Showing posts with label Telugu Books. Show all posts
Showing posts with label Telugu Books. Show all posts

Saturday, October 1, 2022

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్

శరన్నవరాత్రుల కుంకుమ పూజల హడావుడి మధ్య శుక్రవారం రానే వచ్చేసింది. చిరుజల్లులు కురుస్తున్న సాయంత్రాల్లో వేడి వేడి కాఫీతో బాలగోపాల్ సాహితీ వ్యాసాలు మరింత రుచిగా ఉన్నాయి.☕📖 కేఫ్ లో కొందరు హుషారుగా కబుర్లలో మునిగిపోయి కనిపిస్తే, కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు, ఒక కుర్రాడు మాత్రం ఒక మూలన ప్రపంచానికి దూరంగా పుస్తకంలో లీనమైపోయి చదువుకుంటూ కనిపించాడు,కేరళ ప్రకృతి సౌందర్యమంత అందమైన దృశ్యం చూసినట్లనిపించింది. అలా ఎవర్నైనా, ఎక్కడైనా చూసినప్పుడు వాళ్ళని పనిగట్టుకుని డిస్టర్బ్ చేసి, "ఏం చదువుతున్నారు ? " అని అడగడం అలవాటు. 🫣😁

Copyright A Homemaker's Utopia

కొన్ని రోజులుగా కె.బాలగోపాల్ సాహితీ ప్రపంచంలో ఉన్నాను. ఈ మధ్య ఎప్పుడూ బ్యాగ్ లో ఉండే రెండు,మూడు పుస్తకాల్లో ఆయన పుస్తకం కూడా  ఒకటి. బాలగోపాల్ నాకు ఒక సోషల్ ఆక్టివిస్ట్ అని మాత్రమే తెలుసు. కొన్నినెలల క్రితం ఒక పాత పుస్తకాల షాపులో అనేక పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ప్రత్యేకంగా షెల్ఫ్ లోంచి పలకరించింది. (పుస్తకాల మీద కవర్ డిజైన్ ఎంత ముఖ్యమో కదా ! కవర్ నచ్చకపోతే దృష్టిని దాటిపోయే మంచి పుస్తకాలెన్నో .) అట్టమీద ఎంతో సాదాసీదాగా చేతులు కట్టుకుని కళ్ళజోడు పెట్టుకున్న మొహంలోంచి చిరునవ్వు నవ్వుతున్న ఆయన ఫోటో ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇక అసలు విషయం, "సాహిత్యంపై బాలగోపాల్" అన్న టైటిల్ నన్ను మరింతగా ఆకర్షించింది. ఒక సామాజిక కార్యకర్త సాహిత్యం గురించి ఏమని ఉంటారో తెలుసుకోవాలనే కుతూహలంకొద్దీ ఈ పుస్తకం కొన్నాను. ఒక పూర్తిస్థాయి సాహిత్యకారుడు కూడా ఇంత లోతైన వ్యాసాలు రాయలేరేమో అన్నంతగా దేశవిదేశీ సాహిత్యంపై ఆయనకున్న పట్టు అబ్బురపరిచింది. ఇది ఒక్కసారిగా చదివేసి ఆకళింపు చేసుకునే రచన అస్సలు కాదు. ఆయన వ్యాసాలు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకునేలా ఉన్నాయి. ఈ ఏడాది కొన్న అనేక పుస్తకాల్లో జీరో ఎక్స్పెక్టేషన్స్ / బ్లాంక్ ఇంప్రెషన్ తో రచయిత పూర్వాపరాలు ఏమాత్రం తెలీకుండా మొదలుపెట్టిన ఈ రచన రూపాయికి పదింతలు విలువైనదని కొన్ని పేజీల్లోనే అర్థమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ రచన ఒక నిధి.📖📚

"గాలివస్తే కదిలిపోయేటట్లుండే ఆయన తెలుగుదేశంలో తీవ్ర నిర్బంధపు తుఫానును సైతం తట్టుకుని ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా ఉన్న పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించారు. లెక్చరర్ గా కాకతీయ యూనివర్సిటీలో గణితం బోధించినా ఆర్థిక, సామజికశాస్త్ర, సాహిత్య విమర్శనాది ఉపరితల రంగాల్లో డాక్టర్ కె. బాలగోపాల్ స్పృశించని అంశం లేదు. ఎటు నడిచినా రెండడుగులు వేయలేని రేకుల షెడ్డులో ఆయన ( హైదరాబాద్) నివాసం."

ఇవన్నీ చదివి అసలు ఎవరీయన అని ఆతృతగా వికీ చూస్తే తెలిసిన మరో విషయం ,ఆయన పూర్తిపేరు కందాళ బాలగోపాల్ అని.

పుస్తకంలో పేలిన అనేక డైనమైట్లలో మచ్చుకి ఇదొకటి : ❤️💥🔥

"1930 దశకంలో శ్రీశ్రీ వరుసపెట్టి ఎన్నో శక్తిమంతమైన కవితలు రచించాడు. కుళ్ళు కంపుకొడుతున్న ఫ్యూడల్ సంస్కృతిని చీల్చి చెండాడే పదజాలంతో యువతను కేవలం మేల్కొలిపే విధంగానే కాక, వారిని ప్రేరేపించేలా ఎన్నో కవితలు రాశాడు. శ్రీశ్రీ తొలి రోజుల్లో రాసిన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించడం మన దేశస్తులకు అసాధ్యం. వలస పాలకులు మనకు నేర్పిన ఇంగ్లీష్ కేవలం విజ్ఞాపన పత్రాలను తయారుచెయ్యడానికి పనికొచ్చేదే కానీ, డైనమైట్ ధ్వనిని అనువదించడానికి పనికి వచ్చేది కాదు. స్వయంగా శ్రీశ్రీయే భారతదేశంలోని తెలుగేతరుల కోసం తన కవిత్వాన్ని అనువదించడానికి ప్రయత్నించి, విఫలమయ్యాడు. శ్రీశ్రీ కవిత్వం అనువాదానికి లొంగకపోవడానికి ముఖ్య కారణం ఆయన విరివిగా వాడే హిందూ పురాణ ప్రతీకలు. దీని కారణంగా వామపక్ష విమర్శకులకూ ఆయనకూ మధ్య తరచూ సంవాదాలు సాగుతూండేవి కూడా. "పుడమితల్లికి పురిటినెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి, యముని మహిషపు లోహ ఘంటలు, నరకలోకపు జాగిలమ్ములు, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది ,ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరించింది" , మొదలైనవన్నీ ఇలాంటివే. ఆయన సుప్రసిద్ధ కవితా సంకలనం 'మహాప్రస్థానం' శీర్షిక కూడా మహాభారతం చివర్లో పాండవులు స్వర్గానికి చేసిన ప్రయాణాన్ని సూచించేదే."

Saturday, September 3, 2022

Ade Nadi Iddaridee - Nanda Kishore

నిజానికంతా తెలిసిందే ; తెలిసిందే తెలియందై అంతో ఇంతో అనుభవాన్ని పంచుతుంది. ఎంతోకొంత అశాంతినీ దహిస్తుంది. 

ఇటువంటి వాక్యాలు చదివాక ఇక మాటలనవసరమనిపిస్తూ మౌనం చాలాసేపు వెన్నంటి ఉంది.


నేను హేతువాదిని, భావుకురాల్ని కాదు. ఈ కారణంగా నాలో భావోద్వేగాన్ని  కలిగించలేనిదేదీ నా దృష్టిలో కవిత్వం కాదు. నిజానికి "నా కోసం రాసిన కవిత్వం" కాదు అనడం సమంజసం. ఇప్పటివరకూ మేరీ ఆలీవర్, విస్లావా సింబ్రోస్కా వంటి అతి కొద్దిమంది మాత్రమే ఆ పని చెయ్యగలిగారు. ఇక తెలుగు వెబ్ పత్రికలు చదివే అలవాటు పెద్దగా లేకపోవడం, పద్యం కంటే గద్యం ఎక్కువగా చదివే అలవాటు ఉండడం కారణంగా నాకు నంద కిషోర్ కవిత్వంతో పరిచయం అంత త్వరగా కలగలేదు. గత ఏడాది నాగరాజు పప్పు గారి 'Bankrupt Circus' చదువుతుంటే అందులో ఆయన తెలుగు నుండి అనువదించిన కవితల్లో నందూ పేరు తొలిసారి చూశాను.

ఇక ఫేస్బుక్ లో నందూ పంచుకునే కవిత్వంతో నాకు తెలీకుండానే ప్రేమలో పడిపోయాను. ఇది యాదృచ్ఛికంగా ఎక్కడో ఒకచోట ఒక్క కవిత చదివి అమాంతం కలిగిన అభిమానం కాదు. క్రమంగా, స్థిరంగా, అతి మెల్లగా ఏర్పడిన ఇష్టం. ఒకటి రెండు క్షణాల్లో, ఒకట్రెండు కవితలతో అంతరించిపోకుండా బహుశా తుదకంటా నిలచియుండే ఇష్టం.

నాకు తెలిసి హేతువాదుల్ని భావుకత్వంతో కదిలించడం అంత సులభం కాదు. ఇదేదో గొప్ప విషయమని అనను. అక్షరాల్లో అంతర్లీనంగా ధ్వనించే కపటత్వాన్నీ, పదవిన్యాసాల నడుమ లోతులేని బోలుతనాన్నీ అతి సునాయాసంగా కొలవగల శాపగ్రస్తులు వాళ్ళు. ఇవన్నీ వద్దనుకున్నా వారి దృష్టిని దాటిపోవు. 'Interpretation is the revenge of the intellectual upon art.' అంటారు Susan Sontag.

ఇటువంటి శాపగ్రస్తుల్ని ఊరడిస్తూ అలసిసొలసిన సాయంత్రపు వేళల్లో ఎక్కడో అల్లంత దూరంనుంచి వినిపించే స్వచ్ఛమైన అమ్మ జోల పాట నందూ కవిత్వం. నందూ కవిత్వం ఈ హేతువాదపు చీకట్లు కమ్ముకోక మునుపటి వెలుగుల గతంలోనుండి కొన్ని జ్ఞాపకాలని తిరిగి కళ్ళముందు నిలిపింది. అదే నదినీ, దానితో ముడిపడ్డ జ్ఞాపకాలనీ గుర్తుకుతెచ్చింది. కొన్ని కవితలు చదువుతుంటే మా గోదావరి ఇసుక తిన్నెల్లో వదిలేసి వచ్చిన అడుగు జాడలవైపు కాలం వెనక్కి ప్రయాణించినట్లనిపించింది. ప్రేమనూ, ప్రేమరాహిత్యాన్నీ, వియోగాన్నీ, విరహాన్నీ, వైఫల్యాన్నీ, అస్తిత్వవాదాన్నీ, తాత్వికతనూ అన్ని వర్ణాల్లోనూ చిత్రించిన అందమైన కాన్వాసు నందూ కవిత్వం. చాలాచోట్ల నెరుడా ఛాయలు కనిపించాయి. ఇంతకుమించి నందూ కవిత్వాన్ని గురించి ఇంకేమీ చెప్పే సాహసం చెయ్యను. రసాస్వాదనలో హేతువాదానికీ, తర్కానికీ పనిలేదు. 

ఇక్కడొక చిన్న సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక పండితుడిని "మీరు ఈ విధంగా చేస్తే మీ రచనలు ఎక్కువమందికి చేరతాయి కదా" అని అమాయకంగా ప్రశ్నిస్తే , ఆయన చాలా ప్రశాంతంగా, "ఎక్కువమందికి ఎందుకు ,ఒకరిద్దరు చదివినా చాలు" అన్నారు. ఆమాట అర్థం కావడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాలుగు పుస్తకాలు ప్రచురించినా ముందుమాట / చివరి మాట  ఎవరితోనూ అడిగి రాయించుకోలేదనీ చెప్పిన నందూని చూస్తే ముచ్చటేసింది. తన కవిత్వానికి ఒకరిచ్చే అక్రిడేషన్/సర్టిఫికేషన్ పై ఆసక్తి లేదనీ, Poetry can speak for itself  అని నమ్ముతాననీ చెప్పిన ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం,నిజాయితీల పై అమితమైన గౌరవం కలిగింది.

ఈ కవిత్వాన్ని మీరు కేవలం వెలకట్టి సొంతం చేసుకోగలమనుకుంటే పొరపాటే. ఇటువంటి కవిత్వాన్ని ఆస్వాదించడానికి భావుకత్వంతో పాటు పాఠకుడికి కూడా మరింకేదో అర్హత కావాలి. నంద కిషోర్ కవిత్వం  దారిచేసుకుంటూ ప్రవహించే నదిలా అచ్చంగా ఎవరికోసం రాశారో అటువంటి అర్హత కలిగిన పాఠకులను తప్పకుండా వెతుక్కుంటూ వెడుతుంది.

నిన్న పుస్తకం చేరిన దగ్గరనుండీ పేజీలు తిరగేస్తూనే ఉన్నాను. చదివిన కవితలు కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.

మచ్చుకి ఈ ఆణిముత్యాలు :

కల్లోలాన్ని అనుభవిస్తూ ఒక్కడూ ఏం చేస్తాడు ? తీరాన కూర్చుని కెరటల్ని గురించి కవిత్వం రాస్తాడు. అలల మీదా, నీటి తరగల నాట్యం మీదా పదాలు అల్లుతూ పాటకడతాడు. ఉప్పెన మీదికి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే చేపపిల్లలాగా తుళ్లిపడతాడు. అలలతో పాటే ఊపిరి పోతే ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.

సముద్రం వాణ్ణి ప్రేమించిందని ఎవ్వరికీ చెప్పడు. కల్లోలాన్ని వాడు కోరుకున్నట్లు ఎప్పటికీ తెలియదు. తెలిసేదల్లా వాడికలేడనే !

--------------------------------------------------------

ఎలుగెత్తి నువ్వలా పాట పాడితే, ఎదకెత్తి నువ్వలా జోలపాడితే, పారిపోయేటినిశ్శబ్దాన్ని తెచ్చి పాటపాటలోనూ పదిలంగా నింపితే - మసకలోకమ్మీది మోహాలపొద్దులో సూర్యుడు,చంద్రుడు నిలవరనిపిస్తుంది. మరలిపోయేటి ప్రాణాలకోసం ఏడ్వడం,నవ్వడం కూడదనిపిస్తుంది.

Friday, February 18, 2022

Untitled – Swaroop Thotada

"Some birds are not meant to be caged.." అని స్టీఫెన్ కింగ్ అన్నట్లు ఈ పిల్లవాడి పదాలు పంజరాల్లో ఇమిడేవి కాదు, అవి తమ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా గాలివాటుకి దిశలు మార్చుకుంటూ, ఆకాశంలో గిరికీలు కొడుతూ అల్లరి చేసే విహంగాల సమూహాలు.

అతని వాక్యాల్లోనే చెప్పాలంటే "ఎడారి ఇసుకతిన్నెలమీద గాలికి పుట్టే గీతల్లాగ ఇష్టం వచ్చినట్లు తమ గతిని మార్చుకుంటూ పోయే" స్వరూప్ అక్షరాలు మనతో మాట్లాడతాయి. అతని వచనానికి సంప్రదాయ తెలుగు కాన్వాస్ పరిథి చాలదు.

రెండు తెలుగు వాక్యాలు తిన్నగా రాయలేని తెలుగు సాహితీ సెలెబ్రిటీల భాషారాక్షసాల మధ్యా / జర్నలిజాజానికీ, సాహిత్యానికీ బొత్తిగా తేడా తెలీని అనేక రచనల మధ్యా / సృజనాత్మకత 10%, పదాడంబరాలు 90% కలగలిపి వండే ఎగుడుదిగుడు తూకాల సాహితీపాకాల మధ్యా అలతి పదాలతో అలవోకగా లోతైన భావాన్ని చక్కగా వ్యక్తం చెయ్యగల స్వరూప్ వచనం ఒక సాంత్వన. తెలుగు సమకాలీన సాహిత్యం భవిష్యత్తుపై ఈ ప్రచురణ చిరు నమ్మకాన్ని కలిగిస్తోంది.

"ఇంతకీ ఈ స్వరూప్ ఎవరు ? " అని మీలో ఎవరైనా అడిగితే, "You are neither in right place nor in right company in social media." is my answer :)

Copyright A Homemaker's Utopia

Thursday, July 8, 2021

A Search in Secret India ( రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ) - Paul Brunton

కొన్ని పుస్తకాలు ఒక నిర్ణీత సమయంలో మాత్రమే మన దృష్టినాకర్షిస్తాయి, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు చదవడం సాధ్యపడదు. 2013 లో మిత్రులు సురేష్ పెద్దరాజు గారు బహూకరించిన పాల్ బ్రంటన్ రచన 'రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ' అలా ఒక సరైన సమయంలో చదవడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రిందట నన్ను చేరిన ఈ పుస్తకం ఇంతకాలంగా నా బుక్ షెల్ఫ్లో ఉన్నా ఇంతవరకూ ఎందుకు చదవలేదు అంటే సహేతుకమైన కారణాలు చెప్పలేను. బహుశా కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల  ఏర్పడిన నిరాసక్తత, వైరాగ్యం, స్తబ్దత ఆధ్యాత్మికత వైపు తాత్కాలికంగా నా దృష్టిని మళ్ళించి ఉండవచ్చు. అదలా ఉంచితే ఫిలాసఫీ అంటే మొదట్నుంచీ వల్లమాలిన ఇష్టం కావడంతో కొన్నేళ్ళ క్రితం జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద, రస్సెల్ ,హెస్సే ,గిడే, కామూ వంటి వారి తత్వాలను మైకం కమ్మినట్లు వరుసపెట్టి చదివినా,తరువాతి కాలంలో పరస్పర వైరుధ్య వాదనలతో భౌతిక ప్రపంచం నుండి దూరంగా మనిషిని వేరే ప్లేన్ లోకి తీసుకుని వెళ్ళి వదిలేసే అటువంటి రచనల నుండి ఉద్దేశ్యపూర్వకంగా దూరం జరిగే ప్రయత్నం చేశాను. కానీ ఆధ్యాత్మిక,తాత్విక విషయాలపై స్వతహాగా ఉన్న ఆసక్తి నాస్తికత్వపు (?) ముసుగుల మాటున మిగిలిపోయేది కాదేమో.

Image Courtesy Google

సత్యాన్వేషణలో భాగంగా భారత దేశం వచ్చి మెహెర్ బాబా, అడయారు యోగి బ్రమ,హజరత్ బాబాజాన్, రమణ మహర్షి, శ్రీ శంకరులు,విశుద్ధానంద మొదలగు అనేకమంది యోగుల్ని కలిసి,  వారి సాన్నిహిత్యంతో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలను పలు ఆధ్యాత్మిక రచనల్లో పొందుపరచిన బ్రిటిష్ రచయిత పాల్ బ్రంటన్ ఈ రచన ద్వారా పాఠకులకు దాదాపు కనుమరుగైపోయిన భారతీయ ఆధ్యాత్మిక  ప్రపంచాన్ని పునఃదర్శనం చేయిస్తారు. ఈ పుస్తకంలో భారతీయ యోగతత్వాన్ని గురించి చదువుతున్నంతసేపూ చాలామందికి వచ్చే సందేహమే నాకూ వచ్చింది. ఈ ఆధునిక యుగంలో భారతీయ యోగశాస్త్రం యొక్క ఉపయోగం ఎంత ? కానీ బ్రంటన్ తో ప్రయాణంలో నా ప్రశ్నకు కొన్ని సరైన సమాధానాలు దొరికినట్లనిపించింది.

ఆదర్శ జీవన శైలికి పాశ్చాత్యుల నిర్వచనమైన 'కార్యాచరణ' కు సుదూరంగా ముక్కుమూసుకుని ఎక్కడో అరణ్యాల్లో,హిమాలయాల్లో మారుమూల గుహల్లో,ఆశ్రమాల్లో తపస్సు చేసుకునే యోగుల వల్ల ఈ ఆధునిక సమాజానికి ఉపయోగం ఏమిటి ? అనేది బ్రంటన్ ను కూడా తుదికంటా వేధించిన ప్రశ్న. కానీ కనిపించినదాన్నల్లా గుడ్డిగా నమ్మకుండా తర్కం ప్రధానంగా భారత దేశంలో తన యాత్రలు కొనసాగించారాయన. వేల సంవత్సరాల క్రితం భారత దేశంలో ఋషులు ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల గురించీ, మానవజాతి ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల గురించీ మేధోమథనం చేసే సమయంలో పాశ్చాత్య దేశాలకు అటువంటి విషయాల్లో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదనే విషయాన్ని నేటి ఆధునిక భారతం అవహేళన చేస్తూ ప్రస్తావించే పరిస్థితులున్నా ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించే దిశగా ఈ పుస్తకంలో అనేక విశ్లేషణలు ఉంటాయి.

"బర్నాఫ్, కోల్బ్రూక్ , మాక్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారత దేశంలోని విలువైన సాహిత్య సంపదను పరిచయం చేసే వరకూ, యూరప్ లోని జ్ఞాన రక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశ ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు. ఆ రకంగా ప్రాచ్యదేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రచారం చేస్తూ, వారి సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి ఈ యురోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు."  అంటారు బ్రంటన్.

'మంచి వారి మౌనం సమాజానికి ప్రమాదకరమైనది' అనడం తరచూ వింటూ ఉంటాం. నిజానికి భారతీయ యోగ శాస్త్ర రహస్యాలను ఔపాసన పట్టిన ఋషులు సామజిక జీవనాన్నుంచి నిష్క్రమించడంతోనే భారతీయ సమాజం పతనం ప్రారంభమైంది అని పలువులు యోగులు అభిప్రాయపడతారు. 

"నిజానికి ఈ విశ్వ రహస్యాలన్నిటినీ విప్పి చెప్పగలమనే విజ్ఞాన శాస్త్ర రచయితలకి తెసింది సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం మాత్రమే ! వారెవరూ ఒక వృద్ధ ఫకీరు వనితతో కొన్ని నిముషాల సాన్నిహిత్యం నా ధృడమైన మానసిక మూలాలను కదిలించడం ఎలా సాధ్యపడిందో వివరించి చెప్పగలరని నేననుకోను. నిజానికి ఆ విషయం నాకూ అర్ధం కాలేదు." అంటారు బ్రంటన్. 
తన యాత్రలో బ్రంటన్ కలిసిన ఒక మౌన యోగి "ఈ ప్రపంచంలో ఆలోచనలను అంతర్ముఖం చేయడమే అన్నిటికంటే ఉన్నతమైన యోగం" అంటారు. కానీ క్షణకాలం పాటు కుదురునీ, మౌనాన్నీ,ఏకాంతాన్నీ భరించలేని నేటి 'డిస్ట్రాక్షన్' సమాజంలో నిజమైన అజ్ఞానులు అటువంటి యోగులను పిచ్చివాళ్ళుగా, సోమరులుగా, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా పరిగణించి నిందిస్తున్నారు. తర్కాతర్కాలను ప్రక్కన పెట్టి ఆలోచించి చూస్తే ఒక శాస్త్ర సాకేంతిక నిపుణుడు అభివృద్ధి పేరిట చేసే సామజిక వినాశనం కంటే తమ ప్రపంచంలో మౌనంగా ధ్యానం చేసుకునే ఈ యోగులు చేసే చేటు ఎక్కువేమీ కాదనిపించింది. నేటి సమాజంలో ప్రపంచాన్నిమార్చడం కంటే ఎవరికీ చేటు చెయ్యకుండా మనల్ని మనం మార్చుకోవడం మిక్కిలి అవసరం.
"పాశ్చాత్యులలో కొంతమందికి మహర్షి ఈ విధంగా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అనిపించవచ్చు. కానీ కొంతమందైనా ఈ విధంగా విడిగా కూర్చుని నిరంతర వ్యాపకాలతో సతమతమయ్యే మన ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించడమే మంచిదనిపిస్తుంది. అలా దూరంగా ఉండి చూసేవారికే లోక వ్యవహారం బాగా అర్ధమై సత్యం బోధపడుతుంది. మరో విధంగా ఆలోచిస్తే, ఈ లోకంలో అల్ప విషయాలకే తలకిందులయ్యే మూఢుల కంటే,ఈ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకుని అరణ్యంలో ధ్యానం చేసుకుంటూ కాలం గడిపే యోగి అన్ని విధాలా అధికుడనే చెప్పాలి. అంటారు బ్రంటన్ . 

రమణ మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు పొందిన అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ,

"ప్రశాంతత ఒక నదీరూపంలో నా దగ్గరగా ప్రవహిస్తున్నదనీ, ఒక గొప్ప ఆనందం నా అంతరాంతరాలని తాకుతున్నదనీ, ఆలోచనలతో సతమతమవుతున్న నా మనసుకి విశ్రాంతిగా ఉన్నదనీ మాత్రమే నాకు తెలుస్తున్నది. ఇప్పుడు చూస్తే నిరంతరం నన్ను వేధించే ప్రశ్నలు చాలా అల్పమైనవనిపిస్తోంది. గతాన్ని అవలోకిస్తే ఆ సమయమంతా ఎంత నిస్తేజంగా గడిపానా ? అని నాకే ఆశ్చర్యం వేస్తున్నది. ఒక విధంగా చూస్తే మన మేథే సమస్యలని సృష్టించుకుని ,వాటిని పరిష్కరించడానికి నానా యాతనా పడుతూ ఉంటుందనే అభిప్రాయం బలపడుతున్నది. ఇప్పటి దాకా మేథని ఒక గొప్ప వరంగా భావిస్తూ వచ్చిన నాకు ఈ రకమైన ఆలోచన రావడం విచిత్రమే." అంటారు బ్రంటన్. 

యుక్తవయస్సులో నాస్తికుడైన టాల్స్టాయ్ తన చివరి కాలంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ రచించిన 'కన్ఫెషన్స్'  అనే పుస్తకంలో నిరక్షరాస్యులైన క్రైస్తవులకు దైవం పట్ల ఉన్న అపారమైన నమ్మకాన్ని గురించిన అభిప్రాయాన్నే బ్రంటన్ కూడా వెలిబుచ్చడం విశేషం. దైవం విషయంలో తర్కానికి ఆస్కారం లేని 'నమ్మకం', 'లొంగుబాటు' ఎంత అవసరమో ఈ మాటలు చెబుతాయి. 

ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నానో, అక్కడ చేరిన శ్రోతల నమ్మకం చూసి అంత ఈర్ష్య పడ్డాను. వారి జీవితంలో సందేహానికి తావులేదు. "దేవుడున్నాడు" అంటే "అవును. ఉన్నాడు" అనే నమ్మకం తప్ప, జీవితమంటే, విశ్వంలోని భూమి అనే సూక్ష్మ రేణువుపై మానవుడు చేసే యాత్ర అనీ, అక్కడ భగవంతుడనే వాడికి చోటు ఉండదనీ ఆలోచిస్తూ చీకటి రాత్రులు గడపడం వారికి తెలియదు. 

'సిద్ధార్థ' లో హెర్మాన్ హెస్సే రాసినట్లుగానే సత్యాన్వేషణకు మార్గాన్ని,సాధనాల్నీ గురువు సూచించినా స్వీయానుభవంతో మాత్రమే ఎవరైనా అంతర్గతమైన "నేను" ని దర్శించగలరని రమణ మహర్షి కూడా బ్రంటన్ కు ఉపదేశిస్తారు.

మానవ సమాజంలో సాన్నిహిత్యానికి నిర్వచనాలు విచిత్రంగా అనిపిస్తాయి. మనుషులతో సాన్నిహిత్యం ఏర్పడాలంటే వారి సంతోషంలోనో,దుఖ్ఖములోనో నువ్వు పాలుపంచుకోగలగాలి. అటువంటి మానవ సంబంధాల్లో పరస్పరం మార్పులకి సిద్ధం కాగలగాలి. కానీ భావోద్వేగాలకు అతీతమైన వారిని నువ్వు దూరంనుండి పరిశీలించగలవు గానీ వారితో స్నేహాన్ని చెయ్యడం అసాధ్యం. యోగుల చుట్టూ ప్రశాంతమైన అటువంటి అభేధ్యమైన కోటను దాటి వారి ఆత్మను దర్శించడం సాధారణ మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. రమణ మహర్షిని తదేక ధ్యానంలో చూసిన బ్రంటన్ ఈ విధంగా అంటారు.

తరువాత కొన్ని రోజులు మహర్షితో సాన్నిహిత్యం పెంచుకుందామని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. దానికి మూడు కారణాలున్నాయి.ఒకటి ఆయనలో సహజంగానే ఉన్న గాంభీర్యం . వాదప్రతివాదాల పట్లా, చర్చల పట్లా అయన అయిష్టతా, ఇతరుల నమ్మకాలూ, అభిప్రాయాల పట్ల ఆయన నిర్లిప్తతా అందరికీ తెలుసు. ఎవరినీ తన అభిమతానికి అనుగుణంగా మార్చాలనే కోరిక ఆయనకి ఏ కోశానా లేదు. తన అనుచరగణానికి మరొక్కరినైనా కలుపుకోవాలనే ఆరాటమూ ఆయనకి లేదు.

ప్రాచ్య దేశాలతో పోలిస్తే పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక లేమిని ఎత్తి చూపించడానికి బ్రంటన్ వెనుకాడకపోవడం విస్మయపరిచింది.

"పాశ్చాత్య దేశాల్లో చాలామందికి ఇటువంటి సత్యాన్వేషణకి అసలు సమయమే ఉండదు. యథాతథ స్థితిని ఏ ప్రశ్నలూ లేకుండా ఆమోదించే పొరపాటు చేయటానికి వారు చెప్పే కారణం " ఇది నా ఖండంలో ప్రజలందరూ చేస్తున్న పొరపాటే"  అంటారాయన .

ఒక ప్రక్క ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తూనే మరో ప్రక్క మతం పేరిట ప్రజలను మోసం చేసే దొంగ సాధువుల గురించీ ఫకీరుల గురించీ కూడా రాశారు. మానవ ప్రయత్నం ఏమీ లేకుండా అన్నీ దైవం చేసిపెట్టాలని ఎదురు చూసే మూఢ భక్తినీ, కర్మ చెయ్యకుండా అన్నిటినీ దైవం మీదకు తోసేసి కులాసాగా బ్రతికే భారతీయ నిష్క్రియాపరత్వాన్నీ దుయ్యబట్టారు. నిజానికి మతంతో సంబంధం లేని ఎన్నో విషయాలను కప్పిపెట్టడానికి మతాన్ని అడ్డుపెట్టుకోవడం భారతీయ సమాజంలో ఉన్న లోపం. మతాన్ని అనుసరించకుండా,జీవితానికి అన్వయించుకోకుండా,ఎటువంటి కార్యాచరణా లేకుండా మతోద్ధారకుల్లా మతం గురించి మాట్లాడడం వరకే నేటి భారతీయుల ఆదర్శాలు పరిమితమైపోయాయి. ఇటువంటి సందర్భాల్లోనే కపట గురువులు పుట్టుకొచ్చి మతమంటే వంచన అనే స్థాయికి పడిపోయింది. ఉదాహరణకు ఈ రచనలో మెహెర్ బాబా గురించి బ్రంటన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా పాల్ బ్రంటన్ సత్యాన్వేషణ రమణ మహర్షి ఆశ్రమంలో పూర్తికాగా ప్రాచీన యోగశాస్త్రాన్ని ఆధునిక పద్ధతులలో ఉపయోగించే దిశగా రెండిటినీ సమన్వయము చేసే వ్యవస్థలూ,వ్యక్తుల అవసరం భారతీయ సమాజానికి ఎంతైనా ఉంది అని ఆయన అభిప్రాయపడతారు.

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :

ఆనందమే మనిషి సహజ స్థితి.ఈ ఆనందం నిజమైన "నేను" లో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా ఈ సహజ స్థితిని కనుక్కోడానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే! ఈ సహజ స్థితికి నాశనం లేదు.

భావోద్రేకాల నుంచి హేతువాదాన్నీ, అభూత కల్పనల నుంచి చరిత్రనీ, ఊహ నుంచి సత్యాన్నీ వేరు చేసే శాస్త్రీయ శిక్షణా, ఆలోచనలూ గుడ్డిగా అనుసరించేవారికి తెలియవు. అందుకని నిజాయితీ లేనివారూ, అనుభవంలేని మూఢులూ, గొప్పవారిని అనుకరిద్దామనే అభిలాష గలవారూ, ఈ రకమైన వారితో గూడిన అనుచరణగణాన్ని పోగుచేసుకోవడం ఈ దేశంలో చాలా తేలిక.

Wednesday, June 10, 2020

Vishnu Sharma English Chaduvu - Viswanatha Satyanarayana


Image Courtesy Google
చాలా ఏళ్ళ క్రితం చదివిన విశ్వనాథవారి 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' నుండి సేవ్ చేసుకున్న కొన్ని వాక్యాలు ఈరోజు అనుకోకుండా కంటబడ్డాయి..ఈ బ్లాగ్ లో అనేక ఇంగ్లీష్ పుస్తకాల మధ్య కాస్త వెరైటీగా కూడా ఉంటుంది,కొంత విరామం తరువాత బ్లాగ్ పునః ప్రారంభోత్సవం ఆ వాక్యాలతో చేస్తే ఎలా ఉంటుందా అని సరదా ఆలోచన వచ్చింది..అందుకే క్వారంటైన్ సమయంలో ఫేస్బుక్ లో సమయం వృథా చేసిన పాపాన్ని ప్రక్షాళన గావించే ఉద్దేశ్యంతో,అటకెక్కిన చదువుని అటకమీద నుండి దించుతూ,పుస్తకాల బూజు దులుపుతూ అటు రివ్యూ కాని,ఇటు వ్యాసం అంతకంటే కాని ఈ నాలుగు ముక్కల అచ్చ తెలుగు పోస్టు..విశ్వనాథ వారి హాస్య ప్రియత్వం,వ్యంగ్యోక్తులు ఆద్యంతం ఆసక్తికరంగా పుస్తకాన్ని క్రిందపెట్టనివ్వకుండా చదివించాయి.

ఈ పుస్తకంలో విద్యకూ వివేకానికీ చాలా భేదం ఉందని రుజువు చేస్తూ,అందరూ అదేదో బ్రహ్మ పదార్థమనుకుని అబ్బుర పడుతూ చూసే ఇంగ్లీషు విద్య వివేకాన్నీ,విచక్షణనూ ఇవ్వదని వాదిస్తూ విశ్వనాథవారు తనదైన శైలిలో పెట్టిన అనేక వాతలు ఉంటాయి.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు..
వ్రాయగలవాడవు అలా అనకు.. కాలాన్ని అనుసరించి వ్రాయి..
కాలం నన్నెందుకనుసరించకూడదు ??  తనని అనుసరించమని కాలం నన్నెందుకు అడగాలి.. ఆ కాలం గొప్ప ఏమిటి ? అదైనా నేనైనా ఆలోచన మీద ఆధారపడి కదా నడవాలి.. "నేను కాలాన్ని గనుక ఆలోచించను" అని అది అంటే నేనేమనాలి ? నీవు కాలానివైనా సరే..నీవు ఆలోచించి ప్రవర్తించకపోతే నేను నిన్ను అనుసరించను అనాలి.. అంతే . 
కారణమునందు లేని గుణము కార్యము నందు సంక్రమించదు కదా.. 
ఆ తిక్కన్న గారిలో పేచీ పద్యాలు చాలా ఉన్నవట .. 
విష్ణు శర్మ ""మీ తాత తాత ఉండాలి కదా ఆయన చిన్నప్పుడే చచ్చిపోయినాడు..మీ తాత తండ్రిని కనక ముందే చచ్చిపోయినాడు.. తరువాత మీ తాత పుట్టాడు ఏమంటావు ?""  మీ తాత తాతే అంతే నన్నాను  
ఈ దేశం లో ప్రతిదాన్ని గురించీ చర్చలే తప్ప సారాంశమనేది ఉండదు.. 
వాడు చెప్పినదానికి నీవు సమాధానం చెప్పలేకపోతే,పూర్వ కాలం లో అవతలవాళ్ళు చెప్పింది ఒప్పుకొనేవాళ్ళు .. ఈ కాలంలోనో వాడు భేదించేందుకు అడుగుతాడు.. ఇక దేని తత్వం ఎట్లా నిర్ణయింపబడుతుంది ?  
ఈ దేశం లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళేనన్నమాట.. కనీసం నూటికి తొంభై తొమ్మండుగురికి ఇంగ్లీషు రాదు,తెలుగూ రాదని అర్థం..ఎందుచేతనంటే ఒక భాష మాతృ భాష అయితే ఆ భాష మాట్లాడేస్తూ ఉండటం వల్ల ఆ భాషంతా నోటికి వస్తుంది.. తరువాత వ్యాకరణము తెలుసుకుంటాము.. వ్యాకరణం తెలియటంతోనే నీవు పండితుడవని అర్థం.. నీవు నాలుగు వందల పుస్తకాలు చదివినా సరే నీకు వ్యాకరణం తెలియకపోతే అపండితుడవు... మీరందరూ అపండితులు.