Monday, October 11, 2021

The Ink Dark Moon : Love Poems by Ono no Komachi and Izumi Shikibu, Women of the Ancient Court of Japan

జాపనీస్ సాహిత్యంలో స్వర్ణయుగంగా (Heian era) పరిగణించే 794-1185 ల మధ్య కాలానికి చెందిన ఇద్దరు కీలకమైన కవయిత్రులు ఓనో నో కొమచి,ఇజుమీ షికిబు ల కవితలను అమెరికన్ కవయిత్రి జేన్ హిర్ష్ఫీల్డ్  'ఇంక్ డార్క్ మూన్' పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కవయిత్రులిద్దరూ జపాన్ రాజ్యసభలో (అనగా ఇప్పటి క్యోటో) భాగంగా ఉండేవారట. ఓనో కొమచి తన కవితల్లో ప్రేమ విరహం,శృంగారం,సంతాపం వంటి విషయాల్లో స్త్రీ సహజమైన భావోద్వేగాలకూ,స్పందనలకూ తాత్విక దృష్టితో అక్షరరూపమిస్తే , షికిబు కవితలలో శృంగారంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాముఖ్యతనిస్తూ రాసిన కవితలు ఉంటాయి. నిజానికి విరహాన్నీ,ప్రేమనూ స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో మగవారికి ఉండే స్వేచ్ఛ గానీ,సాధనాలు గానీ స్త్రీకి అందుబాటులో లేని కాలం అది. 4,5 శతాబ్దాలలో చైనీస్ భాష జపాన్ లో మొట్ట మొదటి లిపి ఉన్న భాషగా వ్యవహారంలో ఉండేదట, కానీ 8 వ శతాబ్దం వరకూ ఆ భాష స్త్రీలకు అందుబాటులోకి రాలేదు.

జపాను కవిత్వానికి మూలాలు మానవ మస్తిష్కంలోనుండి వ్రేళ్ళూనుకుని  ఉంటాయి కాబట్టి గాఢమైన అనుభవప్రధానమైన ఈ కవితలు హృదయపు లోతుల్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. ఎంతమంది మనుషులుంటే అన్ని విధాలైన వ్యక్తీకరణ మార్గాలు గనుక ఈ కవితల్లో ఆ కాలపు సంస్కృతిలో కన్నవీ,విన్నవీ యథాతథంగా అక్షరీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. కొమ్మల్లో దాక్కుని కూసే కోయిల, తటాకాల్లోని కలువల మధ్య నుండి వినిపించే కప్పల సందడి వంటివి ఈ కవితల్లో విరివిగా ప్రస్తావనకొస్తాయి.

Image Courtesy Google

సహజంగా ఎప్పుడూ ముందుమాట పుస్తకం చివర్లో చదివే అలవాటు నాకు. గద్యం చదివేటప్పుడు ఈ అలవాటు ఫర్వాలేకపోయింది కానీ ఈ మధ్య కవిత్వం చదివేటప్పుడు ఖచ్చితంగా ముందుమాట చదివిన తరువాతే మిగతా పేజీల్లోకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కవిత్వం చదివేముందు పరిచయ వాక్యాలు చదివితే కవితల నేపథ్యం అర్థమై ఆ వాక్యాలు మరింత అర్థవంతంగా అనిపిస్తాయి, లేకపోతే కాంటెక్స్ట్ తెలీని ఖాళీ వాక్యాల్లా మిగిలిపోతాయి. ముఖ్యంగా ప్రాచీన కవిత్వం చదివే విషయంలో కవితల నేపథ్యం తెలియడం మరింత ముఖ్యమని తమిళ కవి ఎ.కె. రామానుజన్ కూడా అభిప్రాయపడతారు. నిజానికి ఈ కవితలు విడివిడిగా చదివినప్పుడు నాకంత గొప్పగా అనిపించలేదు. కానీ నేపథ్యం తెలిశాకా అవే కవితలు మరింత అర్థవంతంగా ధ్వనించాయి. 

స్త్రీ పురుష సంబంధాలు ప్రధాన వస్తువుగా ఉండే ఈ కవితలపై ఆ కాలపు సామజిక పరిమితులూ, పితృస్వామ్యం వంటి అంశాల ప్రభావం కనిపిస్తుంది. ఆ కాలంలో కులీన వర్గాల్లో వివాహితుడైన పురుషుడు ఎంత మంది స్త్రీలతోనైనా సంబంధం కలిగి ఉండవచ్చు. కానీ వివాహిత అయిన స్త్రీ మాత్రం పాతివ్రత్యంతో భర్త పట్ల విధేయతతో మెలగాలి. అవివాహిత స్త్రీలకు మాత్రం ఈ  విషయంలో మినహాయింపు ఉండేది కానీ సాధారణంగా వారు ఇటువంటి సంబంధాలను రహస్యంగా నెరపేవారట. ఈ పుస్తకంలో కోర్టింగ్ విషయంలో రాసిన మరి కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ కాలంలో మగవారు ఎవరినైనా ఇష్టపడితే ఆ స్త్రీకి లిఖితరూపంలో నాలుగైదు పంక్తుల కవిత రాసి పంపేవారట. ఆమెకు ఆ కవిత్వం, కవిత్వపు భాష గనుక నచ్చితే అదే మార్గంలో తిరిగి జవాబు అందేదట. అంటే కవిత్వానికీ, భాషకీ ఆ కాలంలో అంతటి ప్రాముఖ్యత ఉండేదని అర్ధమవుతుంది.

ఇందులోని కొన్ని కవితలకు నా స్వేచ్ఛానువాదం :

నీ విరహంలో ఈ హృదయం వెయ్యి ముక్కలైంది

నేనొక్క ముక్కను కూడా కోల్పోలేదు. 

 

నేను నీకోసం పరితపిస్తున్నప్పుడు నీవు చేరువకాకుండా దూరంగా ఉండి ఉంటే

ఈపాటికి నేను నిన్ను మరచిపోయి ఉండేదాన్ని.


ఈ ప్రపంచమొక జాగృత స్వప్నమని నీకు తెలియదా ?

నేను నీకోసం తపించిన ఆనాటి క్షణాలు, అవి కూడా అశాశ్వతమైన భావనలే  కదా !


నేను నీ పేరు పదేపదే పలవరించినా  ఈ వాస్తవం నా హృదయపు  తీవ్రతను ప్రతిబింబించగలదా ?  


నా సన్నిహితుడూ, నా శరీరమూ  కూడా  త్వరలో మేఘాలుగా  రూపాంతరం చెంది  

తలోదిక్కుకీ ప్రవహిస్తాయి.


నిరంతరం అలుపెరగక నా స్వప్నాల దారుల వెంట అతన్ని చేరుకోవడం

వాస్తవ ప్రపంచానికి వచ్చేసరికి ఒక క్రీగంట చూపుతో  సరిసమానం కాదు.  

 

అతడి ఆలోచనలతో నిద్రకుపక్రమించాను కాబట్టి అతడు నా నిదురలో అగుపించాడా !

అది స్వప్నమని అవగతమైతే నేను నిదుర మేల్కొనేదాన్నే కాదు !

 

ఈ విరహపు తీవ్రత అవధుల్లేనిది. 

నిశీధి స్వప్నాల దారులవెంట నీ చెంతకు చేరుకునే వేళ

కనీసం నన్నెవరూ నిందించలేరు.

   

నీవు వదిలివెళ్ళిన జ్ఞాపకాల బహుమతులు

నాకు శత్రువులుగా  మారాయి. 

అవి లేకపోతే కనీసం క్షణకాలపు మరుపు సాధ్యమయ్యేది.

2 comments: