Friday, April 3, 2020

సైన్సు - సాహిత్యము

కెమిస్ట్రీ,ఫిజిక్స్,మాథ్స్ లాంటి సబ్జెక్టులు చిన్నప్పుడు స్కూల్లో విడివిడిగా నేర్చుకుంటాం..కానీ క్లాసులు పెరిగికొద్దీ ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుంటాయి..ఎంతగా అంటే ఒక దశలో వీటిలో ఒక సబ్జెక్టు రాకుండా మరో సబ్జెక్టు చదవడం అసంభవం అన్నంతగా,ఇది అందరికీ తెలిసిన విషయమే..ఒకరకంగా సైన్సు,సాహిత్యం కూడా ఇంతేనేమో అనిపిస్తుంది..“Science and literature are not two things, but two sides of one thing.” అంటారు Thomas Henry Huxley..రెండిటి లక్ష్యమూ ప్రశ్నించడమే,సమాధానాలు వెతుక్కోవడమే,సృజనాత్మకతకు పదును పెడుతూ మానవమస్తిష్కపు పరిథుల్ని శోధించడమే.
Image Courtesy Google
మొన్న రిచర్డ్ ఫైన్మన్ ని చదువుతున్నప్పుడు ఆయన ఆర్ట్ కూ,సైన్స్ కూ ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తూ రాసిన కొన్ని పేజీలు నాలో అనేక ఆలోచనలకు తెరతీశాయి.."Facts are not science as Dictionary is not literature" అని Martin H.Fischer అంటారు..నేను కూడా ఈ రెండు విభాగాల్లోనూ సృజనాత్మకత పుష్కలంగా ఉంటుందని నమ్ముతాను..ఒక సైన్స్ స్టూడెంట్ గా ఈ మాట అథారిటేటివ్ గా అనగలిగే అర్హత నాకుందనే అనుకుంటున్నాను..మరి సాహిత్యానికీ సైన్స్ కీ తేడా లేదా అంటే,ఉంది..ఈ రెంటికీ భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది.. I think literature is pure 'human experience' where as science is mere 'execution of facts'..ఇమాజినేషన్ ఉందని చెప్పి మళ్ళీ ఫాక్ట్స్ అంటారేంటి అని మీరనే ముందే,Let me elaborate...'ఊహాత్మకత' ప్రధానంగా చూస్తే  సాహిత్యానికీ ,సాంకేతికతకూ తేడా ఉండదు గానీ,'అనుభూతి' ప్రధానంగా ఈ రెండూ ఉత్తరదక్షిణ ధృవాలు,రెంటినీ కలపడం వీలుపడదు.

సైన్సు స్పష్టమైన సమాధానాల కోసం వెతుకుతుంది,నిర్వచనాలిస్తుంది..నిర్వచించలేనిది నిజం కాదంటుంది..'To define is to limit' కాబట్టి సమాధానం దొరకగానే అక్కడో అడ్డుగోడ తయారవుతుంది..ఏదో ఒక బిందువు వద్ద దాని విస్తృతి ఆగిపోతుంది..ఒక పరిధి దాటాక స్పష్టమైన పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది..సైన్సు మనిషి దైనందిన జీవితంతో పాటుగా ప్రకృతిపై,సమస్త విశ్వంపై ప్రత్యక్షమైన ప్రభావం కలిగి సాధికారికంగా వ్యవహరిస్తుంది..నిర్ణయాధికారం ఎప్పుడూ తన చెప్పుచేతల్లో ఉండాలనుకుంటుంది..ఇక్కడ మనిషికి సాంకేతికత పర్యవసానాల్ని నిస్సహాయంగా అంగీకరించడం మినహా,స్వతంత్రంగా కంట్రోల్ తీసుకునే అవకాశం తక్కువ..సరిగ్గా ఇక్కడే సాహిత్యం అవసరం తెరమీదకొస్తుంది..సైన్స్ మనకు దైనందిన జీవితంలో విషయపరిజ్ఞానాన్ని అందిస్తే,సాహిత్యం ఆ పరిజ్ఞానాన్ని ఎలావాడాలో / ఎంతవరకూ వాడాలో / అసలు వాడాలో వాడకూడదో నిర్ణయించుకునే విచక్షణను నేర్పుతుంది..ఈ విచక్షణ తెలియని మనిషి చేతిలో సాంకేతిక పరిజ్ఞానం పిచ్చివాడి చేతిలో రాయి వంటిది.

కానీ (మంచి)సాహిత్యం దీనికి భిన్నంగా నిర్వచనాలకు దూరంగా వ్యవహరిస్తుంది..సాహిత్యానికి  స్పష్టమైన సమాధానాలు అవసరం లేదు,వెతకదు కూడా..ఎక్స్ప్లోర్ చెయ్యడమే పరమావధిగా ఉంటుంది..ఆలోచనలు రేకెత్తించే వరకే దాని పని..ప్రశ్నలు లేవనెత్తి సమాధానాల కోసం వెతికే పని పాఠకుడికి వదిలేస్తుంది..ఇక ఒక పుస్తకాన్ని ఎవరెలా చదివారన్నది పూర్తిగా ఆ పాఠకుని మీద ఆధారపడి ఉంటుంది,No two persons ever read the same book అని మనకు తెలిసిందే..ఇక్కడ అడ్డుగోడలుండవు..పరిమితులుండవు..సాంకేతికతను భిన్నంగా సాహిత్యం వాస్తవ జీవితంపై పరోక్షంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది..మానవ జీవితంలో స్వయంగా వేలు పెట్టకుండా,ఒక కెటలిస్ట్ లా పరోక్షంగా ఉంటూ మనిషి ఆలోచనల్ని షేప్ చేసుకునే దిక్సూచిగా,మంచి గురువుగా మాత్రమే వ్యవహరిస్తుంది..సైన్స్ లో ఇమాజినేషన్ ఆబ్జెక్టివ్ గా ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ప్రయాణిస్తుంది..కానీ సాహిత్యం సబ్జెక్టివ్ గా ఖచ్చితమైన లక్ష్యాలకు దూరంగా మానవీయ విలువల ఆధారంగా,అనుభూతి ప్రధానంగా వ్యవహరిస్తుంది.

సైన్స్ ను ఉపయోగించి ఒక పారిజాతాన్ని పోలిన ప్లాస్టిక్ పువ్వుని సృష్టించగలం..అలాగే ఆర్టిఫిషియల్ గా దాని సువాసన కూడా తయారుచెయ్యగలం..కానీ ఒక అసలుసిసలు నిజమైన  పారిజాతం మొక్కనుండి క్రిందకి రాలిపడిన పువ్వుల్ని నలిగిపోకుండా అపురూపంగా  దోసిళ్ళలోకి తీసుకుని ఆ సుగంధాన్ని ఆస్వాదించడం (Outworldly experience,Isn't it ?) : ఈ అనుభూతి/అనుభవం సాహిత్యం,చిత్రలేఖనం,సంగీతం,నృత్యం లాంటి కళారూపాలు మాత్రమే అందించగలవు,సైన్స్ వల్ల సాధ్యం కాదు..కీట్స్,వర్డ్స్వర్త్,ఫ్రాస్ట్,ఎమెన్ వంటి కవుల పదాల్లో గుప్పుమనే సన్ఫ్లవర్స్,డఫోడిల్స్,క్రిమ్సన్ రోజెస్ వంటి పువ్వుల గుభాళింపునీ,సౌందర్యాన్నీ స్వచ్ఛమైన మానవీయ అనుభవంగా మార్చడం ఏ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల సాధ్యమవుతుంది ?

ఇక సాహిత్యం అనేది ఒక పూర్తి స్థాయి కళారూపం..అది ఆస్వాదించి,ఆనందించడానికే గానీ అభ్యసించడానికి కాదు..'కళ' అంటే ప్రస్తుతం అమల్లోకి వస్తున్న ఆధునిక నిర్వచనాలను ప్రక్కన పెడితే కనీసం నా దృష్టిలో స్వచ్ఛమైన కళ పరమావధి 'విజ్ఞాన సముపార్జన' ఎంతమాత్రం కాదు..ఇక సాహితీ ద్రష్టలందరూ తెలివైనవారా అంటే,ఉహూ కాదు..వైల్డ్ అనుకుంటా అంటారు,'All art is immoral and imperfect' అని..మరికొంతమంది ఇంకాస్త ముందుకి వెళ్ళి 'insane' అని మరో పదం కూడా జోడిస్తారు..రేషనాలిటీ/లాజిక్/ప్రాక్టీకాలిటీ లాంటి ఆధునికపదాలకు దూరంగా వ్యవహరించేదే నిజమైన ఆర్ట్..ఇది అభ్యసిస్తే అబ్బేది కాదు..మరి సాహిత్యాన్ని కూడా అభ్యసిస్తారు కదా అంటే,సైన్స్ చదివిన వారందరూ సైంటిస్టులు కానట్టే సాహిత్యాన్నిఅభ్యసించే వారందరూ సాహిత్యకారులూ కాలేరు..సృజన,ఆస్వాదన,అభ్యాసం ఇవన్నీ పరస్పర విరుద్ధమైన అంశాలు..ఏ రెంటినీ కలపడం వీలుపడదు.

ఎక్కడైనా చదివానో,లేక ఎవరైనా అన్నారో స్పష్టంగా గుర్తులేదు గానీ,ఎప్పుడూ మానవ మేథస్సు (సైన్స్/knowledge ) చేరుకోగలిగే స్థానంనుండి సాహిత్యం(Wisdom /వివేకం) కేవలం రెండంగుళాల దూరమేనట..అలాగే సాహిత్యం చేరగలిగే స్థానంనుండి ఆధ్యాత్మికత (Spirituality/ఆత్మ సాక్షత్కారం) మరో రెండంగుళాల దూరమేనట.

చివరగా,Charles Baudelaire అంటారు "Any literature that refuses to step in line with science and philosophy, is homicidal and suicidal literature" అని..మనిషి సౌకర్యవంతంగా,నాగరికంగా జీవించడానికి సాంకేతికత ఎంత అవసరమో,మనఃశాంతి,వివేకం,విచక్షణలతో జీవించడనికి సాహిత్యంలాంటి కళారూపాలు కూడా అంతే అవసరం..ఈ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు మానవజీవితం నరక ప్రాయమవుతుంది..పూర్తిగా మెటీరియలిస్టిక్ గా మారిపోయిన మనిషి తన ప్రాముఖ్యతల్ని విస్మరించి వ్యవహరించినప్పుడు,ఇప్పటిలా కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ నిస్సహాయంగా ఏదైనా మిరాకల్ కోసం ఎదురుచూపులు చూసే దుర్గతి ఎదురవుతుంది..చివరకు ఓటమినెరగని మానవ మేథస్సు కూడా వేరే గత్యంతరం లేక 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అనుకోవాల్సొస్తుంది.

No comments:

Post a Comment