ఎలిజబెత్ గాస్కెల్ 'నార్త్ అండ్ సౌత్' బీబీసీ అడాప్టేషన్ చూసి ఒక దశాబ్దం పైనే అయినట్లుంది. అందులో మిల్టన్ లో కాటన్ మిల్ యజమాని జాన్ థ్రోన్టన్ కి చిన్నప్పుడే తండ్రి మరణం కారణంగా కుటుంబం,మిల్లు బాధ్యతలు మీద పడడంతో చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన మార్గరెట్ హేల్ తండ్రితో థ్రోన్టన్ కు స్నేహం కుదరడంతో ఆయన దగ్గర రోజూ కొంత సేపు ట్యూషన్ చెప్పించుకుందామని నిర్ణయించుకుంటాడు. అప్పుడు హేల్ తండ్రి, "జాన్ కి చదువు అరిస్టాటిల్ తో మొదలు పెట్టాలా లేదా ప్లేటో తో మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను" అంటాడు. అది చూసినప్పుడు అనిపించింది,ఒకప్పటి చదువు వాస్తవ జీవితంలో సంక్లిష్టతలను సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో వివేకాన్ని పెంపొందించేదిగా ఉండేది. పూర్తిగా కాకపోయినా అటువంటి చదువుకు ఉండే ప్రాముఖ్యతను గుర్తెరిగిన సమాజం అది. మరి ఇప్పుడు, లెక్కలూ,అంకెలూ,నిర్వచనాలూ అంటూ అంతా 'ఫాక్ట్ బేస్డ్' చదువైపోయింది. నేడు సాంకేతిక విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యత మానవీయ విలువలు పెంపొందించే విద్యకు లేదు. దానితో 'మైండ్ అండ్ సౌల్' విషయంలో సంతులనం లోపించి మనిషి అపరిమిత జ్ఞానసంపన్నుడైనప్పటికీ వివేకహీనుడుగా మిగిలిపోతున్నాడు. ఫలితం, నేటి విచక్షణారహిత సమాజం మన కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. జ్ఞాపకశక్తిని తెలివితేటలకూ,తెలివితేటల్ని వివేకానికీ ముడిపెట్టి మురిసిపోతున్న అమాయకపు తరం మనది. ఒకానొకప్పుడు ఏథెన్సులో ఇటువంటి వాస్తవాలను గొంతెత్తి చెప్పిన నేరానికి సోక్రటీస్ కు మరణదండన విధించారు. ఇంత దూరం ప్రయాణించి వచ్చినా మునుపటి తరానికీ,నేటి తరానికీ ఈ విషయంలో పెద్ద తేడా లేకపోవడం దురదృష్టకరం.
Image Courtesy Google |
మొత్తం పది పుస్తకాల ప్లేటో 'రిపబ్లిక్' లో ఏడవ పుస్తకంలో ప్లేటో అన్నగారైన గ్లాకన్ కూ, సోక్రటీస్ కూ నడుమ జరిగిన సంభాషణల్లో భాగంగా 'The Allegory of the Cave' గా ప్రసిద్ధికెక్కిన ఒక చిన్న కథను చెప్తారు సోక్రటీస్. ఇది చదివినప్పుడు రోలాండ్ బార్త్, గై డెబోర్డ్, వాల్టర్ బెంజమిన్, బెర్ట్రాండ్ రస్సెల్, కలాస్సో వంటి తత్వవేత్తలు తరువాత కాలంలో చేసిన అనేక ప్రతిపాదనలకు మూలాలు ఈ కథలోనే ఉన్నాయనిపించింది. నేను వీరి ప్రతిపాదనలను ఇదివరకే కొంత చదివి ఉండడంతో ఈ పిట్టకథ 375 బీసీ నాటిదని తెలిసి మరింత ఆశ్చర్యమనిపించింది.
సోక్రటీసు గ్లాకన్ కు చెప్పిన కథ ఇది : అనగనగా ఒక గుహ,ఆ గుహలో నుండి కాస్త పైకి వెళ్తే బయట ప్రపంచానికి ఉన్న ఒకే ఒక ద్వారం..ఆ గుహలో తల తిప్పి వెనక్కి చూడడానికి కూడా వీలులేకుండా మెడకూ,కాళ్ళకూ సంకెళ్ళతో చిన్నప్పటినుండీ ఖైదు చెయ్యబడ్డ కొందరు మనుషులు. వాళ్ళకి వెనుక భాగంలో కాస్త దూరంగా ఎప్పుడూ వెలుగుతూ ఉండే మంట..ఆ మంటనుండి వచ్చే వెలుగు కారణంగా వీళ్ళ ఎదురుగా ఉన్న గోడమీద వీళ్ళ దృష్టికి ఆవల ఉండే ప్రపంచం తాలూకు ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి.ఒక్కోసారి ఈ గుహలో ప్రతిధ్వనించే శబ్దాలను ఆ ప్రతిబింబాలే స్వయంగా మాట్లాడుతున్నాయనుకుని భ్రమపడే అవకాశం కూడా ఉంది.
To them, I said, the truth would be literally nothing but the shadows of the images.
Image Courtesy Google |
ఇప్పుడు సూర్యకాంతినీ, చీకటినీ, ప్రతిబింబాలనీ మెటఫోర్లుగా వాడుతూ సోక్రటీస్ చెప్పిన కథలోని సారాంశాన్ని చూద్దాం :
* ఒకవేళ వారిలో ఒక ఖైదీ విడుదలైన పక్షంలో అతడు ఉన్నట్లుండి తన చీకటి గుహలో అలవాటైన నీడల బదులు వెలుగులు చిమ్మే సూర్య కాంతిని చూడలేక సతమతమవుతాడు.
* చీకటి బదులు వెలుతురునూ, ప్రతిబింబాల బదులు వాస్తవాన్నీ చూడగలగడానికి అతడు చాలా కష్టపడతాడు. తన కళ్ళకి సౌకర్యవంతంగా ఉండే అలవాటైన నీడలే నిజమేమో అనుకుంటాడు.
* ఇప్పుడు వెలుగులో గుహ వెలుపలి ప్రపంచంలో అతడు చూసే వస్తువులను పేర్లతో సహా చెప్పి గుర్తుపట్టమని ఎవరైనా అంటే అతడు గందరగోళానికి గురవుతాడు. ఎందుకంటే ప్రతిబింబాలకు అతడు పెట్టుకున్న పేర్లు వేరు. అతడికి సంబంధించినంత వరకూ గుహలో అతడి చీకటి జీవితం వాస్తవం. మిగతాదంతా భ్రమ.
* మొదట్లో వెలుతురును సూటిగా చూసే ప్రయత్నం చేస్తే కళ్ళు నెప్పెట్టి, చూపు తిప్పుకుంటాడు. తన కళ్ళు గ్రహించగలిగిన కాంతిని మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాస్త దగ్గరగా మనుషుల్నీ,జంతువుల్నీ చూశాకా అతడు తాను ఇంత కాలం చూసిన నీడలన్నీ భ్రమలని చివరకు అర్ధం చేసుకుంటాడు. శబ్దాలకు ఆధారభూతమైన మూలాలను గ్రహిస్తాడు.
* ఇప్పుడు తాను చూసిన అద్భుతమైన వాస్తవాలను తన సహచరులతో పంచుకోడానికి గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళతాడు. (ఇప్పుడు ఇతడు సత్యాన్ని గ్రహించిన జ్ఞానీ,తాత్వికుడూ.)
* కానీ లోపల మనుషులకు ఇవేవీ తెలియదు. వాళ్ళకి ఇప్పటికీ ఆ చీకటి గుహలో నీడలే నిజం. లోపల కనిపిస్తుందంతా భ్రమని వారికి చెప్పజూస్తే ఈ తాత్వికుణ్ణి పిచ్చివాడు అనుకుంటారు.
* బయట తమకు తెలీని వెలుగులోకి వెళ్ళగానే కళ్ళు బైర్లుకమ్మి మతితప్పి వ్యవహరిస్తున్నాడని అతన్ని హేళనచేసి తరిమికొడతారు.
* ఇప్పుడు ఆ గుహలో వ్యక్తులు మునుపటిలాగే నీడల్ని గమనిస్తూ ఏ నీడ ముందో,ఏ నీడ తరువాతో అని వారిలో వారు పెట్టుకునే పోటీలు ఈ తాత్వికుణ్ణి మునుపటిలా ఆకర్షించలేవు. అతడు వారి పోటీల్లో పాలుపంచుకోడానికి ఆసక్తి చూపడు. వారి మూర్ఖత్వంతో కూడిన గౌరవాలనూ, విజేత పురస్కారాలనూ అతడు లెక్క చెయ్యడు, ఆ పోటీల్లో విజేతలను చూసి ఈర్ష్య చెందడు. వాళ్ళ చీకటి ప్రపంచం,దాని విధివిధానాలన్నీ అతడికి అఙ్ఞానంగా తోస్తాయి. కానీ వాళ్ళు మెజారిటీ.
Would he not say with Homer, ‘Better to be the poor servant of a poor master,’ and to endure anything, rather than think as they do and live after their manner?
ఈ పిట్ట కథను ఏ తరానికి అన్వయించినా సరిగ్గా అతికిపోతుంది. వాస్తవ జీవితాలు సోషల్ మీడియా కిటికీల్లో ప్రతిబింబాలుగా రూపాంతరం చెందిన ఈ కోవిడ్ పాండెమిక్ సమయంలో ఈ కథ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనిపిస్తుంది. శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన మన అస్తిత్వాలు 'ప్లేటో కేవ్' లోని గోడ మీద నీడల్లా పరిణామం చెందిన క్రమంలో నీడల్ని నిజమనుకుని,ప్రతిధ్వనుల్ని నీడల వెనుక స్వరాలని అనుకుంటూ వాస్తవమేదో భ్రమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ఖైదీలం మనం. ఎవరైనా మెజారిటీ మూర్ఖత్వాన్ని ఎద్దేవా చేస్తూ 'వెలుగు' ను చూపించే ప్రయత్నం చేసినా వాళ్ళని సోక్రటీస్ లా పిచ్చివాడనీ,ప్రమాదకారి అనీ ముద్రవేసే సమాజంలోనే ఇప్పటికీ ఉన్నాం.
ఒక తత్వవేత్త సాధారణ సమూహానికి తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు సోక్రటీస్. జ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని గ్రహించే విషయంలో మనిషిలో మానసిక సంసిద్ధత లేకపోతే వాస్తవం కళ్ళముందే కనిపిస్తున్నా ఎప్పటికీ అజ్ఞానాంధకారంలోనే మిగిలిపోతాడు. మనిషిలో జ్ఞానాన్ని అతడు ఉండే పరిసరాలూ, అతడు కలిసిమెలిసి తిరిగే సమూహాలూ ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి కూడా ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ పుస్తకానికి అనేక అనువాదాలున్నప్పటికీ బెంజమిన్ జోవెట్ అనువాదం దొరికితే తప్పకుండా చదవండి.
పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు :
But then, if I am right, certain professors of education must be wrong when they say that they can put a knowledge into the soul which was not there before, like sight into blind eyes.
And whereas the other so-called virtues of the soul seem to be akin to bodily qualities, for even when they are not originally innate they can be implanted later by habit and exercise, the virtue of wisdom more than anything else contains a divine element which always remains, and by this conversion is rendered useful and profitable; or, on the other hand, hurtful and useless. Did you never observe the narrow intelligence flashing from the keen eye of a clever rogue—how eager he is, how clearly his paltry soul sees the way to his end; he is the reverse of blind, but his keen eyesight is forced into the service of evil, and he is mischievous in proportion to his cleverness
The students of the art are filled with lawlessness.
So men who begin to analyse the first principles of morality cease to respect them.
Young men are fond of pulling truth to pieces and thus bring disgrace upon themselves and upon philosophy.
The study of philosophy to continue for five years; 30-35
No comments:
Post a Comment