Monday, March 26, 2018

Family Happiness - Leo Tolstoy

మేము ప్రకృతితో సహజీవనం చేసిన కాలంలో,ఎంతో కాలం నుంచీ చూద్దామనుకుని ఎట్టకేలకు చూసిన ఒక సినిమా 'In to the wild'..మొదటి నుంచీ చివరి వరకు ఒక రకమైన ఉద్వేగంతో చూసిన ఈ సినిమాలో,జనారణ్యానికి దూరంగా,ఒంటరిగా క్రిస్ తన మేజిక్ బస్ లో టాల్స్టాయ్ రాసిన 'ఫామిలీ హ్యాపీనెస్' అనే పుస్తకంలోని ఈ వాక్యాల్ని పైకి చదువుకుంటాడు..ఆ సీన్ రెండు మూడు సార్లు రిపీట్ చేసి చూశాము..అప్పట్లో ఆ మాటలు క్రిస్ నోటినుండి వింటే ఏదో కవిత్వం వింటున్నట్లనిపించింది..

“A quiet secluded life in the country, with the possibility of being useful to people to whom it is easy to do good, and who are not accustomed to have it done to them; then work which one hopes may be of some use; then rest, nature, books, music, love for one's neighbor — such is my idea of happiness.”

Image courtesy Google
ఒక ప్రపంచ ప్రఖ్యాత రచయిత తన దృష్టిలో 'సంతోషాన్ని' నిర్వచించిన వాక్యాలు ఇవి..కేవలం చెప్పడమే కాకుండా తన ఆలోచనల్ని ఆచరణలో కూడా పెట్టిన వ్యక్తి టాల్స్టాయ్..1859 లో రాసిన 'ఫ్యామిలీ హ్యాపీనెస్' అనే ఈ నవలిక,పదిహేడేళ్ళ మార్యా (Marya Alexandrovna/Masha ) కథ..కథ మొదలయ్యే సమయానికి మార్యా తల్లిని కూడా పోగొట్టుకుని చెల్లెలు సోన్యా,గవర్నెస్ కాత్యాలతో కలిసి Pokrovskoye ఎస్టేటులో నివసిస్తూ ఉంటుంది..తల్లి మరణం తాలూకూ వైరాగ్యం కారణంగా జీవితం పట్ల ఆశావహ దృక్పథం లోపించిన మార్యాలో క్రమేపీ నిరాసక్తత చోటుచేసుకుంటుంది..అదే సమయంలో గతించిన తండ్రికి స్నేహితుడైన (తండ్రి కంటే వయసులో చిన్న వాడు) 36 ఏళ్ళ Sergey Mikhaylych రాక మార్యాకు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తుంది..చిన్నతనం నుండీ ఎరిగిన సెర్జీతో మార్యా తొందరగానే ప్రేమలో పడుతుంది..కానీ ఇద్దరి మధ్యా ఉన్న వయోభేదం వారిని త్వరగా బయటపడనివ్వదు..ఆ సమయంలో సెర్జీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన మార్యాని చూస్తే 'బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది' అంటూ యువతిలో తొలి యవ్వనపు పొంగుని వర్ణిస్తూ యద్దనపూడి రాసిన పదాలు జ్ఞాపకం వచ్చాయి..సెర్జీ,మార్యాల ప్రేమ కథ చదువుతున్న అనేక సందర్భాల్లో నాకు తెలీకుండానే ఆ పదహారేళ్ళ వయసుకి వెళ్ళిపోయాను..ఏదేమైనా కొన్ని నిద్రలేని రాత్రులూ,మరి కొన్ని అందమైన కలయికల మధ్య వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది..

ఆ ప్రేమ భావన ఎక్కడ వదిలిపోతుందోనని మిగతా కథ చదవబుద్ధి కాలేదు..పుస్తకం ప్రక్కన పెట్టేసి ఒకరోజు చదవలేదు..ఈ కథ ఇక్కడితో ఆపేస్తే ఎంత బావుంటుంది అనిపించింది..మరి జేన్ ఆస్టిన్ కాదు కదా,టాల్స్టాయ్ ఇక్కడ.. కలలు కన్నది చాలు,కాసేపు నిజాలు కూడా మాట్లాడుకుందాం పదమంటారు.. అయిష్టంగానే ఆయన్ని అనుసరించాను..మరొక్కసారి తృప్తిగా రెండో సారి మొదట్నుంచీ చదివాకా అప్పుడు మిగతా కథ చదివాను..అంత అద్భుతమైన ప్రేమకథా అతి మాములుగా ముగుస్తుంది..ఆస్కార్ వైల్డ్ అంటారు 'They spoil every romance by trying to make it last forever.' అని..అలాగే మాములుగా సెర్జీ,మార్యాలకు పెళ్ళైపోతుంది..ఇద్దరు పిల్లలు..కానీ కాలం నేనున్నానంటూ వారి మధ్య అనుకోని అగాథం సృష్టిస్తుంది..సెర్జీ పల్లెజీవితంలోని స్థిరత్వం కోరుకుంటే,మార్యా పట్టణాల్లోని హంగూ ఆర్భాటాలవైపు పరుగులు తీస్తుంది..అలజడి చేసే మనసుతో,అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న  స్వేచ్ఛతో ఎగిరిపోవాలనే యవ్వనపు ప్రవాహానికి అడ్డు కట్ట వెయ్యలేని మార్యా సెయింట్ పీటర్స్బర్గ్ తళుకుబెళుకుల సమాజం మత్తులో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.. కానీ తన తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చిన మార్యా,సెర్జీ ప్రేమలో (సెర్జీలో ?) వచ్చిన మార్పుల్ని భరించలేకపోతుంది..మరి వారి ప్రేమ మళ్ళీ మునుపటి రూపాన్ని సంతరించుకుందా లేదా అనేది వారి కథకు ముగింపు..

జేన్ ఆస్టిన్ ఎలిజబెత్ గురించీ,ఎలిజబెత్ గాస్కెల్ మిస్ హేల్ గురించీ,బ్రాంట్ మిస్ అయిర్ గురించీ రాయడంలో వింతేమీ లేదుగానీ..స్త్రీ తత్వాన్ని మనసుకి హత్తుకునే విధంగా మలచడం ఒక పురుషుడికి అంత సులభమేమీ కాదు..అదే ఈ కథలో మరో ప్రత్యేకత..శరత్,టాగోర్ లాంటి  వారి తరహాలో ఈ కథంతా మార్యా దృష్టికోణం నుంచి చెప్పారు టాల్స్టాయ్..ఒకరకంగా మార్యా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు..

జీవితంలో కొన్ని అపురూప క్షణాలు ఒక్కోసారి మనకు తెలీకుండానే పలుకరించి వెళ్ళిపోతుంటాయి..తరువాతెప్పుడో వాటి ఉనికిని గూర్చిన స్పృహ కలిగినప్పుడు మార్పుని నిరంతరం ఆలింగనం చేసుకోవాలనీ,ఆ క్షణాల్ని పూర్తిగా జీవించాననీ తెలిసిన మనసుని ఎంత మభ్య పెట్టుకున్నా,దాటిపోయిన క్షణాల్లోని తియ్యదనం గుర్తొచ్చి మనసు చేదుగా అయిపోతుంటుంది..అందులోనూ అవధుల్లేని ఆనందాన్ని ఒకసారి చవిచూసిన మనసు ఇంకా ఇంకా కావాలనే ఆరాటపడుతుంది తప్ప ఆనందంలో నిశ్చలత్వాన్నీ,పరిమితుల్నీ అంగీకరించదు..మార్యా అదే ఆనందాన్ని మళ్ళీ కోరుకోవడం ఒకరకంగా అత్యాశే..

ప్రకృతితో మమేకమై జీవించడం ఒక్కసారి రుచి చూసిన తరువాత కళ్ళు మిరుమిట్లు గొలిపే అసహజత్వాన్ని అంగీకరించడం కష్టం..ఈ అనుభవాలన్నీ కాచి వడపోసిన సెర్జీ మనకి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపిస్తాడు..ప్రేమతో సహా కాలగతికి తలవంచనిదేదీ ఉండదని ఈ కథ మరోసారి రుజువు చేస్తుంది..మారే కాలంతో పాటు మనుషులూ,వారి మనస్తత్వాలూ,వాటితో  పాటు సంతోషం,దుఖ్ఖము,ప్రేమ,మానవ సంబంధాలూ ఇలాంటివన్నీ జీవితంలోని ఒక్కో దశలో,ఒక్కో విధంగా రూపాంతరం చెందుతాయి..ఆ మార్పుని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని,ఆనందాన్ని మూటగట్టుకున్న క్షణాల్ని స్మృతిపథంలో జాగ్రత్తగా పొదివిపట్టుకుని ముందుకెళ్ళమని హితవు చెప్తుందీ నవలిక..
ఇది చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన Charlotte Bronte రాసిన 'Jane Eyre',యాష్ చోప్రా లమ్హే సినిమాలు గుర్తుకొచ్చాయి..నాలాగే మీక్కూడా ప్రేమ కథలు ఇష్టమా ? అయితే తప్పకుండా చదవండి :)

మార్యా అంతరంగం..
“I wanted movement and not a calm course of existence. I wanted excitement and the chance to sacrifice myself for my love. I felt it in myself a superabundance of energy which found no outlet in our quiet life.”

సెర్జీ దృష్టిలో స్త్రీ ...
“I can't praise a young lady who is alive only when people are admiring her, but as soon as she is left alone, collapses and finds nothing to her taste--one who is all for show and has no resources in herself”

2 comments:

  1. Very nice. I haven't read this book. Adding it to my tbr. Btw, any idea of it is available in telugu?

    ReplyDelete
    Replies
    1. I have no idea Ruth..I read this in English translation.Thank you :)

      Delete