సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు,అందునా పుస్తకప్రియులకు కళ్ళు ఎంత అపురూపమో కదా ! ఊహ తెలిసినప్పటినుండీ దివారాత్రాలు జ్ఞానపిపాసతో సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసిన జార్జ్ లూయి బోర్హెస్ లాంటి వాళ్ళకైతే మరీనూ..ప్రపంచ ప్రఖ్యాత రచనలెన్నో చేసినప్పటికీ ఆయన తనను తాను ఒక సాధారణ పాఠకుడిగానే చూసుకుంటారు..కానీ 'It came like a slow summer twilight' ,స్వర్గమంటే ఒక గ్రంథాలయం అని నిర్వచించిన వ్యక్తికి ఆ గ్రంథాలయం సొంతం చేసుకోగానే అంథత్వం సంక్రమించడం ఐరనీ కదా !యాభైల వయసులోనే అంధత్వం బారినపడి చేతికర్ర సాయంతో అడుగులో అడుగువేసుకుంటూ నడిచే ఆ కురువృద్ధుడు తనదైన ప్రపంచంలో తానుండే యోగిలా కనిపిస్తారు కానీ, మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రముఖ వక్తలా వివిధ అంశాలకు సంబంధించి అనర్గళంగా ఉపన్యసించగలరు..సాక్ష్యం ఈ ఇంటర్వ్యూలే..అర్జెంటీనాకు చెందిన ఈ 81 ఏళ్ళ సాహితీవేత్తను చేసిన కొన్ని ఇంటర్వ్యూలను Borhes at Eighty : Conversations పేరిట పుస్తకంగా ప్రచురించారు..రచయితగా బోర్హెస్ చాలామందికి సుపరిచితమే అయినప్పటికీ ఈ రచన, పాఠకులకు బోర్హెస్ అంతరంగాన్ని చదివే మహదావకాశం కల్పిస్తుంది.
Image Courtesy Google |
ఈ పుస్తకం మొదటి భాగంలో ఆర్ట్,ఫిలాసఫీ,సైకాలజీ, ఆధ్యాత్మికత,ఆఫ్టర్ లైఫ్ వంటి అంశాలకు సంబంధించి బోర్హెస్ ను పలు వ్యక్తులు చేసిన ఇంటర్వ్యూలు ఉంటాయి..రెండో భాగంలో బోర్హెస్ రాసిన కొన్ని కవితలను గూర్చి సహేతుకమైన వివరణలతో పాటుగా ఆయనకు ఇష్టమైన కవులు వాల్ట్ విట్మన్,రాబర్ట్ ఫ్రాస్ట్, ఎడ్గర్ అలాన్ పో వంటివారి కవితా వస్తువు,శైలి మొదలగు అంశాలను గురించి అడిగిన ప్రశ్నలకు వారు రాసిన కొన్ని కవితలనుటంకిస్తూ బోర్హెస్ విస్తృతంగా చర్చించారు..కానీ తన ఇష్టమైన కవుల జాబితాలో బోర్హెస్ ఎమెర్సన్ బదులు ఫ్రాస్ట్ పేరు ప్రస్తావించడం విశేషం..ఈ పుస్తకమంతా ప్రశ్నలూ,సమాధానాలే కాబట్టి రచనలో మంచి చెడ్డలు విశ్లేషించాడనికేమీ లేదు..అందువల్ల బోర్హెస్ చెప్పిన సమాధానాల్లో నాకు నచ్చిన కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను..ఈ రచనలో ఒక ప్రక్క చాలా లోతైన,విలువైన విషయాలు చర్చిస్తూనే బోర్హెస్ తన మార్కు హాస్యంతో విసిరిన ఛలోక్తులు ఈ సంభాషణలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి..ఉదాహరణకు "మీ రాతల్లో మీరొకసారి,'నేను మా పూర్వీకుల్లా ధైర్యవంతుణ్ణి కాననీ ,శారీరకంగా పిరికివాణ్ణనీ' అన్నారు నిజమేనా ? " అనడిగితే, "అవును,My dentist knows all about it! "అన్న ఆయన మాటల్ని విని నవ్వుకోకుండా ఎలా ఉండగలం ! ఇలాంటి సరదా సమాధానాలు ఇందులో అడుగడుక్కీ ఎదురవుతాయి.
బోర్హెస్ ను ఇంటర్వ్యూ చేసిన బార్న్ స్టోన్, రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత The Road Not Taken ను గుర్తుచేసి,మీరు తప్పుడు మార్గంలో ప్రయాణించిన సందర్భాలున్నాయా ? అటువంటి ప్రయాణంలో మీకు సత్ఫలితాలు ఎదురయ్యాయా ? లేదా దుష్ఫలితాలు ఎదురయ్యాయా ? అని ప్రశ్నిస్తారు..దానికి సమాధానంగా బోర్హెస్" నేను రాసిన చెడ్డ పుస్తకాల గురించా ?" అనడుగుతారు..బార్న్ స్టోన్ అవునంటూ, "మీరు రాసిన చెడ్డ పుస్తకాల గురించీ,ప్రేమించిన రాంగ్ వుమన్ గురించీ,గడిపిన చెడ్డ రోజుల గురించీ చెప్పమంటారు..అప్పుడు బోర్హెస్ :
"ఈ విషయంలో నేను చెయ్యగలిగింది ఏముంది ? నా జీవితంలో నేను ప్రేమించిన నాకు సరిపడని స్త్రీలూ, చేసిన చెడ్డ పనులూ, ఎదురైన చెడు సందర్భాలూ,ఇవన్నీ కవికి సాధనాలు..దొరికింది దురదృష్టమైనా సరే,కవి ఇవన్నీ తనకు సాధనాలుగా దొరికాయనుకోవాలి..దురదృష్టం,ఓటమి,అవమానం, వైఫల్యం, ఇవన్నీ మా కళాకారులకు పనిముట్లు..సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా సృజించగలం అనుకోవడం పొరపాటు..మన తప్పటడుగులూ,పీడకలలు వీటన్నిటినీ కవిత్వంగా మలచడమే కవి చెయ్యగలిగిన పని..ఒకవేళ నేను నిజంగా కవినే అయితే నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ కవిత్వముందని భావిస్తాను, ప్రతీ క్షణాన్నీ కవిత్వంగా మలచగలిగే ఒక విధమైన మట్టిముద్దగా అనుకుంటాను..ఈ కారణంగా నా తప్పులకు నేను క్షమించమని అడగవలసిన అవసరం ఉందనుకోవడంలేదు..Those mistakes were given me by that very complex chain of causes and effects, or rather, unending effects and causes—we may not begin by the cause—in order that I might turn them into poetry." అంటారు.
బోర్హెస్ జన్మించిన బ్యూనోస్ ఐరిస్ జ్ఞాపకాల గురించి చెప్పమని అడిగినప్పుడు,
"నేను బ్యూనోస్ ఐరిస్ ని చూసింది చాలా తక్కువ..పలేర్మో మురికివాడల దగ్గర పుట్టాను..కానీ నాకు 29 ఏళ్ళు వచ్చేవరకూ ఆ ప్రాంతం నచ్చనేలేదు..ఒక పిల్లవాడిగా నాకున్న జ్ఞాపకాలల్లా నేను చదివిన పుస్తకాల జ్ఞాపకాలు మాత్రమే..నాకు ఆ జ్ఞాపకాలు నేనున్న పరిసరాలకంటే మిక్కిలి వాస్తవంగా తోస్తాయి..అందువల్ల నా జ్ఞాపకాలన్నీ స్టీవెన్సన్ జ్ఞాపకాలు,కిప్లింగ్ వి,అరేబియన్ నైట్స్ వి,డాన్ క్విక్సోట్ వి ('డాన్ క్విక్సోట్' నేను చిన్నపిల్లవాడిగా చదివాను,చదువుతూనే ఉన్నాను,ముఖ్యంగా రెండవ భాగం అద్భుతం,మొదటి భాగంలో మొదటి అధ్యాయం మినహా మిగతాదంతా హాయిగా వదిలెయ్యచ్చు.) ఇక నా బాల్యాన్ని గురించి ఏమని చెప్పాలి ! అతి కొద్ది జ్ఞాపకాలు మినహా చెప్పడానికేముంది ! మా పూర్వీకుల ఫోటోలు గుర్తున్నాయి,వాళ్ళు యుద్ధాలలో ఉపయోగించిన ఖడ్గాలు గుర్తున్నాయి..ఇలా అతి కొద్ది వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి..నా జ్ఞాపకాలన్నీ ముఖ్యంగా పుస్తకాలకు సంబంధించినవే..నిజానికి నాకు నాదైన సొంత జీవితమే జ్ఞాపకం లేదు,మీకు తారీఖులూ,సంవత్సరాలూ లాంటి వివరాలు చెప్పలేను..నాకు గుర్తున్నంత వరకూ నేను 17,18 దేశాల్లో పర్యటించాను, కానీ ఇప్పుడా ప్రయాణాల క్రమం చెప్పమంటే చెప్పలేను..ఎక్కడ ఎంతకాలం ఉన్నానన్న గణాంకాలు కూడా చెప్పలేను..ఇదంతా నాకొక 'jumble of division, of images'.అందుకనే నేను పుస్తకాలను ఆశ్రయిస్తాను..ముఖ్యంగా నాతో ఎవరైనా మాటామంతీ కలిపినప్పుడు సంభాషణను పుస్తకాలవైపు మళ్ళిస్తాను, పుస్తకాల్లో చదివిన కొటేషన్స్ ను ఆశ్రయిస్తాను." అంటారు.
ఈ పుస్తకంలో స్వర్గనరకాలను గురించి బోర్హెస్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి..ఇక్కడ బోర్హెస్ స్వరంలో ఒకవిధమైన అలసట,జీవితం పట్ల నిర్లిప్తత,నిరాసక్తతా ధ్వనిస్తాయి.
"డాంటే ని చదివి అందరూ భ్రమపడినట్లు నరకమనేది ఒక స్థలం కాదు, నేను దాన్నొక 'స్థితి' గా భావిస్తాను..మిల్టన్ 'పారడైజ్ లాస్ట్' లో సాతాను 'Myself am Hell' అనడం గుర్తుకొచ్చింది.."
"నేను చదివిన ఒక ఆంగ్ల మతప్రవక్త రాసిన పుస్తకంలో 'స్వర్గం అంతా దుఃఖ్ఖమయం' అంటారు..నేనది నమ్ముతాను..నిజానికి మితిమీరిన సంతోషాన్ని భరించలేము..సంతోషం ఎప్పుడూ కొన్ని క్షణాలో, కొద్దిసేపో మితంగా ఉంటే బావుంటుంది గానీ శాశ్వతమైన ఆనందం ఆలోచనలకందనిది..వ్యక్తిగతంగా నాకు మరణానంతర జీవితంపై నమ్మకం లేదు, నా ఉనికి శాశ్వతంగా అంతమైపోతుందనుకుంటాను..నేను దుఃఖ్ఖంతో ఉన్నప్పుడో, దేనికైనా చింతిస్తూ ఉన్నప్పుడో (నిజానికి నేను ఎప్పుడూ ఏదో విషయమై చింతపడుతూనే ఉంటాను) నాకు నేను ఇలా చెప్పుకుంటాను : "ఏదో ఒక క్షణంలో మృత్యురూపంలోనో,మరో వినాశనం రూపంలోనో మోక్షం ప్రాప్తించే పాటికి ఇలా చింతించడం ఎందుకు ? మృత్యువు తథ్యం, ఏ క్షణంలోనైనా సాధ్యం,అటువంటప్పుడు అనవసర విషయాల గురించి వ్యథ పడటం ఎందుకు ?"..నేను చీకటి కోసం ఎదురుచూడడంలేదు..నాకు కావాల్సింది నన్ను అందరూ మరచిపోవడం..నిజానికి నేను ఏదో ఒక సమయంలో మనుషుల జ్ఞాపకాలనుండి చెరిగిపోతాను..కాలక్రమేణా ప్రతిదీ చెరిగిపోతుంది."
కథలు రాస్తారు గానీ నవలలు ఎందుకు రాయరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ :
బహుశా నేను నవలా పాఠకుణ్ణి కాదు కాబట్టి నవలా రచయితను కూడా కాలేకపోయాను..ఎందుకంటే ఎంతో ఉత్తమమైన నవలలకు సైతం 'padding' అవసరమవుతుంది.. దీనికి భిన్నంగా కథలకు ఆ అవసరం ఉండదు..కథలు అవసరమైన విషయాలతో సత్తువ కలిగి ఉంటాయి..ఉదాహరణకు రుడ్యార్డ్ కిప్లింగ్, హెన్రీ జేమ్స్ రాసిన చివరి కథలూ, కాన్రాడ్ రాసిన కథలూ నా దృష్టిలో సారవంతమైనవి.ఆ మాటకొస్తే అరేబియన్ నైట్స్ కూడా,ఆ కథల్లో padding కనపడదు..సాధారణంగా నవలారూపంలో రచయిత యొక్క అలసట నా దృష్టికి వస్తుంది.
కళాకారుడిగా కళపట్ల తప్ప కీర్తి గురించి వెంపర్లాట లేని ఆ తరం రచయితలను గురించి బోర్హెస్ మాటలు చదివినప్పుడు ఒక పుస్తకం రాయగానే సన్మానాలు,గజారోహణలు అంటున్న నేటితరం రచయితలు గుర్తొచ్చారు..
"నేనెప్పుడూ కీర్తి గురించి ఆలోచించలేదు.అది నాకు పరాయి భావన..ప్రచురణ రచయిత ఉపాధిలో గానీ,రచనావ్యాసంగంలో గానీ భాగం కాదని ఎమిలీ డికిన్సన్ అంటారు..ఆమె ఎప్పుడూ తన రచనల్ని పబ్లిష్ చెయ్యలేదు..మా అందరి అభిప్రాయం కూడా అదే..మేము మైనారిటీ కోసమో,మెజారిటీ కోసమో,పబ్లిక్ కోసమో రాయడం లేదు..మమల్ని మేము సంతోషపెట్టుకోవడానికి రాసుకుంటాం,బహుశా మా స్నేహితుల్ని సంతోషపెట్టడానికి కూడా రాస్తాం..అదీ కాదూ,బహుశా మాకొచ్చిన కొన్ని ఆలోచనల్ని వదిలించుకోవాలని రాస్తాము..గొప్ప మెక్సికన్ రైటర్ అల్ఫోన్సో రెయిస్ నాతో ఏమన్నారంటే : "మనం రఫ్ డ్రాఫ్ట్స్ ని తప్పులు సరిదిద్ది మెరుగుపరుచుకోడానికి పబ్లిష్ చేస్తాం." ఆయనన్నది నిజమని నాకు తెలుసు..ఒక పుస్తకాన్ని రాశాక దాన్ని వదిలించుకోడానికీ,మర్చిపోడానికీ మేము పబ్లిష్ చేస్తాం..మేము రాసినవి పుస్తక రూపంలో కనపడగానే మాకు దానిపై ఆసక్తి పూర్తిగా పోతుంది..I’m sorry to say that people have written fifty or sixty books about me. I haven’t read a single one of them, since I know too much of the subject, and I’m sick and tired of it.
పుస్తకపఠనం గురించి మాట్లాడుతూ ,
పుస్తక పఠనం ఒక అనుభవం.ఎటువంటి అనుభవమంటే ఒక స్త్రీ వైపు దృష్టి సారించడం,ప్రేమలో పడడం,వీధి వెంబడి విలాసంగా నడవడంలాంటిదన్నమాట..వాటన్నిటిలాగే చదవడం ఒక అనుభవం,చాలా వాస్తవమైన అనుభవం.
"నా అభిప్రాయంలో రచయితలు తమ జీవితకాలంలో ఒకే పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ రాస్తుంటారు.కొద్దిపాటి మార్పులతో,వైవిధ్యంతో ప్రతీ తరం ముందు తరాలు రాసినదాన్ని తిరగరాస్తూ ఉంటుంది..ఈ విషయంలో మనిషి తనంతట తానుగా స్వతంత్రించి ఏమీ చెయ్యలేడు అనుకుంటాను.ఎందుకంటే అతడు భాషను ఉపయోగించాలి,కానీ భాష అనేది ఒక సంప్రదాయం..రచయిత సంప్రదాయాల్ని మార్చగలిగినా దాన్ని అంటిపెట్టుకున్న భూతకాలన్ని విస్మరించలేడు..అందుకే మనం కొద్దిపాటి కొత్తదనంతో సాహిత్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి అంటారు ఎలియట్ ..ఇక బెర్నార్డ్ షా అయితే Eugene O’Neill నుద్దేశించి అవమానకరంగా “There is nothing new about him except his novelties,” అన్నట్లు గుర్తు..meaning that novelties are trivial."
బోర్హెస్ గురించి బోర్హెస్ మాటల్లోనే :
"నాకు విముఖత ఉన్న అన్నిటికీ ప్రతీకగా నిలుస్తాడు బోర్హెస్..అతడు పబ్లిసిటీకి నిలబడతాడు ,ఫొటోగ్రాఫులకు పోజులిస్తాడు, ఇంటర్వ్యూలు ఇస్తాడు, రాజకీయాలకూ,అభిప్రాయాలకూ ప్రతినిధిగా ఉంటాడు,నన్నడిగితే అభిప్రాయాలన్నీ హేయమైనవంటాను..అతడు విలువలేని జయాపజయాలకు కూడా ప్రతినిధిగా నిలుస్తాడు..or, as he called them: where we can meet with triumph and disaster and treat those two imposters just the same. He deals in those things. While I, let us say, since the name of the paper is “Borges and I,” I stands not for the public man but for the private self, for reality, since these other things are unreal to me. The real things are feeling, dreaming, writing—as to publishing, that belongs, I think, to Borges, not to the I. Those things should be avoided. Of course I know that the ego has been denied by many philosophers.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క వ్యాసంలో ఎన్ని కబుర్లని చెప్పగలను ! ఈ పుస్తకంలో బోర్హెస్ ప్రేమనూ,స్నేహాన్నీ ఒకదానితోనొకటి పోలుస్తూ చేసిన విశ్లేషణ ఎంత నచ్చిందంటే దాని గురించి విడిగా మరో వ్యాసం రాయాలనిపించింది..ఎంత రాసినా ఇంకా రాయకుండా ఏదో మిగిలిపోయిందన్న భావన కలిగించే పుస్తకం ఇది.ఇందులో మరి కొన్ని నచ్చిన అంశాలను గురించి మరో వ్యాసంలో మరెప్పుడైనా..అంత వరకూ హ్యాపీ రీడింగ్. :)
పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు :
No comments:
Post a Comment