శరన్నవరాత్రుల కుంకుమ పూజల హడావుడి మధ్య శుక్రవారం రానే వచ్చేసింది. చిరుజల్లులు కురుస్తున్న సాయంత్రాల్లో వేడి వేడి కాఫీతో బాలగోపాల్ సాహితీ వ్యాసాలు మరింత రుచిగా ఉన్నాయి.☕📖 కేఫ్ లో కొందరు హుషారుగా కబుర్లలో మునిగిపోయి కనిపిస్తే, కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు, ఒక కుర్రాడు మాత్రం ఒక మూలన ప్రపంచానికి దూరంగా పుస్తకంలో లీనమైపోయి చదువుకుంటూ కనిపించాడు,కేరళ ప్రకృతి సౌందర్యమంత అందమైన దృశ్యం చూసినట్లనిపించింది. అలా ఎవర్నైనా, ఎక్కడైనా చూసినప్పుడు వాళ్ళని పనిగట్టుకుని డిస్టర్బ్ చేసి, "ఏం చదువుతున్నారు ? " అని అడగడం అలవాటు. 🫣😁
Copyright A Homemaker's Utopia |
కొన్ని రోజులుగా కె.బాలగోపాల్ సాహితీ ప్రపంచంలో ఉన్నాను. ఈ మధ్య ఎప్పుడూ బ్యాగ్ లో ఉండే రెండు,మూడు పుస్తకాల్లో ఆయన పుస్తకం కూడా ఒకటి. బాలగోపాల్ నాకు ఒక సోషల్ ఆక్టివిస్ట్ అని మాత్రమే తెలుసు. కొన్నినెలల క్రితం ఒక పాత పుస్తకాల షాపులో అనేక పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ప్రత్యేకంగా షెల్ఫ్ లోంచి పలకరించింది. (పుస్తకాల మీద కవర్ డిజైన్ ఎంత ముఖ్యమో కదా ! కవర్ నచ్చకపోతే దృష్టిని దాటిపోయే మంచి పుస్తకాలెన్నో .) అట్టమీద ఎంతో సాదాసీదాగా చేతులు కట్టుకుని కళ్ళజోడు పెట్టుకున్న మొహంలోంచి చిరునవ్వు నవ్వుతున్న ఆయన ఫోటో ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇక అసలు విషయం, "సాహిత్యంపై బాలగోపాల్" అన్న టైటిల్ నన్ను మరింతగా ఆకర్షించింది. ఒక సామాజిక కార్యకర్త సాహిత్యం గురించి ఏమని ఉంటారో తెలుసుకోవాలనే కుతూహలంకొద్దీ ఈ పుస్తకం కొన్నాను. ఒక పూర్తిస్థాయి సాహిత్యకారుడు కూడా ఇంత లోతైన వ్యాసాలు రాయలేరేమో అన్నంతగా దేశవిదేశీ సాహిత్యంపై ఆయనకున్న పట్టు అబ్బురపరిచింది. ఇది ఒక్కసారిగా చదివేసి ఆకళింపు చేసుకునే రచన అస్సలు కాదు. ఆయన వ్యాసాలు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకునేలా ఉన్నాయి. ఈ ఏడాది కొన్న అనేక పుస్తకాల్లో జీరో ఎక్స్పెక్టేషన్స్ / బ్లాంక్ ఇంప్రెషన్ తో రచయిత పూర్వాపరాలు ఏమాత్రం తెలీకుండా మొదలుపెట్టిన ఈ రచన రూపాయికి పదింతలు విలువైనదని కొన్ని పేజీల్లోనే అర్థమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ రచన ఒక నిధి.📖📚
"గాలివస్తే కదిలిపోయేటట్లుండే ఆయన తెలుగుదేశంలో తీవ్ర నిర్బంధపు తుఫానును సైతం తట్టుకుని ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా ఉన్న పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించారు. లెక్చరర్ గా కాకతీయ యూనివర్సిటీలో గణితం బోధించినా ఆర్థిక, సామజికశాస్త్ర, సాహిత్య విమర్శనాది ఉపరితల రంగాల్లో డాక్టర్ కె. బాలగోపాల్ స్పృశించని అంశం లేదు. ఎటు నడిచినా రెండడుగులు వేయలేని రేకుల షెడ్డులో ఆయన ( హైదరాబాద్) నివాసం."
ఇవన్నీ చదివి అసలు ఎవరీయన అని ఆతృతగా వికీ చూస్తే తెలిసిన మరో విషయం ,ఆయన పూర్తిపేరు కందాళ బాలగోపాల్ అని.
పుస్తకంలో పేలిన అనేక డైనమైట్లలో మచ్చుకి ఇదొకటి : ❤️💥🔥
"1930 దశకంలో శ్రీశ్రీ వరుసపెట్టి ఎన్నో శక్తిమంతమైన కవితలు రచించాడు. కుళ్ళు కంపుకొడుతున్న ఫ్యూడల్ సంస్కృతిని చీల్చి చెండాడే పదజాలంతో యువతను కేవలం మేల్కొలిపే విధంగానే కాక, వారిని ప్రేరేపించేలా ఎన్నో కవితలు రాశాడు. శ్రీశ్రీ తొలి రోజుల్లో రాసిన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించడం మన దేశస్తులకు అసాధ్యం. వలస పాలకులు మనకు నేర్పిన ఇంగ్లీష్ కేవలం విజ్ఞాపన పత్రాలను తయారుచెయ్యడానికి పనికొచ్చేదే కానీ, డైనమైట్ ధ్వనిని అనువదించడానికి పనికి వచ్చేది కాదు. స్వయంగా శ్రీశ్రీయే భారతదేశంలోని తెలుగేతరుల కోసం తన కవిత్వాన్ని అనువదించడానికి ప్రయత్నించి, విఫలమయ్యాడు. శ్రీశ్రీ కవిత్వం అనువాదానికి లొంగకపోవడానికి ముఖ్య కారణం ఆయన విరివిగా వాడే హిందూ పురాణ ప్రతీకలు. దీని కారణంగా వామపక్ష విమర్శకులకూ ఆయనకూ మధ్య తరచూ సంవాదాలు సాగుతూండేవి కూడా. "పుడమితల్లికి పురిటినెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి, యముని మహిషపు లోహ ఘంటలు, నరకలోకపు జాగిలమ్ములు, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది ,ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరించింది" , మొదలైనవన్నీ ఇలాంటివే. ఆయన సుప్రసిద్ధ కవితా సంకలనం 'మహాప్రస్థానం' శీర్షిక కూడా మహాభారతం చివర్లో పాండవులు స్వర్గానికి చేసిన ప్రయాణాన్ని సూచించేదే."
No comments:
Post a Comment