Monday, September 19, 2022

Loveless Love - Luigi Pirandello

గ్రీసులోని డెల్ఫిలో ఒక పురాతన అపోలో దేవాలయంలో జ్ఞానసముపార్జన వైపు ప్రయాణించే మార్గాన్ని సూచించే తొలివాక్యంగా " Know thyself" అనే చెక్కడం ఉంటుందట. ఈ మూడు కథలకూ కలిపి అటువంటి ఒక శిలాశాసనం రాయాలంటే "Thou canst not know thyself " అని రాస్తే సరిగ్గా సరిపోతుందంటారు ఈ కథలను ఆంగ్లంలోకి అనువదించిన జె.జి.నికోల్స్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో. మనం ఏమిటో, మనకి కావాల్సింది ఏమిటో స్పష్టత లేనప్పుడు జీవితం నరకప్రాయమవుతుందని చెబుతాయీ కథలు. కానీ ఆ స్పష్టత సాధించడం అంత సులభమేం కాదంటారు మానవ మనస్తత్వాల లోతులు తెలిసిన రచయిత పిరాండెల్లో.

ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు "ఇట్స్ కాంప్లికేటెడ్" అనడం తరచూ వింటుంటాం. నిజానికి ప్రేమ చాలా సరళమైన అనుభవం. కానీ మనకు ప్రతీ చిన్న విషయాన్నీ సమస్యగా చేసుకోవడం పట్ల ఆసక్తి మెండు కాబట్టి దాన్ని కూడా సంక్లిష్టమైనదిగా చేసుకుంటామనిపిస్తుంది. నోబెల్ గ్రహీతా, ఇటాలియన్ రచయితా లూగీ పిరాండెల్లో 'లవ్ లెస్ లవ్' అనే రచనలో మూడు కథలూ ప్రేమ తాలూకూ సంక్లిష్టతల చుట్టూనే తిరుగుతాయి. నిజానికి అన్నీ సరళంగా సజావుగా జరిగిపోతే ఇక చెప్పుకోడానికి కథలేం ఉంటాయి !

Image Courtesy Google

19 శతాబ్దికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో సైకో ఎనలిటిక్ విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మానవ మస్తిష్కంలో రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలం దీనికొక కారణం  కావచ్చు. సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. అందువల్ల ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ చదువుతున్నప్పుడు అందులో మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి  మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అబ్సర్డ్ గా ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్థుల్ని పోలి ఉంటాయి. అందువల్ల వారి ప్రవర్తనా సరళిలో లోపాలూ, పిచ్చితనం లాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదేమో.

మొదటి కథ 'ది వేవ్', తన ఇంట్లో అద్దెకున్న ప్రతీ అమ్మాయితోనూ ప్రేమలో పడే అలవాటున్న జూలియో అనే ఒక యువకుడి కథ. ఇక్కడ ఒక చిత్రమైన అంశం ఏమిటంటే, అతడు ఆ అమ్మాయి తిరిగి ప్రేమించగానే ఆమెకు దూరం జరిగి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. ఎటువంటి నిబద్ధతా లేకుండా తన మనసుని నేర్పుగా అదుపు చేసుకుంటూ ఇతరుల భావోద్వేగాలతో ఆడుకునే అలవాటున్న అతడు చివరకు తన ఆత్మన్యూనత, అసూయల కారణంగా అవే భావోద్వేగాల తూఫానులో చిక్కుకుని ఎలా సతమతమవుతాడో చెబుతుందీ కథ. జూలియో సంక్లిష్టమైన మనస్తత్వంపై  అగాథా కల్మషంలేని అమాయకత్వం పరోక్షంగా సాధించిన విజయానికి (?) ఈ కథ ఒక మంచి ఉదాహరణ. పిరాండెల్లో ఈ కథను రక్తికట్టించిన తీరు చాలా బావుంది.

రెండో కథ 'ది సిగ్నోరినా' కూడా దాదాపూ మొదటి కథలాంటిదే. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్  ప్రకారం వేటాడడం (ఛేజ్), దేన్నైనా తన సొంతం చేసుకునేవరకూ వదిలిపెట్టకపోవడం మగవాడి నైజం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విధానం అతడి జీవితకాలమంతా కొనసాగుతుంది. దీనికి భిన్నంగా స్త్రీ తనకు కావల్సినది దొరికాక, కోరుకున్నది సొంతం చేసుకున్నాకా స్థిరత్వాన్ని ఆశిస్తుంది. ఈ ఫ్రాయిడ్ విశ్లేషణలను ఆధారంగా చేసుకుని అల్లిన కథలే పై రెండూను. తన సామజిక స్థాయికి తగిన స్త్రీ కాదని ప్రేమించిన జూలియాని తిరస్కరించిన లూసియో , ఆమెకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి వరుడుగా రావడం పట్ల తీవ్రమైన అసూయతో ఆ సంబంధం చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడి స్థానంలో ఆమెకు గంతకు తగ్గ బొంతలా సరిపోయే తన స్నేహితుడు మార్జానీని వివాహమాడమని ప్రతిపాదిస్తాడు. లూసియోను ఎంతో ప్రేమించినప్పటికీ అతడి నిజస్వరూపం తెలుసుకున్న తరువాత జూలియా తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది మిగతా కథ. ప్రేమించిన మనిషి తనకి దక్కకపోయినా ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడం నిజమైన ప్రేమికుల లక్షణం. కాగా తనకు దక్కనిదాని వినాశనాన్ని కోరుకోవడం కౄరత్వం. తన అసూయాద్వేషాలనూ, ఆధిపత్య ధోరణినీ ప్రేమగా భ్రమించే లూసియో కథ ఇది. ఇక మూడో కథ 'ఎ ఫ్రెండ్ టు ది వైవ్స్', పై రెంటికంటే కాస్త భిన్నంగా ఉన్న కథ. ఈ కథ చాలా అసహజంగా అనిపించడంతో నాకు పెద్దగా నచ్చలేదు.

పిరాండెల్లో రచనల్లో ఇది తొలిసారిగా ప్రచురితమైన కథల పుస్తకం అని రాశారు. నేను కొన్నేళ్ళ క్రితం 'టేల్స్ ఆఫ్ మ్యాడ్నెస్' , 'ఆయిల్ జార్ అండ్ అదర్ స్టోరీస్' అనే రెండు కథల సంపుటులు చదివి ఉన్నాను కాబట్టి ఆ కథల్లో కనిపించిన పదును తొలినాళ్ళలో రాసిన ఈ కథల్లో లేదనిపించింది. ఏదేమైనా ప్రేమికుల తగాదాలూ, విరహాలూ, పరితాపాలూ, అసూయలూ, అమాయకత్వాలూ, మాటల్లేని సంభాషణలూ చదివే సరదా ఉంటే ఈ కథలొకసారి చదవొచ్చు. హ్యాపీ రీడింగ్ :) 

Wednesday, September 7, 2022

Lady Macbeth of Mtsensk - Nikolai Leskov

ఆ మధ్య ఓటీటీ సినిమాల వ్రతంలో బిజీగా ఉండగా 'లేడీ మాక్బెత్' పేరుతో ఒక సినిమా కనిపించింది. పీరియడ్ డ్రామాలంటే అమితమైన ఇష్టం కాబట్టి ఆ ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించి చూడగా అది రష్యన్ రచయిత నీకొలాయ్ లెస్కోవ్ కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని తెలిసింది. నిజానికి లెస్కోవ్ రచనలతో నాకాట్టే పరిచయం లేదు. తీరా బుక్ అడాప్టేషన్ అని తెలిశాక పుస్తకం చదవకుండా సినిమా చూడడం మా బుక్ నెర్డ్ల ప్రపంచంలో ఘోరమైన పాపంగా పరిగణిస్తాం కాబట్టి ఆ కథేదో చదివేశాక సినిమా చూద్దామని ముందుగా ఆ కథ చదివాను, తరువాత సినిమా చూశాను. లెస్కోవ్ కథను మూలాంశంగా తీసుకోవడం మినహా మూలకథకూ, సినిమాకూ ఎక్కడా పోలికలు లేవు. బ్రిటిష్ అడాప్టేషన్ కాబట్టి రష్యన్ పేర్లైన 'కాటెలినా' ను 'క్యాథెరిన్', 'సెర్జీ' ని 'సెబాస్టియన్' వంటి బ్రిటిష్ పేర్లుగా మార్చారు.

Image Courtesy Google

షేక్స్పియర్ 'మాక్బెత్' ద్వారా ప్రభావితమై రాసిన ఈ కథకు ఫ్లాబర్ట్ 'మేడమ్ బోవరీ', టాల్స్టాయ్ 'అన్నా కరినిన'లతో కూడా కొన్ని పొంతనలు కనిపిస్తాయి. సంతానలేమీ, మారుమూల పల్లెలో ఖైదులాంటి ఇంట్లో నిస్సారమైన జీవితం వెరసి ఉన్నత వ్యాపారస్థుల కుటుంబానికి చెందిన స్త్రీ కాటెలినా వివాహేతర సంబంధానికి దారి తీస్తాయి. కాటెలినా భర్త జినోవీ వద్ద పనిచేసే సెర్జీతో ఆమె వివాహేతర సంబంధం ఒక పాపం మీద మరో పాపంగా మారి వరుస హత్యలకు కారణమవుతుంది. కామం, ధనవ్యామోహం, దురాశ, స్వార్థం ఇవన్నీ పెచ్చుమీరితే మనిషి ఏ స్థాయికి దిగజారతాడో చెప్పడానికి కాటెలిన్ పాత్ర ఒక మంచి ఉదాహరణ. కానీ టాల్స్టాయ్ అన్నాలో కనిపించే మానవీయ సహజ గుణాలైన నిస్సహాయత, బలహీనత,అపరాధభావం, పశ్చాత్తాపం లాంటివి లెస్కోవ్ కాటెలినాలో ఎంత వెతికినా కనిపించవు. అన్నాలో అణువణువునా కనిపించే 'గ్రేస్' లెస్కోవ్ కాటెలినాలో శూన్యం. తనకు కావలసింది సొంతం చేసుకునే క్రమంలో ఏ పని చెయ్యడానికైనా వెనుకాడని ఆమె వ్యక్తిత్వమే పూర్తి లోపభూయిష్టం. ఆమెను చూసి ఏ సందర్భంలోనూ "అయ్యో" అనిపించదు.

ఇది నాణానికి రెండో వైపు కథను పూర్తిగా వదిలేసి ఒక మగవాడి దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పిన కథ. కథలో rawness కనిపిస్తుంది. టాల్స్టాయ్ రచనల్లో స్త్రీలపట్ల కాసింత సహానుభూతీ, గౌరవం కనిపిస్తాయి. దీనికి కారణం ఆయన ఉన్నతవర్గానికి చెందిన సమాజంలో భాగమని కొందరు అభిప్రాయపడతారు. లెస్కోవ్ శైలి మన్ననలూ, మర్యాదలూ లేని ఆనాటి దిగువమధ్యతరగతి రష్యన్ సమాజాన్ని చూపించింది. ఆయన ప్రపంచంలో మానవీయ ప్రవృత్తిలో మోటుదనం, క్రూరత్వం యధాతథంగా చిత్రిక పట్టినట్లుంది. జన్మతః పేద కుటుంబం నుంచి వచ్చిన స్త్రీగా కాటెలినా లో ఎటువంటి నైతిక నియమాలకూ లోబడని తెగింపు, స్వార్థం కనిపిస్తాయి. ఆమెకు కావలసిందల్లా పాపభీతికి ఆస్కారం లేని అచ్చమైన 'అనుభవం' మాత్రమే. అన్నాలో కనిపించే ద్వైదీభావం కాటెలినాలో లేదు. నాకు ఆమెలోని "స్వచ్ఛమైన మృగతృష్ణ " అస్సలు నచ్చలేదు.

ఎటొచ్చీ షేక్స్పియర్ 'మాక్బెత్' ని అనేక వ్యక్తిత్వ వైరుధ్యాల నడుమ ప్రతినాయకుడిగా కంటే కథానాయకుడిగా చూడగలిగిన సమాజం కాటెలినాను అదే సమదృష్టితో ఎందుకు చూడలేదా అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. రాబర్ట్ చాండ్లెర్ అనువాదంలో NYRB క్లాసిక్స్ వారు ప్రచురించిన లెస్కోవ్ కథల సంపుటిలో ఈ కథ కూడా ఒకటి. ఈ చిన్నపాటి నవలిక లెస్కోవ్ శైలిని నాకు తొలిసారి పరిచయం చేసింది.

Saturday, September 3, 2022

Ade Nadi Iddaridee - Nanda Kishore

నిజానికంతా తెలిసిందే ; తెలిసిందే తెలియందై అంతో ఇంతో అనుభవాన్ని పంచుతుంది. ఎంతోకొంత అశాంతినీ దహిస్తుంది. 

ఇటువంటి వాక్యాలు చదివాక ఇక మాటలనవసరమనిపిస్తూ మౌనం చాలాసేపు వెన్నంటి ఉంది.


నేను హేతువాదిని, భావుకురాల్ని కాదు. ఈ కారణంగా నాలో భావోద్వేగాన్ని  కలిగించలేనిదేదీ నా దృష్టిలో కవిత్వం కాదు. నిజానికి "నా కోసం రాసిన కవిత్వం" కాదు అనడం సమంజసం. ఇప్పటివరకూ మేరీ ఆలీవర్, విస్లావా సింబ్రోస్కా వంటి అతి కొద్దిమంది మాత్రమే ఆ పని చెయ్యగలిగారు. ఇక తెలుగు వెబ్ పత్రికలు చదివే అలవాటు పెద్దగా లేకపోవడం, పద్యం కంటే గద్యం ఎక్కువగా చదివే అలవాటు ఉండడం కారణంగా నాకు నంద కిషోర్ కవిత్వంతో పరిచయం అంత త్వరగా కలగలేదు. గత ఏడాది నాగరాజు పప్పు గారి 'Bankrupt Circus' చదువుతుంటే అందులో ఆయన తెలుగు నుండి అనువదించిన కవితల్లో నందూ పేరు తొలిసారి చూశాను.

ఇక ఫేస్బుక్ లో నందూ పంచుకునే కవిత్వంతో నాకు తెలీకుండానే ప్రేమలో పడిపోయాను. ఇది యాదృచ్ఛికంగా ఎక్కడో ఒకచోట ఒక్క కవిత చదివి అమాంతం కలిగిన అభిమానం కాదు. క్రమంగా, స్థిరంగా, అతి మెల్లగా ఏర్పడిన ఇష్టం. ఒకటి రెండు క్షణాల్లో, ఒకట్రెండు కవితలతో అంతరించిపోకుండా బహుశా తుదకంటా నిలచియుండే ఇష్టం.

నాకు తెలిసి హేతువాదుల్ని భావుకత్వంతో కదిలించడం అంత సులభం కాదు. ఇదేదో గొప్ప విషయమని అనను. అక్షరాల్లో అంతర్లీనంగా ధ్వనించే కపటత్వాన్నీ, పదవిన్యాసాల నడుమ లోతులేని బోలుతనాన్నీ అతి సునాయాసంగా కొలవగల శాపగ్రస్తులు వాళ్ళు. ఇవన్నీ వద్దనుకున్నా వారి దృష్టిని దాటిపోవు. 'Interpretation is the revenge of the intellectual upon art.' అంటారు Susan Sontag.

ఇటువంటి శాపగ్రస్తుల్ని ఊరడిస్తూ అలసిసొలసిన సాయంత్రపు వేళల్లో ఎక్కడో అల్లంత దూరంనుంచి వినిపించే స్వచ్ఛమైన అమ్మ జోల పాట నందూ కవిత్వం. నందూ కవిత్వం ఈ హేతువాదపు చీకట్లు కమ్ముకోక మునుపటి వెలుగుల గతంలోనుండి కొన్ని జ్ఞాపకాలని తిరిగి కళ్ళముందు నిలిపింది. అదే నదినీ, దానితో ముడిపడ్డ జ్ఞాపకాలనీ గుర్తుకుతెచ్చింది. కొన్ని కవితలు చదువుతుంటే మా గోదావరి ఇసుక తిన్నెల్లో వదిలేసి వచ్చిన అడుగు జాడలవైపు కాలం వెనక్కి ప్రయాణించినట్లనిపించింది. ప్రేమనూ, ప్రేమరాహిత్యాన్నీ, వియోగాన్నీ, విరహాన్నీ, వైఫల్యాన్నీ, అస్తిత్వవాదాన్నీ, తాత్వికతనూ అన్ని వర్ణాల్లోనూ చిత్రించిన అందమైన కాన్వాసు నందూ కవిత్వం. చాలాచోట్ల నెరుడా ఛాయలు కనిపించాయి. ఇంతకుమించి నందూ కవిత్వాన్ని గురించి ఇంకేమీ చెప్పే సాహసం చెయ్యను. రసాస్వాదనలో హేతువాదానికీ, తర్కానికీ పనిలేదు. 

ఇక్కడొక చిన్న సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక పండితుడిని "మీరు ఈ విధంగా చేస్తే మీ రచనలు ఎక్కువమందికి చేరతాయి కదా" అని అమాయకంగా ప్రశ్నిస్తే , ఆయన చాలా ప్రశాంతంగా, "ఎక్కువమందికి ఎందుకు ,ఒకరిద్దరు చదివినా చాలు" అన్నారు. ఆమాట అర్థం కావడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాలుగు పుస్తకాలు ప్రచురించినా ముందుమాట / చివరి మాట  ఎవరితోనూ అడిగి రాయించుకోలేదనీ చెప్పిన నందూని చూస్తే ముచ్చటేసింది. తన కవిత్వానికి ఒకరిచ్చే అక్రిడేషన్/సర్టిఫికేషన్ పై ఆసక్తి లేదనీ, Poetry can speak for itself  అని నమ్ముతాననీ చెప్పిన ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం,నిజాయితీల పై అమితమైన గౌరవం కలిగింది.

ఈ కవిత్వాన్ని మీరు కేవలం వెలకట్టి సొంతం చేసుకోగలమనుకుంటే పొరపాటే. ఇటువంటి కవిత్వాన్ని ఆస్వాదించడానికి భావుకత్వంతో పాటు పాఠకుడికి కూడా మరింకేదో అర్హత కావాలి. నంద కిషోర్ కవిత్వం  దారిచేసుకుంటూ ప్రవహించే నదిలా అచ్చంగా ఎవరికోసం రాశారో అటువంటి అర్హత కలిగిన పాఠకులను తప్పకుండా వెతుక్కుంటూ వెడుతుంది.

నిన్న పుస్తకం చేరిన దగ్గరనుండీ పేజీలు తిరగేస్తూనే ఉన్నాను. చదివిన కవితలు కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.

మచ్చుకి ఈ ఆణిముత్యాలు :

కల్లోలాన్ని అనుభవిస్తూ ఒక్కడూ ఏం చేస్తాడు ? తీరాన కూర్చుని కెరటల్ని గురించి కవిత్వం రాస్తాడు. అలల మీదా, నీటి తరగల నాట్యం మీదా పదాలు అల్లుతూ పాటకడతాడు. ఉప్పెన మీదికి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే చేపపిల్లలాగా తుళ్లిపడతాడు. అలలతో పాటే ఊపిరి పోతే ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.

సముద్రం వాణ్ణి ప్రేమించిందని ఎవ్వరికీ చెప్పడు. కల్లోలాన్ని వాడు కోరుకున్నట్లు ఎప్పటికీ తెలియదు. తెలిసేదల్లా వాడికలేడనే !

--------------------------------------------------------

ఎలుగెత్తి నువ్వలా పాట పాడితే, ఎదకెత్తి నువ్వలా జోలపాడితే, పారిపోయేటినిశ్శబ్దాన్ని తెచ్చి పాటపాటలోనూ పదిలంగా నింపితే - మసకలోకమ్మీది మోహాలపొద్దులో సూర్యుడు,చంద్రుడు నిలవరనిపిస్తుంది. మరలిపోయేటి ప్రాణాలకోసం ఏడ్వడం,నవ్వడం కూడదనిపిస్తుంది.

Friday, April 8, 2022

సాహిత్యం - ఆధ్యాత్మికత

సత్యశోధనలో (స్పిరిట్యుయల్ క్వెస్ట్ అందామా !) ఒకరు ఆధ్యాత్మికతనూ, మరొకరు సాహిత్యాన్నీ సాధనాలుగా చేసుకున్నవాళ్ళం కాబట్టి నాకూ,నరేన్ కీ మధ్య ఈ విషయంలో తరచూ వాడీ వేడీ చర్చలు జరుగుతూ ఉంటాయి. అలా ఒకసారి మాటల మధ్యలో తన మార్గాన్ని ఎలివేట్ చేసుకుంటూ సాహిత్యానికి పై మెట్టు ఆధ్యాత్మికత అన్నారు నరేన్. నిజమే, నాస్తికురాలినైనా(?) నేను కూడా నిర్ద్వందంగా అంగీకరించే విషయం ఇది. ఎటొచ్చీ నా విషయంలో ఆధ్యాత్మికతకు ఉన్న నిర్వచనాలు పూర్తిగా వేరు.

Image Courtesy Google

కానీ నా గమనింపులోకి తరచూ వచ్చే విషయం ఏమిటంటే చాలామంది సాహిత్యాన్నీ,ఆధ్యాత్మికతనూ ఒకే గాటికి కట్టేస్తారు. కాస్త పరిశీలిస్తే రెంటి మధ్యా భూమ్యాకాశాల అంతరం ఉంటుంది. సాహిత్యం ఏదో ఒక స్టాండ్ తీసుకోమంటుంది, ఆధ్యాత్మికత చూపు ఆ అంతరాల్ని దాటి ఆవలకి వెళ్తుంది. సాహిత్యాన్ని శోధించేవాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అనుకుంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాడు వానప్రస్థంలో ఉన్నవాడితో సమానం. గృహస్థాశ్రమంలో ఉంటూ సర్వసంగపరిత్యాగిలా వ్యవహరించడం కుదరదు. సాహిత్యం పరమోద్దేశం బ్రతుకు చిత్రాన్ని యధాతథంగా అక్షరబద్ధంచేసి చూపించడం. నా వరకూ పురాణేతిహాసాలు కూడా ఈ కాల్పనిక సాహిత్యం క్రిందకే వస్తాయి. సాహిత్యం ప్రతిబింబించే ఈ 'బ్రతుకు చిత్రం' సహజంగా చైనీస్ ఫిలాసఫీలో ఉండే ఇన్-యాంగ్ (Yin-Yang) ని పోలి ఉంటుంది. ఇందులో మంచి-చెడు,ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, వాస్తవం- కల్పన, యుద్ధం-శాంతి వంటి ద్వంద్వాలు అన్నీ పరస్పరం అనుసంధానంగా ఉంటాయి. ఈ వైరుధ్యం, ద్వంద్వం లేని సాహిత్యం అసంపూర్ణం.

ముఖ్యంగా టాల్స్టాయ్ సాహితీ ప్రస్థానంలో మొదలూ,తుదా గమనిస్తే ఈ ద్వంద్వాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అన్నా కరెనిన, వార్ అండ్ పీస్ లాంటి రచనలతో మొదలైన ఆయన సత్యశోధన చివరకు కన్ఫెషన్స్, ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇలియచ్ లాంటి రచనలతో ముగిసింది. ఆయన రచనా వ్యాసంగం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తరహాలో 'హ్యాపీ గో లక్కీ' రచనలతో మొదలవ్వలేదు. ముళ్ళని విస్మరించి తన రాతల్లో ఆయన గులాబీల పరిమళాల్ని మాత్రమే వెదజల్లలేదు. నిజానికి అనేక సంఘర్షణల,సందిగ్ధతల నడుమ కళాకారుడి తొలి అడుగుపడుతుంది. సాహితీ ప్రపంచంలో వెతికితే నిజానికి గొప్ప గొప్ప  సాహితీవేత్తల్ని ఎవర్ని చూసినా వారి ప్రయాణం దాదాపూ అలాగే మొదలవుతుంది. దీనికి పూర్తి విరుద్ధమైన సాహితీసృజనలో ప్రామాణికత  అనుమానాస్పదం.

ఇక ఆధ్యాత్మికత అనగానే సహజంగా మనసుని నిశ్చలంగా ఉంచి రాగద్వేషాలకతీతంగా తామరాకుమీద నీటిబొట్టులా బ్రతకడం అలవర్చుకోవడం అంటారు. కానీ ఈ దశకి చేరుకున్న కళాకారుడిలో సృజనాత్మకతకు అవకాశం లేదు. ఎటువంటి సంఘర్షణకూ, రాపిడికీ లోనుకాని అతడి కలంలోంచి వెలువడే పదాల్లో భావావేశం కొరవడిన డొల్లతనం వ్యక్తమవుతుంది. ఇక్కడ సాహితీ సృజనకు ఆస్కారం శూన్యం. నిశ్చలత్వంలోంచి సాహిత్యం పుట్టదు. నిశ్చలత్వం అన్ని స్థితులకూ అతీతమైన స్థితి. అందువల్ల ఇది మత గ్రంథాలపైనా, పురాణేతిహాసాలపైనా లోతుగా వ్యాఖ్యానించే వారినుద్దేశించి అంటున్న మాట ఎంతమాత్రం కాదు. సాహిత్యం ఆధ్యాత్మికతకు భిన్నంగా క్రియాశీలకంగా వ్యవహరించడం నేర్పిస్తుంది. నిశ్చలమైన ఆధ్యాత్మిక స్థితికీ, సాహితీ ప్రయోజనానికీ చుక్కెదురని చెప్పడమే నా ఉద్దేశ్యం. 

నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారిని వదిలేస్తే మనచుట్టూ తమ నిస్సహాయతనూ, అశక్తతనూ ఆధ్యాత్మికత ముసుగులో దాచుకుంటూ, సెల్ఫ్-హెల్ప్ కంటెంట్ కి సాహిత్యం పేరుపెట్టి అమ్మేస్తున్న సాహితీవేత్తలు పెరిగిపోయారు. మనిషిలో 'జడ్జిమెంట్' చెయ్యగల నేర్పు ఆరోగ్యకరమైన మెదడుకి సూచన అంటారు ప్రముఖ రచయితా,న్యూరో సైంటిస్ట్ ఆలివర్ సాక్స్. తామరకు మీద నీటిబొట్టులా జీవించాలని బోధించిన గీతాచార్యుడు కూడా సందర్భం వచ్చినప్పుడు తాను కూడా పాండవుల పక్షం తీసుకుని కర్మ సిద్ధాంతాన్నే బోధించాడు గానీ అస్త్రసన్యాసం చేసి గోడమీద పిల్లిలా తటస్థంగా ఉండమని బోధించలేదు. జడ్జిమెంట్ చెయ్యలేని చేతకానితనానికీ, ఏ పక్షమైనా తీసుకోవాలంటే లాభనష్టాల బేరీజు వేసుకోకుండా ఆ పనిచెయ్యలేని స్వార్థానికీ ఆధ్యాత్మికతను (?) సౌకర్యంగా అడ్డుపెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ సాహితీరంగంలో ఉన్నవారు ఏ పక్షమూ తీసుకోకూడదని అనేవారికి సాహిత్యం పరమోద్దేశ్యం అర్థం కాలేదని అర్థం. సాహిత్యానికి అటువంటివారి అవసరంలేదు. నిజానికి సాహిత్యానికి అటువంటి వారు చేసే మేలు కంటే కీడే ఎక్కువ. 

సాహితీవేత్త శాంతి మంత్రాన్ని జపించడంతోపాటు విప్లవ గీతాన్ని కూడా ఆలపిస్తాడు. అలాకాకుండా కేవలం శాంతి మంత్రాన్ని జపించేవాడు ప్రవచనకారుడవుతాడే గానీ సాహితీవేత్త కాలేడు. కేవలం యుద్ధంవైపో, లేదా పూర్తిగా శాంతివైపో పరిమితమయిపోయిన సాహిత్యంలో ఆత్మ లేని శరీరంలా పరిపూర్ణత లోపిస్తుంది. ఆ సమతౌల్యం దెబ్బతినకుండా చూసుకోవడం కళాకారుడి బాధ్యత. సమాజం ముందుకు అడుగు వెయ్యడానికి గోర్కీలాంటి రచయితలు నమ్మి ఆచరించే కర్మ సిద్ధాంతం ఎంత అవసరమో, అవే అడుగులు తప్పటడుగులు కాకుండా ఆపి ఆలోచింపజేసే క్రిఝానోవ్స్కీ లాంటి వారి కర్మకు సుదూరమైన తాత్వికతా, ఆదర్శవాదం కూడా అంతే అవసరం. సాహిత్యంలో అనేక పార్శ్వాలు ఉంటాయి. అవన్నీ శోధించడానికి ఒక జీవితకాలం పడుతుంది. కేవలం తనకు అనువైన ఏదో ఒక పార్శ్వాన్ని పట్టుకుని వ్రేళ్ళాడుతూ సాహితీవేత్తలమైపోయామనుకునేవాళ్ళూ, మరో పార్శ్వాన్ని చూడలేని వాళ్ళూ ముందుముందు ప్రవచనకారుల్లా మిగిలిపోయే అవకాశం ఉంది. సామాజిక వైచిత్రికి అద్దంపట్టవలసిన సాహిత్యం రాజకీయ,సాంఘిక అస్థిరతలు తలెత్తినప్పుడు ఏదో ఒక పక్షం తీసుకోకుండా బాధ్యతారహితంగా,తటస్థంగా కేవలం గట్టున కూర్చుని శాంతిమంత్రాలు జపించే మత ప్రవక్తల్నీ, బాబాల్నీ తయారుచేసే నిలయంగా మారిపోయే ప్రమాదం ఉంది.

సాహిత్యంతో సావాసం వ్యక్తిగత అభిప్రాయాలనూ, సిద్ధాంతాలనూ, మోరల్ కోడ్ నీ ఏర్పరుచుకోడానికీ, మంచి-చెడులను విశ్లేషించుకోడానికీ సహాయం చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో క్రియాశీలకంగా ఉండడమెలాగో నేర్పిస్తుంది. మన గళాన్ని నిర్భయంగా వినిపించే ధైర్యాన్నిస్తుంది. అలా కాని పక్షంలో సాహిత్యంతో ఏ ప్రయోజనమూ లేదు. ఆధ్యాత్మికత పేరిట జడ్జిమెంట్ కు ఉపయోగపడని ప్రవచనాలకూ, ప్రవచనకారులకూ సాహిత్యంలో స్థానం లేదు.

Wednesday, April 6, 2022

My Evil Mother - Margaret Atwood

'రీడింగ్ బ్లాక్' పేరిట హాయిగా సినిమాలు చూస్తూ రోజులు గడిపేస్తుంటే, ఆట్వుడ్ పుస్తకాలకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చానని ఆవిడ తాజాగా రాసిన కథను రికమెండ్ చేస్తూ గుడ్ రీడ్స్ నుంచి గత వారంలో ఒక మెసేజ్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంతోనూ, కిండిల్ అన్లిమిటెడ్ లోనూ ఈ కథ ఉచితంగా చదవవచ్చు అని ఆ మెసేజ్ సారాంశం. 'బిగ్ బ్రదర్' సర్వేలెన్స్ క్రింద మార్కెటింగ్ మాయాజాలంలో బయటపడే అవకాశం లేనంతగా పీకల్లోతు కూరుకుపోయాం :) ఈ ఫిర్యాదులన్నీ ప్రక్కనపెడితే నా విషయంలో ఈ కథ వెంటనే చదవాలనిపించడానికి కారణం ఆ టైటిల్. ఒక సార్వత్రికసత్యంగా భావించే విషయాన్ని సవాలు చేస్తూ 'మై ఈవిల్ మదర్' అనే పేరు పెట్టడం నాలో కాస్త కుతూహలాన్ని రేకెత్తించింది.

Image Courtesy Google

మంచి కథకులకు కథావస్తువు విషయంలో పెద్ద పట్టింపులేమీ ఉండవు. ముడి సరుకు ఏదైనా, ఎంత సాధారణమైనదైనా వాళ్ళ నైపుణ్యంతో దాన్ని చక్కని కథగా మలచగల నేర్పు వాళ్ళకి సహజంగానే అబ్బుతుంది. ఈ కోవలోనే సాధారణమైన తల్లీకూతుళ్ళ మధ్య సమస్యలకు కాస్త మ్యాజికల్ రియలిజం, కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి ఈ కథనల్లారు ఆట్వుడ్. ఈ కథలో నవ్యత ఏదన్నా ఉంటే అది ఆట్వుడ్ శైలీ, కథనం మాత్రమే.

పసితనంలో చందమామను చూపించి గోరుముద్దలు తినిపించినా, గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని నమ్మబలికినా, అల్లరి చెయ్యకుండా బుద్ధిమంతుల్లా ఉంటే శాంటా మంచి మంచి బహుమతులు తెస్తాడని మోసం చేసినా వాటి వెనుక పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమే కారణం. పిల్లల పట్ల వ్యవహరించే విధానాల్లో తేడాలున్నప్పటికీ, మంచి తల్లులూ, చెడ్డ తల్లులూ అంటూ ఉండే అవకాశాలు బహు అరుదు. ఎటొచ్చీ యుక్తవయస్సు పిల్లల్ని అదుపు చెయ్యవలసివచ్చినప్పుడు కొంత తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో బాటుగా కొన్నిసార్లు దండనలూ తప్పవు. ఆ ప్రయత్నంలో చాలాసార్లు వాళ్ళ దృష్టిలో విలన్లుగా మిగిలిపోయే తల్లుదండ్రులు ఎంతమందో ! అందులోనూ ఈ కథలో తల్లిలా భర్త సహకారం లేకుండా ఒంటరిగా కూతుర్ని  పెంచాల్సి వచ్చినప్పుడు అది అడుగడుగునా కత్తిమీద సాములా ఉంటుంది.

You’re so evil,” I said to my mother. I was fifteen, the talk-back age.

“I take that as a compliment,” she said. “Yes, I’m evil, as others might define that term. But I use my evil powers only for good.”

అంటూ తల్లీ కూతుళ్ళ మధ్య సాధారణమైన సంభాషణతో కథ మొదలవుతుంది. కానీ ఈ కథలో తల్లి కాస్త భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. దివ్యదృష్టితో పాటు తాంత్రికవిద్యల్లో కూడా ప్రవేశం ఉన్న మనిషిగా ఇరుగుపొరుగు వారు ఆమెపై దుష్ప్రచారాలు చేస్తూ, తిరస్కారభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆ ప్రభావంతోనే అందరికంటే భిన్నంగా ఉన్న తల్లిని ఆమోదించడానికి అవసరమయ్యే పరిపక్వతలేని 15 ఏళ్ళ కూతురు సైతం క్రమంగా తల్లిపట్ల ద్వేషం పెంచుకుంటుంది. నిజమే కదా ! Avenging a toad. Pointing at a tree. Who could handle that kind of thing, in a mother ? 

కూతురు ఒక సందర్భంలో, Don’t you care what they say about you?” అని తల్లిని నిలదీస్తే , "Why would I care about the tittle-tattle of the uninformed? Ignorant gossip.” అని తాపీగా సమాధానమిచ్చి, ఏమీ పట్టనట్లు మళ్ళీ తనపనిలో మునిగిపోతుందామె. ఈ కథలో పంతం, పట్టుదల, ఆత్మవిశ్వాసం మేళవింపుగా ఉండే శక్తివంతమైన స్త్రీగా ఆమె కనబడుతుంది. ఆమె భిన్నమైన ఆలోచనలూ, తాను నమ్మిన విలువల విషయంలో ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడని తెగువా, సామజిక చట్రంలో ఇమడాలని ప్రయత్నించకపోవడం వంటివి ఆమెను ఉలిపికట్టెగా మారుస్తాయి. ఆట్వుడ్ ఈ కథలో ఆమెను తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన పరిణితి చెందిన పాత్రగా చాలా ప్రేమగా చిత్రించారనిపిస్తుంది. 

కానీ జీవితం పట్ల ఆమెకున్న స్పష్టత ఆమె చుట్టూ ఉన్నవారిని కలవరపెడుతుంది. 'Know it alls' తో సహజీవనం ఎంత కష్టమో కదా ! “It’s hard living with someone who’s always right. Even when it turned out that she was. It can be . . . alarming.” అని ఆమె కూతురు ఆమె గురించి చెప్పే వాక్యాలను చదివినప్పుడు ఆట్వుడ్ వచనంలో సరళత్వం మాటున దాచేసిన లోతుల్ని గమనించకుండా ఉండలేం.

కొన్ని సంభాషణల మధ్యలో అలవోకగా దొర్లే,

"only the wild ones had souls "

“They may not like me, but they respect me. Respect is better than like.”

She said that wanting to be liked was a weakness of character. లాంటి  వాక్యాలు ఆమె ధృడమైన వ్యక్తిత్వాన్ని పాఠకులకు పూర్తి వెలుగులో చూపిస్తాయి.

ఎడ్డెమంటే తెడ్డెమంటూ మాటకు మాట ఎదురు చెప్పే కూతుర్ని తన మానవాతీత శక్తులతో భయపెట్టీ, బుజ్జగించీ తన దారికి తెచ్చుకునే ఆ అమ్మ కథా, అటువంటి తల్లి నీడలోంచి ఎప్పుడు బయటపడతానా అని  నిరంతరం ప్రయత్నించే కూతురి కథా ఎటువంటి ముగింపు తీసుకుందో తెలియాలంటే ఈ పుస్తకం చదవండి. అక్కడక్కడా ఆట్వుడ్ మార్కు హాస్యం, వ్యంగ్యం తళుక్కుమనే ఈ కథ ఒక మినీ మ్యాజిక్. కొన్ని చోట్ల చెప్పీ చెప్పకుండా వదిలేసే చిన్న చిన్న వివరాలు మిస్టరీగా మారి పాఠకులతో ఆత్రంగా పేజీలు తిప్పిస్తాయి. ఈ కథ గురించి ఇంతకుమించి చెబితే ఆ అనుభవం నుండి మిమ్మల్ని దూరం చేసినట్లవుతుంది. అందువల్ల ఇంతటితో ముగిస్తాను. హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు, 

“Who says you need eyes for seeing?”

“Where’s your father?” was annoying, but “Who’s your father?” was insulting.

My mother and I had had a major breach after the birth of the first one: she’d come to the maternity ward while I was in labor, bearing a gift of something orange in a jar for me to rub on my stretch marks, and announced that she wanted to cook the placenta so I could eat it.

And so I come to the end. But it’s not the end, since ends are arbitrary. I’ll close with one more scene.

Thursday, March 31, 2022

The Lost Soul - Olga Tokarczuk

చాలా కాలానికి ఈ మధ్య కామిక్స్, గ్రాఫిక్ నవలల వైపు మనసుపోయింది.

ఆంగ్లంలో 'సౌల్' కి తెలుగులో ఆత్మ, అంతరాత్మ, స్పృహ, హృదయం (?) లాంటి పర్యాయ పదాలు వాడొచ్చేమో ! దీనికి నిర్దిష్టమైన అర్థం ఏమిటో నాకు తెలీదు గానీ సౌల్ అంటే ఏమిటో మాత్రం తెలుసు. ఇది మంచి,ఇది చెడు,ఇది ధర్మం, ఇది అధర్మం అంటూ బ్రతకడానికి మనకో వ్యక్తిగతమైన మోరల్ కోడ్ నీ  ,వ్యక్తిత్వాన్నీ డిజైన్ చేసిచ్చే హ్యూమన్ కాన్షియస్, అంతరాత్మ, భౌతికమైన అస్తిత్వం లేని మన లోపలి మనిషే 'సౌల్'. పోనీ ఇంత వివరణ ఎందుకు గానీ, కాస్త సరళంగా మనకందరికీ తెలిసిన ఆత్మ అనుకుందాం.

Image Courtesy Google

ఆధునిక తరానికి 'మెదడు' గురించి తెలిసినంత 'ఆత్మ' గురించి తెలీదు. బహుశా రెంటికీ భేదం ఉంటుందని కూడా తెలీదు. ఇక ఆత్మ అంటే అదేదో సినిమాల్లో చూపించే ప్రేతాత్మలూ వగైరా అనుకునేవారికి కూడా కొదవ లేదు :) అందుకే పిల్లలకీ,అంతకుమించి పెద్దలకీ 'హ్యూమన్ సౌల్' ని గురించి ఒక పుస్తకం రాసి మరీ పరిచయం చెయ్యవలసిన అవసరం ఉందనుకున్నారో ఏమో, నోబెల్ గ్రహీత Olga Tokarczuk 'ది లాస్ట్ సౌల్' అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. (ఈ పోలిష్ రచయిత్రికీ ఆస్ట్రియన్ రచయిత Peter Handke కీ కలిపి 2019 లో నోబెల్ పురస్కారం లభించించి) ఒక చిట్టిపొట్టి కథతో పాటు పలు చక్కని చిత్రాలతో ప్రచురించిన ఈ పుస్తకం సైజు తక్కువైనా నాణ్యత దృష్ట్యా దీనికి విలువ చాలా ఎక్కువ. అందుకే ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలనిపించింది. ఓల్గా కథకు Joanna Concejo ఇల్లస్ట్రేషన్స్ అదనపు హంగునిచ్చాయి.

ఈ పుస్తకంలో ఓపెనింగ్ లైన్స్ ఈ విధంగా ఉంటాయి.

"If someone could look down on us from above, they’d see that the world is full of people running about in a hurry, sweating and very tired and their lost souls always left behind, unable to keep up with their owners. The result is great confusion as the souls lose their heads and the people cease to have hearts. The souls know they’ve lost their owners, but most of the people don’t realise that they’ve lost their own souls."

కథ విషయానికొస్తే, ఒకానొకప్పుడు ఎంతో కష్టించి పని చేసే ఒక మనిషుండేవాడు. వేగవంతమైన జీవితంలో అతడు తన ఆత్మను వదిలి చాలా దూరం వచ్చేసి చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ అతడి జీవితంలో పెనుమార్పులంటూ పెద్దగా ఏమీ లేవు. ఆత్మ లేకుండా కూడా అతడు మామూలుగానే తినేవాడు, నిద్రపోయేవాడు,పని చేసేవాడు, కారు నడిపేవాడు, చివరకు టెన్నిస్ కూడా ఆడేవాడు. కానీ కొన్ని సార్లు మాత్రం,

"He felt as if the world around him were flat, as if he were moving across a smooth page in a math book that was covered in evenly spaced squares... "

శూన్యం..... భరించలేని శూన్యం.... ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ఎత్తుకి ఎదిగినా ఇలాంటి వెలితి ప్రతీ మనిషిలోనూ ఏదో ఒక దశలో ఏర్పడుతుందేమో ! జీవితపు పరుగుపందెంలో క్షణం ఆగి ఆలోచించే తీరిక లేకుండా, అలుపెరుగకుండా పరిగెడతాం. సామజిక చట్రంలో సౌకర్యంగా ఇమిడిపోయే ప్రయత్నంలో మన చుట్టూ చేరి అరిచే అనేకానేక గొంతుకల మధ్య మన అంతరాత్మ గొంతు నొక్కేసి ముందుకు వెళ్ళిపోతాం. We want to belong. We want to fit in. క్రమేపీ మన అస్తిత్వాన్ని కోల్పోయి 'ఎంప్టీ షెల్స్' గా మారిపోతాం. నిరంతరం ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే తలపోతల మధ్య మన మనసు చెప్పే విషయాలను పెడచెవినపెడతాం. కానీ ఈ ప్రయాణంలో ఏదో ఒక దశలో చుట్టూ ఉన్న గొంతుకలన్నీ ఒక్కొక్కటిగా మూగబోతాయి. ఎవ్వరూ లేని ఆ ఏకాంత క్షణంలో నీతో ఉండవలసిన నీ అంతరాత్మ గుర్తొస్తుంది. దాని కోసం ఆత్రంగా వెతుక్కుంటావు. ఆత్మలేని నీ ఉనికి శూన్యమని అర్థమయ్యాక ఆ వెలితిని పూరించుకోడానికి చుట్టూ మనుషులను ప్రోగేసుకుని తాత్కాలికానందాల నడుమ తలమునకలుగా జీవిస్తావు.

ఈ కథలో మనిషి ఆ శూన్యాన్ని భరించలేక తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఒక వివేకవంతుడైన వైద్యుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడా వైద్యుడు ఒక చిన్న చిట్కా చెప్తాడు. జీవితపు పరుగుపందెం నుంచి కాస్త విరామం తీసుకుని, నిశ్చలంగా ఒక చోట తన ఆత్మ కోసం నిరీక్షించమంటాడు.

"You must find a place of your own, sit there quietly and wait for your soul."

ఆ వైద్యుడు చెప్పినట్లు అతడు సమాజపు వత్తిడికీ, అర్థవిహీనమైన మాటలకీ దూరంగా ఒక ఇంట్లో తన ఆత్మ కోసం వేచి చూస్తూ ఉంటాడు. మెల్లిగా వర్ణ విహీనంగా ఉన్న అతడి పూలతోట సప్తవర్ణాల సమ్మిళితమై వసంత శోభను సంతరించుకుంటుంది. ఒక చిన్న పాప అతడి కిటికీ బయట ఆడుకుంటూ కనిపిస్తుంది. Joanna Consejo నిస్సారమైన జీవితం సారవంతమయ్యే క్రమంలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపిస్తూ అద్భుతమైన చిత్రాలను గీశారు. మనిషి తన ఆత్మను వెతుక్కునే క్రమంలో తిరిగే వివిధ ప్రదేశాలను చిత్రిస్తారు. ఒక వేడి వేడి కప్పు కాఫీ,పుస్తకంతో ఉన్న టేబుల్, నిర్జనమైన ఒక ప్రాకృతిక ప్రదేశం, సూర్యోదయాలూ, మనుషులున్న ఒక చిన్ని కేఫ్, పచ్చని పొలాలూ, ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉన్న మనుషులూ, స్వప్నాలూ లాంటివి ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. మరి చివరకి అతడి నిరీక్షణ ఫలించి అతడి ఆత్మ అతణ్ణి వచ్చి చేరిందో లేదో తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదవండి. మీ ఇంట్లో బుజ్జాయిలుంటే వాళ్ళ చేత కూడా చదివించండి. హ్యాపీ రీడింగ్. :) 

Thursday, March 3, 2022

In Other Worlds : Essays In Cultural Politics - Gayatri Chakravorty Spivak

చాలా కాలం క్రితం మహాశ్వేతాదేవి రచనలు చదువుతున్నప్పుడు 'గాయత్రి చక్రవర్తి స్పివాక్' పేరు తొలిసారిగా విన్నాను. కథల గురించి తప్ప కథల వెనుక కథల గురించి సహజంగానే శ్రద్ధ తక్కువ కావడంతోటో మరొకటో తెలీదు గానీ ఆ సమయంలో ఆవిడను మహాశ్వేతాదేవి రచనల అనువాదకురాలిగా మాత్రమే చూశాను. మళ్ళా కొన్నేళ్ళ తరువాత డెరిడ్డా వ్యాసాలు చదువుతున్నప్పుడు ఈ పేరెక్కడో విన్నట్లుందే అనుకున్నాను. కాస్త వివరాల్లోకి వెళ్ళగా సొంటాగ్ లాగే గాయత్రి కూడా పురుషాధిక్య జాడ్యాలకు మినహాయింపు కాని సాహితీ ప్రపంచంలో 'పబ్లిసిటీ తక్కువ క్రిటిక్' అని అర్థమైంది. భారతీయురాలైన ఆమె పేరు ఇండియాలో కూడా తక్కువ వినడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా మరీ ఎక్కువైతే ఆశ్చర్యపోలేదు. స్త్రీవాదమనగానే తమ అస్తిత్వాన్ని ఎవరో గుర్తించాలనో, లేదా తమ హక్కుల్ని ఎవరిని నుంచో రాబట్టుకోవాలనో అనుకునే సగటు స్త్రీవాదుల మధ్య సుసాన్ సోంటాగ్, గాయత్రి చక్రవర్తి స్పివాక్ వంటి సాధికారత కలిగిన విమర్శకులు బహు అరుదు. వీళ్ళ విమర్శకు సాహితీలోకంలో శిఖరసమానులైనవారు కూడా మినహాయింపు కాదు, వీరి విమర్శ లక్ష్యం కేవలం స్త్రీవాదానికి మాత్రమే పరిమితమవ్వకుండా సాహిత్యంలో పురుషాధిక్య మూలాల్ని పెకలించే దిశగా సాగింది.

Image Courtesy Google

సుసాన్ సోంటాగ్ తరహాలోనే స్పివాక్ పేరు ప్రముఖ స్త్రీవాదుల జాబితాల్లో వినిపించకపోవడానికి కారణం కూడా ఆమె రచనలు ఏదో ఒక్క స్త్రీవాద సమస్యకో, సిద్ధాంతానికో, వర్గానికో, సమూహానికో పరిమితం కాకపోవడమేననిపిస్తుంది. చివరకు ఆమె తన కెరీర్ లో ఎక్కువ కాలం కలిసి పనిచేసిన ఫ్రెంచ్ తత్వవేత్త డెరిడ్డా సైతం ఆమెను తన 'కోటరీ' కి చెందిన వ్యక్తిగా పరిగణించేవారు కాదని స్పివాక్ ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పుకున్నారు. ఎప్పుడూ 'బిగ్ పిక్చర్' చూసే స్పివాక్ రచనల వైశాల్యం పెద్దది. ఈ కారణంగా సాధారణ పాఠకులకు సులభగ్రాహ్యంకాని స్పివాక్ రచనలు ఇతర స్త్రీవాదుల రచనల్లా పెద్దగా గుర్తింపుకి నోచుకోలేకపోయాయి.

స్పివాక్ రాసిన అనేక వ్యాసాల్లో 'Can the Subaltern Speak' పేరిట రాసిన ఒక వ్యాసాన్ని 'పోస్ట్ కలోనియల్ స్టడీస్' లో మిక్కిలి ప్రాధాన్యత కలిగిన వ్యాసంగా పరిగణిస్తారు. మేథావి వర్గాల్లో అంతర్గతంగా ఉండే నిరంకుశత్వాన్ని విమర్శిస్తూ రాసిన ఈ వ్యాసాన్ని నిజానికి 'బడుగుజీవి మాట్లాడగలడా?' అనేకంటే, 'బడుగుజీవి గళం వినబడుతుందా?' అన్న కోణంలోనే రాశారు. థర్డ్ వరల్డ్ గళం వినపడకుండా నిరోధించే అంశాలు అనేకం ఉన్నప్పటికీ, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్న విద్యావేత్తలూ,మతాధికారులూ,ఇతర ఉన్నత వర్గాలతో కూడిన శక్తివంతమైన సామజిక వర్గాలను అన్నిటికంటే ముఖ్యమైన కారణంగా చూపిస్తారు స్పివాక్. ఆమె మార్క్సిస్టు సిద్ధాంతాలూ, స్త్రీవాదం ,వచనం యొక్క పునఃనిర్మాణపు లక్షణాల ద్వారా తన వాదనలను సహేతుకంగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా పాశ్చాత్య పండితులు 'థర్డ్ వరల్డ్' ని నిర్వచించిన విధానమే  లోపభూయిష్టమైనదని స్పివాక్ అభిప్రాయపడతారు. ఈ క్రమంలో స్పివాక్ వాదనలన్నీ భౌతికమైన హింస కంటే ఆలోచన,భాష,వ్రాత రూపంలో జరిగే 'Epistemic violence' మరింత ఎక్కువ ప్రమాదకరమన్న దిశగా సాగుతాయి. ఉదాహరణకు చరిత్ర నుండి బడుగుజీవుల కథల్ని ఆనవాళ్ళు లేకుండా తుడిచివెయ్యడం ఈ రకమైన హింస క్రిందకి వస్తుంది. స్త్రీవాదాన్ని కూడా ఇదే వెలుగులో చూపిస్తూ, స్త్రీ గళం అణచివేతకు గురికావడానికి అటు పితృస్వామ్యంతో బాటు, ఇటు వలసవాదం కూడా ఒక కారణమంటారు. స్పివాక్ రచనల్లో సింహభాగం మేథావి వర్గాల ఆధిపత్యం కారణంగా సాంఘిక,సాంస్కృతిక,రాజకీయ,సాహితీ రంగాల్లో జరిగే అణచివేతపైనే దృష్టిసారిస్తాయి.

బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి కథ 'ద్రౌపది' ని స్పివాక్ ఆంగ్లంలోకి అనువదించడానికి కారణం కూడా అది తాను ప్రతిపాదించిన 'ఎపిస్టమిక్ వయొలెన్స్' ను ప్రతిబింబించే కథ కావడమేనంటారామె. క్లుప్తంగా కథ విషయానికొస్తే, ఒక సైనికాధికారి సేనానాయక్ ద్రౌపది అనే గిరిజన స్త్రీని బంధించి ఆమెను న్యాయ విచారణచేసే క్రమంలో దారుణమైన హింసకు గురిచేసి పలువురు ఆమెపై అత్యాచారం చెయ్యడానికి పరోక్షంగా కారణమవుతాడు. ఈ కథను తాను అనువదించడానికి 'ద్రౌపది' ఎంత కారణమో అందులో ప్రతినాయకుడు 'సేనానాయక్' పాత్ర కూడా అంతే కారణమంటారు స్పివాక్. ఆ కథలో సేనానాయక్ పాత్ర 'ఫస్ట్ వరల్డ్ స్కాలర్' ప్రతినిధిగా 'థర్డ్ వరల్డ్' కి చెందిన ద్రౌపదిని వెతుక్కుంటూ వెడుతుంది. ధర్మాధర్మాల విచక్షణా, సహానుభూతీ ఉన్నప్పటికీ చివరకి సేనానాయక్ తన వృత్తిలో భాగంగా ఫాసిస్టు భావజాలానికి కొమ్ముకాయక తప్పదు.

మహాశ్వేతాదేవి ఈ కథలో ఒక సందర్భంలో సేనానాయక్ తన చేతిలో ఉన్న Hochhuth రచన 'The Deputy' పేపర్ బ్యాక్ ని టేబుల్ మీదకు విసిరేశాడని రాస్తారు. చిన్న సంగతే అయినా ఈ వివరం కథలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిజానికి 'ది డిప్యూటీ' నవల హోలోకాస్ట్ సమయంలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ బాధ్యత గల మతాధికారి స్థానంలో ఉన్న పోప్ (Pope Pius XII) ఎటువంటి ప్రకటనా జారీచెయ్యకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన యాంటీ ఫాసిస్టు రచన. ఇది చదువుతున్న సేనానాయక్ కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న 'ఫస్ట్ వరల్డ్ ప్రతినిధి' గా ఉంది కూడా పోప్ తరహాలోనే ధర్మబద్ధంగా వ్యవహరించకుండా ద్రౌపది (థర్డ్ వరల్డ్) పై జరిగిన అత్యాచారానికి పరోక్షంగా బాధ్యుడవుతాడు. స్పివాక్ డెరిడ్డా 'డీకన్స్ట్రక్టివ్ ప్రిన్సిపుల్' ని ఈ విశ్లేషణకు మూలాధారంగా చేసుకున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ.

డాంటే మొదలు ఈట్స్ వరకూ సాహిత్యంలో స్త్రీ పాత్రపై దృష్టి సారిస్తూ ఆమె రాసిన 'ఇన్ అదర్ వరల్డ్స్' అనే పుస్తకంలో స్పివాక్ చేసిన కొన్ని విశ్లేషణలు స్త్రీవాదంపై ఆమె భావాలకు దర్పణం పడతాయి. కవితా వస్తువుగా స్త్రీని ఉపయోగించుకోవడంలో డాంటే,ఈట్స్ వంటివారు అవలంబించిన ద్వంద్వ విలువల్నీ, పురుషాధిక్య భావజాలాన్నీ వారి రచనల్లోని ఒక్కో వాక్యాన్నీ 'deconstruct' చేస్తూ చేసిన విశ్లేషణలు చదువుతున్నప్పుడు ఉత్తమ సాహిత్యంగా పరిగణింపబడే సాహిత్యంలో స్త్రీ పాత్ర ఎంత ? అనే ప్రశ్న జనించకపోదు. ఈ కవులందరూ సాహిత్యంలో స్త్రీ పాత్రను ఒక జీవం ఉన్న మనిషిగా కాకుండా ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చేయడాన్ని స్పివాక్ వ్యాఖ్యానాల్లో స్పష్టంగా చూస్తాం.

1977 లో జరిగిన వోక్స్ స్త్రీవాద సదస్సులో డాంటే La Vita nuova మీద వ్యాసానికి సంబంధించి పేపర్ ఒకటి చర్చకు పెట్టినప్పుడు ఆ పేపరు ప్రెజెంటేషన్ పూర్తైన వెంటనే సభలో ఒక స్త్రీ లేచి "స్త్రీకి ఏ మాత్రం విలువ ఆపాదించని ఈ రచనను స్త్రీలు ఏ విధంగా ప్రశంసించాలి ?" అని అడిగారట. దానికి అదే సభలో మరో స్త్రీ లేచి డెరిడ్డా డీకన్స్ట్రక్టివ్ సూత్రాన్ని గుర్తు చేస్తూ ఆ రచనకి రచయిత, అంటే ఇక్కడ డాంటే ఎంతమాత్రం బాధ్యుడు కాదని అన్నారట. డెరిడ్డా సూత్రం ప్రకారం వచనానికి తనను తానే నిరంతరం పునఃనిర్మించుకునే గుణం ఉంటుంది,ఈ కారణంగా స్వయానా రచయిత కూడా ఆ రచనకు బాధ్యుడు కాడు.

డాంటే-బీట్రిస్ ల ప్రేమకథలో డాంటే విపరీతమైన సెల్ఫ్ ఇండల్జెన్స్ తో బీట్రిస్ పాత్రను ఒక ఇమేజ్ కి మాత్రమే పరిమితం చెయ్యడం చూస్తాం. డాంటే ఆమెకు తన హృదయంలో ఒక గుడి కట్టి దేవతలా ఆరాధిస్తారు. కానీ నిజానికి ఆమె జీవితాంతం డాంటే ప్రేమను గురించిన స్పృహలేకుండానే జీవించి పాతికేళ్ళ వయసులో అకస్మాత్తుగా మరణిస్తుంది. అంటే ఈ కథలో బీట్రిస్ ఉనికిని పూర్తిగా తన ఆలోచనలకే పరిమితం చేస్తారు డాంటే. వాస్తవానికి ఆమెకు ఒక రూపం ఇవ్వకపోయినా తన ప్రతీ చర్యకూ బీట్రిస్ ని (ఆమె ఇమేజ్) కారణభూతంగా చూపించే ప్రయత్నం చేస్తారు. తన కల్పనలో తన కర్మలకు  ఆమెను బాధ్యురాలిని చేసి తాను మాత్రం ఎటువంటి బాధ్యతా తీసుకోరు. "బీట్రిస్ కారణంగా నేను అలా వ్యవరించవలసి వచ్చింది" అని డాంటే అనడంలో నిజానికి బీట్రిస్ పాత్ర ఏమీ ఉండదు. డాంటే రచనలో చర్యా/ప్రతిచర్యా /ఉనికీ ఇవేమీ లేని బీట్రిస్ కేవలం 'డాంటే యొక్క ఏజెంట్' గా మిగిలిపోతుంది. మరోవిధంగా చూస్తే ఆమె అతడి 'నాన్ ఏజెంట్' : ఆ కారణంగా ఒక ఆబ్జెక్ట్ (బీట్రిస్) స్థానంలో ఉంటూ సబ్జెక్టు(డాంటే) చర్యను ఆమె నియంత్రిస్తుంది. డాంటే తన ఆధిపత్యపు ఉద్దేశ్యాన్ని ఎప్పటికప్పుడు పునఃనిర్మించుకోవడానికి ఆమె ఒక ప్రేరణగా నిలుస్తూ, అతడి నార్సిసిజాన్నీ,మసకిజాన్నీ (Masochism) కప్పెట్టే తెరచాటుగా మారుతుంది.

మరికాస్త ముందుకెళ్ళి డాంటే కవిగా తన సృజనాత్మకతనీ, నైపుణ్యాన్ని మరికాస్త బిగ్గరగా చాటే పనిలోపడతారు. బీట్రిస్ ని జీవంలేని ఇమేజ్ గా మిగిల్చి 'ప్రేమ' ని మాత్రం కవితా సంప్రదాయంలో ఒక జీవం ఉన్న ప్రాణిగా చూపించే యత్నం చేస్తారు. ఆయన రచనలో ప్రేమను గురించిన వర్ణనలు ప్రేమ ఒక సజీవమైన వ్యక్తేమో అన్న భ్రమను కలిగిస్తాయి. ఈ ప్రయత్నాన్ని సమర్ధించుకునే దిశగా, వర్జిల్,లుకన్,హోరేస్ మరియు ఒవిడ్ వంటి వారి ప్రస్తావన తెచ్చి ప్రేమను 'పొయెటిక్ లైసెన్స్' కాలిడోస్కోప్ లో నుంచి సజీవమైన వ్యక్తిగా చూడొచ్చని నమ్మబలుకుతారు.

డాంటే,ఈట్స్ వంటి వారు స్త్రీని తమ కవితావస్తువుగా చేసుకునే క్రమంలో ఆమెకు తమ సృజనాత్మకతతో ఒక ఆదర్శ రూపమిచ్చే ప్రయత్నం చేశారు. కాల్పనిక వస్తువుగా ఇందులో స్త్రీ ప్రమేయం ఎంతమాత్రం లేకుండా ఆమెకు ఆపాదించిన రూపాన్ని మళ్ళీ వారే ఛిద్రం చేస్తారు, ఆ విధంగా ఆమెను 'న స్త్రీ స్వాంత్త్య్రమర్హతి' అన్న తీరులో ఆమె ఉనికిని సమూలంగా హరించే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇదంతా పాఠకుల దృష్టికి రాకుండా ఒక రహస్యంలా, వారి శిల్పంలో అంతర్గతంగా ఉంటూ, వారి పంక్తుల్ని ఒకదానితోనొకటి దగ్గరగా కలిపి ఉంచే చర్యలా జరుగుతూ ఉంటుంది. "ఒక స్త్రీగా స్త్రీ అస్తిత్వానికి ఆనవాళ్ళు లేకుండా చేసిన ఇటువంటి  ఉత్తమ సాహిత్యాన్ని నేను తిరస్కరిస్తే ఇక సాహిత్యంలో మిగిలినదేముంటుంది ? " అని ప్రశ్నిస్తారు స్పివాక్. పోనీ మరీ ఇంత కఠినమైన ప్రశ్నని కాసేపు ప్రక్కన పెడితే, "స్వయంసిద్ధమైన ఉనికిలేని కాల్పనిక వస్తువుగా స్త్రీ ఇమేజిని కుదించేశాక ఇక రచనలో ఎటువంటి ద్వంద్వానికీ చోటివ్వని కవి శిల్పం అతడి కావ్య సాధనలో ఏ రకమైన సంపూర్ణత్వాన్ని సాధిస్తుంది ?" అని సూటిగా ప్రశ్నిస్తారు. ఈ కారణంగా కేవలం వచనాన్ని మాత్రమే సాధనంగా చేసుకుని ఏకపక్షంగా చేసే ఈ రచనలు ఏ విధమైన వైరుధ్యానికీ ఆస్కారం లేకుండా చేసే అవకాశం ఉందంటారు స్పివాక్. ఇదే విశ్లేషణను ప్రముఖ ఫ్రెంచ్ సైకో అనలిస్టు జక్ లకాన్ పరిభాషలో ప్రకారం చెప్పాలంటే, కవులూ,రచయితలూ కేవలం ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని సృష్టించే ఈ తరహా సంబంధాలూ,ఊహలూ,ఫాంటసీలూ సాధారణ దృష్టికీ  గమనింపుకీ ఎంత మాత్రం అందేవి కాదు. అందువల్ల భాషాసౌందర్యాల మాటున చేర్చి భావగర్భంగా సమాజంలోకి ప్రవేశపెట్టే ఇటువంటి భావజాలాల్ని నమ్మి పాఠకులు ఆ కాల్పనికతను వాస్తవమని భ్రమపడే అవకాశం ఉంది [the symbolic masquerade of the Imaginary]. అక్కడితో ఆగకుండా అదంతా సహజమనీ,వాస్తవమనీ అంగీకరించే ప్రమాదం కూడా ఉంది.

పుస్తకం  నుండి మరికొన్ని అంశాలు : 

It is not surprising that the book ends with a promise to write further: “I hope to write of her that which has never been written of any other woman.” In Dante’s text, Beatrice is fully sublated into an object—to be written of, not to.

To keep the woman out. Here the third woman in Yeats’s life plays a role. She was caught on the rebound within the institution of marriage, and had a masculine nickname, “Georgie Yeats.” She was the transparent medium through which the voices of Yeats’s instructors, themselves at first dependent upon his own text, travelled: “On the afternoon of October 24th 1917,” Yeats writes in A Vision, “four days after my marriage, my wife surprised me by attempting automatic writing.… The unknown writer took his theme at first from my just published Per Amica Silentia Lunae”. We are back to “Ego Dominus Tuus.” Is it the unknown writer who is Yeats’s lord, is it Yeats who is his wife’s lord? We are caught in another labyrinth of “I,” “you,” and mastery.

తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ - 28 ఫిబ్రవరి 2022.

https://lit.andhrajyothy.com/vividha/article-about-spinak-articles-39742

https://www.andhrajyothy.com/telugunews/femininity-reduced-to-fiction-as-a-story-ngts-editorial-1922022804273432?fbclid=IwAR2t53EfcjxXkPSDc0DiW7zM3DPADq-FPModZ2OFzmYlZD-aPUrTo1XMahQ