కొన్ని పుస్తకాలు ఒక నిర్ణీత సమయంలో మాత్రమే మన దృష్టినాకర్షిస్తాయి, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు చదవడం సాధ్యపడదు. 2013 లో మిత్రులు సురేష్ పెద్దరాజు గారు బహూకరించిన పాల్ బ్రంటన్ రచన 'రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ' అలా ఒక సరైన సమయంలో చదవడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రిందట నన్ను చేరిన ఈ పుస్తకం ఇంతకాలంగా నా బుక్ షెల్ఫ్లో ఉన్నా ఇంతవరకూ ఎందుకు చదవలేదు అంటే సహేతుకమైన కారణాలు చెప్పలేను. బహుశా కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల ఏర్పడిన నిరాసక్తత, వైరాగ్యం, స్తబ్దత ఆధ్యాత్మికత వైపు తాత్కాలికంగా నా దృష్టిని మళ్ళించి ఉండవచ్చు. అదలా ఉంచితే ఫిలాసఫీ అంటే మొదట్నుంచీ వల్లమాలిన ఇష్టం కావడంతో కొన్నేళ్ళ క్రితం జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద, రస్సెల్ ,హెస్సే ,గిడే, కామూ వంటి వారి తత్వాలను మైకం కమ్మినట్లు వరుసపెట్టి చదివినా,తరువాతి కాలంలో పరస్పర వైరుధ్య వాదనలతో భౌతిక ప్రపంచం నుండి దూరంగా మనిషిని వేరే ప్లేన్ లోకి తీసుకుని వెళ్ళి వదిలేసే అటువంటి రచనల నుండి ఉద్దేశ్యపూర్వకంగా దూరం జరిగే ప్రయత్నం చేశాను. కానీ ఆధ్యాత్మిక,తాత్విక విషయాలపై స్వతహాగా ఉన్న ఆసక్తి నాస్తికత్వపు (?) ముసుగుల మాటున మిగిలిపోయేది కాదేమో.
Image Courtesy Google |
సత్యాన్వేషణలో భాగంగా భారత దేశం వచ్చి మెహెర్ బాబా, అడయారు యోగి బ్రమ,హజరత్ బాబాజాన్, రమణ మహర్షి, శ్రీ శంకరులు,విశుద్ధానంద మొదలగు అనేకమంది యోగుల్ని కలిసి, వారి సాన్నిహిత్యంతో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలను పలు ఆధ్యాత్మిక రచనల్లో పొందుపరచిన బ్రిటిష్ రచయిత పాల్ బ్రంటన్ ఈ రచన ద్వారా పాఠకులకు దాదాపు కనుమరుగైపోయిన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పునఃదర్శనం చేయిస్తారు. ఈ పుస్తకంలో భారతీయ యోగతత్వాన్ని గురించి చదువుతున్నంతసేపూ చాలామందికి వచ్చే సందేహమే నాకూ వచ్చింది. ఈ ఆధునిక యుగంలో భారతీయ యోగశాస్త్రం యొక్క ఉపయోగం ఎంత ? కానీ బ్రంటన్ తో ప్రయాణంలో నా ప్రశ్నకు కొన్ని సరైన సమాధానాలు దొరికినట్లనిపించింది.
ఆదర్శ జీవన శైలికి పాశ్చాత్యుల నిర్వచనమైన 'కార్యాచరణ' కు సుదూరంగా ముక్కుమూసుకుని ఎక్కడో అరణ్యాల్లో,హిమాలయాల్లో మారుమూల గుహల్లో,ఆశ్రమాల్లో తపస్సు చేసుకునే యోగుల వల్ల ఈ ఆధునిక సమాజానికి ఉపయోగం ఏమిటి ? అనేది బ్రంటన్ ను కూడా తుదికంటా వేధించిన ప్రశ్న. కానీ కనిపించినదాన్నల్లా గుడ్డిగా నమ్మకుండా తర్కం ప్రధానంగా భారత దేశంలో తన యాత్రలు కొనసాగించారాయన. వేల సంవత్సరాల క్రితం భారత దేశంలో ఋషులు ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల గురించీ, మానవజాతి ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల గురించీ మేధోమథనం చేసే సమయంలో పాశ్చాత్య దేశాలకు అటువంటి విషయాల్లో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదనే విషయాన్ని నేటి ఆధునిక భారతం అవహేళన చేస్తూ ప్రస్తావించే పరిస్థితులున్నా ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించే దిశగా ఈ పుస్తకంలో అనేక విశ్లేషణలు ఉంటాయి.
"బర్నాఫ్, కోల్బ్రూక్ , మాక్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారత దేశంలోని విలువైన సాహిత్య సంపదను పరిచయం చేసే వరకూ, యూరప్ లోని జ్ఞాన రక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశ ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు. ఆ రకంగా ప్రాచ్యదేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రచారం చేస్తూ, వారి సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి ఈ యురోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు." అంటారు బ్రంటన్.
'మంచి వారి మౌనం సమాజానికి ప్రమాదకరమైనది' అనడం తరచూ వింటూ ఉంటాం. నిజానికి భారతీయ యోగ శాస్త్ర రహస్యాలను ఔపాసన పట్టిన ఋషులు సామజిక జీవనాన్నుంచి నిష్క్రమించడంతోనే భారతీయ సమాజం పతనం ప్రారంభమైంది అని పలువులు యోగులు అభిప్రాయపడతారు.
"నిజానికి ఈ విశ్వ రహస్యాలన్నిటినీ విప్పి చెప్పగలమనే విజ్ఞాన శాస్త్ర రచయితలకి తెసింది సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం మాత్రమే ! వారెవరూ ఒక వృద్ధ ఫకీరు వనితతో కొన్ని నిముషాల సాన్నిహిత్యం నా ధృడమైన మానసిక మూలాలను కదిలించడం ఎలా సాధ్యపడిందో వివరించి చెప్పగలరని నేననుకోను. నిజానికి ఆ విషయం నాకూ అర్ధం కాలేదు." అంటారు బ్రంటన్.తన యాత్రలో బ్రంటన్ కలిసిన ఒక మౌన యోగి "ఈ ప్రపంచంలో ఆలోచనలను అంతర్ముఖం చేయడమే అన్నిటికంటే ఉన్నతమైన యోగం" అంటారు. కానీ క్షణకాలం పాటు కుదురునీ, మౌనాన్నీ,ఏకాంతాన్నీ భరించలేని నేటి 'డిస్ట్రాక్షన్' సమాజంలో నిజమైన అజ్ఞానులు అటువంటి యోగులను పిచ్చివాళ్ళుగా, సోమరులుగా, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా పరిగణించి నిందిస్తున్నారు. తర్కాతర్కాలను ప్రక్కన పెట్టి ఆలోచించి చూస్తే ఒక శాస్త్ర సాకేంతిక నిపుణుడు అభివృద్ధి పేరిట చేసే సామజిక వినాశనం కంటే తమ ప్రపంచంలో మౌనంగా ధ్యానం చేసుకునే ఈ యోగులు చేసే చేటు ఎక్కువేమీ కాదనిపించింది. నేటి సమాజంలో ప్రపంచాన్నిమార్చడం కంటే ఎవరికీ చేటు చెయ్యకుండా మనల్ని మనం మార్చుకోవడం మిక్కిలి అవసరం.
"పాశ్చాత్యులలో కొంతమందికి మహర్షి ఈ విధంగా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అనిపించవచ్చు. కానీ కొంతమందైనా ఈ విధంగా విడిగా కూర్చుని నిరంతర వ్యాపకాలతో సతమతమయ్యే మన ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించడమే మంచిదనిపిస్తుంది. అలా దూరంగా ఉండి చూసేవారికే లోక వ్యవహారం బాగా అర్ధమై సత్యం బోధపడుతుంది. మరో విధంగా ఆలోచిస్తే, ఈ లోకంలో అల్ప విషయాలకే తలకిందులయ్యే మూఢుల కంటే,ఈ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకుని అరణ్యంలో ధ్యానం చేసుకుంటూ కాలం గడిపే యోగి అన్ని విధాలా అధికుడనే చెప్పాలి. అంటారు బ్రంటన్ .
రమణ మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు పొందిన అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ,
"ప్రశాంతత ఒక నదీరూపంలో నా దగ్గరగా ప్రవహిస్తున్నదనీ, ఒక గొప్ప ఆనందం నా అంతరాంతరాలని తాకుతున్నదనీ, ఆలోచనలతో సతమతమవుతున్న నా మనసుకి విశ్రాంతిగా ఉన్నదనీ మాత్రమే నాకు తెలుస్తున్నది. ఇప్పుడు చూస్తే నిరంతరం నన్ను వేధించే ప్రశ్నలు చాలా అల్పమైనవనిపిస్తోంది. గతాన్ని అవలోకిస్తే ఆ సమయమంతా ఎంత నిస్తేజంగా గడిపానా ? అని నాకే ఆశ్చర్యం వేస్తున్నది. ఒక విధంగా చూస్తే మన మేథే సమస్యలని సృష్టించుకుని ,వాటిని పరిష్కరించడానికి నానా యాతనా పడుతూ ఉంటుందనే అభిప్రాయం బలపడుతున్నది. ఇప్పటి దాకా మేథని ఒక గొప్ప వరంగా భావిస్తూ వచ్చిన నాకు ఈ రకమైన ఆలోచన రావడం విచిత్రమే." అంటారు బ్రంటన్.
యుక్తవయస్సులో నాస్తికుడైన టాల్స్టాయ్ తన చివరి కాలంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ రచించిన 'కన్ఫెషన్స్' అనే పుస్తకంలో నిరక్షరాస్యులైన క్రైస్తవులకు దైవం పట్ల ఉన్న అపారమైన నమ్మకాన్ని గురించిన అభిప్రాయాన్నే బ్రంటన్ కూడా వెలిబుచ్చడం విశేషం. దైవం విషయంలో తర్కానికి ఆస్కారం లేని 'నమ్మకం', 'లొంగుబాటు' ఎంత అవసరమో ఈ మాటలు చెబుతాయి.
ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నానో, అక్కడ చేరిన శ్రోతల నమ్మకం చూసి అంత ఈర్ష్య పడ్డాను. వారి జీవితంలో సందేహానికి తావులేదు. "దేవుడున్నాడు" అంటే "అవును. ఉన్నాడు" అనే నమ్మకం తప్ప, జీవితమంటే, విశ్వంలోని భూమి అనే సూక్ష్మ రేణువుపై మానవుడు చేసే యాత్ర అనీ, అక్కడ భగవంతుడనే వాడికి చోటు ఉండదనీ ఆలోచిస్తూ చీకటి రాత్రులు గడపడం వారికి తెలియదు.
'సిద్ధార్థ' లో హెర్మాన్ హెస్సే రాసినట్లుగానే సత్యాన్వేషణకు మార్గాన్ని,సాధనాల్నీ గురువు సూచించినా స్వీయానుభవంతో మాత్రమే ఎవరైనా అంతర్గతమైన "నేను" ని దర్శించగలరని రమణ మహర్షి కూడా బ్రంటన్ కు ఉపదేశిస్తారు.
మానవ సమాజంలో సాన్నిహిత్యానికి నిర్వచనాలు విచిత్రంగా అనిపిస్తాయి. మనుషులతో సాన్నిహిత్యం ఏర్పడాలంటే వారి సంతోషంలోనో,దుఖ్ఖములోనో నువ్వు పాలుపంచుకోగలగాలి. అటువంటి మానవ సంబంధాల్లో పరస్పరం మార్పులకి సిద్ధం కాగలగాలి. కానీ భావోద్వేగాలకు అతీతమైన వారిని నువ్వు దూరంనుండి పరిశీలించగలవు గానీ వారితో స్నేహాన్ని చెయ్యడం అసాధ్యం. యోగుల చుట్టూ ప్రశాంతమైన అటువంటి అభేధ్యమైన కోటను దాటి వారి ఆత్మను దర్శించడం సాధారణ మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. రమణ మహర్షిని తదేక ధ్యానంలో చూసిన బ్రంటన్ ఈ విధంగా అంటారు.
తరువాత కొన్ని రోజులు మహర్షితో సాన్నిహిత్యం పెంచుకుందామని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. దానికి మూడు కారణాలున్నాయి.ఒకటి ఆయనలో సహజంగానే ఉన్న గాంభీర్యం . వాదప్రతివాదాల పట్లా, చర్చల పట్లా అయన అయిష్టతా, ఇతరుల నమ్మకాలూ, అభిప్రాయాల పట్ల ఆయన నిర్లిప్తతా అందరికీ తెలుసు. ఎవరినీ తన అభిమతానికి అనుగుణంగా మార్చాలనే కోరిక ఆయనకి ఏ కోశానా లేదు. తన అనుచరగణానికి మరొక్కరినైనా కలుపుకోవాలనే ఆరాటమూ ఆయనకి లేదు.
ప్రాచ్య దేశాలతో పోలిస్తే పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక లేమిని ఎత్తి చూపించడానికి బ్రంటన్ వెనుకాడకపోవడం విస్మయపరిచింది.
"పాశ్చాత్య దేశాల్లో చాలామందికి ఇటువంటి సత్యాన్వేషణకి అసలు సమయమే ఉండదు. యథాతథ స్థితిని ఏ ప్రశ్నలూ లేకుండా ఆమోదించే పొరపాటు చేయటానికి వారు చెప్పే కారణం " ఇది నా ఖండంలో ప్రజలందరూ చేస్తున్న పొరపాటే" అంటారాయన .
ఒక ప్రక్క ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తూనే మరో ప్రక్క మతం పేరిట ప్రజలను మోసం చేసే దొంగ సాధువుల గురించీ ఫకీరుల గురించీ కూడా రాశారు. మానవ ప్రయత్నం ఏమీ లేకుండా అన్నీ దైవం చేసిపెట్టాలని ఎదురు చూసే మూఢ భక్తినీ, కర్మ చెయ్యకుండా అన్నిటినీ దైవం మీదకు తోసేసి కులాసాగా బ్రతికే భారతీయ నిష్క్రియాపరత్వాన్నీ దుయ్యబట్టారు. నిజానికి మతంతో సంబంధం లేని ఎన్నో విషయాలను కప్పిపెట్టడానికి మతాన్ని అడ్డుపెట్టుకోవడం భారతీయ సమాజంలో ఉన్న లోపం. మతాన్ని అనుసరించకుండా,జీవితానికి అన్వయించుకోకుండా,ఎటువంటి కార్యాచరణా లేకుండా మతోద్ధారకుల్లా మతం గురించి మాట్లాడడం వరకే నేటి భారతీయుల ఆదర్శాలు పరిమితమైపోయాయి. ఇటువంటి సందర్భాల్లోనే కపట గురువులు పుట్టుకొచ్చి మతమంటే వంచన అనే స్థాయికి పడిపోయింది. ఉదాహరణకు ఈ రచనలో మెహెర్ బాబా గురించి బ్రంటన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా పాల్ బ్రంటన్ సత్యాన్వేషణ రమణ మహర్షి ఆశ్రమంలో పూర్తికాగా ప్రాచీన యోగశాస్త్రాన్ని ఆధునిక పద్ధతులలో ఉపయోగించే దిశగా రెండిటినీ సమన్వయము చేసే వ్యవస్థలూ,వ్యక్తుల అవసరం భారతీయ సమాజానికి ఎంతైనా ఉంది అని ఆయన అభిప్రాయపడతారు.
పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :
ఆనందమే మనిషి సహజ స్థితి.ఈ ఆనందం నిజమైన "నేను" లో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా ఈ సహజ స్థితిని కనుక్కోడానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే! ఈ సహజ స్థితికి నాశనం లేదు.
భావోద్రేకాల నుంచి హేతువాదాన్నీ, అభూత కల్పనల నుంచి చరిత్రనీ, ఊహ నుంచి సత్యాన్నీ వేరు చేసే శాస్త్రీయ శిక్షణా, ఆలోచనలూ గుడ్డిగా అనుసరించేవారికి తెలియవు. అందుకని నిజాయితీ లేనివారూ, అనుభవంలేని మూఢులూ, గొప్పవారిని అనుకరిద్దామనే అభిలాష గలవారూ, ఈ రకమైన వారితో గూడిన అనుచరణగణాన్ని పోగుచేసుకోవడం ఈ దేశంలో చాలా తేలిక.
నిజమైన "నేను" కి భావోద్రకాల నుండి హేతువాదాన్ని వేరు చేసే శాస్త్రీయ శిక్షణ పొందాలనే కోరిక ఉంటుందా?
ReplyDeleteమంచి ప్రశ్న.ఎంతో క్రమశిక్షణ ఉంటే తప్ప నాకు తెలిసి ఉండదు.
Delete