Thursday, June 20, 2019

ఆర్టిస్టు , క్రిటిక్కు - ఒక బెస్ట్ సెల్లరు

Image Courtesy Google
ఒక పుస్తకాన్ని పాఠకులు ఎలా చదువుతారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు 'No two persons ever read the same book.' అని Edmund Wilson ను కోట్ చేస్తారు..'లోకో భిన్న రుచి' అన్నతీరులో ఒక పుస్తకం బెస్ట్ సెల్లర్ అయినప్పటికీ అందరికీ నచ్చాలని రూలేమీ లేదు..అలాగే ఒక బెస్ట్ సెల్లర్ నచ్చనంత మాత్రాన ఆ నచ్చనివారికి ఆ రచనను ఆస్వాదించే,అర్ధం చేసుకునే స్థాయి లేదనుకోవడం కూడా అవివేకం..'కళాతపస్వి' తీసిన కళాఖండాలు సైతం విమర్శకులకు మినహాయింపు కాదు..అలాగే ఒక వర్గానికి నచ్చనంత మాత్రాన ఆయన సినిమాల విలువ తగ్గిపోదు..ఒక ఆర్టిస్టు తన కళను నలుగురిలో ప్రదర్శనకు పెట్టినప్పుడే పాఠకులకూ/ప్రేక్షకులకూ దాన్ని జడ్జి చేసే హక్కును తన చేత్తో తానే స్వయంగా కట్టబెడతాడు..అలా కాకుండా తన కళకు ఎవరూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడానికి అర్హులు కాదనే నిశ్చితాభిప్రాయం ఉన్నవాళ్ళు ఫెర్నాండో పెస్సోవా తరహాలో జాగ్రత్తగా తమ రచనల్ని ట్రంక్ పెట్టెల్లో భద్రపరుచుకోవడం ఉత్తమం..వ్యక్తిగత విమర్శలు,దూషణలూ కానంతవరకూ ఒక రచన మీద ప్రశంసలనూ,విమర్శలనూ సమానంగా స్వీకరించగలిగే మానసిక సంసిద్ధత ఆర్టిస్టులో ఉండవలసిన ముఖ్య  లక్షణం..నచ్చకపోవడాన్నీ,విమర్శించడాన్నీ రసాస్వాదన చెయ్యలేని ఒక పాఠకుడి అపరిపక్వతగా భావించే బదులు దాన్ని ఒక వ్యక్తిగతాభిప్రాయంగా భావించి,ఆ వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించడం ఆర్టిస్టు కనీసం ధర్మం..ఎందుకంటే భావప్రకటనా స్వేచ్ఛ ఆవశ్యకతను ఒక కళాకారుడు అర్ధం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్ధం చేసుకోలేరు.

ఇక విమర్శకుడి విషయానికొద్దాం..ఒక వ్యక్తికి ఒక రచనని విమర్శించడానికి ఉండాల్సిన కనీసార్హతలేమిటన్నది ఈనాటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది..ఒక రచన చెయ్యడానికి రచయితకు పీహెచ్డీ సర్టిఫికెట్లు గానీ,సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీగానీ ఉండాలన్న నియమమేమీ లేదు..భావవ్యక్తీకరణలో ఈస్థెటిక్స్ తెలియడమే తప్ప మరే నియమమూ అక్కర్లేని కాల్పనిక ప్రపంచంలో కళాకారుడు నిత్యస్వతంత్రుడు..మరి ఆర్టిస్టుకి లేని అర్హతలూ,పరిమితులూ విమర్శకుడికి మాత్రం ఎందుకుండాలి అనేది కొందరి వాదన..సాధారణమైన ప్రపంచాన్ని ఒక ఆర్టిస్టు తన అసాధారణమైన దృష్టికోణంనుండి చూస్తూ,మనకు తానెన్నుకున్న ప్రత్యేక మాధ్యమంలో నుండి దర్శింపజేస్తాడు..కళ అనేది ఆర్టిస్టులో 'నేను' అనే స్పృహ(ఇగో) లోంచి పుడుతుందని అనేకమంది రచయితలు అంటూ ఉంటారు..ఇక విమర్శకుల విషయానికొస్తే ఒక కళాకారుడు తన కళపట్ల ఎంత పక్షపాత వైఖరితో వ్యవహరిస్తాడో,ఒక విమర్శకుడు కూడా ఆ కళను తన దృష్టికోణంనుంచి చూస్తూ విమర్శించడంలో అంతే పక్షపాతధోరణిని అవలంబిస్తాడు..All is fair in love & war అన్నతీరులో ఆర్టిస్టుకీ,క్రిటిక్ కీ మధ్య నిరంతరం జరిగే ఈ గెలుపోటముల యుద్ధం,ఒకరకంగా చూస్తే రెండు వర్గాల ఇగోల ఆధిపత్యపోరాటం...Authors are partial to their Wit, ’tis true.But are not Criticks to their Judgment too?....Those monsters, Criticks! అంటారు అలెగ్జాండర్ పోప్ “An Essay on Criticism” లో...ఆ మధ్య చదివిన విలియం.ఎస్.బరోస్ (William S Burroughs) 'The Adding Machine' అనే పుస్తకంలో పుస్తక సమీక్షల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రాశారు..ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కు వెళ్ళారు,అందులో ఒకరు హోటల్ ambiance బావుంది,ఫుడ్ బావుంది,కిచెన్ శుభ్రంగా ఉంది అని రాస్తే,మరొక వ్యక్తి అక్కడ హోటల్ ambiance బాగాలేదు,ఫుడ్ అస్సలు రుచిగా లేదు,కిచెన్ లో శుభ్రత లేదు అని రాస్తాడు..మొదటి వ్యక్తికి ఇటాలియన్ రుచులంటే ప్రీతి,ఇక రెండో వ్యక్తికి ఇటాలియన్ ఫుడ్ అంటే అయిష్టత..ఈ నచ్చకపోవడమే అతని జడ్జిమెంట్ కు కారణం కావచ్చు..లేదా ఆ హోటల్ లో వంటవాడి వ్యక్తిగత జీవితం పై అభ్యంతరాలు ఉండొచ్చు..అదీ కాకపోతే హోటల్ ప్రొప్రయిటర్ రాజకీయ అభిప్రాయాలు ఇతని అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండొచ్చు..జిహ్వకోరుచి పుర్రెకోబుద్ధి అన్నట్లు ఈ జడ్జిమెంట్ కు కారణాలేవైనా కావచ్చు..అలాగే ఒక పుస్తకం నచ్చకపోవడానికి కూడా ఇలాంటి కారణాలెన్నో ఉండవచ్చు..కొందరికి భాష నచ్చకపోవచ్చు,మరికొందరికి భావం నచ్చకపోవచ్చు..కొందరికి ఆ జానర్ అంటేనే రుచించకపోవచ్చు..కానీ ఒక పాఠకుడి జడ్జిమెంట్ మాత్రం తీసిపారెయ్యలేనిది..అది 'ఆర్టిస్టిక్ ఇంపెర్ఫెక్షన్' అంత స్వచ్ఛమైనది.

సాహిత్యం సైతం డిజిటలైజ్డ్ చెయ్యబడుతున్న ఈ టెక్నాలజీ యుగంలో సమీక్షకూ,విమర్శకూ మధ్య అంతరాలు చెరిగిపోతున్నాయి..నిజానికి ఒక రచనను సమీక్షించడానికీ,విమర్శించడానికీ చాలా భేదం ఉంది..సమీక్షకులు సాధారణంగా పుస్తకప్రియులై  ఉంటారు..వీరి పఠనం రచనలోని భావాన్ని ఆస్వాదించే దిశగా ఒక ఉపరితలంపై మాత్రమే సాగుతుంది..ఒక రచనను లోతుగా,క్రాఫ్ట్ ను కూలంకషంగా అధ్యయనం చేస్తూ చదవడం వీరికి సాధ్యపడదు..ఇక విమర్శకులు అనగా 'ప్రొఫెషనల్ క్రిటిక్స్' ఒక రచనను చదివేటప్పుడు,వారి దృష్టి భాష,భావం,వ్యాకరణం,శిల్పం ఇలా నలు దిశలకూ ప్రయాణిస్తూ సాగుతుంది..సద్విమర్శకులు ఏ రచననైనా కొన్ని నిర్దిష్టమైన సాహితీ విలువల తూకపు రాళ్ళను వేసి తూచాక గానీ విలువ కట్టరు..ఒక రచనకు అటువంటి విమర్శకుడు లభించాడంటే ఆ రచయిత అదృష్టవంతుడని చెప్పొచ్చు..మరి విమర్శించే వారికి ఉండాల్సిన అర్హతలేమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సాహిత్యం గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచి విమర్శకులు అవుతారని అనుకోవచ్చేమో..కేవలం ప్రాంతీయతకు పరిమితమయిపోకుండా జాతీయ,అంతర్జాతీయ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవారు సాహితీ విమర్శకులుగా రాణిస్తారు..ఇటువంటి సద్విమర్శకుల అభిప్రాయాన్ని తప్ప మిగతా వారి అభిప్రాయాలను ఒక విమర్శగా చూడడం సరికాదు..అవి ఒక సామాన్య పాఠకుడి సమీక్షగా మాత్రమే పరిగణించాలి.

Yet what separates reviewing from criticism—pragmatically—are the reductive limits of space; the end is always near. What separates criticism from reviewing—intrinsically—is that the critic must summon what the reviewer cannot: horizonless freedoms, multiple histories, multiple libraries, multiple metaphysics and intuitions. Reviewers are not merely critics of lesser degree, on the farther end of a spectrum. Critics belong to a wholly distinct phylum.This is a phylum that, at present, hardly exists.అంటారు Cynthia Ozick.

ఈ కాలంలో సమీక్షలే ఉన్నాయి గానీ తులనాత్మక విమర్శలు దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి..Reviewers we have but no critic; a million competent and incorruptible policemen but no judge. Men of taste and learning and ability are for ever lecturing the young and celebrating the dead అంటారు Virginia Woolf...కానీ దీనికి కారణమేంటా అని ఆలోచిస్తే,ఒక రివ్యూయర్ కి  చనిపోయిన రచయిత యొక్క రచనను జడ్జి చేస్తే ఆయన ఖచ్చితంగా సమాధిలోంచి లేచొచ్చి తిట్టలేడనే ధైర్యం కావచ్చు :)  'Critics, Monsters, Fanatics & Other Literary Essays' అనే పుస్తకంలో అమెరికన్ రచయిత్రి Cynthia Ozick, బుక్ రివ్యూలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..డిజిటలైజేషన్ కారణంగా సమీక్షలూ,విమర్శలూ కూడా అమెజాన్ లాంటి మార్కెట్ ప్లేసెస్ చేతుల్లో పడి కొత్త రూపును సంతరించుకుంటున్నాయి..అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లో పాఠకుల రివ్యూలు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా యథాతథంగా ప్రచురించబడతాయి..తనకు అర్ధంకాని ఉన్నతమైన భాష,వ్యాకరణం,శైలి ఉన్న ఒక మంచి లిటరరీ పీస్ గురించి కూడా ఒక సామాన్య పాఠకుడు 'బోరింగ్'/'డిప్రెస్సింగ్ రీడ్' అంటూ 'సింగిల్ స్టార్' రివ్యూలు ఇవ్వడం ఇక్కడ సర్వసాధారణం..'The customer is always right' అన్నతీరులో అమెజాన్ ఎటువంటి ప్రాథమిక ప్రమాణాలూ లేకుండా 'పిచ్చివాడి చేతిలో రాయి' మాదిరిగా ప్రతి వ్యక్తికీ సాహిత్యాన్ని విమర్శించే హక్కుని సులభంగా కట్టబెట్టింది..అతి సాధారణ భాషలో,పాఠకులకు సులువుగా అర్ధమయ్యే సామాన్యమైన రచనలకి ఈ కారణంగా 5 స్టార్ రేటింగ్ లూ,బెస్ట్ సెల్లర్ ట్యాగ్ లూ లభించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు..అమెజాన్ బుక్ స్టోర్ ఓపెన్ చెయ్యగానే 'పాపులారిటీ/మెజారిటీ ఒపీనియన్' ప్రధానంగా జరిగే ఈ వ్యాపారంలో బుక్ suggestions లో కూడా రవీందర్ సింగ్,చేతన్ భగత్,అమిష్ త్రిపాఠి వంటి వారి రచనలు బెస్ట్ సెల్లర్ ట్యాగులతో తొలి పేజీలోనే దర్శనమివ్వడమే దీనికొక ఉదాహరణ..దీని వల్ల పెద్ద నష్టమేమీ లేదులే అనుకోడానికి వీల్లేకుండా 'ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' లాంటి చవకబారు రచనలు బెస్ట్ సెల్లర్లుగా ఫ్రంట్ పేజీలో కనిపించడం మరింత బాధాకరం..నిజానికి ఇక్కడ కూడా అమెజాన్ లాంటి సంస్థల్ని తప్పు పట్టాల్సిన పని లేదు..తప్పంతా అమెజాన్ చేస్తున్నది వ్యాపారమనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్న కస్టమర్ ది,అంటే పాఠకుడిది.

దీని తరువాత సాహిత్యంపై సోషల్ మీడియా ప్రభావం గురించి చెప్పుకోవాలి..సాహితీ గ్రూపులు,బ్లాగు సమూహాలు,బుక్ క్లబ్ లు,ఇండీ బ్లాగర్ లాంటి బ్లాగ్ జాలపత్రికలు పాఠకుల రీడింగ్ హ్యాబిట్స్ పై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి..శాస్త్రసాంకేతికత కళారంగాన్ని త్రోసిరాజని పురోగతి సాగిస్తోందనేది కాదనలేని సత్యం..దినపత్రికలూ,టీవీల స్థానంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు జర్నలిజాన్నీ,తద్వారా సమాజాన్ని పరోక్షంగా శాసించే స్థాయికి ఎదిగాయి..ఏ రకమైన ఫ్యాక్ట్ వెరిఫికేషన్/ప్రామాణికతలూ లేని సమాచారాన్నే సగటు సోషల్ మీడియా యూజర్ ప్రామాణికంగా తీసుకుంటున్నాడు..ఈ విషయాన్ని ఫేస్బుక్  ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన Roger McNamee రాసిన Zcked: Waking Up to the Facebook Catastrophe అనే పుస్తకంలో విపులంగా చర్చించారు..ఈ మొత్తం వ్యవహారాన్ని సాహిత్యానికి అన్వయిస్తే జరుగుతున్న చేటు అంతాఇంతా కాదు..పుస్తకాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లాంటి ఇన్ఫర్మేషన్ జెయింట్స్,Goodreads లాంటి అనేక పుస్తక సంబంధిత  భాండాగారాలు అందుబాటులో ఉన్నప్పటికీ  ఏ సమాచారం కావాల్సివచ్చినా ఫేస్బుక్,వాట్సాప్ లాంటి ఇరుకు ఏసీ గదుల్ని దాటి బయటకు వెళ్ళమని భీష్మించుకుని కూర్చునే పాఠకులు(?) ఈ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న 'సముద్రంలో ఒక నీటి బొట్టు'ని మాత్రమే సాహిత్యమనుకునే భ్రమలో ఉన్నారు..అక్కడ కుప్పలుతెప్పలుగా కనిపించే సామాన్యుల సమీక్షలనే (బుక్ రివ్యూస్) విమర్శలుగా భావించి,మెజారిటీ జడ్జిమెంటే 'నాణ్యమైన జడ్జిమెంట్' అన్న భావనలో కొట్టుకుపోతున్నారు..ఈ తరహా సమూహాల్లో,ఇతర సోషల్ మీడియా వెబ్సైట్స్ లో కనిపించే బుక్ రెకమెండేషన్స్ సైతం ఫేస్బుక్ పబ్లిసిటీ/మార్కెటింగ్ స్ట్రాటజీ లో భాగమని తెలీక సగటు పాఠకుడు కంప్యూటరైజ్డ్ ఎక్సప్లోయిటేషన్ బారిన పడి మోసపోతున్నాడు.

అన్నీ సమస్యలేగానీ పరిష్కారాలేవీ ఉండవా అంటే,ఉన్నాయి..నాది మంచి సాహిత్యమని ఆర్టిస్టూ,కాదు నీ రచన అసలు సాహిత్యమే కాదు,లోపభూయిష్టమని క్రిటిక్కూ తమ అభిప్రాయాలపై స్థిరంగా నిలబడినప్పుడు మధ్యలో ఉండే అర్భక పాఠకుడికి తనేం చదవాలో తెలియాలంటే మరో మధ్యేమార్గమే లేదా అంటే ఎందుకు లేదూ ? ఉంది..అదే కాలపరీక్ష..ఒక రచన ఉన్నత విలువలతో,మంచి సాహితీప్రమాణాలతో తుదకంటా మెరిసే మేలిమి బంగారమా లేదా కాస్త తడి అంటితేనే తుప్పుపట్టే ఇనుప లోహమా అనేది కాలమే నిర్ణయిస్తుంది..రివ్యూలూ,మార్కెటింగ్ ఇవేవీ పెద్దగా లేకపోయినా కేవలం  నోటి మాట ద్వారా మంచి సాహిత్యం కాలదోషం పట్టకుండా నిలుస్తుంది..అలా కానిపక్షంలో పబ్లిసిటీ,రివ్యూల పేరిట సమూహాలు రేపుకున్న దుమారంలో అది కూడా కొట్టుకుపోయి దానంతటదే అదృశ్యమయిపోతుంది.

3 comments:

  1. ఈ కాలంలో సమీక్షలే ఉన్నాయి గానీ తులనాత్మక విమర్శలు దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి.
    ఈ వాక్యంతో సహా ఈ వ్యాసం తెలుగు సాహిత్యానికి సంబంధించిది అనుకోవాలా లేక అన్ని భాషలకి వర్తిస్తుందా?
    అసలు పుస్తకం ఎలా చదవాలన్నది కూడా పాఠకులు నేర్చుకోవాలనుకుంటాను. చి న.

    ReplyDelete
  2. Very well written. I agree with you on the marketing strategies. I'm afraid I must think twice after reading such "award winning" "best seller" tags. Commercial reviews are only advertising that book. I hear even the lit fests are safely avoided by "real" writers to avoid the drama. But readers will find good stuff anyway.

    ReplyDelete
  3. చక్కగా చెప్పారు.

    ReplyDelete