Monday, September 23, 2019

Fly Already : Stories- Etgar Keret

ఇజ్రాయెల్ సాహిత్యానికి సంబంధించి 2017 మాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్న David Grossman 'A Horse Walks into a Bar' తప్ప ఇతరత్రా రచనలేవీ నేను చదవలేదు..కానీ అమోస్ ఓజ్ నీ,ఎట్గర్ కెరెట్ నీ చదవాలని చాలా కాలం నుండీ అనుకుంటూ వాయిదా వేస్తు వచ్చాను..ఈలోగా ఎట్గర్ కెరెట్ తాజా కథల పుస్తకం 'ఫ్లై ఆల్రెడీ' కనిపించింది..ప్రస్తుతం చదువుతున్నవి ప్రక్కన పెట్టి మరీ చదివినందుకు ఈ కథలు మంచి పఠనానుభవాన్ని మిగిల్చాయి..ఇందులో మొత్తం 22 కథల్నీ మరో ప్రముఖ జ్యూయిష్ రచయిత నాథన్ ఇంగ్లాండర్ తో పాటు మరి కొందరు అనువదించారు.
Image Courtesy Google
ఆ మధ్య ఎవరో రచయిత ఓప్రా విన్ఫ్రె చాలా తెలివైనావిడనీ,ఆవిడ రివ్యూలలో తొంభై శాతం స్టోరీ కలెక్షన్స్ ని రివ్యూ చెయ్యరనీ అన్నారు..ఈ పుస్తకం చదివాకా ఆ విషయం  గుర్తొచ్చింది..ఇరవై రెండు ఆణిముత్యాల్లాంటి కథల్లో ఏ ఒక్క కథనొదిలేసినా ఈ పుస్తకానికి రాసే వ్యాసానికి న్యాయం చెయ్యలేననిపించింది..ఇందులో ఒక్కో కథా ఒక్కో అద్భుతం..ఒక కాల్వినో..ఒక బోర్హెస్..ఒక సిగిస్మన్డ్... ఒక కెరెట్....ఒక షార్ట్ స్టోరీ రైటర్ గా ఇంతకంటే ఎట్గర్ కెరెట్ సత్తాను చాటిచెప్పడం నాకు సాధ్యం కాని పని..అందుకే ప్రతిసారి కంటే భిన్నంగా ఇందులో నాకు బాగా నచ్చిన ఒక కథను స్వేచ్ఛానువాదం చేశాను.

ఇందులో ఒక కథ 'The Birthday of a Failed Revolutionary' కి నా స్వేచ్ఛానువాదం :

అనగనగనగా ఒకూళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడట..చాలా ఏళ్ళ క్రితం అతడు ఏదో కనిపెట్టాడో లేక ఎవరో కనిపెట్టిన దాన్ని తస్కరించాడో సరిగ్గా గుర్తులేదు.కానీ ఆ కనుగొన్నది చాలా పెద్ద మొత్తానికి అమ్ముడుకాగా అతడు దాన్ని నీటి మీద,నేల మీద పెట్టుబడులు పెట్టాడు..నేలమీద అతడు చిన్న చిన్న కాంక్రీట్ క్యూబికల్స్ కొని తలపై చూరుకోసం ప్రాకులాడేవారికి అమ్మితే,నీటిని బాటిళ్ళలో నింపి దాహార్తితో ఉన్నవాళ్ళకి అమ్మి దాహం తీర్చాడు..ఈ అమ్మకాలు అయిపోయాక అతడు తన ఇంద్రభవనంలాంటి ఇంటికి తిరిగి వెళ్ళి గడించిన సంపదతో ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు..నిజానికి అతడు తన జీవితంతో ఏం చెయ్యవచ్చని ఆలోచించవచ్చు,ఇది కూడా అంత తక్కువ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు కాదు మరి.. but people with that much money are usually too busy to find time for that kind of thinking..అతడు తన సంపదను రెట్టింపు చేసే మార్గాలను యోచిస్తూ వాటితో పాటు తనను సంతోషపెట్టే వాటిని కూడా సంపాదించుకోవాలనుకుంటాడు..స్వభావరీత్యా సున్నిత మనస్కుడూ,అనుమానం మనిషీ కావడంతో అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవర్నీ నమ్మడు..నిజానికి అతడూహించింది నిజమే..అతడి చుట్టూ స్నేహితులుగా ఉన్నవాళ్ళందరూ అతడు సంపదకు ఆశపడి అతడి చుట్టూ చేరినవాళ్ళే,ఒక్క వ్యక్తి తప్ప..నిజానికి ధనవంతుడు మంచివాడు కాకపోవడం వల్ల ఒంటరికాలేదు..అతడు నిజానికి చాలా మంచివాడూ,ప్రముఖుడూను.

ఒకరోజు ధనవంతుడి సంపాదనకు ఆశపడని ఆ ఒక్క స్నేహితుడూ తన ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటాడు..ఇదిలా ఉండగా ధనవంతుడు తన తెల్లని పాలరాతి నేల మీద పడుకుని ఒంటరితనంతో రోజులు వెళ్ళదీస్తూ ఇలా అనుకుంటాడు “There must be something in the world that I want, that could make me happy. Something another person might have to spend his whole life trying to acquire but that I could buy without any effort.” నాలుగు రోజులు ఇలాగే గడిచాయి..ఒకరోజు ధనవంతుడికి  జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అతడి తల్లి ఫోన్ చేస్తుంది..మతిమరపు మనిషైన ఆవిడకి ఏమీ గుర్తులేకపోయినా అతి కొద్ది సన్నిహితుల వివరాలు మాత్రం గుర్తుంటాయి..తల్లితో మాట్లాడడం వల్ల కలిగిన సంతోషంతో అతడు సంభాషణ ముగించి ఫోన్ పెట్టేలోగా డోర్ బెల్ మోగుతుంది..ఎవరో తెలిసిన వ్యక్తి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పుష్పగుచ్ఛంతో పాటు బర్త్డే కార్డు ఉంటుంది..పంపిన వ్యక్తి మీద ధనవంతుడికి సదభిప్రాయం లేకపోయినప్పటికీ  అతడికి ఆ పూల పరిమళాలు  అమితానందాన్నిస్తాయి..ఆ క్షణంలో అతడిలోని వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది..ఒక్క పుట్టినరోజు ఇంతటి ఆనందానిస్తే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దానిని ఎందుకు జరుపుకోవాలి అనుకుంటాడు..అనుకున్నదే తడవుగా పేపర్ లో పుట్టినరోజులు కొనుక్కుంటానని పెద్ద ప్రకటన ఇస్తాడు..నిజానికి పుట్టినరోజులు కొనడం సాధ్యపడదు కదా,అందుకే అచ్చంగా పుట్టినరోజులు కాకపోయినా ఆ రోజుతో పాటొచ్చే బహుమతులూ,శుభాకాంక్షలూ,పార్టీలూ కొనుగోలు చేద్దామని తలపోస్తాడు..అప్పట్లో ఉన్న ఆర్ధికమాంద్యం వల్లనో,లేక ప్రజలకు తమ పుట్టినరోజులు అంత ప్రాముఖ్యత లేనివిగా అనిపించడం వల్లనో గానీ వారం తిరిగేలోపు అతడి ప్రకటనకు గొప్ప స్పందన వచ్చి అతడి డైరీ అంతా జన్మదినాల తాలూకూ తారీఖులతో నిండిపోతుంది..జన్మదినాలు అమ్మినవాళ్ళు అందరూ నిజాయితీపరులే గానీ ఒక్క వృద్ధుడు మాత్రం అన్నీ ఇవ్వకుండా తనకోసం కొన్ని తడి ముద్దుల్నీ,మనవలు బహుమతిగా ఇచ్చిన ఒక పిచ్చి పెయింటింగ్ నీ రహస్యంగా దాచుకుంటాడు.

ఇక ధనవంతుడికి ప్రతిరోజూ పుట్టినరోజుగా మారిపోతుంది..అపరిచితులైన పిల్లలూ,స్త్రీలూ ఎవరో ఒకరు అతడికి రోజూ ఫోన్ చేసి "హ్యాపీ బర్త్డే టూ యూ" అని పాడుతుంటారు..ఇంటికి రంగురంగుల గిఫ్ట్ రేపర్లు చుట్టిన బహుమతులు ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి..అతడి ఈమెయిలు బాక్సు శుభాకాంక్షల మెసేజీలతో నిండిపోతుంది..ఫిబ్రవరి నెలలో అక్కడక్కడా కొన్ని ఖాళీలు మిగిలిపోయినా అవి కూడా భర్తీ అయిపోతాయని అతడి మనుషులు నమ్మబలుకుతారు..ఇదిలా ఉంటే,ఇదంతా చూస్తూ భరించలేని ఎవరో వ్యక్తి ఒక ప్రముఖ దినపత్రికలో దీన్నొక 'అనైతిక చర్యగా' అభివర్ణించినా అది ధనవంతుడి సంతోషాన్ని కొంచెం కూడా తగ్గించలేకపోయింది,ఎందుకంటే ఆ రోజే అతడు ఒక పద్దెనిమిదేళ్ళ యువతి పుట్టినరోజు జరుపుకున్నాడు..ఆమె స్నేహితురాళ్ళు చెప్పిన శుభాకాంక్షలకు అతడికి కళ్ళ ముందు తన ఉజ్వల భవిష్యత్తు కదలాడింది.

కానీ ఈ సంతోషమంతా మార్చ్ 1 నాటికి అంతమైపోతుంది..నిజానికి ఆరోజు ధనవంతుడు 'భార్యను కోల్పోయి వైధవ్యం బారినపడ్డ ఒక కోపిష్టి' జన్మదినం జరుపుకోవాలి..కానీ ఆ రోజు ఉదయం నుండీ ఒక్క బహుమతిగానీ,శుభాకాంక్షలుగానీ ఏవీ రావు..అయినా ధనవంతుడు ఆశావాదికావడంతో ఆ రోజును ఎలాగైనా సద్వినియోగపరచుకుందామనుకుంటాడు..తననుంచి ఏమీ ఆశించక ఆత్మహత్య చేసుకున్న ఒకే ఒక్క స్నేహితుడి సంవత్సరీకం అదేరోజు కావడంతో స్మశానానికి బయలుదేరతాడు..అక్కడ సంతాపం ప్రకటించడానికి చాలా మంది జనం హాజరవడం చూస్తాడు..వచ్చినవాళ్ళందరూ సమాధిమీద ఎర్రగులాబీలుంచి,ఆ వ్యక్తి  మరణం తమ జీవితంలో ఎలా భర్తీచేయలేని వెలితిగా మిగిలిపోయిందో గుర్తుచేసుకుంటూ బాధపడతారు..ఇదంతా చూసిన ధనవంతుడి మదిలో మరో మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.."మరణానంతరం జనాలు చూపించే ప్రేమ మరణించినవారికి తెలిసే అవకాశం లేదు,కానీ నాకుంది..ఒకవేళ నేను చనిపోయినవాళ్ళ సంవత్సరీకాల్ని కొనుక్కుంటే !! అచ్చంగా వాళ్ళనుండి కాదుగానీ వాళ్ళ వారసుల వద్ద కొనుక్కుంటే ! అప్పుడు ఆ సమాధి మీద ఒక నల్లటి 'వన్ వే గ్లాస్' మీద ఒక మంచం ఏర్పాటు చేసుకుంటే అందరూ నన్నెంత మిస్ అవుతున్నారో నేను వినచ్చు" అనుకుంటాడు..ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉందిగానీ ఈ ఆలోచనను అమలుపరచడానికి మరునాడు ఆ ధనవంతుడు మాత్రం జీవించి లేడు..మరునాడు ఉదయం అతడు మరణించాడు..అతడు ఇటీవలే పండుగలా జరుపుకున్న అనేక సందర్భాల వలెనే అతడి మరణం కూడా అతడిది కాదు,అది వేరొకరి కోసం ఉద్దేశించబడినది..విప్పేసి ఉన్న గిఫ్టు రేపర్ల మధ్య అతడి శవం దొరికింది..ఆ తరువాత తెలిసిన విషయమేంటంటే ఆరోజు అతడు కొనుక్కున్న పుట్టినరోజు ఒక విఫలమైన విప్లకారుడిది,ఆ విప్లవకారుణ్ణి చంపడానికి గిఫ్ట్ రూపంలో వచ్చిన బాక్సు ఒక నిరంకుశ వ్యవస్థ పన్నిన పన్నాగం.

ధనవంతుడి అంత్యక్రియలకు జనం వేలల్లో హాజరయ్యారు..వచ్చిన వాళ్ళందరికీ అతడి సంపద మీదే కన్నున్నప్పటికీ వ్యక్తిగా అతడంటే కూడా ఎంతో అభిమానం..అందుకే వాళ్ళందరూ అతణ్ణి గంటలకొద్దీ శ్లాఘిస్తూ,సంతాప గీతాలు పాడారు..ఇది ఎంతగా మనసుని కదిలించిన విషయమంటే చివరకు ధనవంతుడి  అంత్యక్రియలకు చట్టపరమైన హక్కుల్ని కొనుక్కున్న యువ చైనీస్ బిలియనీర్ కూడా సమాధి అడుగున రహస్యంగా కట్టుకున్న నల్లని క్యూబికల్ లో కూర్చుని ఇదంతా చూస్తూ రెండు కన్నీటి బొట్లు కార్చాడు.

Publishers : Granta Books
Pages        : 224 pages

4 comments: