Monday, February 19, 2018

కథా - కాలక్షేపం

"అన్ని పుస్తకాలు ఊరికే చదవకపోతే నువ్వు కూడా ఏదైనా రాయొచ్చు కదా,కథలో కాకరకాయలో రాల్తాయి"
నాకు బాగా సన్నిహితులైన మిత్రులు ఒకసారి సరదాగా అన్న మాట ఇది..
"సరిపోయింది ! నువ్వనేది ఎలా ఉందంటే అన్ని సినిమాలు ఊరికే చూడకపోతే ఏదో ఒక సినిమా నువ్వే తియ్యచ్చు కదా ! అన్నట్లుంది మీ వరస" నా సమాధానం.. 

చదివేవాళ్ళందరూ రాయలేరు,రాయవలసిన అవసరమూ లేదు..కానీ రాయాలనుకునేవాళ్ళు అందరూ చదవాలి...శాస్త్రీయ సంగీతం ఆస్వాదించగలిగినవారు అందరూ సంగీతకారులు కాలేరు..ఈ వర్గంవారు రసాస్వాదనకే  పరిమితమవుతారు..అయినా అందరూ రచయితలైపోతే పాఠకులెవరని ?????  :) 

గత సంవత్సరం నుండీ చదివిన కొందరు రచయితలు బుర్రలో తిష్ట వేసుకుని కూర్చుని,స్టోరీ క్రాఫ్టింగ్ గురించి ఆలోచనలో పడేశారు..హోల్డ్ ఆన్..హోల్డ్ ఆన్.. ఇప్పుడు కథలెలా రాయాలో నేను చెప్పబోవటం లేదు..ఈ 'క్రాఫ్టింగ్' అనే బ్రహ్మపదార్థం గురించి గతంలో మహామహులంతా ఎప్పుడో ఉద్గ్రంధాల్లో రాసేసి మన చేతిలో పెట్టారు..ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏదీ లేదు..కానీ కూరలు కొంటున్నప్పుడు చచ్చులూ,పుచ్చులూ లేకుండా నాణ్యమైనవి ఎలా ఏరుకుంటామో,ఒక పాఠకురాలిగా రచనలో నాణ్యతను కోరుకోవడం కూడా సహజం..అయినా ఈ భావజాలాల విషయానికొస్తే Everything is already said...And everything is already done..We all are mere translators..We all are mere followers..అనే నేను నమ్మే ఫిలాసఫీని  ఎప్పుడో ట్విన్ టాక్ చేసినట్లు గుర్తు.. :P 

ఫిలాసఫీని భక్తి శ్రద్ధలతో చదువుతున్న రోజుల్లో,పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువ చదవకూడదేమో ,చదివితే తమకు తెలీకుండానే ఆ రచయితల భావజాలాల్లో కొట్టుకుపోతారేమో అనిపించేది..'రచయితలం ఏదైనా ప్రతిపాదన చేశాక ఆ విషయాన్ని ఆల్రెడీ ఆస్కార్ వైల్డ్ చెప్పేశాడేమో అని ఒక సారి వెరిఫై చేసుకుంటామని' డోరతీ పార్కర్ అన్నట్లు కొన్నిసార్లు భావజాలాలు సంఘర్షించుకోవడం అనివార్యమేమో అనిపిస్తుంది..మళ్ళీ మొన్నామధ్య ఆడమ్ ఫిలిప్స్ 'అన్ ఫర్బిడెన్ ప్లెషర్స్' చదువుతున్నప్పుడు ఇదే విషయం అందులో కూడా చర్చకొచ్చింది..నీషే తన రచనల్లో తాను చదివిన రచయితల ఉనికిని గమనించలేకపోయాననీ,అందువల్లే తన భావజాలంలో స్వఛ్ఛత లోపించిందనీ  వాపోతారు..కానీ రచయితలకు,ముఖ్యంగా ఫిలాసఫర్లకు  ఈ ఐడియాలజీస్ overlap అవ్వకుండా ఆపడం సాధ్యమేనా !!!!!!!

ఫిలాసఫీ గురించి ప్రక్కన పెడితే సిద్ధాంతాలు,ప్రతిపాదనలు అవసరం లేని కథలు అంటూ ఉంటాయా! 'ఏ కథైనా రచయిత భావజాలాన్ని ప్రతిబింబించాలి' అనే సూత్రం తప్పనిసరా  అనేది మరో ప్రశ్న..Kurt Vonnegut,టాల్స్టాయ్,పిరెండెల్లో,కార్వర్,గుల్జార్,మంటో,బ్రాడ్బరీ వంటి వాళ్ళను చదువుతుంటే అసలు కథంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది...ముఖ్యంగా డెబ్భైల ముందు వచ్చిన సాహిత్యానికీ,ఇప్పటి సాహిత్యానికీ నాణ్యతలో ఉన్న తేడా తెలియాలంటే మన ముందు తరాల రచయితల్ని చదవాలి..అందులోనూ కథలు రాయాలనుకున్నవారు తప్పకుండా చదవాలి..ఇన్నేళ్ళుగా మిరియాలు వాడుతూ 'ఘాటు' అనుకునే నాకు పోయినేడాది వాయనాడ్ లో మిరియాల తోటల్లో కోసిన మిరియాల్ని చేతిలోకి తీసుకుని ఒక చిన్న మిరియాన్ని నోట్లో వేసుకుని చూసినప్పుడు గానీ తెలీలేదు,అసలు మిరియాల 'ఘాటు' ఎలా ఉంటుందో..సాహిత్యానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందనుకుంటా..ఆ 'ఘాటు' సమకాలీన సాహిత్యంలో లోపించింది...అసలు రాసేవాళ్ళు ఎంతమంది చదువుతారు అనేది ఇక్కడ మొదట ఆలోచించవలసిన విషయం..నాలుగు పుస్తకాలు చదివి,ఒక్క పుస్తకం రాసి 'సెలబ్రిటీ రైటర్' ట్యాగ్ తగిలించేసుకుంటున్నవాళ్ళలో లోపిస్తున్న అంకితభావం/నిలకడ లాంటి అంశాల గురించి ప్రముఖ రచయిత్రి ఉర్సులా లెగైన్ 'నో టైం టు స్పేర్' లో చాలానే చురకలంటించారు..'As a writer, you should not judge, you should understand.' అని హెమ్మింగ్వే చెప్పిన రచనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని ఎంత మంది ఆచరిస్తున్నారో ఆలోచించవలసిన విషయమే..సమకాలీన సాహిత్యంలో స్త్రీవాదం,దళితవాదం,జాతి-మత-ప్రాంతీయ వాదాల మినహా ఇంకేదైనా దొరకాలంటే భూతద్దంలో వెతుక్కోవడమే అవుతోంది ..అప్పట్లో జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో ఒక ప్రముఖ పబ్లికేషన్ సంస్థ 'మాకు క్వాలిటీ ముఖ్యం..శోభా డే,చేతన్ భగత్ లాంటి వాళ్ళ పుస్తకాలు మేం పబ్లిష్ చెయ్యం' అని ఘంటాపథం గా చెప్పడమే సమకాలీన సాహిత్యానికి చెంపపెట్టులాంటి సంఘటన.

ఒక కథ ద్వారా ప్రపంచానికి ఏదో సందేశం ఇద్దామని,ఒక పది సందేశాలను తయారు చేసుకుని,ఆ సందేశాన్ని సౌకర్యవంతంగా ఒక పాత్ర నోటి ద్వారా కక్కించి,తమ అస్థిత్వపు వైకల్యాలన్నీ సంభాషణల్లో ఇరికించి,ఇసుక పాళ్ళు ఎక్కువైన సిమెంట్ లాంటి కథనంతో బలహీనమైన పునాదుల్ని లేపి,నేపథ్యం లేకుండా కూర్చిన కథ ప్యాచ్ వర్క్ చేసిన చీరలా ఉంటే,ఒక్కో నూలు పోగునీ జాగ్రత్తగా మగ్గం మీద ఓపిగ్గా నేసిన నేత కార్మికుని చీర లాంటిది నాణ్యత కలిగిన కథ..పెద్దవాళ్ళు చెప్పే నీతి బోధలు పసివారికి ఎలా విసుగ్గా ఉంటాయో,రచయితలు ఇది మంచి,ఇది చెడు అని చెయ్యి పట్టుకుని నడిపిస్తుంటే పాఠకులకు కూడా అంతే విసుగ్గా ఉంటుంది..పసి పిల్లవాడు ప్రపంచాన్ని తన అనుభవం ద్వారా తెలుసుకుందామని ఉబలాటపడతాడు..అలాగే పాఠకులకు ఆ అనుభవాన్ని దూరం చేసి ప్రతీదీ తేటతెల్లం చేసి చెప్పడం,నా వరకూ ఒక రచయిత చెయ్యగలిగే క్రూరమైన పని..భావజాలాల చిక్కుముడుల్లోపడి ఉండిపోకుండా,ఆ చిక్కుల్ని విడదీసుకుని రచయిత తన పరిధిని ఎంతగా విస్తరించుకుంటారనేదానిపై ఆ రచన నాణ్యత ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది..స్వఛ్ఛమైన రచన ( A creative piece of work in its purest form) చెయ్యడం ఎవరివల్లా కాని పనైతే కాదు..కానీ అలా సృష్టించడానికి మనిషిలో మనుష్యత్వానికి మించిందేదో ఉండాలి..బహుశా దైవాంశ సంభూతులు అంటారేమో అటువంటి వారిని..ఉదాహరణకు జాన్ బెర్జర్ 'ది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పికాసో' చదువుతున్నప్పుడు పికాసో చిత్రాలను గీయడాన్ని 'ఒక స్పృహ లేని స్థితిలో జరిగిన చర్య'గా అభివర్ణిస్తారు..అలా 'తన నుండి తాను విడివడి' సృష్టించే ప్రతీదీ ఒక కళా ఖండమవుతుంది..అసలైన ఆర్ట్ కి Consciousness తో పని లేదంటారు బెర్జర్,వైల్డ్ లాంటివాళ్ళు ..మరి కుల,మత,భాష,లింగ,జాతి భేదాలతో తమను నిర్వచించుకోకుండా పొద్దుపోని ఆర్టిస్టుల నుండి తయారయ్యే కళాఖండాల్లో (?)  ఈ స్వఛ్ఛత కోరుకోవడం అత్యాశేనేమో..

No comments:

Post a Comment