నిజానికంతా తెలిసిందే ; తెలిసిందే తెలియందై అంతో ఇంతో అనుభవాన్ని పంచుతుంది. ఎంతోకొంత అశాంతినీ దహిస్తుంది.
ఇక ఫేస్బుక్ లో నందూ పంచుకునే కవిత్వంతో నాకు తెలీకుండానే ప్రేమలో పడిపోయాను. ఇది యాదృచ్ఛికంగా ఎక్కడో ఒకచోట ఒక్క కవిత చదివి అమాంతం కలిగిన అభిమానం కాదు. క్రమంగా, స్థిరంగా, అతి మెల్లగా ఏర్పడిన ఇష్టం. ఒకటి రెండు క్షణాల్లో, ఒకట్రెండు కవితలతో అంతరించిపోకుండా బహుశా తుదకంటా నిలచియుండే ఇష్టం.
నాకు తెలిసి హేతువాదుల్ని భావుకత్వంతో కదిలించడం అంత సులభం కాదు. ఇదేదో గొప్ప విషయమని అనను. అక్షరాల్లో అంతర్లీనంగా ధ్వనించే కపటత్వాన్నీ, పదవిన్యాసాల నడుమ లోతులేని బోలుతనాన్నీ అతి సునాయాసంగా కొలవగల శాపగ్రస్తులు వాళ్ళు. ఇవన్నీ వద్దనుకున్నా వారి దృష్టిని దాటిపోవు. 'Interpretation is the revenge of the intellectual upon art.' అంటారు Susan Sontag.
ఇటువంటి శాపగ్రస్తుల్ని ఊరడిస్తూ అలసిసొలసిన సాయంత్రపు వేళల్లో ఎక్కడో అల్లంత దూరంనుంచి వినిపించే స్వచ్ఛమైన అమ్మ జోల పాట నందూ కవిత్వం. నందూ కవిత్వం ఈ హేతువాదపు చీకట్లు కమ్ముకోక మునుపటి వెలుగుల గతంలోనుండి కొన్ని జ్ఞాపకాలని తిరిగి కళ్ళముందు నిలిపింది. అదే నదినీ, దానితో ముడిపడ్డ జ్ఞాపకాలనీ గుర్తుకుతెచ్చింది. కొన్ని కవితలు చదువుతుంటే మా గోదావరి ఇసుక తిన్నెల్లో వదిలేసి వచ్చిన అడుగు జాడలవైపు కాలం వెనక్కి ప్రయాణించినట్లనిపించింది. ప్రేమనూ, ప్రేమరాహిత్యాన్నీ, వియోగాన్నీ, విరహాన్నీ, వైఫల్యాన్నీ, అస్తిత్వవాదాన్నీ, తాత్వికతనూ అన్ని వర్ణాల్లోనూ చిత్రించిన అందమైన కాన్వాసు నందూ కవిత్వం. చాలాచోట్ల నెరుడా ఛాయలు కనిపించాయి. ఇంతకుమించి నందూ కవిత్వాన్ని గురించి ఇంకేమీ చెప్పే సాహసం చెయ్యను. రసాస్వాదనలో హేతువాదానికీ, తర్కానికీ పనిలేదు.
ఇక్కడొక చిన్న సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక పండితుడిని "మీరు ఈ విధంగా చేస్తే మీ రచనలు ఎక్కువమందికి చేరతాయి కదా" అని అమాయకంగా ప్రశ్నిస్తే , ఆయన చాలా ప్రశాంతంగా, "ఎక్కువమందికి ఎందుకు ,ఒకరిద్దరు చదివినా చాలు" అన్నారు. ఆమాట అర్థం కావడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాలుగు పుస్తకాలు ప్రచురించినా ముందుమాట / చివరి మాట ఎవరితోనూ అడిగి రాయించుకోలేదనీ చెప్పిన నందూని చూస్తే ముచ్చటేసింది. తన కవిత్వానికి ఒకరిచ్చే అక్రిడేషన్/సర్టిఫికేషన్ పై ఆసక్తి లేదనీ, Poetry can speak for itself అని నమ్ముతాననీ చెప్పిన ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం,నిజాయితీల పై అమితమైన గౌరవం కలిగింది.
ఈ కవిత్వాన్ని మీరు కేవలం వెలకట్టి సొంతం చేసుకోగలమనుకుంటే పొరపాటే. ఇటువంటి కవిత్వాన్ని ఆస్వాదించడానికి భావుకత్వంతో పాటు పాఠకుడికి కూడా మరింకేదో అర్హత కావాలి. నంద కిషోర్ కవిత్వం దారిచేసుకుంటూ ప్రవహించే నదిలా అచ్చంగా ఎవరికోసం రాశారో అటువంటి అర్హత కలిగిన పాఠకులను తప్పకుండా వెతుక్కుంటూ వెడుతుంది.
నిన్న పుస్తకం చేరిన దగ్గరనుండీ పేజీలు తిరగేస్తూనే ఉన్నాను. చదివిన కవితలు కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.
మచ్చుకి ఈ ఆణిముత్యాలు :
కల్లోలాన్ని అనుభవిస్తూ ఒక్కడూ ఏం చేస్తాడు ? తీరాన కూర్చుని కెరటల్ని గురించి కవిత్వం రాస్తాడు. అలల మీదా, నీటి తరగల నాట్యం మీదా పదాలు అల్లుతూ పాటకడతాడు. ఉప్పెన మీదికి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే చేపపిల్లలాగా తుళ్లిపడతాడు. అలలతో పాటే ఊపిరి పోతే ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.
సముద్రం వాణ్ణి ప్రేమించిందని ఎవ్వరికీ చెప్పడు. కల్లోలాన్ని వాడు కోరుకున్నట్లు ఎప్పటికీ తెలియదు. తెలిసేదల్లా వాడికలేడనే !
--------------------------------------------------------
ఎలుగెత్తి నువ్వలా పాట పాడితే, ఎదకెత్తి నువ్వలా జోలపాడితే, పారిపోయేటినిశ్శబ్దాన్ని తెచ్చి పాటపాటలోనూ పదిలంగా నింపితే - మసకలోకమ్మీది మోహాలపొద్దులో సూర్యుడు,చంద్రుడు నిలవరనిపిస్తుంది. మరలిపోయేటి ప్రాణాలకోసం ఏడ్వడం,నవ్వడం కూడదనిపిస్తుంది.
No comments:
Post a Comment