'కామన్ రీడర్' అనే పుస్తకంలో 'ఎవరైనా పుస్తకాన్ని ఎలా చదవాలి' అనే వ్యాసంలో "The only advice, indeed, that one person can give another about reading is to take no advice." అని చమత్కరిస్తారు వర్జీనియా వూల్ఫ్..పుస్తక పఠనం విషయంలో ఏ పుస్తకం ఎలా చదవాలో,ఎందుకు చదవాలో,ఎటువంటి పుస్తకాలు చదవాలో నిజానికి ఎవరూ ఎవరికీ సలహాలు ఇవ్వరాదు,తీసుకోరాదు..మల్లెల పరిమళాన్ని ఆఘ్రాణించండం,పసిపాప బోసినవ్వుల్ని చూసి మైమరచిపోవడం,సముద్రపు అలల హోరుని చెవులప్పగించి వినడం,ప్రభాతవేళ చెంపలను తాకుతున్న నునువెచ్చని సూర్య కిరణాలను అనుభవించడం,ఇలాంటివన్నీ ఎవరూ ఎవరికీ నేర్పించలేదు,నేర్పించలేరు,ఇవన్నీ వ్యక్తిగతమైన అనుభవాలు.పుస్తక పఠనం అనేది కూడా పూర్తిగా ఒక వ్యక్తిగతమైన అనుభవం.ఇది ఇంచుమించు ఆధ్యాత్మికత లాంటిదే.ఒక పాఠకుని పఠనానుభవం అతడి మానసిక పరిపక్వతా,వ్యక్తిగత స్థితీ,పరిణితీ,గ్రాహక శక్తి,ఊహాత్మకత స్థాయిల్ని బట్టి మారుతూ ఉంటుంది.ఏ ఒక్కరి పఠనానుభవమూ ఒక్కటి కావడం అనేది దాదాపూ అసంభవం.పుస్తకపఠనం విషయంలో కొన్ని దిశానిర్దేశం చేసే అంశాలున్నప్పటికీ సిద్ధార్థ నవలలో హెస్సే అన్నట్లు చివరగా ఎవరి గమనం,గమ్యం వారిదే.
Image Courtesy Google |
పుస్తకాలు ఎందుకు చదువుతారని ఎవరినైనా అడిగినప్పుడు చాలా భిన్నమైన సమాధానాలు చెబుతుంటారు.కొందరు కాలక్షేపానికి చదువుతామంటారు,మరికొందరు జ్ఞానాన్ని పెంచుకోవడానికనీ,ఆధ్యాత్మికత వైపు ప్రయాణించడానికనీ అంటే,ఇంకొందరు సత్యశోధనకోసమని చెప్పగా కూడా విన్నాను.వీటికి తోడు ఈ మధ్య కాలంలో తరచూ వింటున్న మరో సమాధానం ఏమిటంటే "రివ్యూలు రాయడం కోసం" అని.సాంకేతిక విప్లవం విమర్శకులకూ,సమీక్షకులకూ ఉన్న వైరుధ్యాన్ని చెరిపేసి ,కంప్యూటరూ,కీబోర్డు ఉండి రాయడం వచ్చిన ప్రతి వారూ వ్రాసే ప్రతి అక్షరానికీ విలువ అమాంతం పెంచేసిన ఈ తరుణంలో అందరూ పాఠకులే,అందరూ రచయితలే,అందరూ విమర్శకులే అన్నచందాన తయారయ్యింది.ఇదేమీ అభ్యంతరకరమైన వాతావరణమని కూడా అనలేం.ఎందుకంటే ఒకప్పటి కంటే నేడు ప్రచురణల సంఖ్య బాగా పెరిగింది,చదివేవారికంటే రాసేవారు పెరిగారు.ప్రచురణ సంస్థలు ముందుకు నడవాలన్నా,కొత్త రచయితలు పుట్టుకురావాలన్నా రివ్యూలు రాయాలి తప్పదు.మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఓపిగ్గా కొత్త రచయితలను ప్రోత్సహించే నిమిత్తం ప్రొఫెషనల్ గా చదివేవారు కూడా ఉంటారు.నాకు నచ్చిందే చదువుతాను అని ఎస్కేపిజంతో భీష్మించుకు కూర్చునే లగ్జరీ అందరికీ ఉంటుందనుకోను.మరి చదువు వివేకాన్ని ఇస్తుందా అంటే,అది చదివే పుస్తకాలను బట్టీ,చదవడానికి కారణమైన అంశాలను బట్టీ మారుతుంది అనుకుంటాను.కొందరు తమను తాము పుస్తకంలోని పాత్రలతో ఐడెంటిఫై చేసుకోడానికి చదువుతామంటారు.పాఠకుడే కదా అని క్రైమ్ థ్రిల్లర్స్ చదివి క్రైమ్ చేసిన వాడితో ఐడెంటిఫై చేసుకునే పాఠకుణ్ణి 'ఇంటెలెక్చువల్ పెడెస్టల్' మీద కూర్చోబెట్టలేం.అలాగే రామాయణం చదివి రావణుణ్ణీ,భారతంలో సుయోధనుణ్ణీ ఆదర్శంగా తీసుకునే పాఠకుణ్ణి ఉత్తముడనీ,జ్ఞాని అనీ అనుకోలేం.పల్ప్ ఫిక్షన్ మొదలు పోర్న్ వరకూ ఏ జానర్స్ చదివేవాళ్ళయినా ఈ 'పాఠకుల' వర్గంలోకే వస్తారు..ఒకసారి ఎవరో పెద్దావిడతో మాకు ఇద్దరికీ సాహిత్యం అంటే ప్రాణమని నా స్నేహితురాలు చెప్తే,ఆవిడ మా అక్క కూడా చాలా ఎక్కువ చదువుతుంది,స్వాతి వీక్లీ మొదలు అన్ని వారపత్రికలూ వదలకుండా చదువుతుంది అంటూ,పుస్తకాలుంటే ఆవిడకి తిండికూడా అక్కర్లేదు అన్నారు నవ్వుతూ.అప్పుడు అనిపించింది పఠనానుభవం,అందులో పొందే అపరిమితమైన తృప్తి,ఏకాంతం,ప్రశాంతత లాంటివి,చదివే జానర్స్ వేరైనా అందరికీ ఒక్కటే కదా అని.కానీ మంచి పుస్తకాలూ,చెడ్డ పుస్తకాలూ ఉండవని ఆస్కార్ వైల్డ్ అన్నట్లు పుస్తకాలు ఎక్కువ చదివేవారందరూ ఉత్తములనో,జ్ఞానవంతులనో అనుకోవడం మాత్రం వట్టి భ్రమ అని చెప్పడమే నా ఉదేశ్యం.పుస్తకాలు ఒక మిర్రర్ లాంటివి.పాఠకుడు అందులో తన ప్రతిబింబాన్నే చూసుకుంటాడు.భుజాలు తడుముకోడానికి జెనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కాదులెండి,మినహాయింపులు అన్నిచోట్లా ఉంటాయి.
పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలేమిటో అందరికీ తెలుసు,అనేక వ్యాసాల్లో ఆ విషయాన్ని చాలాసార్లు చర్చించుకున్నాం కూడా.ఇప్పుడు దానికి భిన్నంగా పుస్తకాలు అతిగా చదవడం వల్ల కలిగే నష్టాలేమిటో కూడా చూద్దాం.ఉదాహరణకు జీవితకాలమంతా రామాయణం లాంటి ఒక గ్రంథాన్ని (నేను నాస్తికురాల్ని,ఇప్పుడు రామాయణం అన్నాను కదాని నాకు ఆస్తికత్వం అంటగట్టకండి) పారాయణం చేస్తూ గడిపే ఒక సగటు వ్యక్తి ,రాముడి లక్షణాలను తన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తాడు.ఒక నిర్ణీతమైన మార్గంలో తాను నమ్మిన,తనకు తెలిసిన విలువలతో గడిపే (అజ్ఞానం ఆనందం అంటారు మోడర్నిస్టులు) అతడి జీవితంలో కన్ఫ్యూషన్ కి ఆస్కారం చాలా తక్కువ.అదే విధంగా కాస్త క్వాలిటీ ఉన్న ఏ రియలిస్టిక్ ఫిక్షన్ అయినా పాఠకులకు నిత్యజీవితంలో మార్గదర్శిగా ఉంటుంది.ఇక అసలు చిక్కు 'ఇంటెలెక్చువల్ స్టఫ్' (ఫిలాసఫీ,సైకాలజీ,ఫాంటసీ,అబ్సర్డిటీ,మ్యాజికల్ రియలిజం లాంటి జానర్స్ ఇందులో కలపొచ్చేమో (?)) చదివేవాళ్ళతో ఉంటుంది.ఈ రకం పాఠకులు ఒక వంద మంది తత్వవేత్తల్ని చదివారనుకుందాం,ఆ తత్వాలను వంద రకాల దుస్తులనుకుంటే,వార్డ్రోబ్ నిండిపోయి ఓవర్ ఫ్లో అయిపోతున్న వాళ్ళకి తమ వార్డ్రోబ్ లో ఉన్న వంద డిజైనర్ వేర్ సూట్స్ లో ఏ రోజు,ఏ సందర్భానికి ఏ సూటు ధరించాలో తెలియదు..కన్ఫ్యూషన్..వాళ్ళు తమ జీవితానికి అన్వయించుకోవడానికో,లేదా ఏదైనా మరో విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన సందర్భంలో ఏ ఫిలాసఫీ మంచిదో,ఏ తత్వం ఆచరణయోగ్యమో నిర్ణయించుకోలేరు.వాస్తవ జీవితంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవలవలసిన చోట విపరీతమైన గందరగోళంతో తికమకపడుతూ అతిగా ఆలోచించడం మినహా ఖచ్చితమైన సైడ్స్ తీసుకోలేరు.ఏకకాలంలో అందరి చెప్పుల్లోనూ కాళ్ళు పెట్టుకుని ఆలోచించగలగడం,ఒక విషయాన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పద్ధతిలో వీలైనన్ని కోణాల్లో చూడగల శక్తిని ఇవ్వడం ఇటువంటి చదువు ఇచ్చే వరం అనుకుంటే,అదే సమయంలో అదొక శాపం కూడా అనిపిస్తుంది.చివరగా ఇటువంటి పాఠకులు వందమంది సరి అన్నదానిని ఖండించే నూట ఒకటో సరికొత్త విశ్లేషణతో వస్తుంటారు.ఇది ఇప్పటి సరికొత్త ఫ్యాషన్.
ఏ మనిషైనా ఒక్క జీవితంలో ఎంతమంది మనుషుల్ని కలవగలడు ? చాలా మంచి మానవసంబంధాలున్న వ్యక్తికి కూడా ఒక జీవితంలో మహా అయితే ఒక వందమంది గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది..ఇక ఇంట్రావర్టులు,మొహమాటస్థులు అయితే ఆ సంఖ్య ఖచ్చితంగా పది లోపే..అందరినీ గుడ్డిగా నమ్మగలిగే ఒకనాటి ఆదర్శ సమాజం ఎప్పుడో అంతరించిపోగా,మన గ్లోబల్ విలేజ్ లో ఏ మనిషితో కరచాలనం చేస్తే ఏ వ్యాథి సంక్రమిస్తుందో తెలియని నేటి కోవిడ్ కాలంలో మానవ సంబంధాలు మరింత బలహీనపడుతున్నాయి.వీటన్నిటిమధ్యా పుస్తకపఠనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనుషులతో ఉండే 'ఎమోషనల్ కనెక్షన్' ను కొంతవరకూ అనుభవంలోకి తీసుకువస్తుంది.
కానీ పుస్తకాలు మానవ సాహచర్యానికి సరిసమానమైన ప్రత్యామ్నాయంగా కాగలుగుతాయా ? నిస్సందేహంగా అవుననే అంటారు మార్సెల్ ప్రూస్ట్,హరోల్డ్ బ్లూమ్ వంటి కొందరు రచయితలు.ఒక మంచి మిత్రుడు ఒక పెద్ద గ్రంథాలయంతో సమానమని అంటూ ఉంటారు.ఒకప్పుడు జ్ఞానసముపార్జన కోసం పండితులతో చర్చించడం ద్వారానూ,సజ్జన సాంగత్యంలోనూ సాంఘిక,రాజకీయ,ఆధ్యాత్మిక,తాత్విక,ప్రాపంచిక విషయాలను అధ్యయనం చెయ్యడం జరిగేది..కానీ నేటి పరిస్థితుల్ని చూస్తే,మనిషి సంఘజీవిగా మనగలిగే అవకాశాలను టెక్నాలజీ సమూలంగా తుడిచేస్తోంది.ఉమ్మడికుటుంబాలనుండి న్యూక్లియర్ కుటుంబాలు ఆవిర్భవించి,కుటుంబవ్యవస్థ సైతం ఛిద్రమైన తరుణంలో ఒక సినిమా కవిగారు అన్నట్లు జగమంత కుటుంబంలో ఏకాకి జీవితాలు ఒంటరితనం బారినపడకుండా పుస్తక పఠనమనే అభిరుచి కాపాడుతుంది.One of the uses of reading is to prepare ourselves for change, and the final change alas is universal. అంటారు హరాల్డ్ బ్లూమ్..సంగీతం,నాట్యం,చిత్రలేఖనం వంటి అభిరుచులు కళాకారుణ్ణి అతడి ఆత్మతో లీనమయ్యేలా చేస్తే,పుస్తక పఠనం వాస్తవ జీవితంలో కలవడానికి అవకాశం లేని అనేకమంది గొప్ప వ్యక్తులతో సంభాషించే అమూల్యమైన అవకాశాన్ని ఇస్తుంది.'Otherness' ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి పుస్తకపఠనాన్ని మించిన మార్గంలేదు.
ఇక ఎందుకు చదవాలి అనే విషయానికొస్తే Sir Francis Bacon సలహా గుర్తుకువస్తుంది, "Read not to contradict and confute, nor to believe and take for granted, nor to find talk and discourse, but to weigh and consider." అందునా నేటి సాహితీలోకంలో పుస్తక పఠనమంటే తమ విజ్ఞాన ప్రదర్శనకో,ఎవరి వాదననైనా ఖండించడానికో లేదా చదవడాన్ని ఒక ఫ్యాషన్ గా,చదివిన ప్రతీ విషయాన్నీ గుడ్డిగా నమ్మడానికో మాత్రమే ఉపయోగిస్తున్న ఈ కాలంలో బేకన్ సలహా మరింత ఆచరణీయం అనిపిస్తుంది.నిజానికి ఈ పుస్తకపఠనాన్ని సామజిక ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనంగా అంటే పూర్తి స్వార్థపూరిత చర్యగా చూస్తారు కొందరు,ఇది కూడా నిజమే.పాఠకుడు తనదైన ప్రపంచంలో తలమునకలై ఒక పుస్తకాన్ని లోతుగా అధ్యయనం చెయ్యడంలో ప్రత్యేకించిన సామజిక శ్రేయస్సు ఏదీ ఉండదు.కానీ పుస్తకాలు చదవడం ద్వారా మంచి-చెడుల విచక్షణా జ్ఞానం అలవడుతుంది,జ్ఞానం పెంపొందుతుంది..పుస్తకాలు పాఠకుని మనోవికాసానికీ దోహదపడడం ద్వారా వ్యక్తిగత స్థాయిలో మనిషికీ, తద్వారా సమాజానికీ శ్రేయస్సు చేకూరుస్తాయి.ఇదే విషయాన్ని రాబర్ట్ వాల్సర్ మరికొంత సరళంగా,ఆయన మార్కు హాస్యం మేళవించి,"పుస్తకంలో లీనమైపోయి ప్రపంచాన్ని మర్చిపోయిన పాఠకుడు,ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చకుండా,ఎవరితోనూ అనవసర వాదోపవాదాలు పెట్టుకోకుండా,ఎవర్నీ జడ్జి చెయ్యకుండా తన పనితాను చేసుకోవడం ద్వారా తనకు తెలీకుండానే సమాజంలో శాంతిని నెలకొల్పి ఎనలేని సేవ చేస్తున్నాడు" అంటారు.
మార్సెల్చ ప్రూస్ట్ 'డేస్ ఆఫ్ రీడింగ్' అనే పుస్తకంలో చదువుల్లో రకాలను గురించి వ్రాస్తూ,ఒక చరిత్రకారుడు గానీ లేదా మరో స్కాలర్ గానీ ఒక సత్యాన్ని కనుగొనే దిశగా పుస్తకాలను ఆశ్రయించే విధానం కేవలం ఒక ఇండెక్స్ నో,మరో చిన్న సాక్ష్యాన్నో చూసి ఆ సత్యాన్ని తమ సత్యంతో బేరీజు వేసుకోవడంలా ఉంటుందంటారు.ఈ తరహా పఠనం,కొన్ని వాస్తవికవిషయాలను (ఫ్యాక్ట్స్ ) సంగ్రహించడానికే తప్ప సత్యశోధనకు దారితీసేవిగా ఉండవని ఆయన అభిప్రాయపడతారు..వారి పరిశోధన పురోగతిలేకుండా కేవలం వారి మెదడులో అప్పటికే ఉన్న సమాచారాన్ని దానికి సంబంధించిన వాస్తవికతను ధృవీకరించుకోవడంతో ఆగిపోతుంది.ఇక 'లిటరరీ మాన్' చదువు దీనికి కాస్త భిన్నంగా ఉంటుంది..అతడు చదవాలి కాబట్టి చదువుతాడు,జ్ఞాపకముంచుకోవాలి కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకుంటాడు.అతడికి పుస్తకం,తెరవగానే రెక్కలు విప్పుకుని సెలెస్టియల్ గార్డెన్ లోకి తీసుకువెళ్ళే ఏంజెల్ కాదు,కేవలం ఒక మాటాపలుకూ లేని జడమైన విగ్రహం మాత్రమే.ఇటువంటి చదువు పాఠకుడి ఊహాత్మకతకు పదును పెట్టేదిగా గాక అతడిలోని ఆలోచనలను ఒక ఫాల్స్ నాలెడ్జి తో నింపేస్తుంది.నిజానికి ఇది అజ్ఞానం కంటే ప్రమాదకరం.ఇది చాలా అనారోగ్యకరమైన పరిణామమని అంటూ,ఈ తరహా విద్యా విధానాన్ని ఒక 'లిటరరీ డిసీస్' గా అభివర్ణిస్తారు ప్రూస్ట్.ప్రొఫెషనల్ రీడింగ్ కీ,రీడింగ్ ఫర్ ప్లెషర్ కీ చాలా తేడా ఉంటుంది.మొదటిదానిలో నిర్బంధం ఉంది,సంతోషం పాళ్ళు తక్కువ.ఇక ప్రొఫెషనల్ రీడింగ్ లో పాఠకుడు చదువుతో స్వచ్ఛందంగా (soul కనెక్షన్) కనెక్ట్ కాలేడు.అకడమిక్ పుస్తకాలు తీర్చలేని ఈ లోటును సాహిత్యం భర్తీ చేస్తుంది.
ఇప్పుడు పుస్తకాలు చదువుకోవడం వల్ల లాభాలు చూద్దాం.ప్రూస్ట్ పుస్తక పఠనాన్ని ఒక స్నేహంగా అభివర్ణిస్తారు.వాస్తవ జీవితంలో స్నేహాలతో పోలిస్తే పుస్తకంతో స్నేహంలో నిజాయితీ పాళ్ళు మరికాస్త ఎక్కువేనంటారు కూడా.పుస్తకంతో స్నేహం చెయ్యడంలో ఉన్న అనేకానేక లాభాలను ఆయన తన 'డేస్ ఆఫ్ రీడింగ్' లో ఏకరువుపెట్టారు..ఈ స్నేహంలో స్నేహితుడు మన ఎదురుగా ఉండడు,మనం పిలిచినప్పుడు వస్తాడు,వెళ్ళిపొమ్మన్నప్పుడు ఏ రకమైన నస పెట్టకుండా వెళ్ళిపోతాడు,అతడితో ఇగో ప్రాబ్లమ్స్ ఉండవు,అతడి ఇగోని మనం బూస్ట్ చెయ్యవలసిన అవసరం లేదు,అతడి సోషల్ స్టేటస్,పరపతి,పలుకుబడి లాంటివాటిని మనం పరిగణనలోకి తీసుకోనవసరం లేదు.ఇకపోతే ఈ పుస్తకలోకంలో స్నేహితుల్లో అధిక శాతం మంది మరణించినవారే ఉంటారు.ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట..మన బ్రతికున్నవారి లోకంలో స్నేహాలను కాపాడుకోవడానికి నిరంతరం మన ఎనర్జీ డ్రైన్ అయిపోయేలా అతి మర్యాదలూ,తెచ్చిపెట్టుకున్న వినయ విధేయతలూ,అభిమానాలూ,ఆరాధనలూ,కృతజ్ఞతలూ వంటివి వారిపట్ల చూపించనక్కర్లేదు,ఆమాటకొస్తే పుస్తకప్రపంచంలో ఎంత గొప్పవారినైనా కలవడానికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొనవసరం లేదు,వాళ్ళ సమయం కోసమో,వారి కరుణాదృష్టి సోకడం కోసమో క్యూలో పడిగాపులు కాయక్కర్లేదు.కానీ నిజజీవితంలో స్నేహాలతో చాలా చిక్కులున్నాయి.ఒక స్నేహం మొదలవ్వడానికి కారణభూతమైన మన చిన్న మాటో,అభిప్రాయమో,మన వ్యక్తిత్వమో,మన గుణమో,మరొకటో ఒక వైబ్ లాంటిదేదో ఉంటుంది చూశారా,అవి మనం వదిలించుకోలేము.స్నేహితునితో గడిపే ప్రతిరోజూ అవన్నీ మనపాలిటి శిలాశాసనాలై కూర్చుంటాయి.ఆ నియమాల బరువుని మన స్నేహితుని ముందు ఒక మాస్క్ లా ధరించవలసి ఉంటుంది.ప్రతి నిత్యం మనలో మార్పుల్ని మన స్నేహితుడు అంగీకరించలేడు.పుస్తకాలతో ఆ ఇబ్బంది లేదు.ప్రతిఫలాపేక్షలేని స్వచ్ఛమైన ప్రేమను పొందే అవకాశం పుస్తకాల్లోని కాల్పనిక వ్యక్తులతో చేసే స్నేహంలో పొందే అవకాశం చాలా ఎక్కువ.అటువంటి స్నేహం మీకు అనుభవంలోకి రావాలంటే పుస్తకాలు చదవండి.హ్యాపీ రీడింగ్ :)
తొలిప్రచురణ : లీడర్ తెలుగు డైలీ : రైటర్స్ అకాడమీ సాహిత్యం పేజీ
http://www.leaderepaper.com/m5/2861243/Leader-Telugu-Daily/19-10-2020?fbclid=IwAR2fVGtZRHuxhD4ax4Ow_i4J-seEa80BYdYmIgE6-VmsdrmwlBuv6F0czO8#page/7/1
http://www.leaderepaper.com/m5/2868053/Leader-Telugu-Daily/25-10-2020?fbclid=IwAR2di_gaPK82TFw_cpOgQpf7QHI_5bXMS4sQNcj6nLRr5oJMD--Z54JrL_o#page/7/1
గూగుల్ డ్రైవ్ లింక్ : https://drive.google.com/drive/u/0/folders/1wTkghs24r54rVAdDpOrHU0OEx2tnTdYm
No comments:
Post a Comment