9. Scylla and Charybdis :
![]() |
Image Courtesy Google |
ఆనాటి డబ్లిన్ సాహిత్య ప్రపంచానికి కేంద్రమైన 'నేషనల్ లైబ్రరీ'లో జరిగే సాహితీ గోష్టిలో షేక్స్పియర్ 'హేమ్లెట్' తో బాటు ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చకు వస్తుంది. 'హేమ్లెట్' పాత్ర కాల్పనికమా, వాస్తవమా? అసలు హేమ్లెట్ ఎవరు?- ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాచీన తర్కం ప్రకారం, షేక్స్పియర్ తననే 'హేమ్లెట్' పాత్రగా సృష్టించుకున్నారనే కొందరి వాదనను స్టీఫెన్ వ్యతిరేకిస్తాడు. ఈ చర్చలో షేక్స్పియర్, ఆయన భార్య ఆన్ హాథవే వైవాహిక జీవనం గురించి 'జాయిస్ మార్కు పదాల్లో' దొర్లే హాస్యం, వ్యంగ్యం వచనాన్ని ఆసక్తికరంగా చదివిస్తాయి. మరోవైపు బ్లూమ్ నేషనల్ మ్యూజియంలో గ్రీకు శిల్పాలను చూస్తూ ఉంటాడు. అతడి అభిరుచిని చూసి మల్లిగన్ అతణ్ణి "గ్రీకర్ దాన్ ది గ్రీక్స్" అని వేళాకోళం చేస్తాడు. ఇక ఈ అధ్యాయంలో మరో ముఖ్యమైన గమనింపు-- జాయిస్ శైలి గురించి ఒక వివరం స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రింది వాక్యాలు చూడండి-- రెండు, మూడు పదాలను కలిపి ఒకే పదంగా రాయడం చూస్తే జాయిస్ రచనా శైలిలో వాక్య నిర్మాణం శబ్దప్రధానంగా ఉంటుందని మన గమనింపులోకొస్తుంది.
—He’s a cultured allroundman, Bloom is, he said seriously. He’s not one of your common or garden… you know… There’s a touch of the artist about old Bloom.
Haines opened his newbought book.
—I’m sorry, he said. Shakespeare is the happy huntingground of all minds that have lost their balance.
'ఒడిస్సీ' 12వ పుస్తకంలో కిర్కె అతనికి ఇథాకాకు చేరుకోవడానికి ఒక మార్గం సూచిస్తుంది. సముద్ర ప్రయాణంలో రెండు భూభాగాల మధ్య ఒకవైపు రాళ్ళతో కూడిన ద్వీపంలా ఉండే ప్రాంతం, 'సిల్లా' అనే ఆరు తలల రాక్షసి నివాసమైతే మరోవైపున ఉండేది సుడిగుండాన్ని తలపించే చారిబ్డిస్ అనే రాక్షసి నివసించే ప్రాంతం. చారిబ్డిస్ సముద్ర ప్రయాణికులను తన సుడిగుండంలోకి లాక్కుని చంపేస్తుంది. ఒడిస్సియస్ ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒడిస్సియస్ ఓడ చారిబ్డిస్ సుడిగుండాన్ని సులభంగానే తప్పించుకున్నప్పటికీ, సిల్లా నోటికి ఆరుగురు అనుచరులు బలవుతారు. ఒడిస్సియస్ మిగిలిన సహచరులతో బాటు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడతాడు.
సోక్రటీస్ వ్యక్తిగత జీవితం గురించిన చర్చలో ఎన్ని హాస్యోక్తులో!!
John Engliton said shrewdly-----What useful discovery did Socrates learn from Xanthippe?
Dialectic, Stephen answered.
ఈ ఎపిసోడ్లో ప్రాసలతో కూడిన జాయిస్ 'వర్డ్ ప్లే' చదవడానికి భలే సరదాగా ఉంటుంది, ఉదాహరణకు:
If others have their will Ann hath a way. [Ann Hathaway -- Shakespeare's wife]
ఇంకొక వాక్యం:
Between the acres of the rye
These beautiful countryfolk would lie.
దానికి తోడు సంభాషణల మధ్యలో అనేక 'టంగ్ ట్విస్టర్స్' దొర్లుతూ ఉంటాయి. ఉదాహరణకు:
Peter Piper pecked a peck of pick of peck of pickled pepper.
The quaker librarian, quaking, tiptoed in, quake, his mask, quake, with haste, quake, quack.
"దేవుడి తర్వాత ఎక్కువ సృష్టి చేసింది షేక్స్పియరే" అన్న మాటలు చదివి నవ్వుకోకుండా ఉండలేం. [After God Shakespeare has created most]
కళ గురించి కొన్ని అభిప్రాయాలు :
“Art has to reveal to us ideas, formless spiritual essences. The supreme question about a work of art is out of how deep a life does it spring. Paintings of Moreau are paintings of ideas. The deepest poetry of Shelley, the words of Hamlet bring our mind into contact with the eternal wisdom; Plato's world of ideas. All the rest is the speculation of schoolboys for schoolboys.”
"After romantic assumption that artist is greater in the soul than other men and that the greatness of a work of art is in direct proportion to the greatness of the artist's soul."
ఇందులో గుర్తుండిపోయే మరికొన్ని వాక్యాలు :
Mahamahatma-- భారతీయ పురాణేతిహాసాల మీద జాయిస్ పట్టు ఇలాంటి అనేక పదాల్లో కనిపిస్తుంది.
I don't care a button
The artist weave and unweave his image.
The mind, Shelly says , is a fading coal.
Father -daughter: Will he not see reborn in her, with the memory of his own youth added, another image?
When Rutlandbaconsouthamptonshakespeare or another poet of the same name in the comedy of errors wrote Hamlet he was not the father of his own son merely but, being no more a son, he was and felt himself the father of all his race, the father of his own grandfather, the father of his unborn grandson who, by the same token, never was born, for nature, as Mr Magee understands her, abhors perfection.
10. Wandering Rocks :
![]() |
Image Courtesy Google |
జాయిస్ అసలేం చెప్పాలనుకుంటున్నారో అర్థంకాక, కథకు మొదలూ-తుదీ పట్టుకోలేక, పాఠకుడికి కాకులు దూరని కారడివిలో తప్పిపోయినట్లనిపించే చాప్టర్- ‘వాండరింగ్ రాక్స్’. ఇది 11 మినీ ఎపిసోడ్లుగా విభజించబడింది. ఇందులో జరుగుతున్న సంఘటనల్లో ఒకే సమయంలో డబ్లిన్లోని వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతున్న విషయాలను ప్రస్తావిస్తారు. ఇందులో అనేక పాత్రల "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్" మల్టిపుల్ లేయర్స్ లో వచనాన్ని విడదీయలేనంత సంక్లిష్టంగా మార్చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఊరిలో బాగా రద్దీగా ఉన్న బజారులో నడుస్తుంటే ఎవరో తెలిసిన మనిషి కనిపిస్తాడనుకుందాం. అతణ్ణి పలకరించాక, ఇద్దరూ ఏదో పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ మరో చోటికెక్కడికో నడుస్తూ వెళ్తుంటే దారిలో మరో వ్యక్తి కనిపిస్తాడు. మొదటి ఇద్దరూ వీడ్కోలు చెప్పుకున్నాక, ఆ మూడో వ్యక్తి ప్రపంచంలో సంగతులు మొదలవుతాయి. ఎపిసోడ్ అంతా ఇదే విషయం రిపీటెడ్ గా అనేక వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది.
స్టీఫెన్ తోబుట్టువులు కేటీ, బూడీలు కడుపేదరికంలో తినడానికి తిండి లేక తమ పుస్తకాలను మదుపుకు పెట్టి డబ్బు తెచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమవుతారు. వాళ్ళ పాత్రల ద్వారా డబ్లిన్ దిగువ తరగతి ప్రజల్లో మతం పట్ల విధేయతనూ, నమ్మకాన్నీ ఆకలితో కొనే ప్రయత్నాన్ని చూస్తాం. "All things are inconstant except the faith in the soul, the service of which is eternal."
హోమర్ 'ఒడిస్సీ'లో కిర్కె ఒడిస్సియస్ కు ఇథాకాకు తిరిగివెళ్ళడానికి సూచించిన రెండు మార్గాల్లో ఒకటి సిల్లా- చారిబ్డిస్ అయితే మరొకటి 'వాండరింగ్ రాక్స్'. సముద్రంలో కదులుతూ ఉండే ఆ రాళ్ళ మధ్య నుండి ఓడలు వెళ్ళడం దాదాపు అసాధ్యమని భావించిన ఒడిస్సియస్ సిల్లా మరియు చారిబ్డిస్ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ఎపిసోడ్లో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" బ్లూమ్, స్టీఫెన్ లను దాటి ఇతర పాత్రలకు కూడా వ్యాపిస్తుంది. వచనంలో మనుషులతో బాటు డబ్లిన్ వీధులన్నీ మన కళ్ళముందు సజీవంగా ప్రాణంపోసుకున్నట్లనిపిస్తుంది. జాయిస్ ప్రతీ వీధి పేరు, దుకాణం పేరూ మొదలుకుని డబ్లిన్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రతీ చిన్న వివరమూ వదలకుండా చెబుతుంటే చదివేవాళ్ళకి డబ్లిన్ మ్యాప్ వెతుక్కుని ప్రక్కన పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. జాయిస్ ఈ ఎపిసోడులో వాడిన టెక్నిక్ ని "లాబిరింథ్" అని పిలుస్తారట. సాహిత్యంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన బోర్హెస్, కాల్వినోలతో బాటు నాకు మన మహాభారతంలో 'పద్మవ్యూహం' కూడా గుర్తొచ్చింది. డబ్లిన్ నగరం ఇక్కడ ఒక లాబిరింథ్‌గా రూపాంతరం చెందుతుంది.
“The reverend Hugh C. Love walked from the old chapterhouse of saint Mary’s abbey past James’s street, past the brewery of Messrs Arthur Guinness, Son and Co., Limited, and past the Irish National Foresters’ Hall, past Lapton’s undertakers.”
కానీ డబ్లిన్ గురించి ప్రాథమికమైన అవగాహన లేని పాఠకులకు ఇందులోని వివరణలు ఏదో గ్రహాంతర వ్యవహారంలా అనిపిస్తాయి. పాఠకుడి మెదడులో జరుగుతున్న సంఘటనలను ఆయా ప్రాంతాలతో సహా దృశ్య రూపంలో చిత్రీకరించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. దానికి తోడు ‘వాండరింగ్ రాక్స్’ ఎపిసోడ్ కొన్ని ముఖ్య పాత్రల చుట్టూ తిరగదు. ఇందులో ఏ పాత్రకాపాత్ర ముఖ్యమనే అనిపిస్తుంది. మొత్తం డబ్లిన్ సమాజం ఇందులో మెయిన్ స్టేజిని తీసుకుంటుంది. చివరకు బ్లూమ్, స్టీఫెన్లు కూడా ఆ బిగ్ పిక్చర్ లో ప్రాముఖ్యత లేని వాళ్ళలాగే కనిపిస్తారు. ఇందులో మరణం తాలూకు సంతాపం ప్రధానంగా కనిపిస్తుంది. మరణించిన పాడీ డిగ్నమ్ కొడుకు మాస్టర్ ప్యాట్రిక్ డిగ్నమ్, తల్లిని కోల్పోయిన స్టీఫెన్-- వీరిద్దరి మానసిక స్థితీ ఒకేలా ఉంటుంది.
11. Sirens :
![]() |
Image Courtesy Google |
హోమర్ 'ఒడిస్సీ' 12 వ పుస్తకంలో ఒడిస్సియస్ ఓడ ప్రయాణంలో ఎదురయ్యే 'సైరెన్స్' అనే ప్రమాదం గురించి కిర్కె ముందే అతణ్ణి హెచ్చరిస్తుంది. 'సైరెన్స్' అనే సముద్ర కన్యల రూపంలో ఉండే రాక్షసులు మధురమైన స్వరాలతో పాటలు పాడుతూ వారిని మైకంలో ముంచేసి తమవైపు ఆకర్షిస్తూ మాయ చేస్తాయి. ఆ మాయకు లొంగి వీళ్ళు గనుక ఆ ద్వీపం వైపు వెళ్తే ఇక అంతే సంగతులు. మృత్యుమార్గంలోకి వెళ్ళినట్లే. ఒడిస్సియస్ తనను ఓడ స్తంభానికి కట్టెయ్యమని ఆదేశించి, తన అనుచరుల్ని 'సైరెన్స్' శబ్దాలు వినబడకుండా మైనంతో చెవులు మూసుకోమంటాడు. ఆవిధంగా అందరూ సైరెన్స్ బారిన పడకుండా సురక్షితంగా తప్పించుకుంటారు. జాయిస్ బ్లూ ప్రింట్ గిల్బర్ట్ స్కీమా ప్రకారం 'సైరెన్స్' బార్ లో పనిచేసే మెయిడ్స్ అయితే, వారి ద్వీపాన్ని స్టీఫెన్ మద్యం సేవించడానికి వెళ్ళిన 'ఆర్మాండ్ బార్' గా అనుకోవచ్చు.
బ్లూమ్ సాయంత్రం నాలుగవుతోందని అనుకుంటూ ఒక నది ఒడ్డున నడుస్తూ ఉంటాడు. నిజానికి నాలుగ్గంటలకి బ్లూమ్ భార్య మోలీ తన కాన్సర్ట్ మేనేజర్ [లవ్ ఎఫైర్] బ్లేజెస్ బోయ్లన్ ని కలవాల్సి ఉంది. బ్లూమ్ మధ్యాహ్నం భోజనం చెయ్యడం మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి ఏదైనా మంచి హోటల్ కోసం వెతుకుతూ, ఉదయం అందిన మార్తా ఉత్తరానికి జవాబు కూడా రాయాలని మనసులో అనుకుంటాడు. మరోవైపు ఆర్మండ్ హోటల్ బార్ లో స్టీఫెన్ కూర్చుని తాగుతుంటాడు. అదే సమయంలో ఒక ఎస్సెక్స్ బ్రిడ్జ్ పై కారులో బ్లేజెస్ బోయ్లన్ ని చూసిన బ్లూమ్ కు అతణ్ణి అనుసరించాలనే బుద్ధిపుడుతుంది. బ్లూమ్ బోయ్లన్ ను అనుసరించే క్రమంలో రిచీ గౌల్డింగ్ ను కలుస్తాడు. ఆకలిగా ఉండడంతో ఇద్దరూ ఆర్మండ్ బార్లో తినాలని నిర్ణయించుకుంటారు. అదే హోటల్లో బోయ్లన్ కు 'బార్ మెయిడ్' మిస్ డౌస్ మద్యం ఇస్తూ "సోన్నర్ లా క్లోచ్" అనే ట్రిక్ ను ప్రదర్శిస్తుంది. ఇక్కడ మిస్ లిడియా డౌస్, మిస్ మినా కెనెడీ అనే ఆర్మండ్ హోటల్ బార్ మెయిడ్స్ ని హోమర్ "ఒడిస్సీ"లో "సైరెన్స్"కు ప్రతీకలుగా చూడవచ్చు. ఆ బార్ లో స్టీఫెన్, బోయ్లన్ లాంటి అందరూ ఇతరుల స్వరాలతో కూడిన సంగీతమనే మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ బ్లూమ్ మాత్రం ఒడిస్సియస్ లాగే ప్రేక్షక పాత్రలో దాన్నుండి విడివడి, బాహ్య ప్రపంచానికి చెందిన శబ్దాలకు దూరంగా తన స్వతఃసిద్ధమైన ఉనికిని కాపాడుకుంటాడు.
'సైరెన్స్' శైలి కొత్తగానూ, వైవిధ్యంగానూ ఉంటుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా ఆడుకునే "మేజిక్ రెయిన్బో స్ప్రింగ్ టాయ్" తెలుసు కదా! ఈ ఎపిసోడ్లో జాయిస్ శైలి నాకు ఆ రెయిన్బో రింగ్స్ ని గుర్తుకు తెచ్చింది. తన అరచేతుల్లో భాషను సప్తవర్ణాల మిశ్రమంగా చేసి, ఆ రింగ్స్ ఎలా తిరుగుతాయో అలా ఇష్టంవచ్చినట్లు వంపులు తిప్పుతూ భాషతో యథేచ్ఛగా ఆడుకుంటారు జాయిస్. కొన్నిచోట్ల అలా తిప్పుతున్నప్పుడు జాయిస్ వచనం పూర్తిగా అదుపుతప్పి వక్రీకరణలోకి వెళ్ళిపోతుంది. దానికి తోడు శబ్దానికి [సైరెన్స్] ఈ చాప్టర్లో ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే "సైరెన్స్" వచనం పేరుకి తగ్గట్టు సంగీత ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ జాయిస్ వచనం పూర్తిగా నేలవిడిచి సాముచేస్తూ వేగం హెచ్చించి గగనతలంలోకి "టేక్ ఆఫ్" తీసుకుంటుంది. సైరెన్స్ ఎపిసోడ్ ని చదవడం కంటే వినడం ప్రధానం. వివిధ స్వరాలను కలిపి "ఫ్యూషన్" చేసినట్లు రాసిన వచనం అర్థంచేసుకోవడం కూడా అంత సులభం అనిపించలేదు. ఈ క్రమంలో సాధారణ పాఠకుడికి కూడా విమర్శకుడికి మల్లే జాయిస్ చెప్పే కథ కంటే క్రాఫ్ట్ పైకి దృష్టి మళ్ళుతుంది.
ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి :
“Bloom looped, unlooped, noded, disnoded.”
“Tingting. All sing. All a ring.”
“A look. Brahms’ words. He doesn’t see. Me. Closes eyes. Ears full, of music.”
12. Cyclops :
![]() |
Image Courtesy Google |
'సైక్లోప్స్' ఎపిసోడ్లో డబ్లిన్ వాసుల సంభాషణల్ని పేరడీ రూపంలో రాస్తారు. నేరేషన్ ఫస్ట్ పర్సన్లో మనకు మునుపు పరిచయం లేని వ్యక్తి "నోమన్" స్వరంలో ఉంటుంది. జాయిస్ "గిల్బర్ట్ స్కీమా"లో "సైక్లోప్స్" నేరేటర్ పేరు కూడా 'నోమన్' అని క్లూ ఇస్తారు. గమనిస్తే హోమర్ "ఒడిస్సీ"లో 'సైక్లోప్స్' కథలో ఒక సందర్భంలో 'నోమన్' అనే పేరును ఒడిస్సియస్ తన పేరుకి ప్రతిగా తాత్కాలికంగా వాడుకుంటాడు. జన్మతః యూదుడైన బ్లూమ్ ని ఐర్లాండ్ వాసులు "నువ్వు ఏ జాతి వాడివి?" అని వేళాకోళం చేస్తారు. దానికి బ్లూమ్, "నేను ఐర్లాండ్ లో పుట్టాను, నేను ఐరిష్" అని సమాధానం చెప్తాడు. మరో సందర్భంలో, వారి వాక్బాణాలకు అతడి స్పందన అతడి నైతికతకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది:
“But it's no use, says he. Force, hatred, history, all that. That's not life for men and women, insult and hatred. And everybody knows that it's the very opposite of that that is really life.”
“Love, says Bloom. I mean the opposite of hatred.”
ఈ ప్యారడీలలో 19వ శతాబ్దపు మరియు ఆంగ్లో-ఐరిష్ పునరుద్ధరణకాలపు ఐరిష్ సాగాలు, పురాణాల హాస్యవ్యంగ్య ప్రదర్శనలూ, ఐరిష్ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యానాలూ ఉంటాయి. యూదుడైన బ్లూమ్ మీద మాటలతో జరిగే దాడిలో పబ్ అంతర్గత రాజకీయాలూ, డబ్లిన్ లో సామజిక వర్గాల మధ్య జరిగే లావాదేవీలూ ఒక్కొక్కటిగా బయటపడతాయి. "సైక్లోప్స్" ఎపిసోడ్ ఐరిష్ సమాజపు జాతీయత ముసుగులో అసహనానికి వివరణాత్మకమైన చిత్రికపడుతుంది. ఈ ఎపిసోడ్ ని జాయిస్ డబ్లిన్ మీద వ్యంగ్యంతో కూడిన విమర్శ రూపంలో రాశారు.
హోమర్ "ఒడిస్సీ" 9వ పుస్తకంలో ఒడిస్సియస్ ఓడ ప్రయాణంలో అతడి అనుచరులతో బాటు "సైక్లోప్స్" అనే ఒంటి కన్ను రాక్షసులుండే చోటుకి చేరుకుంటారు. ఆ రాక్షసులు క్రూరమైన నరమాంస భక్షకులు. ప్రమాదవశాత్తూ ఒడిస్సియస్ తన అనుచరులతో బాటు పొలిఫెమస్ అనే రాక్షసుడి గుహలో చిక్కుకుంటాడు. ఆ రాక్షసుడు నలుగురు అనుచరులను అప్పటికప్పుడే చంపి తినేసి, వెనువెంటనే నిద్రలోకి జారిపోతాడు. ఒడిస్సియస్ ఒక ఉపాయంతో పొలిఫెమస్ ను మద్యంతో మత్తులోకి తీసుకువెళ్తాడు. ఆ మత్తులో రాక్షసుడు ఒడిస్సియస్ పేరు అడిగినప్పుడు, తన పేరు "నోమన్" అని అబద్ధం చెబుతాడు. మద్యం మత్తులో ఉన్న పొలిఫెమస్ ఒంటి కన్నుని కర్రతో పొడిచి అతణ్ణి గుడ్డివాణ్ణి చేస్తాడు.
ఒడిస్సియస్, అతని అనుచరులూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని గొర్రెల మధ్య దాక్కుని ఎలాగైతేనేం గుహ నుండి తప్పించుకుంటారు. బ్రతుకుజీవుడా అని తిరిగి వెళ్ళిపోకుండా, ఒడిస్సియస్ ఓడలోకి చేరిన తర్వాత తరుముకుంటూ ఒడ్డు వరకూ వచ్చిన పొలిఫెమస్ ను కవ్విస్తాడు. దానికి ప్రతిగా అతడు వారిపై రాళ్ళు రువ్వుతాడు. నిజానికి పొలిఫెమస్ తండ్రి సముద్ర దేవుడు "పొసైడన్". ఈ కారణంగానే ఒడిస్సియస్ ఓడ నాశనమై అతని ప్రయాణం భగ్నమవుతుంది. ఈ ఎపిసోడ్ శైలిని "గిగాంటిజం" [gigantism] అంటారట. జాయిస్ 'బ్లూ ప్రింట్' గిల్బర్ట్ స్కీమాలో జాయిస్ ఒడిస్సియస్ తాత్కాలికంగా పెట్టుకున్న పేరు "నోమన్" గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ చాప్టర్ లో జాయిస్ వచనం అసంబద్ధంగా అనిపించే వర్ణనలతో, అనేక ప్యారడీలతో కలగలిసి ఉంటుంది.
13. Nausicaa :
![]() |
Image Courtesy Google |
ఒక సాయంకాలం ముగ్గురు స్నేహితులు- గెర్టీ మాక్‌డౌవెల్, సిస్సీ క్యాఫ్రీ, ఎడీ బోర్డ్మన్ 'శాండీమౌంట్ స్ట్రాండ్ బీచి'లో గడుపుతూ ఉంటారు. [“There was none so fair among them as Gerty MacDowell.”] వారి వెంట సిస్సీ పిల్లలు టామీ, జాకీ (కవలలు), ఎడ్డీ నెలల పసిబిడ్డ కూడా ఉంటారు. టామీ, జాకీలు ఒడ్డున ఇసుక గూళ్ళు కడుతూ ఉంటారు. గెర్టీ వీరికి కొంత దూరంలో ఒంటరిగా కూర్చుని తన ప్రియుడు రెగ్గీ వైలీ గురించిన ఆలోచనల్లో మునిగిపోతుంది. 21 ఏళ్ళ గెర్టీ 'రెగ్గీ వైలీ' తనకు తగినవాడు కాదని అనుకుంటుంది. ఇక్కడ ఆమె, స్త్రీ సహజమైన ఆలోచనలకు ప్రతీకగా కనిపిస్తుంది.
ఈలోగా కవలలు ఆడుకుంటూ బంతిని విసిరేస్తే అక్కడే మరోచోట బండరాళ్ళపై కూర్చున్న బ్లూమ్ దాన్ని అందుకుని వారివైపు విసిరేస్తాడు. గెర్టీ పాదాల వద్దకు చేరిన ఆ బంతిని చూస్తూ అది విసిరిన వ్యక్తిని చూసినప్పుడు బ్లూమ్ మొహం "ఆమె జీవితంలో చూసిన అత్యంత దుక్ఖంతో కూడుకున్న ముఖంగా" కనిపిస్తుంది.
తర్వాత వర్ణించనలవికాని కొన్ని అసభ్యమైన సంఘటనల తర్వాత లియోపోల్డ్ బ్లూమ్ దూరంగా లేచి కుంటుకుంటూ నడుస్తున్న గెర్టీ ని చూసి "అయ్యో పాపం" అనుకుంటాడు. ఇక్కడ బ్లూమ్, గెర్టీ ల ఆలోచనలు స్త్రీ-పురుష భిన్నత్వాన్ని స్పష్టంగా చూపిస్తాయి. 'నాసికా' చాప్టర్లో గెర్టీ మాక్‌డోవెల్ శృంగారం, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే స్త్రీ సహజమైన స్వరానికీ, లియోపోల్డ్ బ్లూమ్ పురుష సహజమైన భౌతికవాదపు నిర్లిప్తతతో కూడిన స్వరానికీ మధ్య భిన్నతను స్పష్టంగా చూడవచ్చు. ఈ రెండు శైలుల మధ్య వ్యత్యాసం వారి రెండు ప్రపంచాల మధ్య దూరాన్ని సూచిస్తుంది. 'నాసికా'లో గెర్టీ పాత్ర స్త్రీ తన ప్రపంచాన్ని ఎంత రొమాంటిక్ దృష్టికోణం నుంచి చూస్తుందో చూపిస్తుంది. కాల్పనిక ప్రపంచానికి చెందిన ఆమె ఆలోచనలు ఆమెకు ఏవిధంగానూ వాస్తవంలో ఆచరణీయం కాలేవని తెలుస్తుంది. గెర్టీ పాత్ర, ఆ కాలపు స్త్రీల మ్యాగజైన్లలో కనిపించే పాపులర్ లిటరేచర్ నుండి ప్రేరణ పొందిన "కలల ప్రపంచంలో విహరించే 20వ శతాబ్దపు ఆధునిక కథానాయిక" పాత్రకు ప్రతినిధిలా కనిపిస్తుంది. ఆ కాలపు రొమాంటిసిజపు సాహిత్యం ద్వారా ప్రభావితమైన గెర్టీ తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషిగా కనిపిస్తుంది. అదే సమయంలో బ్లూమ్ ఆలోచనలు అతని అనిశ్చితమైన మనస్థితిని, నిర్లిప్తతతో కూడిన ఒంటరితనాన్నీ ప్రతిబింబిస్తాయి.
"యులీసిస్"లో గెర్టీ పాత్ర హోమర్ "ఒడిస్సీ"లో 'నాసికా' పాత్రకు ప్రతీక. నాసికా ఒడిస్సియస్ ను ఆ దేశపు రాజైన తన తండ్రి వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణానికి సహాయం చేస్తుంది. హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ కాలిప్సో ద్వీపాన్ని విడిచిపెట్టిన తర్వాత సముద్ర దేవుడైన పొసైడన్ ఆగ్రహానికి గురై అతడి ఓడ నాశనమవుతుంది. నడిసముద్రంలో పడిపోయిన ఒడిస్సియస్ ఎట్టకేలకు అథీనా సాయంతో ఫైషియన్ల భూమి తీరానికి కొట్టుకుని వస్తాడు. అక్కడ కొన్ని పొదల క్రింద దాక్కుని, అలసిపోయి నిద్రపోతాడు. అంతఃపుర వస్త్రాలను ఉతకడానికి నదికి చేరిన యువరాణి 'నాసికా', ఆమె చెలికత్తెలూ ఒడిస్సియస్ ను చూస్తారు. అథీనా మాయతో యువకుడిగా మారిన ఒడిస్సియస్ ను చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. తనతో పాటు తండ్రి ఆల్సినస్ వద్దకు తీసుకెళ్తుంది. నాసికా తండ్రి, ఆల్సినస్ ఒడిస్సియస్ ను ఆదరించి అతడి ప్రయాణాన్ని కొనసాగించేందుకు సహాయం చేస్తాడు.
14. Oxen of the Sun :
![]() |
Image Courtesy Google |
లియోపోల్డ్ బ్లూమ్ ఆ రాత్రి హోల్స్ స్ట్రీట్‌లోని నేషనల్ మెటర్నిటీ హాస్పిటల్ కి వెళ్తాడు. ప్రసవ వేదనతో ఉన్న మిసెస్ ప్యూర్ఫాయ్ పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. మూడు రోజులుగా పురిటినొప్పులతో ఆమె బాధపడుతోంది తెలిసి సానుభూతి చూపిస్తాడు. అదేచోట మెటర్నిటీ వార్డు బయట కొందరు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల స్త్రీ ప్రసవవేదన పడుతోందన్న స్పృహ వారికుండదు. బ్లూమ్ మెడికల్ స్టూడెంట్ లెనెహన్ తో మిసెస్ ప్యూర్ఫాయ్ కష్టం గురించి మాట్లాడినా మత్తులో జోగుతున్న లెనెహాన్ అదేమీ పట్టనట్లుంటాడు.
హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ అతని అనుచరులతో కలిసి "సిల్లా మరియు చారిబ్డిస్" మార్గం గుండా ప్రయాణించి ట్రినాక్రియా (ప్రస్తుత సిసిలి) చేరుకుంటాడు. అది సూర్యదేవుడు "హెలియోస్" యొక్క స్వస్థలం. కిర్కె సూర్యదేవుని ఆవులకు హాని తలపెడితే ప్రమాదమని ముందే హెచ్చరించిన కారణంగా ఒడిస్సియస్ ఆ ద్వీపంలో అడుగుపెట్టడానికి ఇష్టపడడు. కానీ అప్పటికే అలసిపోయిన అతని అనుచరులు విశ్రాంతి కావాలని కోరగా, ఒడిస్సియస్ అక్కడి గోవులకు హాని తలపెట్టమని వారి దగ్గర మాట తీసుకుంటాడు. కానీ ఒడిస్సియస్ లేని సమయం చూసి, ఆకలికి తట్టుకోలేని అనుచరుల్లో కొందరు గోవుల్ని చంపి తినేస్తారు. తిరిగివచ్చిన ఒడిస్సియస్ పొంచి ఉన్న ప్రమాదం గ్రహించి, వెనువెంటనే అనుచరులతో కలిసి తిరుగుప్రయాణమవుతాడు. కానీ హోలియోస్, అప్పటికే జ్యూస్ కు తన గోవులను ఒడిస్సియస్ మనుషులు వధించిన సంగతి ఫిర్యాదు చెయ్యడంతో ఆగ్రహించిన జ్యూస్ పెనుతుఫాను సృష్టించి ఓడను ధ్వంసం చేస్తాడు. ఆ ప్రమాదంలో ఒడిస్సియస్ తప్ప మిగతా వందమందీ సముద్రంలో మునిగిపోతారు.
ఇక 'యులీసిస్' విషయానికొస్తే, ఈ అధ్యాయాన్ని ఇంగ్లీష్ వచనంలో లాటిన్, ఆంగ్లో సాక్సన్ మూలాలను గుర్తుచేస్తూ, పేరడీల రూపంలో రాశారు. నాకు హోమర్ 'ఒడిస్సీ'కీ, ఈ చాప్టర్ కీ ఒక్కటంటే ఒక్క పోలిక కూడా కనబడలేదు. కానీ జాయిస్ తన మిత్రుడు ఫ్రాంక్ బడ్జెన్‌కు రాసిన ఒక ఉత్తరంలో ఆ ఆసుపత్రిని ఒక గర్భాశయంగా అభివర్ణిస్తూ "Bloom is the spermatozoon, the hospital the womb, the nurse the ovum, Stephen the embryo" అని రాశారట. అది చదివి "ఓహో!" అనుకోవడమే. జాయిస్ దాన్నొక పటంగా కూడా గీయించారట. అది ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రరీలో ఉందంటారు.
‘ఆక్సెన్ ఆఫ్ ది సన్’ 'యులీసిస్'లో ఇది అత్యంత సంక్లిష్టమైన ఎపిసోడ్ అంటారు. ఈ ఎపిసోడ్లో సంభాషణలు అర్థం కావాలంటే పాఠకులకు సాహిత్యం గురించి విస్తృతమైన అవగాహన ఉండి తీరాలి. కొన్ని పేరాగ్రాఫులు అర్థం కావాలంటే కొందరు రచయితల రచనల్ని ఖచ్చితంగా చదివి ఉండాలి, స్థలకాలాదులతో సహా వివిధ చారిత్రక అంశాలపై పట్టు ఉండాలి. ఇవేమీ తెలీని సాధారణ పాఠకులకు ఇదొక కొరకరాని కొయ్యలానూ, బ్రహ్మపదార్థంగానూ మిగిలిపోతుంది. నాకైతే ఇది చదువుతున్నంతసేపూ పెద్దపెద్ద కంకర్రాళ్ళ దారిలో చెప్పుల్లేకుండా నడుస్తున్నట్లుంది. :) :)
15. Circe :
![]() |
Image Courtesy Google |
"ఒడిస్సీ" 10వ భాగంలో లెస్ట్రిగోనియన్లతో జరిగిన యుద్ధం తరువాత ఒడిస్సియస్ అనుచరులు తీరాన్ని వెతుక్కుంటూ కిర్కె ద్వీపానికి చేరతారు. అక్కడ యురిలోకస్ మినహా మిగిలిన వారంతా కిర్కె మాయ వల్ల పందులుగా మారిపోతారు. యురిలోకస్ మాత్రం ఒడిస్సియస్ కు ఈ విషయాన్ని చెప్పడానికి తప్పించుకుంటాడు. విషయం తెలిసిన ఒడిస్సియస్ ఒంటరిగా కిర్కె ఉన్న చోటుకి బయలుదేరతాడు. మార్గమధ్యంలో దేవతల వార్తాహరుడు హర్మిస్ ను కలుస్తాడు. కిర్కె మాయను ఎదుర్కోడానికి హర్మిస్ అతనికి ఒక మంత్రించిన మూలికను ఇస్తాడు. ఒడిస్సియస్ కిర్కె ప్రాంగణానికి చేరుకోగానే ఆమె మంత్రాలు మూలిక శక్తి వలన పనిచెయ్యవు. ఒడిస్సియస్ హెచ్చరికల వలన ఆమె అతడి అనుచరులను మళ్ళీ మనుషులుగా మారుస్తుంది. ఆ తర్వాత కిర్కె వారందరికీ సంవత్సరం పాటు తన ద్వీపంలో అతిథి మర్యాదలతో కూడిన వసతులు ఏర్పాటు చేసి ఒడిస్సియస్ ను పాతాళలోకంలో (హేడ్స్) ఉన్న టైరేసియస్ ను వెళ్ళి కలవమని సలహా ఇస్తుంది.
ఇక "యులీసిస్"లో ఈ చాప్టర్ నైట్‌టౌన్లో 'మబ్బోట్ స్ట్రీట్' అనే చోట జరుగుతుంది. అది డబ్లిన్లోని ఒక వేశ్యావాటిక. మనకు మునుపు శాండీ మౌంట్ స్ట్రాండ్‌లో కనిపించిన సిస్సీ కాఫ్రీ, ఎడ్డీ బోర్డ్మన్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తారు. మద్యం మత్తులో స్టీఫెన్ మరియు లింఛ్ కూడా అక్కడకు చేరతారు. బ్లూమ్ నైట్‌టౌన్‌లో టాల్బాట్ స్ట్రీట్ దగ్గర ఉంటాడు. బ్లూమ్ స్టీఫెన్‌ను చూసే క్రమంలో ఉత్సాహంగా రోడ్డు దాటుతుండగా ఒక వాహనం గుద్ది తాత్కాలిక భ్రమల్లోకి వెళ్ళిపోతాడు. ఈ ఎపిసోడ్లో తరువాత జరిగేదంతా అతడి భ్రమల్లోని కాల్పనిక ప్రపంచానికి చెందిన కథే. ఆ కల్పనల్లో బ్లూమ్ మరణించిన తన తల్లిదండ్రుల్నీ, భార్య మోలీనీ చూస్తాడు. ఈ ఎపిసోడ్ "ఒడిస్సీ"లో 'కిర్కె' చాప్టర్లో కిర్కె ఒడిస్సియస్ అనుచరులనందరినీ పందులుగా మార్చేసిన వైనాన్నీ, ఆమె మాయాజాలంలోపడి మతిభ్రమించి వారి పరిస్థితినీ ప్రతిబింబిస్తుంది. ఆ భ్రమల్లో బ్లూమ్ పురుషత్వంపై కఠిన విమర్శలు ఎదుర్కొంటాడు. అనేక ఊహాజనిత పాత్రల మధ్య ఇందులో ఒక పాత్రకు "విరాగ్" అనే పేరు పెడతారు. నిజానికి అది లియోపోల్డ్ బ్లూమ్ తండ్రి పేరు. [Rudolf Virag (later Rudolph Bloom)]
'కిర్కె' ఎపిసోడ్ శైలి చాలా నాటకీయంగా అనిపిస్తుంది. ఇందులో పాత్రల వస్త్రధారణ గురించి వివరాలు, బిగ్గరగా తెచ్చిపెట్టుకున్నట్లుండే సంభాషణలు చదువుతున్నప్పుడు పాత కాలపు నాటకాలు గుర్తొస్తాయి. ఇందులో జాయిస్ వచనం, ఒకవేళ ఫ్రాయిడ్ కలల్ని సన్నివేశాలుగా చేసి రాస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో స్టీఫెన్, బ్లూమ్ తమలోని అంతర్గత భయాలతో ప్రత్యక్షంగా తలపడతారు. ఇందులో ప్రధాన కథ బ్యాక్ స్టేజి తీసుకోగా ఫాంటసీతో కూడిన జాయిస్ వర్ణనలు వాస్తవానికీ, కల్పనకూ మధ్య రేఖల్ని పూర్తిగా చెరిపేస్తాయి. కలలు మనిషి "సబ్కాన్షియస్ మైండ్"లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలకూ, అనుభవాలకూ ప్రతిరూపాలంటారు. ఈ ఎపిసోడ్ అటువంటి కలల ద్వారా వ్యక్తుల ఆంతరంగిక ప్రపంచాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫ్రాయిడ్ నమూనాలో ప్రతీ పాత్రలోని అంతర్ముఖత్వాన్నీ బయటికి తీసి, వాటిని ఒక రంగస్థల నాటకంగా చూపిస్తారు జాయిస్. ఎటొచ్చీ పాఠకులకు వాస్తవం ఎక్కడ ముగుస్తోందో, ఫాంటసీ ఎక్కడ మొదలవుతుందో కనిపెట్టడం చాలా కష్టం.
16. Eumaeus :
![]() |
Image Courtesy Google |
హోమర్ "ఒడిస్సీ"లో 'Eumaeus' అంటే ఒడిస్సియస్ కు చాలా నమ్మకస్తుడైన పందుల కాపరి పేరు. ఇథాకాకు తిరిగొచ్చిన ఒడిస్సియస్ కు అతడు రహస్యంగా తన ఇంట్లో ఆతిధ్యం ఇస్తాడు. బ్లూమ్ స్టీఫెన్ ను తన ఇంటికి తీసుకెళ్ళి ఆతిధ్యం ఇచ్చే సన్నివేశం దానికి ప్రతీక. స్టీఫెన్ పాండిత్యం పట్ల లోలోపలే ఆరాధనాభావంతో ఉన్న బ్లూమ్ అతణ్ణి గమనిస్తూ ఉంటాడు.
He had a sort of scholarly manner and he sidled along rather dubiously, as if he felt himself not quite fit for the position.
స్టీఫెన్ మాటలు- "A man of genius makes no mistakes. His errors are volitional and are the portals of discovery."
17. Ithaca :
![]() |
Image Courtesy Google |
బ్లూమ్, స్టీఫెన్- ఇద్దరూ ఎక్లెస్ వీధి వైపుకి నడుస్తూ మాటల్లోపడతారు. నైట్‌టౌన్‌లో స్టీఫెన్ కుప్పకూలిపోడానికి సరైన పోషకాహారం లేకపోవడం, మద్యం అధికంగా తాగడం అని బ్లూమ్ అభిప్రాయపడతాడు. బ్లూమ్ తన అభిప్రాయాలు, స్టీఫెన్ అభిప్రాయాలు కొన్ని విషయాల్లో ఒకేలా ఉంటే, మరికొన్ని విషయాల్లో భిన్నంగా ఉన్నాయని గమనిస్తాడు. ఇద్దరూ ఎక్లెస్ వీధి నంబర్ 7 లో ఉన్న బ్లూమ్ ఇంటికి చేరుకున్న తర్వాత గానీ అతడికి ఇంటి తాళం చెవి మర్చిపోయిన సంగతి గుర్తురాదు. తలుపు కొట్టి నిద్రపోతున్న మోలీని లేపడం ఇష్టంలేక ఇంటి బయట రెయిలింగ్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి, వంటగదిలో దీపం వెలిగించి హాల్లో తలుపు తీసి స్టీఫెన్‌ను లోపలికి ఆహ్వానిస్తాడు.
"ఇథాకా"లో జీడీపాకంలా పట్టుకు వదలని అనేక పేరాగ్రాఫులుంటాయి. ప్రతీ పేరాగ్రాఫుకీ ఫుల్స్టాప్ కనీసం రెండు పేజీల తర్వాతే కనబడుతుంది. పోనీ ఆ వివరాలు మన కథకేమన్నా అవసరమా అంటే, అదేమీ ఉండదు. ఆయనకి చెప్పాలనిపించింది, చెప్పారంతే! బ్లూమ్ వంటింట్లో కెటిల్లో నీరు నింపుతున్న సమయంలో బ్లూమ్ కి "నీళ్ళంటే ఇష్టం" [:) :) :)] అన్న ఒకే ఒక్క అంశాన్ని పట్టుకుని "నీరు" ప్రాముఖ్యతను స్తుతిస్తూ జాయిస్ రాసే లిస్టు ఆశ్చర్యంగానూ, హాస్యంగానూ, ఒకింత విరక్తిగానూ అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు ఒకానొక జంధ్యాల సినిమాలో సుత్తి వీరభద్రరావు సన్నివేశం గుర్తురాని తెలుగు పాఠకులుండరు. :) బ్లూమ్ చేతులు కడుక్కుంటూ స్టీఫెన్‌ను కూడా చేతులు కడుక్కోమని పిలిస్తే, అతను నీళ్ళంటే తనకి సరిపడదని తిరస్కరిస్తాడు. ఆనాటి ఐరిష్ సంస్కృతిలో వేళ్ళూనుకున్న 'అపరిశుభ్రత' గురించి ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది.
సాధారణమైన మానవ జీవితాన్ని ఆధ్యాత్మికతకు దగ్గర చేసి, రసాస్వాదనలో సౌందర్యభరితంగా మార్చే 'కళ'కు దూరంగా ఒక సాధారణ అడ్వర్టైజింగ్ ఏజెంట్ గా అతి మామూలు జీవితం గడిపే బ్లూమ్ కి, నిరంతరం "అదర్ వరల్డ్లీ" ఆలోచనలతో కుస్తీ పట్టే ఆర్టిస్టు స్టీఫెన్ తో గడిపిన సమయం చాలా సంతోషాన్నిస్తుంది. కానీ అతడిని మళ్ళీ కలుసుకునే అవకాశం లేదనే విషయం బ్లూమ్ ను విచారంలో ముంచేస్తుంది. స్టీఫెన్ లాంటి లోతైన వ్యక్తితో సంబంధం తన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తూ పరిపూర్ణం చేయగలదని బ్లూమ్ భావిస్తాడు. టీ తాగిన తరువాత స్టీఫెన్ వెళ్ళిపోతాడు. తర్వాత బ్లూమ్ మెల్లగా బెడ్రూమ్ లోకి వెళ్ళి మోలీ కాళ్ళ వైపుకి తలపెట్టుకుని నిద్రపోతాడు. బ్లూమ్ మోలీతో కొత్త జీవితం ప్రారంభిస్తాడా లేదా అదే జీవితాన్ని పునరావృతం చేస్తాడా అనేది పాఠకులకు ఒక ప్రశ్నలా మిగిలిపోతుంది.
హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ ఇథాకాకు తిరిగి వచ్చాకా తన కోటలోకి భిక్షగాడిలా మారువేషంలో ప్రవేశిస్తాడు. ఆంటినస్, యురిమాకస్ [సూటర్స్] మొదలైన వాళ్ళు ఒడిస్సియస్ ఎవరో గ్రహించేలోగానే ఒడిస్సియస్ కొడుకు టెలిమాకస్ తో కలిసి పన్నాగం పన్ని పెద్ద హాల్లో వారందర్నీ ఒకేచోట చేర్చి, ఎటూ వెళ్ళే అవకాశం లేకుండా బంధిస్తారు. ఒడిస్సియస్ తన భార్య పెనెలొపె ను వివాహమాడమని బలవంతపెడుతున్న వాళ్ళందర్నీ అదే హాల్లో హతమారుస్తాడు. తర్వాత ఆ రక్తపాతం జరిగిన తన కోటను పూర్తిగా శుద్ధి చేస్తాడు. [ఇది బ్లూమ్ తన ఇంట్లో ధూపాన్ని వెలిగించి సుద్ధి చేయడాన్ని పోలి ఉంటుంది.] 'యులీసిస్'లో రెండు ప్రధాన పాత్రలు స్టీఫెన్, బ్లూమ్ లు కలుసుకోవడం ఈ చాప్టర్లో ముఖ్యమైన ఘట్టం. ఇది 'ఒడిస్సీ'లో ఒడిస్సియస్ 'ఇథాకా'కు చేరి టెలిమాకస్ ను కలుసుకోవడంలా ఉంటుంది.
ఈ చాప్టర్లో వ్యక్తిగత జీవితం విషయంలో బ్లూమ్ కు తన అంతఃస్సంఘర్షణ నుండి మరికొంత స్పష్టత వస్తుంది. వాస్తవాన్ని అంగీకరిస్తూ మోలీతో కలిసి జీవించే దిశగా అతడి ఆలోచనలు సాగుతాయి.
18. Penelope :
![]() |
Image Courtesy Google |
మరుసటి ఉదయం మోలీని బ్లూమ్ తనకు మంచంలోనే బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వమని కోరతాడు. అలా అడిగాడంటే అతడు ఆ ముందు రోజు బ్లూమ్ నైట్‌టౌన్‌కు వెళ్ళాడనీ, ఎవరితోనో గడిపి వచ్చాడనీ భావిస్తుంది. మోలీకి బ్లూమ్ రహస్యంగా ఉత్తరాలు రాయడం, ఎవరినో కలుసుకోవడం, తన పనిమనిషితో అతడి గత ప్రవర్తన-- ఇవన్నీ తెలుసు. బ్లూమ్ బోయ్లన్ తో తన సంబంధం గురించి తెలిసే తనకు దూరంగా ఉంటున్నాడని కూడా అనుకుంటుంది.
“yes because he never did a thing like that before as ask to get his breakfast in bed with a couple of eggs since the City Arms hotel when he used to be pretending to be laid up with a sick voice doing his highness to make himself interesting to that old faggot Mrs Riordan”
దేవునిపై విశ్వాసం ఉన్న మోలీకి 'ధర్మం' తనకు అనుకూలంగా మలుచుకునే వ్యవహారం మాత్రమే. 33 ఏళ్ళ మోలీ బోయ్లన్‌తో తన వివాహేతర సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రీమాన్స్ జర్నల్ లో బ్లూమ్ చేసే ఉద్యోగంలో వచ్చే జీతం ఆమెకు నచ్చదు. ఆమె ఆలోచనలు జిబ్రాల్టర్ లో గడిచిన తన యవ్వనంలోని తొలిప్రేమ మీదకు మళ్ళుతాయి. తన జీవితంలో కాస్త ఉల్లాసానికి బోయ్లన్ ప్రేమలేఖలు కారణమని భావిస్తుంది.
హోమర్ "ఒడిస్సీ"లో ఒడిస్సియస్ భార్య పెనెలొపే, ఒడిస్సియస్ లేని సమయం చూసి తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వత్తిడి తెచ్చిన వారి నుండి తనను తాను కాపాడుకోడానికి అనేక వ్యూహాలు పన్నుతూ ఉంటుంది. వాటిల్లో ఒకటి: పట్టు జలతారు తెరను నేస్తున్నానని చెప్పి రోజూ దాన్ని అల్లుతూ, రాత్రికి మళ్ళీ అల్లిక మొత్తం విప్పేస్తూ కాలయాపన చేస్తుంది. చివరకు వాళ్ళకి ఆమె చేస్తున్న మోసం తెలిసిపోయినా, ఈ వ్యూహం వల్ల ఓ మూడేళ్ళు వారి నుండి తనను రక్షించుకుంటుంది. "యులీసిస్"లో 'పెనెలొపె' ఎపిసోడ్ అసభ్యకరమైన వర్ణనలు కలిగిన చాప్టర్లలో ఒకటి. హోమర్ "ఒడిస్సీ"లో పెనెలొపె, "యులీసిస్"లో మోలీ బ్లూమ్ వ్యక్తిత్వాలకు భూమ్యాకాశాల వ్యత్యాసం ఉంటుంది. పెనెలొపె భర్తకు విధేయురాలుగా ఉంటూ ప్రేమిస్తే, మోలీ చాలామంది ప్రేమికులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంది. పూర్తిగా మోలీ దృష్టి కోణం నుంచి ఆమె స్వరంలోనే రాసిన ఈ మోనోలాగ్ లో విపరీతమైన వేడి, చీమల దండులాంటి ప్రజలు, సముద్రం, వీధులు-- వీటన్నిటితో కూడిన గిబ్రాల్టార్ ప్రపంచపు దృశ్యాలు మోలీ కళ్ళముందు కదలాడతాయి. మోలీ బ్లూమ్ తనను మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు అంగీకరించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ "and yes I said yes I will Yes.” అనే ఐకానిక్ వాక్యాలతో ఈ నవల ముగింపుకొస్తుంది.
ఇలా కొందరు మనుషుల జీవితంలో ఒక రోజు, అంటే సుమారు 18 గంటలపాటు జరిగే వివిధ సన్నివేశాల, సంభాషణల ఆధారంగా ఈ నవలంతా రాసుకొచ్చారు జాయిస్. ఈ కథ రాసిన 1904 సమయంలో ఐర్లాండ్ బ్రిటిష్ రాజ్యంలో భాగంగా ఉండేది. తన నవలకు గ్రీకు గాథ 'ఒడిస్సీ'ని నేపథ్యంగా తీసుకుని, 18 భాగాలకూ ఒడిస్సీ చాప్టర్ల పేర్లు పెట్టినప్పటికీ నిజానికి ఈ నవలలో ఆ పాత్రలు ఎక్కడా ప్రస్తావనకు రావు. కేవలం 'హోమర్ ఒడిస్సీ'తో మనకు సారూప్యతలు వెతుక్కోడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment