ఆ మధ్య ఓటీటీ సినిమాల వ్రతంలో బిజీగా ఉండగా 'లేడీ మాక్బెత్' పేరుతో ఒక సినిమా కనిపించింది. పీరియడ్ డ్రామాలంటే అమితమైన ఇష్టం కాబట్టి ఆ ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించి చూడగా అది రష్యన్ రచయిత నీకొలాయ్ లెస్కోవ్ కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని తెలిసింది. నిజానికి లెస్కోవ్ రచనలతో నాకాట్టే పరిచయం లేదు. తీరా బుక్ అడాప్టేషన్ అని తెలిశాక పుస్తకం చదవకుండా సినిమా చూడడం మా బుక్ నెర్డ్ల ప్రపంచంలో ఘోరమైన పాపంగా పరిగణిస్తాం కాబట్టి ఆ కథేదో చదివేశాక సినిమా చూద్దామని ముందుగా ఆ కథ చదివాను, తరువాత సినిమా చూశాను. లెస్కోవ్ కథను మూలాంశంగా తీసుకోవడం మినహా మూలకథకూ, సినిమాకూ ఎక్కడా పోలికలు లేవు. బ్రిటిష్ అడాప్టేషన్ కాబట్టి రష్యన్ పేర్లైన 'కాటెలినా' ను 'క్యాథెరిన్', 'సెర్జీ' ని 'సెబాస్టియన్' వంటి బ్రిటిష్ పేర్లుగా మార్చారు.
Image Courtesy Google |
షేక్స్పియర్ 'మాక్బెత్' ద్వారా ప్రభావితమై రాసిన ఈ కథకు ఫ్లాబర్ట్ 'మేడమ్ బోవరీ', టాల్స్టాయ్ 'అన్నా కరినిన'లతో కూడా కొన్ని పొంతనలు కనిపిస్తాయి. సంతానలేమీ, మారుమూల పల్లెలో ఖైదులాంటి ఇంట్లో నిస్సారమైన జీవితం వెరసి ఉన్నత వ్యాపారస్థుల కుటుంబానికి చెందిన స్త్రీ కాటెలినా వివాహేతర సంబంధానికి దారి తీస్తాయి. కాటెలినా భర్త జినోవీ వద్ద పనిచేసే సెర్జీతో ఆమె వివాహేతర సంబంధం ఒక పాపం మీద మరో పాపంగా మారి వరుస హత్యలకు కారణమవుతుంది. కామం, ధనవ్యామోహం, దురాశ, స్వార్థం ఇవన్నీ పెచ్చుమీరితే మనిషి ఏ స్థాయికి దిగజారతాడో చెప్పడానికి కాటెలిన్ పాత్ర ఒక మంచి ఉదాహరణ. కానీ టాల్స్టాయ్ అన్నాలో కనిపించే మానవీయ సహజ గుణాలైన నిస్సహాయత, బలహీనత,అపరాధభావం, పశ్చాత్తాపం లాంటివి లెస్కోవ్ కాటెలినాలో ఎంత వెతికినా కనిపించవు. అన్నాలో అణువణువునా కనిపించే 'గ్రేస్' లెస్కోవ్ కాటెలినాలో శూన్యం. తనకు కావలసింది సొంతం చేసుకునే క్రమంలో ఏ పని చెయ్యడానికైనా వెనుకాడని ఆమె వ్యక్తిత్వమే పూర్తి లోపభూయిష్టం. ఆమెను చూసి ఏ సందర్భంలోనూ "అయ్యో" అనిపించదు.
ఇది నాణానికి రెండో వైపు కథను పూర్తిగా వదిలేసి ఒక మగవాడి దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పిన కథ. కథలో rawness కనిపిస్తుంది. టాల్స్టాయ్ రచనల్లో స్త్రీలపట్ల కాసింత సహానుభూతీ, గౌరవం కనిపిస్తాయి. దీనికి కారణం ఆయన ఉన్నతవర్గానికి చెందిన సమాజంలో భాగమని కొందరు అభిప్రాయపడతారు. లెస్కోవ్ శైలి మన్ననలూ, మర్యాదలూ లేని ఆనాటి దిగువమధ్యతరగతి రష్యన్ సమాజాన్ని చూపించింది. ఆయన ప్రపంచంలో మానవీయ ప్రవృత్తిలో మోటుదనం, క్రూరత్వం యధాతథంగా చిత్రిక పట్టినట్లుంది. జన్మతః పేద కుటుంబం నుంచి వచ్చిన స్త్రీగా కాటెలినా లో ఎటువంటి నైతిక నియమాలకూ లోబడని తెగింపు, స్వార్థం కనిపిస్తాయి. ఆమెకు కావలసిందల్లా పాపభీతికి ఆస్కారం లేని అచ్చమైన 'అనుభవం' మాత్రమే. అన్నాలో కనిపించే ద్వైదీభావం కాటెలినాలో లేదు. నాకు ఆమెలోని "స్వచ్ఛమైన మృగతృష్ణ " అస్సలు నచ్చలేదు.
ఎటొచ్చీ షేక్స్పియర్ 'మాక్బెత్' ని అనేక వ్యక్తిత్వ వైరుధ్యాల నడుమ ప్రతినాయకుడిగా కంటే కథానాయకుడిగా చూడగలిగిన సమాజం కాటెలినాను అదే సమదృష్టితో ఎందుకు చూడలేదా అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. రాబర్ట్ చాండ్లెర్ అనువాదంలో NYRB క్లాసిక్స్ వారు ప్రచురించిన లెస్కోవ్ కథల సంపుటిలో ఈ కథ కూడా ఒకటి. ఈ చిన్నపాటి నవలిక లెస్కోవ్ శైలిని నాకు తొలిసారి పరిచయం చేసింది.
విశ్లేషణ బాగుందమ్మా
ReplyDeleteఇన్ని పుస్తకాలు చదవటం ఇన్ని సినిమాలు చూడటం వాటిల్లో పోలికలు పట్టటం ఆ క్రమంలో వాటినే పోలిన లేదా వాటికి సారూప్యం కలిగిన పుస్తకాన్నో సినిమానో ప్రస్తావించటం అంటే నిజంగా ఎంతో ఆసక్తి జ్ఞానం (అనొచ్చా, సరైన పదం తట్టక అలా అన్నా ) ఉండాలి. ఇవి నీలో పుష్కలంగా ఉన్నాయి. మీరు ఇంకా ఇంకా వ్రాయాలమ్మా.
ReplyDeleteThank you so much for your kind words Prasad garu. Means a lot :)
Delete