ఆధునిక సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన రచనల్లో జేమ్స్ జాయిస్ 'యులీసిస్' ఒకటి. చాలామంది పబ్లిషర్లు తిరస్కరించిన తర్వాత, పారిస్ లోని 'షేక్స్పియర్ అండ్ కంపెనీ' యజమాని సిల్వియా బీచ్ 1922లో 'యులీసిస్'ను తొలిసారి ప్రచురించారు. కానీ అశ్లీలతల పేరిట ఈ నవలను త్వరలోనే బ్యాన్ చేశారు. U.S.పోస్టల్ సర్వీసు ఏకంగా 'యులీసిస్' కాపీలను తగలబెట్టింది. కథాపరంగా చూస్తే 'యులీసిస్' ఎటువంటి ప్రత్యేకతలూ లేని నవల. దీని ప్రత్యేకత కథలో కంటే అతి సాధారణమైన కథను జాయిస్ ఎలా చెప్పారన్నదానిలోనే ఉంటుంది. జేమ్స్ జాయిస్ 1904 జూన్ 16వ తేదీన డబ్లిన్లోని కొందరు సాధారణ వ్యక్తుల జీవితంలోని ఒకే ఒక్క రోజు, అంటే సుమారు 18 గంటల కాలంలో జరిగే సంఘటనలను కథగా రాసుకొచ్చారు. జాయిస్ దైనందిన వ్యవహరాల్లో, మామూలు సంభాషణల్లో 'ఆర్ట్'ను ఎంత వైవిధ్యంగా చూపగలిగారన్నదే 'యులీసిస్' ప్రత్యేకత. నిజానికి ఇప్పటి ఓటీటీ వెబ్ సిరీస్లు, సినిమాలూ, పుస్తకాల్లో కనిపించేంత అశ్లీలత ఈ నవలలో లేదు. అందువల్ల ఆధునిక పాఠకుడికి ఈ పుస్తకంలో షాక్ వేల్యూ పెద్దగా కనిపించే అవకాశం లేదు. కానీ 1920ల కాలంలోని మతవిశ్వాసాలనూ, సాంఘిక నియమాలనూ సవాలు చేసిన ఈ నవలకు ఎదురైన వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.
![]() |
Copyright A Homemaker's Utopia |
సాహిత్యంలో "స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్" కథనాలు కొత్తేమీ కాదు. ఉదాహరణకు జులియన్ బార్నెస్ 'ది సెన్స్ ఆఫ్ ఆన్ ఎండింగ్', థామస్ బెర్న్హార్డ్ 'ది లూజర్' లాంటి నవలల్లో కథంతా ఒకే ఒక్క ముఖ్య పాత్ర తన స్వగతం చెప్పుకుంటున్నట్లు రాశారు. ఇటీవల నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న హాన్ కాంగ్ రచన 'ది వెజిటేరియన్', టాల్స్టాయ్ 'అన్నా కరెనిన'లాంటి నవలల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల స్వగతాలను ఒక్కొక్కరి దృష్టి కోణం నుంచీ విడదీసి చెబుతారు. ఇప్పుడు జాయిస్ వచనాన్ని పరిశీలిస్తే, ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుష- ఈ మూడు రకాల నేరేటివ్ లూ కథలో ఏ విధమైన క్రమమూ లేకుండా ఒకదాన్నొకటి ఢీ కొడుతూనే ఉంటాయి. అందువల్ల 'యులీసిస్' వచనమంతా అనేక పాత్రల ఆలోచనల అంతర్వాహిని అస్తవ్యస్తంగా పెనవేసుకుని చిక్కులు పడిపోయినట్లుంటుంది. కథలో లియోపోల్డ్ బ్లూమ్, స్టీఫెన్ డెడలస్, మోలీ వంటి ముఖ్య పాత్రలతో బాటు కథ మధ్యలో వస్తూ పోతూ ఉండే ఇతరత్రా పాత్రల 'స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్' కూడా కలగాపులగంగా కలిసిపోయి, జాయిస్ వచనాన్ని పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడనివ్వదు. పాఠకుడికి ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడడం మొదలులుపెట్టారో, సంభాషణ ఎప్పుడు ముగించారో స్పష్టత ఉండదు. వాక్యాల చివర ఫుల్ స్టాపులూ, కామాలూ ఉండవు. రెండు మూడు పేజీలు పూర్తైనా ఒక్కోసారి వాక్యం ముగింపు కానరాదు. ఇక చివరి అధ్యాయం 'పెనెలోపె'లో అయితే మోలీ స్వగతం గురించిన వాక్యం మొదట్నుంచి చివరి వరకూ ఆగకుండా అనంతమైన ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. ఏదేమైనా ఐరిష్ సంస్కృతి గురించీ, జేమ్స్ జాయిస్ శైలి గురించీ కనీస అవగాహన లేని సగటు పాఠకుడిని చెయ్యి పట్టుకుని 'యులీసిస్' యేరు దాటించే 'డిజిటల్ సాయాలు' ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అనేకం అందుబాటులో ఉండడం వల్ల 'యులీసిస్' చదవడం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలికే.
నిర్ధిష్టమైన మూలం, నేపథ్యం ఉండే ఇద్దరి మధ్య సంభాషణ, వాటి నేపథ్యం తెలియని మూడో వ్యక్తికి అర్థం కాదు. జాయిస్ నవల ఇటువంటి ఒక 'ఇన్సైడ్ జోక్' లాంటిది. ఎటొచ్చీ "యులీసిస్" రాయడం ద్వారా జాయిస్ ఏ ఒక్క వ్యక్తినో కాకుండా మొత్తం ప్రపంచాన్ని తన సంభాషణలో భాగంగా చేసుకునే ప్రయత్నం చేశారు. పాఠకులకు జాయిస్ శైలితో కాస్త చనువు ఏర్పడ్డాక, కథలో మనల్ని వెతుక్కోమంటూ దాచేసిన "ఈస్టర్ ఎగ్స్" పట్టుకోవడం ఒక ఆటలా ఉంటుంది. నిజానికి ఈ నవలకు ఫ్రేమ్ వర్క్ గా తీసుకున్న హోమర్ 'ఒడిస్సీ' చదివితే 'యులీసిస్' చదవడం తేలికన్నది అర్ధసత్యం మాత్రమే. కథాపరంగా ఒడిస్సీకీ, యులీసిస్ కీ పొంతనలుండవు. కానీ జాయిస్ తన స్నేహితులకు ఇచ్చిన 'గిల్బర్ట్ స్కీమా డయాగ్రమ్'లో ప్రతీ చాప్టర్ కూ 'ఒడిస్సీ' నేపథ్యమేమిటో చెప్పే లంకెలుంటాయి.
మొదటి 10 ఎపిసోడ్ల వరకూ విపరీతమైన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించినా 'సైరెన్స్' ఎపిసోడ్ మొదలు హాస్యం, వ్యంగ్యం, పేరడీలతో జాయిస్ పామరుల కోసమే ప్రత్యేకించి రాస్తున్నారనిపించేంతగా, కఠినమైన వచనాన్ని కొమ్ములు వంచి ఉన్న పళంగా 180 డిగ్రీల టర్న్ తిప్పుతారు. జాయిస్ వచనం ఆయన సృష్టించిన అనేక పాత్రల వెనక ఎక్కడో నక్కి పాఠకుడితో నర్మగర్భంగా దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయన తన గురించి ఎన్నో వివరాలను గుక్కతిప్పుకోకుండా చెప్పీచెప్పనట్లు చెబుతూనే, చివరి వరకూ దూరంగా, ఒక అపరిచిత వ్యక్తిగానే మిగిలిపోతారు. అయినప్పటికీ ఆయనంత ప్రామాణికమైన 'ఆటోబయోగ్రఫికల్ ప్రోజ్' మరెవ్వరూ రాయలేదంటారు. రచయిత పాఠకుడి స్థాయికి దిగే ప్రయత్నం అస్సలు చెయ్యకుండా తానున్న ప్లేన్ లోనే నిలబడి కథ చెప్పడం బోర్హెస్, క్రిఝానోవ్స్కీ, ఉంబెర్తో ఎకో వంటి చాలామంది రచయితల్లో కూడా కనబడుతుంది. జాయిస్ వచనంలో అందరికీ అర్థంకావాలనే ఉబలాటం కనపడదు. "నా గురించి తెలియాలంటే నా ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి" అనే కళాకారుడికుంటే సాధికారత, అహంకారం ఆయన వచనంలో అణువణువునా కనిపిస్తుంది.
ఇక జాయిస్ శైలిలో మనకు నవలంతా స్థిరంగా కనిపించే ఒకే ఒక్క నియమం- "నియమాలేవీ లేకపోవడమే". మొదటి మూడు చాప్టర్లలో చాలా పకడ్బందీగా కనిపించే వాక్య నిర్మాణం తరువాత చాప్టర్లలో పూర్తిగా వీగిపోతుంది. ఇక్కడ నుండీ పాండిత్య ప్రకర్ష తగ్గి జాయిస్ అసలుసిసలు "Foul play" మొదలవుతుంది. ఇక్కడ నుండీ జాయిస్ వాక్యనిర్మాణపు సంప్రదాయాలకూ, నవల రాయడానికి అమలులో ఉన్న విధివిధానాలకూ పూర్తి స్థాయిలో తిలోదకాలిచ్చేస్తారు. ఇక 11వ భాగం అయిన "సైరెన్స్"కి వచ్చేసరికి జాయిస్ స్వరంలోని "గూఫీ టోన్" పూర్తిగా అదుపు తప్పి తారాస్థాయికి చేరుకుంటుంది. “Bronze by gold heard the hoofirons, steelyrining imperthnthn thnthnthn” అనే వాక్యాలు చదివిన ఎజ్రా పౌండ్ "జాయిస్ తలకు ఏదైనా బలమైన దెబ్బ తగిలిందేమో" అని కలవరపడ్డారంటేనే మనం ఊహించుకోవచ్చు. జాయిస్ సాధారణంగా ఆనాటి రచయితలు వాడని నాగరికతకు సుదూరమైన అసభ్యమైన భాషని పచ్చిగా, ఎటువంటి ఫ్యాబ్రికేషన్లు లేకుండా ఉన్నదున్నట్లుగా ఎందుకు వాడారని ఎవరో అడిగితే "This race and this country and this life produced me — I shall express myself as I am." అని సమాధానమిచ్చారాయన.
ఈ నవల నైతిక విలువలనూ, సభ్యతనూ మాత్రమే కాదు, కాల్పనిక సాహిత్యపు సంప్రదాయాలన్నిటినీ కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తుంది. జాయిస్ వచనం కొన్నిచోట్ల ఐరిష్, బ్రిటిష్ రైమ్స్, దేశవిదేశీ కవిత్వం, చరిత్ర లాంటి ఉత్తమమైన సాంస్కృతిక అంశాలతోనూ, మరికొన్ని చోట్ల వాటికి పూర్తి భిన్నంగా 'gibberish' భాషలో అతి సామాన్యమైన, ఒకింత అర్థంపర్థం లేని సంభాషణలూ, పారడీలతోనూ ఎగుడుదిగుడు రోడ్ల మీద పడుతూ లేస్తూ చేసే ప్రయాణాన్ని తలపిస్తుంది. కేంబ్రిడ్జి సెంటినరీ యులీసిస్' కు సంపాదికత్వం వహించిన క్యాథెరిన్ ఫ్లిన్ తన ఉపోద్ఘాతంలో "At a larger scale, Ulysses challenges the reader through its defiance of conventional modes of narration and characterization" అంటారు. జాయిస్ ఈ నవలను రాసిన తర్వాత, "భవిష్యత్తులో ఈ డబ్లిన్ నగరమూ, దాని సంస్కృతీ పూర్తిగా అదృశ్యమైపోయినా, నా పుస్తకం ఆధారంగా ఆ నగరాన్ని యథాతథంగా పునర్నిర్మించవచ్చు" అని తన మిత్రుడు, చిత్రకారుడూ అయిన ఫ్రాంక్ బడ్జెన్ తో అన్నారట.
ఐదువందల పేజీల పుస్తకాన్ని అరగంటలో కుదించే వెబ్ సిరీస్లు, అంతకంతకూ క్షీణించిపోతున్న మన అటెన్షన్ స్పాన్ ని సూచించే అర నిముషం వీడియోలు- ఇవన్నీ కలగలసిన 'ఇన్స్టంట్' సంస్కృతిలో 'యులీసిస్' చదవడం రాటుదేలిపోయిన మెదడును రీవైర్ చెయ్యడంలాంటిది. మొండి పశువు కొమ్ములు బలవంతంగా వంచడంలాంటిది. ఇలాంటి నవలలు మనం నేర్చుకున్నదంతా వదిలించుకుని మళ్ళీ పూర్వపు విద్యార్థిగా మారే అవకాశమిస్తాయి. ముఖ్యంగా జాయిస్ వాడిన ఐరిష్ యాసతో కూడిన 'పక్కా లోకల్' భాష మనకి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉందనే నమ్మకాన్ని తునాతునకలు చేసిపారేస్తుంది. మార్కస్ జూసాక్ నవల 'బుక్ థీఫ్'లో లీసెల్ మెమింగర్ చిన్నప్పుడు చదవడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్కో అక్షరాన్నీ కూడబలుక్కుంటూ పదాలను పేర్చుకోవడం గురించి రాస్తారు. అదే విధంగా జేమ్స్ జాయిస్ 'యులీసిస్' మనలో బాల్యంలో ఎక్కడో కోల్పోయిన తొలి పాఠకుడిని మరోసారి వెలికితీస్తుంది.
తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వివిధ - ఏప్రిల్ 7, 2025
https://www.andhrajyothy.com/2025/editorial/reading-ulysses-in-the-age-of-reels-1389989.html?fbclid=IwY2xjawLsd9JleHRuA2FlbQIxMABicmlkETF3bEFEbTVmQWtrUll1QVdEAR6Bxl1ZfvWpdczqUFghfV-_hr_f9aJ1VcBo-174tpLpytrt-nsZSn1fEZUNtQ_aem_yHHOYbKQ1jUwDQ7SO6VuEg
No comments:
Post a Comment