Showing posts with label AndhraJyothi Articles. Show all posts
Showing posts with label AndhraJyothi Articles. Show all posts

Tuesday, July 22, 2025

Ulysses - James Joyce

 ఆధునిక సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన రచనల్లో జేమ్స్ జాయిస్ 'యులీసిస్' ఒకటి. చాలామంది పబ్లిషర్లు తిరస్కరించిన తర్వాత, పారిస్ లోని 'షేక్స్పియర్ అండ్ కంపెనీ' యజమాని సిల్వియా బీచ్ 1922లో 'యులీసిస్'ను తొలిసారి ప్రచురించారు. కానీ అశ్లీలతల పేరిట ఈ నవలను త్వరలోనే బ్యాన్ చేశారు. U.S.పోస్టల్ సర్వీసు ఏకంగా 'యులీసిస్' కాపీలను తగలబెట్టింది. కథాపరంగా చూస్తే 'యులీసిస్' ఎటువంటి ప్రత్యేకతలూ లేని నవల. దీని ప్రత్యేకత కథలో కంటే అతి సాధారణమైన కథను జాయిస్ ఎలా చెప్పారన్నదానిలోనే ఉంటుంది. జేమ్స్ జాయిస్ 1904 జూన్ 16వ తేదీన డబ్లిన్లోని కొందరు సాధారణ వ్యక్తుల జీవితంలోని ఒకే ఒక్క రోజు, అంటే సుమారు 18 గంటల కాలంలో జరిగే సంఘటనలను కథగా రాసుకొచ్చారు. జాయిస్ దైనందిన వ్యవహరాల్లో, మామూలు సంభాషణల్లో 'ఆర్ట్'ను ఎంత వైవిధ్యంగా చూపగలిగారన్నదే 'యులీసిస్' ప్రత్యేకత. నిజానికి ఇప్పటి ఓటీటీ వెబ్ సిరీస్లు, సినిమాలూ, పుస్తకాల్లో కనిపించేంత అశ్లీలత ఈ నవలలో లేదు. అందువల్ల ఆధునిక పాఠకుడికి ఈ పుస్తకంలో షాక్ వేల్యూ పెద్దగా కనిపించే అవకాశం లేదు. కానీ 1920ల కాలంలోని మతవిశ్వాసాలనూ, సాంఘిక నియమాలనూ సవాలు చేసిన ఈ నవలకు ఎదురైన వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.

Copyright A Homemaker's Utopia

సాహిత్యంలో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" కథనాలు కొత్తేమీ కాదు. ఉదాహరణకు  జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్', థామస్ బెర్న్హార్డ్ 'ది లూజర్' లాంటి నవలల్లో కథంతా ఒకే ఒక్క ముఖ్య పాత్ర తన స్వగతం చెప్పుకుంటున్నట్లు రాశారు. ఇటీవల నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న హాన్ కాంగ్ రచన 'ది వెజిటేరియన్', టాల్స్టాయ్ 'అన్నా కరెనిన'లాంటి నవలల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల స్వగతాలను ఒక్కొక్కరి దృష్టి కోణం నుంచీ విడదీసి చెబుతారు. ఇప్పుడు జాయిస్ వచనాన్ని పరిశీలిస్తే, ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుష- ఈ మూడు రకాల నేరేటివ్ లూ కథలో ఏ విధమైన క్రమమూ లేకుండా ఒకదాన్నొకటి ఢీ కొడుతూనే ఉంటాయి. అందువల్ల 'యులీసిస్' వచనమంతా అనేక పాత్రల ఆలోచనల అంతర్వాహిని అస్తవ్యస్తంగా పెనవేసుకుని చిక్కులు పడిపోయినట్లుంటుంది. కథలో లియోపోల్డ్ బ్లూమ్, స్టీఫెన్ డెడలస్, మోలీ వంటి ముఖ్య పాత్రలతో బాటు కథ మధ్యలో వస్తూ పోతూ ఉండే ఇతరత్రా పాత్రల 'స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్' కూడా కలగాపులగంగా కలిసిపోయి, జాయిస్ వచనాన్ని పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడనివ్వదు. పాఠకుడికి ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడడం మొదలులుపెట్టారో, సంభాషణ ఎప్పుడు ముగించారో స్పష్టత ఉండదు. వాక్యాల చివర ఫుల్ స్టాపులూ, కామాలూ ఉండవు. రెండు మూడు పేజీలు పూర్తైనా ఒక్కోసారి వాక్యం ముగింపు కానరాదు. ఇక చివరి అధ్యాయం 'పెనెలోపె'లో అయితే మోలీ స్వగతం గురించిన వాక్యం మొదట్నుంచి చివరి వరకూ ఆగకుండా అనంతమైన ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. ఏదేమైనా ఐరిష్ సంస్కృతి గురించీ, జేమ్స్ జాయిస్ శైలి గురించీ కనీస అవగాహన లేని సగటు పాఠకుడిని చెయ్యి పట్టుకుని 'యులీసిస్' యేరు దాటించే 'డిజిటల్ సాయాలు' ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అనేకం అందుబాటులో ఉండడం వల్ల 'యులీసిస్' చదవడం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలికే.

నిర్ధిష్టమైన మూలం, నేపథ్యం ఉండే ఇద్దరి మధ్య సంభాషణ, వాటి నేపథ్యం తెలియని మూడో వ్యక్తికి అర్థం కాదు. జాయిస్ నవల ఇటువంటి ఒక 'ఇన్సైడ్ జోక్' లాంటిది. ఎటొచ్చీ "యులీసిస్" రాయడం ద్వారా జాయిస్ ఏ ఒక్క వ్యక్తినో కాకుండా మొత్తం ప్రపంచాన్ని తన సంభాషణలో భాగంగా చేసుకునే ప్రయత్నం చేశారు. పాఠకులకు జాయిస్ శైలితో కాస్త చనువు ఏర్పడ్డాక, కథలో మనల్ని వెతుక్కోమంటూ దాచేసిన "ఈస్టర్ ఎగ్స్" పట్టుకోవడం ఒక ఆటలా ఉంటుంది. నిజానికి ఈ నవలకు ఫ్రేమ్ వర్క్ గా తీసుకున్న హోమర్ 'ఒడిస్సీ' చదివితే 'యులీసిస్' చదవడం తేలికన్నది అర్ధసత్యం మాత్రమే. కథాపరంగా ఒడిస్సీకీ, యులీసిస్ కీ పొంతనలుండవు. కానీ జాయిస్ తన స్నేహితులకు ఇచ్చిన 'గిల్బర్ట్ స్కీమా డయాగ్రమ్'లో ప్రతీ చాప్టర్ కూ 'ఒడిస్సీ' నేపథ్యమేమిటో చెప్పే లంకెలుంటాయి.

మొదటి 10 ఎపిసోడ్ల వరకూ విపరీతమైన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించినా 'సైరెన్స్' ఎపిసోడ్ మొదలు హాస్యం, వ్యంగ్యం, పేరడీలతో జాయిస్ పామరుల కోసమే ప్రత్యేకించి రాస్తున్నారనిపించేంతగా, కఠినమైన వచనాన్ని కొమ్ములు వంచి ఉన్న పళంగా 180 డిగ్రీల టర్న్ తిప్పుతారు. జాయిస్ వచనం ఆయన సృష్టించిన అనేక పాత్రల వెనక ఎక్కడో నక్కి పాఠకుడితో నర్మగర్భంగా దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయన తన గురించి ఎన్నో వివరాలను గుక్కతిప్పుకోకుండా చెప్పీచెప్పనట్లు చెబుతూనే, చివరి వరకూ దూరంగా, ఒక అపరిచిత వ్యక్తిగానే మిగిలిపోతారు. అయినప్పటికీ ఆయనంత ప్రామాణికమైన 'ఆటోబయోగ్రఫికల్ ప్రోజ్' మరెవ్వరూ రాయలేదంటారు. రచయిత పాఠకుడి స్థాయికి దిగే ప్రయత్నం అస్సలు చెయ్యకుండా తానున్న ప్లేన్ లోనే నిలబడి కథ చెప్పడం బోర్హెస్, క్రిఝానోవ్స్కీ, ఉంబెర్తో ఎకో వంటి చాలామంది రచయితల్లో కూడా కనబడుతుంది. జాయిస్ వచనంలో అందరికీ అర్థంకావాలనే ఉబలాటం కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయన వచనంలో అణువణువునా కనిపిస్తుంది.

ఇక జాయిస్ శైలిలో మనకు నవలంతా స్థిరంగా కనిపించే ఒకే ఒక్క నియమం- "నియమాలేవీ లేకపోవడమే". మొదటి మూడు చాప్టర్లలో చాలా పకడ్బందీగా కనిపించే వాక్య నిర్మాణం తరువాత చాప్టర్లలో పూర్తిగా వీగిపోతుంది. ఇక్కడ నుండీ పాండిత్య ప్రకర్ష తగ్గి జాయిస్ అసలుసిసలు "Foul play" మొదలవుతుంది. ఇక్కడ నుండీ జాయిస్ వాక్యనిర్మాణపు సంప్రదాయాలకూ, నవల రాయడానికి అమలులో ఉన్న విధివిధానాలకూ పూర్తి స్థాయిలో తిలోదకాలిచ్చేస్తారు. ఇక 11వ భాగం అయిన "సైరెన్స్"కి వచ్చేసరికి జాయిస్ స్వరంలోని "గూఫీ టోన్" పూర్తిగా అదుపు తప్పి తారాస్థాయికి చేరుకుంటుంది. “Bronze by gold heard the hoofirons, steelyrining imperthnthn thnthnthn” అనే వాక్యాలు చదివిన ఎజ్రా పౌండ్ "జాయిస్ తలకు ఏదైనా బలమైన దెబ్బ తగిలిందేమో" అని కలవరపడ్డారంటేనే మనం ఊహించుకోవచ్చు. జాయిస్ సాధారణంగా ఆనాటి రచయితలు వాడని నాగరికతకు సుదూరమైన అసభ్యమైన భాషని పచ్చిగా, ఎటువంటి ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా ఎందుకు వాడారని ఎవరో అడిగితే "This race and this country and this life produced me — I shall express myself as I am." అని సమాధానమిచ్చారాయన.

ఈ నవల నైతిక విలువలనూ, సభ్యతనూ మాత్రమే కాదు, కాల్పనిక సాహిత్యపు సంప్రదాయాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తుంది. జాయిస్ వచనం కొన్నిచోట్ల ఐరిష్, బ్రిటిష్ రైమ్స్, దేశవిదేశీ కవిత్వం, చరిత్ర లాంటి ఉత్తమమైన సాంస్కృతిక అంశాలతోనూ, మరికొన్ని చోట్ల వాటికి పూర్తి భిన్నంగా 'gibberish' భాషలో అతి సామాన్యమైన, ఒకింత అర్థంపర్థం లేని సంభాషణలూ, పారడీలతోనూ ఎగుడుదిగుడు రోడ్ల మీద పడుతూ లేస్తూ చేసే ప్రయాణాన్ని తలపిస్తుంది. కేంబ్రిడ్జి సెంటినరీ యులీసిస్' కు సంపాదికత్వం వహించిన క్యాథెరిన్ ఫ్లిన్ తన ఉపోద్ఘాతంలో "At a larger scale, Ulysses challenges the reader through its defiance of conventional modes of narration and characterization" అంటారు. జాయిస్ ఈ నవలను రాసిన తర్వాత, "భవిష్యత్తులో ఈ డబ్లిన్ నగరమూ, దాని సంస్కృతీ పూర్తిగా అదృశ్యమైపోయినా, నా పుస్తకం ఆధారంగా ఆ నగరాన్ని యథాతథంగా పునర్నిర్మించవచ్చు" అని తన మిత్రుడు, చిత్రకారుడూ అయిన ఫ్రాంక్ బడ్జెన్ తో అన్నారట.

ఐదువందల పేజీల పుస్తకాన్ని అరగంటలో కుదించే వెబ్ సిరీస్లు, అంతకంతకూ క్షీణించిపోతున్న మన అటెన్షన్ స్పాన్ ని సూచించే అర నిముషం వీడియోలు- ఇవన్నీ కలగలసిన 'ఇన్స్టంట్' సంస్కృతిలో 'యులీసిస్' చదవడం రాటుదేలిపోయిన మెదడును రీవైర్ చెయ్యడంలాంటిది. మొండి పశువు కొమ్ములు బలవంతంగా వంచడంలాంటిది. ఇలాంటి నవలలు మనం నేర్చుకున్నదంతా వదిలించుకుని మళ్ళీ పూర్వపు విద్యార్థిగా మారే అవకాశమిస్తాయి. ముఖ్యంగా జాయిస్ వాడిన ఐరిష్ యాసతో కూడిన 'పక్కా లోకల్' భాష మనకి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉందనే నమ్మకాన్ని తునాతునకలు చేసిపారేస్తుంది. మార్కస్ జూసాక్ నవల 'బుక్ థీఫ్'లో లీసెల్ మెమింగర్ చిన్నప్పుడు చదవడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్కో అక్షరాన్నీ కూడబలుక్కుంటూ పదాలను పేర్చుకోవడం గురించి రాస్తారు. అదే విధంగా జేమ్స్ జాయిస్ 'యులీసిస్' మనలో బాల్యంలో ఎక్కడో కోల్పోయిన తొలి పాఠకుడిని మరోసారి వెలికితీస్తుంది.

తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వివిధ - ఏప్రిల్ 7, 2025

https://www.andhrajyothy.com/2025/editorial/reading-ulysses-in-the-age-of-reels-1389989.html?fbclid=IwY2xjawLsd9JleHRuA2FlbQIxMABicmlkETF3bEFEbTVmQWtrUll1QVdEAR6Bxl1ZfvWpdczqUFghfV-_hr_f9aJ1VcBo-174tpLpytrt-nsZSn1fEZUNtQ_aem_yHHOYbKQ1jUwDQ7SO6VuEg

Tuesday, January 2, 2024

అతడు రాసిన ఆమె కథలు

పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు లింగవివక్షల ప్రాతిపదికన  ఏర్పడినవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా, మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతిక ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. అందువల్ల స్త్రీలు జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.

Image Courtesy AndhraJyothi

గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరమైన స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, ఆమె ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తూ వారి సృజనాత్మకతకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె సాహిత్యంలో సహజత్వానికి దూరంగా పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన "ఆదర్శ స్త్రీమూర్తి". జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు; ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది. ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది. 

ప్రాచీన కావ్యాల్లో స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి'గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి, మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ, రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవి. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా, పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన ఇల్లాలి వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.

ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదని నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా తీసుకుంటారంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చేసే దిశగా వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ; హేతువునూ, తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు.

ఈ కారణాల దృష్ట్యా అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలుపెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి'లాంటి కావ్యాలూ, గ్రంథాలూ రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీలు తమ రచనల ద్వారా పితృస్వామ్య సాహితీ సృజనలో రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అందువల్ల 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. తాను రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో  తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఒక పురుషుడి స్వరంలో ఉన్న అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో పెద్దవాడో నాకు తెలియదు. నేను రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీగానూ కూడా ఆలోచించాలి." అంటారామె.

అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ, భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్యపు సృష్టనీ కొట్టిపారేస్తారు. మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.

అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties”గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీని కేవలం ఒక గృహిణిగా మాత్రమే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవి టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం.

ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కవయిత్రిగా ఆమె ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.

నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. కవి కలం నుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. ఆ కాలంలో తన సృజనాత్మకతతో కావ్యసృష్టి చేద్దామని ప్రయత్నిస్తే  ఆమె మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్దిపాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.

ప్రాచీన కాలంనుండీ స్త్రీలను కళారంగానికి దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారిస్తూ -సృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన  బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేదనీ, రచయిత్రులకు ఆ అవకాశం లేదనీ అంటారు. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. సాహితీ విమర్శకుడు హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వ ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా  “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. 

ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ  కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ సరికాదు. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ప్రాచీన సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగమైన స్త్రీల జీవితాలు. అందువల్ల సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ, మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి.

గాలిలా కంటికి కనిపించని లింగవివక్షను ఎదుర్కొంటూ, మౌనాన్ని ఛేదిస్తూ ఆ కాలంలో కూడా ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు అనేక రచనలు చేశారు. ఈ కారణంగా  పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష అస్తిత్వవాద రచనలన్నిటిలోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.

ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట రాసిన వ్యాసాల్లో స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.  'Anxieties of authorship' తో కష్టపడుతున్న రచయిత్రులు రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన ఆమెలోని 'ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. అంటే స్త్రీ ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్'ను నాశనం చెయ్యాలి. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలి. కానీ అలా చెయ్యాలంటే ముందు వాటి మూలాలెక్కడున్నాయో తెలుసుకుని వాటి పూర్వాపరాలు  అర్థంచేసుకోవాలి. అందుకు స్త్రీల రచనల్ని చదవాలి, వాటిలోని స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్- పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందంటారు. స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ'కు కారణాలను స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు.

ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు 'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. అవన్నీ Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick, Simone de Beauvoir, Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరకపోవడం వల్ల చెప్పినదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది.

ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా రచయిత్రులకు  సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది రచయితలు స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీల రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది స్త్రీవాదాన్ని వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు. ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ వివక్ష లేదని అంటూ విపరీతమైన ఆశావహదృక్పథాన్ని అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం. ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక పితృస్వామ్య మూలాలుంటాయి. 

ఏదేమైనా "స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది" అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్'ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపజేస్తూ స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

తొలి ప్రచురణ : 1st జనవరి 2024

https://www.andhrajyothy.com/2024/editorial/her-stories-written-by-him-1189635.html

Wednesday, September 13, 2023

ఆంధ్రజ్యోతి "పలకరింపు"

ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకానుభవాన్ని పదిలపరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో... -- కె.ఎన్‌. మల్లీశ్వరి


1. సాహిత్య విమర్శ పరిధిని మీరెలా నిర్వచిస్తారు?

రచయిత వ్యక్తిగతాల జోలికి వెళ్ళ నంతవరకూ నిజానికి విమర్శకు ప్రత్యేకమైన పరిధులు, పరిమితులు అంటూ ఏవీ ఉండవలసిన అవసరం లేదు. పాఠకులు ఏదైనా రచనను తమ ఆలోచనా పరిధిలోకి తెచ్చుకుని తమ వైన ప్రత్యేకమైన సాహితీ విలువల తూకపురాళ్ళతో దాని నాణ్యతను నిర్ణ యిస్తారు. దేశ విదేశీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న పాఠకుల అభి ప్రాయాలను విమర్శగా భావించవచ్చు గానీ సాధారణ పాఠకుల సమీక్షనూ, అభిప్రాయాన్నీ విమర్శగా చూడడం సరికాదనుకుంటాను. ఇక ప్రొఫెషనల్‌ క్రిటిక్స్‌ చూపు కేవలం రచన ఉపరితలం వద్దే ఆగిపోకుండా మరికాస్త ముందుకెళ్ళి భాష, వ్యాకరణం, శిల్పం, భావం ఇలా నలుదిశలా ప్రసరిస్తూ రచన నాణ్యతను అంచనా వేస్తుంది. అటువంటి విమర్శకులు దొరికిన రచయితలు అదృష్టవంతులు. కానీ ప్రస్తుతం మనకు మొక్కుబడి సమీక్షలే ఉన్నాయి తప్ప నిక్కమైన విమర్శ లేదు. కమ్యూనిజం, మార్క్సిజం, మానవ పరిణామ క్రమం, చరిత్ర, గ్రీకు, రోమన్‌, భారతీయ పురాణాల వంటి విషయాల్లో కనీస ప్రాథమిక అవగాహన లేనివారు విమర్శకు పూనుకోకూడదనుకుంటాను.

2. ‘ప్రపంచ సాహిత్య వ్యాసాలు’ అన్న టాగ్‌లైన్‌తో వచ్చిన మీ తొలి పుస్తకం ‘ధీ’ కూర్పులో ఎటువంటి క్రమాన్ని పాటించారు?

‘ధీ’లో ముప్ఫై వ్యాసాలు సుమారు పదేళ్ళ కాలంలో వివిధ సమ యాల్లో బ్లాగులో, పత్రికల్లో రాసిన సుమారు మూడు వందల వ్యాసాల నుండి గ్రహించినవి. ప్రపంచ సాహిత్యం ప్రాతిపదికగా ఎంపిక చేసిన వ్యాసాలు కాబట్టి ఈ రచనలో భారతీయ సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు లేవు. మొదటి పుస్తకం కావడంతో- బాగున్నాయి అనిపించిన కొన్ని వ్యాసాల్ని ఎంపిక చేశామే కానీ ఒక క్రమం అంటూ ప్రత్యేకంగా ఏమీ పాటించలేదు. ‘కాగ్నిటివ్‌ రీడింగ్‌’ను ఇష్టపడే పాఠకురాలిని కాబట్టి సహజంగానే ఇందులోని వ్యాసాలు తర్కం, హేతుబద్ధతకు పనిపెడతాయి. ఈ కారణంగా మరీ పాఠం చెప్పినట్లు ఉండకుండానూ, అదే సమయంలో పాఠకుల మెదడు మీద వత్తిడి లేకుండానూ మధ్య మధ్యలో ఒక సరళమైన వాస్తవిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసం, వెనువెంటనే ఒక చిక్కనైన తర్కానికి సంబం ధించిన వ్యాసం వచ్చే పద్ధతిలో ఇందులోని వ్యాసాల్ని పొందుపరిచాము.

3. ప్రపంచ సాహిత్య విమర్శకి, తెలుగు సాహిత్య విమర్శకి మధ్య మీరు గ్రహించిన అంతరాలు?

సహజంగానే ప్రపంచ సాహిత్యం కాన్వాసు చాలా పెద్దది. నేను గమనించినంతలో తెలుగు సాహిత్య విమర్శలో భాషా సౌందర్యాలకు, పద గాంభీర్యాలకూ పెద్దపీట వేస్తారు. తెలుగు సాహిత్యంలో భాష, వ్యాకరణాల విషయంలో తీసుకునే శ్రద్ధ భావం విషయంలో కనబడదు. అదే సమయంలో ఇతర భారతీయ భాషల సాహిత్యంలో సైతం రచనలో సాంస్కృతిక అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగులో బహు అరుదుగా కనిపిస్తుంది. కథల్లోని పాత్రలను అన్ని అస్తిత్వ చిహ్నాలకూ దూరంగా మొండి గోడల్లా నిలబెట్టే ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఈ మధ్య అధికంగా కనబడుతోంది. మంచో, చెడో- మనిషికున్న చరిత్రను, సంస్కృతినీ, అన్ని అస్తిత్వ చిహ్నాలనూ సమూలంగా తుడిచేశాక ఇక చెప్పుకోడానికి మనకి కథలేం మిగులుతాయి! విమర్శకైనా ఆస్కారం ఏముంటుంది! ఇటువంటి రచనల మీద విమర్శ చెయ్యాలంటే భాష మీద పట్టు ఉంటే సరిపోతుంది. విమర్శకు వారికి ఇతరత్రా అర్హతలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. ఏదేమైనా మినహా యింపులు ఇక్కడ కూడా ఉన్నాయి. సింహభాగం తెలుగు సాహిత్యం గురించి మాత్రమే చెబుతున్నాను. అందువల్ల లోతులేని ఈ కాలపు సాహిత్యానికి తగ్గట్టే విమర్శ కూడా బలహీనంగానే ఉంటోంది. విమ ర్శకులు కూడా రచనల్లో ఏం చెప్పాలనుకున్నారు అన్నదాని కంటే భాషా ప్రావీణ్యం పైన మాత్రమే ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు అనిపిస్తుంది. రచనల్లో భాష, భావం విషయంలో ఇక్కడ సమతూకం శూన్యం.

4. మీ విమర్శని నడిపే చూపు గురించి చెప్పండి?

నావన్నీ పఠనానుభవాలే, విమర్శ అనుకోను. దానికి నేను ఎంచుకునే పుస్తకాలు కూడా కొంత కారణం. సద్విమర్శకు మరికొన్ని అదనపు అర్హతలు అవసరమవుతాయి. ఉదాహరణకు నేను ఏదైనా రచన చదువు తున్నప్పుడు నా దృష్టి రచయిత చెప్పాలనుకుంటున్న దేమిటో వినాలనే కుతూహలం దగ్గరే ఆగిపోతుంది. రచనలో శైలీ, శిల్పం వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ చదివే అలవాటు నాకు లేదు. చదువుతున్నప్పుడు ఆ రచన నన్ను ఆలోచింపజేసిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. మేధ విషయంలో విమర్శకులు రచయిత కంటే పై స్థాయిలో ఉండాలి. నేను చదివే రచయితల వద్ద నేనిప్పటికీ విద్యార్థినే.

5. వ్యాస నిర్మాణానికి భాషా పరంగా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు?

బాల్యంలో మూడు భాషలు సమాంతరంగా మాట్లాడే వాతావరణం నుండి వచ్చినదాన్నిగా నా భాషలో యాసతోబాటు కొన్ని సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు కూడా సహజంగానే వచ్చి చేరాయి. మా ముందు తరం వాళ్ళకు భిన్నంగా మా తరం వాడుక భాషలో అచ్చ తెలుగు అరుదుగానే కనిపిస్తుంది. వాడుక భాషలోనూ, రాయడంలోనూ కూడా విరివిగా ఆంగ్లపదాల వాడకం మా తరంలో చాలా సహజం. పదేళ్ళ క్రితం నా భాషలో ఆంగ్ల, హిందీ పదాలు అనేకం దొర్లేవి. కానీ తెలుగులో తరచూ రాయడం వల్ల క్రమేపీ ఆ అలవాటు తగ్గింది. ఇప్పుడా సమస్య లేదు. అనవసర వర్ణనలకు దూరంగా నా వ్యాసాల్లో సరళమైన భాషకు ప్రాముఖ్యతనిస్తాను.

ఇంటర్వ్యూ : కె.ఎన్‌. మల్లీశ్వరి

ప్రచురణ : ఆంధ్రజ్యోతి "పలకరింపు" - 28 ఆగస్ట్ 2023

https://www.andhrajyothy.com/2023/editorial/all-i-have-is-reading-experience-i-dont-think-of-criticism-1129015.html

Friday, July 21, 2023

ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!

బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ రచన "1984" పేరు వినగానే చాలామందికి  వెనువెంటనే గుర్తొచ్చేది అందులో ఆయన సృష్టించిన 'న్యూ స్పీక్' అనే పదమే. డిస్టోపియన్ సమాజాల్లో భాషను ఒక సమర్ధవంతమైన ఆయుధంగా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్వెల్ ముందుగానే హెచ్చరించారు. ఆర్వెల్ సృష్టించిన ప్రపంచంలోని ఫాసిస్టు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికీ, భ్రమలో ఉంచడానికీ వాడే ప్రత్యేకమైన భాషే 'న్యూ స్పీక్'.  ఉదాహరణకు ఆర్వెల్ కథలోని ప్రభుత్వం "క్రైమ్ థింక్" (స్వంతంగా ఆలోచించే తప్పు చెయ్యడం), "గుడ్ థింక్" (సంప్రదాయ ఆలోచనలు మాత్రమే చెయ్యడం) లాంటి కొత్త పదాల్ని తమ అజెండాలకు అనుకూలంగా సృష్టిస్తుంది. ఆ కాలంలోనే సాహిత్యంలో దీన్నొక గొప్ప ప్రయోగంగా చూడవచ్చు. నిరంకుశ పరిపాలనలో భాష ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో, ప్రజల్ని మోసపుచ్చే దిశగా దాన్ని ఆయుధంగా ఎలా వాడతారో వర్ణిస్తూ సంస్కృతిలో భాష యొక్క ప్రాథాన్యత అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని 'న్యూ స్పీక్' ద్వారా మరోసారి గుర్తుచేస్తారు ఆర్వెల్. భవిష్యత్తులో భాషను ఆయుధంగా వాడడం రాజకీయ, సామాజికాంశాల విషయంలోనే కాకుండా సాహితీరంగానికి కూడా పెనుప్రమాదంగా పరిణమిస్తుందని ఆర్వెల్ లాంటి వాళ్ళు బహుశా ముందే ఊహించి ఉండవచ్చు.

రచయితగా తాను నమ్మిన విలువలకు ఆర్వెల్ ఎంతగా కట్టుబడి ఉండేవారో తెలియాలంటే ఒక చిన్న సందర్భాన్ని గురించి చెప్పుకోవాలి. ఆర్వెల్ ఒక రచయితగా రచన కూర్పుపై ఎంత శ్రద్ధ పెట్టేవారో దాని సంపాదకీయం  విషయంలో కూడా అంతే పట్టుదలగా ఉండేవారట. తన స్వంత నవలలను ఎడిట్ చెయ్యడం పట్ల ఆర్వెల్ వైఖరి దీనికి ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ ప్రచురణ సంస్థ అధినేత Victor Gollancz తన రచనల్లో వేలుపెట్టడమే "A Clergyman’s Daughter" and "Keep the Aspidistra Flying" అనే రెండు నవలలు పాడైపోవడానికి కారణమని అంటారు ఆర్వెల్. తన రచనల్లో ఇతరుల ప్రమేయం పట్ల ఆర్వెల్ ఎంత మొండి వైఖరితో కూడిన విముఖత కనబర్చేవారంటే, చివరకు "అమెరికన్ బుక్ ఆఫ్ ది మంత్ క్లబ్" వారు "1984" ని ప్రచురించడానికి ‘The Principles of Newspeak’ appendix and the lengthy essay on Oligarchical Collectivism' ని పుస్తకంలోంచి తీసేస్తే తప్ప కుదరదంటే, ఆ ప్రతిపాదనని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఆయన కోల్పోయినదెంతో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్షరాలా ఆ కాలంలో నలభై వేల పౌండ్ల అమెరికన్ సేల్స్. ఆయన తన ఏజెంట్ తో "పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడా కోసుకుంటూపోతే నవల స్ట్రక్చర్ (నిర్మాణం) దెబ్బతింటుంది కాబట్టి కుదరదని అన్నారట. "ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీకి" ఇదొక మచ్చుతునక. ఏదేమైనా అది ఆర్వెల్ జీవించి ఉన్న సమయం కాబట్టి ఆయన తన రచనను సంపాదకీయాల నుండి కాపాడుకోగలిగారు. మరి ప్రస్తుతం జీవించిలేని రచయితలకు తమ కళను కాపాడుకునే అవకాశం ఉందా ? 

తరాలు మారుతున్నా, అప్పుడూ ఇప్పుడూ కూడా పాలనా వ్యవస్థకు ప్రతిబంధకాలుగా, ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్న సాహిత్యాన్ని బహిష్కరించడం పరిపాటే. నేడు అందరికీ సుపరిచితమైన క్లాసిక్స్ లో To Kill a Mockingbird (Harper Lee), The Handmaid’s Tale (Margaret Atwood), Of Mice and Men (John Steinbeck), Brave New World (Aldous Huxley), The Catcher in the Rye (J.D.Salinger) వంటివన్నీ ఒకప్పుడు బ్యాన్ చేసిన పుస్తకాలే. ఈ జాబితా చెప్పుకుంటూ వెళ్తే బహిష్కరణకు గురైన పుస్తకాలు కోకొల్లలు. కానీ నేడు అదే  బహిష్కరణ అందరికీ ఆమోదయోగ్యంగా (?) ఆధునికమైన రూపుదాలుస్తోంది.  టెక్స్ట్ ను అర్థం చేసుకోడానికి ఫ్రెంచ్ తత్వవేత్త జాక్వెస్ డెఱిడా ప్రతిపాదించిన "డీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్" ను పాఠకుల బదులుగా సంపాదకులు వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాహిత్యంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగానూ, అనుకూలంగానూ  లేని ప్రతీ పదాన్నీ మరో ఆలోచన లేకుండా తీసివెయ్యడం, దాని స్థానాన్ని తమకనుకూలమైన పదాలతో భర్తీ చెయ్యడం జరుగుతోంది.

ఈ పునఃనిర్మాణానికి అంకురార్పణగా మూలాలను పెకలిస్తూ ఈ మార్పులు బాలసాహిత్యంతో మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పఫిన్ బుక్స్ వారు బ్రిటిష్ రచయిత రోల్ డాల్ పుస్తకాలపై సెన్సార్షిప్ వేటు వేశారు. సాహితీవేత్తగా ఆయన లెగసీలో భాగమైన "చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ", "మెటిల్డా" వంటి రచనల్లో ఫాట్, అగ్లీ , మ్యాడ్ వంటి పదాలు సున్నితత్వానికి సుదూరంగా బాడీ షేమింగ్ ని ప్రోత్సహిస్తూ, అవమానకరంగానూ, వివక్షలకు దారితీసేవిగానూ ఉన్నాయనేది వారి వాదన. ఇదిలా ఉండగా రోల్ డాల్ తో బాటు బాలసాహిత్యంలో దిగ్గజాలైన ఎనిడ్ బ్లైటన్, డాక్టర్ సూస్, రుడ్యార్డ్ కిప్లింగ్ ల రచనలు సైతం జాతి వివక్షలనూ, లింగవివక్షలనూ ప్రోత్సహించే భావజాలాల్నీ, భాషనూ కలిగి ఉన్నాయని సెన్సార్షిప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అగాథా క్రిస్టీ రచనలపై కూడా ఇటువంటి ఆరోపణలే  వచ్చిన నేపథ్యంలో ఆమె మునిమనుమడు పత్రికాముఖంగా "క్రిస్టీకి ఎవరినీ అఫెండ్ ఉద్దేశ్యం లేదని" అన్నారట. భవిష్యత్తులో వీరందరి రచనల్లో ఉపయోగించిన పదాలనూ, భాషనూ మార్చి సమూలమైన మార్పులు చెయ్యాలనే ప్రతిపాదనలు వినబడుతున్నాయి.

ఈ చర్యలు సల్మాన్ రష్దీ, జూడీ బ్లూమ్ వంటి పలువురు సాహితీవేత్తల ఘాటు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. బంగ్లాదేశ్, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి వెనుకబడిన దేశాలే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కళాకారుడి స్వేచ్ఛకు పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. అకడమిక్ పుస్తకాల్లో సవరణలు చేసినట్లే సాహిత్యాన్ని కూడా నేటి సామజిక చట్రాల్లో ఇమిడ్చే యత్నాలు ఎటువంటి జీవ వైవిధ్యాన్నీ సహించలేని ప్రస్తుత సమాజపు అసహనానికి పరాకాష్ట. అందునా రచయితలు జీవించిలేని సమయంలో వారి రచనల్లో ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చెయ్యడం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి, వారి ప్రైవసీకి భంగం కలిగించడమే. పరిశీలిస్తే ఇది సమస్యలో ఒక పార్శ్వం మాత్రమే.

విజేతలు నిజాన్ని తమకనుగుణంగా వక్రీకరించే అవకాశం పుష్కలంగా ఉన్న చరిత్రలోని ప్రామాణికత ఎప్పటికీ అనుమానాస్పదమే. తులనాత్మకంగా చూస్తే, దీనికి భిన్నంగా ప్రతీ మనిషి యొక్క వ్యక్తిగత అనుభవాలకూ గళాన్నిచ్చే సాహిత్యంలో ఆ అవకాశం కాస్త తక్కువని చెప్పచ్చు. కళను కళాకారుడి యొక్క "స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన వ్యక్తీకరణగా" భావిస్తే ప్రతీ కళాకారుడి కళలోనూ ఆ కాలమాన పరిస్థితులకనుగుణంగా ఆ వ్యక్తి యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్న పలు సాంస్కృతిక, రాజకీయ, సామాజికాంశాలు అనేకం కనిపిస్తాయి. ఈ కారణంగా ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ కాలపు సంస్కృతిని ప్రతిబింబించే జీవన విధానాలూ, వేష భాషలూ, వివక్షలూ మొదలైనవి అనేకం గమనిస్తాం. నిజానికి సాహిత్యం యొక్క పరమావధి అదే కదా ! ప్రపంచంలో ఏ మారుమూలో, మరో కాలంలో జన్మించిన మనిషిలో పరకాయ ప్రవేశం చేసి అతడి కళ్ళతో ఆనాటి ప్రపంచాన్ని పరికించడం.

ఈ తరం పాఠకులకూ, సంస్కృతికీ అనుకూలంగా ప్రాచీన సాహిత్యంలో  భాషాపరమైన మార్పులు చెయ్యడంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ఈ చర్య ద్వారా మరణించిన కళాకారుణ్ణి అగౌరవపరచడమైతే రెండోది ఆ రచయిత అస్తిత్వాన్ని చెరిపేసే లేదా మార్చేసే ప్రయత్నానికి పూనుకోవడం. మంచో,చెడో ఏ కాలపు రచయితల భావజాలాలకైనా ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలనుబట్టి సందర్భానుసారంగా ఒక చారిత్రక నేపథ్యం అంటూ ఉండి తీరుతుంది. సంపాదకుడు తనకు నచ్చని పదాలనన్నిటినీ  ఎఱ్ఱని ఇంకుతో యథేచ్ఛగా కొట్టేసుకుంటూ పోతే ఇక ఆ రచనలో ఏ విధమైన ప్రామాణికతా మిగిలుండే అవకాశం లేదు. అంతేకాకుండా ఒక రచనను పునఃవిశ్లేషించే సంపాదకుల వ్యక్తిగత భావజాలాలు కూడా రచనపై ప్రభావం చూపిస్తాయనేది విస్మరించలేని విషయం. సాహిత్యంలో "బైగోటెడ్ వ్యూస్", "బైగోటెడ్ లాంగ్వేజ్" పేరిట ఆ కాలంలోని మతవిశ్వాసాలనూ, మూఢ భావజాలాలనూ, వివక్షలనూ ఈ కాలానికి తగ్గట్టు చెరుపుకుంటూనో, మార్చుకుంటూనో పోతే ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలూ, వేషభాషలూ, వివక్షల గురించి ఈ తరానికి తెలిసే అవకాశం మృగ్యమైపోతుంది. ఇది మనిషి కులమత జాతి వివక్షలను ఎన్నిటిని దాటుకుని ఈరోజు నాగరికమైన మనిషిగా నిలబడ్డాడో తెలిసే అవకాశం మన ముందు తరాలకు లేకుండా చెయ్యడమే.

ఆర్వెల్ 'The Prevention of Literature' అనే వ్యాసంలో భవిష్యత్తులో వ్యక్తిగత అనుభవాలూ, భావోద్వేగాలూ, నిజాయితీతో కూడిన పరిశీలనలూ లేని డొల్లతనంతో కూడిన కొత్త రకం సాహిత్యం పుడుతుందనీ, లిబరల్ సంస్కృతి అంతరించడంతో పాటే సాహిత్యం కూడా తుది శ్వాస విడుస్తుందని జోస్యం చెప్పడం సమకాలీన సాహితీ ప్రపంచపు విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే నిజమేననిపిస్తుంది. ఆ నిరంకుశత్వం నీడల్లో మెటాఫోర్ల ముసుగుల్ని ఆసరా చేసుకుని కవిత్వం కొంతవరకూ నిలదొక్కుకోగలుగుతుందేమో గానీ హేతువాదం పునాదుల మీద నిలబడే వచన రచన మాత్రం అంతరించిపోతుందంటారాయన. నిరంకుశ సంస్కృతిలో వచన రచన చేసే రచయితకి అయితే నిశ్శబ్దమూ లేదా మృత్యువూ తప్ప మధ్యే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పిన ఆర్వెల్ జోస్యాన్ని జీవించిలేని రచయితల యొక్క రచనల రూపంలో మిగిలిన అస్తిత్వాన్ని సమాధుల్లోంచి తవ్వితీసి మరీ పోస్ట్మార్టం చేస్తున్న నేటి ప్రచురణ సంస్థలూ, సంపాదకీయాలూ నిజమేనని నిరూపిస్తున్నాయి.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' : 17 జులై 2023

https://www.andhrajyothy.com/2023/editorial/orwells-prophecy-is-coming-true-1104593.html?fbclid=IwAR0qh_-4gDhI7xP-a85PGB3k7npmpAeBj0L9S5CkB7RSvK_2xiPChwfJiZc

Monday, February 20, 2023

Novelist as a Vocation - Haruki Murakami

కొత్త రచయితలకు మాత్రమే ఇచ్చే అకుతాగవా ప్రైజుకు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి "used goods" అని ముద్ర వేయించుకున్నా, స్వదేశంలోనే సాహితీ ప్రపంచం మొత్తం ఏకమై ఆయన రచనలు సాహితీ విలువలకు సుదూరమైనవంటూ తూర్పారబట్టినా, "ఆకుతాగవా ప్రైజు గెలుచుకోడంలో మురాకమీ వైఫల్యానికి కారణాలు" వంటి ఛీసీ పేర్లతో కొందరు విమర్శకులు పుస్తకాలు రాసి పరిహసించినా ప్రఖ్యాత జపాన్ రచయిత హరుకి మురాకమీ మాత్రం తాను చెయ్యాలనుకున్నదే చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన పంథాలోనే రచనావ్యాసంగాన్ని కొనసాగించి బెస్ట్ సెల్లర్స్ రాసే నవలాకారుడిగా సొంత గడ్డైన జపాన్లోనే కాక అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించారు. ప్రతీ తరంలోనూ సాహితీ విలువల కొలమానాల్లో తూగగలిగిన రచనలు కొన్నైతే, ఆ నిర్ణీత కొలమానాలకు దూరంగా జనాదరణ పొందిన సాహిత్యంగా పాఠకుల అభిమానాన్ని చూరగొనేవి మరికొన్ని. తెలుగులో యద్దనపూడీ, ఆంగ్లంలో జేన్ ఆస్టెన్ వంటివారు అటువంటి రచనలే చేసి పాఠకుల మనసుల్లో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. మురాకమీ రచనలు కూడా అటువంటి కోవకే చెందుతాయి.  

Image Courtesy Google

మురాకమీ జపాన్ లోని క్యోటోలో మొదలై న్యూయార్క్ టైమ్స్ వరకూ సాగిన తన సాహితీ ప్రయాణాన్ని గురించి "Novelist as a Vocation" పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. కానీ ఒక స్థాయికి చేరుకున్నాకా వర్ధమాన రచయితలకు రాయడం విషయంలో సూచనలిచ్చే చాలామంది రచయితల్లా మురాకమీ ఈ పుస్తకంలో నవలలు ఎలా రాయాలో, ఎలా రాయకూడదో చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఒక నవలాకారునిగా ఆయన వ్యక్తిగత అనుభవాల సమాహారంగా రాసిన ఈ వ్యాసాలు యువ రచయితలకు దిశానిర్దేశం చేసే గైడ్ లా కంటే ఆయన రచయితగా ఎదిగే క్రమంలో ఎదుర్కున్న ఆటుపోట్లనూ, అనుభవాలను గురించే ఎక్కువ చెబుతాయి.

ఏ రంగంలో నైనా ఒక పోతపోసినట్లుండే శైలికి భిన్నంగా ఏది కనిపించినా ముందు తిరస్కారంతో కూడిన విమర్శలు వెల్లువెత్తడం సహజమే. సాహిత్యం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నిజానికి ఈ పోకడలూ ఈనాటివి కాదు. చిత్రకళా రంగంలో విన్సెన్ట్ వాన్ గో, క్యూబిజం శైలికి ఆద్యుడైన పాబ్లో పికాసో వంటి దిగ్గజాల పెయింటింగ్స్ ని తొలిసారిగా చూసిన కళాప్రియులు కూడా అప్పట్లో విస్తుపోయి పెదవి విరిచారంటారు. అదే విధంగా ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, Natsume Sōseki వంటివారి రచనలు నేడు నీరాజనాలందుకుంటున్నప్పటికీ, వారు కూడా తమ సమకాలీనులనుండి నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కున్నారు. అలనాటి సాంస్కృతిక మేథోవర్గం తీవ్రంగా విమర్శించిన వారి రచనలు నేడు ప్రామాణికమైనవిగా నిలబడడంలో ఎంతమాత్రమూ ఆశ్చర్యం లేదు. మురాకమీ కూడా తన రచనలు కాలగతికి ఎదురీది నిలబడతాయో లేదో భవిష్యత్తులో తన పాఠకులే చెప్పాలంటారు.

మురాకమీ రచయితగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్ళలో సాహితీ వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. "దీన్ని నవల అనలేం" అని కొందరూ, "ఇది సాహిత్యం కాదని" మరికొందరూ ఆయన రచనల్ని తరచూ  విమర్శించేవారు. కథలూ, నవలికలూ రాయడంలో కూడా తనదైన ప్రత్యేకమైన ముద్రను వేసినప్పటికీ ఎక్కువ నిడివి ఉన్న పెద్ద నవలలు రాయడాన్ని తన ప్రత్యేకతగా చెప్పుకుంటూనే, ఏ రచయితకైనా తానొక కళాకారుణ్ణని చెప్పుకోకపోవడం మనసుమీద నుండి పెద్ద గుదిబండ దింపుకోవడంతో సమానమంటారు. నిజానికి తానొక "ఆర్టిస్టుని" అనుకోకపోవడం వల్ల రచయితలపై వత్తిడి ఉండదు. ముఖ్యంగా రచయితలు తాము రచయితలని భావించుకోకపోవడంలో ఒకవిధమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచం వాళ్ళనెలా చూస్తుందనే దానితో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా కావాలంటే అలా చేసే స్వాతంత్య్రం ఉంటుంది. ఇటువంటి స్వేచ్ఛ సృజనాత్మకతలో కీలక పాత్ర పోషిస్తుంది. "వ్యవస్థ తన మార్గంలో తాను వెళ్తుంది, నేను నా మార్గంలో నా పని చేసుకుంటాను." అని ఆత్మవిశ్వాసంతో అనగలిగే మురాకమీ, ఎవరికీ జవాబుదారీ లేని విధంగా తనకు వీలైన షెడ్యూల్స్ ని బట్టి నచ్చినట్లు రాసుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండడం ఒక రచయితకు మిక్కిలి అవసరమంటారు.

"నవలలు రాయడమంటే నిజానికి నీ గురించి నీవు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పుకోవడం లాంటిదే. అందువల్ల ఒక రచయితగా రాయడం గురించి మాట్లాడడమంటే, నీ గురించి నువ్వు మాట్లాడడమే." అంటూ మురాకమీ ఒకవేళ తానొక రచయిత గనక కాకపోయుంటే తన ఉనికిని గుర్తించే ప్రత్యేకతలు తనలో ఏమీ లేవని అంటారు. భాష మీద పట్టూ, సృజనాత్మకత మినహా నవలాకారులవ్వడానికి ఎవరికైనా ప్రత్యేకార్హతలేవీ అవసరం లేదు కానీ మురాకమీ పరిశీలనలో బాగా తెలివైనవాళ్ళు నవలాకారులు కాలేరు. కొంత విద్య, కాసిన్ని తెలివితేటలూ, విభిన్న విషయాలపై అంతో ఇంతో జ్ఞానం రచయిత కావడానికి అవసరమే అయినా "నువ్వు తెలివైన వాడిననుకుంటున్నావా ?" అని ఎవరైనా అడిగితే, అవునని ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడానికి కష్టపడతానంటారాయన. "మీరొక ఊరిలో నడుస్తూ వెళ్తుంటే, నాలాంటి సాధారణ వ్యక్తులు మీకు అడుగడుక్కీ తారసపడతారు. వీళ్ళు నలుగురిలో ప్రత్యేకంగా నిలబడే వ్యక్తులు కాదు, తెలవారుతుండగా కాకా హోటళ్ళలో పరమ అశుభ్రంగా ఉండే టేబుల్స్ దగ్గర టీ తాగుతూ కూర్చునే మామూలు మనుషులు. ఒకవేళ నేను నవలలు రాయకపోయి ఉంటే బహుశా నా ఉనికిని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు." అనడం ఆయనలో ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే తత్వానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

కొంతమంది నవలాకారులు పత్రికల వాళ్ళో, ప్రచురణ సంస్థలో రాయమని కోరితే రాస్తారు. ఇది చాలామంది ప్రొఫెషనల్ రైటర్స్ సహజంగా చేసేదే. కానీ మురాకమీ ఒక పూర్తి స్థాయి రచయితగా నిలదొక్కుకునే వరకూ ఆ విధంగా రాయలేదని అంటారు. బహుశా ఆయనలాంటి వాళ్ళు ఈ  కాలంలో అరుదు కావచ్చు. బాల్యంలో అన్ని రకాల పుస్తకాలూ చదివినప్పటికీ ప్రత్యేకం రష్యన్ అనువాదాలంటే ప్రీతిగా ఉండేదని చెప్పుకునే మురాకమీ, తనకు ఆధునిక జాపనీస్ సాహిత్యం (సీరియస్ వెరైటీ) పట్ల ఎటువంటి అవగాహనా లేదని చెప్పడం గమనార్హం. నిజానికి మురాకమీ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో జాపనీస్ సాహిత్యం అంటే కావబాతా, తనిజాకి, మిషిమా వంటి వారి పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఈ రచనలు కూడా నిర్ణీత మేథోవర్గానికి చెందినవి కావడంతో వాటిని చదివే పాఠకవర్గం కూడా మితంగానే ఉండేది. అటువంటి సమయంలో సాధారణ పాఠకులు సైతం తమను తాము సులభంగా గుర్తుపట్టుకోగల పాత్రల రూపకల్పన చేసిన మురాకమీ వినూత్నమైన శైలి జపాన్ సాహిత్యంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

సమకాలీన జాపనీస్ సాహిత్యం చదవనందువల్ల తాను నవలలు రాయడం మొదలుపెట్టే సమయానికి జపాన్లో ఎటువంటి పుస్తకాలు రాసేవారో, ఎటువంటి సాహిత్యాన్ని జనం ఎక్కువగా ఆదరించేవారో తనకు తెలీదంటారు మురాకమీ. బహుశా ఈ అవగాహనాలేమే పొంతనలూ, పోటీతత్వాలకు దూరంగా నవలాకారుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన శైలిని తయారుచేసుకోవడంలో మార్గం సుగమం చేసిందనిపిస్తుంది. అందుకే, "నా వరకూ నేను ఇలా మాత్రమే రాయగలను, అందుకే అదే చేస్తాను." అంటారాయన. ప్రశంసలూ, విమర్శలకతీతంగా, వాస్తవానికి ఏ రచయితకైనా అనుకరణలకు దూరంగా తనదైన ప్రత్యేకమైన శైలీ ఉండడం ఎంతో అవసరమని ఒడిదుడుకుల మురాకమీ సాహితీ ప్రయాణం నిరూపిస్తుంది. ఈ విషయాలన్నీ పంచుకుంటున్నా మురాకమీ "నవలలు అంటే ఇలాగే రాయాలి" అని ఎక్కడా చెప్పిన దాఖలాల్లేవు. నిజమే కదా ! మనమో వందమంది నవలాకారుల్ని తీసుకుంటే, వందమంది వంద రకాలుగా రాయడం గమనిస్తాం.

ఫిక్షన్ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో మురాకమీ శైలిపై విమర్శలు ఏ స్థాయిలో వెల్లువెత్తేవంటే, చివరకు ఒక ప్రఖ్యాత విమర్శకుడు ఆయన్ని "కాన్ మాన్" అని అవమానించారట. అయినప్పటికీ దాన్ని కూడా మెచ్చుకోలుగానే తీసుకుంటానంటారు మురాకమీ. ఒక నవలాకారుడిగా పాఠకులకు కట్టు కథలు చెప్పి మభ్యపెట్టడాన్ని మించిన బాధ్యత మరొకటుంటుందా అన్నది ఆయన వాదన. అదే సమయంలో ఎంత సానుకూల ధోరణి అవలంబించినా ఇటువంటి  విమర్శలు చేదు మాత్రల్లా నిరుత్సాహపరుస్తాయి. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే పోలిష్ రచయిత హెర్బర్ట్ అన్నట్లు, "నీ లక్ష్యాన్ని చేరాలంటే ప్రవాహానికి ఎదురీదాలి. కేవలం చెత్త మాత్రమే ప్రవాహంతో బాటు వెళ్తుంది" అన్న మాటలు నిరాశ అలుముకున్న సందర్భాల్లో తన మీద ఎంతో ప్రభావం చూపించాయని చెప్పే మురాకమీ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక  నవలలు రాయడానికి విదేశాల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సంప్రదాయతకు పెద్ద పీట వేసే అనేక ఆసియా దేశాల్లాగానే జపాన్ లో కూడా అధిక శాతం జనాభాకు ప్రవాహానికి ఎదురీదే వాళ్ళంటే ద్వేషం ఉంటుందంటారు. ఈ కారణంగా జపాన్ లాంటి దేశాల్లో సాంస్కృతికపరమైన భారాన్ని మోస్తూ ముందుకు అడుగు వెయ్యడం కళాకారులకు పెనుసవాలుగా ఉండేది.

ఫిక్షన్ విషయంలోనే కాక నాన్ ఫిక్షన్ రాయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మురాకమీకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తన రచనలకు భిన్నంగా "టోక్యో సబ్వే గ్యాస్ ఎటాక్" నేపథ్యంలో "అండర్ గ్రౌండ్" ని ప్రచురించినప్పుడు ప్రొఫెషనల్ నాన్ ఫిక్షన్ రచయితల తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారాయన : “a display of ignorance of the basic rules of nonfiction”; “a tearjerker of the first order”; “the work of a dilettante.” లాంటి విమర్శనాస్త్రాలెన్నో.  "నిజానికి నాకు నాన్ ఫిక్షన్ రాసే ఉద్దేశ్యం లేదు. ఏ జానర్ నియమాలకూ లోబడని రచన చేద్దామని ప్రయత్నించాను. కానీ ఈ క్రమంలో 'నాన్ ఫిక్షన్ పవిత్ర స్థలాన్ని' పరిరక్షించే పులుల తోకల మీద తెలీకుండానే కాలేసి వాళ్ళకి కోపం తెప్పించానని" చిరునవ్వు నవ్వుతారాయన. కారణాలేవైనా ఒక రంగంలో నిష్ణాతులు ఆ రంగంలో కొత్తగా వచ్చినవారి పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సహజమే. ఆ అథారిటీ ఎంత శక్తిమంతంగా ఉంటే కొత్తవారిపై వ్యతిరేకత కూడా అంతే తీవ్రంగా ఉంటుంది.

కొన్ని వ్యాసాల్లో మనుషుల్నీ, మనస్తత్వాల్నీ చదవడంలో మురాకమీకి సహజంగా అబ్బిన నైపుణ్యం ఆయనపై వచ్చే విమర్శలకు సహేతుకమైన కారణాలు విశ్లేషించడంలోనూ కనిపిస్తుంది. ఆయన రచనలపై సదభిప్రాయం లేని వారి గురించి రాస్తూ, "నిజానికి చాలామంది విమర్శకులు రచనల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు, ఒకవేళ ఏదైనా నవలో, కథో అర్థమైనా దాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించడం వారికి చేత కాదు. సాధారణంగా ఇటువంటి విమర్శకుడు నవలాకారుడి కంటే చాలా తెలివైన వాడు, అతి వేగంగా పనిచేసే అతడి మెదడు మెల్లగా నడిచే వాహనమైన నవల వేగానికి సర్దుకోలేదు. ఈ కారణంగా వారు ఆ నవల మొత్తం వచనాన్ని తమ వేగానికి తగ్గట్లు చిన్న సారాంశంగా కుదించి అనువదించుకుని, దాన్ని బట్టే విమర్శను చేస్తారు. ఈ క్రమంలో నవలకు ప్రాణంపోసే ప్రాముఖ్యత కలిగిన వివరాలనూ, చిన్న చిన్న సంగతులనూ వదిలేస్తారు." అని చెప్పడంలో విమర్శకులే కాదు, పాఠకులు కూడా ఒక నవలను ఓపిగ్గా ఎలా చదవాలో, ఎలా చదవకూడదో చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. అందులోనూ నవలా ప్రక్రియ మెల్లిగా అంతరించిపోతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఆధునిక తరానికి ఈ సలహా అనుభూతి చెందడంలో వేగాన్ని తగ్గించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

మురాకమీ ఒక సందర్భంలో నవల రాయడాన్ని ఒంటరి ప్రయాణంతో పోలిస్తే మరోచోట  నవలాకారుడిగా మారే విధానాన్ని రెజ్లింగ్ రింగ్ లోకి ప్రవేశించడంతో పోలుస్తారు. ఆయన ఉద్దేశ్యంలో : "నవలదేముంది !! ఎవరైనా రాయగలరు." ఇలా అనడంలో ఆయనకు నవల రాయడాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపించదు. ఆయన దృష్టిలో అదొక పొగడ్త. తీవ్రమైన కృషీ, సాధనా అవసరమైన అనేక కళారూపాల కంటే ఇది సులభమని ఆయన భావన. అర్హతలూ, సర్టిఫికెట్లతో సంబంధం లేని నవలాకారుల ప్రపంచం ధైర్యంగా బరిలోకి దిగి కుస్తీకి సిద్ధపడ్డ ఎవరినైనా స్వాగతించే ప్రొఫెషనల్ రెజ్లింగ్ రింగ్ లాంటిది. ఆ రెస్లింగ్ రింగ్ చుట్టూ ఉండే తాళ్ళ మధ్య అంతరం ఎవరైనా అందులో ప్రవేశించడానికి అనువైనంత వెడల్పుగా ఉంటుంది. ఆ రింగ్ లోపలి వైశాల్యం కూడా ఎక్కువే. ఇక ఎవరినైనా అందులో ప్రవేశించకుండా ఆపడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉండరు, లోపల రిఫరీ బయటకి పొమ్మని మీ మీద అరవడు. అప్పటికే రింగ్ లోపల ఉన్న రెజ్లర్స్, అంటే ప్రసిద్ధ నవలాకారులు, "రావోయ్, సరదాగా ఒక పట్టు పడదాం"  అని మిమ్మల్ని కూడా రింగ్ లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. The ring is—how shall I put this?—an airy, easy, accommodating, altogether laid-back environment." అంటారు మురాకమీ. కానీ కంటికి కనిపించిన ఏ విషయంపైనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసేవాళ్ళు నవలాకారులుగా రాణించే అవకాశం తక్కువన్నది మురాకమీ భావన. అటువంటి వాళ్ళు రచయితలుగా కంటే పాత్రికేయులుగా, విమర్శకులుగా బాగా పనికొస్తారంటారు.

మురాకమీ తన వ్యాసాల్లో అనేక అంశాలను చర్చించగా, ముఖ్యంగా సాహితీ పురస్కారాల గురించీ, రచయితల శారీరక, మానసిక ఆరోగ్యం గురించీ విశ్లేషించిన అంశాలు పాఠకుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆయన అవార్డుల గురించి రాసిన వ్యాసంలో, ఎన్ని బెస్ట్ సెల్లర్స్ రాసినప్పటికీ సాహితీ విలువలు లేవంటూ మేథోవర్గం చేసిన విమర్శల కారణంగా తన రచనల్ని సాహితీ పురస్కారాలు వరించకపోవటం పట్ల మురాకమీలో కాస్త నిరాశతో కూడిన కోపం ఉన్నట్లు కనిపిస్తుంది. మురాకమీ కోవలోనే పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న పలు రచనలు చేసిన అమెరికన్-బ్రిటిష్ రచయిత రేమండ్ చాండ్లెర్ సైతం ఒక సందర్భంలో తనకు నోబెల్ బహుమతి రావకపోవడం పట్ల స్పందిస్తూ అప్పటికే నోబెల్ ను అనేకమంది సెకండ్ రేట్ రచయితలకి ఇచ్చిన కారణంగా దానికి వెలువ లేదనీ, అయినా ఆ ప్రైజు తీసుకోడానికి హుందాగా డ్రెస్ చేసుకుని, ప్రసంగం తయారుచేసుకుని మరీ స్వీడన్ వరకూ వెళ్ళేంత విలువ నోబెల్ కి లేదనీ వ్యంగ్యాస్త్రాలు విసిరారంటారు.

సాహితీ రంగంలో తన వ్యక్తిగతానుభవాల్ని ఒక్కొక్కటిగా విప్పి చెబుతూ "ఆర్టిస్టు" ల చుట్టూ ఉండే అనేక భ్రమల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు మురాకమీ. రచయితల్ని అందర్నీ ఒకే గాటన కట్టెయ్యకపోయినా, చాలా మంది నవలాకారులు నిజాయితీ, స్నేహపూర్వక స్వభావం కలిగిన వాళ్ళు కాదనీ, అందరూ అనుకున్నట్లు మంచి స్ఫూర్తినిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే వాళ్ళూ అంతకంటే కాదనీ అంటారు. మురాకమీ మాటల్లోనే చూస్తే  రచయితలు సహజంగా విపరీత స్వభావాలతో, విచిత్రమైన జీవన విధానాలతో, భిన్నమైన ప్రవర్తనలతో ఉంటారన్నది నిజమే అయినప్పటికే, "నా లెక్క ప్రకారం నాతో కలిపి 92% మంది రచయితలు మిగతా రచయితలందరూ తప్పు, నా దారే సరైన దారనే అప్రకటితమైన ఊహతో ఉంటారని" ఈ విమర్శలో సైతం తనను మినహాయించుకోకపోవడమే ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది.

మురాకమీ నవలలు ఎలా రాయాలో చెప్పకపోయినా, రచయితలు దీర్ఘకాలం పాటు రచనావ్యాసంగంలో కొనసాగడానికి మాత్రం వారి శారీరక,మానసికారోగ్యాల పై దృష్టి పెట్టడం చాలా అవసరమని పదేపదే సూచిస్తారు. రచయితలు  గంటల తరబడి కదలకుండా రాయడంలో నిమగ్నమైనప్పుడు క్రమేపీ వయసు పెరిగే కొద్దీ వారి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలుపెడుతుంది. దీనికి తోడు ఆర్టిస్టులందరూ క్రమశిక్షణ లేని జీవితాలు మాత్రమే గడుపుతారని వారి జీవన విధానాన్ని రొమాంటిసైజ్ చేస్తూ కనిపించే అనేక సాక్ష్యాలూ, ఊహాగానాలను సవాలు చేస్తూ తన దైనందిన జీవన విధానం గురించి కొన్ని విషయాలను పంచుకుంటారు. ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ, క్రమం తప్పకుండా రోజూ జాగింగ్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, ఖచ్చితమైన వేళలకు నిద్రపోయే తన జీవన విధానాన్ని గురించి పాఠకులకు తెలిస్తే ఒక రైటర్ గా తనను రొమాంటిసైజ్ చెయ్యడం మానేస్తారేమో అని హాస్యమాడతారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత ఆంథోనీ ట్రోల్లోప్ విషయంలో ఇటువంటిదే జరిగింది. మరణానంతరం ట్రోల్లోప్ క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి అంతవరకూ తెలియని వివరాలు తెలుసుకున్న యావత్ పాఠకలోకం నివ్వెరపోయిందట. మొజార్ట్, షూబర్ట్, పుష్కిన్, రిమ్బాడ్ , వాన్ గో వంటి ప్రాడిజీల మార్గంలో తక్కువకాలంలో ఒక వెలుగు వెలిగి నిష్క్రమించే ఉద్దేశ్యం ఉంటే తప్ప నవలాకారుడిగా సుదీర్ఘకాలంపాటు కొనసాగే ఉద్దేశ్యం ఉంటే మాత్రం పైన చెప్పిన సూచనలు పాటించడం తప్పనిసరంటారు మురాకమీ. నిజానికి ఒకటో రెండో నవలలు రాయడం కష్టమేమీ కాదు. కానీ అలా రాస్తూనే ఉండడం, రాయడాన్ని జీవనోపాధిగా మార్చుకోవడమే తన అనుభవంలో అత్యంత కష్టంతో కూడుకున్నపని అంటారు మురాకమీ. నలభై ఏళ్ళుగా ప్రొఫెషనల్ రచయితగా అనేక రచనలు చేసిన మురాకమీ ఈ హెర్క్యూలియన్ టాస్క్ ని సమర్ధవంతంగా పూర్తి చేసి యువ రచయితలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' 20 ఫిబ్రవరి 2023. 

https://www.andhrajyothy.com/2023/editorial/extremely-professional-1014523.html?fbclid=IwAR0igKR6Pk60WCgAzQrKdY0vVd_PodxrxOM-kUI4fHalVzOITE6FWriUi_c

విత్ లాగిన్ : https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=20/02/2023&pgid=365447

Monday, November 28, 2022

ముఖంపై మారే ముసుగులు చెప్పిన కథలు - లూగీ పిరాండెల్లో

"జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ పాత్రను నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే వేదికపై నువ్విక లేనట్లే" అనే ఇటాలియన్ రచయిత లూగీ పిరాండెల్లోను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించదు. ఆధునిక యుగంలో రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనిషికి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ సరికొత్తగా నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఆ కాలంలో కవులూ, రచయితలూ చేసిన సింహభాగం రచనల్లో ఈ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుంది. అటువంటి ఆధునిక యుగపు రచయితల్లో హెన్రిక్ ఇబ్సెన్, జార్జ్ బెర్నార్డ్ షా, శామ్యూల్ బెకెట్ వంటి వారికి సమకాలీనులైన నోబెల్ గ్రహీత లూగీ పిరాండెల్లో (1867-1936) కూడా ఒకరు. ఇబ్సెన్ సామజిక సమస్యల నేపథ్యంలో వాస్తవికతతో కూడిన రచనలు చేస్తే, బెకెట్ మనిషిలోని నిరాశా నిస్పృహలతో కూడిన సాంఘికమైన వేర్పాటుతనాన్నీ, సామజిక పరాయీకరణనీ ఆధారంగా చేసుకుని అసంబద్ధమైన అంశాలతో కూడిన రచనలు చేశారు, వీరిరువురికీ భిన్నంగా పిరాండెల్లో రచనలు మానసిక విశ్లేషణల చుట్టూ తిరుగుతాయి.

Image Courtesy Google

ఆధునిక రచయితలు తమ నాటకాల్లో మనస్తత్వ శాస్త్రంతోబాటు సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ వంటి వారి మానసిక విశ్లేషణలకు ప్రాధాన్యతనివ్వడం గమనిస్తాం. ఈ క్రమంలో పిరాండెల్లో నాటకాల్ని 'సైకో డ్రామా' శైలికి చెందిన రచనలుగా వర్గీకరిస్తారు. ఈ 'సైకో డ్రామా' అనే పదానికి సృష్టికర్త అయిన జాకబ్ లెవీ మోనెరో ఈ శైలికి చెందిన నాటకాలు మనుషులకు తమ మానసిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా సహాయపడగలవని భావిస్తారు. ఉదాహరణకు షేక్స్పియర్ 'హేమ్లెట్'ను ఈ శైలికి చెందిన నాటకంగా పరిగణిస్తారు. ప్రప్రథమంగా ఒక నాటక రచయితగానే ఖ్యాతిని కూడగట్టుకున్నప్పటికీ తరువాతి కాలంలో పిరాండెల్లో మంచి కథకుడిగా, నవలాకారుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రచనల్లో తరచూ 'కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్' ను ప్రధాన పాత్రగా చేస్తూ, "నేను ఎవరు ?", "ఏది వాస్తవం? ", "ఏది భ్రమ ?" అనే ప్రశ్నల్ని చర్చకు పెడతారు. ఒక సంఘజీవిగా స్పష్టమైన గుర్తింపు సంపాదించుకోవడంలో మనిషి ఎదుర్కునే సంక్లిష్టతల్నీ, భావప్రకటన విషయంలో మనుషుల మధ్య సంభాషణల్లోని అసంపూర్ణత్వాన్నీ, వాస్తవికత-భ్రమల మధ్య నిరంతరం స్థానభ్రంశం చెందే పరిధులనూ ఆయన తన రచనలకు థీమ్స్ గా వాడుకుంటారు.

19 వ శతాబ్దికి చెందిన ఆస్ట్రియన్ న్యూరాలజిస్ట్ ,సైకో ఎనాలిసిస్ ఆద్యుడూ   సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో మానసిక  విశ్లేషణలు ఎక్కువగా కనిపించడంలో నిజానికి వింతేమీ లేదు. పిరాండెల్లో రచనలు ఉపచేతనావస్థలో మానవ మస్తిష్కంలోని లోపలి పొరల్ని మానసిక విశ్లేషణల ద్వారా విడదీసే ప్రయత్నం చేస్తూ, మనిషి యొక్క ఉనికినీ, గుర్తింపునీ శోధిస్తాయి. అలాగని ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మనిషి మెదడులోని రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలమే దీనికొక కారణం కావచ్చు. నిజానికి ఫ్రాయిడ్, పిరాండెల్లో, ఈ ఇద్దరి రచనల్లోనూ సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ,  వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. కానీ ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణలు చదువుతున్నప్పుడు, వాటిల్లో కనిపించే మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అసంబద్ధంగా  ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్తుల్ని పోలి ఉంటాయి. ఈ కారణంగా మనిషి ప్రవర్తనా సరళిలో అసహజంగా అనిపించే లోపాలూ, పిచ్చితనంలాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. Six Characters in Search of an Author ,హెన్రీ-IV ఈ రెండు నాటకాల్లోనూ ప్రధాన పాత్రలు గతాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ వర్ణన జ్ఞాపకాల్లో నుండీ, అచేతనావస్థలో నుండీ వచ్చేది కావడం వల్ల వాళ్ళు ఆ క్రమంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకూ, అస్థిమితానికీ లోనవడం చూస్తాం. పిరాండెల్లో కథల సంపుటి 'The Tales of Madness' లో మనిషిలో విపరీత ధోరణులు మొదలుకుని చిత్త వైకల్యాలవంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు. ఈ కథల్లో అస్తిత్వవాదాన్ని విశ్లేషించడానికి 'madness' ను ఒక మెటఫోర్ గా వాడతారు. మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం మానసికవైకల్యాలపై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు.

ప్రతి మనిషిలో మనకు తెలిసి కొంతా, తెలియక కొంతా పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని పిరాండెల్లో కథలు  నిరూపిస్తాయి. వాస్తవం నుండి దూరం జరగడం, ఏదో జరుగుతుందని భయపడడం, నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం, సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం లేదా 'తను' కాని తనను సామాజిక చట్రంలో ఇమిడ్చేసుకోవడం, ఈ కారణాల వల్ల ఉత్పన్నమయ్యే అనేక భయాలూ, బాధలూ, కోపతాపాలు, నిరాశా-నిస్పృహలూ వెరసి పిరాండెల్లో కథలు అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మెదడులోని రహస్యాలను లోతంటా కొలవడానికి ప్రయత్నిస్తాయి.

పిరాండెల్లో అస్తిత్వాన్ని నిరంతరం రూపాంతరం చెందుతూ మిగిలిపోయే  జ్ఞాపకంగానూ, మనిషి గుర్తింపుని కాలాన్ని బట్టి నిరంతరం మారే ముసుగు  వెనుక రహస్యంగానూ చూస్తారు. అందువల్ల మనిషి తన స్పష్టమైన ఉనికిని నిర్వచించుకోవడం దాదాపూ అసాధ్యమనేది ఆయన వాదన, అందునా భావదారిద్య్రం రాజ్యమేలే ఆధునిక సమాజం ఇటువంటి అంశాలను పూర్తిగా కోల్పోయిందని మనసావాచా నమ్మేవారాయన. అందువల్ల ప్రతి మనిషీ తనని తాను కోల్పోయి మాత్రమే ఇటువంటి ఒక వ్యవస్థలో భాగం కాగలడని ఆయన రచనలన్నీ మనకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరూపించే ప్రయత్నం చేస్తాయి. ఈ కారణంగానే పిరాండెల్లో పాత్రలన్నీ సంఘజీవిగా రూపాంతరం చెందే క్రమంలో తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఒక అనుకూలమైన ముసుగు చాటున దాచే ప్రయత్నం చేస్తాయి.'హెన్రీ IV' నాటకంలో ప్రధాన పాత్రధారికి గుర్రం మీద నుండి పడిపోవడంతో మతిస్థిమితం తప్పుతుంది. కానీ అతడు కొంతకాలానికి కోలుకుని మామూలు మనిషైనప్పటికీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని సమాజం నుండి దాచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా పిచ్చివాడిలా నటిస్తుంటాడు. ఇలా తన అస్తిత్వాన్ని చెరిపేసుకుని నటించడం ద్వారా అతడు సామజిక శృంఖలాలనుండి తప్పించుకుని స్వేచ్ఛగా తనకు తోచినట్లు జీవించే అవకాశం ఉందని భావిస్తాడు. పిరాండెల్లో నవలల్లో బాగా పేరుపొందిన నవల 'ది లేట్ మటియా పాస్కల్' కూడా ఇటువంటి కథే. మరణించాడని సమాజం పొరపాటుగా భావించిన కథానాయకుడు తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని, వారికి నిజం చెప్పకుండా తన అస్తిత్వాన్ని సరికొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త జీవితం ప్రారంభించాలని తలపోస్తాడు. ఈవిధంగా మనిషి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ కనుగొనడానికి సహాయపడే శాస్త్రమైన కార్ల్ యుంగ్ మానసిక విశ్లేషణల్ని 'Six Characters in Search of an Author' ,'హెన్రీ -IV', 'The Late Mattia Pascal' వంటి రచనల ద్వారా పిరాండెల్లో తన కాల్పనిక ప్రపంచాలకు అన్వయించడాన్ని చూస్తాం. కార్ల్ యుంగ్ ఇగోని మనిషి గుర్తింపుకి కేంద్రంగా చూస్తారు. ఈ కారణంచేత ఎవరైనా తన వ్యక్తిత్వానికి ఒక ముసుగు తొడుక్కున్నప్పుడు తనని తాను ఆ ముసుగు ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతాడు కాబట్టి అతడు తన స్వతఃసిద్ధమైన ఐడెంటిటీని కోల్పోతాడని ప్రతిపాదిస్తారాయన. ఒకవేళ పైకి అగుపించే ఆకారస్వరూపాలే మనిషి అస్తిత్వాన్ని నిర్వచించే చిహ్నాలైతే, ఆ వాస్తవికత నిరంతరం రూపాంతరం చెందుతుందని పిరాండెల్లో రచనలు పదేపదే నిరూపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఆయన దృష్టిలో ఖచ్చితమైన, విశ్వజనీనమైన వాస్తవమంటూ అసలుండే అవకాశం లేదు కాబట్టి భ్రమను అపాయకారిగా కంటే ఒక వ్యక్తిగత ధృవీకరణగా, సమాజానికి సవాలు విసిరే అంశంగా చూడాలన్నది ఆయన భావన. 

పిరాండెల్లో కథల్లో నేపథ్యాలే కాదు ఆయన కథ చెప్పే తీరు కూడా విలక్షణంగా ఉంటుంది. జీవితంలోని అబ్సర్డిటీకి హాస్యాన్నీ, వ్యంగ్యోక్తుల్నీ జోడించి దాన్నొక హాస్య కథలా చెప్పడం ఆయన ప్రత్యేకత. కథలో ఎక్కడో ఒకచోట లోతైన విషయం చర్చిస్తున్నారనుకునేలోగా ఉన్నట్లుండి చిన్న చమత్కారం దొర్లుతుంది. మరోచోట ఏదో ఒక సరదా సందర్భంలో అంతర్లీనంగా నిరాశా నిస్పృహలు, ఇదిగో మేమున్నామంటూ తొంగిచూస్తాయి. ఇంకోచోట మానవసంబంధాలను ఆవిష్కరించే క్రమంలో ఉన్నట్లుండి తాత్వికత తెరపైకొస్తుంది. ఆయన కథల్లో వర్ణనలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఆయన శైలి పాదరసంలా ఒక వర్ణన నుండి స్వగతానికీ , స్వగతం నుండి ఒక నాటకీయ సంభాషణకూ, దాన్నుండి ప్రత్యక్ష ఉపన్యాసానికీ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో గమనించే సమయం పాఠకులకు ఇవ్వరు. 

తాను జీవించి ఉన్న కాలంలో సుమారు 200 పై చిలుకు కథలు రాసిన ఆయన, తాను తొలినాళ్ళలో రాసిన కథల్నే పునాదులుగా చేసుకుని తరువాతి కాలంలో అనేక నాటకాలకు రూపకల్పన చేశారంటారు. ఆయన కథల్లో అంతఃసంఘర్షణలూ, వ్యక్తిగత సమస్యల ఆధారంగా రాసివి కొన్నైతే, అధికశాతం కథలు మాత్రం మనిషి సామజిక సాలెగూడులో చిక్కుకుని ఎదుర్కునే సంఘర్షణలూ, సామజిక కట్టుబాట్లను ఉల్లంఘించలేని నిస్సహాయత వల్ల సంఘజీవిగా మనడానికి అవసరమయ్యే ముసుగు ధరించే దిశగా పురిగొల్పే పరిస్థితుల (పిరాండెల్లో చాలా ఏవగించుకునే విషయం ) చుట్టూ తిరుగుతాయి. బహుశా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పాఠకులు పిరాండెల్లో రచనల్ని ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా ఇదే కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో పాత్రల జీవితాలు విధి లిఖితంగా,ఊహించని మలుపులతో అనూహ్యంగా ఉంటాయి. అనేక వైరుధ్యాల పోగుగా ఉండే విభిన్నమైన మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు లూగీ పిరాండెల్లో. కాల్పనికత, వాస్తవికతలనే రెండు పాయలనూ రెండు వైపుల నుంచీ సరిసమానంగా అల్లుకొచ్చి చిట్టచివరకి వాస్తవికతకు ముడి పెట్టడంలో పిరాండేల్లో నైపుణ్యం ఆయన ప్రతీ రచనలోనూ కనిపిస్తుంది. ఆయనను చదవడమంటే తాత్వికతనూ, మానసిక తత్వశాస్త్రాన్నీ, అస్తిత్వవాదాన్నీ, కాల్పనికతనూ అన్నిటినీ సమపాళ్ళలో కలిపి వండిన విందుభోజనం చెయ్యడంలా ఉంటుంది. పిరాండెల్లో రచనలు పాఠకులకు అన్నిఅంశాలూ తగుపాళ్ళలో కుదిరిన ఒక పూర్తి స్థాయి రచన చదివిన తృప్తినిస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో కనబరిచే నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 28th నవంబర్ 2022

https://www.andhrajyothy.com/2022/editorial/stories-told-by-changing-face-masks-956143.html

https://epaper.andhrajyothy.com/Home/ShareImage?Pictureid=e0fe4a13

Thursday, March 3, 2022

In Other Worlds : Essays In Cultural Politics - Gayatri Chakravorty Spivak

చాలా కాలం క్రితం మహాశ్వేతాదేవి రచనలు చదువుతున్నప్పుడు 'గాయత్రి చక్రవర్తి స్పివాక్' పేరు తొలిసారిగా విన్నాను. కథల గురించి తప్ప కథల వెనుక కథల గురించి సహజంగానే శ్రద్ధ తక్కువ కావడంతోటో మరొకటో తెలీదు గానీ ఆ సమయంలో ఆవిడను మహాశ్వేతాదేవి రచనల అనువాదకురాలిగా మాత్రమే చూశాను. మళ్ళా కొన్నేళ్ళ తరువాత డెరిడ్డా వ్యాసాలు చదువుతున్నప్పుడు ఈ పేరెక్కడో విన్నట్లుందే అనుకున్నాను. కాస్త వివరాల్లోకి వెళ్ళగా సొంటాగ్ లాగే గాయత్రి కూడా పురుషాధిక్య జాడ్యాలకు మినహాయింపు కాని సాహితీ ప్రపంచంలో 'పబ్లిసిటీ తక్కువ క్రిటిక్' అని అర్థమైంది. భారతీయురాలైన ఆమె పేరు ఇండియాలో కూడా తక్కువ వినడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా మరీ ఎక్కువైతే ఆశ్చర్యపోలేదు. స్త్రీవాదమనగానే తమ అస్తిత్వాన్ని ఎవరో గుర్తించాలనో, లేదా తమ హక్కుల్ని ఎవరిని నుంచో రాబట్టుకోవాలనో అనుకునే సగటు స్త్రీవాదుల మధ్య సుసాన్ సోంటాగ్, గాయత్రి చక్రవర్తి స్పివాక్ వంటి సాధికారత కలిగిన విమర్శకులు బహు అరుదు. వీళ్ళ విమర్శకు సాహితీలోకంలో శిఖరసమానులైనవారు కూడా మినహాయింపు కాదు, వీరి విమర్శ లక్ష్యం కేవలం స్త్రీవాదానికి మాత్రమే పరిమితమవ్వకుండా సాహిత్యంలో పురుషాధిక్య మూలాల్ని పెకలించే దిశగా సాగింది.

Image Courtesy Google

సుసాన్ సోంటాగ్ తరహాలోనే స్పివాక్ పేరు ప్రముఖ స్త్రీవాదుల జాబితాల్లో వినిపించకపోవడానికి కారణం కూడా ఆమె రచనలు ఏదో ఒక్క స్త్రీవాద సమస్యకో, సిద్ధాంతానికో, వర్గానికో, సమూహానికో పరిమితం కాకపోవడమేననిపిస్తుంది. చివరకు ఆమె తన కెరీర్ లో ఎక్కువ కాలం కలిసి పనిచేసిన ఫ్రెంచ్ తత్వవేత్త డెరిడ్డా సైతం ఆమెను తన 'కోటరీ' కి చెందిన వ్యక్తిగా పరిగణించేవారు కాదని స్పివాక్ ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పుకున్నారు. ఎప్పుడూ 'బిగ్ పిక్చర్' చూసే స్పివాక్ రచనల వైశాల్యం పెద్దది. ఈ కారణంగా సాధారణ పాఠకులకు సులభగ్రాహ్యంకాని స్పివాక్ రచనలు ఇతర స్త్రీవాదుల రచనల్లా పెద్దగా గుర్తింపుకి నోచుకోలేకపోయాయి.

స్పివాక్ రాసిన అనేక వ్యాసాల్లో 'Can the Subaltern Speak' పేరిట రాసిన ఒక వ్యాసాన్ని 'పోస్ట్ కలోనియల్ స్టడీస్' లో మిక్కిలి ప్రాధాన్యత కలిగిన వ్యాసంగా పరిగణిస్తారు. మేథావి వర్గాల్లో అంతర్గతంగా ఉండే నిరంకుశత్వాన్ని విమర్శిస్తూ రాసిన ఈ వ్యాసాన్ని నిజానికి 'బడుగుజీవి మాట్లాడగలడా?' అనేకంటే, 'బడుగుజీవి గళం వినబడుతుందా?' అన్న కోణంలోనే రాశారు. థర్డ్ వరల్డ్ గళం వినపడకుండా నిరోధించే అంశాలు అనేకం ఉన్నప్పటికీ, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్న విద్యావేత్తలూ,మతాధికారులూ,ఇతర ఉన్నత వర్గాలతో కూడిన శక్తివంతమైన సామజిక వర్గాలను అన్నిటికంటే ముఖ్యమైన కారణంగా చూపిస్తారు స్పివాక్. ఆమె మార్క్సిస్టు సిద్ధాంతాలూ, స్త్రీవాదం ,వచనం యొక్క పునఃనిర్మాణపు లక్షణాల ద్వారా తన వాదనలను సహేతుకంగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా పాశ్చాత్య పండితులు 'థర్డ్ వరల్డ్' ని నిర్వచించిన విధానమే  లోపభూయిష్టమైనదని స్పివాక్ అభిప్రాయపడతారు. ఈ క్రమంలో స్పివాక్ వాదనలన్నీ భౌతికమైన హింస కంటే ఆలోచన,భాష,వ్రాత రూపంలో జరిగే 'Epistemic violence' మరింత ఎక్కువ ప్రమాదకరమన్న దిశగా సాగుతాయి. ఉదాహరణకు చరిత్ర నుండి బడుగుజీవుల కథల్ని ఆనవాళ్ళు లేకుండా తుడిచివెయ్యడం ఈ రకమైన హింస క్రిందకి వస్తుంది. స్త్రీవాదాన్ని కూడా ఇదే వెలుగులో చూపిస్తూ, స్త్రీ గళం అణచివేతకు గురికావడానికి అటు పితృస్వామ్యంతో బాటు, ఇటు వలసవాదం కూడా ఒక కారణమంటారు. స్పివాక్ రచనల్లో సింహభాగం మేథావి వర్గాల ఆధిపత్యం కారణంగా సాంఘిక,సాంస్కృతిక,రాజకీయ,సాహితీ రంగాల్లో జరిగే అణచివేతపైనే దృష్టిసారిస్తాయి.

బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి కథ 'ద్రౌపది' ని స్పివాక్ ఆంగ్లంలోకి అనువదించడానికి కారణం కూడా అది తాను ప్రతిపాదించిన 'ఎపిస్టమిక్ వయొలెన్స్' ను ప్రతిబింబించే కథ కావడమేనంటారామె. క్లుప్తంగా కథ విషయానికొస్తే, ఒక సైనికాధికారి సేనానాయక్ ద్రౌపది అనే గిరిజన స్త్రీని బంధించి ఆమెను న్యాయ విచారణచేసే క్రమంలో దారుణమైన హింసకు గురిచేసి పలువురు ఆమెపై అత్యాచారం చెయ్యడానికి పరోక్షంగా కారణమవుతాడు. ఈ కథను తాను అనువదించడానికి 'ద్రౌపది' ఎంత కారణమో అందులో ప్రతినాయకుడు 'సేనానాయక్' పాత్ర కూడా అంతే కారణమంటారు స్పివాక్. ఆ కథలో సేనానాయక్ పాత్ర 'ఫస్ట్ వరల్డ్ స్కాలర్' ప్రతినిధిగా 'థర్డ్ వరల్డ్' కి చెందిన ద్రౌపదిని వెతుక్కుంటూ వెడుతుంది. ధర్మాధర్మాల విచక్షణా, సహానుభూతీ ఉన్నప్పటికీ చివరకి సేనానాయక్ తన వృత్తిలో భాగంగా ఫాసిస్టు భావజాలానికి కొమ్ముకాయక తప్పదు.

మహాశ్వేతాదేవి ఈ కథలో ఒక సందర్భంలో సేనానాయక్ తన చేతిలో ఉన్న Hochhuth రచన 'The Deputy' పేపర్ బ్యాక్ ని టేబుల్ మీదకు విసిరేశాడని రాస్తారు. చిన్న సంగతే అయినా ఈ వివరం కథలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిజానికి 'ది డిప్యూటీ' నవల హోలోకాస్ట్ సమయంలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ బాధ్యత గల మతాధికారి స్థానంలో ఉన్న పోప్ (Pope Pius XII) ఎటువంటి ప్రకటనా జారీచెయ్యకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన యాంటీ ఫాసిస్టు రచన. ఇది చదువుతున్న సేనానాయక్ కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న 'ఫస్ట్ వరల్డ్ ప్రతినిధి' గా ఉంది కూడా పోప్ తరహాలోనే ధర్మబద్ధంగా వ్యవహరించకుండా ద్రౌపది (థర్డ్ వరల్డ్) పై జరిగిన అత్యాచారానికి పరోక్షంగా బాధ్యుడవుతాడు. స్పివాక్ డెరిడ్డా 'డీకన్స్ట్రక్టివ్ ప్రిన్సిపుల్' ని ఈ విశ్లేషణకు మూలాధారంగా చేసుకున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ.

డాంటే మొదలు ఈట్స్ వరకూ సాహిత్యంలో స్త్రీ పాత్రపై దృష్టి సారిస్తూ ఆమె రాసిన 'ఇన్ అదర్ వరల్డ్స్' అనే పుస్తకంలో స్పివాక్ చేసిన కొన్ని విశ్లేషణలు స్త్రీవాదంపై ఆమె భావాలకు దర్పణం పడతాయి. కవితా వస్తువుగా స్త్రీని ఉపయోగించుకోవడంలో డాంటే,ఈట్స్ వంటివారు అవలంబించిన ద్వంద్వ విలువల్నీ, పురుషాధిక్య భావజాలాన్నీ వారి రచనల్లోని ఒక్కో వాక్యాన్నీ 'deconstruct' చేస్తూ చేసిన విశ్లేషణలు చదువుతున్నప్పుడు ఉత్తమ సాహిత్యంగా పరిగణింపబడే సాహిత్యంలో స్త్రీ పాత్ర ఎంత ? అనే ప్రశ్న జనించకపోదు. ఈ కవులందరూ సాహిత్యంలో స్త్రీ పాత్రను ఒక జీవం ఉన్న మనిషిగా కాకుండా ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చేయడాన్ని స్పివాక్ వ్యాఖ్యానాల్లో స్పష్టంగా చూస్తాం.

1977 లో జరిగిన వోక్స్ స్త్రీవాద సదస్సులో డాంటే La Vita nuova మీద వ్యాసానికి సంబంధించి పేపర్ ఒకటి చర్చకు పెట్టినప్పుడు ఆ పేపరు ప్రెజెంటేషన్ పూర్తైన వెంటనే సభలో ఒక స్త్రీ లేచి "స్త్రీకి ఏ మాత్రం విలువ ఆపాదించని ఈ రచనను స్త్రీలు ఏ విధంగా ప్రశంసించాలి ?" అని అడిగారట. దానికి అదే సభలో మరో స్త్రీ లేచి డెరిడ్డా డీకన్స్ట్రక్టివ్ సూత్రాన్ని గుర్తు చేస్తూ ఆ రచనకి రచయిత, అంటే ఇక్కడ డాంటే ఎంతమాత్రం బాధ్యుడు కాదని అన్నారట. డెరిడ్డా సూత్రం ప్రకారం వచనానికి తనను తానే నిరంతరం పునఃనిర్మించుకునే గుణం ఉంటుంది,ఈ కారణంగా స్వయానా రచయిత కూడా ఆ రచనకు బాధ్యుడు కాడు.

డాంటే-బీట్రిస్ ల ప్రేమకథలో డాంటే విపరీతమైన సెల్ఫ్ ఇండల్జెన్స్ తో బీట్రిస్ పాత్రను ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చెయ్యడం చూస్తాం. డాంటే ఆమెకు తన హృదయంలో ఒక గుడి కట్టి దేవతలా ఆరాధిస్తారు. కానీ నిజానికి ఆమె జీవితాంతం డాంటే ప్రేమను గురించిన స్పృహలేకుండానే జీవించి పాతికేళ్ళ వయసులో అకస్మాత్తుగా మరణిస్తుంది. అంటే ఈ కథలో బీట్రిస్ ఉనికిని పూర్తిగా తన ఆలోచనలకే పరిమితం చేస్తారు డాంటే. వాస్తవానికి ఆమెకు ఒక రూపం ఇవ్వకపోయినా తన ప్రతీ చర్యకూ బీట్రిస్ ని (ఆమె ఇమేజ్) కారణభూతంగా చూపించే ప్రయత్నం చేస్తారు. తన కల్పనలో తన కర్మలకు  ఆమెను బాధ్యురాలిని చేసి తాను మాత్రం ఎటువంటి బాధ్యతా తీసుకోరు. "బీట్రిస్ కారణంగా నేను అలా వ్యవరించవలసి వచ్చింది" అని డాంటే అనడంలో నిజానికి బీట్రిస్ పాత్ర ఏమీ ఉండదు. డాంటే రచనలో చర్యా/ప్రతిచర్యా /ఉనికీ ఇవేమీ లేని బీట్రిస్ కేవలం 'డాంటే యొక్క ఏజెంట్' గా మిగిలిపోతుంది. మరోవిధంగా చూస్తే ఆమె అతడి 'నాన్ ఏజెంట్' : ఆ కారణంగా ఒక ఆబ్జెక్ట్ (బీట్రిస్) స్థానంలో ఉంటూ సబ్జెక్టు(డాంటే) చర్యను ఆమె నియంత్రిస్తుంది. డాంటే తన ఆధిపత్యపు ఉద్దేశ్యాన్ని ఎప్పటికప్పుడు పునఃనిర్మించుకోవడానికి ఆమె ఒక ప్రేరణగా నిలుస్తూ, అతడి నార్సిసిజాన్నీ,మసకిజాన్నీ (Masochism) కప్పెట్టే తెరచాటుగా మారుతుంది.

మరికాస్త ముందుకెళ్ళి డాంటే కవిగా తన సృజనాత్మకతనీ, నైపుణ్యాన్ని మరికాస్త బిగ్గరగా చాటే పనిలోపడతారు. బీట్రిస్ ని జీవంలేని ఇమేజ్ గా మిగిల్చి 'ప్రేమ' ని మాత్రం కవితా సంప్రదాయంలో ఒక జీవం ఉన్న ప్రాణిగా చూపించే యత్నం చేస్తారు. ఆయన రచనలో ప్రేమను గురించిన వర్ణనలు ప్రేమ ఒక సజీవమైన వ్యక్తేమో అన్న భ్రమను కలిగిస్తాయి. ఈ ప్రయత్నాన్ని సమర్ధించుకునే దిశగా, వర్జిల్,లుకన్,హోరేస్ మరియు ఒవిడ్ వంటి వారి ప్రస్తావన తెచ్చి ప్రేమను 'పొయెటిక్ లైసెన్స్' కాలిడోస్కోప్ లో నుంచి సజీవమైన వ్యక్తిగా చూడొచ్చని నమ్మబలుకుతారు.

డాంటే,ఈట్స్ వంటి వారు స్త్రీని తమ కవితావస్తువుగా చేసుకునే క్రమంలో ఆమెకు తమ సృజనాత్మకతతో ఒక ఆదర్శ రూపమిచ్చే ప్రయత్నం చేశారు. కాల్పనిక వస్తువుగా ఇందులో స్త్రీ ప్రమేయం ఎంతమాత్రం లేకుండా ఆమెకు ఆపాదించిన రూపాన్ని మళ్ళీ వారే ఛిద్రం చేస్తారు, ఆ విధంగా ఆమెను 'న స్త్రీ స్వాంత్త్య్రమర్హతి' అన్న తీరులో ఆమె ఉనికిని సమూలంగా హరించే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇదంతా పాఠకుల దృష్టికి రాకుండా ఒక రహస్యంలా, వారి శిల్పంలో అంతర్గతంగా ఉంటూ, వారి పంక్తుల్ని ఒకదానితోనొకటి దగ్గరగా కలిపి ఉంచే చర్యలా జరుగుతూ ఉంటుంది. "ఒక స్త్రీగా స్త్రీ అస్తిత్వానికి ఆనవాళ్ళు లేకుండా చేసిన ఇటువంటి  ఉత్తమ సాహిత్యాన్ని నేను తిరస్కరిస్తే ఇక సాహిత్యంలో మిగిలినదేముంటుంది ? " అని ప్రశ్నిస్తారు స్పివాక్. పోనీ మరీ ఇంత కఠినమైన ప్రశ్నని కాసేపు ప్రక్కన పెడితే, "స్వయంసిద్ధమైన ఉనికిలేని కాల్పనిక వస్తువుగా స్త్రీ ఇమేజిని కుదించేశాక ఇక రచనలో ఎటువంటి ద్వంద్వానికీ చోటివ్వని కవి శిల్పం అతడి కావ్య సాధనలో ఏ రకమైన సంపూర్ణత్వాన్ని సాధిస్తుంది ?" అని సూటిగా ప్రశ్నిస్తారు. ఈ కారణంగా కేవలం వచనాన్ని మాత్రమే సాధనంగా చేసుకుని ఏకపక్షంగా చేసే ఈ రచనలు ఏ విధమైన వైరుధ్యానికీ ఆస్కారం లేకుండా చేసే అవకాశం ఉందంటారు స్పివాక్. ఇదే విశ్లేషణను ప్రముఖ ఫ్రెంచ్ సైకో అనలిస్టు జక్ లకాన్ పరిభాషలో ప్రకారం చెప్పాలంటే, కవులూ,రచయితలూ కేవలం ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని సృష్టించే ఈ తరహా సంబంధాలూ,ఊహలూ,ఫాంటసీలూ సాధారణ దృష్టికీ  గమనింపుకీ ఎంత మాత్రం అందేవి కాదు. అందువల్ల భాషాసౌందర్యాల మాటున చేర్చి భావగర్భంగా సమాజంలోకి ప్రవేశపెట్టే ఇటువంటి భావజాలాల్ని నమ్మి పాఠకులు ఆ కాల్పనికతను వాస్తవమని భ్రమపడే అవకాశం ఉంది [the symbolic masquerade of the Imaginary]. అక్కడితో ఆగకుండా అదంతా సహజమనీ,వాస్తవమనీ అంగీకరించే ప్రమాదం కూడా ఉంది.

పుస్తకం  నుండి మరికొన్ని అంశాలు : 

It is not surprising that the book ends with a promise to write further: “I hope to write of her that which has never been written of any other woman.” In Dante’s text, Beatrice is fully sublated into an object—to be written of, not to.

To keep the woman out. Here the third woman in Yeats’s life plays a role. She was caught on the rebound within the institution of marriage, and had a masculine nickname, “Georgie Yeats.” She was the transparent medium through which the voices of Yeats’s instructors, themselves at first dependent upon his own text, travelled: “On the afternoon of October 24th 1917,” Yeats writes in A Vision, “four days after my marriage, my wife surprised me by attempting automatic writing.… The unknown writer took his theme at first from my just published Per Amica Silentia Lunae”. We are back to “Ego Dominus Tuus.” Is it the unknown writer who is Yeats’s lord, is it Yeats who is his wife’s lord? We are caught in another labyrinth of “I,” “you,” and mastery.

తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ - 28 ఫిబ్రవరి 2022.

https://lit.andhrajyothy.com/vividha/article-about-spinak-articles-39742

https://www.andhrajyothy.com/telugunews/femininity-reduced-to-fiction-as-a-story-ngts-editorial-1922022804273432?fbclid=IwAR2t53EfcjxXkPSDc0DiW7zM3DPADq-FPModZ2OFzmYlZD-aPUrTo1XMahQ

Tuesday, December 14, 2021

ముళ్ళకంపల వాస్తవంపై విరబూసిన కల్పన - ‘సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ

1932 లో మాక్సిమ్ గోర్కీ ని సిగిజ్మండ్  క్రిఝిఝానోవ్‍స్కీ (1887–1950) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని విమర్శనాత్మకంగా పరిశీలించమని కోరారట. నిజానికి  సిగిజ్మండ్ సాహితీరంగంలో ఆనాటికి ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. అప్పటికే 'ఆల్ యూనియన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియెట్ రైటర్స్' కి తొలి ఛైర్మన్ గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్న గోర్కీ, సోవియెట్ యువ రచయితలకు 'సోషలిస్ట్ వాస్తవిక సాహిత్యం' భవిష్యత్తు విషయంలో దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కానీ తన రచనల్ని పరిశీలించే నిమిత్తం గోర్కీ చేతిలో పెట్టడమనే ఈ ఒక్క తప్పిదానికీ సిగిజ్మండ్ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సొచ్చింది. గోర్కీ విమర్శలు సిగిజ్మండ్ కు ఒక రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన 'సిగిజ్మండ్ క్రిఝిఝానోవ్‍స్కీ' అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్ రచనలు ఆనాటి 'సోవియెట్ లిటరరీ ఎస్థెటిక్స్' కి  తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పరబట్టారట : "నేను మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్ని వాటి యొక్క తాత్వికమైన విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో, తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం,పాండిత్య ప్రకర్ష ఆనాటి మేథావి వర్గాల్లో ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలమది. పండితులందరూ సమోవర్ చుట్టూ సమావేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్ వర్డ్ ప్లే - lukavoe prazdnoslovie) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవజాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి కంటే అతడి కర్మల ద్వారానే సృష్టించబడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అందువల్ల మిస్టర్ క్రిఝిఝానోవ్‍స్కీ రచనలకు ప్రచురణకర్తలు దొరుకుతారనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ  దొరికినప్పటికీ వాళ్ళు నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా ! "

Image Courtesy Google

ఇటువంటి తీవ్రమైన విమర్శలు చెయ్యడం ద్వారా గోర్కీ సిగిజ్మండ్ ఒక రచయితగా వాస్తవదూరమైన  విషయాసక్తితో (Self-indulgent untimeliness) ఘోరమైన పాపానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బాధ్యతగల రచయితగా సోసియెట్ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఆయన వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. యుద్ధ సమయంలో రచయితలు  వాస్తవాన్ని విస్మరించి పదసౌందర్యాలపై అనురక్తితో తాత్వికమైన విషయాల్లో మునిగితేలడం నేరమన్నది గోర్కీ భావన. నిజానికి గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్ ను 19 వ శతాబ్దానికి చెందిన రచయితగానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్ పై 19వ శతాబ్దపు రష్యన్ సింబాలిజాన్ని పెద్ద ఎత్తులో నిర్వచించిన నీకొలాయ్ గొగోల్, ఎడ్గర్ అలాన్ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ కనబడుతుంది. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్ శైలికీ  గొగోల్ శైలికీ చాలా పొంతనలుంటాయి. ఉదాహరణకు 'ది రన్ అవే ఫింగర్స్' (1922) అనే కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతడి చెయ్యినొదిలి పారిపోవడం గొగోల్ 'ది నోస్' కథను తలపిస్తుంది. సిగిజ్మండ్ కథానాయకులు కూడా గొగోల్ కథానాయకుల్లాగే కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్ 'ది ఓవర్ కోట్', సిగిజ్మండ్ 'క్వాడ్రాటురిన్' కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథానాయకులు వృత్తి,ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టు సిగిజ్మండ్ ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయినట్లుండే ఆయన కథలు అర్థంకావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్ లాంటి సిగిజ్మండ్ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.

ఉక్రెయిన్ లోని కీవ్ లో పుట్టిన పోలిష్ మాట్లాడే కుటుంబానికి చెందిన సిగిజ్మండ్ డొమినికోవిచ్ క్రిఝిఝానోవ్‍స్కీ 1919-1950 ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే ప్రచురించబడ్డాయి. మాస్కో సాహితీలోకంలో పలు మేథావుల మన్ననలందుకున్నప్పటికీ క్రిఝిఝానోవ్‍స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల,ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగా 1949 లో గుండెపోటుతో రచయితగా సిగిజ్మండ్ కెరీర్ ముగిసిపోయేవరకూ ఆయన మాస్కో సాహితీలోకంలో (నాన్ అకడమిక్) విమర్శకునిగా,సంపాదకునిగా మాత్రమే పనిచేశారు. దీనికి తోడు సిగిజ్మండ్ స్టాలిన్ కంటే మూడేళ్ళు ముందుగానే మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధవాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్ లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్ 1920 ల తొలి కాలంలో ఈ నియంతృత్వపు కాలాన్ని 'ఫెంటాస్టిక్' శైలిలో రూపకాలు,ఉపమానాలతో కూడిన కాల్పనిక  సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు. 

భావవ్యక్తీకరణ నేరమైన నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయితలూ,కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్ శకంలో ఇటువంటి రచయితలు  రెండు రకాలనుకుంటే,  అలెగ్జాండర్‌ సోల్జెనిత్సిన్‌, విక్టర్ సెర్జీ, మిఖాయిల్ బల్గకోవ్, బోరిస్ పాస్టర్నాక్ వంటి రచయితలు స్టాలిన్ సోవియెట్ రష్యా విప్లవం, సివిల్ వార్ కాలం నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేవిధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృదయాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిఝిఝానోవ్‍స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని కౄరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి తీసుకువెళతాయి. 1930 ల్లో సిగిజ్మండ్ జీవించి ఉన్న కాలంలో తనను తాను రచయితగా కంటే థియేటర్ ప్రొఫెషనల్ గా, సాహితీ విమర్శకునిగానే చూసుకున్నారంటారు. షేక్స్పియర్,జార్జ్ బెర్నార్డ్ షా ల ప్రభావం అధికంగా ఉన్న తన కథలను నిర్లక్ష్యం చేసినా వారిద్దరి రచనల్నీ మాత్రం తనదైన శైలిలో విశ్లేషిస్తూ విస్తృతమైన పరిశోధనలు చేసి పలు వ్యాసాలు ప్రచురించారు. ఈ కారణంగా సాహితీ రంగంలో సిగిజ్మండ్ ఒక ప్రత్యేకమైన 'nonacademic sort of Shakespeare critic'  గా పేరు తెచ్చుకున్నారు. 

క్రిఝిఝానోవ్‍స్కీ రచనలపై షేక్స్పియర్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన తనను తాను ప్రప్రథమంగా 'ఎక్స్పెరిమెంటల్ రియలిస్టునని' చెప్పుకునేవారు. స్టాలినిస్ట్ సెన్సార్షిప్ కారణంగా సిగిజ్మండ్ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా Joanne Turnbull, Nikolai Formozov వంటి సంపాదకుల దృష్టికి వచ్చి 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలు వెలువడ్డాయి. రచయితలుగా భిన్న ధృవాలైనప్పటికీ సిగిజ్మండ్ రచనా శైలిని ఆధునిక రచయితల్లో ఒకరైన వ్లాదిమిర్ షరోవ్ శైలితో పోలుస్తారు కార్ల్ ఎమర్సన్. వీరిద్దరి శైలుల్లో ఉమ్మడిగా కనిపించే ఒక అంశం సినెస్థీసియా అంటారు, అంటే కథ చెప్పేటప్పుడు ఇద్దరూ సినెస్థీసియాను మూలాధారంగా చేసుకుని చెబుతారు. నిజానికి మనిషికుండే  పంచేంద్రియాలు మెదడులోని వేర్వేరు భాగాలను చైతన్యవంతం చేస్తాయంటారు. కానీ సినెస్థీసియా కారణంగా ఒక ఇంద్రియ చైతన్యం మరో ఇంద్రియం చేత ఉద్దీపితమవుతుంది. ఉదాహరణకు సంగీతం విన్నప్పుడు మనం కొన్ని రంగుల్ని చూడడం తటస్థిస్తుంది. లేదా ఏవైనా అంకెలు చూసినప్పుడు మనకు కొన్ని రంగులు జ్ఞప్తికి వస్తాయి, ధ్వనులకు వాసనలుంటాయి, స్వరాలకు వర్ణాలుంటాయి, లేదా ఏదైనా వాక్యాలను విన్నా,చదివినా శరీరంలో ఉన్నట్లుండి ఉష్ణం జనించిన భావన కలుగుతుంది, ఇలా మెదడు అనేక అనుభూతులకు లోనవుతుంది. నిజానికి జీవశాస్త్ర పరంగా చూస్తే ఈ సినెస్థీసియా ఇంద్రియ సంబంధమైనది కాదు. ఈ సాహితీ ప్రక్రియ పాఠకులపై ప్రభావం చూపే రీతిలో అర్ధవంతమైన వాక్యాలను శ్రద్ధగా ఏర్చి కూర్చిన కృత్రిమమైన నిర్మాణం. ఈ సినెస్థీసియాను పాఠకులపై సమర్థవంతంగా ప్రయోగించడానికి రష్యన్ విప్లవం, సివిల్ వార్లను వేదికగా చేసుకున్నారు సిగిజ్మండ్.

సిగిజ్మండ్ దృష్టిలో భాష గతిశీలమైనది. కొన్ని కథల్లో సిగిజ్మండ్ పదాలూ,అక్షరాలూ పేజీని వీడి పైకి ఎగసిపడుతున్న అలల్లా ఒకదానితో ఒకటి తలపడుతున్నట్లుంటాయి. దీనికి తోడు ప్రవృత్తి రీత్యా ఏకాకి జీవితాన్ని ఇష్టపడే అంతర్ముఖత్వం సిగిజ్మండ్ కథల్లో కాంటియన్ భావజాలానికి సంబంధించిన మెటాఫిజికల్ ప్రపంచాలు ఎక్కువ కనబడడానికి ఒక ముఖ్య కారణం. కథ చెప్పే సమయంలో సిగిజ్మండ్ దృష్టి ఎల్లప్పుడూ మానవ మస్తిష్కం లోలోపలి పొరల్లో ఎవరూ చొరబడడానికి సాహసించని మారుమూల ఏకాంత ప్రదేశాలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన కథా వస్తువు (లేదా కథానాయకుడు) ఆ మెదడు లోపలి పొరల్లోంచి సూటిగా వెలుపలికి ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున వెలుపలికి దూసుకువచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ సమయంలో ఎటువంటి వైకల్యాలకూ తావివ్వకపోవడం సిగిజ్మండ్ ప్రత్యేకత.

యుద్ధంతో వినాశనాన్ని చవిచూసిన కీవ్ నుండి బయటపడి 1922 లో మాస్కో లో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్. కాసేపు సిగరెట్ ముట్టించి అది కాలే లోగా కథ రాసి సిగరెట్ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచయితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ,ప్రవృత్తికీ నిజాయితీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్. నార్వే రచయిత కనూట్ హాంసన్ బాటలోనే సిగిజ్మండ్ కూడా కథ రాయడం కోసం ఏకంగా తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సిగిజ్మండ్ అనువాదకుల్లో ఒకరైన కార్ల్ ఎమర్సన్ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. ఎమర్సన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి రాసిన ఒక వ్యాసంలో సిగిజ్మండ్ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలిలోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునేవారని అంటారు. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక,మానసిక సమతౌల్యంలోనుంచి పుడుతుందనీ సిగిజ్మండ్ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి. 

అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి  'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్ ఎమర్సన్ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిఝిఝానోవ్‍స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవిచూసిన క్రిఝిఝానోవ్‍స్కీ  ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "డూ యూ లవ్ పుష్కిన్ ?" అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక "ఐ...ఐ......" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య బోవ్షెక్ చెప్తూ, ఆ సమయంలో ముప్ఫయ్ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అన్న ఊహ రాక మానదు. 'కాంటియన్ థింకర్' (ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న క్రిఝిఝానోవ్‍స్కీ రచనలు మోతాదుమించిన తార్కికతతో ఉండడం వల్ల వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ  తీర్మానించడంతో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" క్రిఝిఝానోవ్‍స్కీ వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం.

క్రిఝిఝానోవ్‍స్కీ రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి 'లెటర్ కిల్లర్స్ క్లబ్' లో టైడ్ (రచయిత) అనే పాత్ర ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్' అనే అంశం తోడ్పడుతుంది. కథలను అల్లే విధానాన్ని బట్టి సాహితీ ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్, పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయంటాడు టైడ్. వీటిల్లో పీపుల్ ప్లాట్స్ అనేవి వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే సాధారణమైన కథలన్నమాట. ఈ కథల్లో వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది. కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి, ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించివై ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్ అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యవు, పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన క్రిఝిఝానోవ్‍స్కీ కి ఈ రెండవ పద్ధతి అంటే ప్రాణం, ఈ కారణంగానే ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాశారు.

'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరికొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్ అనే రచయిత చెప్పే 'ఎక్సెస్' (Exes) అనే డిస్టోపియాన్ హారర్ స్టోరీ మరో కథల సంపుటి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆరోజుల్లోనే అలవోకగా రాశారు క్రిఝిఝానోవ్‍స్కీ. కొన్ని చోట్ల కథలో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి తత్వాన్ని ప్రస్తావిస్తూ సాగే సిగిజ్మండ్ లోతైన కథనంలోని ప్రవాహపు వేగాన్ని అందుకుంటూ చదవడం పాఠకులకు కత్తిమీద సాములా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు రచయితకు దైనందిన జీవితంలో పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలే కాకుండా పలు రాజకీయ, సామాజిక, విజ్ఞాన, తత్వ, శాస్త్ర సాంకేతికత వంటి విభిన్నమైన అంశాలపై ఉండవలసిన జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది.  మరోచోట ఫెవ్ అనే రచయిత చెప్పిన 'టేల్ ఆఫ్ ది త్రీ మౌత్స్' అనే కథలో ఇంగ్, నిగ్, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిఝిఝానోవ్‍స్కీ ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. "తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని" ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిఝిఝానోవ్‍స్కీ. ప్రవాహానికి ఎదురెళ్ళడమనేదే విప్లవమనుకుంటే మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంపై తన వినూత్నమైన కథలతో తిరుగుబాటు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే పాఠకులు ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఈయన రచనల్లో దొరకని ఒకే ఒక్క వస్తువు 'అనుసరణ' (conformity).

క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివే భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం, బోర్హెస్ కథల్లోలాగే ఆయన కథల్లో కూడా తరచూ కనిపించే భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు !! బోర్హెస్, ఉర్సులా లెగైన్ వంటి కొందరు 'ఫెంటాస్టిక్ జానర్' రచయితల్లాగే క్రిఝిఝానోవ్‍స్కీ కి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిఝిఝానోవ్‍స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక రుజువులు కనిపిస్తాయి. గూగుల్ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు దేశవిదేశీ  సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్, కాఫ్కా వంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్ కు అందుబాటులో లేనప్పటికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్, పో, గోగోల్  వంటివారు కొలువుదీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న 'షూ బాక్స్' సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిఝిఝానోవ్‍స్కీ ని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

రచయితగా క్రిఝిఝానోవ్‍స్కీ దృష్టి అంతా తనలో చెలరేగే నిరంతరమైన తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనిపించదు. 'ఇన్ ది ప్యూపిల్'  వంటి కథల్ని చూస్తే పాఠకులు తన వేగాన్ని అందుకుంటున్నారో లేదో కూడా గమనించని లోతైన క్రిఝిఝానోవ్‍స్కీ కథనం సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి, ,కెమిస్ట్రీ నుంచి కాల్పనికతకూ పాదరసంలా చురుకుగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది. ప్రేమలూ, వాటిల్లో రకాలూ, మానవ సంబంధాలను సర్రియలిస్టిక్ అంశాలతో జతచేసి రాసిన ఇటువంటి కథల్లో వ్యక్తుల బదులు చిత్రాలు (ఇమేజస్) ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి. క్రిఝిఝానోవ్‍స్కీ అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే  'నేను' కథా, కథనాల్ని బట్టి రూపాంతరం చెందుతుంటుంది. ఈ 'నేను' కి ప్రత్యేకమైన ఆకారంగానీ గుణగణాలుగానీ ఉండవు, సైన్సు పరిభాషలో చెప్పాలంటే క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో 'నేను' ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే కనపడుతుంది. "Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని ఆడమ్ థిర్వెల్ ఒక పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగథాల్లోకి తొంగి చూడమంటాయి. ఈ రష్యన్ రచయితను ఒకసారి చదివితే పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా  క్రిఝిఝానోవ్‍స్కీ ని చదవక మునుపు, క్రిఝిఝానోవ్‍స్కీ ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి. 

రెండు స్థితుల నడుమ ఊగిసలాడే క్రిఝిఝానోవ్‍స్కీ స్థిర స్థావరమైన ఈ ఫెంటాస్టిక్ జానర్ కూడా అత్యంత సంక్లిష్టమైనది. ఒక స్థితిలో వట్టి భ్రమలా అద్భుతంగా  కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది. మరో ప్రక్క కొన్ని కథల్లో ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు. కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన తాత్వికత క్రిఝిఝానోవ్‍స్కీ కథల్లో కీలకమైన అంశం. ఈయన్ని చదివేటప్పుడు పదాలనూ, వాక్యాలనూ దాటి reading between the lines/seeing through the gaps తప్పనిసరి. ఎందుకంటే ఆయన పాఠకులతో చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య ఇరుకు సందుల్లో దాచేస్తారు. నిజానికి మన దృష్టిని దాటిపోయిన అతి చిన్న బిందువు వద్దే క్రిఝిఝానోవ్‍స్కీ కథకు రూపకల్పన మొదలవుతుంది. అదే విధంగా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.

ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది. ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్తిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం. కానీ క్రిఝిఝానోవ్‍స్కీ కథలెన్ని చదివినా ఆయన పాఠకులకు ఒక అంతుపట్టని ఎనిగ్మా గానే మిగిలిపోతారు. ఇలాంటి రచయితలు పాఠకుల ఊహలకు రెక్కలిస్తారే గానీ దిశానిర్దేశం చెయ్యరు. వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన. ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేస్తారు క్రిఝిఝానోవ్‍స్కీ. మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా, కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా, పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా, ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే, మరో ప్రక్క నిజమేనని తొందరగానే నమ్మేస్తాం. వాస్తవంలో సాధ్యం కాని విషయాలను సృజనాత్మకతతో సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక సాధనంగా ఎంత నేర్పుగా ఉపయోగించవచ్చో క్రిఝిఝానోవ్‍స్కీ కథలు చదివితే అర్థమవుతుంది. ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో, మాన్ బుకర్, నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో క్రిఝిఝానోవ్‍స్కీ లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉండే ఉంటారు.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 13  డిసెంబర్ 2021

https://www.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977

https://m.andhrajyothy.com/telugunews/hedgehog-fantasy-on-the-reality-of-hedgehogs-ngts-editorial-1921121312150977?fbclid=IwAR06wgTQdLluiVRwc4uLBCImxKt1WnUCln4jsO1qRa17Tut07np3RtPv_Ko

Thursday, August 5, 2021

The Terror of Fables - Roberto Calasso

ఆస్ట్రియన్ రచయిత రాబర్ట్ ముసిల్ మాగ్నమ్ ఓపస్ 'ది మాన్ వితౌట్ క్వాలిటీస్' లో కథానాయకుడు అల్రిచ్ స్పోర్ట్స్ మాగజైన్లో ప్రచురించిన ఒక వ్యాసంలోని వాక్యం 'a racehorse of genius' చదివి ఆలోచనలో పడతాడు..ఆ సందర్భంలో అల్రిచ్ కి ప్రపంచ చరిత్ర యావత్తూ ఈ వాక్యంతోనే ముడిపడి ఉన్నట్లు తోస్తుంది..వెనువెంటనే అతడు ఒక మాథెమెటీషియన్ గా తన జీవితం నుండి ఒక సంవత్సరం పాటు శెలవు తీసుకుని 'ఎ మాన్ వితౌట్ క్వాలిటీస్' గా రూపాంతరం చెందుతాడు..ఈ కథ విన్నప్పుడు తరతరాలనుండి వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలూ,రాజకీయ సామజిక స్థితిగతులూ,సాంఘిక నియమాలూ,వ్యవస్థలూ మనకు ఆపాదించిన అస్తిత్వపు చిహ్నాలను సమూలంగా చెరిపేసి అల్రిచ్ లా శెలవు తీసుకోవడం మనకు కుదిరే పనేనా అనిపిస్తుంది..గత సంవత్సరం చదివిన ఒట్టెస్సా మోష్ఫెగ్ రచన 'మై ఇయర్ ఆఫ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్' లో కూడా యధాతథంగా కాకపోయినా దాదాపూ ఇటువంటి అంశమే చర్చకు వస్తుంది..అందులో యువ కథానాయిక జీవితపు నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక సంవత్సరంపాటు ఒంటరిగా తన అపార్ట్మెంట్లో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ నిద్రాణస్థితిలో జీవించాలని నిర్ణయించుకుంటుంది..రాబర్ట్ ముసిల్ కథానాయకుడు సంఘజీవిగా తన అస్తిత్వాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ,మోష్ఫెగ్ కథానాయిక ఒంటరితనంతో అలసిపోయి డిప్రెషన్ బారిన పడుతున్న నేటి తరానికి ప్రతినిధిలా కనిపిస్తుంది..ఏదేమైనా ఈ రెండు కథల్లోనూ అలసిపోయి అస్తిత్వపు మూలలను వదిలించుకోవాలనే తపన మాత్రం సుస్పష్టం..సాంస్కృతిక మూలాలను రక్షించుకోవడం పేరిటో లేదా సౌకర్యవంతమైన మార్గమనుకునో అనుకరణ,అనుసరణలను విధిగా పాటిస్తూ జీవించేవారు కొందరైతే,Be a Roman in Rome తరహాలో తమ చుట్టూ ఉన్న పరిసరాలకూ,మనుషులకూ,వ్యవస్థలకూ అనుగుణంగా తమ ఉనికిని నిరంతరం మార్చుకుంటూ స్పష్టమైన అస్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు..కానీ ప్రాక్టికల్ గా అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడం మన చేతుల్లో ఉండే పనేనా ?

Image Courtesy Google

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతీ,సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు,చరిత్ర,నాగరికత లాంటివి అందించబడతాయి..ముఖ్యంగా సాహిత్యంలో కథలూ,కవిత్వం లాంటివి ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా వర్తిస్తాయి..సాహితీ  ప్రపంచంలో 'మిత్' (పురాణం/గాథ) చాలా ప్రత్యేకమైనది..ఈ 'మిత్' ను వాడుక భాషలో పుక్కిట పురాణమని కూడా అంటుంటాం..'మిత్' చరిత్రను సజీవంగా ఉంచుతుంది..ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో, బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం,చిత్రలేఖనం ,నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో ,ఇతరత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థలోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి..పాలిటిక్స్,జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్ బార్త్ , తన 'మైథాలజీస్' లో 'మిత్' గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా 'సైన్ ని సిగ్నిఫైర్ గా మార్చే సెమియోటిక్  సిస్టం లో భాగమని' అంటారు..వివిధ సంస్కృతులకు సంబంధించిన చరిత్ర యావత్తూ ఈ మిత్ ప్రాతిపదికగా రూపొందినదే..మిత్స్ సమాజాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.

ఇటాలియన్ రచయిత రోబర్టో కలాస్సో 'ది ఫోర్టీ నైన్ స్టెప్స్' అనే పుస్తకంలో 'ది టెర్రర్ ఆఫ్ ఫేబుల్స్' పేరిట రాసిన వ్యాసంలో మిత్ కు కొన్ని పేజీలు కేటాయిస్తూ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు..చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..కథలూ,గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటని ఆశ్చర్యంగా అనిపించినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు..ఈ మిత్ ను రెండు అర్ధాల్లో తీసుకోవచ్చు అంటారు కలాస్సో : మొదటిది, 'ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం' అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో 'ఒక అబద్ధం / భ్రమ / పుక్కిటి పురాణమని' కొట్టిపారేసేది..మిత్ గురించి చర్చించే నేపథ్యంలో ప్లేటో 'రిపబ్లిక్' ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్ కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో 'రిపబ్లిక్' లోనే అంటారు..ప్లేటో 'రిపబ్లిక్' లో తాత్వికతకూ,కవిత్వానికీ పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు..ఆనాటికి కవిత్వానికి మారు పేరేదైనా ఉందంటే అది ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసి,ఇలియడ్,ఒడిస్సీలను సృష్టించిన హోమర్ మాత్రమే..ఆ కోణంలో చూస్తే మొత్తం రిపబ్లిక్ ను ప్లేటో, హోమర్ ల మధ్య ఘర్షణగా పరిగణించవచ్చు..గ్రీకులు హోమర్ ను తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా , ప్రపంచానికీ , దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధిగా చేసిన అనుసంధానకర్తగా చూస్తారు..అటువంటి హోమర్ ని ప్లేటో , 'రిపబ్లిక్' రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిట పురాణాలు సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు..ఇక రిపబ్లిక్ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను 'మిమెసిస్' (the dangerous art of imitation) సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు..కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిథ్యం వహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమయ్యారని అంటారు ప్లేటో. 

హోమర్ కు వ్యతిరేకంగా ప్లేటో వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది చేసిన అభియోగాలనుకుంటే పొరపాటే..నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్ దృష్టికోణం నుండి చేసినవేనంటారు కలాస్సో..ఒక వేళ హోమర్ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, నిరంతరం తమ రూపాలను మార్చుకుని మానవుల్ని మోసం చేసే దేవుళ్ళను ఇంద్రజాలికులుగా , మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది..కానీ నిజానికి దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాంతరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి కాదు..హోమర్ ఆ మెటామార్ఫోసిస్ కు పరోక్షంగా ప్రాతినిథ్యం వహించే సాధనంగా మాత్రమే అగుపిస్తారు..ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా,నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్ జోన్ సహజంగానే ఫిలాసఫర్లకు శత్రు సమానంగా కనిపిస్తుంది..అందువల్ల వాస్తవికతకు సుదూరంగా అబ్సర్డిటీ తో కూడిన ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే కవులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంఘం నుండి బహిష్కరింపబడాలన్నది ప్లేటో వాదన.

నిశితంగా గమనిస్తే ఆంగ్లో సాక్సన్ల క్రిస్టియానిటీకీ, వైకింగ్స్ పాగనిజానికీ మధ్య ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వైరం లాంటిదే ప్లేటో హోమర్ ల మధ్య 'సిములాక్రం' లో (Simulacrum = వాస్తవానికి ప్రతిరూపం/అనుకరణ/ప్రాతినిథ్యం వహించేది) కూడా కనిపిస్తుంది..'సిములాక్రం' మనిషిని తనను అనుసరించమని శాసిస్తుంది,దానిని చూసిన మనిషి తన ప్రమేయం లేకుండానే దాని ప్రతిరూపంగా మారిపోతాడు..ఒకవేళ ప్లేటో రిపబ్లిక్ లో భావించినట్లు సిములాక్రం వాస్తవదూరంగా,లోపభూయిష్టంగా ఉన్న పక్షంలో దానికి రూపకల్పన చేసిన కవి కూడా తాను సృష్టించిన దేవుడిలాగే ఇంద్రజాలికుడిలా,తాంత్రికుడిలా మారిపోతాడు..అందువల్ల దైవమైనా,ఆ దైవాన్ని సృష్టించిన కవి అయినా 'సిములాక్రం' అన్న పదంలో కంటికి కనిపించని శత్రువుల్లా దాగి ఉన్నారన్నది ప్లేటో భావన..దీనినే మరో విధంగా చూస్తే , 'మిత్' అనేది ఒక అవాస్తవికతను మరో అవాస్తవికతగా చూపించే ప్రయత్నం చేస్తుంది..ప్లేటో ఈ అవాస్తవికతను వ్యతిరేకిస్తారు. 

ఈ తరహా హోమరిక్ మిత్ నూ, వాళ్ళ 'మిమెటిక్' పోయెట్రీ నీ ఖండించిన 'ప్లేటో ప్రపంచం'లో కేవలం కవికే గాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు..ప్లేటో కవిని "A man skillfully able to transform himself into everything" అని నిర్వచిస్తారు..కవిత్వం విషయంలో సిములాక్రా , అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్ పదాల వాడకం పట్ల ప్లేటో కి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయినప్పటికీ , కావ్యసృష్టిలో  భాగమైన మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుంటాయంటారు కలాస్సో..మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడంతో 'A is transformed into B' అనే బదులు 'A is B' అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది..మొదటిది (మెటామోర్ఫోసిస్) ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి అంటే నేరేటివ్ కి అవకాశమున్న అంశం కాబట్టి ఏ ఇమేజ్ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞానసముపార్జనకు ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ,నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక..దీనికి భిన్నంగా, రెండో పద్ధతి 'A is B' నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్పుట్,ఔట్పుట్ పద్ధతిలో ఉండడం వల్ల మెటామోర్ఫోసిస్ కు అవకాశం శూన్యం..అందుచేత ప్లేటో మెటామోర్ఫోసిస్ ని తిరస్కరించడం అంటే,కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ,తద్వారా ఇమేజ్ ని అర్థంచేసుకునే (cognitive power ) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క.

ప్లేటో వాదనలో ఉన్న లొసుగులు చూశాం కాబట్టి,ఇప్పుడు ఆయన చెబుతున్న ఇమిటేషన్ లో ఉన్న ప్రమాదాలేమిటో కూడా చూద్దాం..పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి,తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి..ఈ మాయలో పడ్డవాళ్ళు కర్ట్ వన్నెగట్ సృష్టించిన Karass (A network or group of people who are somehow affiliated or linked spiritually ) లాంటివాళ్ళు..గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేని వీళ్ళు తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు.

ఇక మిత్ ను గురించి సోక్రటీస్ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకు కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది..ఈ విషయంలో ప్లేటో లో ఉన్న మొండితనం సోక్రటీస్ లో కనిపించదు..సోక్రటీస్ మిత్ గురించి మాట్లాడుతూ “Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., with the fables themselves].” అంటారు..ఈ సందిగ్ధంలో రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి..ప్లేటో హెచ్చరించిన అస్పష్టత,అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశమివ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఇక్కడ ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం.

ఈ మిత్ ప్రభావాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్ మిత్ ను ఉదహరిస్తారు కలాస్సో : మిత్ మనమీద చెక్కతో చేసిన టారియన్ ఆర్టెమిస్ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన..ఓరెస్టిస్ దాన్ని ఆలయంలోనుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువుకుని పారిపోతున్నంతసేపూ  అతడిలో ఒకవిధమైన ఉన్మాదం జనిస్తుంది..చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకుని యూరోటస్ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని  పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు..ఆ విగ్రహం అక్కడే ఏళ్ళ తరబడి ఎవరికంటాబడకుండా శిథిలమైపోతుంది..ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్ యువకులు ఆస్ట్రాబాకస్,ఏలోపెకస్ లు యాదృచ్చికంగా ఆ విగ్రహం చూడడం జరుగుతుంది..తీక్షణంగా తమకేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తున్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవుతారు..సిములాక్రం కి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో..దాని గురించి అర్థం చేసుకోగలిగిన వారిని మాత్రమే అది నయం చేస్తుంది..మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాథిలా సంక్రమిస్తుంది..

Thus the myth: The power that arouses terror is also the only one that can cure it, as happened with Orestes. But only if it is recognized for what it is.

తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ : 2 ఆగష్టు 2021

https://lit.andhrajyothy.com/vividha/poet-pleto-37634

https://www.andhrajyothy.com/telugunews/what-did-plato-have-to-do-with-poets-19210802042167?fbclid=IwAR0hR2M9kZvzyIyZ9yJrYkH-Klr53Vz_oy-OYh6GhMF2lTSYdjfh7bELCE4