ముందుగా ఒక మెత్తని సౌకర్యవంతమైన కుర్చీనీ, దానికెదురుగా గట్టి చెక్కతో చేసిన బల్లనూ వేసుకోండి. ఇప్పుడు ఆ చెక్క బల్లపై చదవాలనుకుంటున్న పుస్తకాలను ఒకదానిపై ఒకటి బొత్తిగా పెట్టుకోండి. ప్రక్కనే కిటికీలుంటే వాటికి రంగురంగుల కర్టెన్లు గానీ, నర్సరీలో కొన్న మొక్కల్నీ గానీ వ్రేలాడదీసుకోండి. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎస్తెటిక్స్ మర్చిపోకూడదు. ప్రక్కన గోడకి మీరు చదవని వాళ్ళైనా పర్వాలేదు, ఓ నలుగురైదుగురు రచయితల ఫోటోలు పోస్టర్స్ అంటించుకోండి.
Copyright A Homemaker's Utopia |
ఇప్పుడు పుస్తకం పేజీపై సగం వెలుగూ, మీ మొహంపై మిగతా సగం వెలుగూ పడే విధంగా రాత్రి వేళల్లో చదువుకోడానికి వీలుగా ఒక టేబుల్ లాంపును కూడా అమర్చుకోవడం మర్చిపోవద్దు. ఆ వెలుగు మీ తలలోకి వెళ్ళబోతున్న జ్ఞానానికి సూచన. ఒకవేళ మీకు కళ్ళజోడు లేకపోయినా పుస్తకం ప్రక్కన కళ్ళజోడు పెట్టడం వల్ల "intellectual aura" క్రియేట్ అవుతుంది.
ఇప్పుడు ముందుగా ఏర్పాటుచేసుకున్న కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉంచి మెల్లగా కూర్చోండి. ఒకవేళ మీది వత్తుగా కొబ్బరి నూనె పెట్టుకున్న తలైతే గనుక, ప్లీజ్... దయచేసి ఆ రీడింగ్ చైర్ కి మీ నూనె జిడ్డు అంటించకుండా తల దగ్గర ఏదైనా వేసుకోండి. ఇప్పుడు పుస్తకం పేజీలు ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టండి. ప్రక్కనే చల్లారిపోయిన కాఫీ కప్పు గురించి మర్చిపోండి.
చెయ్యవలసిన పనులు చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు చదువుతున్నప్పుడు చెయ్యకూడని పనులేమిటో కూడా చూద్దాం. తలను అటూ ఇటూ తిప్పుతూ వంట గదిలో స్టవ్ మీద పెట్టి మర్చిపోయిన కూర మూకుళ్ళ గురించీ, లివింగ్ రూమ్ లో కట్టకుండా వదిలేసిన ఫ్యాన్ గురించీ, పిల్లాడు స్నానం చేసి తుడుచుకుని మంచం మీద ఆరెయ్యకుండా పడేసిన టవల్ గురించీ, అయ్యవారు మెయిన్ డోర్ గుమ్మం దగ్గరే విప్పి పడేసిన సాక్స్ గురించీ, ముందురోజు binge watch చేస్తూ సగంలో వదిలేసిన కొరియన్ డ్రామాలో హీరోయిన్ ఉద్యోగం గురించీ ఆలోచిస్తూ ఫ్రస్ట్రేషన్ తో ప్రక్క చూపులు చూస్తే మీ చదువు ఒఖ్ఖ పేజీ కూడా ముందుకు సాగదని గుర్తుపెట్టుకోండి. కూర మాడిపోయినా, కరెంటు బిల్లు పెరిగిపోయినా, తువ్వాలు దండానికి బదులు మంచం మీదే ఆరేసినా, సాక్సులు అక్కడే పడున్నా, చివరకు భూకంపం వచ్చి మీ కుర్చీ ప్రక్కన భూమి బీటలు వారినా సరే, మీరు మాత్రం చలించకుండా కార్యదీక్షలో మడమ తిప్పని యోధుల్లా పేజీలు తిప్పుతూనే ఉండాలి. ఈ చిట్కాలు గుర్తుపెట్టుకోండి.
"Truth is stranger than fiction" అంటారు కదా ! :)
ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. :))
ఇంస్టాగ్రాముల్లో చూపించినట్లు అధికశాతం చదువు కాఫీ షాపులూ, రీడింగ్ నుక్స్ లోనూ కంటే మిత్రులు అన్నట్లు మంచాలూ / దివాన్ కాట్స్ మీదా, బాల్కనీల్లోనూ, కిచెన్ కౌంటర్ల దగ్గరా, బస్సు /రైల్వే / ఎయిర్పోర్ట్ / హాస్పిటల్ లాంటి వెయిటింగ్ స్పేసేస్ లోనూ, చెట్ల క్రిందా, కారులో వెయిటింగ్ సమయంలోనే ఎక్కువ జరుగుతుంది. పిల్లల్ని పెంచడం, పుస్తకాలు చదవడంలాంటి వాటికి రెసిపీలేమీ ఉండవు. నాకైతే తెలీదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. :)
ఏంటి, చివరిదాకా చదివారా ? అయితే Sorry !! :)))
No comments:
Post a Comment