[ మార్గరెట్ ఆట్వుడ్ కి నోబెల్ ఇవ్వలేదన్న అక్కసుతో చాలా బయాస్డ్ గా రాసిన వ్యాసం. "సాహితీ విలువల" విషయంలో చూసీ చూడనట్లు పోవాలి అనుకునేవాళ్ళ కోసమూ, ఉదారత , నిష్పక్షపాతం, సహానుభూతి etc etc లాంటివి ఆశించేవారి కోసమూ కాదు.]
Image Courtesy Google |
జనాదరణ పొందిన సాహిత్యానికీ ,కొన్ని నిర్ధిష్టమైన సాహితీ కొలమానాలకు లోబడిన సాహిత్యానికీ అనేక అంతరాలుంటాయి. ఒకప్పుడు ఏదైనా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చిన రచన అంటే, ఆ రచనను ఎంపిక చేసే విషయంలో న్యాయనిర్ణేతలు కూడా ఎటువంటి సామాజిక,రాజకీయ వత్తిడులకు లోబడకుండా, ఆ రంగంలో పూర్తి సాధికారత కలిగినవాళ్ళై ఉండేవారు. నేడు ఆ డైనమిక్స్ మారాయి.
సాహిత్యంతో ఎంత మాత్రమూ సంబంధంలేని పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన వ్యక్తుల కనుసన్నల్లో మెలుగుతూ నేటి "సాహితీ విలువలు" రూపురేఖలు మార్చుకుంటున్నాయి. సాహిత్యంలో అభిరుచి లేని వాళ్ళు పుస్తకాల షాపు పెట్టడం అంత మంచి ఆలోచన కాదు, ఇంకాస్త సరళంగా చెప్పాలంటే, వండేవాడికి తినడం ఇష్టం అయితే వంట వేరే విధంగా కుదురుతుందన్నమాట. ఇదే రూలు పెట్టుబడిదారీ వ్యవస్థకు "కళాపోషణ" విషయంలో కూడా వర్తిస్తుంది, వర్తించాలి. కళాపోషణకు ఉండాల్సిన అర్హతలు కళల పట్ల ఇష్టమూ, అంతకుమించి గౌరవమూను. కానీ ఇప్పటి పెట్టుబడిదారీ విధానం పాపులారిటీకీ, మార్కెటింగ్ విలువలకూ, అమ్మకాలకూ ఇచ్చే ప్రాధాన్యత "జనాదరణ" పరిథులకు లోబడని మంచి సాహిత్యానికి ఇవ్వడం లేదనిపిస్తుంది. నేటి సాహితీ పురస్కారాలు అనేక పైరవీలను దాటుకుని, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రశ్నించకుండా, వారు ఆడిస్తున్నట్లల్లా ఆడే లేదా వారికి కొమ్ముకాసే రచనలకూ, రచయితలకూ మాత్రమే పరిమితమవుతున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను సవాలు చేసేదేదైనా ఈ కాలంలో మంచి సాహిత్యం కాదు. అటువంటి సాహిత్యాన్ని విస్మరించడం వాళ్ళ మనుగడకు అవసరం. నిజానికి ఇది కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ రోజుల్లో "పాపులర్ ఒపీనియన్" ని ప్రశ్నించే ఏ సాహిత్యానికైనా ఉనికి లేకుండా చెయ్యడమనేది తన ఉనికిని కాపాడుకోడానికి "మెయిన్ స్ట్రీమ్" సమాజానికీ, సాహిత్యానికీ, సంస్కృతికీ కూడా చాలా అవసరమైన విషయం. ఒకప్పుడు సాహితీ పురస్కారాలు కొంతవరకూ వీటన్నిటికీ అతీతంగా ఉండేవి (????) . నేటి తీరు పూర్తిగా వేరు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కారణంగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న కళారంగానికి పరోక్షంగానైనా పెట్టుబడిదారీ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది నిర్వివాదాంశం అనే విషయాన్ని ప్రక్కన పెడితే, కళారంగంలో క్రియాశీలకంగా వ్యవహరించే విషయాల్లో సైతం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రత్యక్షంగా వేలుపెట్టడం హర్షణీయం కాదు. మోనోపొలీ రాజ్యమేలుతున్న అన్ని రంగాల్లోనూ, కనీసం మనిషిని మిగతా జీవులతో వేరుచేసే కళారంగాన్ని మినహాయిస్తే బాగుండునని అనుకోని సందర్భమూ లేదు.
ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత అన్నే ఎర్నాక్స్ పుస్తకాలు రెండేళ్ళ క్రితం చదివాను, వాటిల్లో "The Years", "I Remain in Darkness" రెండూ తీవ్రంగా నిరాశచెంది సగంలో వదిలేసినవే. జాడీ స్మిత్ , అడిచే , మోష్ఫెగ్ లాంటి వాళ్ళను తలపించే ఎర్నాక్స్ శైలి చాలా సాధారణమైనదిగా ( flat narration ) అంతకుమించి ఎటువంటి ప్రత్యేకతా లేనిదిగా అనిపించింది. వాస్తవికతతో కూడిన ఒక మెమోయర్ గానీ, జర్నల్ గానీ రాయడానికీ, సృజనాత్మకతతో మెదడుకు పదును పెడుతూ కథ చెప్పడానికీ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎర్నాక్స్ నైపుణ్యం మొదటి దానిలో కనబడుతుంది (నిజానికి దానికి మాత్రమే పరిమితమవుతుంది ). ఇటువంటి సాధారణ రచనలు చెయ్యడం కంటే సైన్స్ ఫిక్షన్ వంటి క్లిష్టమైన జానర్స్లో రచనలు చెయ్యడం కత్తిమీద సాములాంటిది. కానీ నోబెల్ పానెల్ సో కాల్డ్ "సాహితీ విలువల" కొలమానాల్లో అటువంటి సైన్స్ ఫిక్షన్ ను ఇన్నేళ్ళుగా విస్మరిస్తూ వస్తుండడం చాలా నిరాశ కలిగించే విషయం. ఉర్సులా లెగైన్ వంటి రచయిత్రులు మరణానంతరమే ఈ మాత్రం గుర్తింపుకైనా (?) నోచుకున్నారు. ఇక ప్రస్తుతం జీవించి లేని వాళ్ళను గురించి వదిలేస్తే సమకాలీన రచయిత్రులలో కెనెడియన్ రచయిత్రి మార్గరెట్ ఆట్వుడ్ వంటి వారిని ప్రక్కన పెట్టి ఎర్నాక్స్ కు పట్టంకట్టడం మాత్రం అస్సలు జీర్ణించుకోలేని విషయం.
ఎర్నాక్స్ ప్రతిభను తక్కువ చెయ్యడమో, లేదా పూర్తిగా తీసిపారెయ్యడమో ఈ వ్యాసం ఉద్దేశ్యం కానప్పటికీ, ఆవిడ నోబెల్ పురస్కారానికి అర్హురాలేనా అన్నది మాత్రం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ మంచి రచయితా, లేదా చెడ్డ రచయితా అనే ప్రశ్న కంటే ఎర్నాక్స్ వంటి జనాదరణ పొందిన ఒక సాధారణ రచయిత్రికి నోబెల్ పురస్కారం కట్టబెట్టడం పట్ల ఆశ్చర్యంగానే అనిపించింది. నిజానికి ఇలా ఆశ్చర్యపోవడమూ కొత్తేమీ కాదు. పాల్ బియట్టి "ది సెల్ ఔట్ " కి బుకర్ ప్రైజు వచ్చినప్పుడూ , ఆండ్రూ సీన్ గ్రీర్ "లెస్" కి పులిట్జర్ వచ్చినప్పుడూ, చాలా ఓవర్ రేటెడ్ రచయిత హరుకి మురాకమీకి ఫ్రాంజ్ కాఫ్కా ప్రైజ్ వచ్చినప్పుడూ, పాట్రిక్ మొదియానోకి నోబెల్ వచ్చినప్పుడూ, సిల్వినా ఒకంపో, మాక్సిమ్ ఒసిపోవ్ వంటివారి కథల్ని ఆకాశానికెత్తుతూ NYRB క్లాసిక్స్ లో చేర్చడం చూసినప్పుడూ (సిల్వినా ఒకంపో కేవలం బోర్హెస్ కు ఆప్తురాలూ, Adolfo Bioy Casares కు సతీమణీ కావడం వల్లే ఆమెకా పేరు వచ్చిందన్నది ఆవిడ ఓవర్ రేటెడ్ కథలు చదివిన వాళ్ళెవరైనా మారుమాట్లాడకుండా ఒప్పుకునే విషయం) .... ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటా బయటా కూడా సాహితీ పురస్కారాల విషయంలో నోరు వెళ్ళబెట్టిన సందర్భాలు కోకొల్లలు.
ఏదేమైనా ఇటువంటి పురస్కారాలూ, సన్మానాలూ, సత్కారాలూ తాత్కాలికంగా రచయితలను లైమ్ లైట్ లోకి బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టినా, వీటన్నిటికీ అతీతంగా కేవలం తమ టాలెంట్ తో పాఠకుల మనసుల్లో శాశ్వతంగా తిష్ఠవేసుకుని కూర్చునే రచయితలు కొందరుంటారు. ఆ కుర్చీలు కదిలించడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. అన్నట్లు హరుకీ మురాకమీ రచనల్ని అబిడ్స్ లో కేజీల లెక్కన అమ్మేస్తున్నారు. ఎప్పుడో ఒకటీ రెండూ ఆయన పరమ డిప్రెస్సింగ్ నవలలు తప్ప మిగిలినవి చదవలేదు గనుక చాలా చవగ్గా వస్తున్నాయని నేను కూడా ఒక కిలో కొని తెచ్చుకున్నాను. బహుశా మరో ఏడాదికల్లా ఎర్నాక్స్ పుస్తకాలు కూడా అదే చోట దొరుకుతాయి. అప్పుడు కొనుక్కుని చదువుదామనుకుంటున్నాను.
No comments:
Post a Comment