ఆస్ట్రియన్ రచయిత రాబర్ట్ ముసిల్ మాగ్నమ్ ఓపస్ 'ది మాన్ వితౌట్ క్వాలిటీస్' లో కథానాయకుడు అల్రిచ్ స్పోర్ట్స్ మాగజైన్లో ప్రచురించిన ఒక వ్యాసంలోని వాక్యం 'a racehorse of genius' చదివి ఆలోచనలో పడతాడు..ఆ సందర్భంలో అల్రిచ్ కి ప్రపంచ చరిత్ర యావత్తూ ఈ వాక్యంతోనే ముడిపడి ఉన్నట్లు తోస్తుంది..వెనువెంటనే అతడు ఒక మాథెమెటీషియన్ గా తన జీవితం నుండి ఒక సంవత్సరం పాటు శెలవు తీసుకుని 'ఎ మాన్ వితౌట్ క్వాలిటీస్' గా రూపాంతరం చెందుతాడు..ఈ కథ విన్నప్పుడు తరతరాలనుండి వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలూ,రాజకీయ సామజిక స్థితిగతులూ,సాంఘిక నియమాలూ,వ్యవస్థలూ మనకు ఆపాదించిన అస్తిత్వపు చిహ్నాలను సమూలంగా చెరిపేసి అల్రిచ్ లా శెలవు తీసుకోవడం మనకు కుదిరే పనేనా అనిపిస్తుంది..గత సంవత్సరం చదివిన ఒట్టెస్సా మోష్ఫెగ్ రచన 'మై ఇయర్ ఆఫ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్' లో కూడా యధాతథంగా కాకపోయినా దాదాపూ ఇటువంటి అంశమే చర్చకు వస్తుంది..అందులో యువ కథానాయిక జీవితపు నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక సంవత్సరంపాటు ఒంటరిగా తన అపార్ట్మెంట్లో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ నిద్రాణస్థితిలో జీవించాలని నిర్ణయించుకుంటుంది..రాబర్ట్ ముసిల్ కథానాయకుడు సంఘజీవిగా తన అస్తిత్వాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ,మోష్ఫెగ్ కథానాయిక ఒంటరితనంతో అలసిపోయి డిప్రెషన్ బారిన పడుతున్న నేటి తరానికి ప్రతినిధిలా కనిపిస్తుంది..ఏదేమైనా ఈ రెండు కథల్లోనూ అలసిపోయి అస్తిత్వపు మూలలను వదిలించుకోవాలనే తపన మాత్రం సుస్పష్టం..సాంస్కృతిక మూలాలను రక్షించుకోవడం పేరిటో లేదా సౌకర్యవంతమైన మార్గమనుకునో అనుకరణ,అనుసరణలను విధిగా పాటిస్తూ జీవించేవారు కొందరైతే,Be a Roman in Rome తరహాలో తమ చుట్టూ ఉన్న పరిసరాలకూ,మనుషులకూ,వ్యవస్థలకూ అనుగుణంగా తమ ఉనికిని నిరంతరం మార్చుకుంటూ స్పష్టమైన అస్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు..కానీ ప్రాక్టికల్ గా అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడం మన చేతుల్లో ఉండే పనేనా ?
Image Courtesy Google |
ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతీ,సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు,చరిత్ర,నాగరికత లాంటివి అందించబడతాయి..ముఖ్యంగా సాహిత్యంలో కథలూ,కవిత్వం లాంటివి ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా వర్తిస్తాయి..సాహితీ ప్రపంచంలో 'మిత్' (పురాణం/గాథ) చాలా ప్రత్యేకమైనది..ఈ 'మిత్' ను వాడుక భాషలో పుక్కిట పురాణమని కూడా అంటుంటాం..'మిత్' చరిత్రను సజీవంగా ఉంచుతుంది..ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో, బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం,చిత్రలేఖనం ,నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో ,ఇతరత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థలోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి..పాలిటిక్స్,జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్ బార్త్ , తన 'మైథాలజీస్' లో 'మిత్' గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా 'సైన్ ని సిగ్నిఫైర్ గా మార్చే సెమియోటిక్ సిస్టం లో భాగమని' అంటారు..వివిధ సంస్కృతులకు సంబంధించిన చరిత్ర యావత్తూ ఈ మిత్ ప్రాతిపదికగా రూపొందినదే..మిత్స్ సమాజాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.
ఇటాలియన్ రచయిత రోబర్టో కలాస్సో 'ది ఫోర్టీ నైన్ స్టెప్స్' అనే పుస్తకంలో 'ది టెర్రర్ ఆఫ్ ఫేబుల్స్' పేరిట రాసిన వ్యాసంలో మిత్ కు కొన్ని పేజీలు కేటాయిస్తూ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు..చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..కథలూ,గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటని ఆశ్చర్యంగా అనిపించినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు..ఈ మిత్ ను రెండు అర్ధాల్లో తీసుకోవచ్చు అంటారు కలాస్సో : మొదటిది, 'ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం' అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో 'ఒక అబద్ధం / భ్రమ / పుక్కిటి పురాణమని' కొట్టిపారేసేది..మిత్ గురించి చర్చించే నేపథ్యంలో ప్లేటో 'రిపబ్లిక్' ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్ కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో 'రిపబ్లిక్' లోనే అంటారు..ప్లేటో 'రిపబ్లిక్' లో తాత్వికతకూ,కవిత్వానికీ పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు..ఆనాటికి కవిత్వానికి మారు పేరేదైనా ఉందంటే అది ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసి,ఇలియడ్,ఒడిస్సీలను సృష్టించిన హోమర్ మాత్రమే..ఆ కోణంలో చూస్తే మొత్తం రిపబ్లిక్ ను ప్లేటో, హోమర్ ల మధ్య ఘర్షణగా పరిగణించవచ్చు..గ్రీకులు హోమర్ ను తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా , ప్రపంచానికీ , దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధిగా చేసిన అనుసంధానకర్తగా చూస్తారు..అటువంటి హోమర్ ని ప్లేటో , 'రిపబ్లిక్' రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిట పురాణాలు సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు..ఇక రిపబ్లిక్ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను 'మిమెసిస్' (the dangerous art of imitation) సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు..కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిథ్యం వహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమయ్యారని అంటారు ప్లేటో.
హోమర్ కు వ్యతిరేకంగా ప్లేటో వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది చేసిన అభియోగాలనుకుంటే పొరపాటే..నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్ దృష్టికోణం నుండి చేసినవేనంటారు కలాస్సో..ఒక వేళ హోమర్ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, నిరంతరం తమ రూపాలను మార్చుకుని మానవుల్ని మోసం చేసే దేవుళ్ళను ఇంద్రజాలికులుగా , మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది..కానీ నిజానికి దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాంతరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి కాదు..హోమర్ ఆ మెటామార్ఫోసిస్ కు పరోక్షంగా ప్రాతినిథ్యం వహించే సాధనంగా మాత్రమే అగుపిస్తారు..ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా,నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్ జోన్ సహజంగానే ఫిలాసఫర్లకు శత్రు సమానంగా కనిపిస్తుంది..అందువల్ల వాస్తవికతకు సుదూరంగా అబ్సర్డిటీ తో కూడిన ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే కవులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంఘం నుండి బహిష్కరింపబడాలన్నది ప్లేటో వాదన.
నిశితంగా గమనిస్తే ఆంగ్లో సాక్సన్ల క్రిస్టియానిటీకీ, వైకింగ్స్ పాగనిజానికీ మధ్య ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వైరం లాంటిదే ప్లేటో హోమర్ ల మధ్య 'సిములాక్రం' లో (Simulacrum = వాస్తవానికి ప్రతిరూపం/అనుకరణ/ప్రాతినిథ్యం వహించేది) కూడా కనిపిస్తుంది..'సిములాక్రం' మనిషిని తనను అనుసరించమని శాసిస్తుంది,దానిని చూసిన మనిషి తన ప్రమేయం లేకుండానే దాని ప్రతిరూపంగా మారిపోతాడు..ఒకవేళ ప్లేటో రిపబ్లిక్ లో భావించినట్లు సిములాక్రం వాస్తవదూరంగా,లోపభూయిష్టంగా ఉన్న పక్షంలో దానికి రూపకల్పన చేసిన కవి కూడా తాను సృష్టించిన దేవుడిలాగే ఇంద్రజాలికుడిలా,తాంత్రికుడిలా మారిపోతాడు..అందువల్ల దైవమైనా,ఆ దైవాన్ని సృష్టించిన కవి అయినా 'సిములాక్రం' అన్న పదంలో కంటికి కనిపించని శత్రువుల్లా దాగి ఉన్నారన్నది ప్లేటో భావన..దీనినే మరో విధంగా చూస్తే , 'మిత్' అనేది ఒక అవాస్తవికతను మరో అవాస్తవికతగా చూపించే ప్రయత్నం చేస్తుంది..ప్లేటో ఈ అవాస్తవికతను వ్యతిరేకిస్తారు.
ఈ తరహా హోమరిక్ మిత్ నూ, వాళ్ళ 'మిమెటిక్' పోయెట్రీ నీ ఖండించిన 'ప్లేటో ప్రపంచం'లో కేవలం కవికే గాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు..ప్లేటో కవిని "A man skillfully able to transform himself into everything" అని నిర్వచిస్తారు..కవిత్వం విషయంలో సిములాక్రా , అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్ పదాల వాడకం పట్ల ప్లేటో కి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయినప్పటికీ , కావ్యసృష్టిలో భాగమైన మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుంటాయంటారు కలాస్సో..మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడంతో 'A is transformed into B' అనే బదులు 'A is B' అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది..మొదటిది (మెటామోర్ఫోసిస్) ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి అంటే నేరేటివ్ కి అవకాశమున్న అంశం కాబట్టి ఏ ఇమేజ్ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞానసముపార్జనకు ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ,నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక..దీనికి భిన్నంగా, రెండో పద్ధతి 'A is B' నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్పుట్,ఔట్పుట్ పద్ధతిలో ఉండడం వల్ల మెటామోర్ఫోసిస్ కు అవకాశం శూన్యం..అందుచేత ప్లేటో మెటామోర్ఫోసిస్ ని తిరస్కరించడం అంటే,కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ,తద్వారా ఇమేజ్ ని అర్థంచేసుకునే (cognitive power ) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క.
ప్లేటో వాదనలో ఉన్న లొసుగులు చూశాం కాబట్టి,ఇప్పుడు ఆయన చెబుతున్న ఇమిటేషన్ లో ఉన్న ప్రమాదాలేమిటో కూడా చూద్దాం..పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి,తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి..ఈ మాయలో పడ్డవాళ్ళు కర్ట్ వన్నెగట్ సృష్టించిన Karass (A network or group of people who are somehow affiliated or linked spiritually ) లాంటివాళ్ళు..గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేని వీళ్ళు తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు.
ఇక మిత్ ను గురించి సోక్రటీస్ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకు కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది..ఈ విషయంలో ప్లేటో లో ఉన్న మొండితనం సోక్రటీస్ లో కనిపించదు..సోక్రటీస్ మిత్ గురించి మాట్లాడుతూ “Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., with the fables themselves].” అంటారు..ఈ సందిగ్ధంలో రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి..ప్లేటో హెచ్చరించిన అస్పష్టత,అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశమివ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఇక్కడ ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం.
ఈ మిత్ ప్రభావాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్ మిత్ ను ఉదహరిస్తారు కలాస్సో : మిత్ మనమీద చెక్కతో చేసిన టారియన్ ఆర్టెమిస్ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన..ఓరెస్టిస్ దాన్ని ఆలయంలోనుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువుకుని పారిపోతున్నంతసేపూ అతడిలో ఒకవిధమైన ఉన్మాదం జనిస్తుంది..చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకుని యూరోటస్ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు..ఆ విగ్రహం అక్కడే ఏళ్ళ తరబడి ఎవరికంటాబడకుండా శిథిలమైపోతుంది..ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్ యువకులు ఆస్ట్రాబాకస్,ఏలోపెకస్ లు యాదృచ్చికంగా ఆ విగ్రహం చూడడం జరుగుతుంది..తీక్షణంగా తమకేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తున్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవుతారు..సిములాక్రం కి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో..దాని గురించి అర్థం చేసుకోగలిగిన వారిని మాత్రమే అది నయం చేస్తుంది..మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాథిలా సంక్రమిస్తుంది..
Thus the myth: The power that arouses terror is also the only one that can cure it, as happened with Orestes. But only if it is recognized for what it is.
తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ : 2 ఆగష్టు 2021
https://lit.andhrajyothy.com/vividha/poet-pleto-37634
https://www.andhrajyothy.com/telugunews/what-did-plato-have-to-do-with-poets-19210802042167?fbclid=IwAR0hR2M9kZvzyIyZ9yJrYkH-Klr53Vz_oy-OYh6GhMF2lTSYdjfh7bELCE4
No comments:
Post a Comment