Saturday, March 20, 2021

The Interior Landscape : Classical Tamil Love Poems - A.K.Ramanujan

ది న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ వారు NYRB పోయెట్స్ సిరీస్ లో భాగంగా ఎ.కె.రామానుజన్ అనువాదం చేసిన క్లాసికల్ తమిళ్ లవ్ పోయెమ్స్ ను 'ది ఇంటీరియర్ ల్యాండ్ స్కేప్' పేరిట పునఃముద్రించారు..నేను రామానుజన్ జానపద కథలు (Folk tales from India) తప్ప ఆయన కవిత్వం గానీ, అనువాదాలు గానీ చదివింది లేదు..అందులోనూ తమిళ వ్యావహారిక భాష తప్ప రాయడం,చదవడం తెలియదు కాబట్టి తమిళ కవిత్వం అనగానే అర్థమవుతుందో లేదో అని ముందు సంకోచించాను..కవిత్వమంటే అన్నిసార్లూ వ్యక్తిగతమే కానక్కర్లేదు, అందునా ప్రాచీన కవిత్వం వ్యక్తిప్రధానమైన కవిత్వానికి బహు దూరం..కవిత్వం చదివేటప్పుడు కవి చరిత్ర,అతడి నేపథ్యం పాఠకుడికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ప్రాచీన కవిత్వం చదివేటప్పుడు ఇటువంటి వివరాలు తెలియడం మరింత ముఖ్యం, ఎందుకంటే అవి తెలియకుండా ఆ కవిత్వపు నాడి పట్టుకోవడం కష్టం..సహజంగా పుస్తకం ముందు మాటల్నీ,తుదిపలుకుల్నీ చివర చదివే అలవాటున్న నేను ఈ పుస్తకం విషయంలో మాత్రం తుదిపలుకు మొదట చదివి అప్పుడు కవితలు చదివాను..ఈ కవితల నిర్మాణం అర్ధం కావాలంటే కవిత్వంతో ఎక్కువ స్నేహం లేని వారికీ,పరాయి సంస్కృతికి సంబంధించిన కవిత్వం చదివేవారికి అది తప్పనిసరి అనిపించింది.

Image Courtesy Google

ఈ రచనలో 300 A.D కి చెందిన 55 మంది కవులు రాసిన తమిళ ప్రాచీన కవిత్వానికి సంబంధించిన ఎనిమిది సంకలనాల్లో ఒకటైన 'కురుంతోకై' అనే సంకలనం నుండి సంగ్రహించిన 76 కవితలు ఉంటాయి..ఈ సంకలనాల్లో కవిత్వాన్ని అకం(అంతర్గతం) ,పూరం(బహిర్గతం) అనే రెండు భాగాలుగా విభజించారు..మొదటి భాగం ప్రేమ కవిత్వం కాగా, రెండవ భాగంలో యుద్ధాలూ,రాజులూ,రాజ్యాలూ,మరణం,మంచి-చెడు లాంటివి థీమ్స్ గా ఉంటాయి..'పబ్లిక్ పోయెట్రీ' అయిన పూరంలో వీరమరణాలు,రాజుల కీర్తి,కవుల పేదరికం లాంటివి గానం చెయ్యబడతాయి..నిజానికి ప్రాచీన తమిళ కవితా సంప్రదాయం వ్యక్తిగతమైనది కాదంటారు రామానుజన్.

ఏదైనా ఒక పరాయి భాషను అనువదించడమంటే పాఠకుణ్ణి ఆ ప్రాంతీయతలోకి  'అనువదించడానికి' ప్రయత్నించడమే..తమిళ ప్రాకృతిక దృశ్య నేపథ్యంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమను మూలాధారంగా రాసిన ఈ పుస్తకంలోని కవితలు పైన చెప్పుకున్న 'అకం' శ్రేణి కి చెందుతాయి..ఈ వర్గానికి చెందిన కవిత్వంలో అంతః ప్రపంచాన్ని కవిత్వంలో పొదగడానికి స్త్రీపురుషుల మధ్య ప్రేమను ఒక అనువైన వ్యక్తీకరణ మార్గంగా వాడేవారు..ప్రేమ రూపురేఖలు నిరంతరం మారిపోయే ఈ 'అకం' కవిత్వానికి కలయిక,ఎడబాటు ,వివాహానంతర ప్రేమ ,పవిత్ర ప్రేమ,అపవిత్ర ప్రేమ లాంటి అన్ని రకాల ప్రేమలూ థీమ్స్ గా ఉంటాయి..రామానుజన్ తుదిపలుకులో ఏడు రకాలైన ప్రేమల్ని వర్ణిస్తారు : అందులో మొదటిది, సామజిక కట్టుబాట్లవల్ల ముడిపడిన బంధం అంటే ప్రేమలేని పెళ్ళి : ఎటువంటి ఆకర్షణా లేకపోయినా తప్పనిసరిగా,ఒక బాధ్యతగా నిలబెట్టుకోవాల్సినది కాగా చివరిది,వన్ సైడెడ్ ప్రేమ : మానసిక పరిపక్వత లేని వయసులో తొలి యవ్వనపు పొంగులో కలిగే ప్రేమ...అకం కవిత్వంలో ఆ ఈ మొదటి,చివరి ప్రేమలకు స్థానం లేదు..వాటిలో కవిత్వానికి అవసరమైన భావావేశాలు ఉండే అవకాశం లేదు..ఇక మిగిలిన ఐదు రకాలు మాత్రమే పరిపూర్ణమైన ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి కాబట్టి వీటినే అకం శైలిలో ఉపయోగించుకుంటారు..ఈ కవిత్వంలో స్త్రీ పురుషులిద్దరూ అన్నివిధాల ఒకరికొకరు సరిసమానులై ఉండాలి అంటే అందచందాల్లో,గుణగణాల్లో,వయసులో,సామజిక స్థితిగతుల్లో అన్ని విధాలా ఒకరికొకరు సమఉజ్జీలై ఉండాలి..సంస్కారవంతులై,నాగరికత తెలిసినవారై ఉండాలి..అటువంటి జోడీ  మాత్రమే పూర్తి స్థాయి ప్రేమకు/కలయికకు లేదా వియోగానికి అర్హమైనది అంటారు.

ఈ శైలికి చెందిన కవిత్వం క్రియాదూరమైనదీ, అనుభవ ప్రధానమయినదీను..దానికి తోడు అకం కవిత్వంలో వ్యక్తుల పేర్లు ప్రస్తావించకూడదన్న నియమం ఒకటి ఉంటుందట..'పూరం' శైలి చారిత్రక వివరాలతో కూడినది గనుక అందులో రాజులూ,కళాకారులూ మొదలైన వారి పేర్లు ప్రస్తావించవచ్చు..ఈ కారణంగా ఈ రచనలో స్త్రీ పురుషుల పేర్లు సర్వనామాల రూపంలో 'హి'/ 'షి' (He, She, Her Friend, Her Foster Mother, Passers-By, Concubine) అని వాడతారు..ఉదాహరణకు ఈ కవితను చూడండి : 

What She Said :
The still drone of the time
past midnight.
All words put out,
men are sunk into the sweetness
of sleep. Even the far-flung world
has put aside its rages
for sleep.

Only I
am awake.

 ఇక ఈ కవిత్వానికి ఉపయోగించిన వ్యాకరణం 'తోల్కాప్పియం' : శబ్దం (ఫోనోలజీ), పదాలు (సెమాంటిక్స్), అర్థం(మోర్ఫోలజీ) అనే మూడు అంశాల మిశ్రమ నిర్మాణంలో ఉంటుంది..నిజానికి ఈ రచనలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న వేర్వేరు కవులు రాసిన చిన్న చిన్న కవితల్ని కలిపి ఒకే కావ్యంగా తయారుచేశారు రామానుజన్..అంతేకాకుండా ఈ కవితల్ని పాఠకులు తమకు నచ్చిన క్రమంలో పేర్చుకుంటే ఒక పజిల్ లో ముక్కల్ని పేర్చినట్లు అనేక విభిన్నమైన నేరేటివ్స్ తయారవుతాయి.

ఐదు రకాల ప్రాకృతిక దృశ్యాలతో కూడిన భౌగోళికాంశాల కవితా నేపథ్యం ఈ కవిత్వంలో మరో ప్రత్యేకత..ఒక్కో లాండ్స్కేప్ కూ ఆహారం,దేవుళ్ళు,జంతువులు,పక్షులు,సంగీతం,వృత్తులు  వంటి కొన్ని స్వాభావికమైన అంశాలు ఉంటాయి..వీటిని ప్రేమలోని ఒక్కో దశనీ వర్ణించడానికి మెటఫోర్లుగా వాడడం వల్ల ఒక్కో దశలో ఒక్కో ఇమేజ్ తయారవుతుంది..వీటిని సింబాలిజంగా  ఉపయోగించడం వల్ల అడవి మల్లెలు,కురింజి పూలు,వసంత,గ్రీష్మ,వర్ష,శరద్ ,హేమంత,శిశిర ఋతువులన్నీ కలిగిన ఈ కవిత్వం జీవం తొణికిసలాడుతూ ఉంటుంది..ఉదాహరణకు ప్రేమికుల కలయికను కొండల్లోని కురింజి పూలతోనూ,ఎడబాటును ఎడారితోనూ, విరహంతో సహనంగా వేచి చూడడాన్ని దట్టమైన అడవులతోనూ, భావావేశాలు ఎగసిపడుతుండగా ఆతృతతో వేచి చూడడాన్ని సముద్రతీరంతోనూ వర్ణిస్తారు..ప్రేమలో నమ్మకద్రోహాన్నీ ,తద్వారా పెల్లుబికిన క్రోధాన్నీ వర్ణించడానికి మతవ్యవస్థ వ్రేళ్ళూనుకున్న కట్టుబాట్లతో కూడిన ప్రాంతాన్ని ఎన్నుకున్నారు..ఏదేమైనా ఈ కవిత్వం భాష తమిళం అని అనిపించదు..చారిత్రక అంశాలు లేకపోవడం,ప్రాకృతిక అంశాలు జోడించడం వల్ల 'అకం' విశ్వజనీనమైన కవిత్వంగా అగుపిస్తుంది.

ఆమె-అతడు ప్రేమించుకుంటారు..ఇచ్చినమాట తప్పి అతడు మగవాడి సహజ స్వభావంతో ప్రపంచంలో తన స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా (సంపద కోసమో,కీర్తి కోసమో,యుద్ధానికో అనే స్పష్టత ఉండదు) ఆమెను వదిలి వెళ్ళిపోతాడు..

అతడి ఎడబాటులో ఆమె ఈ విధంగా అంటుంది. 

What She Said :
Friend,
with no regard for youth
in search of riches he went
no one knows where,
and he will not come back.

మరోచోట అతడు ఆమెను ఈ విధంగా తలుచుకుంటాడు.

What He Said:

O did I not think of you?
and thinking of you,
did I not think and think again of you?
and even as I thought of you
was I not baffled
by the world’s demands
that held me to my work?

O love, did I not think of you,
and think of you till I wished
I were here to sate my passion
till this flood of desire
that once wet the branch of the tall tree
would thin
till I can bend and scoop a drink of water
with my hands ?

వర్షాకాలం-శరదృతువులను మేళవించి ఆమె విరహాన్ని  వర్ణించిన మరో కవిత :

What She Said : 
The rains, already old,
have brought new leaf upon the fields.
The grass spears are trimmed and blunted
by the deer.
The jasmine creeper is showing its buds
through their delicate calyx 
like the laugh of a wildcat. 
In jasmine country, it is evening 
for the hovering bees,
but look, he hasn’t come back.
He left me and went in search
of wealth.

No comments:

Post a Comment