Monday, August 2, 2021

Hyderabad Book Trust Article

చిన్నప్పటి నుండీ ఏకాంతం నా ప్రియ నేస్తం..నీళ్ళలోంచి బయటకు తీసిపడేసిన చేప పిల్ల చందంగా ఆటవిడుపుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినా నా అంతః ప్రపంచాన్ని దాటి ఆవలవైపు ఆట్టే సేపు ఉండలేను. నిర్ణీత సమయం దాటితే శ్వాస ఆడనట్లు సతమతమవుతాను. నేను ప్రత్యేకం కాదు, నాలాంటి అంతర్ముఖులు నా చుట్టూ కోకొల్లలు. ఎప్పుడైనా జ్ఞాపకాల తెరలు తీసి చూద్దును కదా, నలుగురి మధ్యలో నన్నెంత వెతుక్కున్నా నాకు 'నేను' కనపడలేదు. సమూహాల్లో మసిలేటప్పుడు ఇతరుల స్వాభావికమైన నీడలు పడని స్వచ్ఛమైన ఉనికి జాడలు పట్టుకోవడం ఒకింత కష్టం కదూ ! వెనక్కి తిరిగి చూసుకుంటే నా అపురూపమైన జ్ఞాపకాలన్నీ ఏకాంతంతో ముడిపడిన క్షణాలే. అందులోనూ ఏకాంతానికి కాస్త వర్షం జతగా వస్తే ఆ అనుభవం విలువ అమాంతం పెరిగిపోతుంది. వర్షపు రోజుల్లో స్కూలుకి మధ్యాహ్నం అనుకోకుండా సెలవొస్తే పండగలా ఉండేది. కిషోర్ సోలోస్ వింటూ, కిటికీ ప్రక్కన ఫేము కుర్చీలో కూర్చుని బొమ్మలకి రంగులు పులుముకుంటున్న నన్ను, వరండాలో చల్లని వర్షపు జల్లుల్లో తడిసి ముద్దవుతున్న నూరువరహాలూ, రాధామనోహరాలూ ఆత్మీయంగా పలకరించేవి. "మేము పనిగట్టుకుని వర్షంలో తడిసినా జలుబు చేస్తుందని అమ్మ చేత చివాట్లు తినక్కర్లేదోచ్" అన్నట్లు నాకేసి ఒకింత గర్వంగా చూసేవి. ఉక్రోషంతో ఒక్కోసారి వేస్తున్న బొమ్మల్నీ, చదువుతున్న చందమామల్నీ ప్రక్కన పడేసి వెళ్ళి వాటిని పట్టుకుంటే చల్లని వానచినుకులు బుగ్గల్ని ముద్దాడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఆ చల్లని చిరు స్పర్శ ఇప్పటికీ ఎంత తాజాగా ఉందో ! 

Young Woman at the Window by Salvador Dali

మనుషులతో పేచీలేదు గానీ మౌనం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మౌనానికి వాళ్ళకు తోచిన వక్రభాష్యాలద్ది గర్వమనో,అహంకారమనో,కలుపుగోలుతనం లేదనో ట్యాగ్ లు తగిలిస్తే సంజాయిషీలు ఇచ్చే అలవాటు లేకపోయినా "అవేమీ కాదు బాబోయ్. మనుషులంటే ఇష్టమే,మాట్లాడడమే కష్టం" అని అప్పుడప్పుడూ అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రకృతితో ఈ పేచీలేవీ ఉండవు, తమ ఉనికిని డప్పు కొట్టుకుని చాటుకోనవసరం లేకుండా స్థిర గంభీరంగా మానవాళిని గమనిస్తూ ఉండే కొండాకోనలూ, నిశ్శబ్దంగా దారిచేసుకుని ప్రవహించే వాగువంకలూ మన మౌనాన్ని గౌరవిస్తాయి,గౌరవించడమే కాదు ఆ మౌనంలో దొర్లిపోతున్న మాటల్ని ఒడిసిపట్టుకుని మరీ వింటాయి. ప్రకృతికి సంజాయిషీలు అఖ్ఖర్లేదు, నా ఇజం,నా నైజం,నా స్వభావం అంటూ నిరంతరం నిరూపణల అవసరం లేదు. అందుకేనేమో నాలాంటి చాలా మందికి ప్రకృతిని మించిన ప్రియ సఖి లేదు. 

'నో మాన్ ఈజ్ ఆన్ ఐలాండ్' అన్న నానుడిని నిర్ద్వందంగా అంగీకరించినా, నాకెప్పుడూ బుర్రలో ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. అసలు ఆదర్శ జీవన విధానం అంటే ఏమిటి ? దానికో స్పష్టమైన నిర్వచనం సాధ్యమేనా ! ప్రకృతితో మమేకమై జీవించడమే పరమావధి అని కొందరంటారు. మానవాళికి దూరంగా ఉలిపికట్టెలా జీవించడం కూడా ఒక జీవితమేనా అని మరికొందరంటారు. ఎవరి నిర్వచనాలు వారివి. ఆదర్శం కదాని అందరూ ఉన్నపళంగా పట్టణాల్ని వదిలి ప్రకృతికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టినా,పల్లెల్ని వదిలి అందరూ పట్టణాలకు వలస వెళ్ళినా సామజిక సమతౌల్యం దెబ్బతింటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేర్పిన పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఎక్కడి వాళ్ళక్కడ,తామున్న చోటే సంతోషాన్ని తయారుచేసుకోవాలి, తమ చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచాన్నే అసాధారణంగా మలుచుకోవాలి. ఇది సాధ్యపడాలంటే మనకు బాహ్య ప్రభావాలకు లోనుకాని ఘనమైన అంతః ప్రపంచం ఉండి తీరాలి. లేదంటే ఉందో లేదో తెలియని రేపటిరోజు కోసం నిరీక్షిస్తూ, లాక్డౌన్ శృంఖలాలు తెంచుకునే సమయంకోసం వేచి చూస్తూ నిరాసక్తంగా,నిస్తేజంగా రోజుల్ని వెళ్ళదీయడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ ఇంత అశాశ్వతత్వం మధ్య మనదైన ఒకే ఒక్క జీవితంలో ఒక్క క్షణాన్నైనా జారవిడుచుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా !

పొట్ట చేతపట్టుకుని ఊరూరా తిరిగే ఉద్యోగం మాలో ప్రాంతీయాభిమానాల్ని సమూలంగా చెరిపేసింది. ఈ ప్రాంతం, ఈ సమూహం, ఈ క్షణం : ఇంతవరకే మా ఆలోచనల్ని పరిమితం చేసింది. బహుశా ఈ కారణంగానే మహానగరాల్లో రద్దీనీ, దుమ్మూధూళీ కలగలిసిన పెట్రోల్ వాసనల్ని ఎంతగా ఇష్టపడేవాళ్ళమో, నిర్మానుష్యంగా ఉండే పచ్చని అడవి దారుల్ని కూడా అంతే ఇష్టపడేవాళ్ళం. ప్రకృతిలోనైనా, జనారణ్యంలోనైనా ఒకే తీరుగా జీవించడం నేర్చుకున్నాం. మాల్స్ పట్టి తిరగడం అలవాటైన ప్రాణాలైనా అడవులు పట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగానే తిరిగాం. దేవలోకంలో ఉన్న కాలంలో ప్రతీ వారాంతం క్రమం తప్పకుండా లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళేవాళ్ళం. కనుచూపు మేర పచ్చని తివాచీలా పరుచుకున్న తేయాకు తోటల్ని దాటుకుంటూ నీలగిరుల్లో లయబద్ధంగా కురిసే వర్షపు చినుకుల్నీ, కొండల్ని  చీల్చుకుంటూ ప్రవహించే మేఘాల్నీ, తనువంతా తడిసి పులకరిస్తున్న ప్రకృతి అందాల్నీ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ప్రయాణిస్తుంటే వెనుకనుండి కార్ హారన్లు పదపదమంటూ తొందర పెట్టేవి. మేము ప్రక్కకి తొలిగి వాళ్ళకి దారిచ్చేవాళ్ళం. గమ్యాన్ని చేరుకోవాలని వాళ్ళకి ఉన్న తొందర మాకు ఎప్పుడూ లేదు. ప్రయాణాన్ని ఆస్వాదించడమే మా పరమావధి. నలుగురూ సౌకర్యవంతంగా నడిచే దారుల్లో నడవకపోవడంతో ఎవరి కంటాపడని కొన్ని అరుదైన ప్రాకృతిక ప్రదేశాలు మాకు మాత్రమే కనిపించేవి. మనిషి జాడలేని అటువంటి ప్రదేశాల్లో గంటల తరబడి స్వేచ్ఛాజీవుల్లా విహరించేవాళ్ళం. కారాపి ఫ్లాస్కులో వెంట తెచ్చుకున్న ఫిల్టర్ కాఫీ తాగుతుంటే "ఇక్కడ క్షేమం కాదు ఏనుగులు తిరిగే ప్రదేశాలని" ఫారెస్ట్ పెట్రోలింగ్ వాళ్ళు మమ్మల్ని సున్నితంగా హెచ్చరించేవారు. నీలాల నింగీ, కాళ్ళ క్రింద నేలా,పచ్చని పశ్చిమ కనుమలూ,వాటిపై ప్రవహిస్తున్న మేఘాల సాక్షిగా మా అనుభవాల పెట్టెలో అలా చేరిన అదృష్టాలెన్నో. ఎవరైనా ఫోటోలు చూసి "ఈ ప్రదేశం ఎక్కడ ?" అని అడిగితే మాత్రం స్పష్టమైన చిరునామా చెప్పడానికి తడబడేవాళ్ళం. మాకు ప్రయాణమే తప్ప గమ్యాల ఆచూకీ తెలియదు. పారిజాతాల్ని తలపించే కాఫీ పూల పరిమళాలూ, తేయాకు,అరటి తోటల పచ్చదనాలూ, పచ్చని పచ్చి మిరియాల కారాలూ,రోజ్ ఆపిల్స్ తో చేసే కేరళ పానీయాలూ, ఋతువులతో పాటు మారిపోయే అనంతమైన ప్రకృతి వర్ణాలూ, కనీకనిపించని పొగమంచు దారులూ ఇలా జ్ఞాపకాల తుట్టె కదిపితే ఎన్ని అనుభవాలని ! 

మనకి కొత్తొక వింత, పాతొక రోత. ఒకనాడు ఎదుగూ బొదుగూ లేని జీవితాలెందుకని ఆధునికత బాటపట్టి పల్లెల్నీ,ప్రకృతినీ వదిలి పట్టణాలకు వలసపోయాం. ఇప్పుడు పట్టణాలు జనసందోహంతో కిక్కిరిసిపోయి మనిషికి ఏకాంతం కరువైంది. ఇది మెజారిటీ జీవన విధానంగా మారింది. వినియోగదారీ వ్యవస్థ పెచ్చుమీరిన ఈ కాలంలో ఒకనాటి సాంప్రదాయ జీవన శైలులే 'ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్' లా మినిమలిజం,సింపుల్ లివింగ్ లపేరిట మళ్ళీ ప్రచారంలోకి వచ్చాయి. ఈకాలంలో ఇలా జీవించేవాళ్ళు ప్రివిలెజ్డ్ క్లాస్ (?) గా పరిగణింపబడుతున్నారు. మళ్ళీ ఈ జీవన విధానం విసుగుపుడితే ఆధునికతను ఆనందంగా హత్తుకుంటాం. ఈ చక్ర భ్రమణాలు నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. ఒంటరితనం తప్ప ఏకాంతానికి అర్ధం తెలీని నేటి తరానికి కోవిడ్ సెకండ్ వేవ్ కటువుగానైనా కొన్ని కొత్త పాఠాలు నేర్పింది. నీలోపలున్న అంతులేని అంతః ప్రపంచాన్నోదిలి బాహ్య ప్రపంచంలో నలుదిక్కులకూ పరిగెడతావేమని ప్రశ్నించింది. వెతికి వెతికి అలసిపోవలసిందే గానీ నీలో లేని సంతోషం,నువ్వు నీతో చెయ్యని స్నేహం నీకు బయట దొరకదని నిరూపించింది. కోరుకున్నది కాకపోయినా కోవిడ్ ముందు నుండే 'సోషల్ డిస్టెన్సింగ్' అలవాటు ఉంది కాబట్టి ఎప్పటిలాగే పుస్తకాలూ, సినిమాలూ, పెయింటింగ్, సంగీతం లాంటి హాబీలతో లాక్డౌన్ సమయం మాకు ఆనందంగానే గడిచిపోయింది. నిజానికి ఈ కళారూపాలన్నీ లేకపోతే ఈ లాక్ డౌన్ రోజుల్లో ఏమైపోయేవాళ్ళమో అనిపించేది. ఇవన్నీ మానవసంబంధాలకి ప్రత్యామ్న్యాయాలు కాదు కానీ, మనిషిని అతడి అంతః ప్రపంచంతో దగ్గరగా కలిపి ఉంచే సాధనాలు. నిజానికి ఉన్నచోటు నుండి కదలకుండా, విసాలూ,పాస్స్పోర్టుల అవసరం లేకుండా, రెక్కలుకట్టుకుని విశ్వం నలుమూలలూ చుట్టి రావడానికి పుస్తకపఠనాన్ని మించిన మరో మంచి మార్గం ఉందా ! కాలంతో బాటు వేగంగా పరిగెత్తడం తప్ప ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడలేని ఈ మెటీరియలిస్టిక్ తరంలో మేరీ ఆలీవర్,వెండెల్ బెర్రీ,హెన్రీ డేవిడ్ థోరో, ఎమెర్సన్, రస్కిన్ బాండ్ లాంటి అనేకమంది రచయితలు ప్రకృతితో తమ సాన్నిహిత్యం గురించి గంటల కొద్దీ చెప్పే కబుర్లకి సరిసాటి అయిన మరో సాహచర్యం నాకైతే ఇంతవరకూ దొరకలేదు. బైరన్ అన్నట్లు "I love not man the less, but nature more" అనుకున్న సందర్భాలెన్నో. 'హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్' అనే సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా నమ్ముతాను. మనం అందరం ఎక్కువ సమయం (బహుశా పూర్తి సమయం) గడిపేది మన మెదడులోనే కాబట్టి ఆ ప్రపంచాన్ని శుభ్రంగా, అందంగా, ఆనందంగా ఉంచుకోవడం చాలా అవసరం, అది ప్రకృతిలోనైనా,పదుగురిలోనైనా సరే అనుకుంటాను. మా సంతోషాన్ని మేము తయారుచేసుకున్న రెసిపీలో కీలకమైన పదార్థం 'ఆర్ట్'. ఇది మా రెసిపీ మాత్రమే, మీకు నచ్చాలని రూలేమీ లేదు సుమా !

ఈ సందర్భంలో ఫ్రెంచ్ తత్వవేత్త మొంటైన్ ఏకాంతాన్ని గురించి చెప్పిన కొన్ని విలువైన మాటలు ప్రస్తావించాలి : "వివేకవంతుడు నలుగురిలోనైనా, నాలుగ్గోడల మధ్య ఏకాంతంలోనైనా ఎక్కడైనా ఆనందంగానే ఉంటాడు. కానీ అతడు అవకాశం ఉంటే మాత్రం నిస్సందేహంగా ఏకాంతాన్ని కోరుకుంటాడు. సమాజంలో భాగమైన చెడును ఎదుర్కునే క్రమంలో ఎంతో కొంత మకిలి అంటకుండా దాని ప్రభావంనుండి తప్పించుకోవడం అసాధ్యం అని అతడికి స్పష్టంగా తెలుసు. ఇక్కడ రెండే మార్గాలుంటాయి :ఒకటి, మనం సమూహాల్ని వాటి చెడుతో సహా అనుసరించాలి ;రెండు, వారిని ద్వేషిస్తూ వారినుండి విడివడి జీవించాలి. రెండు మార్గాలూ హాని కారకమే." . కానీ నాకు ఆయన మాటలతో చిన్న పేచీ ఉంది. రెండవ మార్గంలో ఎవర్నీ ద్వేషించకుండా కూడా విడివడి మనకు నచ్చినట్లు జీవించే అవకాశం ఉంది కదా ! అనుకుంటాను. కానీ ప్రస్తుతం మనందరం ఉన్న పరిస్థితుల్లో, దీనికంటే ముఖ్యమైన ప్రశ్న : అసలు మనకా ఛాయిస్ ఉందా ? 

తొలి ప్రచురణ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేజీ : 30th July'2021 

https://www.facebook.com/HBTBooks/posts/4281019705280995

No comments:

Post a Comment