తరతరాలుగా సంస్కృతికి ఉన్న నిర్వచనాలు మారుతూ వస్తున్నాయి..చాలా ఏళ్ళ వరకూ సంస్కృతి ఒక మతసంబంధమైన,వేదాంతపరమైన జ్ఞానంగా మాత్రమే ఉండేది..ప్రాచీన కాలంలో గ్రీకులకు ఫిలాసఫీ, రోమన్లకు చట్టం సంస్కృతిని నిర్వచిస్తే, నేటి ఆధునిక తరంలో సైన్సు, సైంటిఫిక్ డిస్కవరీలు సంస్కృతిని నిర్వచించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి..శాస్త్ర సాంకేతిక విప్లవం మూలాలను పెకలించుకుంటూ పురోగమిస్తోంది..రాజకీయ,సామజిక స్థితిగతుల్లో పెనుమార్పులు తీసుకొచ్చే క్రమంలో టెక్నాలజీ జనసామాన్యానికి చేసిన మేలుతో పాటు కీడు కూడా ఉంది..ముఖ్యంగా కళారంగం మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నది ఆర్టిస్టుల అభియోగం..అభివృద్ధి మాటున కనుమరుగైపోతున్న సంస్కృతిని గురించి నోబుల్ గ్రహీత, స్పానిష్/పెరూ రచయిత మారియో వర్గస్ లోసా 'నోట్స్ ఆన్ డెత్ ఆఫ్ కల్చర్' పేరిట కొన్ని వ్యాసాలు రాశారు.
సంస్కృతిని హైబ్రో,లో బ్రో కల్చర్ అంటూ రెండు విధాలుగా దాని నాణ్యత దృష్ట్యా విభజించడం మనకు తెలిసిందే..ఇలియట్,జేమ్స్ జోయ్స్ వంటివారి రచనలు హైబ్రో కల్చర్ కి చెందితే, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే ,వాల్ట్ విట్మన్ లాంటివారి రచనలు సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో లోబ్రో కల్చర్ కి చెందుతాయి..ఈ విభజన రేఖల్ని చెరిపేస్తూ రష్యన్ తత్వవేత్త మిఖాయిల్ బఖ్తిన్, ఆయన అనుయాయులు రష్యన్ ఫార్మలిజం పేరిట తెలిసో తెలియకో ఒక రాడికల్ స్టెప్ తీసుకున్నారంటారు..బఖ్తిన్ ఫిలాసఫీ సంస్కృతి మీద ప్రభావం చూపిస్తూ కళారంగంలో గణనీయమైన మార్పులకు దారితీసింది.."ఒక దశలో సంస్కృతి లేని తరం రూపొందుతుంది" అని ఇలియట్ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ సామాన్యతకు అసామాన్యతను ఆపాదించడం వల్ల సంస్కృతి విలువ క్రమేపీ తగ్గనారంభించింది..ఈ రచనలో లోసా టి.ఎస్.ఇలియట్ Notes Towards the Definition of Culture పేరిట రాసిన పరిశీలనాత్మక వ్యాసంలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు..ఆదర్శవంతమైన సంస్కృతి వ్యక్తి, సమూహం, సమాజం ఈ మూడింటి సమన్వయ, సహకారాలతో ఏర్పడుతుందని ఇలియట్ అభిప్రాయపడతారు..ఎలైట్ క్లాసు పరిధిలో ఉండే సంస్కృతి యొక్క నాణ్యత పరిరక్షింపబడాలంటే అది మైనారిటీ కల్చర్ గా ఉండడం తప్పనిసరి అనేది ఆయన భావన..ఈ వాదన అందరూ సమానమని చాటే ప్రజాస్వామిక విలువలకూ ,లిబరల్ భావజాలాలకూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విలువలను చూసినప్పుడు ఇలియట్ జోస్యం నిజమైంది కదా అనిపిస్తుంది.
Image Courtesy Google |
సాంకేతిక విప్లవంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా సంస్కృతి కనుమరుగవ్వడానికి ఒక కారణంగా భావిస్తారు లోసా..ప్రజాస్వామ్యంలో ఎలైట్ క్లాస్ లాగే సామజిక వర్గం కూడా నిర్వహించవలసిన అవసరమున్న వ్యవస్థ..అందునా ఎలైట్ క్లాసు స్వయంప్రతిపత్తి ఉన్న సమూహం కాదు కాబట్టి తనకు తానుగా ప్రివిలెజ్డ్,ఆర్టిస్టోక్రసీ నుండి వచ్చిన వ్యక్తుల ద్వారా మాత్రమే అది గుర్తింపబడలేదు..ఎలైట్ క్లాస్ మూలాలు సామజిక వర్గానికి చెందిన కుల,మత,భాషలకు చెందిన వివిధ సమూహాలనుండి వ్రేళ్ళూనుకుని ఉంటాయి,ఈ వర్గాల ఆధారంగా ఎలైట్ క్లాసు ఉనికి ప్రభావితమవుతూ ఉంటుంది..నిజానికి ఇలియట్ కలలుగన్న 'హయ్యర్ క్లాస్' స్థిరమైనది కాదు, అభిరుచులను ఆసరా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యంతో ఎవరైనా ఒక వర్గంనుండి మరొక వర్గంలోకి వెళ్ళవచ్చు..ఈ బదలాయింపు ఒక నియమంగా కంటే ఒక మినహాయింపుగా ఉంటుంది..ఇటువంటి వ్యవస్థ సమాజాన్ని క్రమబద్ధీకరిస్తుందని నమ్ముతారు ఇలియట్..కానీ నేటి తరంలో కేవలం విద్య ద్వారా సంస్కృతిని సమాజంలోకి అన్ని వర్గాలకూ వ్యాప్తి చెయ్యవచ్చనే భ్రమ హయ్యర్ కల్చర్ ను ఒకవిధంగా నిర్వీర్యం చేస్తోందంటారు లోసా ఎందుకంటే సంస్కృతిని జ్ఞానంతో పోల్చడం సరికాదు..దీనికి తోడు సంస్కృతి క్షీణించడానికి దాన్ని ప్రజాస్వామ్యబద్ధం చెయ్యడం కూడా మరో కారణమని అభిప్రాయపడతారు లోసా..ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాల నియంత్రణలో ఉన్న సంస్కృతి, ప్రజాస్వామ్య, లిబరల్ సొసైటీలో అందరికీ అన్నీ సమానంగా అందుబాటులో ఉండాలన్న 'మోరల్ ఆబ్లిగేషన్' కారణంగా విద్య ద్వారా కళలనూ,సాహిత్యాన్నీ ప్రోత్సహించడం పేరిట అందరికీ లభ్యమవుతోంది..'అందరికీ సమానావకాశాలు' / 'అందరూ సమానం' అనే రెండు వాక్యాలకు అర్ధాలు వక్రీకరించబడి,కంప్యూటర్ కీ బోర్డు మీద టైపు చెయ్యడం వచ్చిన ప్రతివారూ రచయితలూ, ప్రచురించబడిన ప్రతిదీ సాహిత్యం అన్న తీరుగా తయారై సంస్కృతి అంతరించిపోతోంది..ఏ కళారూపమైనా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని అధికసంఖ్యలో జనానికి చేరాలన్న 'సివిక్ డ్యూటీ' (Quantity at the expense of quality) కళ యొక్క నాణ్యతను తగ్గించింది..కొత్త సంస్కృతికి కావాల్సినదల్లా మాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మరియు కమర్షియల్ సక్సెస్ మాత్రమే..వెలకూ, విలువకూ తేడాలు అదృశ్యమైపోయిన తరుణంలో ఆ రెండిటినీ ఒకే అర్ధంలో వాడుతున్నారు..ఈ కాలంలో విజయవంతమైనదీ,అమ్ముడుపోయేదీ మంచిది..జనరంజకం కానిదీ, అమ్ముడుపోనిదీ చెడ్డదిగా మిగిలిపోతోంది..విలువేదైనా ఉందీ అంటే అది మార్కెట్ నిర్దేశించే 'కమర్షియల్ వేల్యూ' మాత్రమే..ఇవన్నీ ప్రక్కన పెడితే నిజానికి అప్పుడూ ఎప్పుడూ కూడా సంస్కృతి మూలాలు ఇంటి వద్ద నుండే మొదలవుతాయి..కానీ కుటుంబ వ్యవస్థ,దాని తరువాత విద్యాసంస్థలు మాత్రమే సంస్కృతిని పరిరక్షిస్తాయనుకుంటే పొరపాటే..ఒకప్పుడు సాంస్కృతిక పరిరక్షణ చర్చి ఆధీనంలో ఉండే అంశం..కానీ సంస్కృతి అంటే అనేక కార్యకలాపాల సమాహారం కాదు కదా ! అది ఒక జీవన విధానం.
ఈ వ్యాసాల్లో ఇదే అంశం మీద పలు తత్వవేత్తలు రాసిన ఇతర రచనలను కూడా ప్రస్తావించారు లోసా..వాటిలో భాగంగా ప్రస్తావించిన రచనల్లో నేను గత ఏడాది చదివిన ఫ్రెంచ్ తత్వవేత్త గై డెబోర్డ్ రాసిన 'ది సొసైటీ ఆఫ్ స్పెక్టకల్' ప్రధానంగా చర్చకు వచ్చింది..సంస్కృతి విషయంలో లోసా,డెబోర్డ్ అభిప్రాయాల్లో పూర్తి సారూప్యత ఉన్నప్పటికీ సంస్కృతి అంతరించిపోవడానికి గల కారణాలను విశ్లేషించడానికి డెబోర్డ్ ఎంచుకున్న థీమ్స్ వేరు..ఆయన వాదనలన్నీ ఆర్ట్ కు దూరంగా మార్క్సిజం ఆధారంగా సోషల్ ల్యాండ్ స్కేప్ కు మాత్రమే పరిమితమయ్యాయి..వర్చ్యువల్ రియాలిటీ,3D సినిమా లాంటివి మనం అందులో ఏర్పాటుచేసిన కృత్రిమమైన వాస్తవికతలో భాగమేమో అని భ్రమింపజేస్తాయి..వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్నామేమో అనిపించేలా ఉండే ఈ సిమ్యులేటింగ్ టెక్నాలజీ మనకు వాస్తవికత హద్దులకు ఆవలనున్న ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది..ప్రేక్షకుల చుట్టూ ఏర్పడే అనేకానేకమైన ఇమేజెస్ ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అవుతూ,ఏది నిజమో,ఏది భ్రమో తెలియని కృత్రిమమైన జీవితానుభవాన్ని కలిగిస్తాయి..అదే విధంగా మాస్ మీడియా కూడా సమాజానికి వార్తల రూపంలో అనేకానేకమైన రాజకీయ,సాంఘిక,సాంస్కృతిక,భాషా/మతపరమైన ఫ్యాబ్రికేటెడ్ ఇమేజెస్ ను తయారుచేసి అందిస్తుంది..కానీ నిశితంగా పరిశీలిస్తే ఈ ఇమేజెస్ అన్నీ వాస్తవానికి సుదూరమైన కృత్రిమమైన రిప్రెజెంటేషన్స్ మాత్రమే..సమాజపు వాస్తవిక చిత్రం స్థానంలో ఈ ఊహా దృశ్యాలు వచ్చి చేరిన సందర్భంలో వాస్తవిక జీవితం ఈ ఇమేజెస్ ద్వారా ఎలా పునః నిర్మింపబడుతుందో గై డెబోర్డ్ తన రచనలో అనేక విశ్లేషణల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు..కమోడిటీ ప్రొడక్షన్ ను పెరిగేలా చేసే mass consumption మనిషిని ఒక వినియోగదారునిగా మార్చి సాంఘిక,ఆధ్యాత్మిక ,మానవీయ ప్రాముఖ్యతలనుండి దూరం చేస్తూ ఒక వస్తువుగా తయారుచేస్తోంది అంటారు డెబోర్డ్..క్యాపిటలిస్ట్ పద్మవ్యూహంలో చిక్కుకున్న మనిషి తనకు తెలీకుండానే మరో మనిషిని గూర్చిన కనీస స్పృహ లేకుండా ఏకాకి అయిపోతున్నాడు.
మరొకొందరు తత్వవేత్తల్ని కూడా పరిశీలిస్తే, మనిషి అస్తిత్వాన్ని నిరాకరించిన మిచెల్ ఫూకో,వాస్తవికత శైలిలోనే ఉంటుందన్న రోలాండ్ బార్త్,వాస్తవికత ఉనికి టెక్స్ట్ కు మాత్రమే పరిమితమన్న డెరిడా లకంటే, వాస్తవానికీ,మీడియా సృష్టించిన కాల్పనికతకీ మధ్య పరిధులు చెరిగిపోయిన ఈ తరాన్ని 'ఏజ్ ఆఫ్ సిములాక్రా' గా అభివర్ణిస్తూ ఫ్రెంచ్ సోషియాలజిస్టు జీన్ బాడ్రిల్లార్డ్ చేసిన వాదనలో స్పష్టత ఎక్కువ..బాడ్రిల్లార్డ్ అభిప్రాయం ప్రకారం నేడు నిజమైన వాస్తవికత కనుమరుగైపోయింది..నిజానికి మనం టీవీల్లో,సోషల్ మీడియాలో,మీడియా ప్రొఫెషనల్స్ ఎంపికచేసి సృష్టించే వార్తలో,ప్రొమోషన్స్,మార్కెటింగ్ యాడ్స్ లో చూసేది వాస్తవికతకు క్లోన్డ్ వెర్షన్ మాత్రమే..వాస్తవికత పూర్తి స్థాయి వర్చ్యువల్ రియాలిటీగా మారిపోగా, 'ప్రిన్సిపుల్ ఆఫ్ రియాలిటీ' మీద దాడి నైతిక విలువలపై దాడి కంటే గర్హనీయం అంటారు బాడ్రిల్లార్డ్..ఈ తరంలో ఇలా నిజాల్ని నిగ్గు తేల్చే మేథావులు లేరా అంటే ఉన్నారు గానీ, వాళ్ళు తమ తమ రంగాల్లో మాత్రమే ప్రతిభావంతులు..ఈ స్పెషలిస్టులకు తమ రంగానికి ఆవల ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు..తాము సాధించిన విజయాలు సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కూడా కనీస అవగాహన లేదు..లోసా ఈ 'వన్ డైమెన్షనల్ మనుషుల్ని' ఏకకాలంలో ప్రతిభావంతులూ,సంస్కృతి లేని అనాగరికులు అని అంటారు..వారి సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం అందరితోనూ కలవడానికి బదులు వారిని ఏకాకిని చేస్తొందంటారు లోసా.
నేటి తరంలో 'లైట్ లిటరేచర్' అంటే సులభంగా చదవగలిగే సాహిత్యం వినోదాన్ని పంచడమే పరమావధిగా మెజారిటీ పాఠకులకు ప్రాతినిథ్యం వహిస్తోంది..సరళమైన సాహిత్యంతో చిక్కేమిటంటే అది కళాత్మకత లోపించిన సినిమాలు,తేలికపాటి ఆర్ట్ల రూపంలో పాఠకులను కొంచెం కూడా ఎటువంటి తార్కిక దృష్టి పెట్టకుండానే తాము సంస్కృతి తెలిసిన మనుషులమనీ,నవనాగరికులమనీ భ్రమించేలా చేస్తుంది..అలాగని మునుపూ ముందూ సరళమైన సాహిత్యం లేదా అంటే, ఉంది..చక్కని సాహితీ విలువలతో కూడిన సరళమైన రచనలు చేసే నైపుణ్యం ఉన్న రచయితలు,వాటిని ఆదరించే పాఠకులూ మునుపు కూడా ఉండేవారు..ఇది జెనెరలైజ్డ్ స్టేట్మెంట్ ఎంతమాత్రమూ కాదు..కానీ ఈ రోజుల్లో సాహిత్యాన్ని చూస్తే జోయ్స్,వూల్ఫ్,బోర్హెస్,రిల్కే లాంటి వినూత్న శైలులతో ప్రయోగాలు చెయ్యగల సమర్ధత కలిగిన సాహసోపేతమైన రచయితలు బహు అరుదు..ఈ ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్ కాలంలో పుస్తకం చదవడమంటే పాఠకులకు పాప్ కార్న్ తిన్నట్లు ఉండాలి..ఈ తరం పాఠకులకు సమయాభావంతో పాటు సహనం కూడా తక్కువ..అందువల్ల రచయిత నర్మగర్భంగా చెప్పే విలువైన విషయాలను ఆసాంతం చదివి ఆస్వాదించే ఓపికా,తీరికా ఉండడంలేదు..ఈ రోజుల్లో ఒక గొప్ప రచన చేసిన రచయితతో సరిసమాన స్థాయిలో చదివి ఆకళింపు చేసుకోవాలంటే పెట్టవలసిన 'ఇంటెలెక్చువల్ కాన్సంట్రేషన్' పెట్టడానికి ఎవరూ ఇష్టపడడం లేదు..ఐదువందల పేజీల పుస్తకాన్ని ఐదు గంటల్లో నెట్ఫ్లిక్ సిరీస్ లో చూసే సౌలభ్యం ఉండగా అంత సమయం వెచ్చించడం మెదడుకి పనిపెట్టడం అవసరమా అనుకుంటున్నారు..దానికి తోడు బరువైన రచనలూ,ఫిలాసఫీలూ చదివితే మెదడుకి మంచిది కాదు,అనవసరమైన ఆలోచనలు అని కొందరు పెద్దలు పిల్లలను నిరుత్సాహపరచడం,వారించడం కూడా తరచూ చూస్తూ ఉంటాము..ఈ కారణంగా కళ్ళకు పని చెప్పి మెదడుకి తాళం వేస్తోందీ తరం..కర్ట్ వన్నెగట్ స్లాటర్ హౌస్ 5 పుస్తకం మీద సుదీర్ఘకాలంపాటు పనిచేశారంటారు..గంగిగోవు పాలు గరిటెడైన చాలు తరహాలో ఒకప్పుడు ఏళ్ళ తరబడి ఒకే పుస్తకాన్ని రాసీ, తిరగరాసీ ,హంగులద్దీ తదేకంగా శ్రమించేవారు..ఇప్పుడు 'లైట్ లిటరేచర్' కు డిమాండ్ పెరగడంతో రచయితలు కూడా కుప్పలుతెప్పలుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..ఈ కారణంగా సంస్కృతిని నిర్వచించే మౌలికాంశమైన సాహిత్యంలో నాణ్యత లోపించి సంస్కృతి కనుమరుగవుతోంది.
ఇక ఈ కాలంలో సాహితీ విమర్శ ఒక అంతరించిపోతున్న ప్రక్రియ..ఈరోజుల్లో సోషల్ మీడియా ముఖస్తుతులూ,మార్కెటింగ్ మాయాజాలాల మధ్య నిజాయితీగా రచన నాణ్యతను తూకం వేసే పనికి ఎవరైనా పూనుకోవడం బహుఅరుదు..అందువల్ల సాహితీ విమర్శ ఉత్తుత్తి ప్రశంసలతో కూడిన సమీక్షలుగా మిగిలిపోతోంది..ఒకప్పటి 'విమర్శ' కన్నదీ,విన్నదీ,చదివిందీ యథాతథంగా నమ్మకుండా మంచి చెడులు బేరీజు వేసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించేది..నేడు విమర్శకులు కూడా సర్కస్ లో కోతుల్లా వ్యవహరించి వినోదం పంచని పక్షంలో వాళ్ళకు ఎటువంటి ప్రాధాన్యతా లేదంటారు లోసా..దానికితోడు ఈ రోజుల్లో సాంస్కృతిక చర్చలు కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి..ఒకప్పుడు సంస్కృతి పట్ల మక్కువ,కాసింత కళాభిరుచీ ఉన్నవారు మంచి సాహిత్యం గురించో,ఒక మాస్టర్ పీస్ లాంటి సినిమా గురించో చర్చించేవారు..కానీ ఈరోజుల్లో నలుగురు కలిసే కూడళ్ళలో ,వేదికల్లో,సోషల్ మీడియాలోనూ మాట్లాడుకునే అంశాలు కూడా సామజిక శ్రేయస్సుకు ఏమాత్రం సంబంధంలేని అంశాలు..ఉదాహరణకు రియాలిటీ షోలూ,సెలెబ్రిటీల ద్వితీయ వివాహాలూ,మోడీ కన్నీళ్ళు పెట్టుకోవడం,ప్రముఖుల వ్యక్తిగత జీవితంలో గాసిప్స్ లాంటి అప్రధానమైన చౌకబారు విషయాలు నేటి హాట్ టాపిక్స్ గా చలామణి అవుతున్నాయి..యాభయ్యేళ్ళ క్రితం అమెరికాలాంటి దేశాల్లో ది న్యూయార్కర్ ,ది న్యూ రిపబ్లిక్ లాంటి పత్రికల్లో ఎడ్మండ్ విల్సన్,సొంటాగ్,బెర్జర్ లాంటి వాళ్ళు తమ వ్యాసాల ద్వారా ఒక పుస్తకాన్నో, నవలనో,కవితనో, వ్యాసాన్నో విశ్లేషించి వాటి నాణ్యతను అంచనా వేసేవారు..మరి ఇప్పుడూ ఓప్రా విన్ఫ్రె షోలూ, బుక్ క్లబ్ లూ,సోషల్ మీడియా సమీక్షలూ ఇలాంటివి నిర్ణయిస్తున్నాయి..కళాకారుడు తన కళ ద్వారా మాట్లాడాలి,తన మాటల ద్వారా కళను అమ్ముకోకూడదు.
వినోదం పంచడమే పరమావధిగా ఉన్న నేటి మాస్ కల్చర్ గ్లాడియేటర్ సినిమాలో నియంతృత్వ రాజ్యాన్ని తలపిస్తోంది..ఈ సంస్కృతిలో వినియోగదారుడు దేవుడు..అతడికి ఏ ప్రత్యేక విద్యార్హతలూ ఉండవలసిన అవసరంలేదు..దీనికితోడు పైరసీ వచ్చాకా ప్రపంచం మరింత చిన్నదైపోయింది..హాలీవుడ్ సినిమాలను గ్లోబలైజ్ చేసేసింది,సైబెర్నెటిక్ రివల్యూషన్ ప్రపంచీకరణను మరింత వేగవంతం చేసింది..ఏ దేశానికి చెందిన సంస్కృతి అయినా సినిమా,సంగీతం,సాహిత్యం వీటి రూపేణా సమాజంలోని అన్ని వర్గాలకూ అందుబాటులోకి వచ్చింది..అన్ని సరిహద్దుల్నీ దాటుకుని ఇన్ఫర్మేషన్ అన్ని వ్యవస్థల్లోకీ విస్తృతంగా ప్రవహిస్తోంది.. 'స్క్రీన్ ప్రపంచం' సంస్కృతి యొక్క స్పేస్ - టైమ్ ని ఏ మాత్రం నియంత్రణ లేకుండా స్థానభ్రంశం చేసి సమకాలీనమనే భావనకు అవకాశం లేకుండా చేసింది..ఒకప్పటి సంస్కృతికీ, నేటి సంస్కృతికీ వ్యత్యాసం ఏదైనా ఉంటే,ఒకప్పటి సంస్కృతి కాలదోషం పట్టకుండా తరాలపాటు నిలిచి ఉంది..ఈనాటి సంస్కృతి క్షణికం..ఇప్పుడు చూసే సినిమా పూర్తయ్యేసరికి గుర్తు ఉండదు..ఈరోజు చదివిన పుస్తకం రేపటికల్లా మరచిపోతాం..టాల్స్టాయ్,థామస్ మన్, జోయ్స్ ,ఫాక్నర్ లాంటి వాళ్ళ రచనలు వాళ్ళ జీవితకాలాల్ని మించి నేటికీ సజీవంగా నిలిచాయి..నేటి నెట్ఫ్లిక్ సోప్స్,బాలీవుడ్ మూవీస్ ,షకీరా కాన్సర్ట్స్ లాంటివి షో పూర్తయితే చాలు వాటి ఉనికిని కోల్పోతాయి..తమ స్థానంలో మరో విజయవంతమైన, తాత్కాలిక ప్రదర్శనలకు చోటు వదిలి అదృశ్యమైపోతాయి..నేటి తరంలో సంస్కృతి అంటే వినోదం,వినోదాన్ని పంచనిదేదీ సంస్కృతి కాదు.
ఈ రచనలో సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసే టూరిజం గురించి కూడా కొన్ని పేజీలు కేటాయించారు లోసా..Gilles Lipovetsky , Jean Serroy లు La cultura-mundo (Culture-World: Response to a Disoriented Society) పేరిట రాసిన పుస్తకంలో లక్షలాది యాత్రికులు ఈనాటికీ సిసిలీ లోని Louvre,The Acropolis and the Greek amphitheaters ను సందర్శిస్తున్నారు గనుక సంస్కృతి తన విలువ కోల్పోలేదనీ,దాని గొప్పదనాన్ని నిలబెట్టుకుంటోందనే వారి వాదనను ఖండిస్తూ యాత్రికులు ఇలా చారిత్రాత్మక స్థలాలకు,గొప్ప గొప్ప మ్యూజియంలకూ కుప్పలుతెప్పలుగా తరలి వెళ్ళడం హై కల్చర్ పట్ల నిజమైన ఆసక్తితో కాదనీ, కేవలం తమకు సంస్కృతి పట్ల గొప్ప అభిరుచి ఉందని నిరూపించుకోవడానికేననీ అంటారు లోసా..అంతటితో ఊరుకోకుండా ఇటువంటి చారిత్రాత్మక స్థలాలను సందర్శించడం 'పోస్ట్ మోడరన్ టూరిస్టు' బకెట్ లిస్టులో మరో గత్యంతరం లేక చెయ్యవలసిన పని అని ఛలోక్తి విసురుతారు..ఆయనన్నట్లు నేటి యాత్రికులు స్పష్టమైన 'సాంస్కృతిక స్పృహ' కలిగి ఉన్నారని చాటడానికి ఏదైనా ఒక చారిత్రాత్మక కట్టడం,పెయింటింగ్,ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్న సెల్ఫీ సాక్ష్యం చాలు మరి.
ఇక సంస్కృతి క్షీణించడంతో మతపరమైన కారణాలు చూస్తే,చాలా మందికి మతం ఒక అవసరం..మృత్యువు భయపెట్టినప్పుడూ,నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడూ స్వాంతన చేకూరుస్తూ మతం తోడుగా నేనున్నాననే నమ్మకం కలగజేస్తుంది..అధికశాతం ప్రజలు నైతికవిలువలకు లోబడి వ్యవహరించేది కూడా మతం ద్వారానే..కొద్దిమంది నాస్తిక మైనారిటీ వర్గం మాత్రం ఆ ఖాళీని సంస్కృతి,ఫిలాసఫీ,సైన్స్ ,సాహిత్యం,కళల ద్వారా పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది..కానీ చిక్కేమిటంటే ఆ వెలితిని సమర్ధవంతంగా పూరించగల శక్తి హయ్యర్ కల్చర్ కి మాత్రమే ఉంటుంది..జీవితంలో నిరంతరం ఎదురయ్యే సందిగ్దతలకూ,సమస్యలకూ,ఎనిగ్మాలకూ సమాధానాలు ఇవ్వగలిగింది హయ్యర్ కల్చర్ మాత్రమే అంటూ నేటి వినోద ప్రధానమైన సరదా సంస్కృతి ఆ ఖాళీని పూరించలేదంటారు లోసా.
ఒకప్పుడు ఇంగ్లాండ్ లో బెర్ట్రాండ్ రస్సెల్,ఫ్రాన్స్ లో కామూ,సాత్రే,ఇటలీ లో మొరావియా,విట్టోరినీ , జర్మనీలో గుంటర్ గ్రాస్,హన్స్ మాగ్నస్ ఎంజెన్స్బర్గర్ లాంటి విద్యావంతులూ,ఇంటెలెక్చువల్స్ ప్రముఖులుగా చలామణీ అయ్యేవారు..వీళ్ళందరూ రాజకీయ సామాజిక వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించేవారు..కానీ నేడు ఇటువంటి పండితులు పబ్లిక్ అఫైర్స్ లో తెరమరుగైపోయారు..కొంతమంది అడపాదడపా పత్రికలకు సంపాదకీయాలు రాస్తున్నా వాటి ప్రభావం నేటి సమాజం మీద అతి స్వల్పం..దీనికి కారణం Dominant culture లో జ్ఞానంకంటే వినోదానికీ, ఆలోచనలకంటే ఆకారానికీ, విలువైన విషయాల కంటే సాధారణ అంశాలకీ ప్రాధాన్యత పెరిగిపోయింది..ఒకప్పటి రాజకీయవేత్తలు శాస్త్రజ్ఞులూ, ఇంటెలెక్చువల్స్ తో ఫోటోలు తీసుకుని ఎన్నికల ప్రచారాలు నిర్వహించుకునేవారు..నేడు ఎన్నికల ప్రచారానికి సినిమా నటులతోనూ,సింగర్ లతోనూ,పాప్ స్టార్ లతోను,క్రీడాకారులతోనూ ఫోటోలు తీసుకుంటున్నారు..టీవీల్లోనూ,ఇతర ప్రచార మాధ్యమాల్లోనూ 'థింకింగ్' కి బదులు 'గ్లామర్' కి ప్రాముఖ్యత పెరిగింది..In the civilization of the spectacle, the comedian if the king..ఇటువంటి 'షో మాన్ షిప్' లో దిట్టలు కొందరు రాజకీయాల్లో చేరి ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం కూడా మనందరికీ తెలిసిన విషయమే..కానీ వీళ్ళకున్న అర్హతలేమిటి అనే ప్రశ్న వస్తే, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే అంతః సౌందర్యం,పాండిత్యం లేదా ఇంటెలెక్ట్ లాంటివి ఏవీ కాదు, కేవలం పైపై మెరుగుల సౌందర్యం,నటనా వైదుష్యం మాత్రమే..వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అనర్హులు అని పూర్తిగా అనకపోయినా మీడియా ప్రెజన్స్,నటనాకౌశలం ఉన్నవాళ్ళ అవసరం రాజకీయాలకు లేదని అభిప్రాయపడతారు లోసా..'సివిలైజేషన్ ఆఫ్ స్పెక్టకల్' లో రాజకీయాలు కూడా సాహిత్యంలాగే దిగజారిపోయాయి..రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే దానికి అవసరమైన విలువలు, శ్రద్ధ ,విశ్వాసం లాంటి లక్షణాలకంటే 'మీడియా ప్రెజన్స్' కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు..ఎన్నికల సమయంలో రాజకీయవేత్తలకు మొహం మీద ముడతలు,తెల్ల వెంట్రుకలు ,ముక్కు సైజు ,పళ్ళ తెల్లదనం, బట్టతల వంటివి సరి చూసుకోవడం ఎన్నికల పోలసీలు వివరించడం కంటే ముఖ్యమైపోయింది..ప్రదర్శన నిబద్ధత కంటే ముఖ్యం అయిపోయింది.
ఈ వ్యాసాల్లో భాగంగా లోసాకి ఇష్టమైన 'ఎరోటికా' కూడా చర్చకు వచ్చింది. సెక్స్ పట్ల లోసా అభిప్రాయాలు చదివాకా ఆయన రచనలపట్ల ఉండే కొన్ని అపోహలు తొలగిపోయి ఆయనపై గౌరవం రెట్టింపైంది..ఎరొటిసిజం కూడా క్రిటిసిజం,హై కల్చర్ ల లాగే కనుమరుగైపోయిందంటారాయన..సెక్స్ కు సంప్రదాయపు కట్టడినుంచి స్వేచ్ఛను ప్రసాదించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నాలు నిజంగానే మంచివేనా అనే దిశగా ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..ఆధునిక సమాజంలో సెక్స్ గురించి బాహాటంగా,నిర్భీతిగా మాట్లాడుకోవాలనీ,అది చాటుమాటు వ్యవహారంగా ఉండడం సరికాదనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి..కానీ ఇటువంటి స్వేచ్ఛ ఒక దైవసమానమైన 'డివైన్ ఆక్ట్' ను సాధారణం పనిలా మార్చేస్తుందని అభిప్రాయపడతారు లోసా. నేటి తరానికి సెక్స్ ఒక డాన్స్ క్లాసుకో, జిమ్ కో వెళ్ళడంతో సరిసమానంగా కేవలం తమ భౌతిక అవసరాలు తీర్చుకునే ఆటలా తయారైంది. బహుశా ఈ రకం సెక్స్ సైకాలాజికల్,ఎమోషనల్ బాలన్స్ కు మంచిది కావచ్చేమో గానీ ఇలా సెక్స్ ను సాధారణమైన పనిగా మార్చడం వల్ల ఉపయోగం లేదంటారు లోసా. సెక్సువల్ లిబర్టీస్ పెరిగినా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సెక్స్ క్రైమ్స్ ఏవీ తగ్గడం లేదు, పైపెచ్చు ప్రేమ,ఊహాత్మకత,భావోద్వేగాలకు తావులేని 'లైట్ సెక్స్' విపరీతంగా పెరిగింది..అటువంటి సెక్సువల్ ఆక్ట్ ను పూర్తి instinctive and animal sex గా అభివర్ణిస్తారు లోసా..ఈ తరహా సెక్సువల్ ఆక్ట్ మనిషి భౌతికావసరాన్ని తీరుస్తుంది గానీ ఇంద్రియాలనూ,భావోద్వేగాలనూ తృప్తిపరిచి,మనుషుల్ని దగ్గర చేసి జీవితాన్ని పరిపూర్ణం మాత్రం చెయ్యడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతుంది. అందువల్ల సెక్సువల్ ఆక్ట్ పూర్తైన మరుక్షణం ఎటువంటి సంతృప్తీ మిగలకుండా అందులో కృత్రిమంగా పాలుపంచుకున్న జంట తిరిగి అదే ఒంటరితనంలోకి నెట్టివెయ్యబడతారు. ఒకనాటి సాహిత్యానికీ,కళలకూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన సెక్స్ నేడు పోర్న్ గా, బహిరంగ స్థలాల్లో చేసే చవకబారు ప్రదర్శనగా మిగిలిపోయింది..సెక్సువల్ లైఫ్ ను సుసంపన్నం చెయ్యాలంటే దాన్ని దురభిప్రాయాలనుండి దూరం చెయ్యాలి గానీ, నాగరికత నుండీ,సభ్యతతో కూడిన సాంస్కృతిక ఆచారవ్యవహారాలనుండి వేరుచెయ్యడం సరికాదనీ లోసా ఘంటాపథంగా చెప్తారు.
ఒకప్పుడు సాహిత్యం,ఇతరత్రా కళలూ సామజిక సమస్యలకు అద్దం పట్టేవిగా ఉండి ప్రజల్లో సామజిక స్పృహ పెంపొందించేవిగా ఉండేవి..ఇప్పుడు సాహిత్యం ఒక ఎస్కేపిస్ట్ లిటరేచర్ లా సామజిక జాడ్యాల నుండి దూరంగా పారిపోయి బ్రతకడానికీ ,అత్యవసర సమస్యలను నిర్లక్ష్యం చెయ్యడానికీ అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన వ్యసనంలా మిగిలిపోయింది..నేటి కళలు ప్రజలకు ఒక ఉటోపియా ప్రపంచాన్ని సృష్టించి, వాస్తవాన్ని విస్మరించడం కోసం తీసుకునే మాదకద్రవ్యాల్లా మారిపోయాయి..ఈ రచనలో లోసా సంస్కృతి కనుమరుగవ్వడం పట్ల ఒక ఆర్టిస్టుగా తనలో కలవరాన్ని వ్యక్తం చేశారు..సంస్కృతిని కాపాడుకునే దిశగా నాగరికత తెలిసిన మనిషికి ఉండాల్సిన కనీస సామజిక బాధ్యతలను గుర్తుచేసే ప్రయత్నం చేశారు..ఆయన విశ్లేషణలన్నీ సున్నితత్వానికి దూరంగా స్థిరగంభీరమైన సాధికారక స్వరంలో ఒక కళాకారుడిలో పేరుకున్న నిస్సహాయతతో కూడిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి..కళాకారులకు తమ కళలో అత్యవసరమైన సహజత్వం,పరిపూర్ణత లోపించినప్పుడు కలిగే అసంతృప్తి లోసా స్వరంలో స్పష్టంగా కనిపిస్తుంది..ఈ వాదనలన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికీ ,రాజకీయ సామాజిక పరిస్థితులకూ వ్యతిరేకంగా చేసినవి..ఎలైట్ క్లాసులు అభివృద్ధి పేరిట కావాలని సీతకన్ను వేస్తున్న అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి..లోసా క్యాపిటలిస్టు కల్చర్ లోని చీకటి కోణాలనూ, దుష్ప్రభావాలనూ ఈ వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతాయుతమైన ప్రయత్నం చేశారు.
తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ 5th ఏప్రిల్ 2021.
https://lit.andhrajyothy.com/sahityanews/notes-on-the-death-of-culture-35553
https://epaper.andhrajyothy.com/3050947/Vijayawada-Main/05-04-2021#page/4/2
No comments:
Post a Comment