Friday, September 27, 2019

Reading as a meditation..

One of the most effective forms of healing has been largely neglected by doctors and patients—that’s healing by reading. If you are in the dumps or in bed with a bug, or recovering from a serious illness, or waiting for a fracture to heal, get hold of books by your favourite authors and read as much as you can. You will start feeling better far sooner than if you simply lie on your back and feel sorry for yourself. (If the books put you to sleep, all the better.) And it’s safe, too: I have yet to hear of anyone dying from an overdose of reading. -- Ruskin Bond.'
Image Courtesy Google
ఇది చదవగానే ముందు నవ్వొచ్చినా తరువాత నిజమే కదా అనిపించింది..ఈ వాక్యాలు రస్కిన్ బాండ్ 'A Little Book of Life' లోనివి..ఇది చదివాకా సొంత ఘోషనుకోకపోతే ఈ రెండు ముక్కలూ రాద్దామని అనిపించింది..ఒకరికైనా ఉపయోగపడుతుందేమోనని..గత మూడేళ్ళలో మా కుటుంబంలో ఆరుగులు వ్యక్తులు వరుసగా వెళ్ళిపోయారు..వెళ్ళిపోయినవాళ్ళందరూ చిన్నప్పటినుండీ నా మీద ఎంతో ప్రభావం చూపించినవాళ్ళు,నాతో బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నవాళ్లూను.. అమ్మ,అన్నయ్య,అత్త ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన వెలితిని నింపేసి వెళ్ళిపోయారు..సరే ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా వదిలేస్తే ఓ మూడేళ్ళ క్రితం అంతా సజావుగా ఉన్న లైఫ్ ఒక్కసారిగా తలక్రిందులైపోయినట్లైంది..జీవితం నాకేం నేర్పిందో తెలీదు గానీ ఒక్క మరణం మాత్రం మనిషికి చాలా నేర్పిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను..రెండేళ్ళపాటు వరుస దెబ్బలు తిని తిని,చూస్తుండగానే అందమైన ప్రపంచం అనుకున్నదంతా భ్రమ అని తీవ్రమైన నిరాశ, నిస్పృహలు, వైరాగ్యం వచ్చేశాయి..అమ్మ తో పాటు,నన్ను ఎత్తుకు పెంచినవాళ్ళు,కుటుంబంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు ఒక్కొక్కరూ మెల్లిగా నిష్క్రమిస్తుంటే నా చిన్నతనాన్ని కూడా వాళ్ళతో ఒక్కసారిగా తీస్కెళ్ళిపోయినట్లనిపించింది..వెళ్ళేవాళ్ళు వెళ్తూ వెళ్తూ వాళ్ళతో పాటు ముడిపడి ఉన్న నా అస్తిత్వాన్ని తలా నాలుగు ముక్కలూ పంచుకుని తీసుకెళ్ళిపోయారు..ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి గానీ అవి నిజమని నన్ను నమ్మించగలిగే కంటికి కనిపించే సాక్ష్యం ఒక్కటీ మిగల్చలేదు..నా వయసు ఉన్నట్లుండి రెట్టింపైపోయిన భావన..ఏం జరుగుతోందో అర్థంకాక,మెదడులో ఏమీ ప్రాసెస్ చెయ్యలేక అదొకరకమైన నిస్సహాయతా,నిర్లిప్తతా అలముకుంది..

అలాంటి సమయంలో నన్ను ఆ వైరాగ్యం నుండి బయటకు లాగిపడేసినవి పుస్తకాలు..వినడానికి ఫన్నీగా అనిపించినా ఇది నిజం..ఇది నా అనుభవం..మనందరికీ హ్యూమన్ మోర్టాలిటీ గురించి అంతా తెలిసిందే అయినా సరే ఎందుకో అస్సలు ఒప్పుకోబుద్ధి వెయ్యదు...Grief ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హేండిల్ చేస్తారంటారు..ఒక్కోసారి నాలోకి నేను వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోయినా,మరోసారి వాస్తవంలోకి లాక్కొచ్చి పడేసే చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం 'All is well' అనుకునేలా చేస్తుంది...కడుపునిండా తింటున్నాం,చల్లగా ఉంటున్నాం..ఇంకా వీటికి మించి ఆశించడం అత్యాశ కదూ అని ఒకప్రక్క మనసు హితవు చెప్తూనే ఉంటుంది..ఓ రెండ్రోజులు అంతా బావున్నట్లే అనిపిస్తుంది..మళ్ళీ మూడోరోజు మనసు మూలల్లో ఎక్కణ్ణుంచో తెలీదు పెను తుఫానులా మనసంతా చీకట్లు కమ్మేసినట్లు అనిపిస్తుంది...ఆ 'Emptiness' ని వర్ణించతరం కాదు..Grief గురించి చదవడం వేరు,అనుభవించడం వేరు..ఏ వ్యక్తీకరణకూ అందని భావన అది...సరిగ్గా అటువంటి సమయాల్లో పుస్తకం పట్టుకుంటే కళ్ళు అక్షరాలవెంట అలుపు లేకుండా పరిగెత్తేవి..మొదట్లో కళ్ళని వీడి మనసు మాత్రం ఎక్కడెక్కడో చీకటి ప్రపంచాల్లో విహరించి వచ్చేది..కానీ కళ్ళు మాత్రం నిరాఘాతంగా వాటి పని అవి చేసుకుంటూపోయేవి..నేనైతే అదొక రకమైన 'మెడిటేషన్' అంటాను..కానీ ఈ క్రమంలో మెల్లిగా ఆ chaos లో ఒక మెంటల్ బాలన్స్ అలవడింది..ఆ సమయంలో నన్ను వెతుక్కుంటూ (నిజమే నన్ను వెతుక్కుంటూనే వచ్చాయి ) వచ్చిన కొన్ని పుస్తకాలు అతుల్ ఘవన్డే 'బీయింగ్ మోర్టల్',హెలెన్ మాక్ డోనాల్డ్ 'H is for Hawk',Oliver Sacks 'Gratitude',Dalai Lama 'The Book of Joy', Rebecca Skloot 'The Immortal Life of Henrietta Lacks', Mary Roach 'Stiff: The Curious Lives of Human Cadavers' లాంటివి ఎటువంటి డిప్రెషన్ బారినా పడకుండా ఆ వైరాగ్యం నుంచి నన్ను బయటకు లాగి పడేశాయి..ఆ సమయంలో దొరికిన,కనిపించిన ప్రతీ పుస్తకమూ చదివేదాన్ని..ఎప్పుడో జీవితాన్ని కాచి వడపోసి పుస్తకాల రూపంలో మనకు అందించిన ఎంతోమంది రచయితల సాహచర్యంలో నా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయనిపిస్తుంది..మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి..Thanks to the books and so many authors who kept me perfectly sane(?) in those horrible moments...అంతకు ముందు కూడా ఎన్నో పుస్తకాలు చదివాను కానీ ఆ తరువాత పఠనానుభవాలు మాత్రం పూర్తిగా వేరు..అంతవరకూ ఒక హాబీగా ఉన్న పుస్తక పఠనం నాకు ఒక నిత్యావసరంగా ఎప్పుడు మారిపోయిందో చెప్పడం కష్టం..

నిన్ననే హెర్మాన్ హెస్సేని చదువుతుంటే "In spite of all the pain and sorrow I'm still in love with this mad,mad world." అనే వాక్యాలు కనిపించాయి..నా పెదాల మీదకొక చిరునవ్వు వచ్చింది.

Tuesday, September 24, 2019

బోర్హెస్ 'కాంగ్రెస్' ఏం చెబుతోంది..

జార్జ్ లూయీ బోర్హెస్ 'బుక్ ఆఫ్ సాండ్' లో 'కాంగ్రెస్' అనే ఒక కథ ఉంటుంది..నిజానికి ఇది పరిచయం అఖ్ఖర్లేని కథ,చాలా మందికి సుపరిచితమైన కథే..

Image Courtesy Google
ఈ కథ లో మానవజాతికీ,మానవత్వానికీ ప్రాతినిథ్యం వహించడానికి ఒక సంస్థను ప్రారంభిస్తారు..ఆ సంస్థలో పలు దేశాలకు,ప్రాంతాలకూ,భాషలకూ,వృత్తులకూ సంబంధించి పలు విభాగాలను తయారు చేసి వాటికి వివిధ దేశాలకు చెందిన కొందరు వ్యక్తుల్ని ప్రతినిధులుగా నియమిస్తారు..ఈ క్రమంలో ఆ సంస్థకు పెద్ద లైబ్రరీ అవసరమని ప్రపంచం నలుమూలల్నుంచీ పుస్తకాలు తెప్పిస్తారు..ఇలా అన్నిటినీ వర్గీకరించుకుంటూ,వ్యవస్థీకరించుకునే క్రమంలో అసలు లక్ష్యం మూలనపడి పుస్తకాలూ,ప్రతులూ,అంతర్గత విభేదాలతో కూడిన ఆర్గనైజేషన్ మాత్రమే మిగులుతుంది..ఇది గ్రహించిన ఆ సంస్థ అధ్యక్షుడు చివర్లో పుస్తకాలన్నిటినీ దగ్గరుండి మరీ తగలబెట్టిస్తాడు..ఎగసిపడే మంటల్లో కాలుతున్న పుస్తకాలను చూసిన తరువాత అందరూ స్వేచ్ఛగా ఆ సంస్థ తాలూకూ భవనం నుండి బయటకి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు..టూకీగా చెప్పాలంటే ఇదే కథ..మానవాళి తమకంటే ముందు పుట్టినదనీ,తమ తరువాత కూడా స్థిరంగా ఉంటుందనీ,మానవాళినీ,మానవత్వాన్నీ వ్యవస్థీకరించడం అసంభవమనీ,అంత పిచ్చిపని మరొకటి లేదనీ వాళ్ళు గ్రహించడం ఈ కథ సారాంశం.

నిశితంగా గమనిస్తే ఈ కథను మనం వివిధ కోణాల్లో చూడచ్చు..నేటి సమాజం కూడా అనేక తరాల వ్యవస్థీకరణల ఫలితం..ఉదాహరణకు మన భారతీయ సమాజాన్ని తీసుకుంటే మనుధర్మ శాస్త్రాల పేరిట వర్ణ వ్యవస్థల్నీ,రాజ్యాంగాన్నీ,సైన్యాల్నీ వ్యవస్థీకరించుకుంటూ పోయి ఈరోజు ఆ వర్గవిభేదాలతో,జాతిమత వైషమ్యాలతో ఒకరిమీదొకరు కత్తులు దూసుకుంటున్నాం..బోర్హెస్ చెప్పిన ఈ కథ ఏ సమాజానికి అన్వయించి చూసుకున్నా సులభంగా ఆ ఫ్రేమ్ లో ఇమిడిపోతుంది..ఇదే కథను నేటి సాహితీ రంగానికి అన్వయించి చూస్తే ఎలా ఉంటుందనే ఒక సరదా ఆలోచన వచ్చింది..టెక్నాలజీ పుణ్యమాని ఒకప్పుడు ప్రత్యేకమైన సమూహాలుగా మసలే సాహితీ సంఘాలు కూడా నేడు సోషల్ మీడియా వీధి వసారాల్లోనో,మరో వెబ్ పత్రికల మండువాల్లోనో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..బుక్ క్లబ్బులూ,బ్లాగులూ,సోషల్ మీడియా పత్రికలూ ఇలా ప్రతీదాన్నీ వ్యవస్థీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం..ఫలితంగా వెలసిన అనేక సమూహాల్లో తన ఉనికిని చాటుకునే దిశగా కళాకారుడు కూడా నచ్చినా నచ్చకపోయినా బిక్కుబిక్కుమంటూ ఏదో ఒక సమూహపు మూలన నక్కి తీరాలి (?) సమాజంలో అంతర్భాగంగా ఉంటూ తన ఉనికిని చాటుకోడానికి కళాకారుడు తన అస్తిత్వాన్నీ,వ్యక్తిత్వాన్నీ పణంగా పెట్టక తప్పే పరిస్థితులు లేవు..ఇదేదో బ్రహ్మ రహస్యమైన విషయం కాదు..ప్రతీ సమూహానికీ కొన్ని నియమనిబంధనలుంటాయి..అందులో ప్రతి వ్యక్తీ  కొన్ని కనిపించని నియమాలకనుగుణంగా వ్యవహరించవలసి వస్తుంది..సింపుల్ గా చెప్పాలంటే If you want to be part of a crowd,you have to play by their rules..ఈ క్రమంలో ఆర్టిస్టుకు తనకు సంబంధం లేనీ,తనకు నచ్చని విషయాలను కూడా ఆమోదించాల్సిరావడం,గట్ ఫీలింగ్ ను ప్రక్కనపెట్టి మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తూ 'సెల్ఫ్ క్యారెక్టర్ అస్సాసినేషన్' చేసుకోవడం తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి..అడిగిన సంస్థలకు రాయననడం తప్పు...ఆదేశించిన పుస్తకాలపై ప్రశంస/విమర్శ రాయకపోతే తప్పు..అసలు సంస్థాగతంగా వ్యవహరించడానికి నిరాకరించడం తప్పు..ఇదంతా ఈ వ్యవస్థీకరణల ఫలితమే..కానీ ఆర్టిస్టుకు ఉండవలసిన ఏకైక లక్షణం/అవసరం 'స్వయంప్రతిపత్తి కలిగి సర్వ స్వతంత్రుడిగా వ్యవహరించడం'...కానీ ఈ వ్యవస్థీకరణల కారణంగా ఆర్టిస్టు ఈస్థటిక్స్ లో ప్రాథమిక అంశాలు కూడా నేర్వకుండానే బేసిక్స్ దగ్గరే ఆగిపోతున్నాడా !! ఆర్ట్ ను institutionalize చెయ్యడం మంచికా ? చెడుకా ? దీనివల్ల ప్రయోజనం ఏమిటి ? కళ అనేది ప్యాషన్ నుండి పుట్టాలి గానీ,డెడ్ లైన్స్ ఆధారంగా పుట్టేదానిలో సృజనాత్మకత పాళ్ళు ఎంత ?? బహుశా బోర్హెస్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నిష్క్రమించారు అనిపించింది.

Monday, September 23, 2019

Fly Already : Stories- Etgar Keret

ఇజ్రాయెల్ సాహిత్యానికి సంబంధించి 2017 మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్న David Grossman 'A Horse Walks into a Bar' తప్ప ఇతరత్రా రచనలేవీ నేను చదవలేదు..కానీ అమోస్ ఓజ్ నీ,ఎట్గర్ కెరెట్ నీ చదవాలని చాలా కాలం నుండీ అనుకుంటూ వాయిదా వేస్తు వచ్చాను..ఈలోగా ఎట్గర్ కెరెట్ తాజా కథల పుస్తకం 'ఫ్లై ఆల్రెడీ' కనిపించింది..ప్రస్తుతం చదువుతున్నవి ప్రక్కన పెట్టి మరీ చదివినందుకు ఈ కథలు మంచి పఠనానుభవాన్ని మిగిల్చాయి..ఇందులో మొత్తం 22 కథల్నీ మరో ప్రముఖ జ్యూయిష్ రచయిత నాథన్ ఇంగ్లాండర్ తో పాటు మరి కొందరు అనువదించారు.
Image Courtesy Google
ఆ మధ్య ఎవరో రచయిత ఓప్రా విన్ఫ్రె చాలా తెలివైనావిడనీ,ఆవిడ రివ్యూలలో తొంభై శాతం స్టోరీ కలెక్షన్స్ ని రివ్యూ చెయ్యరనీ అన్నారు..ఈ పుస్తకం చదివాకా ఆ విషయం  గుర్తొచ్చింది..ఇరవై రెండు ఆణిముత్యాల్లాంటి కథల్లో ఏ ఒక్క కథనొదిలేసినా ఈ పుస్తకానికి రాసే వ్యాసానికి న్యాయం చెయ్యలేననిపించింది..ఇందులో ఒక్కో కథా ఒక్కో అద్భుతం..ఒక కాల్వినో..ఒక బోర్హెస్..ఒక సిగిస్మన్డ్... ఒక కెరెట్....ఒక షార్ట్ స్టోరీ రైటర్ గా ఇంతకంటే ఎట్గర్ కెరెట్ సత్తాను చాటిచెప్పడం నాకు సాధ్యం కాని పని..అందుకే ప్రతిసారి కంటే భిన్నంగా ఇందులో నాకు బాగా నచ్చిన ఒక కథను స్వేచ్ఛానువాదం చేశాను.

ఇందులో ఒక కథ 'The Birthday of a Failed Revolutionary' కి నా స్వేచ్ఛానువాదం :

అనగనగనగా ఒకూళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడట..చాలా ఏళ్ళ క్రితం అతడు ఏదో కనిపెట్టాడో లేక ఎవరో కనిపెట్టిన దాన్ని తస్కరించాడో సరిగ్గా గుర్తులేదు.కానీ ఆ కనుగొన్నది చాలా పెద్ద మొత్తానికి అమ్ముడుకాగా అతడు దాన్ని నీటి మీద,నేల మీద పెట్టుబడులు పెట్టాడు..నేలమీద అతడు చిన్న చిన్న కాంక్రీట్ క్యూబికల్స్ కొని తలపై చూరుకోసం ప్రాకులాడేవారికి అమ్మితే,నీటిని బాటిళ్ళలో నింపి దాహార్తితో ఉన్నవాళ్ళకి అమ్మి దాహం తీర్చాడు..ఈ అమ్మకాలు అయిపోయాక అతడు తన ఇంద్రభవనంలాంటి ఇంటికి తిరిగి వెళ్ళి గడించిన సంపదతో ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు..నిజానికి అతడు తన జీవితంతో ఏం చెయ్యవచ్చని ఆలోచించవచ్చు,ఇది కూడా అంత తక్కువ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు కాదు మరి.. but people with that much money are usually too busy to find time for that kind of thinking..అతడు తన సంపదను రెట్టింపు చేసే మార్గాలను యోచిస్తూ వాటితో పాటు తనను సంతోషపెట్టే వాటిని కూడా సంపాదించుకోవాలనుకుంటాడు..స్వభావరీత్యా సున్నిత మనస్కుడూ,అనుమానం మనిషీ కావడంతో అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవర్నీ నమ్మడు..నిజానికి అతడూహించింది నిజమే..అతడి చుట్టూ స్నేహితులుగా ఉన్నవాళ్ళందరూ అతడు సంపదకు ఆశపడి అతడి చుట్టూ చేరినవాళ్ళే,ఒక్క వ్యక్తి తప్ప..నిజానికి ధనవంతుడు మంచివాడు కాకపోవడం వల్ల ఒంటరికాలేదు..అతడు నిజానికి చాలా మంచివాడూ,ప్రముఖుడూను.

ఒకరోజు ధనవంతుడి సంపాదనకు ఆశపడని ఆ ఒక్క స్నేహితుడూ తన ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటాడు..ఇదిలా ఉండగా ధనవంతుడు తన తెల్లని పాలరాతి నేల మీద పడుకుని ఒంటరితనంతో రోజులు వెళ్ళదీస్తూ ఇలా అనుకుంటాడు “There must be something in the world that I want, that could make me happy. Something another person might have to spend his whole life trying to acquire but that I could buy without any effort.” నాలుగు రోజులు ఇలాగే గడిచాయి..ఒకరోజు ధనవంతుడికి  జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అతడి తల్లి ఫోన్ చేస్తుంది..మతిమరపు మనిషైన ఆవిడకి ఏమీ గుర్తులేకపోయినా అతి కొద్ది సన్నిహితుల వివరాలు మాత్రం గుర్తుంటాయి..తల్లితో మాట్లాడడం వల్ల కలిగిన సంతోషంతో అతడు సంభాషణ ముగించి ఫోన్ పెట్టేలోగా డోర్ బెల్ మోగుతుంది..ఎవరో తెలిసిన వ్యక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పుష్పగుచ్ఛంతో పాటు బర్త్డే కార్డు ఉంటుంది..పంపిన వ్యక్తి మీద ధనవంతుడికి సదభిప్రాయం లేకపోయినప్పటికీ  అతడికి ఆ పూల పరిమళాలు  అమితానందాన్నిస్తాయి..ఆ క్షణంలో అతడిలోని వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది..ఒక్క పుట్టినరోజు ఇంతటి ఆనందానిస్తే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దానిని ఎందుకు జరుపుకోవాలి అనుకుంటాడు..అనుకున్నదే తడవుగా పేపర్ లో పుట్టినరోజులు కొనుక్కుంటానని పెద్ద ప్రకటన ఇస్తాడు..నిజానికి పుట్టినరోజులు కొనడం సాధ్యపడదు కదా,అందుకే అచ్చంగా పుట్టినరోజులు కాకపోయినా ఆ రోజుతో పాటొచ్చే బహుమతులూ,శుభాకాంక్షలూ,పార్టీలూ కొనుగోలు చేద్దామని తలపోస్తాడు..అప్పట్లో ఉన్న ఆర్ధికమాంద్యం వల్లనో,లేక ప్రజలకు తమ పుట్టినరోజులు అంత ప్రాముఖ్యత లేనివిగా అనిపించడం వల్లనో గానీ వారం తిరిగేలోపు అతడి ప్రకటనకు గొప్ప స్పందన వచ్చి అతడి డైరీ అంతా జన్మదినాల తాలూకూ తారీఖులతో నిండిపోతుంది..జన్మదినాలు అమ్మినవాళ్ళు అందరూ నిజాయితీపరులే గానీ ఒక్క వృద్ధుడు మాత్రం అన్నీ ఇవ్వకుండా తనకోసం కొన్ని తడి ముద్దుల్నీ,మనవలు బహుమతిగా ఇచ్చిన ఒక పిచ్చి పెయింటింగ్ నీ రహస్యంగా దాచుకుంటాడు.

ఇక ధనవంతుడికి ప్రతిరోజూ పుట్టినరోజుగా మారిపోతుంది..అపరిచితులైన పిల్లలూ,స్త్రీలూ ఎవరో ఒకరు అతడికి రోజూ ఫోన్ చేసి "హ్యాపీ బర్త్డే టూ యూ" అని పాడుతుంటారు..ఇంటికి రంగురంగుల గిఫ్ట్ రేపర్లు చుట్టిన బహుమతులు ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి..అతడి ఈమెయిలు బాక్సు శుభాకాంక్షల మెసేజీలతో నిండిపోతుంది..ఫిబ్రవరి నెలలో అక్కడక్కడా కొన్ని ఖాళీలు మిగిలిపోయినా అవి కూడా భర్తీ అయిపోతాయని అతడి మనుషులు నమ్మబలుకుతారు..ఇదిలా ఉంటే,ఇదంతా చూస్తూ భరించలేని ఎవరో వ్యక్తి ఒక ప్రముఖ దినపత్రికలో దీన్నొక 'అనైతిక చర్యగా' అభివర్ణించినా అది ధనవంతుడి సంతోషాన్ని కొంచెం కూడా తగ్గించలేకపోయింది,ఎందుకంటే ఆ రోజే అతడు ఒక పద్దెనిమిదేళ్ళ యువతి పుట్టినరోజు జరుపుకున్నాడు..ఆమె స్నేహితురాళ్ళు చెప్పిన శుభాకాంక్షలకు అతడికి కళ్ళ ముందు తన ఉజ్వల భవిష్యత్తు కదలాడింది.

కానీ ఈ సంతోషమంతా మార్చ్ 1 నాటికి అంతమైపోతుంది..నిజానికి ఆరోజు ధనవంతుడు 'భార్యను కోల్పోయి వైధవ్యం బారినపడ్డ ఒక కోపిష్టి' జన్మదినం జరుపుకోవాలి..కానీ ఆ రోజు ఉదయం నుండీ ఒక్క బహుమతిగానీ,శుభాకాంక్షలుగానీ ఏవీ రావు..అయినా ధనవంతుడు ఆశావాదికావడంతో ఆ రోజును ఎలాగైనా సద్వినియోగపరచుకుందామనుకుంటాడు..తననుంచి ఏమీ ఆశించక ఆత్మహత్య చేసుకున్న ఒకే ఒక్క స్నేహితుడి సంవత్సరీకం అదేరోజు కావడంతో స్మశానానికి బయలుదేరతాడు..అక్కడ సంతాపం ప్రకటించడానికి చాలా మంది జనం హాజరవడం చూస్తాడు..వచ్చినవాళ్ళందరూ సమాధిమీద ఎర్రగులాబీలుంచి,ఆ వ్యక్తి  మరణం తమ జీవితంలో ఎలా భర్తీచేయలేని వెలితిగా మిగిలిపోయిందో గుర్తుచేసుకుంటూ బాధపడతారు..ఇదంతా చూసిన ధనవంతుడి మదిలో మరో మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.."మరణానంతరం జనాలు చూపించే ప్రేమ మరణించినవారికి తెలిసే అవకాశం లేదు,కానీ నాకుంది..ఒకవేళ నేను చనిపోయినవాళ్ళ సంవత్సరీకాల్ని కొనుక్కుంటే !! అచ్చంగా వాళ్ళనుండి కాదుగానీ వాళ్ళ వారసుల వద్ద కొనుక్కుంటే ! అప్పుడు ఆ సమాధి మీద ఒక నల్లటి 'వన్ వే గ్లాస్' మీద ఒక మంచం ఏర్పాటు చేసుకుంటే అందరూ నన్నెంత మిస్ అవుతున్నారో నేను వినచ్చు" అనుకుంటాడు..ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉందిగానీ ఈ ఆలోచనను అమలుపరచడానికి మరునాడు ఆ ధనవంతుడు మాత్రం జీవించి లేడు..మరునాడు ఉదయం అతడు మరణించాడు..అతడు ఇటీవలే పండుగలా జరుపుకున్న అనేక సందర్భాల వలెనే అతడి మరణం కూడా అతడిది కాదు,అది వేరొకరి కోసం ఉద్దేశించబడినది..విప్పేసి ఉన్న గిఫ్టు రేపర్ల మధ్య అతడి శవం దొరికింది..ఆ తరువాత తెలిసిన విషయమేంటంటే ఆరోజు అతడు కొనుక్కున్న పుట్టినరోజు ఒక విఫలమైన విప్లకారుడిది,ఆ విప్లవకారుణ్ణి చంపడానికి గిఫ్ట్ రూపంలో వచ్చిన బాక్సు ఒక నిరంకుశ వ్యవస్థ పన్నిన పన్నాగం.

ధనవంతుడి అంత్యక్రియలకు జనం వేలల్లో హాజరయ్యారు..వచ్చిన వాళ్ళందరికీ అతడి సంపద మీదే కన్నున్నప్పటికీ వ్యక్తిగా అతడంటే కూడా ఎంతో అభిమానం..అందుకే వాళ్ళందరూ అతణ్ణి గంటలకొద్దీ శ్లాఘిస్తూ,సంతాప గీతాలు పాడారు..ఇది ఎంతగా మనసుని కదిలించిన విషయమంటే చివరకు ధనవంతుడి  అంత్యక్రియలకు చట్టపరమైన హక్కుల్ని కొనుక్కున్న యువ చైనీస్ బిలియనీర్ కూడా సమాధి అడుగున రహస్యంగా కట్టుకున్న నల్లని క్యూబికల్ లో కూర్చుని ఇదంతా చూస్తూ రెండు కన్నీటి బొట్లు కార్చాడు.

Publishers : Granta Books
Pages        : 224 pages

Tuesday, September 10, 2019

The Unhappiness of Being a Single Man: Essential Stories - Franz Kafka

పుష్కిన్ ప్రెస్ వారు 'The Unhappiness of Being a Single Man: Essential Stories' పేరిట కాఫ్కా కథల్లో ముఖ్యమైన 22 కథల్ని ఎంపికచేసి ప్రచురించారు..వీటిలో కొన్నిటిని కథలనడం కంటే చిన్న చిన్న దృష్టాంతాలు (allegories),parables,fables గా వర్గీకరించడం సమంజసం.
Image Courtesy Google 
వాల్టర్ బెంజమిన్ కాఫ్కా గురించి రాసిన ఒక వ్యాసంలో ఒక కథ చెప్తారు..రష్యా మహారాణి క్యాథెరిన్ కి ప్రేమికుడే కాక ఆమె హయాంలో మంత్రిగా కూడా పని చేసిన Grigory Potemkin తరచూ డిప్రెషన్ బారినపడుతుంటాడు..ఆ సమయంలో అతడు ఎవర్నీ కలవడు,ఎవరూ అతడి గదిలోకి వెళ్ళే ధైర్యం కూడా చెయ్యరు..Potemkin సంతకాలు సేకరించడంలో విఫలమైన ఉన్నతాధికారుల కారణంగా ప్రభుత్వకార్యకలాపాల్లో జాప్యం జరుగుతుంటుంది..ఈ కారణంగా వారు క్యాథెరిన్ ఆగ్రహానికి గురవుతుంటారు..ఈ సమయంలో ఒక చిన్న గుమాస్తా Shuvalkin ఈ బృహత్కార్యాన్ని తన మీద వెయ్యమని అడుగుతాడు..అసలే నిస్సహాయంగా ఉన్న ఉన్నతాధికారులు ఇందులో వచ్చిన నష్టమేమీ లేదు గనుక దానికి సరేనంటారు..Shuvalkin హుషారుగా Potemkin గొళ్ళెం లేని గదిలోకి సరాసరి తలుపులు తోసుకుంటూ వెళ్ళిపోతాడు..భావరహితంగా అతణ్ణి చూస్తున్న Potemkin కి మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే ఇంకులో ముంచిన సిరాను అతడి చేతిలో పెట్టి పేజీలు తిప్పుతూ అవసరమైన సంతకాలు తీసేసుకుంటాడు..విజయగర్వంతో వెలిగిపోతున్న మొహంతో బయటికి వచ్చిన అతడి చేతిలోనుండి ఆ కాగితాలను ఆతృతగా లాక్కున్న ఆఫీసు సిబ్బంది కాగితాలను పరీక్షించగా Potemkin సంతకాలుండవలసిన అన్ని చోట్లా Shuvalkin..Shuvalkin..Shuvalkin అని అతడి పేరు రాసి ఉంటుంది..కాఫ్కా కథ పుట్టకముందు రెండు వందల ఏళ్ళ క్రితం పుట్టిన ఈ కథని మబ్బులా కమ్మేసిన ఎనిగ్మాను 'కాఫ్కా ఎనిగ్మా' గా అభివర్ణిస్తారు బెంజమిన్.

ఆఫీసులు,చీకటి గదులు,దుమ్ము పేరుకుపోయిన రిజిస్టర్లు ఇవన్నీ కాఫ్కా ప్రపంచానికి దారులు..ఈ ఇరుకు గదుల్లో ఇమడలేక అవస్థపడుతూ కూడా కాఫ్కా హీరో ఒక ఆశావహదృక్పథంతో హుషారుగా తన పని ప్రారంభిస్తాడు,కానీ చివరికివచ్చేసరికి మాత్రం చెయ్యాల్సిన పని అదుపు తప్పి చేజారిపోయి వైఫల్యం బారినపడి హతవిధీ అంటూ నీరసంగా కూలబడతాడు..కాఫ్కా కథల్లో ప్రధానంగా కనిపించే అంశం ఇది..ప్రతి మనిషీ జీవితంలో ఏదో దశలో ఇలాంటి ఒక కాఫ్కా కథలో తనను తాను ఒక పాత్రధారిగా చూసుకుంటాడు..కౄరత్వం నిండిన మానవ జీవితంలోని అస్థిరత్వాన్నీ,అబ్సర్డిటీనీ కాఫ్కా కథలు పదేపదే గుర్తు చేస్తుంటాయి..ఆయన కథల్లోని పాత్రలు సామజిక నియమాలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేసినా చివరికి వైఫల్యాల బారినపడుతుంటాయి.

ఏ పుస్తకమైనా చదివాక దాని గురించి నాలుగు మాటలు రాద్దామని కూర్చున్నప్పుడు ప్రేరణగా ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలిపే కేంద్రబిందువు ఒకటి ఉంటుంది..దాన్ని ఆసరాగా చేసుకుని మొదలును అందిపుచ్చుకుని ఒక్కో వాక్యాన్నీ విడిపోకుండా ఒక్కో కథ తాలూకూ పఠనానుభవాన్నీ చిన్న చిన్న ముడులేస్తూ చివరకు అక్షరమాల కట్టడం పూర్తి చేస్తాం..కానీ కాఫ్కా కథల్ని చదివాకా ఎప్పటిలాగే సారాంశం రాద్దామని కూర్చున్న నేను చాలా సేపు మొదలెక్కడో వెతుక్కుంటూనే ఉన్నాను..ఇలా జరగడం చాలా అరుదు..ఒకవేళ కష్టపడి ఆ మొదలు అందిపుచ్చుకున్నా చివరివరకూ దాన్ని తెగిపోకుండా కొనసాగిస్తాననే నమ్మకం కూడా కలగలేదు..ఈ కథలు చదవడం పూర్తి చేశాక అంతఃచేతనలో నిక్షిప్తమైన కథల తాలూకు దృశ్యాలన్నీ అస్పష్టంగా అలికేసినట్లు కనిపించసాగాయి..కథ చదువుతున్నప్పుడు ఎక్కడనించి వచ్చారో తెలీని ఫాంటమ్స్ లా పరిచయమైన వ్యక్తులందరూ పుస్తకం ముగిసేసరికి ఎలా వచ్చారో అలాగే అదృశ్యమైపోయారు..అందుకేనేమో కాఫ్కా పాత్రలను వాల్టర్ బెంజమిన్ భారతీయ పురాణాల్లో గంథర్వులుగా అభివర్ణిస్తారు..గంధర్వులు ఏ ఒక్క చోటుకీ చెందినవారూ కాదు,పరిమితమైన వారూ కాదు..వీరి ఉనికిని నిర్వచించడం సాధ్యపడదు..వారు ఒక ప్రత్యేక ప్రపంచానికి చెందిన వ్యక్తులూ కాదు,అలాగని ఏ లోకానికీ అపరిచితులూ కాదు..గంధర్వులు ఒకలోకం నుండి మరో లోకానికి సంచరించే దూతలు(మెసెంజర్స్)..కాఫ్కా పాత్రలు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి..Kafka tells us that they resemble Barnabas, who is a messenger. They have not yet been completely released from the womb of nature, and that is why they have "settled down on two old women's skirts on the floor in a corner. It was..their ambition..to use up as little space as possible.To that end they kept making various experiments, folding their arms and legs, huddling close together; in the darkness all one could see in their corner was one big ball." It is for them and their kind, the unfinished and the bunglers, that there is hope. అంటారు కాఫ్కా.

కాఫ్కా కథల్లో కనిపించే 'Absurdity of Existence' చదవడం పూర్తి చేసిన చాలాసేపటి వరకూ పాఠకుల్ని వెంటాడుతూనే ఉంటుంది..ఇంగ్లీషు భాషలో 'Kafkaesque' అనే పదాన్ని ఒక 'పీడకల'ను సూచించే అర్ధంలో వాడతారు..మరి పీడకలల్ని ఇష్టపడేవారు బహు అరుదు..ఈ పుస్తకానికి అనువాదకులు Alexander Starritt ముందుమాట రాస్తూ ఒక మాటంటారు,"Kafka's work is respected far more than it is loved" అని..ఎంత నిజం!!!! బోర్హెస్ కు కూడా మొదటిసారి కాఫ్కాను చదివినప్పుడు నచ్చలేదట !!తరువాత రెండోసారి చదివినప్పుడు ఆ అభిప్రాయం మారిందంటారు..బోర్హెస్ అభిప్రాయం ప్రకారం కాఫ్కా రచనను దగ్గరకి చేర్చే దారులు ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉంటాయి..కాఫ్కా జీవితంలో తండ్రి క్రూరత్వం,ప్రేమ వైఫల్యం,ఇన్సూరెన్సు కంపెనీ ఉద్యోగంలో అసంతృప్తి లాంటివి ఈ కథల్లో ప్రస్ఫుటంగా గోచరమవుతాయి..ఈ కథల్లోని పాత్రలు ఎల్లప్పుడూ అస్తిత్వ లేమితో బాధపడుతూ తమ మూలాలను వెతుక్కునే పనిలో ఉంటాయి..అస్తిత్వ భారాన్ని మోయలేని నిస్సహాయతలో 'The Married Couple' అనే కథలో ఒక చిరుద్యోగి "Oh, what futile paths we’re compelled to tread as we go about our business, and how much further we have to carry our burdens." అని వాపోతాడు.

A Message from the Emperor : అనే కథలో చక్రవర్తి ముఖ్యమైనవాళ్ళందర్నీ కాదని ఒక అతి సామాన్యుడికి ఒక ముఖ్యమైన సందేశం చెప్పడానికి అంతఃపురానికి పిలుస్తాడు..ఆ సందేశం అందుకున్న సామాన్యుడు ఆ భవంతిలో గుమిగూడిన ప్రజలను దాటి బయటకు వచ్చేదారిలేక ఆ కోట నుండి బయటపడే దారి వెతుక్కుంటూ పద్మవ్యూహంలో చిక్కుకుపోతాడు.

A Short Fable : ఇందులో ఒక ఎలుక ""ఒకప్పుడు విశాలమైన ప్రపంచం భయం గొలిపేది,కానీ అది రాన్రానూ ఇరుకుగా తయారవుతోంది..సుదూరంగా కుడి ఎడమలవైపు గోడలు కనిపిస్తున్న దిశగా పరిగెత్తితే,అవి రెండూ కలిసే చోట ఒక మూలలో చిట్టచివరి గదిలో నాకోసమొక ఉచ్చు తయారుగా ఉంది" అనుకుంటుంది..
"అలాంటప్పుడు నువ్వుచెయ్యాల్సిందల్లా వ్యతిరేక దిక్కుకి పరిగెత్తడమే" అని అంటూ పిల్లి ఉన్నపళంగా ఆ ఎలుకను తినేస్తుంది..ఈ పిట్టకథ  'It's a lovely little trap,Either way you're screwed' అనే జీవిత సత్యాన్ని చాటిచెప్తుంది.

'ది జడ్జిమెంట్' కథను ఇందులో 'The Verdict' గా పేరు మార్చారు..ఈ కథలో కాఫ్కా మీద తండ్రి నియంతృత్వపు ప్రభావం,కాఫ్కా కఠినమైన బాల్యపు ఛాయలు కనిపిస్తాయి..ఇందులో ప్రొటొగోనిస్ట్ జార్జ్,అతడి తండ్రి,జార్జ్ కాబోయే భార్య ఫ్రీడా లాంటి పాత్రలు వాస్తవంలో కాఫ్కా,నియంత లాంటి ఆయన తండ్రీ,కాఫ్కా ప్రియురాలు ఫెలిస్ లను తలపిస్తాయి..ఈ కథను కాఫ్కా ఫెలిస్ కు అంకితమివ్వడం గమనార్హం..ఈ కథల్లో దేనికవే ప్రత్యేకమైనవి అయినా నాకు అన్నిటికంటే బాగా నచ్చినవి ఈ మూడు కథలూ : 'Before The law','A First Heartache','A Hunger Artist'..ఈ మూడూ 'కాఫ్కా జీనియస్' కి మంచి ఉదాహరణలు..ఇలా చెప్పుకుంటూపోతే ఇందులో ప్రతి కథా జీవితంలోని అస్థిరత్వాన్నీ,అనిశ్చితినీ ప్రతిబింబించేదే..కాఫ్కా ప్రత్యేకం దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన కథలు మాత్రం 'హ్యూమన్ కండిషన్' కీ మానవ జీవితంలోని అనివార్యమైన స్థితికీ (Inevitability) మధ్య సంఘర్షణపై దృష్టిసారిస్తాయి..అందుకే కాఫ్కా కథల్లో సర్రియలిజం లాంటి అంశాలు కూడా ఒక సాధారణ పాఠకుడు సైతం తనను తాను సులభంగా ఐడెంటిఫై చేసుకునే విధంగా మానవీయ పరిధులకు లోబడి వుంటాయి..బహుశా ఇక్కడే బోర్హెస్ శైలికీ కీ కాఫ్కా శైలికీ మధ్య వైరుధ్యాలు కనిపిస్తాయి..బోర్హెస్ కథల్లో కాఫ్కా ఛాయలు అనేకం తొంగిచూసినా ఆయన కథల విస్తృతీ,పరిధీ  అపరిమితమైనవి,అనంతమైనవీను..బహుశా ఈ కారణం చేతనే అవి సగటు పాఠకుడికి అందని ద్రాక్షలా అనిపిస్తాయి..కాఫ్కా ఒక సాధారణ పాఠకుణ్ణి ఆకట్టుకున్నంతగా బోర్హెస్ ఆకట్టుకోలేరు అనిపిస్తుంది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
But they’re detached questions, of the kind very grand people ask,

It’s my father’s house, but each brick lies cold against the next, as if occupied with its own affairs, which I’ve partly forgotten, partly never knew.

Saturday, September 7, 2019

Mr Salary - Sally Rooney

ఫాబర్ పబ్లిషింగ్ సంస్థ 19 వ వార్షికోత్సవం సందర్భంగా 'ఫాబర్ స్టోరీస్' పేరిట తమ రచయితలు రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి కథలను ఎంపిక చేసి చిన్న చిన్న పుస్తకాల రూపంలో ప్రచురించింది..నవలికకూ,కథకూ మధ్యస్థంగా తక్కువ నిడివి కలిగి ఉండే ఈ కథల్ని చదవడం చాలా తేలిక..ఈ కాలంలో పఠనాభిరుచి ఉన్నా కూడా చదవడానికి తగిన సమయం వెచ్చించలేని సాహితీప్రియుల కోసం పెద్ద పెద్ద నవలలు చదవడానికి తీరిక లేని సమయాల్లో చదువుకోడానికి వీలుగా ఏర్చి కూర్చిన కథలివి.
Image Courtesy Google
ఈ మధ్య Sally Rooney "Normal People" గురించి పత్రికల్లో జరుగుతున్న హంగామా చూసి ఆ పుస్తకం చదువుదామని ప్రయత్నించి పట్టుమని పది పేజీలు కూడా చదవలేకపోయాను..ఆవిడ శైలి నాకు రుచించలేదు..ఒకవేళ నేనేమన్నా మిస్ అవుతున్నానా అనుకునేలోగా ఈ ఫాబెర్ స్టోరీస్ సిరీస్ లో భాగంగా ప్రచురించిన శాలీ రూనీ కథ "మిస్టర్ శాలరీ" కనిపించింది..కథ పూర్తి చేశాక ఫాబెర్ వారికి నా విలువైన సమయం వృథాపోనివ్వనందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను..ఆ మధ్య Ottessa Moshfegh రచన "My year of rest and relaxation" అనే సుమారు మూడొందల పేజీల 'నాన్స్టాప్ నాన్సెన్స్' ఓపిగ్గా చదివి నా సహనానికి నేనే భుజం తట్టుకున్నాను..Moshfegh తరహాలో అదే కోవకి చెందిన మరో రచయిత్రి ఈ శాలీ రూనీ..శైలి విషయంలో వీళ్ళిద్దరూ అచ్చంగా అక్క చెల్లెళ్ళే..వీళ్ళిద్దరి శైలిలో చాలా సారూప్యతలున్నాయి..వీళ్ళిద్దరూ సారహీనమైన కథావస్తువును పట్టుకుని కథనాన్ని మాత్రం సారవంతంగా రక్తికట్టిస్తారు..చెప్పే విషయం గొప్పది కాకపోయినా వీరిద్దరూ కథ చెప్పే విధానం మాత్రం అద్భుతంగా ఉంటుంది..వీరిద్దరికీ భాషపై మంచి పట్టుంది కానీ వీరి కథల్లో హేతువాదం,తార్కికత వంటి పరిణితి చెందిన అంశాలు మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు..అయినా అందరూ కథల్ని హేతువాదం,తర్కం కోసం మాత్రమే చదవరు కదా ! అందుకే వీళ్ళ రచనల్ని పూర్తిగా తీసిపారెయ్యడానికి వీల్లేదు..ఎందుకంటే ఒక్కోసారి భావానికి పదీ భాషాసౌందర్యానికి తొంభై మార్కులూ ఇస్తూ కూడా మనం కథలు చదువుతాం మరి..త్రాసులో వేసినప్పుడు ఈ రెండు అంశాలూ సమపాళ్ళలో తూగినప్పుడు పుట్టే కథ నిస్సందేహంగా ఒక మంచి కథ అవుతుంది,కానీ ఇప్పుడది అప్రస్తుతం.

ఈ ఇద్దరి శైలిలో కనిపించే మరో సారూప్యత వీరి కథల్లో కనిపించే నిరాశావాదం..ఇరవయ్యేళ్ళ వయసు యువతుల్లో కూడా గూడుకట్టుకున్న నిరాశానిస్పృహల్నీ,గమ్యం తెలీకుండా గాలివాటుకి కొట్టుకుపోయే తత్వాన్నీ వీళ్ళు అద్భుతంగా చిత్రిస్తారు..It was in my nature to absorb large volumes of information during times of distress, like I could master the distress through intellectual dominance అంటుంది ఈ కథలో Sukie అనే అమ్మాయి..బహుశా ఈ సమకాలీన రచయిత్రుల కథలు ఆధునిక యువత మనస్థితికి అద్దంపడుతున్నాయేమోననిపిస్తుంది..ఈ కథలో సూకీ కాన్సర్ వైద్యం జరుగుతున్న తండ్రి ఫ్రాంక్ ను కలవడానికి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వస్తుంది..తల్లి మరణానంతరం సూకీకి 19 ఏళ్ళ వయసులో చదువుకునే నిమిత్తం బంధువు నేథన్ (Nathan-34) తో కలిసి అతని ఫ్లాట్ లో కొంతకాలం జీవిస్తుంది..ఇద్దరి మధ్యనా ఉన్న వయోభేదం,బంధుత్వం వారిద్దరి మధ్యా చిగురించిన ఒక అనిర్వచనీయమైన బంధానికి అడ్డంకి కావు..ఇద్దరి మధ్యా ఏ శారీరక సంబంధం లేకపోయినా We were predictable to each other, like two halves of the same brain అంటూ ఒక సందర్భంలో తమ సంబంధాన్ని నిర్వచిస్తుంది సూకీ..నేథన్,సూకీ ల మధ్యనున్న 'ఎమోషన్' ని చివరివరకూ పట్టుసడలనివ్వరు రూనీ..ఒక వ్యక్తిగా,ఒక సోషల్ ఆనిమల్ గా మనిషి అంతరంగానికీ,సామజికపరమైన కట్టుబాట్లకీ మధ్య జరిగే ఘర్షణ ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది..యుక్తవయసులో కళ్ళాల్లేని గుఱ్ఱంలాంటి మనసుకీ,పరిణితి చెందిన వయసులో జనించే వివేచనా,విచక్షణలకీ మధ్య జరిగే నిరంతర సంఘర్షణ ఈ కథలో సూకీ,నేథన్ ఇద్దరు పాత్రల ద్వారా వర్ణించే ప్రయత్నం చేశారు రూనీ..మరి వారిద్దరి సంబంధం చివరికే మలుపు తీసుకుందనేది మిగతా కథ.. I had read that infant animals formed attachments to inappropriate things sometimes, like falcons falling in love with their human breeders, or pandas with zookeepers, things like that.అని సూకీ అంటున్నప్పుడు ఎందుకో లమ్హే సినిమాలో శ్రీదేవి కళ్ళముందు మెదిలింది.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

Death was, of course, the most ordinary thing that could happen, at some level I knew that. Still, I had stood there waiting to see the body in the river, ignoring the real living bodies all around me, as if death was more of a miracle than life was. I was a cold customer. It was too cold to think of things all the way through.

Friday, September 6, 2019

Three Types of Solitude - Brian Aldiss

వాస్తవ జీవితంలో సవాలక్ష డిస్ట్రాక్షన్స్ మధ్య ఈ ఫాబర్ సిరీస్ స్టోరీస్ చదువును గాడితప్పకుండా ఒక ట్రాక్ మీద నడిపిస్తున్నాయి..వీటి పుణ్యమా అని 'రీడింగ్ బ్లాక్' నుండి బయటపడ్డాను..సైన్స్ ఫిక్షన్ నవలలకూ,కథలకూ ఖ్యాతి గడించిన బ్రిటన్ రచయిత బ్రియాన్ ఆల్డిస్ రాసిన మూడు కథల్ని ఫాబర్ 90 వ పుట్టినరోజు సందర్భంగా ఫాబర్ ప్రచురణ సంస్థ 'Three types of solitude' పేరుతో ప్రచురించారు..ఈ రచయిత పేరు ఉర్సులా లెగైన్ ప్రస్తావనలో తొలిసారి విన్నాను..ఒకప్పుడు బ్రియాన్ ఆల్డిస్ సంపాదకునిగా ఒక్క స్త్రీ రచయిత కూడా లేకుండా ప్రచురించిన ఒక సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీకి స్తుతివాక్యం రాయమని సంబంధిత ప్రచురణ  సంస్థవారు ఉర్సులాను కోరారట..అసలే ఈ వివక్షపై ఆగ్రహంతో ఉన్న ఆవిడ ఆ విషయాన్ని కుండబద్దలుకొడుతూ "Gentlemen I just don't belong here" అంటూ ఒక ఉత్తరం రాసి వారి మొహాన కొట్టారట..ఆనాటికే సైన్స్ ఫిక్షన్ గ్రాండ్మాస్టర్ గా ఖ్యాతి గడించిన బ్రియాన్ ఆల్డిస్ తప్పిదానికి అది సరైన జవాబేననిపించింది..కానీ ఇటువంటి 'ప్రీ కన్సీవ్డ్ నోషన్స్' అన్నీ ప్రక్కన పెట్టి ఈయన్ని చదివితే ఆల్డిస్ రచనలు అన్ని వాదాలకూ అతీతమైనవిగా కనిపించాయి.
Image Courtesy Google
ఇక కథల విషయానికొస్తే ఇందులో మొత్తం మూడు కథలున్నాయి..మొదటి కథ
'Happiness In Reverse' లో జడ్జి Beauregard Peach ఒంటరితనంతో బాధపడుతూ,తనను వదిలి కూతుర్ని వెంటతీసుకుని వెళ్ళిపోయిన భార్యకి Gertrude కి ఉత్తరం రాస్తాడు..ఆ ఉత్తరంలో తన కోర్టులో విచారణకు వచ్చిన ఒక కేసు గురించి ఆమెకు వివరిస్తుంటాడు..ఆమెను ఎలా అయినా తన దగ్గరకు తిరిగి రప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆ కేసు రూపేణా ఉత్తరంలో ఒక కల్పిత కథనల్లుతాడు..ఆ కథలో ఒక Donald Maudsley అనే యువకుడు భూగర్భశాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత జనారణ్యానికి దూరంగా దక్షిణమెరికాలోని కారడవుల్లోకి వెళ్ళిపోతాడు..మనుష్య సంచారంలేని ఆ అడవిలో ఒంటరితనం భరించలేక అతడొక చెట్టు కొయ్యబొమ్మను తయారుచేసి దానిని మనిషిగా భావిస్తూ దానితో సంభాషిస్తూ ఉంటాడు..ఇద్దరికీ ఇష్టమైన 'మొరాలిటీ' అనే అంశం మీద తరచూ చర్చలు జరుగుతుంటాయి..ఒక సందర్భంలో ఆ కొయ్యబొమ్మ దుఖ్ఖముగా ఉన్న మాడ్స్లే ని చూసి "మీ మనుషుల్లో ఈ దుఃఖానికి కారణహేతువు ఏంటని" ప్రశ్నిస్తుంది..అప్పుడు మాడ్స్లే "ఈ దుఖ్ఖమనేది సంతోషానికి వ్యతిరేకపదం,దీనినుండి మానవజాతికి విముక్తి లేదు" అంటాడు..దానికి కొయ్యబొమ్మ  ‘I’m only your echo,when all’s said and done' అనడంతో మాడ్స్లే ఆలోచనలో పడతాడు..అతడికి బహుశా జీవితమంతా తన ప్రతిధ్వనినే వింటున్నాడని అర్ధమవుతుంది...."and that his morality, on which he had once prided himself, was merely a refusal to permit other people into his life." అని గ్రహించి ఇంటికి తిరుగుముఖం పడతాడు మాడ్స్లే..కానీ తిరిగొచ్చిన మాడ్స్లే మీద చట్టపరమైన కేసు నమోదవుతుంది..అతడి నిర్లక్ష్యం కారణంగా అడవంతా కొయ్యబొమ్మల జనాభా పెరిగిపోయి అడవులన్నీ నాశనమైపోతుంటాయి..మానవ సమాజంలో చాపక్రింద నీరులా పెరిగిపోతున్న ఒంటరితనాన్ని సూచించడానికి కొయ్యబొమ్మల్ని మెటాఫోర్ గా వాడతారు రచయిత..జడ్జ్ భార్యకి రాస్తున్న ఉత్తరంలో ఈ కథకి ముగింపునిస్తూ "Of course I feel lonely without you, otherwise I would not waste my time inventing fables." అంటూ భార్యను ఆక్స్ఫర్డ్ కి తిరిగిరమ్మని ప్రాధేయపడతాడు..ఈ కథ మరుగున పడుతున్న మానవసంబంధాలు ఆవశ్యకతను,అనేక సందర్భాల్లో మోరల్ జడ్జిమెంట్స్ చేసే హానినీ గుర్తుచేస్తుంది.

రెండో కథ A Single-Minded Artist లో కళ అంటే ఇతరుల ముందు ప్రదర్శనకు పెట్టే అంశం కాదని ఋజువుచేస్తూ ఒక ఆర్టిస్టు జీవితాన్ని ఉదహరిస్తారు..కళను ఆత్మసాక్షాత్కారానికి సాధనంగా మాత్రమే చూడాలని సున్నితంగా గుర్తు చేస్తుందీ కథ..మూడు కథల్లో నాకు బాగా నచ్చిన కథ ఇది..ఇక మూడో కథ Talking Cubes సివిల్ వార్ నేపథ్యంలో కూర్చిన ఈ కథలో యుద్ధానికి పూర్వం ఇద్దరు ప్రేమికులు వైరి పక్షాల్లో చెరో దేశానికీ చెందినవారవడంతో యుద్ధం ముగిశాక విడిపోతారు..యుద్ధానంతరం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ కలుసుకున్నప్పుడు వారిరువురూ ఒక జత 'టాకింగ్ క్యూబ్స్' ద్వారా తమ మనసులోని మాటలను ఒకరికొకరు చెప్పుకుంటారు..సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ అంటూ ఏదీ లేని అతి మామూలు ప్రేమ కథను ఈ పుస్తకంలో చేర్చడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కాలేదు..బహుశా ఈ పుస్తకం టైటిల్ ను జస్టిఫై చెయ్యడానికి ఈ కథను కలిపి ఉండవచ్చనిపించింది..ఈ టైటిల్ లో చెప్పినట్లు మూడు రకాల ఏకాంతాలను ఈ మూడు కథలూ ప్రతిబింబిస్తాయి..కానీ ఈ కథల్లో ఏకాంతానికి పర్యాయపదంలా ఒంటరితనం కూడా నర్మగర్భంగా ధ్వనిస్తుంది..ఈ ఏకాంతానికి మొదటి కథలో నైతికతనూ,రెండో కథలో కళ యొక్క ప్రయోజనాన్నీ కారణంగా చూపిస్తే మూడో కథలో వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఇద్దరు ప్రేమికుల వియోగాన్ని కారణంగా చూపెడతారు..ఆల్డిస్ కథల్ని భావప్రధానంగా గాకుండా శైలి ప్రధానంగా చదివితే ఎక్కువ ఆకట్టుకుంటాయి..ఆయన కథల్ని క్రాఫ్టింగ్ కోసం చదవాలి,అదే వీటిలో ప్రధానాకర్షణ.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
When he had produced his hundredth canvas, she kissed him tenderly, suggesting he gave up. ‘You’ll never be a success…’
 But Arthur Scunnersman was just beginning to enjoy himself.

As I made my way downstairs - the lifts were not working - I thought, the war is
over now. Like my youth.

I had not stayed for the coffee to arrive. Sushia remained in her room with  the
old cubes, old words, old emotions.