Tuesday, September 27, 2022

In the Margins: On the Pleasures of Reading and Writing - Elena Ferrante

ఎవరైనా రచయితల్ని రచనా వ్యాసంగం గురించి కదిపినప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చెయ్యడం చూస్తూ ఉంటాం. వారెంత బాగా  రాసినా రచనలో ఇంకా ఏదో లోపం ఉన్నట్లూ, పూర్తిగా తన ఆధీనంలో లేని పద్ధతిలో రచన రూపొందినట్లూ భావిస్తూ ఉంటారు.

"ఆ కథ తనకు తానే చెప్పుకుంది."

"ఆ పదాలు అలా అలవోకగా ఆ వాక్యాల్లో ఇమిడిపోయాయి."

"ఆ పాత్ర తనకు తానుగా రూపొందింది."

ఇలా ఆ కథ తాను రాయనట్లూ, తనలో ఉన్న మరో మనిషెవరో రాసినట్లూ అనడం తరచూ వింటూ ఉంటాం. ఒక రచన ప్రాణంపోసుకునే క్రమంలో తనకు ఎదురైన అనుభవాల్నీ, సంక్లిష్టతల్నీ 'In the Margins' అనే రచనలో చెప్పుకొచ్చారు 'ది మిస్టీరియస్' ఎలెనా ఫెరాంటే. ఈ రచనను ఆన్ గోల్డ్స్టయిన్ ఆంగ్లంలోకి అనువదించారు. 

Image Courtesy Google

"ఓనమాలు నేర్చుకునే తొలినాళ్ళలో ఎలిమెంటరీ పాఠశాలల్లో రాయడం నేర్పించేటప్పుడు నోటు పుస్తకాల్లో తెల్లకాగితాన్ని నిర్వచిస్తూ నల్లని అడ్డగీతలతోబాటుగా కుడివైపూ, ఎడమవైపూ రెండు ఎర్రని మార్జిన్స్ కూడా ఉండడం గుర్తుండే ఉంటుంది. ఆ గీతల్లో ఎరుపు రంగు వాటి పరిధిని దాటి రాస్తే శిక్షపడుతుందని విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లుంటుంది. ఒక స్థాయి వరకూ ఆ పరిధుల్ని గౌరవించినా రచనలో మెళకువలు నేర్చుకునే కొద్దీ ఆ ఎర్రని సరిహద్దుల్ని దాటకుండా రాయడం వీలవుతుందా ? " 

అని పాఠకుల్ని ప్రశ్నిస్తారు రచయిత్రి ఎలెనా ఫెరాంటే. ఇక్కడ ఆ ఎర్రని గీతల్ని రచయిత్రి మెటఫోర్లుగా వాడారని ప్రత్యేకం చెప్పనక్కర్లేదనుకుంటా ! ఈ ప్రశ్నకు సమాధానం కూడా పుస్తకంలో మరికొన్ని పేజీల తరువాత మెక్సికన్ కవి María Guerra  కవితను ఉదహరిస్తూ ఆమే చెబుతారు.

I lost a poem.
Already written
And ready on the page
To put in the form of a book
I looked in vain.
It was a poem
With a vocation for wind.

This is precisely what happens to our efforts to write: the words are ready para formar el libro, says María Guerra, and yet they won’t stay in the form, they overflow the margins, get lost in the wind.

ఇటాలో స్వెవో గొప్ప రచనల్లో ఒకటిగా పరిగణించే Zeno’s Conscience లో కథానాయకుడు 'జీనో కోసినీ' రాయడం గురించి ఇలా రాస్తారు.

"తినడం పూర్తయ్యాకా సౌకర్యవంతంగా నా మెత్తని కుర్చీలో కూర్చుని నా చేత్తో  పెన్సిలూ,చిన్న పేపరూ పట్టుకున్నాను. ఏ అక్కరకూ ఆస్కారంలేని మనసుతో నా కనుబొమ్మలు ముడివీడిపోయాయి. 'నా' నుండి వేరుపడుతూ పైకీ క్రిందకీ ఎగసిపడుతున్న నా ఆలోచనలకు నేను ప్రత్యక్ష సాక్షిగా మారాను. ఇటువంటి ఒక స్వతఃసిద్ధమైన చర్యను చూస్తున్నప్పుడు, ఆ ఆలోచనలన్నీ కూడా నావేననీ, వాటిని గుర్తుపట్టి చేజారిపోకుండా పట్టుకుని కాగితం మీద పెట్టాలనీ నాకు నేను గుర్తుచేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మెల్లగా నా భృకుటి ముడిపడుతోంది, ఈ క్షణంలో అనేక అక్షరాలను కలుపుకుంటూ పుట్టే ప్రతీ పదమూ గతాన్ని తుడిచేస్తూ వర్తమానాన్ని పూర్తి వెలుగులో స్పష్టంగా చూపిస్తుంది."

రచయిత రాసిన విషయాల్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోవడం పాఠకులకు అసాధ్యం అనే విషయం సుస్పష్టం. కాగా రచయితకైనా తనలో పెల్లుబికే ఆలోచనలను యధాతథంగా వ్యక్తీకరించడం సాధ్యమవుతుందా అనే కోణంలో విశ్లేషిస్తూ, రాయడంలో తనకున్న సంకోచాలను పటాపంచలు చేసిన Denis Diderot రచన Jacques the Fatalist and His Master లో ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటారు ఫెరాంటే : 

"ఉన్నదున్నట్లు విషయాన్ని చెప్పు", అని యజమాని జాక్వెస్ ని ఆజ్ఞాపిస్తాడు. దానికి జాక్వెస్ ఇలా సమాధానమిస్తాడు : "అది సులభం కాదు. మనిషంటే అతడికి మాత్రమే ప్రత్యేకమైన వ్యక్తిత్వం, అభిరుచులూ,ఆసక్తులూ,ఉద్వేగాలూ అన్నీ కలిసి ఉంటాయి కదా ? వాటిని అనుసరించి అతను వాస్తవాన్ని కాస్తో కూస్తో ఏమార్చి, దాన్నొక అతిశయోక్తిగానో, లేదా తక్కువ చేసో చెప్పే అవకాశం ఉంటుంది. కానీ మీరు "ఉన్నదున్నట్లు చెప్పు" అంటున్నారు ! ఇంత పెద్ద నగరంలో అది రోజుకి కనీసం రెండుసార్లు కూడా జరిగే అవకాశం ఉండదేమో !  ఇకపోతే శ్రోత చెప్పేవాడికంటే గొప్ప అర్హతలున్నవాడా ? కాదు కదా ! అందుకే ఇంత పెద్ద నగరంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటల్ని వినేవాడు ఉన్నదున్నట్లుగా అర్థంచేసుకునే అవకాశం హీనపక్షం రోజుకి రెండు సార్లు కూడా జరగదు అంటున్నాను." అంటాడు.

జాక్వెస్ మాటలు విన్న యజమాని చిరాగ్గా “నువ్వొకడివి జాక్వెస్ !! ఈ సిద్ధాంతాలు అన్నీ పట్టుకుని వేళ్ళాడితే అందరూ మాట్లాడడం, వినడం ఇవన్నీ మొత్తంగా మానెయ్యాల్సొస్తుంది. అప్పుడు పరిస్థితి "ఏమీ మాట్లాడవద్దు, ఏమీ వినవద్దు, ఏమీ నమ్మవద్దు" అన్నట్లు తయారవుతుంది. నీకు తోచింది నువ్వు చెప్పు, నేను నాకు చేతనైన రీతిలో విని అర్థంచేసుకుంటాను." అంటాడు. 

ఈ కథ తాను రచనకు పూర్తి స్థాయి న్యాయం చెయ్యలేననే భ్రమల్ని తొలగించి పూర్తి స్థాయి రచయిత్రిగా మారడానికి ఎంతో ప్రోత్సాహకరంగా నిలిచిందంటారు ఫెరాంటే.

I had read a lot of books on these subjects, including pointlessly complex passages, and here, plainly expressed, I found some consolation. If every novel I wrote, hefty or slim, turned out to be far from my aspirations—I had boundless ambitions—maybe the reason was not only my incapacity. Telling the real, Jacques emphasized, is constitutionally difficult; you have to deal with the fact that the teller is always a distorting mirror. So? Better to give up? No, the master answers, you don’t have to throw everything away: it’s arduous to speak truthfully, but you do your best.

ఈ పుస్తకంలో రాసే వాళ్ళందరూ చదవడం ఎంత ముఖ్యమో చెబుతూ, చదువరిగా ఏదో పైపైన చదివెయ్యకుండా ఆమె తన రచనల్లో తాను చదివిన విషయాలను ఎలా అన్వయించుకున్నారో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. జాక్వెస్ కథ ప్రేరణగా, రాయడం విషయంలో ఎటువంటి  దిశానిర్దేశమూ లేకుండా ఒక రచయిత్రిగా తాను ఏర్పరుచుకున్న శైలిని తాను సృష్టించిన ముగ్గురు నాయికల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారు ఫెరాంటే.

మొదటి తరహా రచన Troubling Love లో ప్రధాన పాత్ర డెలియా తన భావావేశాలపై పూర్తిగా అదుపు కలిగిన వ్యక్తి. నాగరిక స్త్రీగా, పట్టుదల కలిగిన మనిషిగా కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి తన కథ పరిథిలో సాధికారికంగా వ్యవహరిస్తుంది. కానీ ఆ నియమాలన్నీ ఆ కథ తాలూకు జానర్ తో క్రమేపీ పటాపంచలైపోగా పుట్టిందే ఆమె రెండో నవల 'The Days of Abandonment'. ఈ కథలో ఓల్గా ఒక నాగరికమైన స్త్రీగా, తల్లిగా,భార్యగా కూలిపోతున్న సంసారాన్ని నిలబెట్టుకునే క్రమంలో అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అయినప్పటికీ ఒక దశలో తన మనసు మీద అదుపు కోల్పోతుంది. ఈ వివాహ వ్వవస్థ అనే జానర్ మెల్లిగా ఆమె కళ్ళముందే పేకమేడల్లా కూలిపోగా మరో నవల ఉద్భవిస్తుంది, అదే 'The Lost Daughter'. ఇందులో విడాకులు తీసుకున్న లెడా యుక్తవయస్సులో ఉన్న కూతుళ్ళతో మరో కథలోని  నియమాలకు లోబడి వ్యవహరిస్తుంది.

In these books I muted the idea that I had to describe an “out there” arranged in a narrative order and, without letting it show, had the duty to record it on the great scroll of realistic literature. Instead, I dipped into the warehouse of literary expression, taking out what I needed—different genres, different techniques, effects, and, why not, unpleasant effects—without indicating boundaries between high and low. I moved on not to a narrative voice—no voice, no imitation of voices—but to a female first person who is all writing and, writing, tells how, in certain circumstances, deviations, unexpected jolts, erratic leaps occurred, which had been able to upset the solidity of the chessboard on which she was castled.

డెలియా, ఓల్గా, లెడా : ఈ ముగ్గురు స్త్రీలలో ఉమ్మడిగా ఉన్న అంశం ఏమిటంటే, వాళ్ళు తమ జీవితంలో చేదు అనుభవాల దృష్ట్యా ఎవరినీ నమ్మరు, తమ శరీరంలో తాము ఖైదీలుగా ఉంటారు. వీళ్ళకి బంధువులూ, స్నేహితులు కూడా ఉండరు. గతంలో ఇతరులతో మానవ సంబంధాలు ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఘోరవైఫల్యాన్ని చవిచూస్తారు, అందుకే ఒంటరిగా మిగిలిపోతారు. వాళ్ళకి తమపట్ల కూడా నమ్మకం ఉండదు. అలాగని మానసికంగా భర్తా,ప్రేమికులూ,పిల్లలపై కూడా ఆధారపడరు. వాళ్ళ రూపురేఖలెలా ఉంటాయో కూడా పాఠకులకి తెలీదు. ఈ కారణంగా వాళ్ళ కథల్లో మూలవస్తువు వాళ్ళే. వాళ్ళను గురించి వర్ణించి చెప్పడానికి ఈ కథల్లో వేరే పాత్రలు ఉండవు. కథంతా వారి గళంలోనుండే వింటాము.

Besides, they seem to have come so close to the facts of their story that they don’t have a view of the whole, don’t truly know the meaning of what they say. I wanted them like that. Writing, I rejected conventional distancing. Where they eliminated the distance from their wounds, I eliminated the distance from their suffering. And I confused myself, the author, with the version they gave of the story, and with their isolated situation, so that even I who was writing avoided the role of the other, the external, she who witnesses what really happened.

In Troubling Love and in The Days of Abandonment this self-imprisonment was a conscious aesthetic choice.

That is, this writing is the always random result of how Delia, Olga, and Leda are recorded in the registry office of fictions, and of how I, the author—a fiction forever incomplete, molded by years and years of reading and the desire to write—invent and disrupt the writing that has recorded them. I am, I would say, their autobiography as they are mine.

ఇందులో ఆటోబయోగ్రఫీ / మెమోయిర్ వంటివి రాయడం గురించి రాస్తూ రచయిత్రిగా గెర్ట్రూడ్ స్టెయిన్ శైలిని గురించి ఫెరాంటే రాసిన కొన్ని విషయాలు చాలా ఆసక్తి కలిగించడంతోబాటు నవ్వు కూడా తెప్పిస్తాయి. అవి  చదివాకా చాలాకాలం నుండీ చదవాలనుకుంటున్న 'The Autobiography of Alice B. Toklas' పుస్తకం వెంటనే చదవాలనిపించింది. గెర్ట్రూడ్ ఆ రచనలో అలిస్ పాత్ర వెనక దాక్కుంటూ తన గురించి తాను రాసుకున్న సోత్కర్షను నిజంగా చదివి తీరాల్సిందే ! :) ఏదేమైనా రచయితలు 'బయటపడిపోవడం' ఇష్టం లేనప్పుడూ, సామజిక జడ్జిమెంట్లకు దూరంగా ఉండాలనుకున్నప్పుడూ  రచనల్లో పాత్రలను తెరచాటు చేసుకుని తమ గురించి తాము ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  చెప్పుకోవడంలో తప్పు లేదని కూడా అంటారు ఫెరాంటే. ఆమె  ఉదహరించిన ఈ వాక్యాలు స్వయంగా గెర్ట్రూడ్ కాల్పనిక సాహిత్యమని చెప్పుకున్న (పార్ట్లీ ఆటోబయోగ్రఫీ) రచనలో రాసుకున్నవి : 

A famous passage in which Alice writes about meeting Gertrude for the first time: "I was impressed by the coral brooch she wore and by her voice. I may say that only three times in my life have I met a genius and each time a bell within me rang and I was not mistaken, and I may say in each case it was before there was any general recognition of the quality of genius in them. The three geniuses of whom I wish to speak are Gertrude Stein, Pablo Picasso and Alfred Whitehead."

ఆలిస్ (అంటే గెర్ట్రూడ్) కలవాలనుకున్న ముగ్గురు జీనియస్లలో గెర్ట్రూడ్ స్టెయిన్ ఒకరన్నమాట :)) ఏదేమైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రచనలో ఒక పాఠకురాలిగా, రచయిత్రిగా ఎలెనా ఫెరాంటే మనతో పంచుకున్న అనుభవాలెన్నో. ఇది చదవడం వల్ల రాయడం ఎలా అనే అంశంతోబాటు ఒక రచనను ఎలా చదవాలో కూడా తెలుస్తుంది. రచయితలూ, పాఠకులూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. హ్యాపీ రీడింగ్ :) 

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

This is what upends the traditional relations between invented story, autobiographical truth, and biographical truth, making Stein’s book a great lesson for the “I” who wants to write, surely a more stimulating lesson, today, than what we might get from Hemingway’s books. Ernest’s mistake is to succeed by prudently respecting the rules of an old, well-known game; Gertrude’s virtue is to succeed by sticking to the old, well-known game but in order to disrupt it and bend it to her purposes.

In Notes from Underground, Dostoyevsky has his terrible protagonist say:

We’ve become so estranged that at times we feel some kind of revulsion for genuine “real life,” and therefore we can’t bear to be reminded of it. Why, we’ve reached a point where we almost regard “real life” as hard work, as a job, and we’ve all agreed in private that it’s really better in books.

Writing is, rather, entering an immense cemetery where every tomb is waiting to be profaned. Writing is getting comfortable with everything that has already been written—great literature and commercial literature, if useful, the novel-essay and the screenplay—and in turn becoming, within the limits of one’s own dizzying, crowded individuality, something written. Writing is seizing everything that has already been written and gradually learning to spend that enormous fortune.

Friday, September 23, 2022

Six Characters in Search of an Author - Luigi Pirandello

ఇటాలియన్ రచయిత, నోబెల్ గ్రహీతా లూగీ పిరాండెల్లో రాసిన అనేక నాటకాల్లో 'Six Characters in Search of an Author' అనే నాటకాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సంప్రదాయతకు సవాలు విసురుతూ ఈ నాటకంలో కనిపించే అసంబద్ధమైన శైలే దానికి కారణం. సహజంగా కథల్లో పాత్రలు రచయిత అధీనంలో ఉంటాయి, అవి రచయిత చేతిలో కీలుబొమ్మల్లా నుంచోమంటే నుంచుంటాయి, కూర్చోమంటే కూర్చుంటాయి. కానీ ఈ నాటకంలో పాత్రలు అలాంటి సాదాసీదా పాత్రలు కాదు. స్వతంత్ర భావాలు కలిగిన ఆ పాత్రలు తమకు జీవంపోయగల రచయితను వెతుక్కుంటూ వెడతాయి. ఒక రచయిత తమ కథకు ముగింపునివ్వకుండా మధ్యలోనే వదిలేశారంటూ తమ పాత్రలను తుదకంటా  పోషించే అవకాశం ఇమ్మని ఈ కథలో ఆరు పాత్రలూ ఒక నాటక సంఘానికి వెళ్తాయి. ఇక అక్కడి నుంచీ మూడు భాగాలుగా రాసిన ఈ నాటకం మొదలవుతుంది. ఆ నాటకసంఘ నిర్వాహకుడు వాళ్ళను కథ చెప్పమంటూ తన దగ్గరున్న నటులతో నాటకాన్ని రిహార్సల్ చేయించడం మొదలుపెడతాడు. ఆ ఆరుగురూ తమ కథను ఉన్నదున్నట్లుగా తాము మాత్రమే చెప్పగలమనీ, అది వాళ్ళ raison d'être అంటూ తమ పాత్రలను యధాతథంగా తామే పోషించగలమనీ నిర్వాహకుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోడు.

Image Courtesy Google

ఇక అక్కడినుండీ కథ ముదిరి పాకానపడుతుంది. వాళ్ళ వాస్తవం వేదిక మీదకొచ్చేసరికి నటుల మొహమ్మీది మేకప్ రంగుల్లో కలిసిపోయి పూర్తి సత్యాన్ని కోల్పోయి అర్థసత్యంగా మిగులుతుంది. దీనిపట్ల ఆ పాత్రలన్నీ తీవ్రమైన అసహనాన్ని వెళ్ళగక్కుతాయి. ఒకరినొకరు నిందించుకుంటూ తమ పాత్రకు న్యాయం జరగట్లేదని వాపోతాయి. ఆ నాటకసంఘ నిర్వాహకుడు కథను జనరంజకంగా మలిచి, నాటకాన్ని రక్తికట్టించే విధంగా వాళ్ళందర్నీ ఒక తాటిపైకి తేలేక తలపట్టుకుంటాడు. ఈ కథంతా మెటఫోర్ల మేళవింపుగా ఉంటుంది, మీ పఠనానుభవాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేదు కాబట్టి నేను కథ జోలికి వెళ్ళదల్చుకోలేదు. ఏకకాలంలో మనిషి వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ నిరంతరం రూపాంతరం చెందే వ్యక్తిత్వ వైరుధ్యాలనూ, అస్తిత్వవాదాన్నీ సరళమైన సంభాషణల్లో చర్చిస్తూ పిరాండెల్లో రాసిన నాటకం 'Six Characters in Search of an Author' వాస్తవానికీ-భ్రమకీ మధ్య ఉన్న అంతరాలను గుర్తించే దిశగా పాఠకుల సృజనాత్మకతకు పదునుపెడుతుంది. 

నిర్వాహకుడికీ, సవతి కూతురుకీ మధ్య జరిగిన ఒక సంభాషణలో "సత్యం" వాస్తవంలో ఉన్నంత యదార్థంగా సాహిత్యంలోనో, మరో కళలోనో ఉండే అవకాశం లేదనే విషయాన్ని 'రంగస్థలాన్ని' మెటఫోర్ గా తీసుకుని రెండే వాక్యాల్లో వర్ణించిన తీరు "ఆహా !" అనిపించకమానదు. 

సవతి కూతురు : నాకు "నిజం" కావాలి . "నిజం". 

నిర్వాహకుడు : నేను కాదనను,  నీ రంపపుకోత నాకు అర్థమవుతోంది. కానీ ఇదంతా రంగస్థలం మీద పనికిరాదు. "నిజం" అక్కడ చెల్లుబాటవ్వదు.

ఇటువంటిదే మరో సంభాషణ,

సవతి కూతురు : కానీ అది "నిజం".

నిర్వాహకుడు : అయితే ఏంటమ్మాయ్ ! నటించడం మన వ్యాపారం. ఇక్కడ "సత్యం" ఒక స్థాయి వరకే అమ్ముడుపోతుంది. 

కాస్త పరిశీలిస్తే పై సంభాషణను పాఠకులు వివిధ కోణాల్లో అన్వయించుకోవచ్చు. Oh chuck it! "Wonderful art!" Withdraw that, please ! అంటూ తమ ట్రేడ్ మీదే వ్యంగ్యోక్తులు విసురుకోడానికి ఎవరికైనా చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. అటువంటి ధైర్యం పుష్కలంగా ఉన్న రచయిత పిరాండెల్లో. ఈ రచన ద్వారా కార్యశీలతకు సుదూరమైన కళారంగంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపించడంలో ఆయన పూర్తిగా సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు. ఈ సంభాషణ దానికొక చక్కని ఉదాహరణ.

The Manager. A bit discursive this, you know!
The Son [contemptuously]. Literature! Literature!
The Father. Literature indeed! This is life, this is passion!
The Manager. It may be, but it won't act.
"అతి సర్వత్రా వర్జయేత్" అని పాఠకులకు గుర్తుచేస్తూ, హేతువాద, మేథోమథనాలు శృతిమించితే మనిషిలోని మృగాన్ని వెలుపలికి తీసుకొస్తాయని హెచ్చరిస్తాయి ఈ వాక్యాలు :
Oh, all these intellectual complications make me sick, disgust me -- all this philosophy that uncovers the beast in man, and then seeks to save him, excuse him . . . I can't stand it, sir. When a man seeks to "simplify" life bestially, throwing aside every relic of humanity, every chaste aspiration, every pure feeling, all sense of ideality, duty, modesty, shame . . . then nothing is more revolting and nauseous than a certain kind of remorse -- crocodiles' tears, that's what it is.
కథలో తండ్రి పాత్రకు అతడి అస్తిత్వపు పరిధులు గుర్తు చేస్తూ నిర్వాహకుడితో ఈ మాటలనిపిస్తారు : 

"The empty form of reason without the fullness of instinct, which is blind." -- You stand for reason, your wife is instinct. It's a mixing up of the parts, according to which you who act your own part become the puppet of yourself. Do you understand?"

Do you suppose that with all this egg-beating business you are on an ordinary stage? Get that out of your head. You represent the shell of the eggs you are beating!

అనేకమంది మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనేకానేకమైన  అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు పిరాండెల్లో. 

The Father :  But don't you see that the whole trouble lies here. In words, words. Each one of us has within him a whole world of things, each man of us his own special world. And how can we ever come to an understanding if I put in the words I utter the sense and value of things as I see them; while you who listen to me must inevitably translate them according to the conception of things each one of you has within himself. We think we understand each other, but we never really do.

చివరగా ఇదొక్కసారి చదివి ప్రక్కన పెట్టగలిగే పుస్తకం కాదు. చదివిన ప్రతిసారీ  ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ అనేక విధాలుగా కనిపించే మాయాదర్పణంలాంటిదీ నాటకం. మనకు నేడు వాస్తవంగా కనిపించే విషయం రేపు భ్రమగా తోచవచ్చు, నేడు భ్రమనుకున్నదే మరోరోజు వాస్తవంగా మారనూ వచ్చు. 'Change is only constant' అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనిషి తన వ్యక్తిత్వంలో పొరల్ని ఒక్కోటీ వలుచుకుంటూపోవడమే జీవితం అని గుర్తుచేస్తూ అస్తిత్వానికి ఒకే ఒక్క నిర్వచనం సాధ్యం కాదనీ, నిరంతరం రూపాంతరం చెందే మనిషి వ్యక్తిత్వానికి అనంతమైన నిర్వచనాలుంటాయని ఈ నాటకం ద్వారా నిరూపిస్తారు పిరాండెల్లో. ఆయన రచనల్లో అన్నిటికంటే ముందు చదవవలసిన ఈ పుస్తకాన్ని నేను చాలా ఆలస్యంగా చదివాను. పిరాండెల్లోను మీరు పరిచయం చేసుకోవాలంటే నేను మొదట ఈ రచన చదవమంటాను. హ్యాపీ రీడింగ్. :) 

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

But every man knows what unconfessable things pass within the secrecy of his own heart. One gives way to the temptation, only to rise from it again, afterwards, with a great eagerness to re-establish one's dignity, as if it were a tombstone to place on the grave of one's shame, and a monument to hide and sign the memory of our weaknesses. Everybody's in the same case. Some folks haven't the courage to say certain things, that's all!

The Father. For the drama lies all in this -- in the conscience that I have, that each one of us has. We believe this conscience to be a single thing, but it is many-sided. There is one for this person, and another for that. Diverse consciences. So we have this illusion of being one person for all, of having a personality that is unique in all our acts. But it isn't true. We perceive this when, tragically perhaps, in something we do, we are as it were, suspended, caught up in the air on a kind of hook. Then we perceive that all of us was not in that act, and that it would be an atrocious injustice to judge us by that action alone, as if all our existence were summed up in that one deed.

The Father. But only in order to know if you, as you really are now, see yourself as you once were with all the illusions that were yours then, with all the things both inside and outside of you as they seemed to you -- as they were then indeed for you. Well, sir, if you think of all those illusions that mean nothing to you now, of all those things which don't even seem to you to exist any more, while once they were for you, don't you feel that -- I won't say these boards -- but the very earth under your feet is sinking away from you when you reflect that in the same way this you as you feel it today -- all this present reality of yours -- is fated to seem a mere illusion to you tomorrow?

The Father. I don't know to what author you may be alluding, but believe me I feel what I think; and I seem to be philosophizing only for those who do not think what they feel, because they blind themselves with their own sentiment. I know that for many people this self-blinding seems much more "human"; but the contrary is really true.

For man never reasons so much and becomes so introspective as when he suffers; since he is anxious to get at the cause of his sufferings, to learn who has produced them, and whether it is just or unjust that he should have to bear them. On the other hand, when he is happy, he takes his happiness as it comes and doesn't analyze it, just as if happiness were his right. The animals suffer without reasoning about their sufferings. But take the case of a man who suffers and begins to reason about it.

Drama is action, sir, action and not confounded philosophy.

Monday, September 19, 2022

Loveless Love - Luigi Pirandello

గ్రీసులోని డెల్ఫిలో ఒక పురాతన అపోలో దేవాలయంలో జ్ఞానసముపార్జన వైపు ప్రయాణించే మార్గాన్ని సూచించే తొలివాక్యంగా " Know thyself" అనే చెక్కడం ఉంటుందట. ఈ మూడు కథలకూ కలిపి అటువంటి ఒక శిలాశాసనం రాయాలంటే "Thou canst not know thyself " అని రాస్తే సరిగ్గా సరిపోతుందంటారు ఈ కథలను ఆంగ్లంలోకి అనువదించిన జె.జి.నికోల్స్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో. మనం ఏమిటో, మనకి కావాల్సింది ఏమిటో స్పష్టత లేనప్పుడు జీవితం నరకప్రాయమవుతుందని చెబుతాయీ కథలు. కానీ ఆ స్పష్టత సాధించడం అంత సులభమేం కాదంటారు మానవ మనస్తత్వాల లోతులు తెలిసిన రచయిత పిరాండెల్లో.

ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు "ఇట్స్ కాంప్లికేటెడ్" అనడం తరచూ వింటుంటాం. నిజానికి ప్రేమ చాలా సరళమైన అనుభవం. కానీ మనకు ప్రతీ చిన్న విషయాన్నీ సమస్యగా చేసుకోవడం పట్ల ఆసక్తి మెండు కాబట్టి దాన్ని కూడా సంక్లిష్టమైనదిగా చేసుకుంటామనిపిస్తుంది. నోబెల్ గ్రహీతా, ఇటాలియన్ రచయితా లూగీ పిరాండెల్లో 'లవ్ లెస్ లవ్' అనే రచనలో మూడు కథలూ ప్రేమ తాలూకూ సంక్లిష్టతల చుట్టూనే తిరుగుతాయి. నిజానికి అన్నీ సరళంగా సజావుగా జరిగిపోతే ఇక చెప్పుకోడానికి కథలేం ఉంటాయి !

Image Courtesy Google

19 శతాబ్దికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో సైకో ఎనలిటిక్ విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మానవ మస్తిష్కంలో రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలం దీనికొక కారణం  కావచ్చు. సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. అందువల్ల ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్ చదువుతున్నప్పుడు అందులో మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి  మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అబ్సర్డ్ గా ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్థుల్ని పోలి ఉంటాయి. అందువల్ల వారి ప్రవర్తనా సరళిలో లోపాలూ, పిచ్చితనం లాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదేమో.

మొదటి కథ 'ది వేవ్', తన ఇంట్లో అద్దెకున్న ప్రతీ అమ్మాయితోనూ ప్రేమలో పడే అలవాటున్న జూలియో అనే ఒక యువకుడి కథ. ఇక్కడ ఒక చిత్రమైన అంశం ఏమిటంటే, అతడు ఆ అమ్మాయి తిరిగి ప్రేమించగానే ఆమెకు దూరం జరిగి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. ఎటువంటి నిబద్ధతా లేకుండా తన మనసుని నేర్పుగా అదుపు చేసుకుంటూ ఇతరుల భావోద్వేగాలతో ఆడుకునే అలవాటున్న అతడు చివరకు తన ఆత్మన్యూనత, అసూయల కారణంగా అవే భావోద్వేగాల తూఫానులో చిక్కుకుని ఎలా సతమతమవుతాడో చెబుతుందీ కథ. జూలియో సంక్లిష్టమైన మనస్తత్వంపై  అగాథా కల్మషంలేని అమాయకత్వం పరోక్షంగా సాధించిన విజయానికి (?) ఈ కథ ఒక మంచి ఉదాహరణ. పిరాండెల్లో ఈ కథను రక్తికట్టించిన తీరు చాలా బావుంది.

రెండో కథ 'ది సిగ్నోరినా' కూడా దాదాపూ మొదటి కథలాంటిదే. ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్  ప్రకారం వేటాడడం (ఛేజ్), దేన్నైనా తన సొంతం చేసుకునేవరకూ వదిలిపెట్టకపోవడం మగవాడి నైజం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విధానం అతడి జీవితకాలమంతా కొనసాగుతుంది. దీనికి భిన్నంగా స్త్రీ తనకు కావల్సినది దొరికాక, కోరుకున్నది సొంతం చేసుకున్నాకా స్థిరత్వాన్ని ఆశిస్తుంది. ఈ ఫ్రాయిడ్ విశ్లేషణలను ఆధారంగా చేసుకుని అల్లిన కథలే పై రెండూను. తన సామజిక స్థాయికి తగిన స్త్రీ కాదని ప్రేమించిన జూలియాని తిరస్కరించిన లూసియో , ఆమెకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి వరుడుగా రావడం పట్ల తీవ్రమైన అసూయతో ఆ సంబంధం చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడి స్థానంలో ఆమెకు గంతకు తగ్గ బొంతలా సరిపోయే తన స్నేహితుడు మార్జానీని వివాహమాడమని ప్రతిపాదిస్తాడు. లూసియోను ఎంతో ప్రేమించినప్పటికీ అతడి నిజస్వరూపం తెలుసుకున్న తరువాత జూలియా తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది మిగతా కథ. ప్రేమించిన మనిషి తనకి దక్కకపోయినా ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడం నిజమైన ప్రేమికుల లక్షణం. కాగా తనకు దక్కనిదాని వినాశనాన్ని కోరుకోవడం కౄరత్వం. తన అసూయాద్వేషాలనూ, ఆధిపత్య ధోరణినీ ప్రేమగా భ్రమించే లూసియో కథ ఇది. ఇక మూడో కథ 'ఎ ఫ్రెండ్ టు ది వైవ్స్', పై రెంటికంటే కాస్త భిన్నంగా ఉన్న కథ. ఈ కథ చాలా అసహజంగా అనిపించడంతో నాకు పెద్దగా నచ్చలేదు.

పిరాండెల్లో రచనల్లో ఇది తొలిసారిగా ప్రచురితమైన కథల పుస్తకం అని రాశారు. నేను కొన్నేళ్ళ క్రితం 'టేల్స్ ఆఫ్ మ్యాడ్నెస్' , 'ఆయిల్ జార్ అండ్ అదర్ స్టోరీస్' అనే రెండు కథల సంపుటులు చదివి ఉన్నాను కాబట్టి ఆ కథల్లో కనిపించిన పదును తొలినాళ్ళలో రాసిన ఈ కథల్లో లేదనిపించింది. ఏదేమైనా ప్రేమికుల తగాదాలూ, విరహాలూ, పరితాపాలూ, అసూయలూ, అమాయకత్వాలూ, మాటల్లేని సంభాషణలూ చదివే సరదా ఉంటే ఈ కథలొకసారి చదవొచ్చు. హ్యాపీ రీడింగ్ :) 

Wednesday, September 7, 2022

Lady Macbeth of Mtsensk - Nikolai Leskov

ఆ మధ్య ఓటీటీ సినిమాల వ్రతంలో బిజీగా ఉండగా 'లేడీ మాక్బెత్' పేరుతో ఒక సినిమా కనిపించింది. పీరియడ్ డ్రామాలంటే అమితమైన ఇష్టం కాబట్టి ఆ ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించి చూడగా అది రష్యన్ రచయిత నీకొలాయ్ లెస్కోవ్ కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని తెలిసింది. నిజానికి లెస్కోవ్ రచనలతో నాకాట్టే పరిచయం లేదు. తీరా బుక్ అడాప్టేషన్ అని తెలిశాక పుస్తకం చదవకుండా సినిమా చూడడం మా బుక్ నెర్డ్ల ప్రపంచంలో ఘోరమైన పాపంగా పరిగణిస్తాం కాబట్టి ఆ కథేదో చదివేశాక సినిమా చూద్దామని ముందుగా ఆ కథ చదివాను, తరువాత సినిమా చూశాను. లెస్కోవ్ కథను మూలాంశంగా తీసుకోవడం మినహా మూలకథకూ, సినిమాకూ ఎక్కడా పోలికలు లేవు. బ్రిటిష్ అడాప్టేషన్ కాబట్టి రష్యన్ పేర్లైన 'కాటెలినా' ను 'క్యాథెరిన్', 'సెర్జీ' ని 'సెబాస్టియన్' వంటి బ్రిటిష్ పేర్లుగా మార్చారు.

Image Courtesy Google

షేక్స్పియర్ 'మాక్బెత్' ద్వారా ప్రభావితమై రాసిన ఈ కథకు ఫ్లాబర్ట్ 'మేడమ్ బోవరీ', టాల్స్టాయ్ 'అన్నా కరినిన'లతో కూడా కొన్ని పొంతనలు కనిపిస్తాయి. సంతానలేమీ, మారుమూల పల్లెలో ఖైదులాంటి ఇంట్లో నిస్సారమైన జీవితం వెరసి ఉన్నత వ్యాపారస్థుల కుటుంబానికి చెందిన స్త్రీ కాటెలినా వివాహేతర సంబంధానికి దారి తీస్తాయి. కాటెలినా భర్త జినోవీ వద్ద పనిచేసే సెర్జీతో ఆమె వివాహేతర సంబంధం ఒక పాపం మీద మరో పాపంగా మారి వరుస హత్యలకు కారణమవుతుంది. కామం, ధనవ్యామోహం, దురాశ, స్వార్థం ఇవన్నీ పెచ్చుమీరితే మనిషి ఏ స్థాయికి దిగజారతాడో చెప్పడానికి కాటెలిన్ పాత్ర ఒక మంచి ఉదాహరణ. కానీ టాల్స్టాయ్ అన్నాలో కనిపించే మానవీయ సహజ గుణాలైన నిస్సహాయత, బలహీనత,అపరాధభావం, పశ్చాత్తాపం లాంటివి లెస్కోవ్ కాటెలినాలో ఎంత వెతికినా కనిపించవు. అన్నాలో అణువణువునా కనిపించే 'గ్రేస్' లెస్కోవ్ కాటెలినాలో శూన్యం. తనకు కావలసింది సొంతం చేసుకునే క్రమంలో ఏ పని చెయ్యడానికైనా వెనుకాడని ఆమె వ్యక్తిత్వమే పూర్తి లోపభూయిష్టం. ఆమెను చూసి ఏ సందర్భంలోనూ "అయ్యో" అనిపించదు.

ఇది నాణానికి రెండో వైపు కథను పూర్తిగా వదిలేసి ఒక మగవాడి దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పిన కథ. కథలో rawness కనిపిస్తుంది. టాల్స్టాయ్ రచనల్లో స్త్రీలపట్ల కాసింత సహానుభూతీ, గౌరవం కనిపిస్తాయి. దీనికి కారణం ఆయన ఉన్నతవర్గానికి చెందిన సమాజంలో భాగమని కొందరు అభిప్రాయపడతారు. లెస్కోవ్ శైలి మన్ననలూ, మర్యాదలూ లేని ఆనాటి దిగువమధ్యతరగతి రష్యన్ సమాజాన్ని చూపించింది. ఆయన ప్రపంచంలో మానవీయ ప్రవృత్తిలో మోటుదనం, క్రూరత్వం యధాతథంగా చిత్రిక పట్టినట్లుంది. జన్మతః పేద కుటుంబం నుంచి వచ్చిన స్త్రీగా కాటెలినా లో ఎటువంటి నైతిక నియమాలకూ లోబడని తెగింపు, స్వార్థం కనిపిస్తాయి. ఆమెకు కావలసిందల్లా పాపభీతికి ఆస్కారం లేని అచ్చమైన 'అనుభవం' మాత్రమే. అన్నాలో కనిపించే ద్వైదీభావం కాటెలినాలో లేదు. నాకు ఆమెలోని "స్వచ్ఛమైన మృగతృష్ణ " అస్సలు నచ్చలేదు.

ఎటొచ్చీ షేక్స్పియర్ 'మాక్బెత్' ని అనేక వ్యక్తిత్వ వైరుధ్యాల నడుమ ప్రతినాయకుడిగా కంటే కథానాయకుడిగా చూడగలిగిన సమాజం కాటెలినాను అదే సమదృష్టితో ఎందుకు చూడలేదా అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. రాబర్ట్ చాండ్లెర్ అనువాదంలో NYRB క్లాసిక్స్ వారు ప్రచురించిన లెస్కోవ్ కథల సంపుటిలో ఈ కథ కూడా ఒకటి. ఈ చిన్నపాటి నవలిక లెస్కోవ్ శైలిని నాకు తొలిసారి పరిచయం చేసింది.

Saturday, September 3, 2022

Ade Nadi Iddaridee - Nanda Kishore

నిజానికంతా తెలిసిందే ; తెలిసిందే తెలియందై అంతో ఇంతో అనుభవాన్ని పంచుతుంది. ఎంతోకొంత అశాంతినీ దహిస్తుంది. 

ఇటువంటి వాక్యాలు చదివాక ఇక మాటలనవసరమనిపిస్తూ మౌనం చాలాసేపు వెన్నంటి ఉంది.


నేను హేతువాదిని, భావుకురాల్ని కాదు. ఈ కారణంగా నాలో భావోద్వేగాన్ని  కలిగించలేనిదేదీ నా దృష్టిలో కవిత్వం కాదు. నిజానికి "నా కోసం రాసిన కవిత్వం" కాదు అనడం సమంజసం. ఇప్పటివరకూ మేరీ ఆలీవర్, విస్లావా సింబ్రోస్కా వంటి అతి కొద్దిమంది మాత్రమే ఆ పని చెయ్యగలిగారు. ఇక తెలుగు వెబ్ పత్రికలు చదివే అలవాటు పెద్దగా లేకపోవడం, పద్యం కంటే గద్యం ఎక్కువగా చదివే అలవాటు ఉండడం కారణంగా నాకు నంద కిషోర్ కవిత్వంతో పరిచయం అంత త్వరగా కలగలేదు. గత ఏడాది నాగరాజు పప్పు గారి 'Bankrupt Circus' చదువుతుంటే అందులో ఆయన తెలుగు నుండి అనువదించిన కవితల్లో నందూ పేరు తొలిసారి చూశాను.

ఇక ఫేస్బుక్ లో నందూ పంచుకునే కవిత్వంతో నాకు తెలీకుండానే ప్రేమలో పడిపోయాను. ఇది యాదృచ్ఛికంగా ఎక్కడో ఒకచోట ఒక్క కవిత చదివి అమాంతం కలిగిన అభిమానం కాదు. క్రమంగా, స్థిరంగా, అతి మెల్లగా ఏర్పడిన ఇష్టం. ఒకటి రెండు క్షణాల్లో, ఒకట్రెండు కవితలతో అంతరించిపోకుండా బహుశా తుదకంటా నిలచియుండే ఇష్టం.

నాకు తెలిసి హేతువాదుల్ని భావుకత్వంతో కదిలించడం అంత సులభం కాదు. ఇదేదో గొప్ప విషయమని అనను. అక్షరాల్లో అంతర్లీనంగా ధ్వనించే కపటత్వాన్నీ, పదవిన్యాసాల నడుమ లోతులేని బోలుతనాన్నీ అతి సునాయాసంగా కొలవగల శాపగ్రస్తులు వాళ్ళు. ఇవన్నీ వద్దనుకున్నా వారి దృష్టిని దాటిపోవు. 'Interpretation is the revenge of the intellectual upon art.' అంటారు Susan Sontag.

ఇటువంటి శాపగ్రస్తుల్ని ఊరడిస్తూ అలసిసొలసిన సాయంత్రపు వేళల్లో ఎక్కడో అల్లంత దూరంనుంచి వినిపించే స్వచ్ఛమైన అమ్మ జోల పాట నందూ కవిత్వం. నందూ కవిత్వం ఈ హేతువాదపు చీకట్లు కమ్ముకోక మునుపటి వెలుగుల గతంలోనుండి కొన్ని జ్ఞాపకాలని తిరిగి కళ్ళముందు నిలిపింది. అదే నదినీ, దానితో ముడిపడ్డ జ్ఞాపకాలనీ గుర్తుకుతెచ్చింది. కొన్ని కవితలు చదువుతుంటే మా గోదావరి ఇసుక తిన్నెల్లో వదిలేసి వచ్చిన అడుగు జాడలవైపు కాలం వెనక్కి ప్రయాణించినట్లనిపించింది. ప్రేమనూ, ప్రేమరాహిత్యాన్నీ, వియోగాన్నీ, విరహాన్నీ, వైఫల్యాన్నీ, అస్తిత్వవాదాన్నీ, తాత్వికతనూ అన్ని వర్ణాల్లోనూ చిత్రించిన అందమైన కాన్వాసు నందూ కవిత్వం. చాలాచోట్ల నెరుడా ఛాయలు కనిపించాయి. ఇంతకుమించి నందూ కవిత్వాన్ని గురించి ఇంకేమీ చెప్పే సాహసం చెయ్యను. రసాస్వాదనలో హేతువాదానికీ, తర్కానికీ పనిలేదు. 

ఇక్కడొక చిన్న సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక పండితుడిని "మీరు ఈ విధంగా చేస్తే మీ రచనలు ఎక్కువమందికి చేరతాయి కదా" అని అమాయకంగా ప్రశ్నిస్తే , ఆయన చాలా ప్రశాంతంగా, "ఎక్కువమందికి ఎందుకు ,ఒకరిద్దరు చదివినా చాలు" అన్నారు. ఆమాట అర్థం కావడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాలుగు పుస్తకాలు ప్రచురించినా ముందుమాట / చివరి మాట  ఎవరితోనూ అడిగి రాయించుకోలేదనీ చెప్పిన నందూని చూస్తే ముచ్చటేసింది. తన కవిత్వానికి ఒకరిచ్చే అక్రిడేషన్/సర్టిఫికేషన్ పై ఆసక్తి లేదనీ, Poetry can speak for itself  అని నమ్ముతాననీ చెప్పిన ఒక ఆర్టిస్టు ఆత్మవిశ్వాసం,నిజాయితీల పై అమితమైన గౌరవం కలిగింది.

ఈ కవిత్వాన్ని మీరు కేవలం వెలకట్టి సొంతం చేసుకోగలమనుకుంటే పొరపాటే. ఇటువంటి కవిత్వాన్ని ఆస్వాదించడానికి భావుకత్వంతో పాటు పాఠకుడికి కూడా మరింకేదో అర్హత కావాలి. నంద కిషోర్ కవిత్వం  దారిచేసుకుంటూ ప్రవహించే నదిలా అచ్చంగా ఎవరికోసం రాశారో అటువంటి అర్హత కలిగిన పాఠకులను తప్పకుండా వెతుక్కుంటూ వెడుతుంది.

నిన్న పుస్తకం చేరిన దగ్గరనుండీ పేజీలు తిరగేస్తూనే ఉన్నాను. చదివిన కవితలు కొన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను.

మచ్చుకి ఈ ఆణిముత్యాలు :

కల్లోలాన్ని అనుభవిస్తూ ఒక్కడూ ఏం చేస్తాడు ? తీరాన కూర్చుని కెరటల్ని గురించి కవిత్వం రాస్తాడు. అలల మీదా, నీటి తరగల నాట్యం మీదా పదాలు అల్లుతూ పాటకడతాడు. ఉప్పెన మీదికి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే చేపపిల్లలాగా తుళ్లిపడతాడు. అలలతో పాటే ఊపిరి పోతే ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.

సముద్రం వాణ్ణి ప్రేమించిందని ఎవ్వరికీ చెప్పడు. కల్లోలాన్ని వాడు కోరుకున్నట్లు ఎప్పటికీ తెలియదు. తెలిసేదల్లా వాడికలేడనే !

--------------------------------------------------------

ఎలుగెత్తి నువ్వలా పాట పాడితే, ఎదకెత్తి నువ్వలా జోలపాడితే, పారిపోయేటినిశ్శబ్దాన్ని తెచ్చి పాటపాటలోనూ పదిలంగా నింపితే - మసకలోకమ్మీది మోహాలపొద్దులో సూర్యుడు,చంద్రుడు నిలవరనిపిస్తుంది. మరలిపోయేటి ప్రాణాలకోసం ఏడ్వడం,నవ్వడం కూడదనిపిస్తుంది.