Saturday, February 1, 2025

The Golden Kite, the Silver Wind - Ray Bradbury

కొద్ది రోజులుగా బోర్హెస్, సిల్వినా ఒకాంపో, అడాల్ఫో సెసారెస్ లతో కలిసి ఎడిట్ చేసిన "బుక్  ఆఫ్ ఫాంటసీ" చదువుతున్నాను. అందులో రే బ్రాడ్బరీ కథ "The Golden Kite, the Silver Wind" చిన్నపుడు చదివిన చందమామ కథను గుర్తుచేసింది. "అనగనగా" అంటూ మొదలుపెట్టి పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన కథ ఇది. యునైటెడ్ స్టేట్స్ కీ, సోవియట్ యూనియన్ కీ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ విపరీతమైన టెన్షన్ నెలకొన్న సందర్భంలో రాసిన ఈ నీతి కథ ప్రతీ మానవ సమాజానికీ అన్వయించుకునే విధంగా అత్యంత అవసరమైన రాజకీయ పాఠం చెబుతుంది.

Image Courtesy Google

Life was full of symbols and omens. Demons lurked everywhere, Death swam in the wetness of an eye, the turn of a gull’s wing meant rain, a fan held so, the tilt of a roof, and, yes, even a city wall was of immense importance.

ఈ కథకు నా స్వేచ్ఛానువాదం: 

అనగనగా రెండూళ్ళు. ఒక్కో ఊరికీ ఒక "మాండరిన్" రాజుగా ఉంటాడు. ఒకరోజు రాజు గారు కొలువుదీరి ఉండగా ఒక బంటు పక్కూరు కువాన్-సి తన ఊరి గోడను పంది ఆకారంలో కట్టుకుందన్న వార్తను మోసుకొస్తాడు.

"నా చిన్నప్పుడు కొండ ప్రక్కన చిన్న పల్లెటూరు, ఇప్పుడు గోడ నిర్మించుకునేంత స్థాయికి చేరిందా!" కోపంతో రుసరుసలాడాడు మాండరిన్.

"ఎక్కడో దూరంగా ఉన్న ఊరు గోడ ఎలా కట్టుకుంటే మనకేంటి నాన్నా?" ప్రశ్నించింది రాజు గారి కూతురు.

"ఎందుకంటే, మన ఊరి గోడ 'నారింజ' ఆకారంలో కట్టుకున్నాం కదా! ఆ పందులన్నీ మన గోడను ఆకలితో తినేస్తాయి" సమాధానమిచ్చాడు రాజు.

మానవ జీవితమంతా సంకేతాలమయం. శకునాలు, చిహ్నాలూ మనకు చాలా ముఖ్యం. మృత్యువు ఎక్కడెలా పొంచి ఉందో చెప్పలేం. అందుకే ఒక గోడ కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చే యాత్రికులూ, ప్రయాణికులు, కళాకారులూ,  దేశదిమ్మరులూ ఈ రెండు ఊళ్ళలో ప్రవేశించడానికి శకునాలూ, సంకేతాలూ చూసుకుంటారు. "నారింజ ఆకారపు గోడ ఉన్న ఊరా? వద్దొద్దు, నేను పంది ఆకారంలో ఉన్న ఊళ్ళో ప్రవేశిస్తే, దానిలాగే సుష్టుగా తిని బాగా వృద్ధి చెందుతాను" అనుకుంటారు.

రాజుగారి భయమూ, బాధా చూసిన కూతురు అతనికో మంచి ఉపాయం చెప్పింది. గోడ కట్టడానికి అవసరమైన శిల్పుల్నీ, పనివాళ్ళనూ వెంటనే పిలిపించమని చెప్పి తాను మాత్రం తెర వెనుక నిలబడి, తండ్రికి వాళ్ళతో ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేస్తానని చెప్పింది.

రాళ్ళు, గ్రానైట్ , ఓనిక్స్, క్వార్ట్జ్ లాంటి స్ఫటికాలూ, శిలలతో పని చెయ్యడం తెలిసిన శిల్పులందరూ సభకు తరలి వచ్చారు. మాండరిన్ సింహాసనం వెనుకనున్న తెరకు దగ్గరగా నిలబడ్డాడు. కాసేపటికి తెర వెనుక నుండి గుసగుసగా మాటలు వినిపించాయి. మాండరిన్, కూతురి మాటల్ని యథాతథంగా వల్లించడం మొదలుపెట్టాడు.

"మన పట్టణమేమో నారింజ ఆకారంలో ఉంది, పొరుగున ఉన్న కువాన్-సి తమ పట్టణాన్ని పంది ఆకారంలో కట్టుకుంది. అందువల్ల అది మన నారింజలన్నిటినీ తినేస్తుంది. మీరు వెంటనే మన గోడను ఆ పందిని హతమార్చడానికి వీలుగా ఉండే పెద్ద దుడ్డు కర్ర ఆకారంలోకి మార్చాలి." అని ఆదేశించాడు.

శిల్పులందరూ సరేనని రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించింది. రాజుగారి తెలివికీ, వివేకానికీ అందరూ అతణ్ణి ప్రశంసించారు.

ఊళ్ళో గోడ కట్టడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రజలందరూ కలసిమెలసి పనిచేశారు. నెల తిరిగేలోగా గోడ కట్టడం పూర్తైపోయింది. ఇప్పుడు మాండరిన్ ప్రతిరోజూ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ఈ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఒకనాడు మధ్యాహ్నం బంటు ఒకడు అత్యవసర సందేశం మోసుకుని సభలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

"ఓ మాండరిన్, మన ఊళ్ళో వ్యాధి ప్రబలింది, నీరు విషతుల్యమైంది, ప్రజలు అల్లాడుతున్నారు. మనం కట్టిన దుడ్డు కర్ర ఆకారంలో ఉన్న గోడను కాల్చి మసిచెయ్యడానికి కువాన్-సి పట్టణం వారు తమ గోడను అతి పెద్ద చలిమంట ఆకారంలో పునర్నిర్మించారు." అని విన్నవించుకున్నాడు.

మాండరిన్ కి మళ్ళీ నీరసం వచ్చినంత పనైంది. ఊళ్ళోకి వచ్చే యాత్రికులు, సులభంగా బూడిదయ్యే కర్రను కాదని ఉవ్వెత్తున ఎగసిపడే మంటలున్న వారి ఊరి వైపు వెళ్ళిపోతారు అనుకుని విచారపడ్డాడు.

సరిగ్గా అదే సమయంలో తెర వెనుక నుండి "కాదు" అన్న స్వరం వినిపించింది. మాండరిన్ మునుపటిలాగే తెర వెనుక మాటల్ని అనుకరిస్తూ, "శిల్పకారులకు  వెంటనే మన గోడలను పెద్ద సరస్సు ఆకారంలో కట్టమని చెప్పండి. ఆ సరస్సు నీటితో వాళ్ళ మంటల్ని ఆర్పేయండి." అని ఆదేశించాడు.

మహారాజు తెలివికి పట్టణమంతా మరోసారి సంతోషించింది. ప్రజలందరూ  మరోసారి గోడ నిర్మించే పనుల్లో పడ్డారు. కానీ వారి పనిలో మునుపటి వేగం , ఉత్సాహం తగ్గాయి. ఎందుకంటే మొదటిసారి గోడ నిర్మించడానికి పట్టిన నెల రోజుల సమయంలో వారు సొంత పనులకూ, వ్యాపారానికీ, వ్యవసాయానికీ సమయం కేటాయించలేకపోయారు. ఈకారణంగా చాలామంది పేదరికంతో బలహీనపడ్డారు. ఏదైతేనేం, త్వరలోనే సరస్సు ఆకారంలో గోడ నిర్మాణం పూర్తయ్యింది.

రాజు గారు సరిగ్గా ఊపిరి పీల్చుకోనైనాలేదు, ఈలోగానే మళ్ళీ ముప్పు ముంచుకొచ్చింది. కువాన్-సి పట్టణంవారు ఈసారి తమ గోడలను సరస్సు నీటిని అమాంతంగా తాగేసే "నోరు" ఆకారంలో కట్టారనన్న వార్త ఊళ్ళో గుప్పుమంది.

మాండరిన్ మరోసారి కుమార్తె సలహా కోసం తెరకు దగ్గరగా జరిగాడు. అప్పుడు తెర వెనుక స్వరం, "మన గోడలను వెంటనే 'సూది' ఆకారంలోకి మార్చండి, ఆ నోటిని కుట్టేద్దాం." అని పలికింది. మాండరిన్ ఆ స్వరాన్ని అనుకరిస్తూ శిల్పులకు ఆదేశాలు జారీ చేసాడు.

"రాజా! రక్ష రక్ష!" అంటూ వార్తాహరుడు మళ్ళీ వచ్చాడు. "వారు తమ గోడలను 'కత్తి' ఆకారంలోకి మారుస్తున్నారు, అది మన సూదిని ఇట్టే విరగ్గొట్టేస్తుంది." అన్నాడు.

ఈసారి మాండరిన్ నిలువెల్లా కంపించిపోయాడు. తెరను పట్టుకుని నిలబడి , కుమార్తె చెప్పే ఉపాయం కోసం వేచి చూస్తున్నాడు.

తెర వెనుక స్వరం, "అయితే మన గోడను వెంటనే 'కత్తి ఒర'గా మార్చండి. వాళ్ళ కత్తి మన ఒరలో ఇమిడిపోతుంది." అని పలికింది.

"ప్రభూ, దయ చూపండి. కువాన్-సి పట్టణం వారు రాత్రీ పగలూ పనిచేసి, తమ గోడను మిరుమిట్లు గొలిపే 'మెరుపు' ఆకారంలోకి మార్చారు, అది మన కత్తి ఒరను ధ్వంసం చేసేస్తుంది." అంటూ పరుగుపరుగున ఏడుస్తూ మరో వార్త మోసుకొచ్చాడు వార్తాహరుడు.

ఊరంతా వ్యాధులు ప్రబలాయి, దుకాణాలు మూసుకుపోయాయి. నడి వేసవి రోజుల్లో వ్యవసాయం మాని, నిరంతరం గోడలు నిర్మిస్తూ నిర్విరామంగా పనిచేసిన జనం నీరసంతో శుష్కించిపోయారు. మృతుల సంఖ్య కూడా పెరిగింది. మాండరిన్ విచారంతో వ్యాధిగ్రస్తుడై మంచంపట్టాడు. తెరవెనుక స్వరం కూడా నీరసించి ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లు వినిపించసాగింది.

"కువాన్-సి ఒక 'గద్ద'. అయితే మన గోడల్ని ఆ గద్దను పట్టుకునే 'వల'గా మార్చాలి. వారు సూర్యుడిగా మారి మన వలను కాల్చేస్తే, మనం చంద్రుడిలా మారి వాళ్ళ సూర్యుణ్ణి గ్రహణంతో కనపడకుండా చేసెయ్యాలి."

ఆ విధంగా వ్యాపారాలూ, వ్యవసాయాలూ మానేసి సమతౌల్యం కోల్పోయిన  ఊరు తుప్పుపట్టిన యంత్రంలా చివరకు పూర్తిగా పనిచెయ్యడం మానేసింది.

తెర వెనుక నుండి క్షీణించిన స్వరం, "ఇంక చాలు, దేవుడి మీద భారం వేసి,  కువాన్-సి ని మన ఊరికి ఆహ్వానిస్తున్నామని వెంటనే కబురు పంపండి" అంది.

వేసవి చివరలో, శుష్కించిన శరీరంతో, నీరసంగా నడవలేని స్థితిలో ఉన్న కువాన్-సి రాజుగారిని నలుగురు బక్కచిక్కిన మనుషులు మోసుకొచ్చి సభలో కూర్చోబెట్టారు. రెండూళ్ళ మాండరిన్లు ఎదురెదురుగా కూర్చున్నారు.

తెర వెనుక స్వరం "మనం ఈ దురంతానికి ముగింపు పలుకుదాం. ఇదిలా కొనసాగదు, మన ప్రజలు ప్రతి రోజూ, ప్రతి గంటా తమ గోడల్ని నిర్మిస్తూనే ఉంటే వాళ్ళకి వేటకీ, వ్యవసాయానికీ, వ్యాపారానికీ, భోజనం చేయడానికీ, చేపలు పట్టడానికీ, ప్రేమలో పడడానికీ, తమ పూర్వీకుల్ని గౌరవించుకోడానికీ సమయం దొరకదు." అని పలికింది.

ఇద్దరు రాజులూ అంగీకారంగా తలూపారు.

"ఇప్పుడు మమ్మల్నందర్నీ సూర్యకాంతిలోకి తీసుకెళ్ళండి" అని సేవకులను  ఆజ్ఞాపించిందా స్వరం.

ఇద్దరు వృద్ధులనూ సూర్యకాంతి పడుతున్న ఒక చిన్న కొండ పైకి  తీసుకెళ్ళారు. అక్కడ పోషణ లేక, సన్నగా చిక్కిపోయిన కొందరు పిల్లలు రంగురంగుల గాలిపటాలెగరేస్తున్నారు.

రాకుమార్తె తన తండ్రి మంచం వద్ద నిలబడి, "అవి చూడండి," అంది.

"చూడ్డానికేముంది? అవి కేవలం గాలిపటాలేగా!" అన్నారు ఇద్దరు మాండరిన్లు.

"నిజమే, కానీ నేలమీద ఉండే గాలిపటానికి విలువేమిటి? విలువ లేని దానికో లక్ష్యాన్నిచ్చి, అది అందంగా ఎదగడానికి అవసరమైనదేమిటి?" ఆమె ఇద్దర్నీ ప్రశ్నించింది.

"గాలి కదా!" ఏకగ్రీవంగా సమాధానమిచ్చారు ఇద్దరు మాండరిన్లు.

"మరి ఆకాశాన్నీ, గాలినీ అందంగా మార్చడానికి వాటికేం కావాలి?" మళ్ళీ ప్రశ్నించిందామె.

"గాలిపటం." వారు ఒక్కసారిగా సమాధానమిచ్చారు. "నిజానికి సాదాసీదాగా,  ఖాళీగా ఉండే ఆకాశాన్ని రంగులమయం చేస్తూ అందంగా మార్చాలంటే ఎగిరే గాలిపటాలు అనేకం కావాలి."

"కదా! ఇప్పుడు మీ కువాన్-సి ఊరి గోడని చివరిసారిగా 'గాలి' ఆకారంలో నిర్మించండి. మేము మా గోడను ఒక బంగారు గాలిపటంలా నిర్మిస్తాము. మీ ఊరి గాలి మా గాలిపటాన్ని ఆకాశంలో అద్భుతమైన ఎత్తులకు తీసుకువెడుతుంది. మా గాలిపటం మీ గాలి యొక్క సమరూపాన్ని మార్చి దానికో గమ్యాన్నీ, అర్థాన్నీ ఇస్తుంది. ఈ రెండూ ఒకటి లేకుండా మరొకటి అందంగా, ఆనందంగా మనలేవు. కలసిమెలసి జీవించడం అంటే పరస్పర సహకారంతో ఒక దాని మీద మరొకటి ఆధారపడి చిరకాలం జీవించడం."

తరువాత ఇద్దరు రాజులూ చాలా కాలం తరువాత తృప్తిగా ఆహారాన్ని తీసుకున్నారు. తాత్కాలికంగా వచ్చిన ఓపికతో ఒకరినొకరు కౌగలించుకుని కీర్తించుకున్నారు. మాండరిన్ కుమార్తె వివేకాన్ని గౌరవిస్తూ ఆమెను కొడుకులు లేని మాండరిన్ కు దక్కిన గొప్ప కొడుకని వేనోళ్ళ పొగిడారు.

ఆ విధంగా ఆ రెండు పట్టణాలూ "గోల్డెన్ కైట్ పట్టణం" మరియు "సిల్వర్ విండ్  పట్టణం"గా మారాయి. పాడి పంటలతో, వ్యాపారాలతో, సుఖసంతోషాలతో  రెండూళ్ళూ కళకళలాడాయి.

No comments:

Post a Comment