Tuesday, April 1, 2025

"Reality continues to ruin my life" అను పాఠకుల పాట్లు

నాకు చిన్నప్పటినుండీ బిగ్ బీ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ టీవీలో వచ్చినప్పుడు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూసాను. రేఖతో "దేఖా ఏక్ ఖ్వాబ్ తో యే సిల్ సిలే హుయే" అని డ్యూయెట్ పాడినా, "బడీ సూనీ సూనీ హై జిందగీ యే జిందగీ" అని వైన్ గ్లాసు చేత్తో పట్టుకుని నిరాశ నిండిన కళ్ళతో నిలబడినా, "దేదే ప్యార్ దే ప్యార్ దే, ప్యార్ దేదే" అంటూ నడివీధిలో అర్థరాత్రి అల్లరి చేసినా, యాంగ్రీ యంగ్ మాన్ లా గంభీరమైన గొంతుతో డైలాగ్స్ చెప్పినా "క్యా బాత్ హై!" అనుకుంటూ సగటు అభిమానిలా ఆనందిస్తాను.

సపోజ్, నాకంత ఇష్టమైన బిగ్ బీని ప్రత్యక్షంగా  కలిసే అవకాశం  వచ్చిందనుకుందాం, (అంత విషయం లేదనుకోండి, ఉత్తినే ఊహించుకుందాం) హ్రిషికేష్ ముఖర్జీ "గుడ్డి" సినిమాలో హీరోయిన్లా ఉంటుంది నా పరిస్థితి. మన మానసిక ప్రపంచంలోని ఫాంటసీలో అంత "లార్జర్ దాన్ లైఫ్" పర్సనాలిటీ కాస్తా దైనందిన జీవితంలో నిత్యం కనిపించే అతి మామూలు మనిషిగా మారిపోతారు కదా! ఇప్పుడాయన భార్యా పిల్లలున్న ఒక పెద్దాయన, వృత్తి రీత్యా యాక్టరు అంతే. ఎంతటి ఆశాభంగం!! అయినా సరే, నేను "సర్లే పోనీ" అని ఊరుకోకుండా ఆ మనిషిలో 'సిల్ సిలా'లో డ్యూయెట్ పాడిన 'అమిత్ మల్హోత్రా' కోసం వెతుకుతాను. 'అభిమాన్లో' పాపులర్ సింగర్ 'సుబీర్ కుమార్' ఛాయలేమన్నా ఈ పెద్దాయనలో కనిపిస్తాయేమో అని ఆశగా చూస్తాను. "ఆనంద్"లో 'డాక్టర్ భాస్కర్ బెనర్జీ' ఇతనయ్యే అవకాశం లేదులే అని పెదవి విరుస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క జీవితం. అంతే. చివరకు నా మానసిక గెలాక్సీలో ముక్కలుచెక్కలుగా బద్దలై నలుదిశలకూ చెదిరిపోతున్న నా ఫాంటసీ ప్రపంచాల తాలూకూ గ్రహశకలాలను తలుచుకుని కాల్విన్ లా "రియాలిటీ కంటిన్యూస్ టు రూన్ మై లైఫ్" అని నిట్టూరుస్తాను.

అన్నట్లు ఇలాంటి ఆశాభంగమే RGV కి కూడా జరిగిందట. ఆయన ఒకసారెప్పుడో జగదేక సుందరి శ్రీదేవికి పెళ్ళైన తరువాత ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు చేతిలో కాఫీ కప్పుతో  వచ్చి నవ్వుతూ పలకరించిన ఆ 'అతిలోక సుందరి'ని చూసి, "ఆమెను ఒక సాధారణ గృహిణిగా మార్చిపారేసిన బోనీ కపూర్ ని ఆ క్షణంలో చంపెయ్యాలనిపించింది" అంటారు నవ్వుతూ. ట్రస్ట్ మీ,  ఫాంటసీ ప్రపంచాలు నాశనమైపోతే కలిగే బాధ అంతా ఇంతా కాదు. :)) ఎప్పుడూ కళాకారులే తమ ఆర్టిస్టిక్ కష్టాల గురించి ఏకరువు పెడుతూ ఉంటారు. కానీ ఆ ఆర్ట్ ని "consume" చేసే వినియోగదారులకు కూడా పైన రాసినట్లు చాలా  రకాల కష్టాలుంటాయి. సీత కష్టాలు సీతవీ, పీత కష్టాలు పీతవీ అంటారందుకే. :) 

ఆ మధ్య ఎవరో ఒక సరదా ప్రశ్న అడిగారు, "నువ్వు ఏ దీవిలోనైనా ఒంటరిగా తప్పిపోతే ఏ రచయితతో  కలిసి తప్పిపోవడం నీకిష్టం?" అని. ఇదే ప్రశ్న సినిమా వాళ్ళ గురించి కూడా అడుగుతుంటారులెండి :) వాళ్ళు అడిగింది చాలా సరదా ప్రశ్నే అయినా నాకు ఆ ప్రశ్న చాలా భయపెట్టేదిగా అనిపిస్తుంది. పైకి పద్ధతిగా ఏం చెప్పాలో తెలీని గందరగోళంలో పిచ్చి నవ్వు నవ్వుతున్నా, లోపల మాత్రం అంతరాత్మ "అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు? రచయితతో తప్పిపోవడమేంటి? ఆ ఊహే భయంకరంగా లేదూ?" అని కేకలు పెడుతోంది. కానీ ఏదో ఒక జవాబు చెప్పాలి కాబట్టి ఆలోచించాను.

జేన్ ఆస్టెన్? -మిస్టర్ డార్సీ, ప్రేమ, రొమాన్స్ ఆవిడ రాతల్లో ఉంటాయి గానీ పాపం జీవితంలో లేవంటారు, దానికి తోడు పరమ జడ్జిమెంటల్, కష్టం.

సిగిజ్మండ్? "డెల్యూషనల్ థింకింగ్" స్టయిల్లో రాయడం కోసం రాత్రంతా తిండీతిప్పలూ మానేసి ఎముకలు కొరికే చలిలో కూర్చున్న పెద్దమనిషి, మనల్ని  కూడా తోడు కూర్చోమంటే? ఎందుకొచ్చిన రిస్కు!

బుకౌస్కి? పోనీ హెమ్మింగ్వే? వాళ్ళ ప్రక్కనే కూర్చుని మాట్లాడాలంటే మనం కూడా కంపెనీ ఇస్తూ హాఫో, క్వార్టరో వెయ్యాలేమో! ఎందుకొచ్చిన గోల.

పోనీ కామూ? నిజాయితీ, ప్రేమా తప్ప బొత్తిగా ఫీలింగ్స్ ఉండకూడదనే ఆ ఎమోషన్స్ లేని నిహిలిజానికీ మనకీ సరిపోదు గానీ, నెక్స్ట్ ... 

పోనీ జాయిస్? ప్రతీ విషయంలోనూ ఆ బ్రెయిన్ స్టోర్మింగ్ డీటెయిల్స్ తట్టుకోలేం. మనుషుల్లో మరీ అంత ఎనలిటికల్ స్కిల్స్ అంటే నాకు చచ్చే భయం. రేప్పొద్దున నా రోజువారీ పనికిరాని జీవితం గురించి కూడా ఒక నవల రాసినా రాసేస్తారు.

అవునూ బోర్హెస్ ని ఎలా మర్చిపోయాను? ప్రతీ విషయానికీ మల్టీపుల్ డైమెన్షన్స్ వెతికే ఆయన లెక్కల చిక్కులు విప్పేసరికి మనకి నీరసం వస్తుంది. నిజానికి ఆయన "తొలిప్రేమ" కూడా ఆయన నెర్డినెస్, గ్రంపీనెస్ భరించలేక ఆయనతో బ్రేక్ అప్ చెప్పారని ఒక పుస్తకంలో చదివాను. తర్వాత ఆయన ఆ ప్రేమను మ్యూజ్ గా చేసుకుని గొప్ప రచయితగా ఎదిగారంటారు, అది వేరే విషయం.

ఈ సంభావ్యతల చిట్టా చాలాసేపు కొనసాగాక చివరకు తేలిందేంటంటే, ఏ గొప్ప రచయితనైనా పుస్తకం రూపంలో చదవడం బావుంటుంది గానీ వాళ్ళని  నిజజీవితంలో రక్తమాంసాలున్న మనిషిగా వాస్తవ ప్రపంచంలో ఊహించడం కష్టం. నిజానికి ఈ మాట ఒక్క రచయిత విషయంలోనే కాదు ఆర్టిస్టిక్ స్ట్రీక్ ఉన్న ప్రతీ ఒక్కరికీ, మొత్తం ఆర్ట్ ప్రపంచానికీ వర్తిస్తుందనిపిస్తుంది. ఆర్ట్ విషయంలో మన సంబంధం వాళ్ళ మెదడుతో, అందులోని ఆలోచనలతో, వాళ్ళ ఫాంటసీ ప్రపంచాలతో. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ "స్పిరిట్ అండ్ సోల్"తో.

రెండేళ్ళ క్రితం అనుకుంటా, గుల్జార్ గురించి ఆయన కూతురు మేఘన రాసిన పుస్తకం "Because He Is" ఒకటి చదివాను. ఆయన తనకు ఏ రకం చాక్లెట్లు తెచ్చేవారో, తన తెల్ల లాల్చీ పైజామా ఎక్కడ ఇస్త్రీ చేయించుకునేవారో, ఏ బ్రాండ్ సిగరెట్లు వాడేవారో- ఇటువంటి  విషయాలను ఏకరువుపెడుతూ మనకి అంతుపట్టని ఉపరితలంలో ఉన్న ఆయన తాత్వికతను కాలికిందవేసి తొక్కేసి, ఆయన్ని రక్తమాంసాలున్న మామూలు మనిషిగా,అంతకుమించి ఒక సగటు తండ్రిగా నేలమీదకి లాగి పడేసిందా పిల్ల :))  గాడ్!! ఐ హేటెడ్ హర్ ఫర్ దట్. నా మెదడులో 'గుల్జార్' పేరు వినగానే గుర్తొచ్చే సినిమా పాటలూ, ఖంగుమనే కంఠంతో చదివిన కవిత్వం- వీటన్నిటినీ ఫార్మాట్  చేసేస్తూ ఆయన్ని ఒక సాధారణ భర్తగా, తండ్రిగా, సమస్త లోపాలూ ఉన్న మనిషిగా నా కళ్ళ ముందు నిలబెట్టేసింది. ఆ దెబ్బతో మళ్ళీ అటువంటి పుస్తకాల జోలికి పోలేదు నేను. గమనిస్తే ఈ ఇబ్బంది మరీ ముఖ్యంగా మన అభిమాన ఫిక్షనల్ ప్రపంచపు మనుషుల విషయంలో ఎక్కువగా ఎదురవుతుంది.

సో మై డియర్ ఆర్టిస్ట్! నాకు నీ ఆలోచనలిష్టం, నీ రాతల్లో ప్రాణం పోసుకునే అక్షరాలిష్టం, జీవితంలో పచ్చితనాన్ని ఎస్తెటిక్స్ తో ఫ్యాబ్రికేట్ చేసి చూపించే వాస్తవాలిష్టం. అంతేగానీ నువ్వు ఏం తింటావో, ఎన్ని గంటలకి యోగా చేస్తావో, నీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో, నీకెంతమంది పిల్లలో, వాళ్ళ పెంపకం ఎలా చేస్తావో, ఎన్ని గంటలు నిద్రపోతావో, ఎక్కడ షాపింగ్ చేస్తావో, నువ్వు వాడే బ్రాండ్ పెన్ ఏమిటో- ఇలాంటి వివరాలు తెలుసుకునే ఆసక్తి నాకు అస్సలు లేదు. నీ గురించి అన్నీ తెలిసిపోయాక, మిస్టరీ విడిపోయాక నీ రాతలు చదవాలనే ఆసక్తి కలగదు. I do not want to trade my beautiful fantasy for your stinking reality. No, thank you.

PS : నేనూ నా చదువు గురించి ఒక పుస్తకం రాశాను. అంచేత ఈ పోస్టుని పర్సనల్గా తీసుకుని మనోభావాలు దెబ్బతీసుకోకండి. :) 

కొన్నేళ్ళ క్రితం పోస్ట్ చేసిన మిత్రుల మధ్య సంభాషణల్లో దొర్లిన నా సరదా సమాధానాలు:

Copyright A Homemaker's Utopia

Copyright A Homemaker's Utopia

2 comments:

  1. Hello, this is Sowmya. Sowmyavadam ani blog raasthoo untanu. ee topic chala rojula nunchi naa mind lo undi kani i didn't write on it. raasi unte plagiarism charge padedi... it would've looked dangerously similar to yours, haha! It was good to know there are other organisms who share some of the most misunderstood or difficult to explain 'anti-popular/social' thoughts :) The few 'heroes' I did meet reluctantly, I regret doing so. Thank you for writing this :)

    ReplyDelete
  2. Literally great meditations! Enjoyed, in part, finding me!!

    ReplyDelete