ప్రఖ్యాత జర్మన్ రచయితా, నోబెల్ గ్రహీతా ఎలైస్ కానెట్టి పేరు పలుమార్లు విని చాలా కాలంగా ఆయన రచనలు చదవాలనుకున్నప్పటికీ గత ఏడాది చదివిన సోంటాగ్ వ్యాసాల్లో ఆయన గురించిన ప్రస్తావనలు ఎట్టకేలకు ఆయన రచనల్ని వెలికి తీయించాయి. కానెట్టి వ్యాసాలు అప్పుడొకటీ ఇప్పుడొకటీ మినహా ఆయన రచనలేవీ నేను పూర్తి స్థాయిలో చదివింది లేదు. అనుకున్నంతలో ఆయన నోట్స్, ఫ్రాగ్మెంట్స్, అఫోరిజంస్ కలిగిన 'ది సీక్రెట్ హార్ట్ ఆఫ్ ది క్లాక్' కనిపించింది. ఈ రచన పాక్షికంగా మెమోయిర్ లా, మరికొంత మ్యూజింగ్స్ లా ఉండడం ఆయనను తొలిసారిగా పరిచయం చేసుకోవడాన్ని సులభం చేసింది.
Image Courtesy Google |
ఈ పుస్తకంలో కానెట్టి తన జీవితసారాన్నంతటినీ చిన్న చిన్న వాక్యాల్లో పొందుపరిచినట్లు ఉంటుంది. ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉండడం వల్ల కథలా చెప్పే మెమోయిర్స్ లో ఉండే అనవసర ప్రస్తావనలు ఈ పుస్తకంలో కనపడవు. మరో విషయం ఏమిటంటే ఆయన ఫస్ట్ పర్సన్ నెరేటివ్ ని వాడకుండా థర్డ్ పర్సన్ నేరేటివ్ లో ఈ పుస్తకాన్నంతా రాయడం ఈ రచనకు అదనపు హంగు అనిపించింది. ఉత్తమ పురుషలో రాయకుండా ప్రథమ పురుషలో రాయడం వల్ల ఇటువంటి రచనలు ఆత్మవిమర్శగా, స్వోత్కర్షగా ధ్వనించే అవకాశం ఉండదు. రచయిత కూడా 'నేను' అనకుండా రచనలు చెయ్యడం వల్ల తన ఇజాలనూ,తీర్మానాలనూ, దృక్పథాలనూ పాఠకుల మీద రుద్దినట్లు అనిపించదు. రాండీ పాష్చ్ 'ది లాస్ట్ లెక్చర్' లో అనుకుంటా "మన అభిప్రాయాలను ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పడం మేలుచేస్తుంది" అంటారు. కానెట్టి ఈ రచనలో థర్డ్ పర్సన్ నేరేటివ్ లో 'He' అని సంబోధిస్తూ తనకు తాను దూరంగా నిలబడి ఒక ప్రేక్షకుడిలా జీవితమనే వేదికపై నిలబడ్డ తననూ, తన గతాన్నీ విశ్లేషించుకున్నట్లు తోస్తుంది. ఈ పుస్తకంలో అధిక భాగం వృద్ధాప్యం, మృత్యువు వంటి అంశాల గురించిన విశ్లేషణలు ఉంటాయి.
ఇందులో కొన్ని వాక్యాలకు నా స్వేచ్ఛానువాదం :
* జీవితంలో మృత్యువు కూడా భాగమన్న సత్యాన్ని ఎందుకు ప్రతిఘటిస్తావు ? మృత్యువు నీలో లేదా ?
* ప్రపంచ సాహిత్యం అంటే వారికి పూర్తిగా విస్మరించదగ్గదని అర్థం.
* తన పరిథులకు అతి జాగ్రత్తగా కావలికాసుకునే వ్యక్తి సమక్షంలో ఎక్కువ సమయం గడపడం కోసం నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవడమనేది అస్సలు భరించలేని విషయం.
* నీ జీవితాన్ని కథగా రాసేటప్పుడు అందులో ప్రతి ఒక్క పేజీలో ఎప్పుడూ ఎవరూ వినని ఒక కొత్త సంగతి ఉండాలి.
* నాకు ఉనామునో అంటే ఇష్టం : నాలో ఉన్న చెడు లక్షణాలే అతడిలో కూడా ఉన్నాయి, కానీ అతడికి తనలోని ఆ లక్షణాలను చూసి సిగ్గుపడాలని స్ఫురించదు.
* ఏమీ ఆశించనివాడే స్వేచ్ఛాజీవి. మరి స్వేచ్ఛగా ఉండడం కోసం ఏమాశిస్తాడు ?
* నిజానికి నిన్ను నిన్నుగా పూర్తిగా ప్రేమించే స్నేహితులెవరూ ఉండరు, అది అవినీతి.
* నీ గురించి ప్రతి ఒక్క 'సెల్ఫ్ డిస్ప్లే' నీ విలువను కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది.
* తనను తాను అదుపులో పెట్టుకుంటూ రాసే రచయితలంటే నాకు గౌరవం. తమ తెలివితేటల్ని ఒక పరిథిని మించకుండా, వాటి నుండి తనను తాను రక్షించుకుంటూ, అలాగని వాటిని పూర్తిగా వదిలివెయ్యకుండా రాసేవాళ్ళంటే నాకు అభిమానం. అదీ కాకపోతే కొత్తగా తెలివి వచ్చిన రచయితలూ, కాస్త ఆలస్యంగా తెలివిని సంపాదించినవాళ్ళూ / తమకు తెలివితేటలున్నాయని గ్రహించినవాళ్ళూ నా దృష్టిలో మంచి రచయితలు. స్వల్పమైన విషయాలను సైతం కళ్ళువిప్పార్చుకుని చూస్తూ ఉత్తేజితమయ్యేవాళ్ళు : అద్భుతం. నిరంతరం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న గొప్ప గొప్ప విషయాల వల్ల మాత్రమే ఉత్తేజాన్ని పొందేవాళ్ళు : భయానకం.
* అతడికి తెలియనీ, అతడు చూడని ప్రతీదీ అతణ్ణి సజీవంగా ఉంచుతుంది.
* అతడు వెలుగులోకి నెట్టివేయబడ్డాడు. ఇంతకీ అతడు ఆనందంగా ఉన్నాడా ?
* నువ్వు అందుబాటులో లేకుండా దాక్కుంటున్నావని వారికి నువ్వంటే ద్వేషం. నువ్వు ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేస్తూ వారి ముందు ఊరేగినా వారు నిన్నేమీ తక్కువ ద్వేషించరు.
* ఏ స్థాయిలోనూ ఒకర్నొకరు అర్ధం చేసుకోవాల్సిన అవసరంలేని వృద్ధాప్యంలో సన్నిహితంగా కూర్చోవడం పరమానందం.
* ఎనభయ్యోపడిలో పడిన తరువాత ఆదర్శాలు లేకుండా బ్రతకడం సాధ్యమేనా ! మరచిన కుతూహలాన్ని మళ్ళీ నేర్చుకో, జ్ఞాన సముపార్జనకోసం వెంపర్లాడకు, గతించినకాలపు అలవాట్లను త్యజించు, ఆ ఖరీదైన అలవాట్లలో నువ్వు మునిగిపోతున్నావని గ్రహించు, కొత్తవాళ్ళను గమనించు, నువ్వు ఆదర్శవంతంగా తీసుకోలేనివారిపై దృష్టిసారించు. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్కు నీ కర్మకు సరితూగేలా జీవించు.
* తనను తాను త్యజించిన పిమ్మట అతడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడికి తన గురించి మరెప్పుడూ ఇంకేమీ తెలుసుకోవాలనే ఇచ్ఛ లేదు.
* ఇక రెండవ రకం స్నేహితులు : నీ రహస్యాలు తెలిసినవాళ్ళు , వాటిని దాచేవాళ్ళు. మొహాన ముసుగు లేకుండా నిన్నూ,నీ ఉనికినీ పూర్తిగా ఎరిగిన వాళ్ళు. వారి ప్రస్తావన మనం ఎవరివద్దా తీసుకురాము, వాళ్ళ గురించి మాట్లాడకుండా తప్పించుకుంటాము. వారి నుండి తగినంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, వారిని అరుదుగా కలుస్తాం. మనకు వాళ్ళను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండదు, వాళ్ళకు మనకు తెలియని అనేక లక్షణాలు ఉంటాయి. చివరకు కాలయంత్రపు రహస్యం అయినాసరే , ఒకసారంటూ నీకు తెలిసిపోయాక అది నీ ఆలోచనలను ఆహ్వానించదు, అవి ఎప్పటికీ అస్పృశ్యంగా ఉండిపోతాయి, ఎంత అంటరానివిగా ఉండిపోతాయంటే అవి ప్రతీ ఒక్క కలయికతోనూ నిన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇటువంటి స్నేహితులు శాశ్వత స్నేహితులమని చెప్పుకునే వారికంటే చాలా అరుదైనవారు.
* ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా రెండవ రకం రహస్య స్నేహితుల్ని కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే అటువంటి స్నేహితుల స్నేహాన్ని ఎవరూ తమ హక్కుగా భావించరు. అటువంటి స్నేహితులు జీవితంలో చివరి మజిలీగా ఉంటారు. ఈ ఒక్క విషయంలో వాళ్ళ స్నేహాన్ని హక్కుగా భావించవచ్చు. మన జీవితంలో వాళ్ళ స్థానం కదిలించ వీలులేనిది, కానీ విచిత్రంగా వారికి ఆ నిజాన్ని గూర్చిన స్పృహ ఉండదు.
No comments:
Post a Comment