పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు లింగవివక్షల ప్రాతిపదికన ఏర్పడినవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా, మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతిక ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. అందువల్ల స్త్రీలు జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.
Image Courtesy AndhraJyothi |
గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరమైన స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, ఆమె ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తూ వారి సృజనాత్మకతకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె సాహిత్యంలో సహజత్వానికి దూరంగా పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన "ఆదర్శ స్త్రీమూర్తి". జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు; ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది. ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది.
ప్రాచీన కావ్యాల్లో స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి'గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి, మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ, రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవి. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా, పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన ఇల్లాలి వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.
ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదని నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా తీసుకుంటారంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చేసే దిశగా వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ; హేతువునూ, తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు.
ఈ కారణాల దృష్ట్యా అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలుపెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి'లాంటి కావ్యాలూ, గ్రంథాలూ రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీలు తమ రచనల ద్వారా పితృస్వామ్య సాహితీ సృజనలో రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అందువల్ల 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. తాను రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఒక పురుషుడి స్వరంలో ఉన్న అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో పెద్దవాడో నాకు తెలియదు. నేను రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీగానూ కూడా ఆలోచించాలి." అంటారామె.
అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ, భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్యపు సృష్టనీ కొట్టిపారేస్తారు. మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.
అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties”గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీని కేవలం ఒక గృహిణిగా మాత్రమే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవి టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం.
ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కవయిత్రిగా ఆమె ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.
నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. కవి కలం నుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. ఆ కాలంలో తన సృజనాత్మకతతో కావ్యసృష్టి చేద్దామని ప్రయత్నిస్తే ఆమె మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్దిపాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.
ప్రాచీన కాలంనుండీ స్త్రీలను కళారంగానికి దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారిస్తూ -సృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేదనీ, రచయిత్రులకు ఆ అవకాశం లేదనీ అంటారు. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. సాహితీ విమర్శకుడు హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వ ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి.
ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ సరికాదు. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ప్రాచీన సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగమైన స్త్రీల జీవితాలు. అందువల్ల సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ, మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి.
గాలిలా కంటికి కనిపించని లింగవివక్షను ఎదుర్కొంటూ, మౌనాన్ని ఛేదిస్తూ ఆ కాలంలో కూడా ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు అనేక రచనలు చేశారు. ఈ కారణంగా పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష అస్తిత్వవాద రచనలన్నిటిలోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.
ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట రాసిన వ్యాసాల్లో స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 'Anxieties of authorship' తో కష్టపడుతున్న రచయిత్రులు రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన ఆమెలోని 'ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. అంటే స్త్రీ ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్'ను నాశనం చెయ్యాలి. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలి. కానీ అలా చెయ్యాలంటే ముందు వాటి మూలాలెక్కడున్నాయో తెలుసుకుని వాటి పూర్వాపరాలు అర్థంచేసుకోవాలి. అందుకు స్త్రీల రచనల్ని చదవాలి, వాటిలోని స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్- పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందంటారు. స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ'కు కారణాలను స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు.
ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు 'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. అవన్నీ Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick, Simone de Beauvoir, Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరకపోవడం వల్ల చెప్పినదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది.
ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా రచయిత్రులకు సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది రచయితలు స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీల రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది స్త్రీవాదాన్ని వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు. ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ వివక్ష లేదని అంటూ విపరీతమైన ఆశావహదృక్పథాన్ని అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం. ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక పితృస్వామ్య మూలాలుంటాయి.
ఏదేమైనా "స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది" అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్'ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపజేస్తూ స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
తొలి ప్రచురణ : 1st జనవరి 2024
https://www.andhrajyothy.com/2024/editorial/her-stories-written-by-him-1189635.html
No comments:
Post a Comment