కొన్నేళ్ళ క్రితం శామ్యూల్ బెకెట్ రచన "Waiting for Godot" చదివాను. పుస్తకం అయిపోవస్తున్నా విచిత్రంగా కథ మాత్రం ముందుకెళ్ళడం లేదు. సగానికి వచ్చేసరికి అసలు రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థంకాక తలపట్టుకున్నాను. ఏదేమైనా చదవడం పూర్తిచేశాక, "The art of nothing happening" is an art in itself అని గ్రహింపుకొచ్చింది. ఇప్పుడు బెకెట్ పుస్తకం ఎందుకు గుర్తొచ్చిందీ అంటే- జాపనీస్ రచయిత నాట్సూమీ సొసెకీ నవల "ది గేట్" చదివినప్పుడు కూడా దాదాపు అటువంటి అనుభవమే ఎదురైంది.
Image Courtesy Google |
"Life is what happens to you while you're busy making other plans." అంటారు జాన్ లెనన్. జీవితంలో మనకి నిరంతరం ఏదో ఒక విషయం జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి క్షణం ప్రత్యేకమైనదేదీ జరగకపోవడం మన దృష్టిలో జీవించడంలోకి రాదు. జీవితం పట్ల ప్రశాంతమైన నిర్లిప్తతను కేవలం రోజులు వెళ్ళదీయడంగా భావిస్తుంది నేటి తరం. ఈ భావన ఆధునిక సంస్కృతిలో మరింతగా పెరిగింది. అందుకే నేడు ఏమీ జరిగే అవకాశంలేని సామాన్యమైన కాలాన్ని పూరించుకోడానికి సినిమాలూ, మాల్స్, ట్రావెలింగ్, షాపింగ్, వండర్ ల్యాండ్స్, కేఫ్స్, పార్టీస్, మ్యూజిక్ షోస్- ఇలా లెక్కకుమించిన వినోదప్రధానమైన మార్గాలున్నాయి. ఇవన్నీ ఉపరితలంలో మనం సంతోషంగానే ఉన్నామన్న భ్రమను కలుగజేసి సుఖంగా జీవిస్తున్నామన్న భరోసా ఇస్తాయి. అటువంటి తాత్కాలికమైన డోపమైన్ హిట్స్ కోసం, అడ్రినలిన్ రష్ కోసం నిరంతరం అర్రులు చాస్తున్న తరం మనది.
హెర్మన్ మెల్విల్లే కథ "బార్టిల్‌బై ది స్క్రీవెనర్"లో "I prefer not to" అని కార్యాచరణకు సుముఖంగా లేని కథానాయకుడిలాగే సొసెకీ నవలలోని పాత్రలు కూడా కార్యాచరణకు సుదూరమైన వ్యక్తిత్వంతో కనిపిస్తాయి. వీళ్ళకి ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రావడం అత్యంత కష్టమైన పని. అలాగని వాళ్ళని సోమరులనుకుంటే పొరబాటే. వాళ్ళు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. కానీ అవేమీ గొప్ప గొప్ప పనులు (?) కావు. ఇందులో కథానాయకుడి సోసుకే తన స్నేహితుడి భార్యను వివాహం చేసుకున్నందుకు అపరాధభావంతో జెన్ మార్గాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తాడు. నవల మొదట్నుంచీ చివర వరకూ ప్రధాన పాత్ర 'సోసుకే'తో సహా అతడి భార్య ఓయోనే, తమ్ముడు కొరోకూ, స్నేహితుడు మొదలైన పాత్రలన్నీ తమ దైనందిన జీవితంలో సర్వసాధారణమైన పనుల్లో నిమగ్నమైపోయి కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో అతి పెద్ద సమస్యల (ఆర్ధిక/సామజిక) నుండి మొహం చాటేస్తున్నారని కూడా అనిపిస్తుంది. రోజులు, నెలలు గడిచిపోతున్నా వాళ్ళ జీవితాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలేవీ జరగవు. నిజానికి వాళ్ళందరూ తమ చేతుల్లో లేని సమస్యల్ని కాలానికీ, విధికీ వదిలేసి తమ ముందున్న ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టడం చూస్తాం. మన జీవితం మన చేతుల్లోనే ఉందనీ, ప్రతీ సమస్యనూ మనం తక్షణమే ఎదుర్కోవాలనీ (action) బోధించే కర్మ సిద్ధాంతాన్ని ఒకరకమైన అనాసక్తితో, నిర్లిప్తతతో ప్రశ్నిస్తుందీ నవల.
ఒక సందర్భంల్లో సోసుకే భార్య జబ్బుపడుతుంది. ఆసరికే విసిగిపోయిన పాఠకులం ఆమెకేమవుతుందో అని కాస్త కుతూహలంగా ఎదురుచూస్తాం. కానీ ఏమీ జరగదు. చివర్లో జెన్ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన సోసుకేకి హెర్మన్ హెస్ 'సిద్ధార్థ' తరహాలో జ్ఞానోదయం అవుతుందేమో అని ఆత్రంగా ఎదురుచూస్తాం. ఎటువంటి ఉపన్యాసాలూ లేకుండానే ఆ సందర్భం కూడా ముగిసిపోతుంది. కానీ నిశితంగా గమనిస్తే సొసెకీ నవలలో కథంతా 'బిట్వీన్ ది లైన్స్' జరుగుతూ ఉంటుంది. నవలలో 'Loud revelations' లేని మౌనంతో కూడిన సందర్భాలూ, సన్నివేశాలూ చెప్పే కథే ఎక్కువ.
ఎటువంటి ప్రయాసలూ, ప్రయత్నపూర్వకమైన వినోదాలూ లేకుండా రోజువారీ జీవితాన్ని యధాతథంగా అంగీకరిస్తూ ఉన్నదున్నట్లుగా జీవిస్తే ఎలా ఉంటుందో సొసెకీ నవలలోని జీవితాల్ని చూస్తే అర్థమవుతుంది. నిజానికి క్షణం తీరికలేని ఆధునీకరణను సంతరించుకున్న నేటి జపాన్ కీ సొసెకీ రచనలో కనిపించే అలనాటి జపాన్ కీ కూడా ఎక్కడా పొంతనలుండవు. ముఖ్యంగా జీవించడం పేరిట ఖాళీలను పూరించుకోవడం అలవాటైపోయిన నేటి సంస్కృతికి సొసెకీ కథలోని పాత్రలు గ్రహాంతర వ్యవహారంలా అనిపించే అవకాశం ఉంది. సొసెకీ నవల అలనాటి జపాన్ సంస్కృతిలో కీలక భాగమైన విరామాన్నీ, ఉబుసుపోనితనాన్నీ, ఏకాంతాన్నీ ఒక ఉత్సవంగా చేసి చూపిస్తుంది. ఆ రెండు సంస్కృతుల మధ్యన సంధి కాలపు సంఘర్షణను వివరించే ప్రయత్నం చేస్తుంది.
No comments:
Post a Comment