Saturday, April 5, 2025

The Transposed Heads: A Legend of India - Thomas Mann / Hayavadana - Girish karnad

చాలాసార్లు ఏదో ఒక పుస్తకం చదువుదామనుకుని దాన్ని వెతుకుతుంటే ఇంకేదో ఆసక్తికరమైన పుస్తకం కంటబడుతుంది. సహజంగానే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ కాబట్టి అసలు పుస్తకం వదిలేసి అది చదవడం జరుగుతుంటుంది. :) "ది మేజిక్ మౌంటైన్" చదవాలనుకుంటూ ఏళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్య ఏదో పుస్తకం గురించి వెతుకుతుంటే జర్మన్ రచయితైన థామస్ మన్ ఒక భారతీయ కథను నవలగా రాశారనే ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ గూగుల్, AI లాంటివి లేని కాలంలో జర్మన్ జాతీయుడైన థామస్ మన్ కి సంస్కృతంలో రాసిన కథ గురించెలా తెలిసిందని చూస్తే మరికొన్ని విషయాలు తెలిసాయి. మాక్స్ ముల్లర్ తర్వాత ఇండియన్ ఫిలాసఫీ గురించి రాసిన స్కాలర్లలో హెన్రిక్ జిమ్మర్ [German Indologist and linguist] సుప్రసిద్ధులు. ఆయన ఇండియన్ మైథాలజీ గురించి రాసిన ఒక పుస్తకంలో "కాళి" గురించి చదివిన థామస్ మన్ కు వెంటనే ఆ కథను ఒక నవలగా రాయాలనే ఆలోచన వచ్చిందట. అనుకున్నదే తడవు 1940లో ఆ జానపద కథను "ది ట్రాన్స్పోజ్డ్ హెడ్స్" పేరుతో నవలగా రాశారు. హెన్రిక్ జిమ్మర్ సోమదేవుడు రాసిన "కథాసరిత్సాగరం" నుండి గ్రహించిన కథను మూలకథగా చేసుకుని మన్ ఈ నవలను రాశారు.

Image Courtesy - Google Photos

ఈ మూలకథ గురించిన వివరాలు గూగుల్ చేస్తే గిరీష్ కర్నాడ్ రచనల్లో ప్రముఖంగా వినబడే "హయవదన" కథ కూడా ఇదేనని తెలిసింది. రెండు రచనల్నీ పోల్చుకుంటూ చదవడం బావుంటుందని అది పూర్తి చేసిన వెంటనే "హయవదన" కూడా చదివాను. ఈ రెండు రచనల్లో మన్ రచన నవల రూపంలో చదవడానికి అనువుగా ఉంది. కర్నాడ్ రచన నాటక రూపంలో కథలో మరో కథగా చెప్పుకొస్తారు. అవకాశం ఉంటే ఈ నాటకం చదవడం కంటే చూడడానికే ఎక్కువ బావుంటుంది. ఈ రెండు రచనల్లోనూ చిన్న చిన్న మార్పులూ, కొన్ని భిన్నమైన పాత్రలూ, వేర్వేరు పేర్లూ ఉన్నప్పటికీ రెండిట్లోనూ మూల కథ మాత్రం ఒక్కటే.

ఇక కథలోకొస్తే, సామాజికంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నంద, శ్రీధామన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు యాత్రకు బయలుదేరినప్పడు ఒక కొలనులో సీత అనే అందమైన యువతి నగ్నంగా స్నానం చేస్తూ ఉండగా చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధులవుతారు. నంద శారీరక ధృడత్వంతో బలంగా ఉండే సామాన్యుడు, కాగా శ్రీధామన్ బ్రాహ్మణ పండితుడు. శ్రీధామన్ తొలిచూపులోనే క్షత్రియ కుటుంబానికి చెందిన సీతను గాఢంగా ప్రేమిస్తాడు. మిత్రుని మనసెరిగిన నంద, స్వయంగా పూనుకుని మిత్రుడికి సీతనిచ్చి వివాహం జరిపిస్తాడు. కొన్ని నెలల తర్వాత గర్భవతి అయిన సీతను పుట్టింటికి తీసుకువెళ్ళడానికి శ్రీధామన్, నందతో కలిసి ప్రయాణమవుతాడు. మార్గమధ్యంలో ముగ్గురూ కాళికా దేవి ఆలయం వద్ద ఆగుతారు. పెళ్ళైన  తరువాత పలు సందర్భాల్లో సీతకు శారీరకంగా బలవంతుడైన నంద పట్ల ఉన్న ఆకర్షణను గ్రహించిన శ్రీధామన్, తాను మధ్యలో తప్పుకుంటే వారిద్దరూ సుఖంగా ఉంటారని భావించి, దేవీ దర్శనం చేసుకొస్తానని చెప్పి ఆలయంలో తన తలను తానే నరుక్కొని ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత లోపలకు వెళ్ళి మిత్రుడి మృత శరీరాన్ని చూసిన నంద కూడా దుఃఖంతో తనను తాను బలి చేసుకుంటాడు.

ఈ ఇద్దర్నీ వెతుక్కుంటూ ఆలయంలోకి వచ్చిన సీత వారి మృతదేహాలను చూసి, దీనంతటికీ తానే కారణమని గ్రహించి, తాను కూడా ఉరి వేసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తుండగా కాళికా దేవి ప్రత్యక్షమై, వారి తలలను శరీరాలకు తిరిగి అతికిస్తే వారు సజీవులవుతారని ఆమెకు వరమిస్తుంది. సీత  తొందరపాటులో శ్రీధామన్ తలను నంద శరీరానికీ, నంద తలను శ్రీధామన్ శరీరానికీ అతికించేస్తుంది. ఇద్దరు స్నేహితులూ శిరస్సులు మారిన దేహాలతో సజీవులవుతారు. ఇప్పుడు సీత భర్త ఎవరు అనే విషయంలో ముగ్గురి మధ్యా వివాదం తలెత్తుతుంది. ఇక్కడనుండీ వాదోపవాదాలతో కథ ఆసక్తికరంగా మారిపోతుంది. పిల్లలు పుట్టడానికి కారణం దేహం కాబట్టి, నంద ఆమె తన భార్యగా ఉండడమే సబబని వాదిస్తాడు. కానీ మనిషి గుర్తింపును నిర్ణయించేది తల కాబట్టి ఆమె తనకు భార్య కావడమే సరైనదని శ్రీధామన్ వాదిస్తాడు. విషయం తేలకపోయేసరికి ఈ వివాదం తీర్చమని వారు అరణ్యంలో నివసించే 'కామదమన' అనే సన్యాసి వద్దకు వెళతారు. ఈ వివాదం ఎలా పరిష్కారమయ్యిందనేది మిగతా కథ.

ఈ వివాదంలో కామదమన తుది తీర్పునివ్వడానికి పరిగణనలోకి తీసుకునే అనేక అంశాలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. వివాహంలో వధువు కోసం చేతిని చాపుతూ పాణిగ్రహణం చేస్తారు కాబట్టి, శరీరానికి చెందిన ఆ చేయి ఉన్నవాడే భర్తగా యోగ్యత కలిగి ఉంటాడని ఒకసారీ, శరీరావయవాలలో శిరస్సు ప్రధానమైనది కాబట్టి అది ఎవరిదైతే అతడే భర్తని మరోసారీ అంటాడు. 

తలలు, దేహాలూ మారిపోయే ఇటువంటి కథే చిన్నప్పుడు చదువుకున్న విక్రమభేతాళుడి కథల్లో కూడా చదివిన గుర్తు. అదే విధంగా ఈ కథ షేక్స్పియర్ నాటకం "A Midsummer Night's Dream"లో "లవ్ పోషన్స్" మార్చేసి ఇవ్వడం వలన రెండు జంటల్లో ఎవరి ప్రియుడు ఎవరో తెలీక ఏర్పడే గందరగోళాన్నీ గుర్తుకు తెచ్చింది. ఈ ప్రాచీన కథలో గమనించిన మరో విషయం- స్త్రీ అయిన సీత, తన లైంగికతను ఓన్ చేసుకోవడంలో అనుభవించే అపరిమితమైన స్వేచ్ఛ. శారీరక దృఢత్వం లేని శ్రీధామన్ కి తన లాంటి సౌందర్యరాశిని భార్యగా పొందే యోగ్యత లేదని భావిస్తున్నట్లు ఒక సందర్భంలో ఆమె స్వయంగా అంటుంది. తలలు మార్పిడి జరిగాక కూడా భర్తకు దక్కిన నంద శరీరం క్రమేపీ శ్రీధామన్ తలకు తగ్గట్టు క్షీణించడం చూసి నిరాశ చెందుతుంది. అదుపు తప్పిన శారీరక వాంఛలు మనిషి ఆలోచనలనూ, మేధనూ, తద్వారా సమాజాన్నీ ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ మూడు పాత్రల ప్రవర్తనలోనూ స్పష్టంగా చూడొచ్చు. ఏదేమైనా సామాజికపరంగా చూస్తే, శరీరం కంటే మనిషి మేధస్సు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని శ్రీధామన్, కామదమనల వాదనలు నిరూపించే ప్రయత్నం చేస్తాయి. పరిపూర్ణమైన మనిషి జీవితానికి ఈ రెండిటి మధ్యా సమన్వయం, సమతౌల్యం అవసరమని చెప్పే ఈ కథ మనిషి ఉనికిని అనేక కోణాల్లో విశ్లేషిస్తుంది. 

హ్యాపీ రీడింగ్ :)

No comments:

Post a Comment