Thursday, December 27, 2018

Goat Days - Benyamin

మేము కేరళలో ఉన్నకాలంలో ఒక పుస్తకాల సంత జరిగింది..అప్పటికే చెన్నై బుక్ ఫెయిర్స్ ని బాగా మిస్ అవుతున్నానేమో,దారిలో ఆ చిన్న పుస్తకాల సంతను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది..లోపలకి వెళ్ళి  చూస్తే తొంభై శాతం అన్నీ మలయాళం పుస్తకాలే..ఆ కవర్లు చూస్తూ ఓ ప్రక్క కడుపునింపుకుంటూ మలయాళం అనువాదాలు ఏమైనా ఉన్నాయా అని వెతగ్గా ఈ పుస్తకం కంటపడింది..ఆ విధంగా రెండేళ్ళకి పైగా నా పుస్తకాల షెల్ఫులో వేచి చూసిన ఈ రచనను ఈ మధ్యనే చదివాను..అదే కేరళ సాహిత్య అకాడమీ అవార్డు(2009) పొందిన బెన్యామిన్ రచన 'గోట్ డేస్'..మలయాళంలో 'ఆడు జీవితం' పేరిట రాసిన ఈ కథ సుమారు ఎనభై భాషల్లోకి అనువదించబడింది..దీని ఆంగ్లానువాదం Man Asian Literary Prize (2012) లాంగ్ లిస్టులో స్థానం సంపాదించుకోవడంతో పాటు DSC Prize for South Asian Literature (2013) ను కూడా గెలుచుకుంది.
Image Courtesy Google
గల్ఫ్ దేశాలకీ కేరళ వాసులకీ ఉన్న విశిష్టమైన అనుబంధం కేరళలో నివాసం ఉన్న సమయంలో నాకు బాగా అనుభవమైంది..వాయనాడ్ లో ఉన్న కాలంలో కేరళ సంస్కృతీ సంప్రదాయాల్నీ,అక్కడి జీవన విధానాన్నీ చాలా దగ్గరగా చూసే అవకాశం లభించింది..అక్కడ ప్రతి ఒక్కరి కలా ఒక స్వంత ఇల్లు..అద్దెకు ఇళ్ళ కోసం తిరుగుతున్నప్పుడు అక్కడ అద్భుతమైన నిర్మాణాలు చూశాము..అన్నీ చక్కటి ఆర్కిటెక్చర్ తో కూడిన సంప్రదాయ కేరళ గృహాలే..వాకబు చేస్తే తెలిసిందేమంటే సింహభాగం ఇళ్ళ యజమానులు దుబాయ్ లో ఉంటారని..సంవత్సరానికోమారు కేరళ వచ్చి కొంతకాలం గడిపి వెళ్ళిపోతుంటారు..అలా ఇంటికి ఒకరిద్దరైనా గల్ఫ్ లో ఉండడం అక్కడ సర్వసాధారణం..అరబ్ దేశాల్లో వృత్తిరీత్యా స్థిరపడిన భారతీయుల్లో ఎనభై శాతం మంది మళయాళీలేనట..ఇంత భారీ సంఖ్యలో మలయాళీయుల వలసకు ప్రధాన కారణం కేరళలో పండించే సుగంధ ద్రవ్యాలు..స్పైసెస్ ను సౌదీకి ఎగుమతి చేసే క్రమంలో అక్కడ ఉద్యోగావకాశాల్ని కూడా అందిపుచ్చుకున్నారు కేరళవారు..ఆ విధంగా ప్రతి సగటు మలయాళీకీ గల్ఫ్ లో ఉద్యోగం ఒక కల..కానీ అందమైన కలలు కొందరికి  పీడకలలుగా మారిన సందర్భాలు కూడా అక్కడ కోకొల్లలు..అటువంటి ఒక దురదృష్టవంతుడు నజీబ్ కథే ఈ 'గోట్ డేస్'..విశేషమేంటంటే ఈ కథ కల్పితం కాదు,వాస్తవ ఘటనల ఆధారంగా రాసినది.

కథ విషయానికొస్తే నజీబ్ కూడా సగటు కేరళ వాసిగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం కోసం సౌదీ పయనమవుతాడు..ఒక స్వంత ఇల్లు,టీవీ,ఏసీ కనీస సదుపాయాల కోసం నిండు గర్భిణి అయిన భార్య సైను నూ,తల్లినీ వదిలి రియాధ్ వెళ్తాడు..రియాధ్ చేరగానే అక్కడ ఒక అర్బబ్ (arbab-యజమాని) ఒక జీపులో వచ్చి నజీబ్ నూ,హకీమ్ అనే మరో యువకుణ్ణీ తన వాహనంలో జనజీవనానికి అందనంత దూరంగా ఒక మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్తాడు..మనుష్య సంచారం బొత్తిగా లేని ఆ ఎడారి ప్రాంతంలో ఇద్దరూ అర్బబ్ చేతుల్లో దారుణమైన హింసలకు  గురవుతారు..సుమారు ఏడువందల మేకలకూ,కొన్ని ఒంటెలకూ కాపరిగా మసారా (masara-a goat farm) లో నజీబ్ జీవితం అతి దారుణంగా ఉంటుంది..హకీమ్ కూడా నజీబ్ కు సమీపంలోని మరో మసారాలో ఇలాంటి బాధలే పడుతుంటాడు..ప్రతిరోజూ కొన్ని khubus (రొట్టెలు),అవీ నీళ్ళలో ముంచుకుని తినడం,గొడ్డు చాకిరీ చేస్తూ,అర్బబ్ చేతిలో బెల్టు దెబ్బలు తింటూ ఆ ఎడారిలో కనీసం తలపై నీడ కూడా లేకుండా బహిరంగ ప్రదేశంలోనే బ్రతకడం,ఎండకు ఎండి ఎర్రగా పెనంలా కాలుతున్న ఇసుక నేల మీద నిద్రపోవడం లాంటివి నజీబ్ దిన చర్యగా మారతాయి..నీళ్ళు ప్రియం కాబట్టి స్నానం లేదు సరికదా,కనీసం మలవిసర్జన తరువాత కూడా నీళ్ళతో శుభ్రం చేసుకోలేని దారుణమైన స్థితిలో,సుమారు మూడేళ్లపాటు శరీర దుర్గంధాన్ని భరిస్తూ,ఆ నరకంలో నుంచి ఎలా అయినా బయట పడతాననే ఆశతో రోజులు వెళ్ళదీస్తుంటాడు.

కడు దుర్భరమైన జీవితం,లేదా మరణం,ఈ రెండూ తప్ప మరో గత్యంతరం లేని దశలో బహుశా ప్రాణం మీద తీపి మాత్రమే మనిషిని నడిపిస్తుంది..అటువంటప్పుడు తనకు దొరికిన జీవితాన్నే (అది నరకమైన సరే) అంగీకరించే పరిస్థితికి మనిషి చేరుకుంటాడు..నజీబ్ కూడా మరో అవకాశం లేని దశలో తన పశువుకంటే హీనమైన జీవితాన్ని అంగీకరిస్తాడు..ఆ మేకలకు Pochakkari Ramani,Marymaimuna,Indipokkar,Njandu Raghavan,Parippu Vijayan అంటూ తన ఊరిలో మనుషుల పేర్లు పెట్టి పిలుస్తూ మాట్లాడుతుంటాడు..ఒక దశలో తన శారీరక అవసరాన్ని కూడా ఆ మేకల సమక్షంలో తీర్చుకుంటాడు..చివరకు తానొక మనిషిననే విషయం పూర్తిగా మర్చిపోయి ఆ పశువుల్లో ఒక పశువుగా (మేకలా) రూపాంతరం చెందుతాడు..వేళకి తిండి,నిద్ర,గొడ్డు చాకిరీ మినహా నజీబ్ జీవితంలో ఇంకేమీ ఆలోచించడానికి లేదు..స్వదేశంలో అతని భార్య,పుట్టబోయే బిడ్డా,తల్లి,వారందరి బాధలతో అతనికి సంబంధం లేదు..వారందరూ కేవలం అతని గతించిన జీవితంలో ఒక చిన్న భాగంలోని వ్యక్తులుగా మిగిలిపోతారు..ఒక సందర్భంలో "ఎడారిలో సూర్యాస్తమాయలు మాములుగా అయితే అందమైనవి,కానీ నా జీవితం దృష్ట్యా  ఆ అందాన్ని ఆస్వాదించలేకపోతున్నాను" అంటాడు నజీబ్..కానీ ఊపిరి ఉన్నంతవరకూ ఎటువంటి అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించగలం అనే ఆత్మవిశ్వాసం నజీబ్ లో అన్ని వేళలా కనిపిస్తుంది.

అటువంటి సమయంలో హకీమ్ మసారాలోకి సోమాలియా నుండి వచ్చిన మరో బానిస ఇబ్రహీం ఖాదిరీ సాయంతో అదను చూసుకుని దారీ తెన్నూ లేని ఆ ఎడారిలో మిణుకుమిణుకుమంటున్న ఆశతో అర్బబ్ మసారా నుండి  తప్పించుకుని బయటకి పరిగెడతారు నజీబ్,హకీమ్..మరి కనీసం నీళ్ళు కూడా తీసుకెళ్ళడం మర్చిపోయి,పాదాలు రక్తాలు ఓడుతుండగా ఆ ఎడారిలో వారు సురక్షితంగా తమ గమ్యం చేరారా లేదా అన్నది తరువాతి కథ..నజీబ్ కు ఆ నరకం నుండి విముక్తి దొరికిందా లేదా? అతని ప్రార్థనలు ఫలించాయా ? ప్రాణాలతో తన స్వదేశానికి రాగలిగాడా లేదా అన్న విషయాలు తెలియాలంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే..

ఎంత కాలం జీవించామన్నది కాదు,ఎలా జీవించామన్నది ముఖ్యమని అంటుంటారు..క్వాలిటీ vs క్వాంటిటీ గురించి చెప్పడం సులభమే గానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఎదురైనప్పుడు ప్రాణం మీద తీపే గెలిచి తీరుతుందనిపిస్తుంది నజీబ్ జీవితాన్ని చూస్తే..కష్టం సుఖం చెప్పుకోడానికి మరో మనిషి లేని ఒంటరితనం ఎంత దారుణంగా ఉంటుందో,హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత అవసరమో నజీబ్ మూడేళ్ళ నరకాన్ని చూస్తే అర్ధం అవుతుంది..నజీబ్ మసారాకు చాలా అరుదుగా ఎవరైనా వస్తే చాలు, భాష రాకపోయినా ఆ మనుష్య వాసన కోసం తపనపడుతూ కుక్కపిల్లలా వాళ్ళ వెనుక వెనుక తిరిగేవాణ్ణి అంటాడు..ఏకాంతాలు అందమైనవే కానీ వాటి అందం మానవ సంబంధాలతో కలగలిసి ఉన్నప్పుడే..అడ్రీ హెప్బర్న్ అంటుంది,'I don't want to be alone,I want to be left alone' అని.

ఇందులో నజీబ్ కథను బెన్యామిన్ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది..నెరేషన్ అంతా ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది..సులభమైన వర్ణనలతో అలవోకగా మనసుకి హత్తుకునే పదాలు రాయడంలో బెన్యామిన్ నేర్పరితనం అడుగడుగునా కనిపిస్తుంది..ఎక్కడా పట్టుతప్పిపోకుండా,క్లిష్టమైన పరిస్థితుల్లో మానవనైజపు భావోద్వేగాల్ని తన వేదాంతధోరణితో బ్యాలెన్స్ చేసిన విధానం ఎంతో బాగుంది..నజీబ్ జీవితం గల్ఫ్ దేశాల వెలుగు జిలుగుల వెనుక చీకటి కోణాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది,అరబ్ సంస్కృతిలో తరతరాలుగా వ్రేళ్ళూనుకుని ఉన్న అతి కౄరమైన బానిస వ్యవస్థ స్వరూపాన్ని నగ్నంగా నిలబెడుతుంది..ఈ కథలో నజీబ్ జీవితాన్ని తుదికంటా నడిపించేది జీవితం పై ఆశ మాత్రమే..అన్ని కష్టాల్లో కూడా నజీబ్ అల్లా తనకు తోడున్నాడని నమ్ముతాడు..అతని నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కౄరమైన మనుషుల మధ్య కొందరు మానవత్వం ఉన్న మనుషులు కూడా అతనికి తారసపడతారు..అర్బాబ్ నజీబ్ తో వ్యవహరించే తీరు కౄరత్వానికి పరాకాష్ట..చేతిలో గన్ తో తన పనివాణ్ణి అనుక్షణం ఒక గ్రద్దలా కాచుకుని కూర్చుని రాత్రీ పగలూ పని చేయించుకోవడం పాశవికంగా ఉంటుంది..ఒక సందర్భంలో ఆర్బాబ్ ను చంపే అవకాశం వచ్చినా వదిలెయ్యడం లాంటి సంఘటనలు నజీబ్ ను పశువుల్లాంటి మనుషుల మధ్య మానవత్వం ఉన్న మనిషిగా నిలబెడతాయి..ఇందులో నన్ను ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే,ఇటువంటి దీనగాథ వర్ణనలో కూడా ప్రతి పేజీనీ ఒక ఆశావహదృక్పధంతో ముగిస్తారు..నజీబ్ లాంటి వాళ్ళ కథలు చదివితే మన దైనందిన జీవితంలో చాలా స్వల్పమైన, అల్పమైన విషయలుగా కనిపించేవి ఒక్కోసారి ఎంత విలువైనవో తెలుస్తాయి..కష్టం సుఖం చెప్పుకోడానికో తోడు,తల మీద ఎండకీ వానకీ తలదాచుకోడానికో చూరు..పంచభక్ష్య పరమాన్నాలు కాకపోయినా వేడిగా వండుకున్న కాస్త అన్నం,ఇవన్నీ ఉన్నట్లుండి చాలా విలువైనవిగా అగుపిస్తాయి..ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనోనిబ్బరాన్ని కోల్పోకూడదని హితవు చెప్పే ఈ నవల ఎందరికో స్ఫూర్తిదాయకం..అస్సలు క్రింద పెట్టనివ్వకుండా నన్ను ఏకబిగిన చదివించిన పుస్తకం ఈ 'గోట్ డేస్'.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
Those plants taught me life's great lessons of hope.They whispered to me :Najeeb,adopted son of the desert,like us,you too must preserve your life and wrestle with this desert.Hot winds and scorching days will pass.Don't surrender to them.Don't grow weary,or you might have to pay with your life.Don't give in.Lie half dead,as if meditating.Feign nothingness.Convey the impression that you will never resurrect.Secretly appeal to Allah the merciful.He will recognize your presence.He will hear your cries.And finally an opportune moment will come for you.This hot wind will blow away.This heat will dissipate.The cold wind of time will beckon you.Then,only then,should you slowly raise your head from the earth,announce your presence and,then,quickly,spring to freedom.Bloom and come to fruit in the morrow.
I lent my ears to the words of the little plants.I waited patiently for the opportune moment.

Even while heading towards freedom,it is agonizing to depart from our loved ones.I experienced intense grief in that happy moment of freedom.

I suddenly lost all urge to escape.Even when it is set free,a goat reared in a cage will return to the cage.I had become like that.I can't go anywhere in this figure and form.I am a goat.My life is in this masara. Till I end my life or die of some disease.I don't want to show anyone this scruffy shape,this scruffy face,this scruffy life.Mine is a goat's life.

I was like a flower that forced to blossom in the desert.