ముడిపడిన జ్ఞాపకాలనూ, భావోద్వేగాలనూ కూడా విడిచిపెట్టడం. ప్రూస్ట్ విషయంలో 'ప్రేమ' అనేది కేవలం ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మాత్రమే కాదు, అదొక "మల్టీ లేయర్డ్ గేమ్". కాలం, జ్ఞాపకాలు, అనుభవాలు-- వీటన్నిటితో ముడిపడిన అనంతమైన వ్యక్తిత్వాల సమాహారం.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు :

"For what we suppose to be our love, our jealousy are, neither of them, single, continuous and individual passions. They are composed of an infinity of successive loves, of different jealousies, each of which is ephemeral, although by their uninterrupted multitude they give us the impression of continuity, the illusion of unity. The life of Swann's love, the fidelity of his jealousy, were formed out of death, of infidelity, of innumerable desires, innumerable doubts, all of which had Odette for their object."

"In his younger days a man dreams of possessing the heart of the woman whom he loves; later, the feeling that he possesses the heart of a woman may be enough to make him fall in love with her. And so, at an age when it would appear since one seeks in love before everything else a subjective pleasure - that the taste for feminine beauty must play the larger part in its procreation, love may come into being, love of the most physical order, without any foundation in desire. At this time of life a man has already been wounded more than once by the  dartsof love; it no longer evolves by itself, obeying its own incomprehensible and fatal laws, before his passive and astonished heart. "

"He had brought her an engraving that she wanted to see. She was a little unwell; she received him in a mauve crepe de chine dressing gown, pulling the richly embroidered material over her chest like a cloak. Standing next to him, allowing her hair, which she had undone, to flow down her cheeks, bending one leg somewhat in the position of a dancer so that without getting tired she could lean over the engraving, which she looked at, inclining her head, with those large eyes of hers, so tired and sullen when she was not animated, she struck Swann by her resemblance to the figure of Zipporah, Jethro’s daughter, in a fresco in the Sistine Chapel."

Saturday, June 13, 2026

The Proustian Reader - 1.Bergotte

"ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్"లో కథకుడు [మనం మార్సెల్ అనుకుందాం] చిన్నప్పటినుంచీ బెర్గొట్ (Bergotte) అనే ఒక రచయితకు వీరాభిమాని. ఒకానొక  సందర్భంలో పొరుగింటి స్వాన్ ఆహ్వానం మీద మార్సెల్ కు తన అభిమాన రచయితను ప్రత్యక్షంగా కలిసే అవకాశం వస్తుంది. కానీ మార్సెల్ ఊహల్ని  తలక్రిందులు చేస్తూ ఒక మహొన్నతమైన రచయిత స్థానంలో పొట్టిగా, లావుగా, ఎర్రటి వంకర ముక్కు, చిన్నపాటి నల్లని గడ్డంతో, అతి సాధారణంగా కనిపించే ఒక మనిషి ఎదురవుతాడు. మార్సెల్ కు తీవ్రమైన నిరాశను కలిగించే ఈ ఘట్టాన్ని కేవలం ఒక రచయితను కలిసిన అనుభవంగా కాకుండా మనిషి కాన్షియస్, సబ్కాన్షియస్ లలో వాస్తవికత-భ్రమల మధ్య సుదీర్ఘమైన తులనాత్మక తాత్విక ధ్యానంగా రాసుకొస్తారు ప్రూస్ట్.

Image Courtesy Google

మనం ఒక రచయిత రచనల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని, రూపాన్నీ  ఊహిస్తాం. అతని భాష ఎంత అందమైనదో, ఆలోచనలు ఎంత విశాలమైనవో  అనుకుంటూ, కళకు లేనిపోని దైవత్వాన్ని ఆపాదించి ఆ అందానికి తగ్గ శరీరాన్నీ, వ్యక్తిత్వాన్నీ, జీవనశైలినీ ఊహించుకుంటాం. మార్సెల్ కూడా  సహజంగానే బెర్గొట్ రచనల్లోని గొప్పదనాన్ని బట్టి ఒక అందమైన ఆకృతిని నిర్మించుకుంటాడు. "గుహల్లో వేల సంవత్సరాల పాటు నీటి చుక్కలు పడుతూ ఏర్పడే stalactite ఎంత మెల్లగా రూపుదిద్దుకుంటుందో, అలాగే బెర్గొట్ గురించిన  ఊహ కూడా అతని పుస్తకాలను చదువుతూ నాలో క్రమంగా రూపుదిద్దుకుంది" అంటాడు. కానీ తీరా చూస్తే నత్తగుల్లలాంటి ముక్కు, గడ్డం-- ఇవన్నీ మార్సెల్ కి అసహనం కలిగిస్తాయి. తన ఊహల్లో నిర్మించుకున్న పవిత్రమైన బెర్గొట్ కి అదనంగా ఇప్పుడు ఈ వంకర ముక్కునీ, గడ్డాన్నీ కూడా కలపాల్సి వస్తుంది మరి. :) ఆ క్షణంలో మార్సెల్ మనసులో ప్రతిష్టించుకున్న బెర్గొట్ రూపం అమాంతం పనికిరానిదైపోతుంది.

ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ, "బెర్గొట్ అనే పేరు వినగానే, నా ముఖం మీద పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పేలినట్లనిపించింది" అంటారు. ప్రూస్ట్ ఊహల్లో నిర్మించుకున్న రూపం వాస్తవానికొచ్చేసరికి ఎలా ఛిద్రమైందో ఈ మెటఫర్ చెప్తుంది. అంతటితో ఊరుకోకుండా, "ఈ ముక్కును దాటుకుని నేను బెర్గొట్ రచనల ప్రపంచానికి వెళ్ళలేకపోయాను" అని చమత్కరిస్తారు. ప్రపంచాన్నైనా, పుస్తకాన్నైనా పాఠకుడు తన దృష్టికోణం నుంచే చూస్తాడనేది జగమెరిగిన సత్యం. చాలా ఏళ్ళ క్రితం చదివిన జాన్ బెర్జర్ "Ways of seeing ", పీటర్ మెండెల్సండ్ "What we see when we read" లాంటి పుస్తకాల్లో ఈ అంశాల గురించి చదివి ఉండడంవల్ల ఈ భాగం కొత్తగా అనిపించలేదు. కానీ వీళ్ళందరూ ప్రూస్ట్ ని చదివే ఉంటారేమో అని అనుమానం మాత్రం వచ్చింది. :) మనం ఒక రచయితనో, కళాకారుణ్ణో, తత్వవేత్తనో దీర్ఘకాలం అతని రచనల ద్వారా మాత్రమే ప్రేమిస్తుంటే, అతని పేరు మనకు తెలీకుండానే మనలో ఒక విశేషమైన భావోద్వేగాన్ని సృష్టిస్తుంది. ఆ పేరు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సూచించదు, అది మన ఊహల్లోని రూపాన్ని సూచిస్తుంది. ప్రూస్ట్ మనసులో బెర్గొట్ కి అటువంటి విశిష్ట స్థానముంది.

మార్సెల్ ఊహించుకున్న గొప్ప రచనలు చేసింది రక్తమాంసాలతో కూడిన అతి సాధారణమైన మనిషే గానీ, తన మనసులో ఏర్పరుచుకున్న గొప్ప వ్యక్తి తాలూకా 'ఇమేజ్' కాదని గ్రహించాక ప్రూస్ట్ లో నవలాకారుడు పూర్తి స్థాయి విమర్శకుడిగా రూపాంతరం చెందుతాడు. కళాకారుడు ఎప్పటికీ తన కళలా ఉండకపోవచ్చు, మనమందరం కవిని అతని కవితలా ఊహిస్తాం, తత్వవేత్తను అతని తత్వంలా ఊహిస్తాం, కానీ నిజ జీవితంలో వారు, వారి రాతలంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ విశ్లేషణ క్రమంగా మరింత లోతైన ప్రశ్న వైపుకు తన దిశను మార్చుకుంటుంది. "గొప్ప కళను సృష్టించే వ్యక్తి తప్పనిసరిగా గొప్ప వ్యక్తేనా!!?" ఈ ఆలోచనతో మార్సెల్ అసహనం కాస్తా అనుమానంగా మారుతుంది. అసలిన్ని గొప్ప రచనలు చేసింది ఈ మనిషేనా? ఒకవేళ అతను ఏదైనా దీవిలో ముత్యాల వ్యాపారం చేసే పరిస్థితిలో పెరిగుంటే, ఇంతే శ్రద్ధగా, ఒక గొప్ప ముత్యాల వ్యాపారి అయ్యుండేవాడేమో! కళ అనేది వ్యక్తి యొక్క అంతరాత్మలో ఉండే దైవత్వం (muse అనే బ్రహ్మపదార్థం?) వల్ల పుడుతుందా, లేక భౌగోళిక  పరిస్థితులు, పరిశ్రమ, అలవాట్లు-- వీటన్నిటి ఫలితమా అన్న అనుమానం మెల్లగా పాఠకుల్లో కూడా మొదలవుతుంది. ఈ వాదనతో ప్రూస్ట్ కళాకారుల్ని దైవాంశ సంభూతులుగా, ఒక పెడెస్టెల్ మీద పెట్టి చూడడాన్ని సవాలు చేస్తారు.

వీటన్నిటికీ తోడు బెర్గొట్ మాట్లాడే తీరు కూడా అతని రచనలతో ఏ మాత్రమూ పొంతనలేని విధంగా ఉంటుంది. వాడుక భాషలో కాకుండా, గొప్ప ఇంటెలెక్చువల్ లా తన ప్రత్యేకతను చాటుకోవాలనే తపనతో, కొన్ని సిలబల్స్ మీద వత్తిడి పెడుతూ ఆడంబరంగా, బలవంతపు కవిత్వంలా, తెచ్చిపెట్టుకున్నట్లు మాట్లాడుతుంటాడు. ఈ ప్రవర్తన మార్సెల్ కు విసుగు తెప్పిస్తుంది. కొన్ని పదాలను అసహజమైన ఉచ్చారణతో గంభీరంగా పలకాలనే ప్రయత్నం అతిశయంగా, మోనోటనస్ గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రూస్ట్ బెర్గోటిజం [Bergottism] అనే పదాన్ని కాయిన్ చేస్తారు. చాలామంది రచయితలు బెర్గొట్ ని అనుకరిస్తారు. అతని మెటఫోర్స్, ఇమేజరీ, పొయెటిక్ టోన్ లాంటి భావవ్యక్తీకరణలను కాపీ చేస్తారు. నిజానికి అవన్నీ అసలైన 'బెర్గొట్' కాదు. నిజమైన బెర్గొట్ ప్రతి వస్తువులోనూ దాగున్న అమూల్యమైన సత్యాన్ని దర్శించి, బయటకు తీయగల శక్తి. అదే రచయిత 'జీనియస్' అనొచ్చు. ఈ జీనియస్ అనుకరణతో వచ్చేది కాదు. ఒక గొప్ప రచయిత 'ఒరిజినాలిటీ' అనేది అతని శైలిలో ఉండదు, అతని దృక్పథంలో ఉంటుంది, అతను ప్రపంచాన్ని చూసే ప్రత్యేకమైన విధానంలో ఉంటుంది.

ఉదాహరణకు ప్రూస్ట్, జాయిస్ లాంటివాళ్ళు రాసే వాక్యాలను కూడా కొందరు అనుకరించగలరేమో గానీ, వాళ్ళు ఒక వాక్యం రాసాక, ఆ వాక్యానికి తర్వాత ఏ పదం వాడతారో ముందుగా ఊహించగలరా!? నిజమైన కళలో ఒకరకమైన "unpredictability" ఉంటుంది. అది అనుకరణకు వీలైన 'ఒక పాటర్న్' కాదు, సాధన చేసి నేర్చుకునే ఫార్ములా అంతకంటే కాదు. మనం గమనిస్తే, చాలామంది రచయితల పుస్తకాల్లో కనిపించే 'లోతు', వారి సంభాషణల్లో కనపడదు. దానికి కారణం, వారి అంతర్ముఖ ప్రపంచం నుంచి వచ్చే ఆలోచనల వెలుగు రచనల్లో మాత్రమే పూర్తిగా వ్యక్తమయ్యే ఆస్కారం ఉంటుంది. బహుశా అందుకేనేమో బార్త్ తన "The Death of the Author"లో రచన మనిషి స్థిరమైన వ్యక్తిత్వం యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ కాదని వాదిస్తారు. ఆయన దృష్టిలో "రచయిత" ప్రత్యేకం రచన పుట్టడానికి ముందే పూర్తిగా ఏర్పడిన కేంద్రం కాదు. రచన పుట్టిన క్షణంలోనే దాన్ని తన ఆవరణలోకి తెచ్చుకుని "ఇంటర్ప్రెట్" చేసే పాఠకుడు కూడా పుడతాడు. అంటే, ఒక రచనకు అర్థం తెలియాలంటే ఆ రచయిత వ్యక్తిగత జీవితాన్ని వెతకాల్సిన అవసరం లేదు. రచయితకూ, రచనకూ మధ్య సంబంధం, రచన పూర్తవడంతోనే తెగిపోతుందని బార్త్ అంటే, ప్రూస్ట్ మొదట్నుంచీ రచనకూ, రచయితకూ అసలు సంబంధమే ఉండదని అంటారు. ఊహాత్మక ప్రపంచంలో ఉండే రచయితకీ, వాస్తవంలో అదే మనిషికీ అస్సలు పొంతనలుండవని ప్రూస్ట్ వాదన.

ప్రూస్ట్ పరిశీలనల్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ వాదనలోనూ ఆయన పూర్తిగా ఒకవైపు మొగ్గి నిలబడరు. ఆయన తర్కం చాలా చోట్ల నాలాగే ఇన్-యాంగ్ నీ, ద్వంద్వాన్నీ ఆధారం చేసుకుని నిలబడడం వల్ల కావచ్చు, ప్రూస్ట్ తర్కం నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చుతుంది. బెర్గొట్ వ్యక్తిత్వం అతని రచనలంత గొప్పది కాదు అని అంటూనే, అతని రచనల్లోని లోతునీ, సత్యాన్నీ  పూర్తిగా నిరాకరించలేమని కూడా అంటారు. ప్రూస్ట్ ప్రకారం గొప్ప రచయితంటే, కేవలం అందమైన పదాలతో,  అలంకార శైలితో రాసేవాడు కాదు. ఇతరులు చూడని ప్రపంచాన్ని కొత్తగా చూపించేవాడు. అతని శైలి మన ఊహకు అందదు, అతని తదుపరి వాక్యం ఏమవుతుందో తెలియదు. ఉదాహరణకు ఎవరైనా ఆస్కార్ వైల్డ్ శైలిని అనుకరించవచ్చు. కానీ "I can resist everything except temptation." అనే అద్భుతమైన వాక్యం ఎలా రాయగలరు? అది కేవలం అనుకరణ వల్ల అబ్బే కళ కాదేమో! 'కళ' మనిషి యొక్క రోజువారీ వ్యక్తిత్వం కాదు. వైల్డ్ "ఏ గొప్ప కళాకారుడూ వస్తువులను అవి ఉన్నవున్నట్లుగా చూడడు." అనడంలో ఒకరకమైన 'ట్రాన్స్ఫర్మేషన్' (రూపాంతరం చెందడం?) కనిపిస్తుంది. "The Critic as Artist" అనే వ్యాసంలో వైల్డ్ ఆర్టిస్టు కళ ఒక "ప్రదర్శన" లాంటిది అంటారు. ఆయనకు కళాకారుడి వ్యక్తిత్వం అనేది 'స్వచ్చమైన ఒప్పుకోలు'  కాదు, అది ఒక తెచ్చిపెట్టుకున్న శైలి, ఒక ప్రదర్శన మాత్రమే. "Man is least himself when he talks in his own person. Give him a mask, and he will tell you the truth." అని వైల్డ్ అన్నట్లే, ప్రూస్ట్ కూడా దాదాపుగా ఇదే విషయాన్ని మరో కోణంలో చెబుతారు. ప్రూస్ట్ కి  కళాకారుడి సామాజిక వ్యక్తిత్వం (social self), సృజనాత్మక వ్యక్తిత్వం (creative self) -- ఈ రెండూ రెండు వేర్వేరు అంశాలు. మనం గమనిస్తే ఏ రచయితా తన జీవితం గురించి నేరుగా రాయడు. మనకు "ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్" నవలలో కథానాయకుడు పూర్తిగా తానేనని ప్రూస్ట్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ అది ఒక ఫిక్షనల్ / సెమీ ఆటోబయోగ్రఫికల్ నవల అని అందరికీ తెలిసిన విషయమే. బెర్గొట్ పాత్రను ప్రూస్ట్ నిజజీవితంలో ఆరాధించిన రచయిత అనాటులీ ఫ్రాన్స్, ఆర్ట్ క్రిటిక్ జాన్ రస్కిన్ లాంటివారిని దృష్టిలో పెట్టుకుని రాసారని అంటుంటారు.

మళ్ళీ బెర్గొట్ విషయానికొస్తే, మార్సెల్ బెర్గొట్ గురించి చెడుగా అనేక పుకార్లు కూడా విని ఉంటాడు. బెర్గొట్ రచనల్లో కనిపించే నైతికత, సున్నితత్వాలకూ, అతని వ్యక్తిగత జీవితంలోని అనైతికతకూ ఎక్కడా పొంతనలుండకపోవడం మార్సెల్ ని ఇబ్బందిపెడుతుంది. బెర్గొట్ పాత్రలు చిన్న తప్పులకే నైతిక భారం మోస్తూ పాపభీతితో కలతపడుతుంటాయి. అలాగని ఈ వైరుధ్యం కారణంగా బెర్గొట్ సాహిత్యంలో ప్రామాణికత లేదనుకోవడం కూడా సరికాదు. దీనికి ప్రూస్ట్ ఇచ్చిన వివరణ విచిత్రంగా అనిపించింది. కళాకారుడిలో దుర్గుణమో, పాపమో  కేవలం సున్నితత్వం లేకపోవడం వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు అతి సున్నితత్వం వల్ల కూడా రావచ్చునంటారు ప్రూస్ట్. కొన్నిసార్లు మనిషిలో దుష్టత్వం, అతని భావోద్వేగ శూన్యత కంటే అతిగా స్పందించే స్వభావం వల్ల కూడా పుట్టొచ్చు. ఇది కొన్నేళ్ళ క్రితం చదివిన నోబెల్  గ్రహీత  J.M.Coetzee "యూత్"లో ఆర్టిస్టు గురించిన చర్చను జ్ఞప్తికి తెచ్చింది.  కోట్జీ వాదనలో సాధారణ మనుషులు తమలోని చెడును వదిలించుకుని మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవాలనుకుంటారు. కానీ కళాకారుడలా కాదు. ఆర్టిస్టు నిరంతరం తనను దహించివేసే ఆ "లోపలి జ్వరంతోనే" జీవించాలి, ఎందుకంటే అదే అతని కళకు మూలాధారం. అందుకే ఆర్టిస్టు ఎప్పుడూ పూర్తిగా బయటి ప్రపంచంలో మనలేడు. అతని చూపులో  కొంత భాగం ఎప్పుడూ అతని లోపలి ప్రపంచంపైనే ఉంటుంది.

దీనికి కొనసాగింపుగా, నిజమైన నైతిక సంఘర్షణ బహుశా తమలో అనేక లోపాలు ఉన్నవాళ్ళలోనే అత్యంత తీవ్రంగా ఉంటుందేమో అని కూడా అంటారు. ఎప్పుడూ ఏ బలహీనతలూ, సంఘర్షణలూ అనుభవించని వ్యక్తికి నైతికత యొక్క అసలు తీవ్రత పూర్తిగా అర్థంకాకపోవచ్చు. గొప్ప కళాకారులు లోపల కలతలతో, విరుద్ధ భావాలతో జీవిస్తారు కాబట్టి, నైతిక సమస్యలను సహజంగానే వారు మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే సాధారణ మనుషులకు భిన్నంగా, కళాకారులు తమ రచనల్లో నైతిక సమస్యలకు పరిష్కారాన్ని వ్యక్తిగత జీవితంలో వెతుక్కోరు. ఆ వెతుకులాట వారి కళలో, సార్వజనీన అనుభవాల స్థాయిలో జరుగుతుంది. బహుశా వేమన శతకం లాంటివి ఇలా పుట్టినవేనేమో కదా! అందుకే కళాకారుల వ్యక్తిగత జీవితం ఎంత లోపభూయిష్టమైనప్పటికీ, వారి కళలో మాత్రం గొప్ప నైతిక సత్యం కనబడవచ్చు. కళాకారులు తమ స్వానుభవాల్నీ, తమ చుట్టూ ఉన్న అనైతికతనూ ఊతంగా చేసుకుని మానవ నైతికతను అర్థం చేసుకుంటారు.

రచయితలు తమ పుస్తకాలలో ఎక్కువగా విమర్శించేది కూడా వాళ్ళు నిజ జీవితంలో కొనసాగిస్తున్న జీవనశైలినే అనేది ప్రూస్ట్ వాదన. అందుకే సమాజాన్ని మార్చాలని రచనలు చేసే అనేకమంది తమ స్వంత నడవడికను మార్చుకోవాలని ప్రయత్నించరు. అవినీతిమయమైన సమాజంతో బాటే అరుదుగా మారిన నైతిక ఆదర్శాలు ఎక్కువగా ఉన్న బెర్గొట్ కాలంలో ఈ విరుద్ధత ఇంకా ఎక్కువగా కనిపించిందని ప్రూస్ట్ అన్నప్పటికీ, ఇది అన్నికాలాలకూ వర్తించే విషయమే! ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అని కళాకారులూ, రచయితల వ్యక్తిగత జీవితాల గురించి ప్రజలకు ఇంతకుముందెన్నడూ లేనంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఒక సమయంలో రచయితలు మారుపేర్లతో  అజ్ఞాతంగా రచనలు చేసేవారు. ఇప్పుడలా కాదు, ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో ప్రైవసీ కుదరని పరిస్థితుల్లో అందరి జీవితాలూ తెరచిన పుస్తకాలైపోయాయి. ఈకారణంగా వారి రచనల మీద వారి వ్యక్తిగత జీవితపు ప్రభావం, తద్వారా 'మోరల్ పోలీసింగ్' ఎక్కువవుతోంది. బహుశా వర్జీనియా వూల్ఫ్ కళాకారుడు తన వ్యక్తిత్వాన్ని సామాజిక ఒత్తిళ్ళనుండి కాపాడుకోవాలని అందుకే అంటారేమో! ఆవిడ ప్రూస్ట్ లా రచయిత ఉనికిని పూర్తిగా తీసిపారెయ్యరు. వ్యక్తిత్వంతో సంబంధం లేని కళను సమర్థించరు. అది వేరే విషయం.

భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన బెర్గొట్ ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించిన సందర్భాలు చూస్తే బహుశా, బెర్గొట్‌లోని "గొప్ప రచయిత" అతని లోపలున్న సాధారణ మనిషిని ఓవర్ షాడో చేసేసాడేమో అనిపిస్తుంది. రచయితల ఊహాలోకపు కాల్పనిక జీవితాలు, భావజాలాలూ వాస్తవంలో తన చుట్టూ ఉండే మనుషుల పట్ల ఉండాల్సిన సాధారణ బాధ్యతలను విస్మరించేలా చేస్తాయేమో! కళాకారుడు నిజ జీవిత నైతిక కర్తవ్యాల స్థానాన్ని సృజనాత్మకతతో భర్తీ చేసుకుంటాడు. అదే సమయంలో ఇతరుల బాధను తన బాధగా అనుభవించగలిగే లక్షణం కూడా కళాకారులకు ఉంటుంది.

బెర్గొట్ చర్చ లేవనెత్తడం ద్వారా మనుషులు, మరిముఖ్యంగా కళాకారులు నైతికంగా సులభంగా అర్థమయ్యే జీవులు కారని చెప్పడమే ప్రూస్ట్ ఉద్దేశ్యం కావొచ్చు. గొప్ప సాహిత్యం తప్పనిసరిగా "మంచి మనుషుల" నుంచే రావాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు అది మనుషుల్లో బలహీనతల్నీ, అంతర్గత సంఘర్షణల్నీ చాలా లోతుగా అర్థంచేసుకున్న మనసుల్లో నుంచే పుడుతుంది. ఇలియట్ "Tradition and the Individual Talent" అనే వ్యాసంలో కళలోని భావోద్వేగం వ్యక్తిగతమైనది కాదంటారు. ఒక కళాకారుడి ఎదుగుదల నిరంతరం తనను తాను కోల్పోవడం (continual self-sacrifice / extinction of personality) ద్వారా మాత్రమే సాధ్యమంటారు. J. M. Coetzee, సాలింజర్, బిల్ వాటర్సన్ లాంటి ఆర్టిస్టులు పబ్లిక్ లైఫ్ కి సాధ్యమైనంత దూరంగా ఉండేవారు. కోట్జీ అంతర్ముఖత్వం ఆయన నవలల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రచయిత రూపం ఒక "carefully constructed image" అంటారాయన. కారణాలు వేరైనా, ఈ ముగ్గురూ సాహిత్యం అనేది ఏ రకమైన ఫిల్టర్లు లేని వ్యక్తీకరణ మాత్రమే కాదనే విషయంలో మాత్రం ఏకీభవిస్తారు. బెర్గొట్ చర్చలో  ప్రూస్ట్ చెప్పేది కూడా అదే! రచనలో వినిపించే స్వరం కేవలం రచయిత వ్యక్తిగత జీవితానికి ప్రతిబింబం కాదు. అది అనేకమైన ముసుగులు, భాష, సాహిత్య సంప్రదాయాలు, సృజన -- వీటన్నిటి మిశ్రమంగా ఏర్పడే కళారూపం.

Tuesday, July 22, 2025

Ulysses - James Joyce

 ఆధునిక సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన రచనల్లో జేమ్స్ జాయిస్ 'యులీసిస్' ఒకటి. చాలామంది పబ్లిషర్లు తిరస్కరించిన తర్వాత, పారిస్ లోని 'షేక్స్పియర్ అండ్ కంపెనీ' యజమాని సిల్వియా బీచ్ 1922లో 'యులీసిస్'ను తొలిసారి ప్రచురించారు. కానీ అశ్లీలతల పేరిట ఈ నవలను త్వరలోనే బ్యాన్ చేశారు. U.S.పోస్టల్ సర్వీసు ఏకంగా 'యులీసిస్' కాపీలను తగలబెట్టింది. కథాపరంగా చూస్తే 'యులీసిస్' ఎటువంటి ప్రత్యేకతలూ లేని నవల. దీని ప్రత్యేకత కథలో కంటే అతి సాధారణమైన కథను జాయిస్ ఎలా చెప్పారన్నదానిలోనే ఉంటుంది. జేమ్స్ జాయిస్ 1904 జూన్ 16వ తేదీన డబ్లిన్లోని కొందరు సాధారణ వ్యక్తుల జీవితంలోని ఒకే ఒక్క రోజు, అంటే సుమారు 18 గంటల కాలంలో జరిగే సంఘటనలను కథగా రాసుకొచ్చారు. జాయిస్ దైనందిన వ్యవహరాల్లో, మామూలు సంభాషణల్లో 'ఆర్ట్'ను ఎంత వైవిధ్యంగా చూపగలిగారన్నదే 'యులీసిస్' ప్రత్యేకత. నిజానికి ఇప్పటి ఓటీటీ వెబ్ సిరీస్లు, సినిమాలూ, పుస్తకాల్లో కనిపించేంత అశ్లీలత ఈ నవలలో లేదు. అందువల్ల ఆధునిక పాఠకుడికి ఈ పుస్తకంలో షాక్ వేల్యూ పెద్దగా కనిపించే అవకాశం లేదు. కానీ 1920ల కాలంలోని మతవిశ్వాసాలనూ, సాంఘిక నియమాలనూ సవాలు చేసిన ఈ నవలకు ఎదురైన వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.

Copyright A Homemaker's Utopia

సాహిత్యంలో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" కథనాలు కొత్తేమీ కాదు. ఉదాహరణకు  జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్', థామస్ బెర్న్హార్డ్ 'ది లూజర్' లాంటి నవలల్లో కథంతా ఒకే ఒక్క ముఖ్య పాత్ర తన స్వగతం చెప్పుకుంటున్నట్లు రాశారు. ఇటీవల నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న హాన్ కాంగ్ రచన 'ది వెజిటేరియన్', టాల్స్టాయ్ 'అన్నా కరెనిన'లాంటి నవలల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల స్వగతాలను ఒక్కొక్కరి దృష్టి కోణం నుంచీ విడదీసి చెబుతారు. ఇప్పుడు జాయిస్ వచనాన్ని పరిశీలిస్తే, ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుష- ఈ మూడు రకాల నేరేటివ్ లూ కథలో ఏ విధమైన క్రమమూ లేకుండా ఒకదాన్నొకటి ఢీ కొడుతూనే ఉంటాయి. అందువల్ల 'యులీసిస్' వచనమంతా అనేక పాత్రల ఆలోచనల అంతర్వాహిని అస్తవ్యస్తంగా పెనవేసుకుని చిక్కులు పడిపోయినట్లుంటుంది. కథలో లియోపోల్డ్ బ్లూమ్, స్టీఫెన్ డెడలస్, మోలీ వంటి ముఖ్య పాత్రలతో బాటు కథ మధ్యలో వస్తూ పోతూ ఉండే ఇతరత్రా పాత్రల 'స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్' కూడా కలగాపులగంగా కలిసిపోయి, జాయిస్ వచనాన్ని పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడనివ్వదు. పాఠకుడికి ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడడం మొదలులుపెట్టారో, సంభాషణ ఎప్పుడు ముగించారో స్పష్టత ఉండదు. వాక్యాల చివర ఫుల్ స్టాపులూ, కామాలూ ఉండవు. రెండు మూడు పేజీలు పూర్తైనా ఒక్కోసారి వాక్యం ముగింపు కానరాదు. ఇక చివరి అధ్యాయం 'పెనెలోపె'లో అయితే మోలీ స్వగతం గురించిన వాక్యం మొదట్నుంచి చివరి వరకూ ఆగకుండా అనంతమైన ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. ఏదేమైనా ఐరిష్ సంస్కృతి గురించీ, జేమ్స్ జాయిస్ శైలి గురించీ కనీస అవగాహన లేని సగటు పాఠకుడిని చెయ్యి పట్టుకుని 'యులీసిస్' యేరు దాటించే 'డిజిటల్ సాయాలు' ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అనేకం అందుబాటులో ఉండడం వల్ల 'యులీసిస్' చదవడం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలికే.

నిర్ధిష్టమైన మూలం, నేపథ్యం ఉండే ఇద్దరి మధ్య సంభాషణ, వాటి నేపథ్యం తెలియని మూడో వ్యక్తికి అర్థం కాదు. జాయిస్ నవల ఇటువంటి ఒక 'ఇన్సైడ్ జోక్' లాంటిది. ఎటొచ్చీ "యులీసిస్" రాయడం ద్వారా జాయిస్ ఏ ఒక్క వ్యక్తినో కాకుండా మొత్తం ప్రపంచాన్ని తన సంభాషణలో భాగంగా చేసుకునే ప్రయత్నం చేశారు. పాఠకులకు జాయిస్ శైలితో కాస్త చనువు ఏర్పడ్డాక, కథలో మనల్ని వెతుక్కోమంటూ దాచేసిన "ఈస్టర్ ఎగ్స్" పట్టుకోవడం ఒక ఆటలా ఉంటుంది. నిజానికి ఈ నవలకు ఫ్రేమ్ వర్క్ గా తీసుకున్న హోమర్ 'ఒడిస్సీ' చదివితే 'యులీసిస్' చదవడం తేలికన్నది అర్ధసత్యం మాత్రమే. కథాపరంగా ఒడిస్సీకీ, యులీసిస్ కీ పొంతనలుండవు. కానీ జాయిస్ తన స్నేహితులకు ఇచ్చిన 'గిల్బర్ట్ స్కీమా డయాగ్రమ్'లో ప్రతీ చాప్టర్ కూ 'ఒడిస్సీ' నేపథ్యమేమిటో చెప్పే లంకెలుంటాయి.

మొదటి 10 ఎపిసోడ్ల వరకూ విపరీతమైన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించినా 'సైరెన్స్' ఎపిసోడ్ మొదలు హాస్యం, వ్యంగ్యం, పేరడీలతో జాయిస్ పామరుల కోసమే ప్రత్యేకించి రాస్తున్నారనిపించేంతగా, కఠినమైన వచనాన్ని కొమ్ములు వంచి ఉన్న పళంగా 180 డిగ్రీల టర్న్ తిప్పుతారు. జాయిస్ వచనం ఆయన సృష్టించిన అనేక పాత్రల వెనక ఎక్కడో నక్కి పాఠకుడితో నర్మగర్భంగా దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయన తన గురించి ఎన్నో వివరాలను గుక్కతిప్పుకోకుండా చెప్పీచెప్పనట్లు చెబుతూనే, చివరి వరకూ దూరంగా, ఒక అపరిచిత వ్యక్తిగానే మిగిలిపోతారు. అయినప్పటికీ ఆయనంత ప్రామాణికమైన 'ఆటోబయోగ్రఫికల్ ప్రోజ్' మరెవ్వరూ రాయలేదంటారు. రచయిత పాఠకుడి స్థాయికి దిగే ప్రయత్నం అస్సలు చెయ్యకుండా తానున్న ప్లేన్ లోనే నిలబడి కథ చెప్పడం బోర్హెస్, క్రిఝానోవ్స్కీ, ఉంబెర్తో ఎకో వంటి చాలామంది రచయితల్లో కూడా కనబడుతుంది. జాయిస్ వచనంలో అందరికీ అర్థంకావాలనే ఉబలాటం కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయన వచనంలో అణువణువునా కనిపిస్తుంది.

ఇక జాయిస్ శైలిలో మనకు నవలంతా స్థిరంగా కనిపించే ఒకే ఒక్క నియమం- "నియమాలేవీ లేకపోవడమే". మొదటి మూడు చాప్టర్లలో చాలా పకడ్బందీగా కనిపించే వాక్య నిర్మాణం తరువాత చాప్టర్లలో పూర్తిగా వీగిపోతుంది. ఇక్కడ నుండీ పాండిత్య ప్రకర్ష తగ్గి జాయిస్ అసలుసిసలు "Foul play" మొదలవుతుంది. ఇక్కడ నుండీ జాయిస్ వాక్యనిర్మాణపు సంప్రదాయాలకూ, నవల రాయడానికి అమలులో ఉన్న విధివిధానాలకూ పూర్తి స్థాయిలో తిలోదకాలిచ్చేస్తారు. ఇక 11వ భాగం అయిన "సైరెన్స్"కి వచ్చేసరికి జాయిస్ స్వరంలోని "గూఫీ టోన్" పూర్తిగా అదుపు తప్పి తారాస్థాయికి చేరుకుంటుంది. “Bronze by gold heard the hoofirons, steelyrining imperthnthn thnthnthn” అనే వాక్యాలు చదివిన ఎజ్రా పౌండ్ "జాయిస్ తలకు ఏదైనా బలమైన దెబ్బ తగిలిందేమో" అని కలవరపడ్డారంటేనే మనం ఊహించుకోవచ్చు. జాయిస్ సాధారణంగా ఆనాటి రచయితలు వాడని నాగరికతకు సుదూరమైన అసభ్యమైన భాషని పచ్చిగా, ఎటువంటి ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా ఎందుకు వాడారని ఎవరో అడిగితే "This race and this country and this life produced me — I shall express myself as I am." అని సమాధానమిచ్చారాయన.

ఈ నవల నైతిక విలువలనూ, సభ్యతనూ మాత్రమే కాదు, కాల్పనిక సాహిత్యపు సంప్రదాయాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తుంది. జాయిస్ వచనం కొన్నిచోట్ల ఐరిష్, బ్రిటిష్ రైమ్స్, దేశవిదేశీ కవిత్వం, చరిత్ర లాంటి ఉత్తమమైన సాంస్కృతిక అంశాలతోనూ, మరికొన్ని చోట్ల వాటికి పూర్తి భిన్నంగా 'gibberish' భాషలో అతి సామాన్యమైన, ఒకింత అర్థంపర్థం లేని సంభాషణలూ, పారడీలతోనూ ఎగుడుదిగుడు రోడ్ల మీద పడుతూ లేస్తూ చేసే ప్రయాణాన్ని తలపిస్తుంది. కేంబ్రిడ్జి సెంటినరీ యులీసిస్' కు సంపాదికత్వం వహించిన క్యాథెరిన్ ఫ్లిన్ తన ఉపోద్ఘాతంలో "At a larger scale, Ulysses challenges the reader through its defiance of conventional modes of narration and characterization" అంటారు. జాయిస్ ఈ నవలను రాసిన తర్వాత, "భవిష్యత్తులో ఈ డబ్లిన్ నగరమూ, దాని సంస్కృతీ పూర్తిగా అదృశ్యమైపోయినా, నా పుస్తకం ఆధారంగా ఆ నగరాన్ని యథాతథంగా పునర్నిర్మించవచ్చు" అని తన మిత్రుడు, చిత్రకారుడూ అయిన ఫ్రాంక్ బడ్జెన్ తో అన్నారట.

ఐదువందల పేజీల పుస్తకాన్ని అరగంటలో కుదించే వెబ్ సిరీస్లు, అంతకంతకూ క్షీణించిపోతున్న మన అటెన్షన్ స్పాన్ ని సూచించే అర నిముషం వీడియోలు- ఇవన్నీ కలగలసిన 'ఇన్స్టంట్' సంస్కృతిలో 'యులీసిస్' చదవడం రాటుదేలిపోయిన మెదడును రీవైర్ చెయ్యడంలాంటిది. మొండి పశువు కొమ్ములు బలవంతంగా వంచడంలాంటిది. ఇలాంటి నవలలు మనం నేర్చుకున్నదంతా వదిలించుకుని మళ్ళీ పూర్వపు విద్యార్థిగా మారే అవకాశమిస్తాయి. ముఖ్యంగా జాయిస్ వాడిన ఐరిష్ యాసతో కూడిన 'పక్కా లోకల్' భాష మనకి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉందనే నమ్మకాన్ని తునాతునకలు చేసిపారేస్తుంది. మార్కస్ జూసాక్ నవల 'బుక్ థీఫ్'లో లీసెల్ మెమింగర్ చిన్నప్పుడు చదవడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్కో అక్షరాన్నీ కూడబలుక్కుంటూ పదాలను పేర్చుకోవడం గురించి రాస్తారు. అదే విధంగా జేమ్స్ జాయిస్ 'యులీసిస్' మనలో బాల్యంలో ఎక్కడో కోల్పోయిన తొలి పాఠకుడిని మరోసారి వెలికితీస్తుంది.

తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వివిధ - ఏప్రిల్ 7, 2025

https://www.andhrajyothy.com/2025/editorial/reading-ulysses-in-the-age-of-reels-1389989.html?fbclid=IwY2xjawLsd9JleHRuA2FlbQIxMABicmlkETF3bEFEbTVmQWtrUll1QVdEAR6Bxl1ZfvWpdczqUFghfV-_hr_f9aJ1VcBo-174tpLpytrt-nsZSn1fEZUNtQ_aem_yHHOYbKQ1jUwDQ7SO6VuEg

Thursday, July 17, 2025

Reading Ulysses - Part 2

9. Scylla and Charybdis :

Image Courtesy Google

ఆనాటి డబ్లిన్ సాహిత్య ప్రపంచానికి కేంద్రమైన 'నేషనల్ లైబ్రరీ'లో జరిగే సాహితీ గోష్టిలో షేక్స్పియర్ 'హేమ్లెట్' తో బాటు ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చకు వస్తుంది. 'హేమ్లెట్' పాత్ర కాల్పనికమా, వాస్తవమా? అసలు హేమ్లెట్ ఎవరు?- ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాచీన తర్కం ప్రకారం, షేక్స్పియర్ తననే 'హేమ్లెట్' పాత్రగా సృష్టించుకున్నారనే కొందరి వాదనను స్టీఫెన్ వ్యతిరేకిస్తాడు. ఈ చర్చలో షేక్స్పియర్, ఆయన భార్య ఆన్ హాథవే వైవాహిక జీవనం గురించి 'జాయిస్ మార్కు పదాల్లో' దొర్లే హాస్యం, వ్యంగ్యం వచనాన్ని ఆసక్తికరంగా చదివిస్తాయి. మరోవైపు బ్లూమ్ నేషనల్ మ్యూజియంలో గ్రీకు శిల్పాలను చూస్తూ ఉంటాడు. అతడి అభిరుచిని చూసి మల్లిగన్ అతణ్ణి "గ్రీకర్ దాన్ ది గ్రీక్స్" అని వేళాకోళం చేస్తాడు. ఇక ఈ అధ్యాయంలో మరో ముఖ్యమైన గమనింపు-- జాయిస్ శైలి గురించి ఒక వివరం స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రింది వాక్యాలు చూడండి-- రెండు, మూడు పదాలను కలిపి ఒకే పదంగా రాయడం చూస్తే జాయిస్ రచనా శైలిలో వాక్య నిర్మాణం శబ్దప్రధానంగా ఉంటుందని మన గమనింపులోకొస్తుంది.

—He’s a cultured allroundman, Bloom is, he said seriously. He’s not one of your common or garden… you know… There’s a touch of the artist about old Bloom.

Haines opened his newbought book.

—I’m sorry, he said. Shakespeare is the happy huntingground of all minds that have lost their balance.

'ఒడిస్సీ' 12వ పుస్తకంలో కిర్కె అతనికి ఇథాకాకు చేరుకోవడానికి ఒక మార్గం సూచిస్తుంది. సముద్ర ప్రయాణంలో రెండు భూభాగాల మధ్య ఒకవైపు రాళ్ళతో కూడిన ద్వీపంలా ఉండే ప్రాంతం, 'సిల్లా' అనే ఆరు తలల రాక్షసి నివాసమైతే మరోవైపున ఉండేది సుడిగుండాన్ని తలపించే చారిబ్డిస్ అనే రాక్షసి నివసించే ప్రాంతం. చారిబ్డిస్ సముద్ర ప్రయాణికులను తన సుడిగుండంలోకి లాక్కుని చంపేస్తుంది. ఒడిస్సియస్ ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒడిస్సియస్ ఓడ చారిబ్డిస్‌ సుడిగుండాన్ని సులభంగానే తప్పించుకున్నప్పటికీ, సిల్లా నోటికి ఆరుగురు అనుచరులు బలవుతారు. ఒడిస్సియస్‌ మిగిలిన సహచరులతో బాటు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడతాడు.

సోక్రటీస్ వ్యక్తిగత జీవితం గురించిన చర్చలో ఎన్ని హాస్యోక్తులో!! 

John Engliton said shrewdly-----What useful discovery did Socrates learn from Xanthippe?

Dialectic, Stephen answered.

ఈ ఎపిసోడ్లో ప్రాసలతో కూడిన జాయిస్ 'వర్డ్ ప్లే' చదవడానికి భలే సరదాగా ఉంటుంది, ఉదాహరణకు:

If others have their will Ann hath a way. [Ann Hathaway -- Shakespeare's wife]

ఇంకొక వాక్యం:

Between the acres of the rye 

These beautiful countryfolk would lie.

దానికి తోడు సంభాషణల మధ్యలో అనేక 'టంగ్ ట్విస్టర్స్' దొర్లుతూ ఉంటాయి. ఉదాహరణకు:

Peter Piper pecked a peck of pick of peck of pickled pepper.

The quaker librarian, quaking, tiptoed in, quake, his mask, quake, with haste, quake, quack.

"దేవుడి తర్వాత ఎక్కువ సృష్టి చేసింది షేక్స్పియరే" అన్న మాటలు చదివి నవ్వుకోకుండా ఉండలేం. [After God Shakespeare has created most]  

కళ గురించి కొన్ని అభిప్రాయాలు : 

“Art has to reveal to us ideas, formless spiritual essences. The supreme question about a work of art is out of how deep a life does it spring. Paintings of Moreau are paintings of ideas. The deepest poetry of Shelley, the words of Hamlet bring our mind into contact with the eternal wisdom; Plato's world of ideas. All the rest is the speculation of schoolboys for schoolboys.”

"After romantic assumption that artist is greater in the soul than other men and that the greatness of a work of art is in direct proportion to the greatness of the artist's soul."

ఇందులో గుర్తుండిపోయే మరికొన్ని వాక్యాలు :

Mahamahatma-- భారతీయ పురాణేతిహాసాల మీద జాయిస్ పట్టు ఇలాంటి అనేక పదాల్లో కనిపిస్తుంది.

I don't care a button 

The artist weave and unweave his image.

The mind, Shelly says , is a fading coal.

Father -daughter: Will he not see reborn in her, with the memory of his own youth added, another image?

When Rutlandbaconsouthamptonshakespeare or another poet of the same name in the comedy of errors wrote Hamlet he was not the father of his own son merely but, being no more a son, he was and felt himself the father of all his race, the father of his own grandfather, the father of his unborn grandson who, by the same token, never was born, for nature, as Mr Magee understands her, abhors perfection.

10. Wandering Rocks :

Image Courtesy Google

జాయిస్ అసలేం చెప్పాలనుకుంటున్నారో అర్థంకాక, కథకు మొదలూ-తుదీ  పట్టుకోలేక, పాఠకుడికి కాకులు దూరని కారడివిలో తప్పిపోయినట్లనిపించే  చాప్టర్-  ‘వాండరింగ్ రాక్స్’. ఇది 11 మినీ ఎపిసోడ్లుగా విభజించబడింది. ఇందులో  జరుగుతున్న సంఘటనల్లో ఒకే సమయంలో డబ్లిన్లోని వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతున్న విషయాలను ప్రస్తావిస్తారు. ఇందులో అనేక పాత్రల "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్" మల్టిపుల్ లేయర్స్ లో వచనాన్ని విడదీయలేనంత సంక్లిష్టంగా మార్చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఊరిలో బాగా రద్దీగా ఉన్న బజారులో నడుస్తుంటే ఎవరో తెలిసిన మనిషి కనిపిస్తాడనుకుందాం. అతణ్ణి పలకరించాక, ఇద్దరూ ఏదో పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ మరో చోటికెక్కడికో నడుస్తూ వెళ్తుంటే దారిలో మరో వ్యక్తి కనిపిస్తాడు. మొదటి ఇద్దరూ వీడ్కోలు చెప్పుకున్నాక, ఆ మూడో వ్యక్తి ప్రపంచంలో సంగతులు మొదలవుతాయి. ఎపిసోడ్ అంతా ఇదే విషయం రిపీటెడ్ గా అనేక వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది.

స్టీఫెన్ తోబుట్టువులు కేటీ, బూడీలు కడుపేదరికంలో తినడానికి తిండి లేక తమ పుస్తకాలను మదుపుకు పెట్టి డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమవుతారు. వాళ్ళ పాత్రల ద్వారా డబ్లిన్ దిగువ తరగతి ప్రజల్లో మతం పట్ల విధేయతనూ, నమ్మకాన్నీ ఆకలితో కొనే ప్రయత్నాన్ని చూస్తాం. "All things are inconstant except the faith in the soul, the service of which is eternal."

హోమర్ 'ఒడిస్సీ'లో కిర్కె ఒడిస్సియస్‌ కు ఇథాకాకు తిరిగివెళ్ళడానికి సూచించిన రెండు మార్గాల్లో ఒకటి సిల్లా- చారిబ్డిస్ అయితే మరొకటి 'వాండరింగ్ రాక్స్'. సముద్రంలో కదులుతూ ఉండే ఆ రాళ్ళ మధ్య నుండి ఓడలు వెళ్ళడం దాదాపు అసాధ్యమని భావించిన ఒడిస్సియస్ సిల్లా మరియు చారిబ్డిస్‌ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ఎపిసోడ్లో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" బ్లూమ్, స్టీఫెన్ లను దాటి ఇతర పాత్రలకు కూడా వ్యాపిస్తుంది. వచనంలో మనుషులతో బాటు డబ్లిన్ వీధులన్నీ మన కళ్ళముందు సజీవంగా ప్రాణంపోసుకున్నట్లనిపిస్తుంది. జాయిస్ ప్రతీ వీధి పేరు, దుకాణం పేరూ మొదలుకుని డబ్లిన్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రతీ చిన్న వివరమూ వదలకుండా చెబుతుంటే చదివేవాళ్ళకి డబ్లిన్ మ్యాప్ వెతుక్కుని ప్రక్కన పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. జాయిస్ ఈ ఎపిసోడులో వాడిన టెక్నిక్ ని "లాబిరింథ్" అని పిలుస్తారట. సాహిత్యంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన బోర్హెస్, కాల్వినోలతో బాటు నాకు మన మహాభారతంలో 'పద్మవ్యూహం' కూడా గుర్తొచ్చింది. డబ్లిన్ నగరం ఇక్కడ ఒక లాబిరింథ్‌గా రూపాంతరం చెందుతుంది.

“The reverend Hugh C. Love walked from the old chapterhouse of saint Mary’s abbey past James’s street, past the brewery of Messrs Arthur Guinness, Son and Co., Limited, and past the Irish National Foresters’ Hall, past Lapton’s undertakers.”

కానీ డబ్లిన్ గురించి ప్రాథమికమైన అవగాహన లేని పాఠకులకు ఇందులోని  వివరణలు ఏదో గ్రహాంతర వ్యవహారంలా అనిపిస్తాయి. పాఠకుడి మెదడులో జరుగుతున్న సంఘటనలను ఆయా ప్రాంతాలతో సహా దృశ్య రూపంలో చిత్రీకరించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. దానికి తోడు ‘వాండరింగ్ రాక్స్’ ఎపిసోడ్ కొన్ని ముఖ్య పాత్రల చుట్టూ తిరగదు. ఇందులో ఏ పాత్రకాపాత్ర ముఖ్యమనే అనిపిస్తుంది. మొత్తం డబ్లిన్ సమాజం ఇందులో మెయిన్ స్టేజిని తీసుకుంటుంది. చివరకు బ్లూమ్, స్టీఫెన్లు కూడా ఆ బిగ్ పిక్చర్ లో ప్రాముఖ్యత లేని వాళ్ళలాగే కనిపిస్తారు. ఇందులో మరణం తాలూకు సంతాపం ప్రధానంగా కనిపిస్తుంది. మరణించిన పాడీ డిగ్నమ్ కొడుకు మాస్టర్ ప్యాట్రిక్ డిగ్నమ్, తల్లిని కోల్పోయిన స్టీఫెన్-- వీరిద్దరి మానసిక స్థితీ ఒకేలా ఉంటుంది.

11. Sirens :

Image Courtesy Google

హోమర్ 'ఒడిస్సీ' 12 వ పుస్తకంలో ఒడిస్సియస్ ఓడ ప్రయాణంలో ఎదురయ్యే 'సైరెన్స్' అనే ప్రమాదం గురించి కిర్కె ముందే అతణ్ణి హెచ్చరిస్తుంది. 'సైరెన్స్'  అనే సముద్ర కన్యల రూపంలో ఉండే రాక్షసులు మధురమైన స్వరాలతో  పాటలు పాడుతూ వారిని మైకంలో ముంచేసి తమవైపు ఆకర్షిస్తూ మాయ చేస్తాయి. ఆ మాయకు లొంగి వీళ్ళు గనుక ఆ ద్వీపం వైపు వెళ్తే ఇక అంతే సంగతులు. మృత్యుమార్గంలోకి వెళ్ళినట్లే. ఒడిస్సియస్ తనను ఓడ స్తంభానికి కట్టెయ్యమని ఆదేశించి, తన అనుచరుల్ని 'సైరెన్స్' శబ్దాలు వినబడకుండా మైనంతో చెవులు మూసుకోమంటాడు. ఆవిధంగా అందరూ సైరెన్స్ బారిన పడకుండా సురక్షితంగా తప్పించుకుంటారు. జాయిస్ బ్లూ ప్రింట్ గిల్బర్ట్ స్కీమా ప్రకారం 'సైరెన్స్' బార్ లో పనిచేసే మెయిడ్స్ అయితే, వారి ద్వీపాన్ని స్టీఫెన్ మద్యం సేవించడానికి వెళ్ళిన 'ఆర్మాండ్ బార్' గా అనుకోవచ్చు.

బ్లూమ్ సాయంత్రం నాలుగవుతోందని అనుకుంటూ ఒక నది ఒడ్డున నడుస్తూ ఉంటాడు. నిజానికి నాలుగ్గంటలకి బ్లూమ్ భార్య మోలీ తన కాన్సర్ట్ మేనేజర్ [లవ్ ఎఫైర్] బ్లేజెస్ బోయ్లన్ ని కలవాల్సి ఉంది. బ్లూమ్ మధ్యాహ్నం భోజనం చెయ్యడం మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఏదైనా మంచి హోటల్ కోసం వెతుకుతూ, ఉదయం అందిన మార్తా ఉత్తరానికి జవాబు కూడా రాయాలని మనసులో అనుకుంటాడు. మరోవైపు ఆర్మండ్ హోటల్ బార్‌ లో స్టీఫెన్ కూర్చుని తాగుతుంటాడు. అదే సమయంలో ఒక ఎస్సెక్స్ బ్రిడ్జ్ పై కారులో బ్లేజెస్ బోయ్లన్ ని చూసిన బ్లూమ్ కు అతణ్ణి అనుసరించాలనే బుద్ధిపుడుతుంది. బ్లూమ్ బోయ్లన్ ను అనుసరించే క్రమంలో రిచీ గౌల్డింగ్ ను కలుస్తాడు. ఆకలిగా ఉండడంతో ఇద్దరూ ఆర్మండ్ బార్లో తినాలని నిర్ణయించుకుంటారు. అదే హోటల్లో బోయ్లన్ కు 'బార్ మెయిడ్' మిస్ డౌస్ మద్యం ఇస్తూ "సోన్నర్ లా క్లోచ్" అనే ట్రిక్ ను ప్రదర్శిస్తుంది. ఇక్కడ మిస్ లిడియా డౌస్, మిస్ మినా కెనెడీ అనే ఆర్మండ్ హోటల్ బార్ మెయిడ్స్ ని హోమర్ "ఒడిస్సీ"లో "సైరెన్స్"కు ప్రతీకలుగా చూడవచ్చు. ఆ బార్ లో స్టీఫెన్, బోయ్లన్ లాంటి అందరూ ఇతరుల స్వరాలతో కూడిన సంగీతమనే మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ బ్లూమ్ మాత్రం ఒడిస్సియస్ లాగే ప్రేక్షక పాత్రలో దాన్నుండి విడివడి, బాహ్య ప్రపంచానికి చెందిన శబ్దాలకు దూరంగా తన స్వతఃసిద్ధమైన ఉనికిని కాపాడుకుంటాడు.

'సైరెన్స్' శైలి కొత్తగానూ, వైవిధ్యంగానూ ఉంటుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా ఆడుకునే "మేజిక్ రెయిన్బో స్ప్రింగ్ టాయ్" తెలుసు కదా! ఈ ఎపిసోడ్లో జాయిస్ శైలి నాకు ఆ రెయిన్బో రింగ్స్ ని గుర్తుకు తెచ్చింది. తన అరచేతుల్లో భాషను  సప్తవర్ణాల మిశ్రమంగా చేసి, ఆ రింగ్స్ ఎలా తిరుగుతాయో అలా ఇష్టంవచ్చినట్లు వంపులు తిప్పుతూ భాషతో యథేచ్ఛగా ఆడుకుంటారు జాయిస్. కొన్నిచోట్ల అలా తిప్పుతున్నప్పుడు జాయిస్ వచనం పూర్తిగా అదుపుతప్పి వక్రీకరణలోకి వెళ్ళిపోతుంది. దానికి తోడు శబ్దానికి [సైరెన్స్] ఈ చాప్టర్లో ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే "సైరెన్స్" వచనం పేరుకి తగ్గట్టు సంగీత  ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ జాయిస్ వచనం పూర్తిగా నేలవిడిచి సాముచేస్తూ వేగం హెచ్చించి గగనతలంలోకి "టేక్ ఆఫ్" తీసుకుంటుంది. సైరెన్స్ ఎపిసోడ్ ని చదవడం కంటే వినడం ప్రధానం. వివిధ స్వరాలను కలిపి "ఫ్యూషన్" చేసినట్లు రాసిన వచనం అర్థంచేసుకోవడం కూడా అంత సులభం అనిపించలేదు. ఈ క్రమంలో సాధారణ పాఠకుడికి కూడా విమర్శకుడికి మల్లే జాయిస్ చెప్పే కథ కంటే క్రాఫ్ట్ పైకి దృష్టి మళ్ళుతుంది.

ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి :

“Bloom looped, unlooped, noded, disnoded.”

“Tingting. All sing. All a ring.”

“A look. Brahms’ words. He doesn’t see. Me. Closes eyes. Ears full, of music.”

12. Cyclops :

Image Courtesy Google

'సైక్లోప్స్' ఎపిసోడ్లో డబ్లిన్ వాసుల సంభాషణల్ని పేరడీ రూపంలో రాస్తారు. నేరేషన్ ఫస్ట్ పర్సన్లో మనకు మునుపు పరిచయం లేని వ్యక్తి "నోమన్" స్వరంలో ఉంటుంది. జాయిస్ "గిల్బర్ట్ స్కీమా"లో "సైక్లోప్స్" నేరేటర్ పేరు కూడా 'నోమన్' అని క్లూ ఇస్తారు. గమనిస్తే హోమర్ "ఒడిస్సీ"లో 'సైక్లోప్స్' కథలో ఒక సందర్భంలో 'నోమన్' అనే పేరును ఒడిస్సియస్ తన పేరుకి ప్రతిగా తాత్కాలికంగా వాడుకుంటాడు. జన్మతః యూదుడైన బ్లూమ్ ని ఐర్లాండ్ వాసులు "నువ్వు ఏ జాతి వాడివి?" అని వేళాకోళం చేస్తారు. దానికి బ్లూమ్, "నేను ఐర్లాండ్ లో పుట్టాను, నేను ఐరిష్" అని సమాధానం చెప్తాడు. మరో సందర్భంలో, వారి వాక్బాణాలకు అతడి స్పందన అతడి నైతికతకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది: 

“But it's no use, says he. Force, hatred, history, all that. That's not life for men and women, insult and hatred. And everybody knows that it's the very opposite of that that is really life.”

“Love, says Bloom. I mean the opposite of hatred.”

ఈ ప్యారడీలలో 19వ శతాబ్దపు మరియు ఆంగ్లో-ఐరిష్ పునరుద్ధరణకాలపు ఐరిష్ సాగాలు, పురాణాల హాస్యవ్యంగ్య ప్రదర్శనలూ, ఐరిష్ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యానాలూ ఉంటాయి. యూదుడైన బ్లూమ్ మీద మాటలతో జరిగే దాడిలో పబ్ అంతర్గత రాజకీయాలూ, డబ్లిన్ లో సామజిక వర్గాల మధ్య జరిగే లావాదేవీలూ ఒక్కొక్కటిగా బయటపడతాయి. "సైక్లోప్స్" ఎపిసోడ్ ఐరిష్ సమాజపు జాతీయత ముసుగులో అసహనానికి వివరణాత్మకమైన చిత్రికపడుతుంది. ఈ ఎపిసోడ్ ని జాయిస్ డబ్లిన్ మీద వ్యంగ్యంతో కూడిన విమర్శ రూపంలో రాశారు.

హోమర్ "ఒడిస్సీ" 9వ పుస్తకంలో ఒడిస్సియస్ ఓడ ప్రయాణంలో అతడి అనుచరులతో బాటు "సైక్లోప్స్" అనే ఒంటి కన్ను రాక్షసులుండే చోటుకి చేరుకుంటారు. ఆ రాక్షసులు క్రూరమైన నరమాంస భక్షకులు. ప్రమాదవశాత్తూ ఒడిస్సియస్ తన అనుచరులతో బాటు పొలిఫెమస్ అనే రాక్షసుడి గుహలో చిక్కుకుంటాడు. ఆ రాక్షసుడు నలుగురు అనుచరులను అప్పటికప్పుడే చంపి తినేసి, వెనువెంటనే నిద్రలోకి జారిపోతాడు. ఒడిస్సియస్ ఒక ఉపాయంతో పొలిఫెమస్‌ ను మద్యంతో మత్తులోకి తీసుకువెళ్తాడు. ఆ మత్తులో రాక్షసుడు ఒడిస్సియస్ పేరు అడిగినప్పుడు, తన పేరు "నోమన్" అని అబద్ధం చెబుతాడు. మద్యం మత్తులో ఉన్న పొలిఫెమస్ ఒంటి కన్నుని కర్రతో పొడిచి అతణ్ణి గుడ్డివాణ్ణి చేస్తాడు.

ఒడిస్సియస్, అతని అనుచరులూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని గొర్రెల మధ్య దాక్కుని ఎలాగైతేనేం గుహ నుండి తప్పించుకుంటారు. బ్రతుకుజీవుడా అని తిరిగి వెళ్ళిపోకుండా, ఒడిస్సియస్ ఓడలోకి చేరిన తర్వాత తరుముకుంటూ ఒడ్డు వరకూ వచ్చిన పొలిఫెమస్ ను కవ్విస్తాడు. దానికి ప్రతిగా అతడు వారిపై రాళ్ళు రువ్వుతాడు. నిజానికి పొలిఫెమస్ తండ్రి సముద్ర దేవుడు "పొసైడన్". ఈ కారణంగానే ఒడిస్సియస్ ఓడ నాశనమై అతని ప్రయాణం భగ్నమవుతుంది. ఈ ఎపిసోడ్ శైలిని "గిగాంటిజం" [gigantism] అంటారట. జాయిస్ 'బ్లూ ప్రింట్' గిల్బర్ట్ స్కీమాలో జాయిస్ ఒడిస్సియస్ తాత్కాలికంగా పెట్టుకున్న పేరు "నోమన్" గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ చాప్టర్ లో జాయిస్ వచనం అసంబద్ధంగా అనిపించే వర్ణనలతో, అనేక ప్యారడీలతో కలగలిసి ఉంటుంది.

13. Nausicaa :

Image Courtesy Google

ఒక సాయంకాలం ముగ్గురు స్నేహితులు- గెర్టీ మాక్‌డౌవెల్, సిస్సీ క్యాఫ్రీ, ఎడీ బోర్డ్మన్ 'శాండీమౌంట్ స్ట్రాండ్ బీచి'లో గడుపుతూ ఉంటారు. [“There was none so fair among them as Gerty MacDowell.”] వారి వెంట సిస్సీ పిల్లలు టామీ, జాకీ (కవలలు), ఎడ్డీ నెలల పసిబిడ్డ కూడా ఉంటారు. టామీ, జాకీలు ఒడ్డున ఇసుక గూళ్ళు కడుతూ ఉంటారు. గెర్టీ వీరికి కొంత దూరంలో ఒంటరిగా కూర్చుని తన ప్రియుడు రెగ్గీ వైలీ గురించిన ఆలోచనల్లో మునిగిపోతుంది. 21 ఏళ్ళ గెర్టీ 'రెగ్గీ వైలీ' తనకు తగినవాడు కాదని అనుకుంటుంది. ఇక్కడ ఆమె, స్త్రీ సహజమైన ఆలోచనలకు ప్రతీకగా కనిపిస్తుంది.

ఈలోగా కవలలు ఆడుకుంటూ బంతిని విసిరేస్తే అక్కడే మరోచోట బండరాళ్ళపై కూర్చున్న బ్లూమ్ దాన్ని అందుకుని వారివైపు విసిరేస్తాడు. గెర్టీ పాదాల వద్దకు చేరిన ఆ బంతిని చూస్తూ అది విసిరిన వ్యక్తిని చూసినప్పుడు బ్లూమ్ మొహం "ఆమె జీవితంలో చూసిన అత్యంత దుక్ఖంతో కూడుకున్న ముఖంగా" కనిపిస్తుంది.

తర్వాత వర్ణించనలవికాని కొన్ని అసభ్యమైన సంఘటనల తర్వాత లియోపోల్డ్ బ్లూమ్ దూరంగా లేచి కుంటుకుంటూ నడుస్తున్న గెర్టీ ని చూసి "అయ్యో పాపం" అనుకుంటాడు. ఇక్కడ బ్లూమ్, గెర్టీ ల ఆలోచనలు స్త్రీ-పురుష భిన్నత్వాన్ని స్పష్టంగా చూపిస్తాయి. 'నాసికా' చాప్టర్లో గెర్టీ మాక్‌డోవెల్ శృంగారం, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే స్త్రీ సహజమైన స్వరానికీ, లియోపోల్డ్ బ్లూమ్ పురుష సహజమైన భౌతికవాదపు నిర్లిప్తతతో కూడిన స్వరానికీ మధ్య భిన్నతను స్పష్టంగా చూడవచ్చు. ఈ రెండు శైలుల మధ్య వ్యత్యాసం వారి రెండు ప్రపంచాల మధ్య దూరాన్ని సూచిస్తుంది. 'నాసికా'లో గెర్టీ పాత్ర స్త్రీ తన ప్రపంచాన్ని ఎంత రొమాంటిక్‌ దృష్టికోణం నుంచి చూస్తుందో చూపిస్తుంది. కాల్పనిక ప్రపంచానికి చెందిన ఆమె ఆలోచనలు ఆమెకు ఏవిధంగానూ  వాస్తవంలో ఆచరణీయం కాలేవని తెలుస్తుంది. గెర్టీ పాత్ర, ఆ కాలపు స్త్రీల మ్యాగజైన్లలో కనిపించే  పాపులర్ లిటరేచర్ నుండి ప్రేరణ పొందిన "కలల ప్రపంచంలో విహరించే 20వ శతాబ్దపు ఆధునిక కథానాయిక" పాత్రకు ప్రతినిధిలా కనిపిస్తుంది. ఆ కాలపు రొమాంటిసిజపు సాహిత్యం ద్వారా ప్రభావితమైన గెర్టీ తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషిగా కనిపిస్తుంది. అదే సమయంలో బ్లూమ్ ఆలోచనలు అతని అనిశ్చితమైన మనస్థితిని,  నిర్లిప్తతతో కూడిన ఒంటరితనాన్నీ ప్రతిబింబిస్తాయి.

"యులీసిస్"లో గెర్టీ పాత్ర హోమర్ "ఒడిస్సీ"లో 'నాసికా' పాత్రకు ప్రతీక. నాసికా ఒడిస్సియస్‌ ను ఆ దేశపు రాజైన తన తండ్రి వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణానికి సహాయం చేస్తుంది. హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ కాలిప్సో ద్వీపాన్ని విడిచిపెట్టిన తర్వాత సముద్ర దేవుడైన పొసైడన్ ఆగ్రహానికి గురై అతడి ఓడ నాశనమవుతుంది. నడిసముద్రంలో పడిపోయిన ఒడిస్సియస్  ఎట్టకేలకు అథీనా సాయంతో ఫైషియన్ల భూమి తీరానికి కొట్టుకుని వస్తాడు. అక్కడ కొన్ని పొదల క్రింద దాక్కుని, అలసిపోయి నిద్రపోతాడు. అంతఃపుర వస్త్రాలను ఉతకడానికి నదికి చేరిన యువరాణి 'నాసికా', ఆమె చెలికత్తెలూ ఒడిస్సియస్ ను చూస్తారు. అథీనా మాయతో యువకుడిగా మారిన ఒడిస్సియస్ ను చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. తనతో పాటు తండ్రి ఆల్సినస్ వద్దకు తీసుకెళ్తుంది. నాసికా తండ్రి, ఆల్సినస్‌ ఒడిస్సియస్ ను ఆదరించి అతడి ప్రయాణాన్ని కొనసాగించేందుకు సహాయం చేస్తాడు.

14. Oxen of the Sun :

Image Courtesy Google

లియోపోల్డ్ బ్లూమ్ ఆ రాత్రి హోల్స్ స్ట్రీట్‌లోని నేషనల్ మెటర్నిటీ హాస్పిటల్  కి వెళ్తాడు. ప్రసవ వేదనతో ఉన్న మిసెస్ ప్యూర్ఫాయ్ పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. మూడు రోజులుగా పురిటినొప్పులతో ఆమె బాధపడుతోంది తెలిసి సానుభూతి చూపిస్తాడు. అదేచోట మెటర్నిటీ వార్డు బయట కొందరు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల స్త్రీ ప్రసవవేదన పడుతోందన్న స్పృహ వారికుండదు. బ్లూమ్‌ మెడికల్ స్టూడెంట్ లెనెహన్ తో మిసెస్ ప్యూర్ఫాయ్ కష్టం గురించి మాట్లాడినా మత్తులో జోగుతున్న లెనెహాన్ అదేమీ పట్టనట్లుంటాడు.

హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ అతని అనుచరులతో కలిసి "సిల్లా మరియు చారిబ్డిస్" మార్గం గుండా ప్రయాణించి ట్రినాక్రియా (ప్రస్తుత సిసిలి)  చేరుకుంటాడు. అది సూర్యదేవుడు "హెలియోస్‌" యొక్క స్వస్థలం. కిర్కె సూర్యదేవుని ఆవులకు హాని తలపెడితే ప్రమాదమని ముందే హెచ్చరించిన కారణంగా ఒడిస్సియస్ ఆ ద్వీపంలో అడుగుపెట్టడానికి ఇష్టపడడు. కానీ అప్పటికే అలసిపోయిన అతని అనుచరులు విశ్రాంతి కావాలని కోరగా, ఒడిస్సియస్ అక్కడి గోవులకు హాని తలపెట్టమని వారి దగ్గర మాట తీసుకుంటాడు. కానీ ఒడిస్సియస్ లేని సమయం చూసి, ఆకలికి తట్టుకోలేని అనుచరుల్లో కొందరు గోవుల్ని చంపి తినేస్తారు. తిరిగివచ్చిన ఒడిస్సియస్ పొంచి ఉన్న ప్రమాదం గ్రహించి, వెనువెంటనే అనుచరులతో కలిసి తిరుగుప్రయాణమవుతాడు. కానీ హోలియోస్,  అప్పటికే జ్యూస్‌ కు తన గోవులను ఒడిస్సియస్ మనుషులు వధించిన సంగతి ఫిర్యాదు చెయ్యడంతో ఆగ్రహించిన జ్యూస్ పెనుతుఫాను సృష్టించి ఓడను ధ్వంసం చేస్తాడు. ఆ  ప్రమాదంలో ఒడిస్సియస్‌ తప్ప మిగతా వందమందీ సముద్రంలో మునిగిపోతారు. 

ఇక 'యులీసిస్' విషయానికొస్తే, ఈ అధ్యాయాన్ని ఇంగ్లీష్ వచనంలో లాటిన్, ఆంగ్లో సాక్సన్ మూలాలను గుర్తుచేస్తూ, పేరడీల రూపంలో రాశారు. నాకు హోమర్ 'ఒడిస్సీ'కీ, ఈ చాప్టర్ కీ ఒక్కటంటే ఒక్క పోలిక కూడా కనబడలేదు. కానీ జాయిస్ తన మిత్రుడు ఫ్రాంక్ బడ్జెన్‌కు రాసిన ఒక ఉత్తరంలో ఆ ఆసుపత్రిని ఒక గర్భాశయంగా అభివర్ణిస్తూ "Bloom is the spermatozoon, the hospital the womb, the nurse the ovum, Stephen the embryo" అని రాశారట. అది చదివి "ఓహో!" అనుకోవడమే. జాయిస్ దాన్నొక పటంగా కూడా గీయించారట. అది ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రరీలో ఉందంటారు. 

‘ఆక్సెన్ ఆఫ్ ది సన్’ 'యులీసిస్'లో ఇది అత్యంత సంక్లిష్టమైన ఎపిసోడ్‌ అంటారు. ఈ ఎపిసోడ్లో సంభాషణలు అర్థం కావాలంటే పాఠకులకు సాహిత్యం గురించి విస్తృతమైన అవగాహన ఉండి తీరాలి. కొన్ని పేరాగ్రాఫులు అర్థం కావాలంటే కొందరు రచయితల రచనల్ని ఖచ్చితంగా చదివి ఉండాలి, స్థలకాలాదులతో సహా వివిధ చారిత్రక అంశాలపై పట్టు ఉండాలి. ఇవేమీ తెలీని సాధారణ పాఠకులకు ఇదొక కొరకరాని కొయ్యలానూ, బ్రహ్మపదార్థంగానూ మిగిలిపోతుంది. నాకైతే ఇది చదువుతున్నంతసేపూ పెద్దపెద్ద కంకర్రాళ్ళ దారిలో చెప్పుల్లేకుండా నడుస్తున్నట్లుంది. :) :)

15. Circe :

Image Courtesy Google

"ఒడిస్సీ" 10వ భాగంలో లెస్ట్రిగోనియన్లతో జరిగిన యుద్ధం తరువాత ఒడిస్సియస్ అనుచరులు తీరాన్ని వెతుక్కుంటూ కిర్కె ద్వీపానికి చేరతారు. అక్కడ యురిలోకస్ మినహా మిగిలిన వారంతా కిర్కె మాయ వల్ల పందులుగా  మారిపోతారు. యురిలోకస్ మాత్రం ఒడిస్సియస్‌ కు ఈ విషయాన్ని చెప్పడానికి తప్పించుకుంటాడు. విషయం తెలిసిన ఒడిస్సియస్ ఒంటరిగా కిర్కె ఉన్న చోటుకి బయలుదేరతాడు. మార్గమధ్యంలో దేవతల వార్తాహరుడు హర్మిస్ ను కలుస్తాడు. కిర్కె మాయను ఎదుర్కోడానికి హర్మిస్ అతనికి ఒక మంత్రించిన మూలికను ఇస్తాడు. ఒడిస్సియస్ కిర్కె ప్రాంగణానికి చేరుకోగానే ఆమె  మంత్రాలు మూలిక శక్తి వలన పనిచెయ్యవు. ఒడిస్సియస్ హెచ్చరికల వలన  ఆమె అతడి అనుచరులను మళ్ళీ మనుషులుగా మారుస్తుంది. ఆ తర్వాత కిర్కె వారందరికీ సంవత్సరం పాటు తన ద్వీపంలో అతిథి మర్యాదలతో కూడిన వసతులు ఏర్పాటు చేసి ఒడిస్సియస్ ను పాతాళలోకంలో (హేడ్స్) ఉన్న    టైరేసియస్‌ ను వెళ్ళి కలవమని సలహా ఇస్తుంది.

ఇక "యులీసిస్"లో ఈ చాప్టర్ నైట్‌టౌన్లో 'మబ్బోట్ స్ట్రీట్' అనే చోట జరుగుతుంది. అది డబ్లిన్లోని ఒక వేశ్యావాటిక. మనకు మునుపు శాండీ మౌంట్ స్ట్రాండ్‌లో కనిపించిన సిస్సీ కాఫ్రీ, ఎడ్డీ బోర్డ్మన్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తారు. మద్యం మత్తులో స్టీఫెన్ మరియు లింఛ్ కూడా అక్కడకు చేరతారు. బ్లూమ్ నైట్‌టౌన్‌లో టాల్బాట్ స్ట్రీట్ దగ్గర ఉంటాడు. బ్లూమ్ స్టీఫెన్‌ను చూసే క్రమంలో ఉత్సాహంగా రోడ్డు దాటుతుండగా ఒక వాహనం గుద్ది తాత్కాలిక భ్రమల్లోకి వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్లో తరువాత జరిగేదంతా అతడి భ్రమల్లోని కాల్పనిక ప్రపంచానికి చెందిన కథే. ఆ కల్పనల్లో బ్లూమ్ మరణించిన తన తల్లిదండ్రుల్నీ, భార్య మోలీనీ చూస్తాడు. ఈ ఎపిసోడ్ "ఒడిస్సీ"లో 'కిర్కె' చాప్టర్లో కిర్కె ఒడిస్సియస్ అనుచరులనందరినీ పందులుగా మార్చేసిన వైనాన్నీ, ఆమె మాయాజాలంలోపడి మతిభ్రమించి వారి పరిస్థితినీ ప్రతిబింబిస్తుంది. ఆ భ్రమల్లో బ్లూమ్ పురుషత్వంపై కఠిన విమర్శలు ఎదుర్కొంటాడు. అనేక ఊహాజనిత పాత్రల మధ్య ఇందులో ఒక పాత్రకు "విరాగ్" అనే పేరు పెడతారు. నిజానికి అది లియోపోల్డ్ బ్లూమ్ తండ్రి పేరు. [Rudolf Virag (later Rudolph Bloom)]

'కిర్కె' ఎపిసోడ్ శైలి చాలా నాటకీయంగా అనిపిస్తుంది. ఇందులో పాత్రల వస్త్రధారణ గురించి వివరాలు, బిగ్గరగా తెచ్చిపెట్టుకున్నట్లుండే సంభాషణలు చదువుతున్నప్పుడు పాత కాలపు నాటకాలు గుర్తొస్తాయి. ఇందులో జాయిస్ వచనం, ఒకవేళ ఫ్రాయిడ్ కలల్ని సన్నివేశాలుగా చేసి రాస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో స్టీఫెన్, బ్లూమ్ తమలోని అంతర్గత భయాలతో ప్రత్యక్షంగా తలపడతారు. ఇందులో ప్రధాన కథ బ్యాక్ స్టేజి తీసుకోగా  ఫాంటసీతో కూడిన జాయిస్ వర్ణనలు వాస్తవానికీ, కల్పనకూ మధ్య రేఖల్ని పూర్తిగా చెరిపేస్తాయి. కలలు మనిషి "సబ్కాన్షియస్ మైండ్"లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలకూ, అనుభవాలకూ ప్రతిరూపాలంటారు. ఈ ఎపిసోడ్ అటువంటి కలల ద్వారా వ్యక్తుల ఆంతరంగిక ప్రపంచాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫ్రాయిడ్  నమూనాలో ప్రతీ పాత్రలోని అంతర్ముఖత్వాన్నీ బయటికి తీసి, వాటిని ఒక రంగస్థల నాటకంగా చూపిస్తారు జాయిస్. ఎటొచ్చీ పాఠకులకు వాస్తవం ఎక్కడ ముగుస్తోందో, ఫాంటసీ ఎక్కడ మొదలవుతుందో కనిపెట్టడం చాలా కష్టం. 

16. Eumaeus :

Image Courtesy Google

స్టీఫెన్, బ్లూమ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో మాట్లాడుకుంటూ కనిపించే ఎపిసోడ్ ఇది. మద్యం మత్తులో ఉన్న స్టీఫెన్ కి బ్లూమ్ చెడు సావాసాల వల్ల జరిగే  అనర్థాల గురించి హెచ్చరిస్తాడు. స్టీఫెన్ కు దాహం వెయ్యడంతో ఇద్దరూ కలిసి నడుచుకుంటూ క్యాబ్‌మాన్ షెల్టర్‌కు చేరుకుంటారు. అక్కడ ఒక నావికుడితో జరిగే చర్చలో బ్లూమ్, స్టీఫెన్ వ్యక్తపరిచే అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉంటాయి. నావికుడు తన ఛాతీపై ఉన్న ఒక టాటూను వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. అది క్రూసిఫిక్షన్ దృశ్యానికి ప్రతీకగా అనిపిస్తుంది. ఈలోగా ఆ ప్రదేశంలో జరిగే మూక అల్లరి తర్వాత బ్లూమ్, మద్యం మత్తులో ఉన్న స్టీఫెన్‌ను వెంటనే అక్కడి నుండి తీసుకుని బయలుదేరతాడు.

హోమర్ "ఒడిస్సీ"లో 'Eumaeus' అంటే ఒడిస్సియస్ కు చాలా నమ్మకస్తుడైన పందుల కాపరి పేరు. ఇథాకాకు తిరిగొచ్చిన ఒడిస్సియస్ కు అతడు రహస్యంగా తన ఇంట్లో ఆతిధ్యం ఇస్తాడు. బ్లూమ్ స్టీఫెన్ ను తన ఇంటికి తీసుకెళ్ళి ఆతిధ్యం ఇచ్చే సన్నివేశం దానికి ప్రతీక. స్టీఫెన్ పాండిత్యం పట్ల లోలోపలే ఆరాధనాభావంతో ఉన్న బ్లూమ్ అతణ్ణి గమనిస్తూ ఉంటాడు. 

He had a sort of scholarly manner and he sidled along rather dubiously, as if he felt himself not quite fit for the position.

స్టీఫెన్ మాటలు- "A man of genius makes no mistakes. His errors are volitional and are the portals of discovery."

17. Ithaca :

Image Courtesy Google

బ్లూమ్, స్టీఫెన్- ఇద్దరూ ఎక్లెస్ వీధి వైపుకి నడుస్తూ మాటల్లోపడతారు. నైట్‌టౌన్‌లో స్టీఫెన్ కుప్పకూలిపోడానికి సరైన పోషకాహారం లేకపోవడం, మద్యం అధికంగా తాగడం అని బ్లూమ్ అభిప్రాయపడతాడు. బ్లూమ్ తన అభిప్రాయాలు, స్టీఫెన్ అభిప్రాయాలు కొన్ని విషయాల్లో ఒకేలా ఉంటే, మరికొన్ని విషయాల్లో భిన్నంగా ఉన్నాయని గమనిస్తాడు. ఇద్దరూ ఎక్లెస్ వీధి నంబర్ 7 లో ఉన్న బ్లూమ్ ఇంటికి చేరుకున్న తర్వాత గానీ అతడికి ఇంటి తాళం చెవి మర్చిపోయిన సంగతి గుర్తురాదు. తలుపు కొట్టి నిద్రపోతున్న మోలీని లేపడం ఇష్టంలేక ఇంటి బయట రెయిలింగ్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి, వంటగదిలో దీపం వెలిగించి హాల్లో తలుపు తీసి స్టీఫెన్‌ను లోపలికి ఆహ్వానిస్తాడు.

"ఇథాకా"లో జీడీపాకంలా పట్టుకు వదలని అనేక పేరాగ్రాఫులుంటాయి. ప్రతీ పేరాగ్రాఫుకీ ఫుల్స్టాప్ కనీసం రెండు పేజీల తర్వాతే కనబడుతుంది. పోనీ ఆ  వివరాలు మన కథకేమన్నా అవసరమా అంటే, అదేమీ ఉండదు. ఆయనకి చెప్పాలనిపించింది, చెప్పారంతే! బ్లూమ్ వంటింట్లో కెటిల్లో నీరు నింపుతున్న సమయంలో బ్లూమ్ కి "నీళ్ళంటే ఇష్టం" [:) :) :)] అన్న ఒకే ఒక్క అంశాన్ని పట్టుకుని "నీరు" ప్రాముఖ్యతను స్తుతిస్తూ జాయిస్ రాసే లిస్టు ఆశ్చర్యంగానూ, హాస్యంగానూ, ఒకింత విరక్తిగానూ అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు ఒకానొక జంధ్యాల సినిమాలో సుత్తి వీరభద్రరావు సన్నివేశం గుర్తురాని తెలుగు పాఠకులుండరు. :) బ్లూమ్ చేతులు కడుక్కుంటూ స్టీఫెన్‌ను కూడా చేతులు కడుక్కోమని పిలిస్తే, అతను నీళ్ళంటే తనకి సరిపడదని తిరస్కరిస్తాడు. ఆనాటి ఐరిష్ సంస్కృతిలో వేళ్ళూనుకున్న 'అపరిశుభ్రత' గురించి ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది.

సాధారణమైన మానవ జీవితాన్ని ఆధ్యాత్మికతకు దగ్గర చేసి, రసాస్వాదనలో సౌందర్యభరితంగా మార్చే 'కళ'కు దూరంగా ఒక సాధారణ అడ్వర్టైజింగ్ ఏజెంట్ గా అతి మామూలు జీవితం గడిపే బ్లూమ్ కి, నిరంతరం "అదర్ వరల్డ్లీ" ఆలోచనలతో కుస్తీ పట్టే ఆర్టిస్టు స్టీఫెన్ తో గడిపిన సమయం చాలా సంతోషాన్నిస్తుంది. కానీ అతడిని మళ్ళీ కలుసుకునే అవకాశం లేదనే విషయం బ్లూమ్ ను విచారంలో ముంచేస్తుంది. స్టీఫెన్‌ లాంటి లోతైన వ్యక్తితో సంబంధం తన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తూ పరిపూర్ణం చేయగలదని బ్లూమ్ భావిస్తాడు. టీ తాగిన తరువాత స్టీఫెన్ వెళ్ళిపోతాడు. తర్వాత బ్లూమ్ మెల్లగా బెడ్రూమ్ లోకి వెళ్ళి మోలీ కాళ్ళ వైపుకి తలపెట్టుకుని నిద్రపోతాడు. బ్లూమ్ మోలీతో కొత్త జీవితం ప్రారంభిస్తాడా లేదా అదే జీవితాన్ని పునరావృతం చేస్తాడా అనేది పాఠకులకు ఒక ప్రశ్నలా మిగిలిపోతుంది.

హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ ఇథాకాకు తిరిగి వచ్చాకా తన కోటలోకి భిక్షగాడిలా మారువేషంలో ప్రవేశిస్తాడు. ఆంటినస్, యురిమాకస్ [సూటర్స్] మొదలైన వాళ్ళు ఒడిస్సియస్ ఎవరో గ్రహించేలోగానే ఒడిస్సియస్ కొడుకు టెలిమాకస్ తో కలిసి పన్నాగం పన్ని పెద్ద హాల్లో వారందర్నీ ఒకేచోట చేర్చి, ఎటూ వెళ్ళే అవకాశం లేకుండా బంధిస్తారు. ఒడిస్సియస్ తన భార్య పెనెలొపె ను వివాహమాడమని బలవంతపెడుతున్న వాళ్ళందర్నీ అదే హాల్లో హతమారుస్తాడు. తర్వాత ఆ రక్తపాతం జరిగిన తన కోటను పూర్తిగా శుద్ధి చేస్తాడు. [ఇది బ్లూమ్ తన ఇంట్లో ధూపాన్ని వెలిగించి సుద్ధి చేయడాన్ని పోలి ఉంటుంది.] 'యులీసిస్'లో రెండు ప్రధాన పాత్రలు స్టీఫెన్, బ్లూమ్ లు కలుసుకోవడం ఈ చాప్టర్లో ముఖ్యమైన ఘట్టం. ఇది 'ఒడిస్సీ'లో ఒడిస్సియస్ 'ఇథాకా'కు చేరి టెలిమాకస్ ను కలుసుకోవడంలా ఉంటుంది.

ఈ చాప్టర్లో వ్యక్తిగత జీవితం విషయంలో బ్లూమ్ కు తన అంతఃస్సంఘర్షణ నుండి మరికొంత స్పష్టత వస్తుంది. వాస్తవాన్ని అంగీకరిస్తూ మోలీతో కలిసి జీవించే దిశగా అతడి ఆలోచనలు సాగుతాయి. 

18. Penelope :

Image Courtesy Google

మరుసటి ఉదయం మోలీని బ్లూమ్ తనకు మంచంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ ఇవ్వమని  కోరతాడు. అలా అడిగాడంటే అతడు ఆ ముందు రోజు బ్లూమ్ నైట్‌టౌన్‌కు వెళ్ళాడనీ, ఎవరితోనో గడిపి వచ్చాడనీ భావిస్తుంది. మోలీకి బ్లూమ్ రహస్యంగా ఉత్తరాలు రాయడం, ఎవరినో కలుసుకోవడం, తన పనిమనిషితో అతడి గత ప్రవర్తన-- ఇవన్నీ తెలుసు. బ్లూమ్ బోయ్లన్ తో తన సంబంధం గురించి తెలిసే తనకు దూరంగా ఉంటున్నాడని కూడా అనుకుంటుంది.

“yes because he never did a thing like that before as ask to get his breakfast in bed with a couple of eggs since the City Arms hotel when he used to be pretending to be laid up with a sick voice doing his highness to make himself interesting to that old faggot Mrs Riordan”

దేవునిపై విశ్వాసం ఉన్న మోలీకి 'ధర్మం' తనకు అనుకూలంగా మలుచుకునే వ్యవహారం మాత్రమే. 33 ఏళ్ళ మోలీ బోయ్లన్‌తో తన వివాహేతర సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రీమాన్స్ జర్నల్ లో బ్లూమ్ చేసే ఉద్యోగంలో వచ్చే జీతం ఆమెకు నచ్చదు. ఆమె ఆలోచనలు జిబ్రాల్టర్ లో గడిచిన తన యవ్వనంలోని తొలిప్రేమ మీదకు మళ్ళుతాయి. తన జీవితంలో కాస్త ఉల్లాసానికి బోయ్లన్ ప్రేమలేఖలు కారణమని భావిస్తుంది.

హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ భార్య పెనెలొపే, ఒడిస్సియస్ లేని సమయం చూసి తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వత్తిడి తెచ్చిన వారి నుండి తనను తాను కాపాడుకోడానికి అనేక వ్యూహాలు పన్నుతూ ఉంటుంది. వాటిల్లో ఒకటి: పట్టు జలతారు తెరను నేస్తున్నానని చెప్పి రోజూ దాన్ని అల్లుతూ, రాత్రికి మళ్ళీ అల్లిక మొత్తం విప్పేస్తూ కాలయాపన చేస్తుంది. చివరకు వాళ్ళకి ఆమె చేస్తున్న మోసం తెలిసిపోయినా, ఈ వ్యూహం వల్ల ఓ మూడేళ్ళు వారి నుండి తనను రక్షించుకుంటుంది. "యులీసిస్"లో 'పెనెలొపె' ఎపిసోడ్ అసభ్యకరమైన వర్ణనలు కలిగిన చాప్టర్లలో ఒకటి. హోమర్ "ఒడిస్సీ"లో పెనెలొపె, "యులీసిస్"లో మోలీ బ్లూమ్ వ్యక్తిత్వాలకు భూమ్యాకాశాల వ్యత్యాసం ఉంటుంది. పెనెలొపె భర్తకు విధేయురాలుగా ఉంటూ ప్రేమిస్తే, మోలీ చాలామంది ప్రేమికులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంది. పూర్తిగా మోలీ దృష్టి కోణం నుంచి ఆమె స్వరంలోనే రాసిన ఈ మోనోలాగ్ లో విపరీతమైన వేడి, చీమల దండులాంటి ప్రజలు, సముద్రం, వీధులు-- వీటన్నిటితో కూడిన గిబ్రాల్టార్‌ ప్రపంచపు దృశ్యాలు మోలీ కళ్ళముందు కదలాడతాయి. మోలీ బ్లూమ్ తనను మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు అంగీకరించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ "and yes I said yes I will Yes.” అనే ఐకానిక్ వాక్యాలతో ఈ నవల ముగింపుకొస్తుంది. 

ఇలా కొందరు మనుషుల జీవితంలో ఒక రోజు, అంటే సుమారు 18 గంటలపాటు జరిగే వివిధ సన్నివేశాల, సంభాషణల ఆధారంగా ఈ నవలంతా రాసుకొచ్చారు జాయిస్. ఈ కథ రాసిన 1904 సమయంలో ఐర్లాండ్ బ్రిటిష్ రాజ్యంలో భాగంగా ఉండేది. తన నవలకు గ్రీకు గాథ 'ఒడిస్సీ'ని నేపథ్యంగా తీసుకుని, 18 భాగాలకూ ఒడిస్సీ చాప్టర్ల పేర్లు పెట్టినప్పటికీ నిజానికి ఈ నవలలో ఆ పాత్రలు ఎక్కడా ప్రస్తావనకు రావు. కేవలం 'హోమర్ ఒడిస్సీ'తో మనకు సారూప్యతలు వెతుక్కోడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

Reading Ulysses - Part 1

1. Telemachus :

Image Courtesy Google

'యూలిసెస్' కథ జూన్ 16 వ తేదీ 1904 ఉదయం 8 గంటలకి డబ్లిన్ లోని 'శాండీ కోవ్' బీచ్ ఒడ్డున మార్టెల్లో టవర్స్ లో మొదలవుతుంది. మొదటి సన్నివేశంలో 20 ఏళ్ళ వయస్సున్న వైద్య విద్యార్థి బక్ ముల్లిగాన్ గడ్డం చేసుకోడానికి టవర్ పైభాగంలో చేరి 'క్యాథలిక్ మాస్' ఎలా జరుగుతుందో పేరడీ చేస్తుంటాడు. 'మలాచి' బక్ ముల్లిగాన్, హైన్స్ అనే ఇద్దరు యువకులు స్టీఫెన్ డెడలస్ గదిలో అతడికి అద్దె కూడా ఇవ్వకుండా అతడితో బాటు నివసిస్తూ ఉంటారు. బక్ కూడా స్టీఫెన్ లాగే తనను తాను 'నాన్ కన్ఫర్మిస్ట్' అని చెప్పుకుంటాడు. ఇక ఆక్స్ఫర్డ్ విద్యార్థి హైన్స్ ఒక ఆంగ్లేయుడు. ఐరిష్ సంస్కృతి గురించి, ముఖ్యంగా సాహిత్యం గురించి రీసెర్చ్ చేసే క్రమంలో డబ్లిన్ వస్తాడు. బక్ గోల పడలేక ఒప్పుకుంటాడు గానీ స్టీఫెన్ కు హైన్స్ తన గదిలో ఉండడం ఇష్టం ఉండదు.

స్టీఫెన్ డెడలస్ "యులీసిస్" కంటే ముందు జాయిస్ రాసిన 'A Portrait of the Artist as a Young Man'లో ప్రధాన పాత్ర అంటారు. [స్టీఫెన్ డెడలస్- ఒక స్కూల్ టీచర్/ రచయిత/ ఐరిష్/ రోమన్ క్యాథలిక్] కానీ అతడు నాస్తికుడు. నేను ఆ పుస్తకం చదవలేదు కాబట్టి అతడి గురించి ఈ కథలో చెప్పిన అంశాలే తప్ప ఆ పాత్ర బాక్గ్రౌండ్ తెలీదు. వ్యక్తిగా స్టీఫెన్ తన ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లనుండి "ఆర్టిస్టిక్ ఫ్రీడమ్" వైపు అడుగులువేసే మనిషిగా కనిపిస్తాడు. ఆ క్రమంలో తన "కాలింగ్" ఏమిటో తెలుసుకోడానికి డబ్లిన్ వదిలి పారిస్ వెళ్తాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ డబ్లిన్ తిరిగివచ్చినా, తల్లి మరణం సమయంలో ఆమె కోరుకున్న విధంగా ప్రవర్తించలేకపోయాననే పశ్చాత్తాపం అతణ్ణి తరచూ కలచివేస్తుంది. దానికి తోడు జీవితంలో తాను ఎంచుకున్న మార్గంలో విఫలమయ్యాననే నైరాశ్యంతో ఉంటాడు. స్టీఫెన్ మనసులో ద్వైదీ భావాలు "Proteus" ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. రచయిత ఈ చాప్టర్లో స్టీఫెన్ ని హోమర్ 'ఒడిస్సీ'లో ఒడిస్సియస్ కొడుకు టెలెమాకస్ తోనూ, షేక్స్పియర్ హేమ్లెట్ తోనూ పోలుస్తారు.

జాయిస్ ని చదవడంలో నాకు చాలా నచ్చిన విషయం, ఆయన నేరేషన్ మధ్యమధ్యలో ఆ సందర్భానుసారంగా సాహిత్యానికో, చరిత్రకో  సంబంధించిన ఏదో ఒక కవితనో, పిట్టకథనో, వాక్యాన్నో ప్రస్తావిస్తారు. అది అర్థం కావాలంటే ఆ పూర్వాపరాలు తెలియాలి. వెంటనే గూగుల్ పేజీలు తిప్పాలి. ఈ వ్యవహారమంతా క్లాసురూములో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు, ఆవలిస్తున్న విద్యార్థిని లేపి ప్రశ్నలడగడంలా ఉంటుంది. :) ఆ కవితనో, పద్యాన్నో, వాక్యాన్నో పట్టుకుని మనం దాని వెనక ఉన్న కథను తెలుసుకుని, ఈసారి కాస్త ఎక్కువ శ్రద్ధతో రచయిత చెప్పేది వింటాం. :)

"Pulses were beating in his eyes, veiling their sight, and he felt the fever of his cheeks."

"And no more turn aside and brood
Upon love's bitter mystery
For Fergus rules the brazen cars."

స్టీఫెన్ తల్లి చివరి క్షణాల్లో అతణ్ణి దేవుడిని ప్రార్థిస్తూ మోకరిల్లమని కోరితే, అది తన నాస్తిక సిద్ధాంతాలకు విరుద్ధమని తిరస్కరిస్తాడు. ఈ కారణంతో బక్ అతణ్ణి నిందిస్తూ, "తల్లిని చంపేస్తాడు గానీ సంతాపానికి చిహ్నంగా ధరించే నల్ల సూటు తప్ప గ్రే సూటు మాత్రం వేసుకోడుట" అని నిష్టూరమాడతాడు. [“He kills his mother but he can’t wear grey trousers”] స్టీఫెన్- బక్ ల సంభాషణల్లో బక్ హాస్యం, వాక్చాతుర్యం చూసి అతడే ఈ కథకు హీరోయేమో అనుకున్నాను.

మొదటి భాగం 'టెలెమాకస్' అనేది నిజానికి ఒడిస్సియస్ కొడుకు పేరు. ఈ నవలలో స్టీఫెన్ డెడాలస్ పాత్ర హోమర్ ఒడిస్సీలో 'టెలెమాకస్'కు ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఒడిస్సియస్ సముద్రప్రయాణంలో మృతిచెంది ఉంటాడని భావించిన కొందరు తిరుగుబాటుదార్లు అతడి స్వస్థలమైన ఇథాకాలో 'పెనెలొపె'ని [టెలెమాకస్ తల్లి] తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని బలవంతపెడుతుండడం వల్ల టెలెమాకస్ తన సొంత ఇంట్లోనే పరాయీకరణను అనుభవిస్తూ ఉంటాడు. స్టీఫెన్ తాను అద్దెకుంటున్న మార్టెల్లో టవర్స్ తాళం చెవిని చివర్లో బక్ కు గత్యంతరం లేక ఇచ్చేసే సందర్భంలో [“Give us that key, Kinch.”] అచ్ఛం టెలెమాకస్ లాగే తన అస్తిత్వాన్ని వెతుక్కునే ప్రయత్నం కనిపిస్తుంది. తన గది తాళాలు విసిరేసి స్టీఫెన్ తన స్నేహితుల్ని పంటి బిగువున "Usurpers" [ఒడిస్సీలోని suitors] అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్లో స్టీఫెన్ పాత్ర చిత్రీకరణలో టెలెమాకస్ తో బాటు 'హేమ్లెట్'లోని అసహనం ఛాయలు కూడా కనిపిస్తాయి. బక్ ముల్లిగాన్ పాత్ర షేక్స్పియర్ 'హేమ్లెట్'లో క్లాడియస్ నీ, హోమర్ 'ఒడిస్సీ'లో 'అంటినస్'నీ పోలి ఉంటుంది.

2. Nestor :

Image Courtesy Google

మిగతా చాప్టర్లతో పోలిస్తే "నెస్టర్" యులీసిస్ లో చాలా చిన్న చాప్టర్. హోమర్ 'ఒడిస్సీ'లో ఒడిస్సియస్ కొడుకు టెలెమాకస్ తండ్రి ఆచూకీ తెలుసుకోడానికి పైలోస్ (Pylos) ప్రయాణమవుతాడు. గుర్రాలను అదుపుచేసే పైలోస్ దేశపు రాజు నెస్టర్ ట్రాయ్ లో ఒడిస్సియస్ తో కలిసి యుద్ధం చేస్తాడు. టెలెమాకస్ కు పైలోస్లో ఘనమైన ఆతిథ్యం దొరుకుతుంది. అతడికి యుద్ధంలో తన తండ్రి ఒడిస్సియస్ శౌర్య పరాక్రమాల గురించీ, తెలివితేటల గురించీ నెస్టర్ మాటల ద్వారా తెలుస్తుంది. నెస్టర్ 'దేవత అథేనా'కు బలులు ఇచ్చి సంతృప్తి పరిచాక ఒడిస్సియస్ ను వెతకడానికి టెలెమాకస్ కు తోడుగా తన ఆఖరి కొడుకు పిసిస్ట్రాటస్ ను పంపుతాడు.

ఇక యులీసిస్ కథ, ఉదయం 10 గంటలకు ఒక ప్రైవేట్ స్కూల్లో మొదలవుతుంది. తన తండ్రితో భౌతికంగా కాకపోయినా మానసికంగా దూరమైన స్టీఫెన్ డెడలస్ హెడ్ మాస్టర్ గారెట్ డీసీ (Garrett Deasy) మాటల్లో స్త్రీద్వేషం, యూదుల పట్ల ద్వేషం చూసి విసుగ్గా “Is this old wisdom?” అని మనసులోనే తిట్టుకుంటాడు. గారెట్ “Jews sinned against the light,” అన్నప్పుడు “Who has not?” అని తీసిపారేస్తాడు స్టీఫెన్. 'ఒడిస్సీ'లో నెస్టర్ మాటలు కూడా  అచ్చం ఇలాగే టెలిమాకాస్ పై ప్రభావం చూపడంలో విఫలమవుతాయి. ఇక్కడ గారెట్ 'నెస్టర్' పాత్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడనిపిస్తుంది. ఈ భాగంలో పైలోస్ రాజ్యాన్ని ఒక ప్రైవేట్ స్కూల్ గానూ, అందులో విద్యార్థులను నెస్టర్ కొడుకులుగానూ మనం స్వేచ్ఛగా ఊహించేసుకోగలిగే కాన్వాస్ మన ముందుంటుంది. స్టీఫెన్ డెడలస్ తన విద్యార్థులకు చరిత్ర బోధించే క్రమంలో మరోచోట తానే స్వయంగా నెస్టర్ గా కనిపిస్తాడు. కానీ గారెట్, స్టీఫెన్- వీరిద్దరూ తమ అనుభవాల్ని తమ తరువాత తరంతో పంచుకునే క్రమంలో ఘోరంగా విఫలమవుతారు. "History is a nightmare from which I am trying to awake" అనే స్టీఫెన్ మాటల్ని విన్నప్పుడు, యువత ఎప్పుడూ పెద్దవాళ్ళ అనుభవసారం కంటే తమ స్వానుభవం నుంచే నేర్చుకోవాలనుకోవడం సహజం కదా అనిపిస్తుంది. డీసీ ఒక వ్యాధి గురించి రాసిన ఉత్తరాలను పత్రికలో ప్రచురించమని స్టీఫెన్ కు ఇస్తాడు. స్టీఫెన్ అవి తీసుకుని పాఠశాల బయటకొచ్చాక డల్‌కీ స్టేషన్ నుండి బయలుదేరే ట్రైన్ ఎక్కడానికి  సాండీమౌంట్ స్ట్రాండ్ ఒడ్డున ఒంటరిగా నడుస్తూ ఆలోచనల్లో మునిగిపోతాడు.

—  Weep no more, woful shepherds, weep no more
For Lycidas, your sorrow, is not dead,
Sunk though he be beneath the watery floor...

Riddle me, riddle me, randy ro.
My father gave me seeds to sow. 

"A woman brought sin into the world. For a woman who was no better than she should be, Helen, the runaway wife of Menelaus, ten years the Greeks made war on Troy. A faithless wife first brought the strangers 34to our shore here, MacMurrough's wife and her leman, O'Rourke, prince of Breffni. A woman too brought Parnell low."

3. Proteus :

Image Courtesy Google

మొదటి రెండు చాప్టర్ల జాయిస్ ధాటిని తట్టుకుని ఎలాగో మూడో చాప్టర్ లోకి అడుగుపెట్టిన సగటు పాఠకుడికి “Ineluctable modality of the visible” అన్న ప్రారంభపు వాక్యాలు చూసి జీవితం మీద విరక్తి కలుగుతుంది. జాయిస్ మనల్ని టార్చర్ చెయ్యడానికే ఈ పుస్తకం రాశారని నమ్మే స్థితికి వచ్చేస్తాం. :)

ఉదయం 11 గంటల సమంయలో స్టీఫెన్ డెడలస్ శాండీ మౌంట్ స్ట్రాండ్ బీచ్ లో నడుస్తూ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఇది ఈ నవల మొత్తానికీ "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" పద్ధతిలో రాసిన అతి పెద్ద చాప్టర్ అని చెప్పొచ్చు. 

శాండీ మౌంట్లో స్టీఫెన్ బంధువులుంటారు. మొదట ఆ రాత్రి వారి దగ్గర బస చెయ్యవచ్చేమో అడగాలనుకున్నా మళ్ళీ వారి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన విరమించుకుని తన జీవితాన్ని తలుచుకుంటూ, ఎడతెగని ఆలోచనలతో ఆత్మపరిశీలన చేసుకుంటాడు. ఈ ఎపిసోడ్లో అరిస్టాటిల్ సిద్ధాంతాల గురించి చర్చిస్తూ రాసిన ఓపెనింగ్ లైన్స్ “Ineluctable modality of the visible” చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఈ ఒక్క వాక్యం దగ్గరే చాలాసేపు ఆగిపోయాను. మనిషి ప్రపంచాన్ని తన కళ్ళతో చూసి అర్థంచేసుకుందామని ప్రయత్నిస్తాడు. తన దృష్టికి వచ్చింది మాత్రమే వాస్తవమని భ్రమపడతాడు. కానీ మన దృష్టి ప్రయాణించినంతవరకూ, అంటే పరిమితమైన పరిధిలో కనిపించే విషయాన్ని మాత్రమే వాస్తవమని నమ్మడం తప్ప మనకి మరోదారి లేదు. నిజానికి చూపు మనకి నిర్ధిష్టమైన [పార్షియల్ రియాలిటీ?]ని మాత్రమే చూపిస్తుంది, దానివల్ల వచ్చే జ్ఞానం, అనుభవం పరిమితం. మిగతా జ్ఞానేంద్రియాలకి సంబంధించిన రుచి, వాసనా, స్పర్శ- ఈ అనుభవాలేమీ కళ్ళు ఇవ్వలేవు. స్టీఫెన్ ఆలోచనల్లో తన పరిధిలో లేని జీవితపు వాస్తవాన్ని చూడలేని నిస్సహాయతా, అశక్తత కనిపిస్తాయి. నిజానికి కళ్ళతో చుసిన ప్రతీదీ నిజమనుకునే జడ్జిమెంట్ ఎంత లోపభూయిష్టమైనదో కదా!! మరి ముఖ్యంగా గై డెబోర్డ్, డెఱిడా లాంటి వాళ్ళు ముందే హెచ్చరించినట్లు నేటి 'వాస్తవం' వర్చువల్ వాస్తవంగా రూపాంతరం చెందిన ఈరోజుల్లో జాయిస్ వాక్యాలు  మరింత అర్థవంతంగా అనిపిస్తాయి. కేవలం నాలుగైదు పదాలతో సరళంగా కనిపించే ఆ వాక్యంలో నిగూఢంగా ఆ మొత్తం చాప్టర్ని చిన్న చుట్టచుట్టేసి ఆ క్లూస్ ని మనమీదకి విసిరెయ్యడం జాయిస్ కే చెల్లింది.

"అరిస్టాటిల్ సిద్ధాంతాల" (space & vision) గురించి ఆలోచిస్తూ స్టీఫెన్ కళ్ళు మూసుకుని, చీకటిలో ఎలాంటి అనుభూతి వస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కళ్ళుమూసుకుని నడుస్తూ "Am I walking into eternity along Sandy mount strand"? అనుకుంటాడు. ఈ ఎపిసోడ్ ముగింపులో ఒకప్పుడు సముద్రంలో మునిగి చనిపోయిన మనిషి మృతదేహాన్ని గుర్తుకుతెచ్చుకుని, "మరణించిన వారిని శ్వాసిస్తూ నేను జీవిస్తున్నాను, మరణించిన వారి శరీరాలు కలిసిపోయిన మట్టి మీద నడుస్తున్నాను, వారి అవశేషాలను ఆహారంగా చేసుకున్నాను"  [Dead breaths I living breathe, tread dead dust, devour a urinous offal from all dead] అనే తలపోతల్లో స్టీఫెన్ కు పూర్వీకుల గతానికీ, వర్తమానంలో తన ఉనికికీ సంబంధం ఉందన్న [Metempsychosis-పునర్జన్మ] అవగాహన కలుగుతుంది.

God becomes man becomes fish becomes barnacle goose becomes featherbed mountain.

 As I am. As I am. All or not at all.

White thy fambles, red thy gan
And thy quarrons dainty is.
Couch a hogshead with me then.
In the darkmans clip and kiss.

4. Calypso :

Image Courtesy Google

'ఒడిస్సీ'లో నాలుగు చాప్టర్ల వరకూ ఒడిస్సియస్ కనిపించడు. ఈ నవలలో కూడా అసలు కథానాయకుడు, అడ్వర్టైజింగ్ ఏజెంట్ అయిన 38 ఏళ్ళ లియోపోల్డ్ బ్లూమ్ 'కాలిప్సో' ఎపిసోడ్లో ఉదయం 8 గంటలకు నంబర్ 7, ఎక్లెస్ వీధిలోని వంటింట్లో ఉదయం అల్పాహారం తయారుచేస్తూ మనకు మొదటిసారి పరిచయమవుతాడు. హోమర్ 'ఒడిస్సీ' ఐదో భాగం కథలో ఒడిస్సియస్ ఒక దీవిలో 'కాలిప్సో' అనే సముద్రపు అప్సరస (nymph) దగ్గర ఏడేళ్ళపాటు నిర్బంధంలో ఉండిపోతాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసీ, ఆమెను వదల్లేని బ్లూమ్ లో  ఒడిస్సియస్ లాగానే తన అధీనంలో లేని పరిస్థితుల నుండి తప్పించుకోలేని నిస్సహాయత కనిపిస్తుంది. 

'ఒడిస్సీ'లో అథేనా సలహా మేరకు 'జ్యూస్' హెర్మెస్ ను కాలిప్సో వద్దకు పంపి ఒడిస్సియస్ ను విడుదల చెయ్యమని ఆదేశిస్తాడు. కాలిప్సో సహాయంతో ఓడను నిర్మించిన ఒడిస్సియస్ సముద్ర ప్రయాణం మొదలుపెడతాడు, కానీ మార్గమధ్యంలో పొసైడన్ ఆగ్రహానికి గురై అతడి ఓడ మునిగిపోతుంది. చివరకు అథేనా జోక్యంతో పొసైడన్ తుఫానును శాంతింపజేశాక ఒడిస్సియస్ ప్రాణాలతో ఒడ్డుకు చేరతాడు. 'ఒడిస్సీ'లో కిర్కె, కాలిప్సో కథలు చదువుతుంటే మహాభారతంలో భీముడు-హిడింబి, అర్జునుడు-ఉలూపి కథలు గుర్తొస్తాయి. గ్రీకు పురాణాలను మన పురాణాలతో పోల్చి చదువుతుంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది.

ఇక 'యులీసిస్' కథలోకొస్తే, బ్లూమ్ మోలీకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళే సమయంలో ఆమె మంచం మీద ఒక వనకన్య [nymph] పెయింటింగ్ ఉందన్న చిన్న వివరం కనిపిస్తుంది. ఈ ఒక్క అంశం తప్ప హోమరిక్ కథకూ యులీసిస్ కథకూ పెద్దగా పోలికలేమీ నాకు కనపడలేదు. మరోచోట జాయిస్ బ్లూమ్ 'పిగ్ కిడ్నీ' తింటున్నాడని రచయిత అతి మామూలు విషయాన్నే చెబుతున్నట్లనిపించినా, దాన్ని వర్ణించిన తీరులో అంతర్లీనంగా అతడు రుచులకిచ్చే ప్రాధాన్యతను గమనించమని పాఠకులకు చెబుతున్నట్లనిపిస్తుంది. బ్లూమ్ భౌతిక రుచులకూ, ఆలోచనలకూ సంబంధించిన సుదీర్ఘమైన వర్ణనలు అతణ్ణి తార్కికతకు దూరంగా, పూర్తి  భౌతికవాదిగా చూపిస్తాయి. వృత్తి రీత్యా రచయిత అయిన స్టీఫెన్ లా అతడికి తర్కవితర్కాలు, అస్తిత్వవాదపు ఝంఝాటాలేం ఉండవు. స్టీఫెన్ బ్లూమ్ కి పూర్తి భిన్నంగా మానసికమైన అలజడులతో భౌతిక ప్రపంచంతో నిత్యం పోరాడుతుంటాడు.

He held the page aslant patiently, bending his senses and his will, his soft subject gaze at rest. The crooked skirt swinging, whack by whack by whack.

బ్లూమ్ మోలీకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్ళిన సందర్భంలోనూ, స్టీఫెన్ "ప్రొటియెస్" చాప్టర్లో బీచ్ ఒడ్డున నడిచే సమయంలోనూ ప్రాచీన గ్రీకు ఫిలాసఫీలో 'పునర్జన్మ' [Metempsychosis అనే గ్రీకు పదం] గురించి ప్రస్తావించడం చూస్తే జేమ్స్ జాయిస్ పునర్జన్మను నమ్ముతారనిపిస్తుంది. పోనుపోనూ ఈ నవలలో ఆ వాదనను బలపరిచే అనేక సన్నివేశాలుంటాయి. కానీ నాస్తికుడైన జాయిస్ కు ఈ నమ్మకమేమిటా అని ఆరా తీస్తే ఆయనపై థియోసోఫికల్ సొసైటీ ప్రభావం ఎక్కువగా ఉండేదని తెలిసింది. జాయిస్ థియోసాఫికల్ సాహిత్యాన్ని విపరీతంగా చదివేవారట.

జేమ్స్ జాయిస్ లాంటి 'ఆర్టిస్టిక్ రెబెల్' కు ఆత్మ, పునర్జన్మ లాంటి అంశాలపై నమ్మకం ఏమిటా అని ఆలోచిస్తే మనిషికి 'మతం' అవసరమా? కాదా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ మతమైనా మనిషి కొన్ని నియమాలకు లోబడి క్రమశిక్షణతో జీవించడానికి అనుసరించే మార్గం అనుకుంటే, ప్రతీ మతం నుండీ కొన్ని అంశాలను సంగ్రహించి,ప్లేటో ఫిలాసఫీతో కలిపి రూపొందిన 'థియోసాఫికల్' ఐడియాలజీ వలన ప్రభావితమవ్వడంలో జాయిస్ వివేకమే తప్ప తెలివితక్కువతనం నాకైతే ఏమీ కనపడలేదు. మళ్ళీ కథలోకొస్తే, ఈ ఎపిసోడ్ ముగిసే సమయానికి బ్లూమ్ 'పాడీ డిగ్నమ్' అనే స్నేహితుడి అంత్యక్రియలకు హాజరవడానికి బయలుదేరతాడు. రాబోయే చాప్టర్లో జేమ్స్ జాయిస్ మీద థియోసాఫికల్ భావజాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

O, Milly Bloom, you are my darling.
You are my lookingglass from night to morning.
I'd rather have you without a farthing
Than Katey Keogh with her ass and garden.

All dimpled cheeks and curls,
Your head it simply swirls.

Seaside girls. Torn envelope. Hands stuck in his trousers' pockets, jarvey off for the day, singing. Friend of the family. Swurls, he says. Pier with lamps, summer evening, band,
Those girls, those girls,
Those lovely seaside girls.

5. Lotus Eaters :

Image Courtesy Google

'యులీసిస్' నవలలో సరళమైన భాషలో చదవడానికి తేలికగా ఉండే చాప్టర్ ఏదైనా ఉందీ అంటే, అది 'లోటస్ ఈటర్స్' మాత్రమే. ఎంత సులభంగా ఉంటుందో అంత బోరింగ్ గా, చివరికొచ్చేసరికి చిరాగ్గా కూడా ఉంటుందనుకోండి, అది వేరే విషయం. 'Proteus' చాప్టర్ మొత్తం స్టీఫెన్ 'స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్' గురించి రాస్తే, 'లోటస్ ఈటర్స్'ని బ్లూమ్ మానసిక స్థితిని గురించి రాశారు. ఈ ఎపిసోడ్ ఉదయం 10 గంటలకు డబ్లిన్లోని 'వెస్ట్ ల్యాండ్ రో' ప్రాంతంలో మొదలవుతుంది.

హోమర్ 'ఒడిస్సీ'లో కాలిప్సో ద్వీపం నుండి బయటపడ్డ ఒడిస్సియస్ సముద్రపు తుఫానులో ఓడను కోల్పోయి రాజు ఆల్సినోస్ వద్ద ఆశ్రయం పొందుతాడు. ఆల్సినోస్ కు తన ప్రయాణంలో ఎదురైన విపత్తులనూ, చేసిన  సాహసాలనూ కథలుగా చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ కథల్లో 'లోటస్ ఈటర్స్' ఒకటి. ఒడిస్సియస్ తన సహచరులతో "లోటస్ ఈటర్స్" ఉండే ప్రాంతంలో ఆహారం కోసం ఆగుతాడు. అక్కడి స్థానికులు ఇచ్చిన తామరపువ్వుల్ని తిని ఒడిస్సియస్ సహచరులు మతి తప్పి అక్కడే ఆ పువ్వుల్ని తింటూ ఉండిపోవాలనుకుంటారు. మిగతావాళ్ళకి కూడా ఆ దుస్థితి రాకుండా వెంటనే ఆ ప్రాంతం నుండి బయలుదేరతారు.

బ్లూమ్ 'ఫ్రీమాన్స్ జర్నల్' కొనుక్కుని వెస్ట్‌ల్యాండ్ రో పోస్టాఫీస్ వద్ద తన టోపీలో దాచుకున్న చిన్న కార్డును తీసి జేబులో పెట్టుకుంటాడు. పోస్టాఫీసులో ఆ కార్డు చూపించి ఒక ఉత్తరం తీసుకుంటాడు. అది 'హెన్రీ ఫ్లవర్ ఎస్క్వైర్' అనే పేరు మీద ఉండడాన్ని బట్టి బ్లామ్ కి రహస్యంగా ఎవరితోనో సంబంధం ఉందనిపిస్తుంది. మార్తా క్లిఫోర్డ్ అనే స్త్రీ రాసిన ఆ ఉత్తరం సారాంశాన్ని బట్టి బ్లూమ్ కి ఆమెతో వివాహేతర సంబంధం(?) ఉంటుందని మనకు మెల్లగా అర్థమవుతుంది. భార్య మోలీకి బ్లేజెస్ బోయ్లన్ [ఆమె కాన్సర్ట్ మేనేజర్] తో వివాహేతర సంబంధం ఉందన్న విషయం నుండి ఒక 'ఎస్కేప్'లాగా బ్లూమ్ మార్తాతో అభ్యంతరకరమైన రీతిలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతాడు. విక్టోరియన్ కాలంలో మనుషుల మధ్య [ముఖ్యంగా ప్రేమికుల మధ్య] పువ్వుల పరిభాషను మార్తా ఉత్తరం ద్వారా వర్ణించిన భాగం అద్భుతంగా ఉంటుంది. మార్తా ఉత్తరంలో రాసిన పువ్వులూ, మొక్కల పేర్లు చదువుతున్నప్పుడు ఒక్కో పువ్వూ అతడి మనసులో ప్రేరేపించే భావావేశాన్ని మనకి అనేక ఉపమానాలతో సహా వర్ణించి చెప్పడం చదివి తీరాల్సిందే.

"Angry tulips with you darling manflower punish your cactus if you don't please poor forgetmenot how I long violets to dear roses when we soon anemone meet all naughty nightstalk wife Martha's perfume."

Image Courtesy Google

ఈ చాప్టర్లో మానసిక స్పష్టత లేని బ్లూమ్ తో సహా డబ్లిన్ వాసుల మతి తప్పి, నిద్రలో నడుస్తున్నట్లుండే ప్రవర్తన 'ఒడిస్సీ'లో 'లోటస్ ఈటర్స్'ను గుర్తుకుతెస్తుంది. రకరకాల పువ్వుల ప్రస్తావనలు "లోటస్ ఈటర్స్" హోమరిక్ ప్రపంచాన్ని డబ్లిన్ నగరంలో పునఃసృష్టించినట్లు ఉంటుంది. ఈ చాప్టర్లో  వాక్యాల మధ్యలో 'ఒడిస్సీ' రిఫరెన్సులు అనేకం కనిపిస్తాయి.

‘big lazy leaves to float about on’, the bather in the Dead Sea, who does not even have to swim to stay afloat, the soldiers, ‘hypnotised like’ from the repetitive drill: these are instances, taken from the first two pages alone

Bloom is quite clear that the Mass, in this context, is indeed what Marx said it was: the opium of the people. 

బ్లూమ్ ఒక సందర్భంలో "చర్చిలో జరిగే 'మాస్' అనేది మార్క్స్ చెప్పినట్లు ప్రజలకు ఓపియం [మాదకద్రవ్యం] లాంటిది" అని అనడం అతడి మతపరమైన భావాలను స్పష్టం చేస్తుంది. జాయిస్ దృష్టంతా కథ చెప్పడం కంటే కథ వెనుక దానికి అనువైన వాతావరణం సృష్టించడం పైనే నిలుపుతారు. బ్లూమ్‌ భౌతికవాద స్వగతాలూ, "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్"- వీటన్నిటినీ బట్టి ఈ ఎపిసోడ్లో 'టెక్నిక్'ను 'నార్సిసిజం' అని నిర్వచించారు.

6. Hades :

Image Courtesy Google

ఈ చాప్టర్ నుండి జాయిస్ నేరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతుంది. నా విషయంలో కథ చదవడంలో ఇక్కడ 'ఫ్లో' పూర్తిగా దెబ్బతినడంతో ఈ చాప్టర్ రెండుసార్లు చదవాల్సొచ్చింది. ఇందులో మనకు అంతవరకూ పరిచయం లేని అనేక పాత్రలు ఉన్నపళంగా స్టేజి మీదకొచ్చేసి ఒక్కసారే మాట్లాడుతున్నట్లు కథంతా గజిబిజి గందరగోళంగా తయారవుతుంది. కానీ అప్పటికే అసందర్భంగా మొదలయ్యే చాప్టర్లకు అలవాటుపడిపోయుంటాం కాబట్టి పాఠకులకు సహనం అలవడుతుంది. :) "మార్టిన్ కన్నింగ్హమ్ అనే పెద్దమనిషి తన తలను కిర్రుకిర్రుమంటున్న గుర్రబ్బగ్గీలోకి దూర్చాడు." అనడంతో ఈ చాప్టర్ మొదలవుతుంది. మునుపు కథలో ఎక్కడో ఈ పేరు విన్నట్లుందే అనిపించినా, "అసలీయనెవరు?" అని ఆలోచించేంత సమయం పాఠకుడికి ఉండదు. తెలుసుకుందామని చదువుతూ ముందుకెళతాం. మృతుడు ప్యాడీ డిగ్నమ్ శవపేటిక సమాధి వైపు బయలుదేరుతుంది. ఆ అంత్యక్రియలకు బ్లూమ్, మార్టిన్ కన్నింగ్హమ్, జాక్ పవర్ తో బాటు స్టీఫెన్ తండ్రి సైమన్ డెడలస్ ఒక గుర్రబ్బగ్గీలో బయలుదేరతారు. ఆ బండి ఏయే వీధులగుండా వెడుతుందో మనకు ఒక్కోపేరుతో వివరంగా చెబుతారు జాయిస్.  మొదట్లో అంత 'డిటైలింగ్' మనకు అసహనంగా అనిపించినా జాయిస్ ఈ నవల రాసిందే తాను కన్నదీ, విన్నదీ పొల్లుపోకుండా డాక్యుమెంట్ చెయ్యడానికే అని తెలుసు కాబట్టి, ఓపిగ్గా పేజీలు తిప్పుతాం. మధ్య దారిలో బ్లూమ్ అటుగా వెళ్తున్న స్టీఫెన్ ని చూస్తాడు. మనం మునుపు విడివిడిగా చదివిన రెండు ప్రధాన పాత్రల్నీ [స్టీఫెన్, బ్లూమ్] ఈ ఎపిసోడ్లో ఒకేచోటకు తెచ్చి కథను ఒక్కటిగా కలిపి ముడేస్తారు. బ్లూమ్ తో బాటు బగ్గీలో ప్రయాణిస్తున్న స్టీఫెన్ తండ్రి సైమన్‌ డెడలస్ తన కొడుకును చూసి బక్ ముల్లిగాన్ స్నేహం అతణ్ణి చెడగొడుతోందని బ్లూమ్ తో అంటూ చిరాకుపడతాడు. బ్లూమ్ మౌనంగా సైమన్ చెప్పేది వింటూ, 1893లో తన స్వంత కొడుకు రూడీ పుట్టిన కొన్ని వారాల్లోనే మరణించడం గుర్తుకొచ్చి, ఆ తండ్రీ కొడుకులను చూసి ఈర్ష్యపడతాడు. బగ్గీ మరోవీధి చేరే సరికి బ్లూమ్ కు బ్లేజెస్ బోయ్లన్ కనిపించినా చూసీ చూడనట్లు ఊరుకుంటాడు. భార్య మోలీతో అతడి సంబంధం గుర్తొచ్చి విచారపడతాడు.  

'ఒడిస్సీ'లో 10,11 పుస్తకాల్లో ఒడిస్సియస్ రాజు ఆల్సినోస్ కు తన ప్రయాణం గురించిన విశేషాలను చెబుతూ ఉంటాడు. అందులో భాగంగా ఒడిస్సియస్  మంత్రగత్తె కిర్కె ద్వీపానికి చేరుకున్న తరువాత కిర్కె అతడికి పాతాళ లోకంలో [గ్రీకులో 'హేడ్స్'] టైరేసియస్ ఆత్మను సంప్రదించమని సూచిస్తుంది. అక్కడనుండి టైరేసియస్ ఒడిస్సియస్ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తాడు. ఒడిస్సియస్ "హేడ్స్"లో ప్రధాన నది స్టిక్స్ తో బాటు అచెరాన్, లీథీ,ప్లెగెథాన్, కొకైటస్ అనే నాలుగు నదుల్ని దాటాల్సి వస్తుంది. ఆ దారిలో మొదట  ఎల్పెనార్‌ ఆత్మ ఎదురవుతుంది. ఎల్పెనార్ అంటే, కిర్కె ద్వీపంలో ఇంటి పైకప్పు మీద నుండి క్రిందపడి మరణించిన ఒడిస్సియస్ అనుచరుడు. ఒడిస్సియస్ అతడికి శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు జరుపుతానని మాటిస్తాడు. తర్వాత ఒడిస్సియస్ టైరేసియస్‌తో మాట్లాడి తన ఓడ ప్రయాణానికి అవరోధంగా నిలిచింది సముద్రదేవుడు పొసైడన్ అని తెలుసుకుంటాడు. ఎందుకంటే పొసైడన్ కొడుకైన సైక్లోప్స్ కంటిని ఒడిస్సియస్ గాయపరిచినందుకు, పొసైడన్ అతణ్ణి శిక్షించాలనుకుంటాడు. టైరేసియస్‌తో మాట్లాడిన తర్వాత, ఒడిస్సియస్ తన తల్లి అంటిక్లియా, ఆగమేంనాన్, సిసిఫస్, హెర్క్యులస్‌, ఆజాక్స్ లాంటి గొప్ప గొప్ప గ్రీకుల ఆత్మలను కలుసుకుంటాడు.

[ఆసక్తి ఉన్నవారికోసం: జాయిస్ 'యులీసిస్'కి ఆయనే స్వయంగా ఇచ్చిన తాళంచెవిలాంటి "గిల్బర్ట్ స్కీమా"లో, ఒడిస్సీ కథకీ ఈ "హేడ్స్" ఎపిసోడ్ కీ  కొన్ని పోలికలు ఇస్తారు.

నాలుగు నదులు: డాడర్, గ్రాండ్ కెనాల్, లిఫీ మరియు రాయల్ కెనాల్.
సిసిఫస్: మార్టిన్ కనింగ్‌హామ్.
సర్బెరస్: ఫాదర్ కాఫీ.
హేడ్స్ (పాతాళపు దేవుడు): జాన్ ఓ’కానెల్.
హెర్క్యులస్‌: డేనియల్ ఓ’కానెల్.
ఎల్పెనార్: పాడీ డిగ్నం.
ఆగమేంనాన్: పార్నెల్.
ఆజాక్స్: మెంటన్.]

"లోటస్ ఈటర్స్"లో వ్యక్తిగా కనిపించే బ్లూమ్‌ను 'హేడ్స్'లో ఒక సంఘజీవిగా  చూస్తాం. ముఖ్యంగా బ్లూమ్ సంభాషణలు ఏ ప్రత్యేకతా లేకుండా, అతి  సాధారణంగా, అస్పష్టంగా ఉంటాయి. 'బ్లూమ్' కు ఒక ప్రధాన పాత్రకి ఉండాల్సిన (పాపులర్ ఒపీనియన్?) లక్షణాలేమీ ఉండకపోవడం గమనార్హం. ఈ ఎపిసోడ్లో ప్రస్తావించిన డాడర్, గ్రాండ్ కెనాల్, లిఫీ మరియు రాయల్ కెనాల్ అనే జల ప్రవాహాలు హోమర్ 'ఒడిస్సీ'లో పాతాళ లోకమైన 'హేడ్స్'ని ప్రతిబింబించేలా ఆ పైన చెప్పిన ఒడిస్సీ కథలో నాలుగు నదులను పోలి ఉంటాయి. ఇక్కడ డబ్లిన్ నగరాన్ని హోమరిక్ 'హేడ్స్'లో భాగంగా  చూడవచ్చు. పాడీ డిగ్నమ్ అంత్యక్రియలకు హాజరైన బ్లూమ్ ఆలోచనలన్నీ మరణం చుట్టూ తిరుగుతున్నప్పటికీ బ్లూమ్ ఆ మృత ప్రపంచంలో భాగం కాకుండా తానున్న చోటు నుండి విడిపడి ప్రేక్షక పాత్రలో ఆలోచిస్తూ ఉంటాడు.  బ్లూమ్ కి మరణం ఆధ్యాత్మికానుభవం కాదు, అలాగని అతడికి మృత్యువంటే భయమూ లేదు. స్టీఫెన్ చలించిపోయినట్లు అతడు మృత్యువును గురించి తలపోస్తూ చలించిపోడు. అతడు దాన్నొక పూర్తి బయోలాజికల్ దృష్టికోణంలో ఒక భౌతికవాదిగా మాత్రమే చూస్తాడు. హోమరిక్ కథతో దీన్ని పోలిస్తే 'హేడ్స్' చివర్లో ఒడిస్సియస్ చుట్టూ ఆత్మలు మూగితే వాటిని తప్పించుకుంటూ బయటపడినట్లే బ్లూమ్ కూడా డిగ్నమ్ అంత్యక్రియలు జరిగిన స్మశానం నుండి బయటకొస్తాడు.

It is now a month since dear Henry fled
To his home up above in the sky
While his family weeps and mourns his loss
Hoping some day to meet him on high.

Only man buries. No, ants too. First thing strikes anybody. Bury the dead. Say Robinson Crusoe was true to life. Well then Friday buried him. Every Friday buries a Thursday if you come to look at it.

O, poor Robinson Crusoe!
How could you possibly do so?

7. Aeolus :

Image Courtesy Google

ఒక పత్రిక ఆఫీసులో మొదలయ్యే ఈ భాగాన్ని జాయిస్ రాసిన విధానం చాలా ప్రత్యేకంగా, ప్రయోగాత్మకంగా ఉంటుంది. కానీ ఈ ఎపిసోడ్లో పాత్రల మధ్య కొన్ని సాహిత్య చర్చల్ని మినహాయిస్తే ఆ పత్రికా పరిభాష నాకు చాలా విసుగ్గా అనిపించింది. జాయిస్ ఒక వార్తాపత్రిక 'లే ఔట్' ఎలా ఉంటుందో ఈ భాగాన్ని అలా రాశారు. ఇందులో పత్రిక ఉత్పత్తిని గురించిన వివరాలన్నీ పొల్లుపోకుండా ఏకరువుపెడతారు. జాయిస్ ఇందులో రీడబిలిటీ కంటే టెక్నిక్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారనిపిస్తుంది. అలాగని ఇదేమీ తీసిపారేసే ఎపిసోడ్ కాదు. ఇందులో మధ్య మధ్యలో గుర్తుండిపోయే భాషా ప్రయోగాలూ, హాస్యంతో కూడిన సంభాషణలూ ఉంటాయి. అడ్వర్టైజింగ్ ఏజెంట్ అయిన బ్లూమ్ ఈ భాగంలో ఫ్రీమాన్ జర్నల్, ఈవెనింగ్ టెలిగ్రాఫ్ ఆఫీసుల్లో ఉద్యోగిగా కనిపిస్తాడు. ఈ ఎపిసోడ్లో కూడా మెయిన్ స్ట్రీమ్ కథకు సంబంధం లేని అనేక పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ వివరాలన్నీ చెబుతూపోతే మీకు విరక్తి రావడం ఖాయం కాబట్టి అవి వదిలేసి అవసరమైన కొన్ని అంశాలు మాత్రం రాస్తాను.

మిగతా చాప్టర్లతో పోలిస్తే 'ఎయోలస్' లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది- అది రాసిన శైలి గురించి. ఈ చాప్టర్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి, ప్రతీ భాగానికీ వార్తా పత్రికకు పెట్టినట్లు 'హెడ్లైన్స్' పెడతారు. ఆనాటికి నవలా రచనలో ఇదొక ధిక్కారంతో కూడిన ప్రయోగమే. ఇందులో కథ ముందుకెళ్ళదు సరికదా పాఠకుడిని మరికాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పాఠకుల్ని రచయిత శైలితో ఒక 'కంఫర్టబుల్ జోన్' లోకి వెళ్ళే అవకాశం ఇవ్వని చాప్టర్ ఇది. 

హోమర్ 'ఒడిస్సీ'లో 'ఎయోలస్' అంటే వాయువులకు అధిపతి. గ్రీకు పురాణాల్లో వాయువులను నియంత్రించే రాజు పేరు దీని పెట్టడం, కథ పత్రికాఫీసులో జరగడం- ఇవన్నీ చూసినప్పడు లిండా గుడ్మన్ రాసిన 'సన్ సైన్స్' (sun signs) గుర్తుకువచ్చింది. మన తెలుగు రాశుల పేర్ల తరహాలో ఆంగ్లంలో ఎయిర్, వాటర్, ఎర్త్, ఫైర్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిల్లో 'ఎయిర్ ఎలిమెంట్', అంటే గాలి 'కమ్యూనికేషన్'ని సూచిస్తుంది. దానికి ప్రాతినిధ్యం వహించే పత్రిక ఆఫీసులో ఈ కథ నడవడం నాకు ఆసక్తికరంగా అనిపించింది. పత్రికాఫీసులో జరిగే వాడి వేడి చర్చలూ, సమాచార విస్తరణ- ఇవన్నీ ఈ అధ్యాయానికి 'ఎయోలస్' పేరును జస్టిఫై చేస్తాయి.

ఒడిస్సియస్ వాయువులకు రాజైన ఎయోలస్ ని కలిసినప్పుడు అతడు  ఒడిస్సియస్‌కి పలు రకాల వాయువుల్ని బంధించిన ఒక సంచీని ఇస్తాడు. వాళ్ళు ఇథాకా చేరడానికి ఆ సంచీలో ఒక పశ్చిమ గాలి తప్ప మిగతా గాలుల్ని పొరపాటున కూడా తెరవకూడదని చెప్తాడు. ఇదేమీ తెలియని ఒడిస్సియస్ అనుచరులు ఆ సంచిలో ఏదో సంపద ఉందని భావించి దాన్ని తెరచి గాలుల్ని విడుదల చేసేస్తారు. దాంతో ఓడ దారితప్పుతుంది. ఎయోలస్ రాజు వాయువుల్ని నియంత్రించినట్లు జాయిస్ చాప్టర్లో పత్రికా సంపాదకులు మాటల్ని నియంత్రిస్తారు. 'ఒడిస్సీ'లో గాలుల సంచీ తెరచి దారి తప్పినట్లే పత్రికాఫీసులో మాటల గొడవ వల్ల బ్లూమ్ కూడా దారి తప్పుతాడు. "ఒడిస్సియస్"కి రాజు ఇచ్చిన బహుమతిని (గాలిని) వారు దుర్వినియోగం చేసినట్లే పత్రికల్లో భాషను వాస్తవాన్ని వదిలేసి, సెన్సేషలిజం కోసమే వాడతారు అన్న అర్థం వచ్చేలా ఈ ఎపిసోడ్లో కథ జరుగుతుంది. ఒడిస్సియస్‌ దారి తప్పినట్లే, బ్లూమ్ కూడా మాటల మధ్య తేలుతూ, తన లక్ష్యం నుండి మరలిపోతాడు.

8. Lestrygonians :

హోమర్ 'ఒడిస్సీ'లో ఒడిస్సియస్ ఓడ ప్రయాణం మధ్యలో ఆహారం కోసం చూస్తుంటే ఒక ద్వీపం కనిపిస్తుంది. దాన్ని సమీపించగానే తీవ్రమైన దుర్గంధం వస్తుంది. ఒడీసియస్ తన అనుచరులను అక్కడ ఎటువంటి ఆహారం తినేవాళ్ళు ఉంటారో వెళ్ళి చూడండని ఆదేశిస్తాడు. నిజానికి అక్కడ ఉండేది 'లెస్ట్రి గోనియన్స్' అనే నరమాంసభక్షకులు, అందువల్లనే ఆ దుర్గంధం. బ్లూమ్ కూడా డిగ్నమ్ అంత్యక్రియలకు హాజరైన తరువాత మధ్యాహ్నం భోజనం కోసం సరైన చోటు వెతుకుతూ డబ్లిన్ వీధుల్లో తిరుగుతుంటాడు. బర్టన్ రెస్టారెంట్లో వ్యక్తులు అసహ్యకరంగా (అచ్చం 'లెస్ట్రి గోనియన్స్'లా) తినే పద్ధతులు, అక్కడ అశుభ్రతలను చూసి ఇది నేనుండాల్సిన చోటు కాదు అనుకుని ఏదో వెతుకుతున్న సాకుతో అక్కడనుండి బయటపడతాడు. లైబ్రరీ వైపు వెడుతుండగా దూరంగా నడిచివెడుతున్న బ్లేజస్ బోయ్లన్ (భార్య మోలీ  ప్రియుడు) కనిపిస్తాడు. అతణ్ణి చూడగానే బ్లూమ్ కి గాభారా మొదలవుతుంది. బోయ్లన్ తనను చూడకుండా మొహానికి న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుని అక్కడనుండి బయటపడతాడు బ్లూమ్.

Image Courtesy Google

బ్లూమ్ స్మశానం దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా 12 మందే ఉంటారు. ఈ భాగంలో మనం బ్లూమ్ వ్యక్తిత్వాన్ని కాస్త అంచనావేసుకోడానికి అవసరమైన  చిన్న చిన్న వివరాలు రాస్తారు జాయిస్. భార్య స్నేహితురాల్ని కలిసినప్పుడు ఆమె శరీరంలో ముడతలను చూస్తూ, 15 మంది పిల్లల్ని కన్న స్టీఫెన్ తల్లిని గురించి తలపోస్తాడు. మతపరమైన కట్టుబాట్లు నాటి "గార్డెన్ ఆఫ్ ఈడెన్"లో శాపగ్రస్తురాలైన 'ఈవ్' మొదలుకుని నేటి స్త్రీల వరకూ ఎంతమందిని వీలైతే అంతమంది పిల్లల్ని కనమని ప్రోత్సహించి, స్త్రీలకు చివరకు ఎటువంటి దుర్గతి పట్టించాయో కదా అనుకుంటాడు. ఈ చాప్టర్ మొత్తం బ్లూమ్ లోపలి ఆలోచనల అంతర్వాహినిగా (స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్) రాసుకొస్తారు జాయిస్. 'ఒడిస్సీ' తరహాలో ఆహారం గురించీ, వాసనల గురించీ విస్తృతమైన వర్ణనలుంటాయి.

స్మశానంలో చావు పుట్టుకల మధ్య మనిషి పాత్రను పూర్తిగా ఒక భౌతికమైన ఆవరణలో నుండి చూస్తూ మనిషి చనిపోయాక అతడు భూమికి ఫెర్టిలైజర్ గా మారిపోతాడంటాడు బ్లూమ్. ఈ చాప్టర్లో, ఎక్కడున్నా బ్లూమ్ ఆలోచనలన్నీ భార్య మోలీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

ఈ అధ్యాయంలో మార్క్ చేసుకున్న కొన్ని అంశాలు:

"The hungry famished gull.
Flaps o'er the waters dull."

సహజంగా కవులు రైమింగ్ తో రాసేవారు కానీ షేక్స్పియర్ కవితల్లో "బ్లాంక్ వెర్స్" తప్ప రైమింగ్ ఉండదంటూ ఆయన కావ్యాలను "భాషా ప్రవాహం" (The flow of the language it is. The thoughts. Solemn.) గా అభివర్ణిస్తారు జాయిస్.

ఉదాహరణ 'హామ్లెట్'లో ఈ వాక్యాలు చూడండి : 

Hamlet, I am thy father's spirit
Doomed for a certain time to walk the earth.
— Two apples a penny! Two for a penny!

చివర్లో "కాసుకు రెండు ఆపిల్ పళ్ళేమిటా!" అనుకుంటున్నారా! జాయిస్ శైలి గురించి చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. షేక్స్పియర్ కావ్యప్రస్తావన నుండి బ్లూమ్ నడుస్తున్న రద్దీగా ఉన్న డబ్లిన్ మార్కెట్  వీధిలోకి పాఠకుల్ని ఆ చివరి రెండు వాక్యాలతో లాక్కొచ్చి పడేస్తారు. :)