Monday, September 19, 2022

Loveless Love - Luigi Pirandello

గ్రీసులోని డెల్ఫిలో ఒక పురాతన అపోలో దేవాలయంలో జ్ఞానసముపార్జన వైపు ప్రయాణించే మార్గాన్ని సూచించే తొలివాక్యంగా " Know thyself" అనే చెక్కడం ఉంటుందట. ఈ మూడు కథలకూ కలిపి అటువంటి ఒక శిలాశాసనం రాయాలంటే "Thou canst not know thyself " అని రాస్తే సరిగ్గా సరిపోతుందంటారు ఈ కథలను ఆంగ్లంలోకి అనువదించిన జె.జి.నికోల్స్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో. మనం ఏమిటో, మనకి కావాల్సింది ఏమిటో స్పష్టత లేనప్పుడు జీవితం నరకప్రాయమవుతుందని చెబుతాయీ కథలు. కానీ ఆ స్పష్టత సాధించడం అంత సులభమేం కాదంటారు మానవ మనస్తత్వాల లోతులు తెలిసిన రచయిత పిరాండెల్లో.

ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు "ఇట్స్ కాంప్లికేటెడ్" అనడం తరచూ వింటుంటాం. నిజానికి ప్రేమ చాలా సరళమైన అనుభవం. కానీ మనకు ప్రతీ చిన్న విషయాన్నీ సమస్యగా చేసుకోవడం పట్ల ఆసక్తి మెండు కాబట్టి దాన్ని కూడా సంక్లిష్టమైనదిగా చేసుకుంటామనిపిస్తుంది. నోబెల్ గ్రహీతా, ఇటాలియన్ రచయితా లూగీ పిరాండెల్లో 'లవ్ లెస్ లవ్' అనే రచనలో మూడు కథలూ ప్రేమ తాలూకూ సంక్లిష్టతల చుట్టూనే తిరుగుతాయి. నిజానికి అన్నీ సరళంగా సజావుగా జరిగిపోతే ఇక చెప్పుకోడానికి కథలేం ఉంటాయి !

Image Courtesy Google

19 శతాబ్దికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో సైకో ఎనలిటిక్ విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మానవ మస్తిష్కంలో రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలం దీనికొక కారణం  కావచ్చు. సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. అందువల్ల ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ చదువుతున్నప్పుడు అందులో మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి  మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అబ్సర్డ్ గా ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్థుల్ని పోలి ఉంటాయి. అందువల్ల వారి ప్రవర్తనా సరళిలో లోపాలూ, పిచ్చితనం లాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదేమో.

మొదటి కథ 'ది వేవ్', తన ఇంట్లో అద్దెకున్న ప్రతీ అమ్మాయితోనూ ప్రేమలో పడే అలవాటున్న జూలియో అనే ఒక యువకుడి కథ. ఇక్కడ ఒక చిత్రమైన అంశం ఏమిటంటే, అతడు ఆ అమ్మాయి తిరిగి ప్రేమించగానే ఆమెకు దూరం జరిగి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. ఎటువంటి నిబద్ధతా లేకుండా తన మనసుని నేర్పుగా అదుపు చేసుకుంటూ ఇతరుల భావోద్వేగాలతో ఆడుకునే అలవాటున్న అతడు చివరకు తన ఆత్మన్యూనత, అసూయల కారణంగా అవే భావోద్వేగాల తూఫానులో చిక్కుకుని ఎలా సతమతమవుతాడో చెబుతుందీ కథ. జూలియో సంక్లిష్టమైన మనస్తత్వంపై  అగాథా కల్మషంలేని అమాయకత్వం పరోక్షంగా సాధించిన విజయానికి (?) ఈ కథ ఒక మంచి ఉదాహరణ. పిరాండెల్లో ఈ కథను రక్తికట్టించిన తీరు చాలా బావుంది.

రెండో కథ 'ది సిగ్నోరినా' కూడా దాదాపూ మొదటి కథలాంటిదే. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్  ప్రకారం వేటాడడం (ఛేజ్), దేన్నైనా తన సొంతం చేసుకునేవరకూ వదిలిపెట్టకపోవడం మగవాడి నైజం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విధానం అతడి జీవితకాలమంతా కొనసాగుతుంది. దీనికి భిన్నంగా స్త్రీ తనకు కావల్సినది దొరికాక, కోరుకున్నది సొంతం చేసుకున్నాకా స్థిరత్వాన్ని ఆశిస్తుంది. ఈ ఫ్రాయిడ్ విశ్లేషణలను ఆధారంగా చేసుకుని అల్లిన కథలే పై రెండూను. తన సామజిక స్థాయికి తగిన స్త్రీ కాదని ప్రేమించిన జూలియాని తిరస్కరించిన లూసియో , ఆమెకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి వరుడుగా రావడం పట్ల తీవ్రమైన అసూయతో ఆ సంబంధం చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడి స్థానంలో ఆమెకు గంతకు తగ్గ బొంతలా సరిపోయే తన స్నేహితుడు మార్జానీని వివాహమాడమని ప్రతిపాదిస్తాడు. లూసియోను ఎంతో ప్రేమించినప్పటికీ అతడి నిజస్వరూపం తెలుసుకున్న తరువాత జూలియా తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది మిగతా కథ. ప్రేమించిన మనిషి తనకి దక్కకపోయినా ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడం నిజమైన ప్రేమికుల లక్షణం. కాగా తనకు దక్కనిదాని వినాశనాన్ని కోరుకోవడం కౄరత్వం. తన అసూయాద్వేషాలనూ, ఆధిపత్య ధోరణినీ ప్రేమగా భ్రమించే లూసియో కథ ఇది. ఇక మూడో కథ 'ఎ ఫ్రెండ్ టు ది వైవ్స్', పై రెంటికంటే కాస్త భిన్నంగా ఉన్న కథ. ఈ కథ చాలా అసహజంగా అనిపించడంతో నాకు పెద్దగా నచ్చలేదు.

పిరాండెల్లో రచనల్లో ఇది తొలిసారిగా ప్రచురితమైన కథల పుస్తకం అని రాశారు. నేను కొన్నేళ్ళ క్రితం 'టేల్స్ ఆఫ్ మ్యాడ్నెస్' , 'ఆయిల్ జార్ అండ్ అదర్ స్టోరీస్' అనే రెండు కథల సంపుటులు చదివి ఉన్నాను కాబట్టి ఆ కథల్లో కనిపించిన పదును తొలినాళ్ళలో రాసిన ఈ కథల్లో లేదనిపించింది. ఏదేమైనా ప్రేమికుల తగాదాలూ, విరహాలూ, పరితాపాలూ, అసూయలూ, అమాయకత్వాలూ, మాటల్లేని సంభాషణలూ చదివే సరదా ఉంటే ఈ కథలొకసారి చదవొచ్చు. హ్యాపీ రీడింగ్ :) 

No comments:

Post a Comment