"ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్"లో కథకుడు [మనం మార్సెల్ అనుకుందాం] చిన్నప్పటినుంచీ బెర్గొట్ (Bergotte) అనే ఒక రచయితకు వీరాభిమాని. ఒకానొక సందర్భంలో పొరుగింటి స్వాన్ ఆహ్వానం మీద మార్సెల్ కు తన అభిమాన రచయితను ప్రత్యక్షంగా కలిసే అవకాశం వస్తుంది. కానీ మార్సెల్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ ఒక మహొన్నతమైన రచయిత స్థానంలో పొట్టిగా, లావుగా, ఎర్రటి వంకర ముక్కు, చిన్నపాటి నల్లని గడ్డంతో, అతి సాధారణంగా కనిపించే ఒక మనిషి ఎదురవుతాడు. మార్సెల్ కు తీవ్రమైన నిరాశను కలిగించే ఈ ఘట్టాన్ని కేవలం ఒక రచయితను కలిసిన అనుభవంగా కాకుండా మనిషి కాన్షియస్, సబ్కాన్షియస్ లలో వాస్తవికత-భ్రమల మధ్య సుదీర్ఘమైన తులనాత్మక తాత్విక ధ్యానంగా రాసుకొస్తారు ప్రూస్ట్.
![]() |
| Image Courtesy Google |
మనం ఒక రచయిత రచనల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని, రూపాన్నీ ఊహిస్తాం. అతని భాష ఎంత అందమైనదో, ఆలోచనలు ఎంత విశాలమైనవో అనుకుంటూ, కళకు లేనిపోని దైవత్వాన్ని ఆపాదించి ఆ అందానికి తగ్గ శరీరాన్నీ, వ్యక్తిత్వాన్నీ, జీవనశైలినీ ఊహించుకుంటాం. మార్సెల్ కూడా సహజంగానే బెర్గొట్ రచనల్లోని గొప్పదనాన్ని బట్టి ఒక అందమైన ఆకృతిని నిర్మించుకుంటాడు. "గుహల్లో వేల సంవత్సరాల పాటు నీటి చుక్కలు పడుతూ ఏర్పడే stalactite ఎంత మెల్లగా రూపుదిద్దుకుంటుందో, అలాగే బెర్గొట్ గురించిన ఊహ కూడా అతని పుస్తకాలను చదువుతూ నాలో క్రమంగా రూపుదిద్దుకుంది" అంటాడు. కానీ తీరా చూస్తే నత్తగుల్లలాంటి ముక్కు, గడ్డం-- ఇవన్నీ మార్సెల్ కి అసహనం కలిగిస్తాయి. తన ఊహల్లో నిర్మించుకున్న పవిత్రమైన బెర్గొట్ కి అదనంగా ఇప్పుడు ఈ వంకర ముక్కునీ, గడ్డాన్నీ కూడా కలపాల్సి వస్తుంది మరి. :) ఆ క్షణంలో మార్సెల్ మనసులో ప్రతిష్టించుకున్న బెర్గొట్ రూపం అమాంతం పనికిరానిదైపోతుంది.
ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ, "బెర్గొట్ అనే పేరు వినగానే, నా ముఖం మీద పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పేలినట్లనిపించింది" అంటారు. ప్రూస్ట్ ఊహల్లో నిర్మించుకున్న రూపం వాస్తవానికొచ్చేసరికి ఎలా ఛిద్రమైందో ఈ మెటఫర్ చెప్తుంది. అంతటితో ఊరుకోకుండా, "ఈ ముక్కును దాటుకుని నేను బెర్గొట్ రచనల ప్రపంచానికి వెళ్ళలేకపోయాను" అని చమత్కరిస్తారు. ప్రపంచాన్నైనా, పుస్తకాన్నైనా పాఠకుడు తన దృష్టికోణం నుంచే చూస్తాడనేది జగమెరిగిన సత్యం. చాలా ఏళ్ళ క్రితం చదివిన జాన్ బెర్జర్ "Ways of seeing ", పీటర్ మెండెల్సండ్ "What we see when we read" లాంటి పుస్తకాల్లో ఈ అంశాల గురించి చదివి ఉండడంవల్ల ఈ భాగం కొత్తగా అనిపించలేదు. కానీ వీళ్ళందరూ ప్రూస్ట్ ని చదివే ఉంటారేమో అని అనుమానం మాత్రం వచ్చింది. :) మనం ఒక రచయితనో, కళాకారుణ్ణో, తత్వవేత్తనో దీర్ఘకాలం అతని రచనల ద్వారా మాత్రమే ప్రేమిస్తుంటే, అతని పేరు మనకు తెలీకుండానే మనలో ఒక విశేషమైన భావోద్వేగాన్ని సృష్టిస్తుంది. ఆ పేరు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సూచించదు, అది మన ఊహల్లోని రూపాన్ని సూచిస్తుంది. ప్రూస్ట్ మనసులో బెర్గొట్ కి అటువంటి విశిష్ట స్థానముంది.
మార్సెల్ ఊహించుకున్న గొప్ప రచనలు చేసింది రక్తమాంసాలతో కూడిన అతి సాధారణమైన మనిషే గానీ, తన మనసులో ఏర్పరుచుకున్న గొప్ప వ్యక్తి తాలూకా 'ఇమేజ్' కాదని గ్రహించాక ప్రూస్ట్ లో నవలాకారుడు పూర్తి స్థాయి విమర్శకుడిగా రూపాంతరం చెందుతాడు. కళాకారుడు ఎప్పటికీ తన కళలా ఉండకపోవచ్చు, మనమందరం కవిని అతని కవితలా ఊహిస్తాం, తత్వవేత్తను అతని తత్వంలా ఊహిస్తాం, కానీ నిజ జీవితంలో వారు, వారి రాతలంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ విశ్లేషణ క్రమంగా మరింత లోతైన ప్రశ్న వైపుకు తన దిశను మార్చుకుంటుంది. "గొప్ప కళను సృష్టించే వ్యక్తి తప్పనిసరిగా గొప్ప వ్యక్తేనా!!?" ఈ ఆలోచనతో మార్సెల్ అసహనం కాస్తా అనుమానంగా మారుతుంది. అసలిన్ని గొప్ప రచనలు చేసింది ఈ మనిషేనా? ఒకవేళ అతను ఏదైనా దీవిలో ముత్యాల వ్యాపారం చేసే పరిస్థితిలో పెరిగుంటే, ఇంతే శ్రద్ధగా, ఒక గొప్ప ముత్యాల వ్యాపారి అయ్యుండేవాడేమో! కళ అనేది వ్యక్తి యొక్క అంతరాత్మలో ఉండే దైవత్వం (muse అనే బ్రహ్మపదార్థం?) వల్ల పుడుతుందా, లేక భౌగోళిక పరిస్థితులు, పరిశ్రమ, అలవాట్లు-- వీటన్నిటి ఫలితమా అన్న అనుమానం మెల్లగా పాఠకుల్లో కూడా మొదలవుతుంది. ఈ వాదనతో ప్రూస్ట్ కళాకారుల్ని దైవాంశ సంభూతులుగా, ఒక పెడెస్టెల్ మీద పెట్టి చూడడాన్ని సవాలు చేస్తారు.
వీటన్నిటికీ తోడు బెర్గొట్ మాట్లాడే తీరు కూడా అతని రచనలతో ఏ మాత్రమూ పొంతనలేని విధంగా ఉంటుంది. వాడుక భాషలో కాకుండా, గొప్ప ఇంటెలెక్చువల్ లా తన ప్రత్యేకతను చాటుకోవాలనే తపనతో, కొన్ని సిలబల్స్ మీద వత్తిడి పెడుతూ ఆడంబరంగా, బలవంతపు కవిత్వంలా, తెచ్చిపెట్టుకున్నట్లు మాట్లాడుతుంటాడు. ఈ ప్రవర్తన మార్సెల్ కు విసుగు తెప్పిస్తుంది. కొన్ని పదాలను అసహజమైన ఉచ్చారణతో గంభీరంగా పలకాలనే ప్రయత్నం అతిశయంగా, మోనోటనస్ గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రూస్ట్ బెర్గోటిజం [Bergottism] అనే పదాన్ని కాయిన్ చేస్తారు. చాలామంది రచయితలు బెర్గొట్ ని అనుకరిస్తారు. అతని మెటఫోర్స్, ఇమేజరీ, పొయెటిక్ టోన్ లాంటి భావవ్యక్తీకరణలను కాపీ చేస్తారు. నిజానికి అవన్నీ అసలైన 'బెర్గొట్' కాదు. నిజమైన బెర్గొట్ ప్రతి వస్తువులోనూ దాగున్న అమూల్యమైన సత్యాన్ని దర్శించి, బయటకు తీయగల శక్తి. అదే రచయిత 'జీనియస్' అనొచ్చు. ఈ జీనియస్ అనుకరణతో వచ్చేది కాదు. ఒక గొప్ప రచయిత 'ఒరిజినాలిటీ' అనేది అతని శైలిలో ఉండదు, అతని దృక్పథంలో ఉంటుంది, అతను ప్రపంచాన్ని చూసే ప్రత్యేకమైన విధానంలో ఉంటుంది.
ఉదాహరణకు ప్రూస్ట్, జాయిస్ లాంటివాళ్ళు రాసే వాక్యాలను కూడా కొందరు అనుకరించగలరేమో గానీ, వాళ్ళు ఒక వాక్యం రాసాక, ఆ వాక్యానికి తర్వాత ఏ పదం వాడతారో ముందుగా ఊహించగలరా!? నిజమైన కళలో ఒకరకమైన "unpredictability" ఉంటుంది. అది అనుకరణకు వీలైన 'ఒక పాటర్న్' కాదు, సాధన చేసి నేర్చుకునే ఫార్ములా అంతకంటే కాదు. మనం గమనిస్తే, చాలామంది రచయితల పుస్తకాల్లో కనిపించే 'లోతు', వారి సంభాషణల్లో కనపడదు. దానికి కారణం, వారి అంతర్ముఖ ప్రపంచం నుంచి వచ్చే ఆలోచనల వెలుగు రచనల్లో మాత్రమే పూర్తిగా వ్యక్తమయ్యే ఆస్కారం ఉంటుంది. బహుశా అందుకేనేమో బార్త్ తన "The Death of the Author"లో రచన మనిషి స్థిరమైన వ్యక్తిత్వం యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ కాదని వాదిస్తారు. ఆయన దృష్టిలో "రచయిత" ప్రత్యేకం రచన పుట్టడానికి ముందే పూర్తిగా ఏర్పడిన కేంద్రం కాదు. రచన పుట్టిన క్షణంలోనే దాన్ని తన ఆవరణలోకి తెచ్చుకుని "ఇంటర్ప్రెట్" చేసే పాఠకుడు కూడా పుడతాడు. అంటే, ఒక రచనకు అర్థం తెలియాలంటే ఆ రచయిత వ్యక్తిగత జీవితాన్ని వెతకాల్సిన అవసరం లేదు. రచయితకూ, రచనకూ మధ్య సంబంధం, రచన పూర్తవడంతోనే తెగిపోతుందని బార్త్ అంటే, ప్రూస్ట్ మొదట్నుంచీ రచనకూ, రచయితకూ అసలు సంబంధమే ఉండదని అంటారు. ఊహాత్మక ప్రపంచంలో ఉండే రచయితకీ, వాస్తవంలో అదే మనిషికీ అస్సలు పొంతనలుండవని ప్రూస్ట్ వాదన.
ప్రూస్ట్ పరిశీలనల్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ వాదనలోనూ ఆయన పూర్తిగా ఒకవైపు మొగ్గి నిలబడరు. ఆయన తర్కం చాలా చోట్ల నాలాగే ఇన్-యాంగ్ నీ, ద్వంద్వన్నీ ఆధారం చేసుకుని నిలబడడం వల్ల కావచ్చు, ప్రూస్ట్ తర్కం నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చుతుంది. బెర్గొట్ వ్యక్తిత్వం అతని రచనలంత గొప్పది కాదు అని అంటూనే, అతని రచనల్లోని లోతునీ, సత్యాన్నీ పూర్తిగా నిరాకరించలేమని కూడా అంటారు. ప్రూస్ట్ ప్రకారం గొప్ప రచయితంటే, కేవలం అందమైన పదాలతో, అలంకార శైలితో రాసేవాడు కాదు. ఇతరులు చూడని ప్రపంచాన్ని కొత్తగా చూపించేవాడు. అతని శైలి మన ఊహకు అందదు, అతని తదుపరి వాక్యం ఏమవుతుందో తెలియదు. ఉదాహరణకు ఎవరైనా ఆస్కార్ వైల్డ్ శైలిని అనుకరించవచ్చు. కానీ "I can resist everything except temptation." అనే అద్భుతమైన వాక్యం ఎలా రాయగలరు? అది కేవలం అనుకరణ వల్ల అబ్బే కళ కాదేమో! 'కళ' మనిషి యొక్క రోజువారీ వ్యక్తిత్వం కాదు. వైల్డ్ "ఏ గొప్ప కళాకారుడూ వస్తువులను అవి ఉన్నవున్నట్లుగా చూడడు." అనడంలో ఒకరకమైన 'ట్రాన్స్ఫర్మేషన్' (రూపాంతరం చెందడం?) కనిపిస్తుంది. "The Critic as Artist" అనే వ్యాసంలో వైల్డ్ ఆర్టిస్టు కళ ఒక "ప్రదర్శన" లాంటిది అంటారు. ఆయనకు కళాకారుడి వ్యక్తిత్వం అనేది 'స్వచ్చమైన ఒప్పుకోలు' కాదు, అది ఒక తెచ్చిపెట్టుకున్న శైలి, ప్రదర్శన. మాత్రమే. "Man is least himself when he talks in his own person. Give him a mask, and he will tell you the truth." అని వైల్డ్ అన్నట్లే, ప్రూస్ట్ కూడా దాదాపుగా ఇదే విషయాన్ని మరో కోణంలో చెబుతారు. ప్రూస్ట్ కి కళాకారుడి సామాజిక వ్యక్తిత్వం (social self), సృజనాత్మక వ్యక్తిత్వం (creative self) -- ఈ రెండూ రెండు వేర్వేరు అంశాలు. మనం గమనిస్తే ఏ రచయితా తన జీవితం గురించి నేరుగా రాయడు. మనకు "ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్" నవలలో కథానాయకుడు పూర్తిగా తానేనని ప్రూస్ట్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ అది ఒక ఫిక్షనల్ / సెమీ ఆటోబయోగ్రఫికల్ నవల అని అందరికీ తెలిసిన విషయమే. బెర్గొట్ పాత్రను ప్రూస్ట్ నిజజీవితంలో ఆరాధించిన రచయిత అనాటులీ ఫ్రాన్స్, ఆర్ట్ క్రిటిక్ జాన్ రస్కిన్ లాంటివారిని దృష్టిలో పెట్టుకుని రాసారని అంటుంటారు.
మళ్ళీ బెర్గొట్ విషయానికొస్తే, మార్సెల్ బెర్గొట్ గురించి చెడుగా అనేక పుకార్లు కూడా విని ఉంటాడు. బెర్గొట్ రచనల్లో కనిపించే నైతికత, సున్నితత్వాలకూ, అతని వ్యక్తిగత జీవితంలోని అనైతికతకూ ఎక్కడా పొంతనలుండకపోవడం మార్సెల్ ని ఇబ్బందిపెడుతుంది. బెర్గొట్ పాత్రలు చిన్న తప్పులకే నైతిక భారం మోస్తూ పాపభీతితో కలతపడుతుంటాయి. అలాగని ఈ వైరుధ్యం కారణంగా బెర్గొట్ సాహిత్యంలో ప్రామాణికత లేదనుకోవడం కూడా సరికాదు. దీనికి ప్రూస్ట్ ఇచ్చిన వివరణ విచిత్రంగా అనిపించింది. కళాకారుడిలో దుర్గుణమో, పాపమో కేవలం సున్నితత్వం లేకపోవడం వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు అతి ఎక్కువ సున్నితత్వం వల్ల కూడా రావచ్చునంటారు ప్రూస్ట్. కొన్నిసార్లు మనిషిలో దుష్టత్వం, అతని భావోద్వేగ శూన్యత కంటే అతిగా స్పందించే స్వభావం వల్ల కూడా పుట్టొచ్చు. ఇది కొన్నేళ్ళ క్రితం చదివిన నోబెల్ గ్రహీత J.M.Coetzee "యూత్"లో ఆర్టిస్టు గురించిన చర్చను జ్ఞప్తికి తెచ్చింది. కోట్జీ వాదనలో సాధారణ మనుషులు తమలోని చెడును వదిలించుకుని మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవాలనుకుంటారు. కానీ కళాకారుడలా కాదు. ఆర్టిస్టు నిరంతరం తనను దహించివేసే ఆ "లోపలి జ్వరంతోనే" జీవించాలి, ఎందుకంటే అదే అతని కళకు మూలాధారం. అందుకే ఆర్టిస్టు ఎప్పుడూ పూర్తిగా బయటి ప్రపంచంలో మనలేడు. అతని చూపులో కొంత భాగం ఎప్పుడూ అతని లోపలి ప్రపంచంపైనే ఉంటుంది.
దీనికి కొనసాగింపుగా, నిజమైన నైతిక సంఘర్షణ బహుశా తమలో అనేక లోపాలు ఉన్నవాళ్ళలోనే అత్యంత తీవ్రంగా ఉంటుందేమో అని కూడా అంటారు. ఎప్పుడూ ఏ బలహీనతలూ, సంఘర్షణలూ అనుభవించని వ్యక్తికి నైతికత యొక్క అసలు తీవ్రత పూర్తిగా అర్థంకాకపోవచ్చు. గొప్ప కళాకారులు లోపల కలతలతో, విరుద్ధ భావాలతో జీవిస్తారు కాబట్టి, నైతిక సమస్యలను సహజంగానే వారు మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే సాధారణ మనుషులకు భిన్నంగా, కళాకారులు తమ రచనల్లో నైతిక సమస్యలకు పరిష్కారాన్ని వ్యక్తిగత జీవితంలో వెతుక్కోరు. ఆ వెతుకులాట వారి కళలో, సార్వజనీన అనుభవాల స్థాయిలో జరుగుతుంది. బహుశా వేమన శతకం లాంటివి ఇలా పుట్టినవేనేమో కదా! అందుకే కళాకారుల వ్యక్తిగత జీవితం ఎంత లోపభూయిష్టమైనప్పటికీ, వారి కళలో మాత్రం గొప్ప నైతిక సత్యం కనబడవచ్చు. కళాకారులు తమ స్వానుభవాల్నీ, తమ చుట్టూ ఉన్న అనైతికతనూ ఊతంగా చేసుకుని మానవ నైతికతను అర్థం చేసుకుంటారు.
రచయితలు తమ పుస్తకాలలో ఎక్కువగా విమర్శించేది కూడా వాళ్ళు నిజ జీవితంలో కొనసాగిస్తున్న జీవనశైలినే అనేది ప్రూస్ట్ వాదన. అందుకే సమాజాన్ని మార్చాలని రచనలు చేసే అనేకమంది తమ స్వంత నడవడికను మార్చుకోవాలని ప్రయత్నించరు. అవినీతిమయమైన సమాజంతో బాటే అరుదుగా మారిన నైతిక ఆదర్శాలు ఎక్కువగా ఉన్న బెర్గొట్ కాలంలో ఈ విరుద్ధత ఇంకా ఎక్కువగా కనిపించిందని ప్రూస్ట్ అన్నప్పటికీ, ఇది అన్నికాలాలకూ వర్తించే విషయమే! ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అని కళాకారులూ, రచయితల వ్యక్తిగత జీవితాల గురించి ప్రజలకు ఇంతకుముందెన్నడూ లేనంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఒక సమయంలో రచయితలు మారుపేర్లతో అజ్ఞాతంగా రచనలు చేసేవారు. ఇప్పుడలా కాదు, ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో ప్రైవసీ కుదరని పరిస్థితుల్లో అందరి జీవితాలూ తెరచిన పుస్తకాలైపోయాయి. ఈకారణంగా వారి రచనల మీద వారి వ్యక్తిగత జీవితపు ప్రభావం, తద్వారా 'మోరల్ పోలీసింగ్' ఎక్కువవుతోంది. బహుశా వర్జీనియా వూల్ఫ్ కళాకారుడు తన వ్యక్తిత్వాన్ని సామాజిక ఒత్తిళ్ళనుండి కాపాడుకోవాలని అందుకే అంటారేమో! ఆవిడ ప్రూస్ట్ లా రచయిత ఉనికిని పూర్తిగా తీసిపారెయ్యరు. వ్యక్తిత్వంతో సంబంధం లేని కళను సమర్థించరు. అది వేరే విషయం.
భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన బెర్గొట్ ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించిన సందర్భాలు చూస్తే బహుశా, బెర్గొట్‌లోని "గొప్ప రచయిత" అతని లోపలున్న సాధారణ మనిషిని ఓవర్ షాడో చేసేసాడేమో అనిపిస్తుంది. రచయితల ఊహాలోకపు కాల్పనిక జీవితాలు, భావజాలాలూ వాస్తవంలో తన చుట్టూ ఉండే మనుషుల పట్ల ఉండాల్సిన సాధారణ బాధ్యతలను విస్మరించేలా చేస్తాయేమో! కళాకారుడు నిజ జీవిత నైతిక కర్తవ్యాల స్థానాన్ని సృజనాత్మకతతో భర్తీ చేసుకుంటాడు. అదే సమయంలో ఇతరుల బాధను తన బాధగా అనుభవించగలిగే లక్షణం కూడా కళాకారులకు ఉంటుంది.
బెర్గొట్ చర్చ లేవనెత్తడం ద్వారా మనుషులు, మరిముఖ్యంగా కళాకారులు నైతికంగా సులభంగా అర్థమయ్యే జీవులు కారని చెప్పడమే ప్రూస్ట్ ఉద్దేశ్యం కావొచ్చు. గొప్ప సాహిత్యం తప్పనిసరిగా "మంచి మనుషుల" నుంచే రావాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు అది మనుషుల్లో బలహీనతల్నీ, అంతర్గత సంఘర్షణల్నీ చాలా లోతుగా అర్థంచేసుకున్న మనసుల్లో నుంచే పుడుతుంది. ఇలియట్ "Tradition and the Individual Talent" అనే వ్యాసంలో కళలోని భావోద్వేగం వ్యక్తిగతమైనది కాదంటారు. ఒక కళాకారుడి ఎదుగుదల నిరంతరం తనను తాను కోల్పోవడం (continual self-sacrifice / extinction of personality) ద్వారా మాత్రమే సాధ్యమంటారు. J. M. Coetzee, సాలింజర్, బిల్ వాటర్సన్ లాంటి ఆర్టిస్టులు పబ్లిక్ లైఫ్ కి సాధ్యమైనంత దూరంగా ఉండేవారు. కోట్జీ అంతర్ముఖత్వం ఆయన నవలల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రచయిత రూపం ఒక "carefully constructed image" అంటారాయన. కారణాలు వేరైనా, ఈ ముగ్గురూ సాహిత్యం అనేది ఏ రకమైన ఫిల్టర్లు లేని వ్యక్తీకరణ మాత్రమే కాదనే విషయంలో మాత్రం ఏకీభవిస్తారు. బెర్గొట్ చర్చలో ప్రూస్ట్ చెప్పేది కూడా అదే! రచనలో వినిపించే స్వరం కేవలం రచయిత వ్యక్తిగత జీవితానికి ప్రతిబింబం కాదు. అది అనేకమైన ముసుగులు, భాష, సాహిత్య సంప్రదాయాలు, సృజన -- వీటన్నిటి మిశ్రమంగా ఏర్పడే కళారూపం.

No comments:
Post a Comment