Friday, June 14, 2019

There Once Lived a Woman Who Tried to Kill Her Neighbor's Baby: Scary Fairy Tales - Ludmilla Petrushevskaya

రచయితల్లో ఈ రష్యన్ రచయితల దారే వేరు..వీళ్ళ పేర్లు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటాయో వీళ్ళ కథలు కూడా అంతే వైవిధ్యతను కలిగి ఉంటాయి..అసలు ఈ రష్యన్ సాహిత్యమే ఒక అక్షయపాత్రలాంటిది,ఎంత తవ్వితీసినా ఇంకా అట్టడుగున మన కంటబడని నిధులేవో మిగిలిపోతూనే ఉంటాయి..అలా దృష్టికి వచ్చిన ఈ కొత్త నిధే 'లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా'..అరే ఈవిడ గురించి ఎప్పుడూ వినలేదే అనుకునేలోపు ఆవిడ జానర్ భయానక రసమని (macabre) తెలిసింది..మనుషుల్లో మనిషిని,నాకు తెలియని భయానక రసమా అనుకుని ఇంతకాలం ఈ జానర్ చదవకుండా మడికట్టుకుని కూర్చున్నాను..సర్లెమ్మని,రచయితల్ని కూడా సరిసమానంగా ప్రేమించాలనే సమన్యాయం గుర్తుకు వచ్చి ,ఎందుకీ వివక్ష ? ఏమిటీ పక్షపాతం అని మరోసారి ఘాటైన ఆత్మ విమర్శ చేసుకుని ఈ కథలు చదవడం మొదలు పెట్టాను..ఈ మధ్య కాలంలో నాన్ ఫిక్షన్ అతిగా చదివి,రియాలిటీలో ఎక్కువ కాలం బ్రతికేసిన నైరాశ్యం నుండి బయటపడడానికినిన్నూ,మరికాస్త 'కలం' మార్పు కోసమునున్నూ అన్నమాట..కానీ 'You'll find beauty in the most unexpected places' అని ఎవరో అన్నట్లు ఈ పుస్తకం నాకో మంచి రచన చదివానన్న అనుభూతిని మిగిల్చింది.


సైన్స్ ఫిక్షన్,macabre లాంటి జానర్స్ లో 'ఫిలసాఫికల్ డెప్త్' ఉన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి..గత సంవత్సరం ఇదే జానర్ లో అర్జెంటీనా రచయిత్రి సిల్వినా ఒకేంపో రాసిన NYRB క్లాస్సిక్ 'Thus Were Their Faces' లో ఒక ముప్పై కథల వరకూ చదివి మిగిలిన వంద పేజీలు పూర్తి చేసే ఓపిక లేక ప్రక్కన పడేశాను,ఆ కథలు చాలా మొనోటోనస్ గా,ఒకటీరెండు కథల మినహా చాలా అర్ధరహితంగా ఉన్నాయి..పెట్రోషెఫ్స్కియా రాసిన ఈ ఫెంటాస్టిక్ ఫిక్షన్ కథలు వాటికంటే వెయ్యి రెట్లు బావున్నాయి..కానీ పెట్రోషెఫ్స్కియా కథలు చదివిన వారికెవరికైనా వాటినిలా ఒక జానర్ పేరుతో ఒకే గాటికి కట్టెయ్యడం అమానుషం అనిపించక మానదు..ఎందుకంటే వీటిలో 'macabre' ని మించిన అంశాలెన్నో ఉన్నాయి.

సోవియెట్ సమాజపు వాస్తవాన్నీ,కాఠిన్యాన్నీ తేటతెల్లం చేసిన పెట్రోషెఫ్స్కియా రచనలు చాలా కాలం నిషేధానికి గురై ,గోర్బచెవ్ అధికారంలోకి వచ్చిన తరువాత గానీ వెలుగుచూడలేదట..ఆ తరువాత ఆమెకు వచ్చిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు..The Pushkin Prize in Russian literature (2003) ,The Russian State Prize for arts (2004), The Stanislavsky Award (2005),World Fantasy Award (2010)  లతో పాటు రష్యా లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అయిన The Triumph Prize (2006) ను కూడా సొంతం చేసుకున్న ఈ రచయిత్రిని ప్రస్తుతం జీవించి ఉన్న సమకాలీన రష్యన్ సాహితీ దిగ్గజాల్లో ఒకరిగా పరిగణిస్తారు.

ఇందులో మొత్తం పంతొమ్మిది కథలుండగా వాటిని నాలుగు భాగాలుగా విభజించారు..'సాంగ్స్ ఆఫ్ ఈస్టర్న్ సావ్స్'  మరియు 'ఫెయిరీ టేల్స్' విభాగాల్లో కథలన్నీ బావున్నాయి..కానీ Allegories,Requiems లో ఫాంటసీ శైలి కథల గురించి ఇక్కడ ప్రత్యేకం చెప్పుకోవాలి..పెట్రోషెఫ్స్కియా కలంలోని  వాడీ,వేడీ ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

Songs of the Eastern Slavs : ఈ విభాగంలో కథలు అధివాస్తవిక ధోరణిలో సోవియెట్ సమాజంలోని చీకటి కోణాల్ని చూపిస్తాయి.

Allegories : ఈ  విభాగంలో నాలుగు కథలూ రూపకాలు..పెట్రోషెఫ్స్కియా కథల్లో ఆణిముత్యాలని చెప్పే  రెండు కథలు ఇందులోనే ఉన్నాయి...'Hygiene','The New Robinson Crusoe' అనే కథలు రాజకీయ సామజిక అస్థిరతను ప్రతిబింబించే కథలు..

మనిషిని మృగాన్నుంచి వేరు చేసేవి జ్ఞానం,ఆలోచనా శక్తి,నైతికత,మానవీయత లాంటి కొన్ని లక్షణాలే..కానీ మనిషి తనను మించిన మేథోజీవి ఈ విశ్వంలో లేదనుకుంటాడు..కానీ తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఎదురైనప్పుడు మనిషి ప్రవర్తన మృగానికి ఏ మాత్రం తీసిపోదు..ఈ విషయాన్ని స్పష్టం చేసే కథ హైజీన్...Hygiene కథలో R. కుటుంబం ఇంట్లో డోర్ బెల్ రింగ్ అయినప్పుడు చిన్న పాప తలుపు తీస్తుంది..ఎదురుగా లేత ఎరుపు రంగులో ఉన్న ఒక యువకుడు మూడు రోజులో మనుషుల్ని చంపే అంటువ్యాధి ప్రబలిందని 'R' కుటుంబాన్ని(నికొలాయి,అతని భార్య ఎలెనా,వాళ్ళ చిన్ని పాప,ఎలెనా తల్లితండ్రులు) హెచ్చరిస్తాడు..పరిశుభ్రత పాటిస్తూ,ఇల్లువదిలి బయటకు వెళ్ళవద్దనీ,ఆ వ్యాధి సంక్రమించినా ఎలాగో తాను బ్రతికిబయటపడ్డాననీ,అందుకే ఇంటింటికీ తిరిగి అవసరమైనవారికి తినడానికి బ్రెడ్,అవసరమైన సామాను లాంటివి అందజేస్తున్నాననీ,డబ్బిస్తే కావాల్సిన సరుకులు తెచ్చిపెడతానని అంటాడు..కానీ అతనిపై నమ్మకంలేక నికొలాయ్ తనే బేకరీకి స్వయంగా వెళ్ళి అవసరమైన ఆహారం తెస్తూ ఉంటాడు..తిరిగి వచ్చాకా కట్టుకున్న వస్త్రాలను బయటే వదిలేసి,కొలోన్ తో ఒంటిని శుభ్రం చేసుకున్నాకే ఇంట్లోకి అడుగుపెడుతుంటాడు..నికొలాయ్ తిండిపోతు,ఈ కారణంగా ఆహారాన్ని భాగాలు పంచుతారు..కానీ మొదట్లో 'అవసరం' కాస్తా క్రమేణా 'స్వార్ధం'గా పరిణమించగా నికొలాయ్ బేకరీ కి వెళ్ళి ఆహారం కోసం హత్యలు కూడా చేస్తాడు..ఇలా ఉండగా ఆ ఇంటి బాల్కనీలో ఉండిపోయిన పిల్లికి ఆహరం పెట్టడానికి ఇంట్లోకి తెస్తారు..ఎలుకను చంపి తిన్న ఆ పిల్లి నోటిని ఆ చిన్ని పాప ముద్దాడుతుంది..అది చూసిన ఆమె అమ్మమ్మ,తాతలు అంటువ్యాధి సోకుతుందని భయపడి పాపను పిల్లితో సహా గదిలో నిర్బంధిస్తారు..పాప తల్లి ఎలెనా అడ్డుపడితే తాత్కాలికంగా ఆమెను బాత్రూమ్లో బంధిస్తారు..ఇంకా స్వయంగా తన పనులు చేసుకోవడం తెలీని ఆ పాప ఎంత అరిచి గోల చేసినా తలుపులు తియ్యరు..బాత్రూం కూడా లేని ఆ చిన్నపాప గది కాస్తా ఉన్నట్లుండి Quarantine ఛాంబర్ గా మారిపోతుంది..నికోలాయ్ గదితలుపుకి పై భాగంలో చిన్న రంధ్రం చేసి దాని ద్వారా పై ఆ పాపకి ఆహారం మాత్రం అందిస్తుంటాడు..పాపకు ఆ గదిలో పరిశుభ్రత నేర్పించడానికి ఎలెనా తో సహా అందరూ అనేక పాట్లు పడతారు..మూడోరోజుకి ఆ పాప గదిలోనుంచి ఎటువంటి శబ్దమూ రాకపోయేసరికి అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు.

తెల్లారి నిద్ర లేచిన అమ్మమ్మ,తాత తమ మంచం క్రింద ఉన్న పిల్లిని చూస్తారు..అది makeshift విండో నుండి ఎలాగో తప్పించుకుని ఇవతలకు వస్తుంది..రక్తం అంటిన దాని మూతిని చూసి పిల్లి పాపను తినడం మొదలుపెట్టిందని భావిస్తారు..ఇదంతా విన్న నికోలాయ్ మెల్లిగా వారిద్దరూ ఉన్న గదిని మూసేసి దానికి కుర్చీని అడ్డుగా పెడతాడు..తలుపుపైన రంధ్రం చేసే ఉద్దేశ్యాన్ని కూడా విరమించుకుంటాడు..అదేమిటని అడ్డువచ్చిన ఎలెనాను మళ్ళీ బాత్రూం లో బంధిస్తాడు..ఈలోగా నికోలాయ్ శరీరంపై అంటువ్యాధి తాలూకా బొబ్బలు వస్తాయి..ఆలోచించగా ఆ రోజు బేకరీకి వెళ్ళి,అక్కడ ఒక స్త్రీని ఆహారంకోసం హత్య చేసి,ఇంటికి వచ్చేదాకా ఆగలేక,అందులో కొంత భాగాన్ని అక్కడే తిన్నానని అతనికి గుర్తొస్తుంది..ఆ కారణంగా నికోలాయ్ కి కూడా ఆ వ్యాధి సోకి,కళ్ళలోంచి రక్తం కారుతూ మరణిస్తాడు..ఈ విధంగా ఒక్కొక్కరుగా అందరూ ఆ వ్యాధి సోకి మరణిస్తారు.

మొదట వచ్చిన యువకుడు మళ్ళీ ఆరో రోజుకి వచ్చి ఆ ఇంటి తలుపు కొడతాడు..మ్యావ్ మ్యావ్ మంటున్న పిల్లి శబ్దం తప్ప ఇతరత్రా అలికిడి లేకపోయేసరికి ఆ జీవినైనా రక్షిద్దామనే సంకల్పంతో లోపలకి అడుగుపెట్టిన అతనికి లివింగ్ రూంలో,కుర్చీ అడ్డుపెట్టిన గదిలో,బాత్రూం లో అతనికి సుపరిచయమైన నల్లటి గుట్టలు కనిపిస్తాయి..ఒక గదికి makeshift విండో లోంచి పిల్లి వెళ్ళడం చూసి తలుపు గొళ్ళెం తీసి ఆ గదిలోకి అడుగు పెట్టిన అతనికి విరిగిన గాజు పెంకులు,మలమూత్రాదులూ,తలతెగిన ఎలుకలూ,చింపిన పుస్తకాల పేజీల మధ్య తనలాగే తలమీద లేత గులాబీరంగు చర్మంతో కూర్చున్న పసిపాప కనిపిస్తుంది,ఆ పాప ప్రక్కన పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళతో చూస్తూ పిల్లి కూర్చుని ఉంటుంది...పెట్రోషెఫ్స్కియా ఈ కథలో పరిశుభ్రతను నిర్వచించే ప్రయత్నం చేశారు..'పరిశుభ్రత' భౌతికమైనదే కాదంటూ మానసికమైన స్వచ్చత యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పే కథ ఇది..తనను తాను రక్షించుకునే క్రమంలో నైతికతకు తిలోదకాలిచ్చే మనిషిలోని స్వార్ధపూరిత మనుగడ స్వభావాన్ని లోడ్మిల్లా పట్టుకున్న విధానం చాలా బావుంది.

'మిరాకిల్' అనే మరో కథలో కొడుకుపై ధృతరాష్ట్ర ప్రేమను చంపుకోలేక,దారితప్పిన కొడుకును సరైన దారిలో పెట్టాలనే ఆశతో ఒక దేశదిమ్మరి అయిన తాగుబోతు ప్రవక్తను కలిసిన మహిళ,తుదకు కోరికలకు అంతం లేదనే విషయాన్ని గ్రహించి తన మనోవేదన నుండి విముక్తురాలై,జీవితాన్ని యధాతథంగా అంగీకరించాలనే విలువైన పాఠాన్ని నేర్చుకుని వెనుదిరుగుతుంది..చూడ్డానికి చాలా పేలవంగా కనిపించే ఈ స్కెలిటన్ లాంటి కథలకు పెట్రోషెఫ్స్కియా కూర్చిన కథనం 'Craft is everything' అనుకునేలా చేస్తుంది.

Requiems (An act or token of remembrance) : 
మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపించే మృత్యువు నీడల్ని చూపే కథలివి..ఈ కథల్లో 'కాలం' వేరుగా పని చేస్తుంది..పాత్రలు భౌతికవాస్తవికతని దాటి సమాంతరంగా భూతభవిష్యత్ వర్తమానాల్లోకి ఏకకాలంలో ప్రయాణిస్తూ ఉంటాయి.

Fairy Tales : 
ఇవి అచ్చంగా ఫెయిరీ టేల్సే.. 'Marilena's secret' అనే కథలో మారియా,లెనా అనే ఇద్దరు కవలలు నర్తకీమణులు ఒక మాంత్రికుని శాపం వల్ల ఏకమై 'మారేలినా' అనే ఊబకాయురాలిగా మారిపోతారు..'The Cabbage-patch mother' అనే మరో కథలో ఒక అమ్మకి నీటిబొట్టు అంతే ఉన్న Droplet అనే కూతురు ఉంటుంది..ఈ కథలన్నీ పాఠకులను ఖచ్చితంగా బాల్యంలోకి లాక్కుపోతాయి..

ఈ కథలు మొదలవ్వడం కూడా విచిత్రంగా జరుగుతుంది..'ఒకానొకప్పుడు ఒక స్త్రీ ఉండేది,ఆమె తన పొరుగింటి స్త్రీని ద్వేషిస్తుంది' అంటూనో,లేదా 'ఒకానొకప్పుడు ఒకమ్మాయి ఉండేది,ఆమె మరణించి పునర్జీవితురాలైంది' అంటూనో పాఠకులను ఏదో సరళమైన చందమామ కథ చెప్తున్నట్లు భ్రమింపజేస్తూ కథ మధ్యలోకి చేరేసరికి అలవోకగా సంక్లిష్టతను తెరపైకి తీసుకువస్తారు..ఇందులో కొన్ని కథల్లో దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కునే సగటు మనుషులు తారసపడతారు..ఈ కోవకి చెందిన 'There’s Someone in the House' కథలో ఇంట్లో 'కనిపించని శత్రువు' కి భయపడిన ఒక స్త్రీ,జరగబోయే దారుణాన్ని తిప్పికొట్టే క్రమంలో ఇంట్లో సామానంతా ఒకొక్కటిగా తానే ధ్వంసం చేసి,చివరకి రోడ్ మీదకు వచ్చేస్తుంది..చివర్లో ఆమెవైపు భయంగా,రక్షించమన్నట్లు చూస్తున్న పెంపుడు పిల్లిని చూసి,చేసిన పనికి పశ్చాత్తాపపడి 'This is life' అని నిట్టూరుస్తూ ఇంట్లోకి వెనుదిరుగుతుంది...ఈ కథలన్నిటిలో సాధారణంగా కనిపించే మరో అంశం ఏంటంటే,ఇందులో చాలా మంది తల్లితండ్రులు పిల్లలపై హద్దుల్లేని ప్రేమను కలిగి ఉంటారు..యుద్ధం నిర్వీర్యం చేసిన భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలనే తపన కలిగిన సగటు సోవియెట్ యువకులూ,వారి తల్లిదండ్రులూ ఈ కథల్లో తారసపడతారు..'ది న్యూయార్కర్' లో ప్రచురితమైన 'The Fountain House' అనే కథలో బస్సు ప్రమాదంలో పదిహేనేళ్ళ కూతురి మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి ఆమె శవాన్ని అటాప్సీ జరగకుండా తీసుకెళ్ళిపోతాడు..డబ్బు కోసం ఏదైనా చేసే ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి కూతురి శవానికి వైద్యం చేయిస్తూ షాక్ కు గురైన ఉన్మాదంలో స్వప్నంలో కూతురు తినడానికి తెచ్చిన శాండ్విచ్ మధ్యలో ఉన్న మనిషి హృదయాన్ని తినేస్తాడు..నిద్రపోయి లేచిన తర్వాత,కూతురు కోలుకుని లేచి తన చెయ్యి పట్టుకుని నడుస్తోంది అంటాడు..ఏం జరుగుతోందో ఒక్క క్షణం అర్ధం కాని స్థితిలోకి పాఠకులను నెట్టేసి,మనం 'కూతురు బ్రతికే ఉందా' అని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ బుర్రకు పదును పెట్టేలోపు,తండ్రి తాను మనిషి హృదయాన్ని తిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ 'అయినా కలలు నిజం కాదుగా' అని మనసులో అనుకునే వాక్యంతో కథను ముగిస్తారు..ఈ ముగింపు వాక్యం నిజంగా అద్భుతం..ఈ ఒక్క వాక్యంతో సృజనాత్మకత పరిధుల్ని చెరిపేస్తూ పాఠకుల్లో జరుగుతున్నది వాస్తవమో లేక స్వప్నమో అర్ధం కాని సందిగ్ధతను సృష్టిస్తారు.

స్టాలిన్ శకంలో పుట్టి (1938),రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి రష్యాలో కడుపునిండా తిండికి కూడా నోచుకోలేక, పదేళ్ళ వయసు లోపే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన పెట్రోషెఫ్స్కియా కథల్లో యుద్ధం పట్ల ఏహ్యభావం,అసహనం,కోపం అంతర్లీనంగా కనిపిస్తాయి..అందుకేనేమో కాఠిన్యం ఎరుగని పసితనం యుద్ధ కాంక్షకు బలైన వైనం ఈ కథల్లో అనేకచోట్ల ప్రస్తావనకు వస్తుంది..ఉదాహరణకు ఒక కథలో మరణించిన స్త్రీ తన తోటి ప్రయాణీకుల్లో యుక్తవయసులో ఉన్న ఒకే రకం యూనిఫామ్ ధరించిన అనేకమంది సైనికులను నోళ్ళు తెరచుకుని నిద్రిస్తుండగా చూశానంటుంది ,మరో కథలో యుద్ధ సమయంలో ఒక కల్నల్ మరణానికి చేరువలో ఉన్న భార్య ఉత్తరం అందుకుని ఇంటికి వెళ్ళే లోపే ఆమె మరణిస్తుంది..పెట్రోషెఫ్స్కియా నిస్సంకోచంగా యుద్ధంలో మరణించిన వారి శవపేటికలను తెరచి అందులో సైనికుల యొక్క శిధిలమైన స్వప్నాల గాధలు వినమంటారు..ఈ కథల్లో చిన్నచిన్న సంగతులు కూడా విస్మరించలేని విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి..ఉదాహరణకు ఒక కథలో స్త్రీ తనకు ఆవలివైపు ఉన్న దేశాన్ని చూస్తూ అక్కడ దూరంగా ఒక క్యాథెడ్రల్,నీరూ ఉన్నాయంటుంది..మతమూ,నీరూ లేకపోతే మనుగడే లేని మనిషి ఉండే భూమిని రచయిత్రి ఇలా అస్పష్టంగా వర్ణిస్తారు..లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా కథల్లో వచనం అత్యంత సరళంగా కనిపించినప్పటికీ భావం మాత్రం సంక్లిష్టమైన నిగూఢతను కలిగి ఉంటుంది.

ఈ కథల్లో ఆత్మలు స్వైర విహారం చేస్తాయి..ఒకే ఆత్మ కలిగి ఏక కాలంలో వివిధ కాలమాన పరిస్థితుల్లో సంచరించే వేర్వేరు మనుషులుంటారు,నిర్ణీత సమయంలో భూతభవిష్యద్ వర్తమానాల్లో వారు ఏ కాలంలో ఉన్నారన్న సంగతి ఇందులో పాత్రలకే కాదు,మనకు కూడా తెలీదు...మరణానంతరం కూడా మనుషులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు,జీవన్మరణాల మధ్య గీతలు మన కళ్ళముందే మసకబారిపోతుంటాయి,వీటన్నిటి మధ్యా పాఠకులకు రహస్యాలమయమైన వింతలోకాల్లో సంచరిస్తూ ఊహేదో,వాస్తవమేదో,స్వప్నమేదో తెలీని మాయాజాలంలో చిక్కుకున్నామనిపిస్తుంది..పోస్ట్ వార్ సోవియెట్ సమాజాన్నీ ఫెంటాస్టిక్ శైలిలో ప్రతిబింబించే ఈ కథలు ఒక ప్రక్క భయంగొల్పుతూనే మరో ప్రక్క రష్యా సమాజంలోని వైఫల్యాలను ఎత్తిచూపుతాయి..పెట్రోషెఫ్స్కియా కథల్లో పాత్రలు 'నాన్ కన్ఫర్మ్మిస్టులు'..నిర్దిష్టమైన వ్యక్తిత్వాలు ఆపాదించబడని కారణంగా ఈ కథల్లో పాత్రలు కథనం తాలూకు ప్రవాహాన్ని బట్టి దారిచేసుకుంటూ వాటంతటవే దిశలు మార్చుకుంటూ ఉంటాయి..కథ కంచికి చేరి అవి తమ గమ్యం చేరే క్రమంలో తమ జీవితాల్లో ఏం జరగబోతోందో తెలీని అస్పష్టతను,సందిగ్ధతను మోసుకుంటూ ముందుకు వెళ్తున్న పాత్రల్ని మనం కూడా నిస్సహాయంగా అనుసరిస్తూ వెళ్ళాల్సిందే...ఇందులో ప్రతీకథా రసాత్మకం,వైవిధ్యభరితం..Keith Gessen,Anna Summers లు చేసిన అనువాదం చాలా బావుంది..ఇందులో లూడ్మిల్లా పెట్రోషెఫ్స్కియా శైలిని పట్టుకుంటూ వారు రాసిన ముందుమాటను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..దానికోసం ప్రత్యేకించి మరో పోస్టు రాస్తాను..అంత వరకూ సెలవు..Happy reading.

No comments:

Post a Comment