1932 లో మాక్సిమ్ గోర్కీ ని సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ (1887–1950) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని కోరారట. నిజానికి సిగిజ్మండ్ సాహితీరంగంలో ఆనాటికి ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. అప్పటికే 'ఆల్ యూనియన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియెట్ రైటర్స్' కి తొలి ఛైర్మన్ గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్న గోర్కీ, సోవియెట్ యువ రచయితలకు 'సోషలిస్ట్ వాస్తవిక సాహిత్యం' భవిష్యత్తు విషయంలో దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కానీ తన రచనల్ని పరిశీలించే నిమిత్తం గోర్కీ చేతిలో పెట్టడమనే ఈ ఒక్క తప్పిదానికీ సిగిజ్మండ్ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సొచ్చింది. గోర్కీ విమర్శలు సిగిజ్మండ్ కు ఒక రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన 'సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ' అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్ రచనలు ఆనాటి 'సోవియెట్ లిటరరీ ఎస్థెటిక్స్' కి తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పరబట్టారట : "నేను మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్ని వాటి యొక్క తాత్వికమైన విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో, తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం,పాండిత్య ప్రకర్ష ఆనాటి మేథావి వర్గాల్లో ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలమది. పండితులందరూ సమోవర్ చుట్టూ సమావేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్ వర్డ్ ప్లే - lukavoe prazdnoslovie) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవజాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి కంటే అతడి కర్మల ద్వారానే సృష్టించబడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అందువల్ల మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనలకు ప్రచురణకర్తలు దొరుకుతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ దొరికినప్పటికీ వాళ్ళు నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా ! "
Image Courtesy Google |
ఇటువంటి తీవ్రమైన విమర్శలు చెయ్యడం ద్వారా గోర్కీ సిగిజ్మండ్ ఒక రచయితగా వాస్తవదూరమైన విషయాసక్తితో (Self-indulgent untimeliness) ఘోరమైన పాపానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బాధ్యతగల రచయితగా సోసియెట్ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. యుద్ధ సమయంలో రచయితలు వాస్తవాన్ని విస్మరించి పదసౌందర్యాలపై అనురక్తితో తాత్వికమైన విషయాల్లో మునిగితేలడం నేరమన్నది గోర్కీ భావన. నిజానికి గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్ ను 19 వ శతాబ్దానికి చెందిన రచయితగానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్ పై 19వ శతాబ్దపు రష్యన్ సింబాలిజాన్ని పెద్ద ఎత్తులో నిర్వచించిన నీకొలాయ్ గొగోల్, ఎడ్గర్ అలాన్ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్ శైలికీ గొగోల్ శైలికీ చాలా పొంతనలుంటాయి. ఉదాహరణకు 'ది రన్ అవే ఫింగర్స్' (1922) అనే కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతడి చెయ్యినొదిలి పారిపోవడం గొగోల్ 'ది నోస్' కథను తలపిస్తుంది. సిగిజ్మండ్ కథానాయకులు కూడా గొగోల్ కథానాయకుల్లాగే కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్ 'ది ఓవర్ కోట్', సిగిజ్మండ్ 'క్వాడ్రాటురిన్' కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథానాయకులు వృత్తి,ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టు సిగిజ్మండ్ ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయినట్లుండే ఆయన కథలు అర్థంకావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్ లాంటి సిగిజ్మండ్ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.
ఉక్రెయిన్ లోని కీవ్ లో పుట్టిన పోలిష్ మాట్లాడే కుటుంబానికి చెందిన సిగిజ్మండ్ డొమినికోవిచ్ క్రిఝిఝానోవ్‍స్కీ 1919-1950 ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే ప్రచురించబడ్డాయి. మాస్కో సాహితీలోకంలో పలు మేథావుల మన్ననలందుకున్నప్పటికీ క్రిఝిఝానోవ్‍స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల,ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగా 1949 లో గుండెపోటుతో రచయితగా సిగిజ్మండ్ కెరీర్ ముగిసిపోయేవరకూ ఆయన మాస్కో సాహితీలోకంలో (నాన్ అకడమిక్) విమర్శకునిగా,సంపాదకునిగా మాత్రమే పనిచేశారు. దీనికి తోడు సిగిజ్మండ్ స్టాలిన్ కంటే మూడేళ్ళు ముందుగానే మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధవాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్ లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్ 1920 ల తొలి కాలంలో ఈ నియంతృత్వపు కాలాన్ని 'ఫెంటాస్టిక్' శైలిలో రూపకాలు,ఉపమానాలతో కూడిన కాల్పనిక సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు.
భావవ్యక్తీకరణ నేరమైన నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయితలూ,కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్ శకంలో ఇటువంటి రచయితలు రెండు రకాలనుకుంటే, అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్, విక్టర్ సెర్జీ, మిఖాయిల్ బల్గకోవ్, బోరిస్ పాస్టర్నాక్ వంటి రచయితలు స్టాలిన్ సోవియెట్ రష్యా విప్లవం, సివిల్ వార్ కాలం నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవిధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృదయాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిఝిఝానోవ్‍స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని కౄరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి తీసుకువెళతాయి. 1930 ల్లో సిగిజ్మండ్ జీవించి ఉన్న కాలంలో తనను తాను రచయితగా కంటే థియేటర్ ప్రొఫెషనల్ గా, సాహితీ విమర్శకునిగానే చూసుకున్నారంటారు. షేక్స్పియర్,జార్జ్ బెర్నార్డ్ షా ల ప్రభావం అధికంగా ఉన్న తన కథలను నిర్లక్ష్యం చేసినా వారిద్దరి రచనల్నీ మాత్రం తనదైన శైలిలో విశ్లేషిస్తూ విస్తృతమైన పరిశోధనలు చేసి పలు వ్యాసాలు ప్రచురించారు. ఈ కారణంగా సాహితీ రంగంలో సిగిజ్మండ్ ఒక ప్రత్యేకమైన 'nonacademic sort of Shakespeare critic' గా పేరు తెచ్చుకున్నారు.
క్రిఝిఝానోవ్‍స్కీ రచనలపై షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన తనను తాను ప్రప్రథమంగా 'ఎక్స్పెరిమెంటల్ రియలిస్టునని' చెప్పుకునేవారు. స్టాలినిస్ట్ సెన్సార్షిప్ కారణంగా సిగిజ్మండ్ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా Joanne Turnbull, Nikolai Formozov వంటి సంపాదకుల దృష్టికి వచ్చి 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలు వెలువడ్డాయి. రచయితలుగా భిన్న ధృవాలైనప్పటికీ సిగిజ్మండ్ రచనా శైలిని ఆధునిక రచయితల్లో ఒకరైన వ్లాదిమిర్ షరోవ్ శైలితో పోలుస్తారు కార్ల్ ఎమర్సన్. వీరిద్దరి శైలుల్లో ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సినెస్థీసియా అంటారు, అంటే కథ చెప్పేటప్పుడు ఇద్దరూ సినెస్థీసియాను మూలాధారంగా చేసుకుని చెబుతారు. నిజానికి మనిషికుండే పంచేంద్రియాలు మెదడులోని వేర్వేరు భాగాలను చైతన్యవంతం చేస్తాయంటారు. కానీ సినెస్థీసియా కారణంగా ఒక ఇంద్రియ చైతన్యం మరో ఇంద్రియం చేత ఉద్దీపితమవుతుంది. ఉదాహరణకు సంగీతం విన్నప్పుడు మనం కొన్ని రంగుల్ని చూడడం తటస్థిస్తుంది. లేదా ఏవైనా అంకెలు చూసినప్పుడు మనకు కొన్ని రంగులు జ్ఞప్తికి వస్తాయి, ధ్వనులకు వాసనలుంటాయి, స్వరాలకు వర్ణాలుంటాయి, లేదా ఏదైనా వాక్యాలను విన్నా,చదివినా శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణం జనించిన భావన కలుగుతుంది, ఇలా మెదడు అనేక అనుభూతులకు లోనవుతుంది. నిజానికి జీవశాస్త్ర పరంగా చూస్తే ఈ సినెస్థీసియా ఇంద్రియ సంబంధమైనది కాదు. ఈ సాహితీ ప్రక్రియ పాఠకులపై ప్రభావం చూపే రీతిలో అర్ధవంతమైన వాక్యాలను శ్రద్ధగా ఏర్చి కూర్చిన కృత్రిమమైన నిర్మాణం. ఈ సినెస్థీసియాను పాఠకులపై సమర్థవంతంగా ప్రయోగించడానికి రష్యన్ విప్లవం, సివిల్ వార్లను వేదికగా చేసుకున్నారు సిగిజ్మండ్.
సిగిజ్మండ్ దృష్టిలో భాష గతిశీలమైనది. కొన్ని కథల్లో సిగిజ్మండ్ పదాలూ,అక్షరాలూ పేజీని వీడి పైకి ఎగసిపడుతున్న అలల్లా ఒకదానితో ఒకటి తలపడుతున్నట్లుంటాయి. దీనికి తోడు ప్రవృత్తి రీత్యా ఏకాకి జీవితాన్ని ఇష్టపడే అంతర్ముఖత్వం సిగిజ్మండ్ కథల్లో కాంటియన్ భావజాలానికి సంబంధించిన మెటాఫిజికల్ ప్రపంచాలు ఎక్కువ కనబడడానికి ఒక ముఖ్య కారణం. కథ చెప్పే సమయంలో సిగిజ్మండ్ దృష్టి ఎల్లప్పుడూ మానవ మస్తిష్కం లోలోపలి పొరల్లో ఎవరూ చొరబడడానికి సాహసించని మారుమూల ఏకాంత ప్రదేశాలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన కథా వస్తువు (లేదా కథానాయకుడు) ఆ మెదడు లోపలి పొరల్లోంచి సూటిగా వెలుపలికి ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున వెలుపలికి దూసుకువచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ సమయంలో ఎటువంటి వైకల్యాలకూ తావివ్వకపోవడం సిగిజ్మండ్ ప్రత్యేకత.
యుద్ధంతో వినాశనాన్ని చవిచూసిన కీవ్ నుండి బయటపడి 1922 లో మాస్కో లో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్. కాసేపు సిగరెట్ ముట్టించి అది కాలే లోగా కథ రాసి సిగరెట్ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచయితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ,ప్రవృత్తికీ నిజాయితీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్. నార్వే రచయిత కనూట్ హాంసన్ బాటలోనే సిగిజ్మండ్ కూడా కథ రాయడం కోసం ఏకంగా తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సిగిజ్మండ్ అనువాదకుల్లో ఒకరైన కార్ల్ ఎమర్సన్ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. ఎమర్సన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి రాసిన ఒక వ్యాసంలో సిగిజ్మండ్ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలిలోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునేవారని అంటారు. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక,మానసిక సమతౌల్యంలోనుంచి పుడుతుందనీ సిగిజ్మండ్ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి.
అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్ ఎమర్సన్ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిఝిఝానోవ్‍స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవిచూసిన క్రిఝిఝానోవ్‍స్కీ ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "డూ యూ లవ్ పుష్కిన్ ?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక "ఐ...ఐ......" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య బోవ్షెక్ చెప్తూ, ఆ సమయంలో ముప్ఫయ్ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అన్న ఊహ రాక మానదు. 'కాంటియన్ థింకర్' (ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న క్రిఝిఝానోవ్‍స్కీ రచనలు మోతాదుమించిన తార్కికతతో ఉండడం వల్ల వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ తీర్మానించడంతో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" క్రిఝిఝానోవ్‍స్కీ వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం.
'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరికొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్ అనే రచయిత చెప్పే 'ఎక్సెస్' (Exes) అనే డిస్టోపియాన్ హారర్ స్టోరీ మరో కథల సంపుటి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆరోజుల్లోనే అలవోకగా రాశారు క్రిఝిఝానోవ్‍స్కీ. కొన్ని చోట్ల కథలో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి తత్వాన్ని ప్రస్తావిస్తూ సాగే సిగిజ్మండ్ లోతైన కథనంలోని ప్రవాహపు వేగాన్ని అందుకుంటూ చదవడం పాఠకులకు కత్తిమీద సాములా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు రచయితకు దైనందిన జీవితంలో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలే కాకుండా పలు రాజకీయ, సామాజిక, విజ్ఞాన, తత్వ, శాస్త్ర సాంకేతికత వంటి విభిన్నమైన అంశాలపై ఉండవలసిన జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. మరోచోట ఫెవ్ అనే రచయిత చెప్పిన 'టేల్ ఆఫ్ ది త్రీ మౌత్స్' అనే కథలో ఇంగ్, నిగ్, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిఝిఝానోవ్‍స్కీ ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. "తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని" ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిఝిఝానోవ్‍స్కీ. ప్రవాహానికి ఎదురెళ్ళడమనేదే విప్లవమనుకుంటే మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంపై తన వినూత్నమైన కథలతో తిరుగుబాటు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠకులు ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఈయన రచనల్లో దొరకని ఒకే ఒక్క వస్తువు 'అనుసరణ' (conformity).
క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివే భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం, బోర్హెస్ కథల్లోలాగే ఆయన కథల్లో కూడా తరచూ కనిపించే భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు !! బోర్హెస్, ఉర్సులా లెగైన్ వంటి కొందరు 'ఫెంటాస్టిక్ జానర్' రచయితల్లాగే క్రిఝిఝానోవ్‍స్కీ కి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిఝిఝానోవ్‍స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక రుజువులు కనిపిస్తాయి. గూగుల్ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు దేశవిదేశీ సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్, కాఫ్కా వంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్ కు అందుబాటులో లేనప్పటికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్, పో, గోగోల్ వంటివారు కొలువుదీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న 'షూ బాక్స్' సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ ని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
Between you and Nagaraju you have practically left any where between zero and nothing to venture even a comment on the great writer. I learned about him through Nagaraju via eemaata. Thoroughly enjoyed your complete essay. Thanks for sharing. Veluri Venkateswara Rao.
ReplyDeleteVeluri garu,thank you so much for taking time to read and leaving your precious feedback here.❤️🙏
Deleteఅధ్బుతంగా వ్రాసారు... Autobiography of corpse నా దగ్గర ఉంది. కానీ చదవలేదు.మీ రివ్యూ చదివాక చదవాలనిపిస్తుంది..thank u so much madam.
ReplyDeleteThank you Ravi garu :)
Delete