Saturday, August 22, 2020

Experience : Early Writings (1910–1917) - Walter Benjamin

ఈ మధ్య వాల్టర్ బెంజమిన్ ఎర్లీ రైటింగ్స్ లో కొన్ని వ్యాసాలు చదివాను..ఇందులో కొన్ని ఆయన  అంతరంగాన్ని మనకు పరిచయం చేసే వ్యక్తిగతమైన వ్యాసాలు..ఈ అక్షరాల్లో ఒక యువకుడిగా బెంజమిన్ మనకు అత్యంత సన్నిహితమైన సహచరునిలా అనిపిస్తారు..ఒక వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు అతడి భావాలు ఎలా ఉంటాయి ? అతడి కలలూ,కల్పనలూ వాస్తవిక ప్రపంచపు దాడికి గురైనప్పుడు అతడి ఆలోచనలు ఎటువంటి ఎదురుదాడి చేస్తాయి ? బెంజమిన్ దృష్టిలో అనుభవానికి నిర్వచనం ఏమిటి ? 'అనుభవం' వ్యాసానికి నా స్వేఛ్ఛానువాదం.

అనుభవం : 

యవ్వనపుపొంగు దాటి పరిణితి చెందిన వ్యక్తిగా మారిన ప్రతివారూ ముఖానికి అనుభవమనే ముసుగును ధరిస్తారు (కోవిడ్ మాస్క్ కాదన్నమాట :) )..మనిషికి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఈ ముసుగుతో నిత్య సంఘర్షణ పరిపాటి..ఈ ముసుగు అభేద్యమైనది,ఏ విధమైన మార్పూ,వ్యక్తీకరిణా లేనిదీను..అడల్ట్ గా మనం పిలుచుకునే వ్యక్తి,తన జీవితంలో దాదాపు అన్నీ అనుభవించి ఉంటాడు..యవ్వనం,ఆదర్శాలు,ఆశలు,ఆశయాలూ, అమ్మాయిలూ : కానీ చివరకు ఇదంతా ఉత్త భ్రమ అని తేల్చిపారేస్తాడు -- ఇది విని మనం భయానికి లోనవుతాం,ఆ అనుభవాలన్నీ విషతుల్యమని భావిస్తాం..బహుశా ఒకవిధంగా అతడు కరక్టే కావచ్చునేమో..కానీ అతడి వాదనను మనమేవిధంగా ఎదుర్కొంటాం ? "అబ్బే,మేమింకా ఏమీ అనుభవించనిదే !!"

ఆ ముసుగును ఒకసారి తొలగించి చూసే ప్రయత్నం చేద్దాం..నిజానికి ఈ అడల్ట్ తన జీవితంలో ఏమి అనుభవించాడు ? మనకు అసలు ఏం ఋజువు చేద్దామనుకుంటున్నాడు ?  అతడు కూడా ఒకప్పుడు యవ్వనాన్ని అనుభవించి ఉంటాడు,తన మనసుకి నచ్చినదేదో కోరుకునే ఉంటాడు,తల్లితండ్రులు చెప్పినవన్నీ నమ్మకుండా ,ఉట్టి అబద్ధాలని కొట్టిపారేసే ఉంటాడు..కానీ క్రమంగా జీవితం వాళ్ళు చెప్పినవన్నీ నిజమేనని నేర్పించింది..మనతో ఈ మాట అంటూ అతడు గంభీరంగా ఒక సుపీరియర్ ఫ్యాషన్ లో చిరునవ్వు నవ్వుతాడు : ఇదే మీ  విషయంలో కూడా జరుగుతుంది,కావాలంటే చూస్తూ ఉండండి అంటాడు..కానీ ఈలోగా మన పసితనపు చేష్టల్ని అతడు అవహేళన చేస్తాడు..అతడికి వయసుతో బాటుగా వచ్చిన హుందాతనం మనకు కూడా అలవడే వరకూ,మన యవ్వనాన్ని కేవలం చిలిపితనంగా,మన ఆలోచనల్నీ,ఆశయాల్నీ అపరిపక్వతతో కూడిన  చిన్నపిల్లలచేష్టలుగా,విలువలేనివిగా కొట్టిపారేస్తాడు..మరికాస్త ముందువెళ్తే,కొంతమంది ప్రబోధకుల దృష్టిలో యవ్వనానికి అసలు గుర్తింపే ఉండదు : 'అన్నప్రాసనరోజే ఆవకాయపచ్చడి' రీతిలో వీళ్ళు చాలా కఠినంగా తమ అనుభవసారాన్నంతా బోధించి మనల్ని ఉన్నపళంగా ఆ జీవితపు క్రూరత్వపు రొంపిలోకి తోసేసే ప్రయత్నం చేస్తారు..అడుగడుక్కీ రాజీపడే సందర్భాలూ,భావదారిద్య్రములు,భావావేశాల్ని అదుపులో ఉంచే ఉదాసీనత : ఇదే జీవితం,ఇదే మా అనుభవసారమంటారు సదరు పెద్దవాళ్ళు..మనపై ఈ రకమైన దాడి జరిగిన ప్రతిసారీ యవ్వనం అంటే నిత్యం వేసే తప్పటడుగుల్ని సరిదిద్దుకోవడమనో లేక ఈ కాలం నిరర్ధకమైనదనో,క్షణికమైనదనో భావన కలుగుతుంది..కానీ మన జీవితం కూడా చివరకు మరో గొప్ప అనుభవంగా రూపాంతరం చెందుతుంది.

ఈ పెద్దవాళ్ళ అనుభవం అంతే : జీవితం యొక్క నిరర్థకత,కౄరత్వం,ఇంతకుమించి మరొకటి కాదు..ఇటువంటి నిరాశావాదం తప్ప వాళ్ళు ఎప్పుడైనా మనల్ని భవిష్యత్తును మరో క్రొత్త కోణంలో ఆశావహదృక్పథంతో చూడమని ప్రోత్సహించారా ? ఉహూ..ఆ అవకాశం లేదు..ఎందుకంటే అటువంటివి వాళ్ళు కూడా బహుశా అనుభవించి ఉండరు..నిజానికి సత్యం,ధర్మం,జీవన సౌందర్యం ఇవన్నీ సుస్థిరమైనవి,మరి వీటన్నిటి మధ్యా అనుభవం ప్రాముఖ్యత ఏమిటి ? - అసలు రహస్యం ఇక్కడే ఉంది..మేథోసంబంధమైన ,అర్థవంతమైన విషయాలపై దృష్టిసారించని ఫిలిస్టిన్ కేవలం అనుభవప్రధానంగా జీవిస్తాడు..అతడి దృష్టిలో 'అనుభవం' జీవితపు సాధారణ తత్వానికి ఒక అనుమతిపత్రం  లాంటిది..నిజానికి ఈ అనుభవానికి ఆవలవైపు మనం నిర్వర్తించవలసిన విలువలనేవి ఉంటాయని అతడు కనీసం గ్రహించడు..బహుశా అనుభవం తప్ప మరొకటి తెలీని కారణంగానే అతడికి జీవితం నిత్యం అశాంతిగా,నిరర్థకంగా  అనిపిస్తుంది..అనుభవసారాన్ని భద్రపరుచుకున్న అతడి మనస్సును మినహాయిస్తే అతడి ఉనికి దాదాపూ శూన్యం..సాధారణ జీవితానికి సంబంధించి దైనందిన విషయవిశేషాలపై తప్ప అతడు వేరే ఏ ఒక్క విషయంతోనూ కూడా ఏ రకమైన ఆంతరంగిక సంబంధాన్నీ కలిగి ఉండడు.

కానీ అనుభవం మనకు ఇవ్వలేనిదీ,మన దగ్గర నుంచి తీసుకోలేనిదీ ఒకటుంటుంది : మునుపటి ఆలోచనలన్నీ భ్రమలైనప్పటికీ చివరకు మిగిలే సత్యం..లేదా ఎవరూ పాటించనప్పటికీ కేవలం మన సంకల్పబలం చేత నిలబెట్టుకునే విశ్వనీయత..ఏదేమైనా మన పెద్దవాళ్ళు అలసిపోయిన హావభావాలతో కూడిన ఒక సుపీరియర్ నిస్సహాయతతో ఒక్క విషయంలో మాత్రం నిజం చెప్తారు : మనం అనుభవించినదంతా దుఃఖపూరితమైనది,మనం అనుభవించలేనిది మాత్రమే శక్తివంతమైనదీ,అర్థవంతమైనదీ అనీను (?)..అప్పుడు మాత్రమే ఆత్మ పరిపూర్ణమైన స్వేఛ్చననుభవిస్తుంది..అయినప్పటికీ జీవితం దాన్ని కాలుపట్టి క్రిందకి లాగుతూనే ఉంటుంది,ఎందుకంటే జీవితం యొక్క అనుభవసారం అశాంతి మాత్రమేనని తేల్చేస్తారు.

ఏదేమైనా మనమిలాంటి విషయాలు ఇకపై అర్థంచేసుకోలేము..కానీ సోమరితనంతో కూడిన అహంకారంతో నిరాసక్తిగా,నిదానంగా ఆత్మ గురించిన అవగాహన బొత్తిగా లేనివాళ్ళ జీవితాన్నే మనం కూడా జీవిస్తున్నామా ? కాదేమో..ప్రతీ జీవితానుభవమూ ప్రత్యేకమైనది..మనం మన ఆంతరంగిక ప్రపంచపు సౌందర్యం (ఆత్మసౌందర్యం) తో అనుభవానికి ఒక ప్రత్యేకతను  ఆపాదిస్తాము - కానీ సరైన ఆలోచనలేనివాడు తన జీవితంలోకి పొరపాట్లను ఆహ్వానిస్తాడు..మనలాంటి సత్యశోధకులతో "నీవెప్పటికీ సత్యం అంటే ఏమిటో తెలుసుకోలేవు,అది నా స్వానుభవం " అంటాడు..ఏదేమైనా శోధకులకు ఈ పొరపాట్లనేవి సత్యానికి చేరుకోడానికి ఒక ఊతం లాంటివి..కేవలం ఆత్మ ఉనికిని పరిత్యజించిన వారికి మాత్రమే అనుభవం నిరర్థకమైనదిగా అనిపిస్తుంది..నిరంతరం ప్రయత్నించేవాడికి అనుభవం బాధాకరంగా పరిణమించినప్పటికీ అతడిని నిరాశవైపు ఖచ్చితంగా మళ్ళించదు.

అటువంటి శోధకుడు నిస్సందేహంగా ఫిలిస్టిన్ భావజాలపు మాయలో పడి ఓటమిని అంగీకరించడు..కానీ ఫిలిస్టిన్ మాత్రం నిరంతరం అర్థరహితమైనదానిలో మాత్రమే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు..ఆత్మలేదని తనని తాను నమ్మించుకుంటూ,తాను ప్రయాణించే మార్గం మాత్రమే సరైనదని భావిస్తాడు..కానీ విచిత్రమేమిటంటే అతడి కంటే ఎక్కువ ఖచ్చితమైన స్వాధీనతనూ,గౌరవాన్నీ వేరెవ్వరూ ఆశించరు..ఎందుకంటే విమర్శించాలంటే సృజించడం కూడా తెలియాలి..కానీ అది అతడికి చేతకాదు..బహుశా ఈ కారణంగానే అతడి సంకల్పానికి విరుద్ధంగా జరిగే ఆత్మానుభవం కూడా అతడికి ఆత్మవిహీనంగా,డొల్లతనంగా అనిపిస్తుంది.

Tell him
He should honor the dreams of his youth
When he becomes a man.

ఫిలిస్టిన్ యవ్వనప్రాయపు స్వప్నాలను తీవ్రంగా ద్వేషిస్తాడు..ఈ ద్వేషానికి అతడు తరచూ సెంటిమెంటాలిటీ రంగునద్దే ప్రయత్నం కూడా చేస్తాడు..ఎందుకంటే ఈ స్వప్నాలు అతణ్ణి భయపెడతాయి,నిద్రలో ఉలిక్కిపడేలా చేస్తాయి..యవ్వనంలో అందరికీ వినపడే ఆ స్వప్నాల్లోని ఆత్మఘోష అతణ్ణి కూడా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది..అందుకే అతడు దానితో నిత్యం సంఘర్షిస్తూ ఉంటాడు..తనకు ఊపిరాడకుండా చేసిన ఆ అనుభవాన్ని యువతకు చెపుతూ,వాళ్ళకు తమను చూసి తాము నవ్వుకోవడం ఎలాగో నేర్పిస్తాడు..నిజానికి  ఆత్మహీనమైన అనుభవం నిరాశాజనకమైనదే కాదు,చాలా సౌకర్యవంతమైనది కూడా.

ఇది కాకుండా మనకు మరొక అనుభవం గురించి కూడా తెలుసు..పరిణితిలేని వయసులో ఆత్మ గురించిన గ్రహింపులేని అనుభవం ఎన్నో కలల్ని మొగ్గతొడుగుతున్న దశలోనే నాశనం చేస్తుంది,అయినప్పటికీ దీనిలో కూడా ఒక రకమైన సహజత్వం ఉంది..ఇది చాలా స్వఛ్ఛమైనది,ఏదీ స్పృశించ సాధ్యం కానిదీ,సత్వరమైనదీను..ఎందుకంటే మనం యవ్వన ప్రాయంలో ఉన్నంతవరకూ యేది చేసినా ఆత్మసహేతుకంగానే చేస్తాం..Always one experiences only oneself,as Zarathustra says at the end of his wanderings..ఫిలిస్టిన్ కు కూడా తన అనుభవం తనకుంటుంది ; దానిని ఆత్మవిహీనమైన గొప్ప అనుభవంగా చూడవచ్చు..కానీ యవ్వనం ఆత్మసహేతుకంగా శ్వాసిస్తుంది..తాను అడుగుపెట్టిన ప్రతిచోటులోనూ,ప్రతి మనిషిలోనూ  ఆత్మను చూడగలిగినవాడు పెద్ద ప్రయత్నమేమీ చెయ్యకుండానే గొప్పవాటిని సాధించగలడు - అతడు అడల్ట్ గా మారగానే అతడి యవ్వనం అతడిలో కారుణ్యంగా స్థిరపడుతుంది..దీనికి విరుద్ధంగా ఫిలిస్టిన్ మాత్రం తీవ్రమైన అసహనంతో మిగిలిపోతాడు.

No comments:

Post a Comment