Tuesday, September 24, 2019

బోర్హెస్ 'కాంగ్రెస్' ఏం చెబుతోంది..

జార్జ్ లూయీ బోర్హెస్ 'బుక్ ఆఫ్ సాండ్' లో 'కాంగ్రెస్' అనే ఒక కథ ఉంటుంది..నిజానికి ఇది పరిచయం అఖ్ఖర్లేని కథ,చాలా మందికి సుపరిచితమైన కథే..

Image Courtesy Google
ఈ కథ లో మానవజాతికీ,మానవత్వానికీ ప్రాతినిథ్యం వహించడానికి ఒక సంస్థను ప్రారంభిస్తారు..ఆ సంస్థలో పలు దేశాలకు,ప్రాంతాలకూ,భాషలకూ,వృత్తులకూ సంబంధించి పలు విభాగాలను తయారు చేసి వాటికి వివిధ దేశాలకు చెందిన కొందరు వ్యక్తుల్ని ప్రతినిధులుగా నియమిస్తారు..ఈ క్రమంలో ఆ సంస్థకు పెద్ద లైబ్రరీ అవసరమని ప్రపంచం నలుమూలల్నుంచీ పుస్తకాలు తెప్పిస్తారు..ఇలా అన్నిటినీ వర్గీకరించుకుంటూ,వ్యవస్థీకరించుకునే క్రమంలో అసలు లక్ష్యం మూలనపడి పుస్తకాలూ,ప్రతులూ,అంతర్గత విభేదాలతో కూడిన ఆర్గనైజేషన్ మాత్రమే మిగులుతుంది..ఇది గ్రహించిన ఆ సంస్థ అధ్యక్షుడు చివర్లో పుస్తకాలన్నిటినీ దగ్గరుండి మరీ తగలబెట్టిస్తాడు..ఎగసిపడే మంటల్లో కాలుతున్న పుస్తకాలను చూసిన తరువాత అందరూ స్వేచ్ఛగా ఆ సంస్థ తాలూకూ భవనం నుండి బయటకి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు..టూకీగా చెప్పాలంటే ఇదే కథ..మానవాళి తమకంటే ముందు పుట్టినదనీ,తమ తరువాత కూడా స్థిరంగా ఉంటుందనీ,మానవాళినీ,మానవత్వాన్నీ వ్యవస్థీకరించడం అసంభవమనీ,అంత పిచ్చిపని మరొకటి లేదనీ వాళ్ళు గ్రహించడం ఈ కథ సారాంశం.

నిశితంగా గమనిస్తే ఈ కథను మనం వివిధ కోణాల్లో చూడచ్చు..నేటి సమాజం కూడా అనేక తరాల వ్యవస్థీకరణల ఫలితం..ఉదాహరణకు మన భారతీయ సమాజాన్ని తీసుకుంటే మనుధర్మ శాస్త్రాల పేరిట వర్ణ వ్యవస్థల్నీ,రాజ్యాంగాన్నీ,సైన్యాల్నీ వ్యవస్థీకరించుకుంటూ పోయి ఈరోజు ఆ వర్గవిభేదాలతో,జాతిమత వైషమ్యాలతో ఒకరిమీదొకరు కత్తులు దూసుకుంటున్నాం..బోర్హెస్ చెప్పిన ఈ కథ ఏ సమాజానికి అన్వయించి చూసుకున్నా సులభంగా ఆ ఫ్రేమ్ లో ఇమిడిపోతుంది..ఇదే కథను నేటి సాహితీ రంగానికి అన్వయించి చూస్తే ఎలా ఉంటుందనే ఒక సరదా ఆలోచన వచ్చింది..టెక్నాలజీ పుణ్యమాని ఒకప్పుడు ప్రత్యేకమైన సమూహాలుగా మసలే సాహితీ సంఘాలు కూడా నేడు సోషల్ మీడియా వీధి వసారాల్లోనో,మరో వెబ్ పత్రికల మండువాల్లోనో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు..బుక్ క్లబ్బులూ,బ్లాగులూ,సోషల్ మీడియా పత్రికలూ ఇలా ప్రతీదాన్నీ వ్యవస్థీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం..ఫలితంగా వెలసిన అనేక సమూహాల్లో తన ఉనికిని చాటుకునే దిశగా కళాకారుడు కూడా నచ్చినా నచ్చకపోయినా బిక్కుబిక్కుమంటూ ఏదో ఒక సమూహపు మూలన నక్కి తీరాలి (?) సమాజంలో అంతర్భాగంగా ఉంటూ తన ఉనికిని చాటుకోడానికి కళాకారుడు తన అస్తిత్వాన్నీ,వ్యక్తిత్వాన్నీ పణంగా పెట్టక తప్పే పరిస్థితులు లేవు..ఇదేదో బ్రహ్మ రహస్యమైన విషయం కాదు..ప్రతీ సమూహానికీ కొన్ని నియమనిబంధనలుంటాయి..అందులో ప్రతి వ్యక్తీ  కొన్ని కనిపించని నియమాలకనుగుణంగా వ్యవహరించవలసి వస్తుంది..సింపుల్ గా చెప్పాలంటే If you want to be part of a crowd,you have to play by their rules..ఈ క్రమంలో ఆర్టిస్టుకు తనకు సంబంధం లేనీ,తనకు నచ్చని విషయాలను కూడా ఆమోదించాల్సిరావడం,గట్ ఫీలింగ్ ను ప్రక్కనపెట్టి మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తూ 'సెల్ఫ్ క్యారెక్టర్ అస్సాసినేషన్' చేసుకోవడం తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి..అడిగిన సంస్థలకు రాయననడం తప్పు...ఆదేశించిన పుస్తకాలపై ప్రశంస/విమర్శ రాయకపోతే తప్పు..అసలు సంస్థాగతంగా వ్యవహరించడానికి నిరాకరించడం తప్పు..ఇదంతా ఈ వ్యవస్థీకరణల ఫలితమే..కానీ ఆర్టిస్టుకు ఉండవలసిన ఏకైక లక్షణం/అవసరం 'స్వయంప్రతిపత్తి కలిగి సర్వ స్వతంత్రుడిగా వ్యవహరించడం'...కానీ ఈ వ్యవస్థీకరణల కారణంగా ఆర్టిస్టు ఈస్థటిక్స్ లో ప్రాథమిక అంశాలు కూడా నేర్వకుండానే బేసిక్స్ దగ్గరే ఆగిపోతున్నాడా !! ఆర్ట్ ను institutionalize చెయ్యడం మంచికా ? చెడుకా ? దీనివల్ల ప్రయోజనం ఏమిటి ? కళ అనేది ప్యాషన్ నుండి పుట్టాలి గానీ,డెడ్ లైన్స్ ఆధారంగా పుట్టేదానిలో సృజనాత్మకత పాళ్ళు ఎంత ?? బహుశా బోర్హెస్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నిష్క్రమించారు అనిపించింది.

No comments:

Post a Comment