Wednesday, June 10, 2020

Vishnu Sharma English Chaduvu - Viswanatha Satyanarayana


Image Courtesy Google
చాలా ఏళ్ళ క్రితం చదివిన విశ్వనాథవారి 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' నుండి సేవ్ చేసుకున్న కొన్ని వాక్యాలు ఈరోజు అనుకోకుండా కంటబడ్డాయి..ఈ బ్లాగ్ లో అనేక ఇంగ్లీష్ పుస్తకాల మధ్య కాస్త వెరైటీగా కూడా ఉంటుంది,కొంత విరామం తరువాత బ్లాగ్ పునః ప్రారంభోత్సవం ఆ వాక్యాలతో చేస్తే ఎలా ఉంటుందా అని సరదా ఆలోచన వచ్చింది..అందుకే క్వారంటైన్ సమయంలో ఫేస్బుక్ లో సమయం వృథా చేసిన పాపాన్ని ప్రక్షాళన గావించే ఉద్దేశ్యంతో,అటకెక్కిన చదువుని అటకమీద నుండి దించుతూ,పుస్తకాల బూజు దులుపుతూ అటు రివ్యూ కాని,ఇటు వ్యాసం అంతకంటే కాని ఈ నాలుగు ముక్కల అచ్చ తెలుగు పోస్టు..విశ్వనాథ వారి హాస్య ప్రియత్వం,వ్యంగ్యోక్తులు ఆద్యంతం ఆసక్తికరంగా పుస్తకాన్ని క్రిందపెట్టనివ్వకుండా చదివించాయి.

ఈ పుస్తకంలో విద్యకూ వివేకానికీ చాలా భేదం ఉందని రుజువు చేస్తూ,అందరూ అదేదో బ్రహ్మ పదార్థమనుకుని అబ్బుర పడుతూ చూసే ఇంగ్లీషు విద్య వివేకాన్నీ,విచక్షణనూ ఇవ్వదని వాదిస్తూ విశ్వనాథవారు తనదైన శైలిలో పెట్టిన అనేక వాతలు ఉంటాయి.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు..
వ్రాయగలవాడవు అలా అనకు.. కాలాన్ని అనుసరించి వ్రాయి..
కాలం నన్నెందుకనుసరించకూడదు ??  తనని అనుసరించమని కాలం నన్నెందుకు అడగాలి.. ఆ కాలం గొప్ప ఏమిటి ? అదైనా నేనైనా ఆలోచన మీద ఆధారపడి కదా నడవాలి.. "నేను కాలాన్ని గనుక ఆలోచించను" అని అది అంటే నేనేమనాలి ? నీవు కాలానివైనా సరే..నీవు ఆలోచించి ప్రవర్తించకపోతే నేను నిన్ను అనుసరించను అనాలి.. అంతే . 
కారణమునందు లేని గుణము కార్యము నందు సంక్రమించదు కదా.. 
ఆ తిక్కన్న గారిలో పేచీ పద్యాలు చాలా ఉన్నవట .. 
విష్ణు శర్మ ""మీ తాత తాత ఉండాలి కదా ఆయన చిన్నప్పుడే చచ్చిపోయినాడు..మీ తాత తండ్రిని కనక ముందే చచ్చిపోయినాడు.. తరువాత మీ తాత పుట్టాడు ఏమంటావు ?""  మీ తాత తాతే అంతే నన్నాను  
ఈ దేశం లో ప్రతిదాన్ని గురించీ చర్చలే తప్ప సారాంశమనేది ఉండదు.. 
వాడు చెప్పినదానికి నీవు సమాధానం చెప్పలేకపోతే,పూర్వ కాలం లో అవతలవాళ్ళు చెప్పింది ఒప్పుకొనేవాళ్ళు .. ఈ కాలంలోనో వాడు భేదించేందుకు అడుగుతాడు.. ఇక దేని తత్వం ఎట్లా నిర్ణయింపబడుతుంది ?  
ఈ దేశం లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళేనన్నమాట.. కనీసం నూటికి తొంభై తొమ్మండుగురికి ఇంగ్లీషు రాదు,తెలుగూ రాదని అర్థం..ఎందుచేతనంటే ఒక భాష మాతృ భాష అయితే ఆ భాష మాట్లాడేస్తూ ఉండటం వల్ల ఆ భాషంతా నోటికి వస్తుంది.. తరువాత వ్యాకరణము తెలుసుకుంటాము.. వ్యాకరణం తెలియటంతోనే నీవు పండితుడవని అర్థం.. నీవు నాలుగు వందల పుస్తకాలు చదివినా సరే నీకు వ్యాకరణం తెలియకపోతే అపండితుడవు... మీరందరూ అపండితులు.

No comments:

Post a Comment