మా బుజ్జిగాడికి సెలవులు కావడంతో వాడితో కూర్చుని కొన్ని పిల్లల పుస్తకాలు చదవడం జరిగింది..నిజం చెప్పొద్దూ,భారీ నవలలు చదివినప్పటికంటే ఇవి చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి..అసలు ఈ 'Where The Wild Things Are' అనే పిల్లల పుస్తకానికి అంత పాపులారిటీ ఏంటా అని ముందు నేనే చదివాను..వింపీ కిడ్ లూ,కాల్విన్ హాబ్స్ లూ చదివి మావాడు కూడా బుల్లి వైల్డ్ థింగ్ లా ఉన్నాడని,ఈ పుస్తకం వాడి చేత చదివించాలనిపించింది..ఇల్లస్ట్రేటెడ్ బుక్స్ లో Maurice Sendak చిత్రాలు గీసి,కథ రాసిన ఈ 'Where The Wild Things Are' గురించి చాలా చోట్ల (ముఖ్యంగా బ్రెయిన్ పికింగ్స్లో ) వినడం జరిగింది..ఇది మాక్స్ అనే పిల్లవాడి కథ..బొమ్మల పుస్తకం కాబట్టి కథను వివరించే చిత్రాలు దీనికి అదనపు ఆకర్షణగా ఉంటాయి..ఆ మాటకొస్తే అసలిలాంటి పుస్తకాల్లో చిత్రాలే కీలకం..ఆ ఇల్లస్ట్రేషన్స్ చూస్తూ చదువుతున్నప్పుడు పిల్లల మొహాల్లో చిరునవ్వులు పూయడం ఖాయం..
|
Image courtesy Google |
ఈ బొమ్మల కథలో మాక్స్ అనే అల్లరి ఒక పిల్లవాడుంటాడు..ఆ పిల్లవాడు ఒకరోజు తన wolf suit ధరించి అల్లరి పనులు చేస్తుంటాడు..ఆ అల్లరి చూసిన మాక్స్ తల్లికి కోపం వచ్చి మాక్స్ ను 'వైల్డ్ థింగ్' అంటుంది..అప్పుడు మాక్స్ "నేను నిన్ను కూడా తినేస్తాను" అంటూ అమ్మని బెదిరిస్తాడు..దాంతో అమ్మకు కోపం మరి కాస్త హెచ్చి మాక్స్ కు ఆ రాత్రి అన్నం పెట్టకుండా, వెళ్ళి నిద్రపొమ్మని పంపించేస్తుంది..అమ్మ మీద అలిగిన మాక్స్ మూతి ముడుచుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు..
అదే రాత్రి మాక్స్ గదిలో ఉన్నట్లుండి ఒక అడవి మొలుస్తుంది..ఇంటికప్పు మాయమై ఆ స్థానంలో పొదలు,తుప్పలూ,చెట్లూ నిండిపోగా,గోడలు పోయి నదీనదాలు,పర్వతాలతో విశాల ప్రపంచం అంతా మాక్స్ కళ్ళ ముందుకొచ్చేస్తుంది..దానితో పాటుగా సముద్రం మాక్స్ కోసం ఒక ప్రైవేటు పడవని మోసుకొస్తుంది..అదెక్కి మన మాక్స్ రాత్రీ పగలూ ప్రయాణించి వారాలూ,నెలలూ దాటి ఒక సంవత్సరం అయ్యేసరికి ఒక ద్వీపాన్ని చేరతాడు..అక్కడన్నీ 'వైల్డ్ థింగ్స్' ఉంటాయన్నమాట..అవి పంజాలు విసురుతూ,భయంకరంగా గర్జిస్తూ,పళ్ళు పటపటా కొరుకుతూ,పసుపు పచ్చని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ,పెద్ద పెద్ద కోరలతో మాక్స్ మీదకొస్తాయి..మాక్స్ ఏమాత్రం బెదరకుండా 'కదలకండి' అంటూ ఆజ్ఞాపించి వాటి కళ్ళలోకి సూటిగా చూస్తూ,ఒక మంత్రం వేసేసి వాటన్నిటినీ వశపరుచుకుంటాడు..మాక్స్ కి భయపడి ఆ వైల్డ్ థింగ్స్ అన్నీ నువ్వు మాకంటే వైల్డ్ గా ఉన్నావు అంటూ మాక్స్ ను తమకు రాజును చేసుకుంటాయి..మాక్స్ వాటితో ఆటపాటల్లో మునిగితేలతాడు..అలా అల్లరి చేసి చేసి చివరకి విసుగొచ్చి ఆ వైల్డ్ థింగ్స్ కి కూడా అన్నం పెట్టకుండా వెళ్ళి నిద్రపొమ్మని పంపించేస్తాడు..ఒంటరిగా కూర్చుని తనని అందరికంటే,అన్నిటికంటే మిన్నగా ప్రేమించే వాళ్ళెవరైనా ఉంటే బావుండు అనుకుంటుండగా దూరంగా ఎక్కడినుంచో మంచి తినుబండారాల సువాసన వస్తుంది..వెంటనే మన మాక్స్ వైల్డ్ థింగ్స్ కి రాజుగా ఇక ఉండబోనని చెప్పేసి తన పడవెక్కి ఆ ఘుమఘుమల దిశగా పయనమవుతాడు..అప్పుడు వైల్డ్ థింగ్స్ అన్నీ బోలెడు బాధపడి నువ్వు వెళ్ళద్దు,వెళ్తే నిన్ను తినేస్తాం అని ఏడుస్తాయి..అయినా మాక్స్ వాటికి టాటా చెప్పేసి వారాలూ,నెలలూ దాటి సంవత్సరం దాటేసరికి మళ్ళీ తన ఇంట్లో,తన గదిలోకి వచ్చేస్తాడు..వచ్చేసరికి మాక్స్ కోసం ఆ గదిలో మంచి భోజనం ఎదురుచూస్తుంటుంది..విచిత్రం ఏంటంటే ఆ భోజనం వేడి వేడిగా పొగలు కక్కుతుంటుంది..
|
Image courtesy Google |
పిల్లల ఊహాత్మక శక్తిని పలు డైమెన్షన్స్ లో చూపించే ఈ పుస్తకం,అమాయకత్వంతో కూడిన వారి ప్రపంచపు స్వరూపాన్ని విశ్లేషిస్తుంది..ఒకసారి కాల్విన్ కూడా ఇలాగే మార్స్ వెళ్ళిపోతున్నానంటూ హాబ్స్ ని తీసుకుని అమ్మకి చెప్పి బయలుదేరతాడు..కాసేపు ఆడుకోగానే మళ్ళీ అన్నీసర్దుకుని,అమ్మ గుర్తొచ్చి వెంటనే ఇంటికొచ్చేస్తాడు..ఈ కథ పిల్లలకు ప్రేమతో కూడిన ఇంటి వాతావరణం అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది..ప్రేమతో,ఆప్యాయతతో ఎలాంటి వైల్డ్ థింగ్స్ నయినా మచ్చిక చేసుకోవచ్చని మరోసారి నిరూపిస్తుంది..ఇలాంటి మరికొన్ని మంచి పుస్తకాల గురించి మళ్ళీ తీరిక దొరికినప్పుడెప్పుడైనా..
No comments:
Post a Comment