Monday, September 28, 2026

The Proustian Reader - 3. Proust, Paintings, and the Art of Seeing

మార్సెల్ ప్రూస్ట్‌ తన నవల "In Search of Lost Time" గురించి జాన్ కోక్టోతో "My book is a painting" అని అన్నారట! ప్రూస్ట్ వచనంలో శైలీ, స్వభావాల్ని చెప్పడానికి ఇంతకంటే సంక్షిప్తమైన మాట మరొకటి ఉంటుందనుకోను. ఆయన దృష్టిలో పెయింటింగ్‌, రైటింగ్‌ రెండూ వేర్వేరు కావు, పదాలతో ఒక పూర్తి స్థాయి ప్రపంచాన్ని చిత్రించడం. చిత్రకారుడు రంగులతో కాన్వాస్‌ పై చిత్రాలను సృష్టించినట్లే, ప్రూస్ట్ జ్ఞాపకాలు, అనుభూతులు, కాలం, మనుషులు, ప్రకృతి, ప్రేమ వంటి వాటిని తన వాక్యాలతో వర్ణించారు. బహుశా అందుకే, ప్రూస్ట్ లో చిత్రకారుడిలా రాయాలనే కోరిక పుస్తకమంతా అనేక దశల్లో కనిపిస్తుంది. ఈ నవలలో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల పేర్లు, వారి పెయింటింగ్స్ పదేపదే ప్రస్తావనకు వస్తాయి.

Image Courtesy Google

ప్రూస్ట్ వచనంలో మనకు కనిపించేవి కథ, కథనాలు అనేకంటే, ఒక "దృశ్యానుభవం" అనొచ్చు. ఈ నవలలో పాత్రలు ఒకే రంగుతో వేసిన చిత్రాలు కాదు, వెలుగు మారే కొద్దీ రంగులు మారే చిత్రంలా, కాలం, జ్ఞాపకాల ప్రభావంతో అవి కొత్త రూపాలను సంతరించుకుంటాయి. ప్రూస్ట్ ప్రపంచంలో వస్తువులు కూడా నిశ్చల స్థితిలో ఉండవు. ఉదాహరణకు మార్సెల్ బాల్యం గడిచిన కాంబ్రే చర్చి గోపురం ఉదయకాంతిలో ఒక విధంగా, సంధ్య వెలుగులో మరో విధంగా కనిపిస్తుంది. పారిస్ లో మార్సెల్, గిల్బెర్టెను కలవడానికి వెళ్ళే Champs-Élysées దారిలో ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, ఆ కుర్రవాడి తొలిప్రేమ పొంగు, ఉత్సాహం, విరహం-- ఇవన్నీ కోల్పోయిన జ్ఞాపకాల తాలూకు మాధుర్యాన్ని మనకు పరిచయం చేస్తాయి. ప్రూస్ట్‌కు "జ్ఞాపకం" ఒక కళాకారుడి కుంచెతో సమానం.

అందుకే ప్రూస్ట్ వచనంలో గతాన్ని ఒక కనుమరుగైపోయిన విషయంగా చూడడం సరికాదు. సాయంత్రం టీలో ముంచుకుని తిన్న మెడెలైన్ కేకుల రుచో, గాలీ వెలుతురూ చొరబడని గదిలోని ఉక్కపోత వాసనో, మరో మనిషి స్వరమో, వర్షమో, మరేదో చిన్న అనుభూతో అకస్మాత్తుగా ఆ గతాన్ని మేల్కొలుపుతుంది, పాఠకుల మనసులో ఆ అనుభవం పునఃసృష్టించబడుతుంది. పాఠకులం గతకాలపు అనుభవాలపై కాలగతిలో పేరుకున్న పొరలను తొలగిస్తూ, ఆ ప్రపంచాన్ని మళ్ళీ చూస్తాము. ఈ మొత్తం ప్రక్రియలో రచయిత కేవలం తన జ్ఞాపకాలను పొందుపరిచే వ్యక్తిగా కాకుండా, వాటి ద్వారా మరో కొత్త వాస్తవాన్ని సృష్టించే చిత్రకారుడిగా మారతాడు. అందుకే "In Search of Lost Time" కేవలం ఒక నవల కాదు, అది సుమారు "నాలుగు వేల పేజీల విశాలమైన సాహిత్య కాన్వాస్" అంటాను.

చాలామంది రచయితల్లాగా ప్రూస్ట్ తన ఇంటలెక్చువల్ సుపీరియారిటీని చాటిచెప్పడానికి ఆ పెయింటింగ్స్ ని తన రచనలో కేవలం అలంకారప్రాయంగా వాడుకోలేదు. వాటిని తన వర్ణనలకు సందర్భోచితమైన  ప్రతీకలుగా ఉపయోగించారు. చిత్రకళ ప్రూస్ట్ వచనంలో వ్యక్తీకరణకు అత్యవసరమైన నిర్మాణాత్మకమైన అంశం. అంటే ప్రూస్ట్‌ నవలలో పెయింటింగ్ కేవలం కనిపించదు, అది నవల ముందుకు నడవడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, దాని అంతర్భాగంగా, కథలో ఫిజికల్ రియాలిటీని అణువణువునా ప్రభావితం చేస్తూ వస్తుంది. అందుకే ఈ నవలలో ప్రూస్ట్ మాటల్లోనే చెప్పాలంటే, "కళకు సంబంధించిన అనేక పొరలు" [several thicknesses of art] కనిపిస్తాయి.

వచనాన్ని పొరలుగా (లేయర్స్ గా) రాయడం ప్రూస్ట్‌ రచనా శైలిలో చాలా కీలకం. ఒక అనుభూతిని ఒక్క మాటతో చెప్పడం కాకుండా దాని మీద మరో జ్ఞాపకపు పొర, ఇంకో భావోద్వేగపు పొర, మరింకో దృశ్యం, ఇంకేదో పోలిక, కళాకృతి, అనుభవం--  ఇలా ఒకదానిపై ఒకటి వేస్తూ పోవడం. దాని వల్ల ఆయన వచనంలో ఒక రకమైన మల్టీ డైమెన్షనల్ వెలుగుతో నిండిన "luminous" స్వభావం కనిపిస్తుంది. ఈ సందర్భంలో క్లాడ్ మోనే పెయింటింగ్స్ గురించి  కూడా చెప్పుకోవాలి. క్లాడ్‌ మోనే  "ఇంప్రెషనిజం" ప్రూస్ట్‌ను చాలా లోతుగా ప్రభావితం చేసిందంటారు. మోనే చిత్రాల్లో ఒకే విషయం పదేపదే కనిపిస్తుంది. ఉదాహరణకు, మోనే ల్యాండ్ స్కేప్స్, వాటర్ లిల్లీస్ లాంటివి పదే పదే చిత్రించేవారు. కానీ మనం గమనిస్తే ప్రతి పెయింటింగ్ లోనూ వెలుగు మారుతుంది, వాతావరణం మారుతుంది, సమయం మారుతుంది, తత్ఫలితంగా మన కంటికి కనిపించే దృశ్యం కూడా మారుతుంది. విషయం అదే అయినా, మనం దాన్ని చూసే అనుభవం ప్రతిసారీ కొత్తది. మోనే లాగే ప్రూస్ట్‌ కూడా తనకున్న ఒకే జీవితాన్ని, ఒకే ప్రపంచాన్ని వివిధ వెలుగుల్లో, దశల్లో, మానసిక స్థితుల్లో వెనక్కు తిరిగి మళ్ళీ మళ్ళీ చూశారనిపిస్తుంది. అందుకే "In Search of Lost Time" ఒక కథలా కాకుండా, అనేక చిత్రాల, జ్ఞాపకాల, అనుభూతుల, కాలాల విస్తారమైన నిర్మాణంలా, ఒక ఇంప్రెషనిస్ట్‌ శ్రద్ధగా వేసిన పెయింటింగ్‌ లా అనిపిస్తుంది. 'కళ' కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోకుండా, మనుషులు తమతో బాటు ఒకరినొకరు అర్థంచేసుకునే పరిభాషగా మారిపోతుంది.

స్వాన్- ఓడెట్ ల ప్రేమలో ఆకర్షణ అంతా ఓడెట్ ఎంత అందంగా ఉందన్న దానికంటే స్వాన్ ఆమెను ఎలా చూస్తున్నాడన్న విషయంలోనే ఉంటుంది. తొలిచూపులో స్వాన్ కు ఓడెట్‌ పట్ల ఎటువంటి ఆకర్షణా కలగదు. కానీ ఒకరోజు బొట్టిసెల్లీ చిత్రించిన "The Trials of Moses"లోని Zipporah అనే స్త్రీని చూసి ఆమె అచ్చం ఓడెట్‌ లాగే ఉందని అనుకుంటాడు. అంతే, ఆ క్షణం నుండీ స్వాన్ దృష్టిలో ఓడెట్ ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటివరకు సాధారణంగా కనిపించిన స్త్రీ కాస్తా బొట్టిసెల్లీ చిత్రంలోని పవిత్రమైన బైబిల్ పాత్రలా కనిపిస్తుంది. ఇక్కడ స్వాన్ ప్రేమలో బొట్టిసెల్లీ ఒక చిత్రకారుడు మాత్రమే కాదు, స్వాన్ కు ఓడెట్ ను ప్రేమించడానికి ఒక ప్రత్యేకమైన ప్రేమ పరిభాషను సృష్టించి ఇచ్చిన లింగ్విస్ట్ గా మారిపోతాడు. మనకు ఒక మనిషి ఎలా కనిపిస్తాడనేదాని కంటే, మన మనసులో అతని ఇమేజ్ ఎలా తయారైందన్నదే ముఖ్యమని ప్రూస్ట్ భావన.

The Trials of Moses by Sandro Botticelli

ఈ నవలలో చాలా చోట్ల మార్సెల్, స్వాన్- వీరిద్దరూ తమ చుట్టూ ఉన్న మామూలు మనుషుల్ని పాత పెయింటింగ్స్ తో, కళాకృతులతో పోల్చడం గమనిస్తాం. మార్సెల్ కాంబ్రేలోని తన అత్త లియోనీ దగ్గర వంట మనిషి ఫ్రాంకోయిస్ ముఖాన్ని Giotto యొక్క "Charity" చిత్రంలోని స్త్రీతో పోలుస్తాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఒక రకమైన మొరటుతనం, జీవశక్తి కనిపిస్తుందంటాడు. మార్సెల్ కు ఉన్న అదే అలవాటు స్వాన్ కి కూడా ఉంటుంది. అతనికి Antonio Rizzo చెక్కిన "Doge Loredan" శిల్పంలో తన కోచ్‌మన్ ముఖంతో ఒక ఆశ్చర్యకరమైన పోలిక కనిపిస్తుంది. అదే విధంగా Tintoretto వేసిన ఒక పోర్ట్రెయిట్లో స్వాన్ తన డాక్టర్ Dr. du Boulbon ముఖాన్ని చూస్తాడు. స్వాన్ లో కళాకృతుల్లో తనకు తెలిసిన మనుషుల శారీరక లక్షణాలను చూసే ఈ అలవాటే ఓడెట్ పట్ల వ్యామోహానికి కూడా కారణమవుతుంది. ప్రూస్ట్‌ కి సంబంధించి కళ అనేది కేవలం సౌందర్యాన్ని ఆస్వాదించే విషయం కాదు, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని నేర్పే దృక్పథం.

మార్సెల్ లో కళపట్ల ఇటువంటి అభిరుచికి కారణం అతని అమ్మమ్మ. ఆవిడ మనవడికి పుట్టినరోజు కానుకగా పుస్తకాలు బహుమతిగా ఇచ్చేటప్పుడు ఏవో కొన్ని పుస్తకాలు కాకుండా కళల పట్ల మార్సెల్ అభిరుచుల్ని తీర్చిదిద్దే ఉత్తమమైన రచనల్ని ఎంపిక చేసి మరీ ఇచ్చేది. పఠనం కూడా ఒక నైతికమైన పనే అని నమ్ముతూ, మనం చదివే పుస్తకాలూ, పరిసరాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయని మార్సెల్ గదిని చారిత్రక భవనాలు, అందమైన ప్రదేశాల చిత్రాలతో అలంకరించేది. కానీ గొప్ప ప్రదేశాలూ, పురాతన కట్టడాల ఫోటోలు తీసి గోడలకు తగిలించుకోవడమంటే ఆవిడకి తీవ్రమైన అయిష్టత ఉండేది. అందుకే నేరుగా వాటి ఫోటోలను పెట్టకుండా, వాటి పెయింటింగ్స్ కొని మార్సెల్ గదిలో పెట్టేది. ఫొటోల్లో యాంత్రికత, వాణిజ్యపు వాసనలకు దూరంగా ఆ ప్రదేశాలను మార్సెల్ ఒక కళాకారుడి దృష్టిలోంచి చూడాలని తపనపడేది. ప్రూస్ట్ తర్వాత ఈ "మల్టీ లేయర్డ్ వ్యూ"ని "Thicknesses of art" అంటారు. ఉదాహరణకు, Corot చూసిన Chartres Cathedral, Hubert Robert చూసిన Fountains of Saint-Cloud, Turner చూసిన Vesuvius లాంటివి మార్సెల్ కు అలా పరిచయమయినవే. నిజానికి అమ్మమ్మకు  కావలసింది ఆ ప్రదేశం యొక్క ఫోటో కాదు, ఆ ప్రదేశాన్ని కళాకారుడి దృష్టితో చూడటం.

1.Corot: Chartres Cathedral, 2.Hubert Robert: Fountains of Saint-Cloud,
 3.Turner: Vesuvius 

ఇక్కడే ప్రూస్ట్ పాఠకులను ఆలోచనలో పడేస్తారు. మన కళ్ళకు మనుషులు నిజంగా కనిపిస్తారా? లేక మన అవసరాలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు-- ఇవన్నీ కలగలిసిన రంగుల్లోనే వాళ్ళను చూస్తామా? స్వాన్ కు చిత్రకారుడు బొట్టిసెల్లీ ఒక అద్దం కాదు, ఒక ప్రిజం. ఆ ప్రిజంతో అతను ఓడెట్ ను చూడటం లేదు, తన అంతఃప్రపంచపు వెలుగుని ఆమె మీదకి ప్రసరింపజేస్తున్నాడు. తద్వారా బొట్టిసెల్లీ చిత్రం అతనికి ఒక "transitional object"లా, అంటే ఒక మధ్యవర్తిత్వం చేసే వస్తువులా, ఓడెట్ కూ, స్వాన్ ఊహల్లోని 'ఐడియల్ ఇమేజీకీ' ఒక వంతెనగా మారుతుంది.

స్వాన్ ప్రేమలో ఐరనీ ఏంటంటే, అతను తాను సృష్టించుకున్న భ్రమతోనే ప్రేమలో పడతాడు. అలాగని స్వాన్ ఏదో డెల్యూషనల్ అనో, పిచ్చివాడనో అనుకోలేం! అతనిది చాలా "ఆధునికమైన ప్రేమ"...దాన్ని కళ, సంస్కృతి, ఎస్థెటిక్స్, చరిత్ర-- ఇవన్నీ వాడుకుని మరీ సమర్థించుకుంటాడు. ఒక సాధారణమైన వ్యామోహాన్ని పూర్తిస్థాయి కళాత్మక అనుభవంగా మార్చుకుంటాడు. కవి రిల్కే కూడా ప్రేమను మన లోపలి ప్రపంచాన్ని విస్తరించే అనుభవంగా చూస్తారు. కానీ రిల్కే మనకు ప్రేమలో దూరాన్ని గౌరవించమని నేర్పుతారు. దీనికి భిన్నంగా, స్వాన్ ఆ దూరాన్ని తట్టుకోలేడు, అతనికి నిజమైన ఓడెట్ కంటే, తనకు అందుబాటులో ఉండే ఆమె తాలూకూ ఊహే అపురూపం. అది అతనికి ప్రాణవాయువుతో సమానం.

నిజానికి మనుషులందరూ కూడా ఇంతేనేమో! మనిషి తన అనుభవాలకు అర్థం ఇవ్వకుండా ఉండలేడు. కానీ ఆ క్రమంలో మనసుకు నచ్చచెప్పుకునే కథే వాస్తవాన్ని కప్పేస్తుంది. మనకు వాస్తవం కంటే దాని గురించి మనం తయారు చేసుకున్న కథే ఎక్కువ అవసరం, ఆసరా అవుతుంది. ఒక మనిషిలో మనం చూసే ప్రత్యేకత నిజంగా ఆ మనిషిలో ఉంటుందా? లేక మనలో ఉండే లోపాలూ, మన గతానుభవాలు, మనం చదివిన పుస్తకాలూ, ఆస్వాదించిన కళలూ, భావోద్వేగాలు, ఒంటరితనం-- ఇవన్నీ కలిసి ఆ మనిషికి లేనిపోని ప్రత్యేకతను ఆపాదించాయా? ఒక సంబంధంలో మనం ప్రేమించేది ఎదుటి వ్యక్తినా, లేక ఆ వ్యక్తిలో మనం చూడాలనుకుంటున్న మన ప్రపంచాన్నీ, రూపాన్నా? మిలియన్ డాలర్ ప్రశ్నే!!

ప్రూస్ట్‌ను చదవడంలో ఒక విశేషం ఉంది. అసలు కథేమిటా అని వెతుక్కోకుండా ఆయన సృష్టించిన ప్రపంచంలో అలా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటే దారిలో మనం ఊహించని అనేక అద్భుతాలు కనిపిస్తాయి. వాటిల్లో ప్రూస్ట్ పెయింటింగ్స్ గురించి రాసిన భాగాలు కొన్ని. ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలు, చిత్రకారులు, సంగీతం, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్, ప్రదేశాలు-- ఇలా సమస్తమైన ఆర్టిస్టిక్ ప్రపంచాన్నీ ఇవేమీ తెలీని పాఠకుడి చేయి పట్టుకుని దగ్గరుండి మరీ సింహావలోకనం చేయిస్తారు. "In Search of Lost Time"లో ప్రూస్ట్ పెయింటింగ్స్ గురించి రాసిన వర్ణనలు చదువుతున్నప్పుడు అసలు కథలో పాత్రల కంటే వాటి దగ్గరే ఎక్కువసేపు ఆగిపోయేదాన్ని. ఒక్కో చిత్రాన్నీ ఆయన కళ్ళతో చూస్తుంటే, మామూలు దృష్టిని దాటిపోయే లేయర్స్ అన్నీ ఒక్కో పొరా విడదీసి చూస్తున్నట్లు అనిపిస్తుంది.ప్రత్యేకం పెయింటింగ్స్ గురించిన ఈ భాగాలు చదువుతున్నప్పుడు మనం మన ఎదురుగా ఉన్న మనిషిని వాస్తవంగానే చూస్తున్నామా లేక మనదైన ప్రత్యేకమైన ఫిల్టర్ లోంచి చూస్తున్నామా? అనే అనుమానం తప్పకుండా వస్తుంది. ఆ ఫిల్టర్లు ఏదో ఒక చిత్రమో, జ్ఞాపకమో, అనుభవమో, కోరికో-- ఇలాంటివేవైనా కావచ్చు. అందుకేనేమో, ప్రూస్ట్‌ను చదవడం నాకు తెలీకుండానే ఒక వ్యక్తిగతమైన అనుభవంగా మారిపోయింది.

తొలి ప్రచురణ: ప్రజాతంత్ర "శోభ" - https://www.prajatantranews.com/proust-the-painter-of-memories-nagini-kandala/?fbclid=IwY2xjawUmvfdleHRuA2FlbQIxMABwZG9mBWJyaWQRMUkxeFpLZEl0OFg3dDJMWGRzcnRjBmFwcF9pZBAyMjIwMzkxNzg4MjAwODkyAAEe8r4WuAw-QTPCW2fv62_GI35gX4yHZOXGkZ5sLjxvfoVJBWvCZO0WkARBY24_aem_3gyWu6EAL-J4qYRh88k5ag