కళల్ని ఆత్మసాక్షాత్కారానికి సాధకాలుగా చూస్తారు..కళాకారుడు ఏ కళ ద్వారానైనా తనలో ప్రపంచానికి తెలీని మరో 'అంశ'ని బయల్పరచాలని ఆరాటపడతాడు..కళకు మూలాధారమే అస్తిత్వవాదం అనుకుంటే చిన్ని కృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండాన్నీ తన నోట్లో చూపించినట్టు తనలో ఉన్న అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ ప్రపంచానికి చూపించే సాహసం చేసిన ఏకైక రచయిత బహుశా 'ఫెర్నాండో పెస్సోవా' మాత్రమే..పోర్చుగీసు కవి 'ఫెర్నాండో ఆంటోనియో నోగైరా పెస్సోవా' 1888 జూన్ 13 న లిస్బన్ లో జన్మించారు..తండ్రి మరణానంతరం తల్లి ద్వితీయ వివాహం కారణంగా ఏడేళ్ళ వయసు నుండీ పెస్సోవా విద్యాభ్యాసం అంతా బ్రిటీష్ పాలన క్రింద ఉన్న దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో జరిగింది..ఈ కారణంగా ఆయన పోర్చుగీసు,ఇంగ్లీషు రెండు భాషల్లోనూ విరివిగా రచనలు చేశారు..1905 లో తిరిగి లిస్బన్ చేరిన తరువాత ఆయన మళ్ళీ పోర్చుగీసు వదిలిపోలేదు..ఆ కాలంలో Orpheu మరియు Athena అనే పత్రికలకు వ్యాసాలూ,కవితలూ రాయడం ద్వారా సాహితీప్రపంచానికి పరిచయం అయ్యారు పెస్సోవా.
Image Courtesy Google |
ఫెర్నాండో పెస్సోవా మానవనైజాన్ని నిర్దేశించ వీలులేదని ఘంటాపథంగా చెప్తూ,మనిషి వ్యక్తిత్వం క్షణక్షణానికీ మారిపోయే అస్థిరమైన లక్షణం కలిగి ఉంటుందని హ్యూమన్ సెల్ఫ్ లోని కన్ఫర్మిటీని తీవ్రంగా ఎద్దేవా చేశారు..రచయితల్లో ఈ తరహా 'ఆల్టర్ ఇగోస్' సంస్కృతి చాలా పాతదే అయినా,మిగతా రచయితలు మరో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే తమ హెటెరోనిమ్స్ గా చూపించడంలో సఫలీకృతులయ్యారు..ముఖ్యంగా ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో,రచయితల్లో ఈ ఆల్టర్ ఇగోస్ ఫ్యాషన్ కొనసాగుతున్న కాలంలో ఎజ్రా పౌండ్ కు -మాబెర్లీ, రిల్కే కు -మాల్టె లారిడ్స్ బ్రిగ్గే,వొలర్ కు - మిష్యుర్ టెస్టే లాంటి కొన్ని హెటెరోనిమ్స్ వాడుకలో ఉండేవి..ఇక్కడే పెస్సోవా మిగతా అందరికంటే కాస్త భిన్నంగా కనిపిస్తారు,ఈ 'ఆల్టర్ ఇగోస్' గేమ్ లో చాలామంది సాహితీ దిగ్గజాలు భాగం పంచుకున్నా,దాన్నిపెస్సోవా తీసుకెళ్ళినంత దూరం మరెవ్వరూ తీసుకెళ్ళలేదు..పెస్సోవా ఈ ఆటను తుదికంటా ఆడారు.
ప్రవృత్తి రీత్యా ఒంటరి అయిన పెస్సోవాకు సామాజిక,వైవాహిక జీవితాలు లేవు ..1910 లో పోర్చుగీసు మోడర్నిస్ట్ మూవ్మెంట్ లో చురుగ్గా పాల్గొన్నా ఆయనెప్పుడూ లైమ్ లైట్ కి దూరంగానే ఉన్నారు..పెస్సోవా జీవనకాలంలో ఆయన రచనలు వెలుగు చూడలేదు..1935లో లిస్బన్ లో ఆయన మరణానంతరం ఒక చిన్న గదిలోని ట్రంక్ పెట్టెలో అస్తవ్యస్తమైన దస్తూరీలో పోర్చుగీసు,ఇంగ్లీష్,ఫ్రెంచ్ భాషల్లో రాసిన ప్రతులు దొరికాయి..ఆ ప్రతుల్లో కవితలూ,కథలూ,ఫిలాసఫీ,అనువాదాలూ,విమర్శలూ,రాజకీయ,భాషాపరమైన వ్యాసాలతో కూడిన పెస్సోవా సమగ్ర సాహిత్యం అంతా నోటుపుస్తకాల్లోనూ,బిల్లుల మీదా,చిత్తు కాగితాల మీదా,ఉత్తరాల వెనుక,ఇలా ఎక్కడపడితే అక్కడ విడదీయడానికి వీల్లేని విధంగా లభ్యమైంది..ఆయన చనిపోయిన ఎనభై ఏళ్ళ తరువాత కూడా ఆయన రచనల్ని ప్రచురణకు తీసుకువెళ్ళే దిశగా ఇంకా తీవ్రమైన పరిశ్రమ జరుగుతూనే ఉంది..పెస్సోవాని అనువదించడాన్ని 'ఒక పీడకల'గా అభివర్ణిస్తారు అనువాదకులు..ఎందుకంటే ఆ ప్రతుల్లో ఉన్నది 'ఫెర్నాండో పెస్సోవా' అనే ఒక్క వ్యక్తి కాదు,అనేకమంది రచయితల సమూహాన్ని తనలో ఇముడ్చుకుని లెక్కలేనన్ని ఆల్టర్ ఇగోస్ తో రచనలు చేశారాయన.
పెస్సోవా 'హెటెరోనిమ్స్','సెమీ హెటెరోనిమ్స్' అని ముద్దుగా పిలుచుకునే డజన్ల కొద్దీ 'ఆల్టర్ ఇగోస్' ఈ సందర్భంగా వెలుగు చూశాయి..ఎన్ని వలిచినా తరగని ఈ ఉల్లిపొర జీవితాల మధ్య పెస్సోవా తో పాటు ఆల్బర్టో కైరో,రికార్డో రైస్ మరియు అల్వారో డి కాంపోస్ అనే మరో ముగ్గురు కవుల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి...పెస్సోవా తన ఆల్టర్ ఇగోస్ కు పేర్లు మాత్రమే ఇచ్చి ఊరుకోకుండా వారికి విభిన్నమైన వృత్తులూ,ప్రవృత్తులూ,ఆహార్యాలూ కూడా ఆపాదించారు..ఒకదానికొకటి పొంతన లేని ఈ వ్యక్తిత్వాల మధ్య నిజమైన పెస్సోవా(?) ఎవరంటే కనుక్కోవడం కష్టమే..పాఠకులకు పుస్తకాల్లో ఎక్కడో ఒకచోట తమని తాము వెతుక్కోవడం పరిపాటైతే పెస్సోవా పాఠకులు మాత్రం తమ గురించి పూర్తిగా మర్చిపోయి రచయితను అన్వేషించే పనిలో పడతారు..'నా ఆలోచనలో నేనున్నాను,కానీ నా ఆలోచనలు అనంతమైనవి' అని ఒక సందర్భంలో అంటారు అల్వారో డి కాంపోస్..అంటే నా ఉనికి కూడా అనంతమేనని చెప్పడం అన్నమాట..యవ్వనం దాటాకా ఎప్పుడూ లిస్బన్ వదిలి బయటకి వెళ్ళకపోయినా పెస్సోవా వ్యక్తిత్వాలన్నీ ఆయన తన గదిలో కిటికీ ప్రక్కన కూర్చుని ఊదే సిగరెట్ పొగ అంత తేలిగ్గా విశ్వంలోకి వ్యాపిస్తాయి..పెస్సోవా మాగ్నమ్ ఓపస్ 'ది బుక్ ఆఫ్ డిస్క్వైట్' అనువాదకులు రిచర్డ్ జెనిత్ ఆ పుస్తకాన్ని ఒక అరుదైన 'అక్షరాలతో మలిచిన ఛాయాచిత్రం' గా అభివర్ణిస్తారు,ఇరవయ్యో శతాబ్దం మొత్తంలో 'హ్యూమన్ సెల్ఫ్' గురించి అంత నిజాయితీతో కూడిన రచన మరొకటి లేదని అభిప్రాయపడతారు.
సాహిత్యంలో సహజంగా కనిపించే ప్రయోగాలూ,ప్రమాణాలూ పెస్సోవా శైలిలో కనిపించవు..సాహితీ విలువల నిర్వచనాలకు ఆయన రచనలు ఆమడదూరంలో నిలబడతాయి..పెస్సోవా రచనల్లో ముడిసరుకు స్వయంగా ఆయనే..బాహ్యప్రపంచాన్ని తన అంతఃప్రపంచంతో పోలుస్తూ రచనలు చేసే రచయితలకు భిన్నంగా తనలో దాగున్న అనంతమైన ప్రపంచాల్లో విహరిస్తూ,తన ప్రతిబింబాలైన విభిన్న వ్యక్తిత్వాలతో సంభాషిస్తూ,తాను మాత్రం వీటన్నిటినుంచీ విడివడి దూరంగా నిలబడి ఒక ప్రేక్షక పాత్ర పోషించడం ఏమంత సులభతరం కాదు..జె.ఎమ్.కాట్జీ 'యూత్' అనే నవల్లో రాసినట్లు "కళని సృజించే క్రమంలో కళాకారుణ్ణి అతనిలోనే ఉండే మరో వ్యక్తి ఆవహిస్తాడు,ఆ సమయంలో ఒక జ్వరతీవ్రతతో ఉన్న వ్యక్తిలా కళాకారుడు పని చేస్తాడు" అని..మరి ఒకరికి మించిన వ్యక్తిత్వాలు ఆవహించిన కళాకారునిలో ఈ జ్వరతీవ్రతను పూర్తిస్థాయిలో భరించగలిగిన పెస్సోవా ప్రత్యేకత నిరాకరించడానికి వీలులేనిది..ఈ పోర్చుగీసు రచయితను ప్రత్యేకం ఒక దేశ,కాలమాన చట్రాల్లో పెట్టి వర్గీకరించాడానికి వీలులేదు.."నేను పోర్చుగీసు వాణ్ణయినా నేను పోర్చుగీసులో రాయను,నన్ను నేను రాసుకుంటాను" అని చెప్పడం రచయితగా ఆయన పరిధి ఎంత విశాలమో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ 10త్ నవంబర్ 2020.
https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-635153
No comments:
Post a Comment